10, సెప్టెంబర్ 2022, శనివారం

భిన్నత్వంలో ఏకత్వం నీటి మూటేనా – భండారు శ్రీనివాసరావు

మూడేళ్ళ క్రితం వరకు నేను అనేక టీవీ చర్చలకు  వెడుతూ ఉండేవాడిని. మా ఆవిడ చనిపోయిన తర్వాత మానేశాను. వారానికి ఏడు రోజులు ఏదో ఒక ఛానల్. దాంతో వారాల అబ్బాయిలాగా రోజుకు ఓ ఛానల్ అనే నిబంధన పెట్టుకున్నాను. అంటే ఆదివారం ఓ ఛానల్ కు వెడితే మళ్ళీ ఆదివారం నాడే ఆ ఛానల్.

ఆ రోజుల్లో ఉప్పూ నిప్పూ వంటి ఛానల్స్ నన్ను పిలిచేవి. ఒక ఛానల్ లోగో వున్న కారులో మరో ఛానల్ కు వెళ్ళే వాడిని, ఆ రెండూ ఉత్తరం ధృవం దక్షిణ ధృవం అయినా కూడా.

ఇలా ఉంచితే,

అన్ని భావజాలాలు వున్న విభిన్న దిన పత్రికలు నా వ్యాసాలు  దశాబ్ద కాలానికి పైగా ప్రచురిస్తున్నాయి.

అదేమిటో దురదృష్టం! ఈ సాంఘిక మాధ్యమంలో అలా  స్వేచ్చగా రాయగలిగే వీలుందా అనే బాధ అప్పుడప్పుడూ మనసును తొలుస్తూ వుంటుంది.

ఈ నేపధ్యంలో కొన్ని రకాల (రాజకీయేతర)  పోస్టులకే పరిమితం అవ్వాల్సిన పరిస్తితి ఒక జర్నలిస్టుగా నన్ను కలవర పెడుతోంది. దీన్ని దృఢ పరచుకోవడానికి అనేకసార్లు  చాలా పాత రాజకీయ  పోస్టులు రిపీట్ చేస్తూ వచ్చాను. ఆ రోజుల్లో వాటిని సాదరంగా స్వీకరించి సానుకూలమైన వ్యాఖ్యలు పెట్టేవాళ్ళు.  ఇప్పుడు అవే పోస్టులకు వస్తున్న కామెంట్లు చూసి ఈ నిర్ధారణకు రావాల్సి వస్తోంది.

మొదట్లో నన్ను పట్టించుకోలేదు అనుకోవాలా! లేక ప్రస్తుతం ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు బాగా  యాక్టివ్ అయ్యాయని అనుకోవాలా!

హేళన, వేళాకోళం, వ్యక్తిత్వ హననం  ఎవరూ భరించలేరు.

నిష్పాక్షిక పాత్రికేయ విమర్శ కూడా ఈ కోవలోకే వస్తుందా!  

(10-09-2022)

 

 

8, సెప్టెంబర్ 2022, గురువారం

కాళోజీ గర్వభంగం - భండారు శ్రీనివాసరావు

(సెప్టెంబరు తొమ్మిది ప్రజాకవి కాళోజీ జయంతి)

కాళోజీ నారాయణ రావు ‘ఇదీ నా గొడవ’ అనే పేరుతొ తన ఆత్మకధ రాసుకున్నారు. స్నేహసాహితి వారు ప్రచురించిన ఈ పుస్తకం 1995 సెప్టెంబరు నెలలో విడుదల అయింది. తెలుగు భాష గురించీ, తెలంగాణా యాస గురించీ ఆయనకున్న మక్కువను ఆయన తన ఈ రచనలో వ్యక్తం చేసారు. అలాగే కొన్ని సందర్భాల్లో తనకు జరిగిన ‘గర్వ భంగాలను’ కూడా ఆయన చాలా హృద్యంగా తన శైలిలోనే నిజాయితీగా  ఈ పుస్తకంలో ప్రస్తావించారు. కాళోజీ స్వయంగా రాసుకున్న ఆ జ్ఞాపకాల్లో కొన్ని ఆయన మాటల్లోనే :

కులాల్లో ఎన్నో తరతమ భేదాలు పాటిస్తున్నాం. అది గ్రామ్యం, ఇది గ్రాంధికం అంటూ భాషలో కూడా తేడాలు పాటిస్తున్నాం.

భాషకి సంబంధించి రెండే రెండు. ఒకటి మాట, రెండు రాత. అంటే ఉచ్చారణ, దస్తూరి. అదే ‘అ’ అదే ‘ఇ’,

అదే ‘ఉ’ అదే ‘క’, అదే ‘య’. అక్షరమైతే ఒకటే. ‘క’ అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాస్తారు. ఎట్ట రాసినా అది ‘క’ అనే అంటం కాని ‘హ’ అని ఎవడూ అనుకోడు.

దస్తూరి విషయంలో వుండే ఈ ఉదారత, సహృదయత ఉచ్చారణ విషయంలో ఎందుకు లేవు ? ఏ ఇద్దరి దస్తూరి ఒక రకంగా వుండనట్టు ఏ ఇద్దరి ఉచ్చారణా ఒక రకంగా వుండది. ఉచ్చారణ ఏ యాసలో వున్నా అర్ధం చేసుకోవడానికి ఇబ్బంది వుండకూడదు. మాండలికాలు లేని భాష చచ్చి వూరుకుంటది. మాండలికంలో తేడాలు, యాసలో వ్యత్యాసాలు వుండడమే భాషకి జీవ లక్షణాలు.

“‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అన్నాను. అన్ని భాషలు నేర్చుకో కానీ నీ మాతృభాషని మాత్రం తప్పకుండా నేర్చుకో.

రావిశాస్త్రి విశాఖ భాష, తెలుగు కాదని మేమూ, నల్గొండ వాళ్ళది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగు కాదని బెజవాడవాడు, బెజవాడ వానిది తెలుగే కాదని రాయలసీమ వాడు – ఇట్లా అనుకుంటపొతే మన మధ్య సుహృద్భావం ఎట్టవస్తది. మనందరం తెలుగు వాండ్లం అనే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ – ఆత్మీయత ఏముంటది . ఒకని భాష విషయంలో, యాస విషయంలో తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బ తింటది. దానికి వెల కట్టలేం.

హైద్రాబాదు రేడియోలో బాలల కార్యక్రమం వచ్చేది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన (1956) నాటినుంచి ఈనాటి (1985) దాకా అంటే దాదాపు ముప్పయ్ ఏండ్లపాటు బాలల కార్యక్రమాలు వందలు వేలు జరిగివుండాలె. వీటిల్లో తెలంగాణా పిల్లలు ఎందరు పాల్గొన్నరు. వాండ్ల వాడుక భాష ఏది. వాండ్లు కనబడరు. వాండ్ల భాష వినబడదు. బిరుదు రామరాజు పిల్లలు, పల్లా దుర్గయ్య పిల్లలు, సినారె పిల్లలు ఎన్నడయినా బాలానందంలో పాల్గొన్నరా. రేడియో అన్నయ్య, అక్కయ్యల పాటా, మాటా, యాసా ఏదీ తెలంగాణది కాదు.

ప్రతి విషయంలో ఈ తేడాలు వుంటుంటే మరి మనమంతా కలిసి తెలుగోళ్ళమనుకుండేదెట్ట. ఆ భాష బాంధవ్యం కానీ, ఆ సామరస్యం కానీ ఎట్ట రావలె. ఏడనుంచి ఒస్తది. ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం”

పొతే కాళోజీ తన ఆత్మ కధలో తన గర్వం అణిగిన సందర్భం ఒకటి ఉదహరించారు ఇలా.

వరంగల్లు రాజరాజనరేంద్ర గ్రంధాలయంల ఆంజనేయులు అనే ఒకవిద్యార్ది సాయంకాలాలు పనిచేసేటోడు. ఐదో ఆరో (రూపాయలు) ఇచ్చేటిది. ఆ లైబ్రరీకి బెజవాడ నుంచి ఓ ఉత్తరం వచ్చిందట. పై కవరు మీద ఆంజనేయులు అడ్రెసు, లోపల మాత్రం రావి నారాయణరెడ్డి నాకు రాసిన ఉత్తరం. మరి సీ.ఐ.డీలు ఎట్ల పసికట్టిన్రో ఏమో, అది పట్టుకుని నన్నూ ఆంజనేయుల్నీ అరెస్టు చేసిన్రు. నన్నొక లాకప్ లోను, ఆంజనేయుల్ని మరో లాకప్ లోను పెట్టిన్రు. ఆ లాకప్ లో నాతో పాటు ఓ దొమ్మరాయన వున్నడు. .....నేను సత్యాగ్రహిని. ఈ నేరస్థునితో సమానం చేస్తరా. నా ప్రిస్టేజికి భంగం వచ్చినట్టు అనిపించింది. దొమ్మరతని చెవిలో సగం కాలిన ఆకు చుట్ట వుంది. అది తీసి, కొరికి, అక్కడే ఉమ్మి వేసి నా వైపు చూస్తూ ‘అగ్గిపుల్ల ఉందా’ అని అడిగాడు. నేను చీదరించుకున్నట్టు ‘హట్! నన్నడుగుతవా’ అన్న. అతడు సెంట్రీ నడిగి చుట్ట ముట్టించుకుని నా ముంగిట కూర్చుని అడిగిండు నన్ను ఏ నేరంలో పోలీసులు పట్టుకొచ్చారని. రాజకీయ సత్యాగ్రహం, బాధ్యతాయుత ప్రభుత్వం ఇవన్నీ నేను చెప్తె వానికేమి తెలస్తది.

చూడండి మనిషి స్వభావం యెంత విచిత్రమో. కులమతాల పట్టింపులు లేనివాడిని. ఆర్య సమాజపు మనిషిని. ఇలాటోడిని లాకప్పులో తోటి మనిషి పట్ల ఇట్లుండడం.

చోరీ చేస్తివా ?”

ఎవుడి తలన్నా పగలగొట్టి వస్తివా ?”

ఎవుడి పెళ్ళాన్నన్నా ఎత్తుకు వస్తివా ?”

ఇలా నేరాలన్నీ ఏకరువు పెట్టి అడుగుతున్నాడు.

ఛీ ఛీ అంటూ అన్నిటికీ కాదు కాదనే చెబుతున్న. ఈ ప్రశ్నలన్నీ అయినంక ఒక నిమిషం ఆలోచించి ఒక్క ప్రశ్న వేసిండు.

అతనాలోచించి అడిగిన ప్రశ్న. ‘గాంధీ మహారాజ్ కిన్నీ, హుజూర్ నైజాంకీ లడాయ్ జరుగుతుందట. దాంటోగిన రాలేదు కద నువ్వు?’

దొంగతనాలు, దోపిడీలు కాకుండా వేరే రకంగా ఓ పోరాటం జరుగుతున్నదనే ఒక పిక్చర్ అతని లోపల కట్టి వున్నదన్నమాట. దాంతో నేను విచిత్రపడిపోయి, దగ్గరకి జరిగి కౌగలించుకుని ‘అవున్నాయనా ఆ లడాయిలోనే వచ్చిన’ అని కళ్ళనీళ్ళు పెట్టుకున్న.

'నా జీవితంలో ఇది మరపురాని ఘట్టం’ అని కాళోజీ తన ఆత్మకధలో రాసుకున్నారు.

ఈ కాలంలో వచ్చే ఆత్మకధల్లో ఇలాటి నిజాయితీని ఊహించగలమా!

 


6, సెప్టెంబర్ 2022, మంగళవారం

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

 

“ ఆ రోజులే వేరు. వొంట్లో యువ రక్తం సలసలా మరుగుతుండేది. మొత్తం ప్రపంచాన్ని ఒక్కమారుగా మార్చేసి నాకు నచ్చిన లోకాన్ని సృష్టించాలని తహతహ లాడుతుండేవాడిని. కానీ ఏమయింది. ప్రపంచాన్ని మార్చడం నా వల్ల కాదని తేలిపోయింది. పోనీ, ప్రపంచం సంగతి అక్కడితో వొదిలేసి నా దేశాన్ని సంస్కరించుకుంటే సరిపోలా అని అనుకున్నాను.
“ఆ ప్రయత్నం కూడా వృధా అని త్వరలోనే తెలిసిపోయింది. దాంతో దేశం గొడవ పక్కనబెట్టి మా వూరిని బాగుచేద్దామని పూనుకున్నాను.
“అయితే వూరును బాగుచేయడం అన్నది నా ఒక్కడివల్లా అయ్యే పని కాదని తెలిసిరావడానికి కూడా ఎక్కువ కాలం పట్టలేదు.
“ఇక అప్పుడు కానీ నాకు నా కుటుంబం గుర్తుకు రాలేదు. ముందు కుటుంబం బాగోగులు చూడాలనిపించింది. కానీ అప్పటికే వయసు మీద పడింది. వెనుకటి సత్తువా లేదు. మునుపటి ఓపికా లేదు.
“బోధివృక్షం లేకుండానే నాకు జ్ఞానోదయం అయింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ముందు నన్ను నేను మార్చుకుంటే యెలా వుంటుంది అన్న ఆలోచన మొదలయింది. మొదటే ఈ పని చేసివుంటే ఎంత బాగుండేదో కదా!
“క్రమంగా నా ఆలోచనలు కొత్త రూపం తీసుకున్నాయి.
“మార్పు అనేది ముందు నాతో మొదలయివుంటే ఆ ప్రభావం నా కుటుంబం పైన పడేది. నేనూ నా కుటుంబం కలిసి మా వూరిని మార్చేవాళ్ళం. మా వూరు బాగుపడితే దానివల్ల నా దేశం బాగుపడివుండేది. మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చిన్నతనంనుంచి కంటున్న నా కల ఆ క్రమంలో ఫలించి వుండేది. కానీ ఏంలాభం? శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన తరవాత కానీ తత్వం బోధపడలేదు.

5, సెప్టెంబర్ 2022, సోమవారం

ముగ్గురు గురువులు - భండారు శ్రీనివాసరావు

 (సెప్టెంబరు అయిదు- ఉపాధ్యాయ దినోత్సవం)

‘సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి

యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః’

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.

ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ  పడనివాడే ఉత్తమ గురువు. ‘నేను  పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నాను’ అని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా  వుంటుంది. అలాగే ‘పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడు’ అని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.

గురు శిష్యుల గురించి  చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్  పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న వృత్తాంతం గుర్తుకువస్తోంది.

“ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి  విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు  చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.

“తమరు నాకు పనికి వచ్చే చదువు  చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు”

ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.”

మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.

1921 వ  సంవత్సరం. అంటే వందేళ్ళ కిందటి మాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.”

పంతుళ్ళ చెవులకు శిష్యులు  తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.

ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.

ఈ రోజు సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.

అక్షరబిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.

నా చిన్నతనంలో మా ఊరిలో షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది.  ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరు టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు.  బ్లాకు బోర్డులు లేవు. విద్యార్ధులలో చాలామందికి పలకా బలపాలు ఉండేవి కావు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ, ఇవి వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.

అప్పయ్య మాస్టారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించేవారు. అంతసేపు నాకు ఒంట్లో వణుకు. అసలు ఆయన్ని చూస్తూనే భయం. కానీ అప్పయ్య మాస్టారు కొట్టో, తిట్టో నేర్పించిన నాలుగు అక్షరాలే నాకు జీవితంలో ఒక మార్గం చూపాయి. వీడికి పొట్ట కొస్తే అక్షరం ముక్క రాదు అనే మాటలు పడకుండా కాపాడాయి. 

ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడిలో పడి,  ఏ రోగం రొష్టు బారినపడకుండా అనాయాస మరణానికి నోచుకున్నారు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది.  మాకు ఇంత అక్షరభిక్ష పెట్టిన మహానుభావుడు కనుకే మహానుభావులకు మాత్రమే లభించే సునాయాస మరణం ఆయనకు దక్కింది.

మరో యాదృచ్చికం. అప్పయ్యగారి మరణ వార్త గురించిన ఫోను వచ్చినప్పుడు నేను ‘రేడియో రోజులు’ మరో భాగం మొదలు పెడుతున్నాను. ఇందులో కాకతాళీయం ఏమిటంటే అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్ అనే విషయం రాస్తున్నాను.   అదేమిటంటారా!

మాచిన్నప్పుడు గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంద్రపత్రిక దినపత్రికను  పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు  మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. ‘అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్. కెనడీ ఎన్నిక. ఓటమి అంగీకరిస్తూ రిచర్డ్ నిక్సన్  ప్రకటన’ అంటూ ఆయన చదివే వార్తలు వింటుంటే, అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.

ఉపాధ్యాయ దినోత్సవంనాడు ఆయన్ని సంస్మరించుకుంటూ -    

గురుద్దేవో నమః

కింది ఫోటో: కీర్తిశేషులు శివరాజు అప్పయ్య పంతులు గారు




అడగ్గానే ఇళ్ళు ఇచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు


ఇంటి అద్దెలు భరించలేకపోతున్నాను, ఒక ఇల్లు ఇప్పించండి” అని అడిగాను ముఖ్యమంత్రిని. ఒకరిని కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులను. వాళ్ళూ ఇలా అడగ్గానే అలా ఇచ్చేసారు.

1975 లో బెజవాడ ఆంధ్రజ్యోతి వదిలి హైదరాబాద్ ఆలిండియా రేడియోలో చేరాను అన్నమాటే కానీ, రాజధాని నగరంలో ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే, రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకుని, ఆ కాపీ నాటి  ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి, పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి మేముంటున్న చిక్కడపల్లి నుంచి రిక్షాలో  ఎగురుకుంటూ వెళ్ళాము. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద భవంతి. కిరాయి మాత్రం మేము చెల్లించే దానిలో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తే అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తే ఇంటివాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీతో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. నేను గట్టిగా చెప్పడంతో, ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావు గారు  అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. మొదటి ఇంటి కధ ఆ విధంగా ముగిసింది.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనసులో

ఇంటి పురుగు తొలిచింది. ఆయన్ని కలిసి, అద్దెలు భరించడం కష్టంగా వుంది ఓ ఇల్లు ఇప్పించండి అని అడిగేశాను. ఆయన చిన్నగా నవ్వి, అదెంత భాగ్యం అన్నట్టు చూసి ఓ అధికారికి నన్నూ, నా పనీ ఒప్పచెప్పారు. ఇల్లు అంటే నా ఉద్దేశ్యం గవర్నమెంటు క్వార్టర్ అని. అదయితే ఎంచక్కా  తక్కువ అద్దె కట్టుకుంటూ కాలక్షేపం చేయొచ్చని నా ఆలోచన.  ఆ అధికారికి నా తరహా నచ్చలేదు. క్వార్టర్ అయితే రేపు రిటైర్ కాగానే ఖాళీ చేసిపోవాలి అన్నాడు. నేనన్నాను. 'అదే మంచిది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఈ ఒక్క మినహాయింపు ఇచ్చి క్వార్టర్ అలాట్ చేస్తే నాకూ ఇబ్బంది వుండదు, ముఖ్యమంత్రి గారికి కూడా మాట రాదు. నాకు క్వార్టరే కావాలి అన్నాను. పిచ్చి బ్రాహ్మడిలాగున్నావే అన్నారాయన వెక్కిరింతగా. వాతావరణం చల్లబరచడానికి, ‘నిజమే, క్వార్టర్ సరిపోదు, ఫుల్లు కావాలి’ అన్నాను. ఆయన పెద్దగా నవ్వేశాడు.

ఎర్రమంజిల్ కాలనీలో ఐ.జే. 2 క్వార్టర్ నా పేరు మీద అలాట్ చేస్తూ మర్నాటికల్లా  ఆర్డర్ వచ్చింది.

2005 డిసెంబరులో దూరదర్సన్ నుంచి  రిటైర్ అయ్యేదాకా తక్కువ అద్దె కట్టుకుంటూ, అటూ ఇటూ ఐ.ఏ.ఎస్. అధికారులు, ఐ.పి.ఎస్. అధికారులు వుండే ఆ  కాలనీలో, సెకండ్ క్లాస్ టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణం చేస్తున్న ఫీలింగుతో సందేహిస్తూ కాలం  గడిపాము.

మొత్తం కాలనీలో అధికారిక వాహనం కానీ, సొంత కారు కానీ లేని ఇల్లు మాదే. కారు షెడ్డు ఖాళీగా వుండేది.

(05-09-2022)

 

 


4, సెప్టెంబర్ 2022, ఆదివారం

ప్రజాస్వామ్యం హరాయించుకోలేని పార్టీ ఫిరాయింపులు

 (Published in Andhra Prabha Daily on 04-09-2022, SUNDAY0

పత్రికారచయితలు రాసుకోవడానికి కాలం చెల్లని, సార్వకాలీన అంశం ఏదైనా వుంది అంటే అది పార్టీ ఫిరాయింపులే. ఎందుకంటే, దేశంలో ఎక్కడో ఒక చోట,  నిన్నా,నేడు, రేపు  అనే తేడా లేకుండా సర్వకాలాల్లో జరుగుతుండేవి ఈ ఫిరాయింపులే.

పార్టీ ఫిరాయింపులు గురించి ప్రస్తావించుకునేటప్పుడు కొంత పరిణామక్రమాన్ని కూడా గుర్తుచేసుకోవాలి.

అనైతిక పార్టీ మార్పిళ్లను అరికట్టడానికి చట్టం లేదా అంటే వుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే, 52వ రాజ్యాంగ సవరణ ద్వారా  పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చారు. అయితే, దాని ప్రకారం, చట్ట సభలో ఒక పార్టీకి వున్న సంఖ్యాబలంలో మూడింట ఒక వంతుమంది వేరే పార్టీలోకి మారితే అది పార్టీ పిరాయింపు కాకుండా, 'విలీనం' కిందికి వస్తుంది. దీన్ని అడ్డుపెట్టుకుని వ్యూహాత్మక మార్పిళ్లు జరగడంతో ఆ చట్టం కోరలు పదును పెట్టడం కోసం దరిమిలా దానికి ఎన్నో సవరణలు కూడా చేశారు. అయినా  చట్టంలోని  లొసుగుల్ని వాడుకుంటూ, చట్టాలకు తూట్లు పొడవడం ఆ చట్టాల నిర్మాతలయిన ప్రజా ప్రతినిధులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే చట్టం దోవ చట్టానిది,  రాజకీయ నాయకుల దోవ వారిదీ అవుతూ వచ్చింది. ఎవరినీ తప్పుబట్టడానికి వీలులేకుండా తప్పులు చేస్తూ పోవడానికి చట్టాల్లో వున్న ఈ లొసుగులే ప్రధాన కారణం. అనేకానేక అధ్యయనాల అనంతరం పద్దెనిమిదేళ్ళ తరువాత అంటే, 2003 లో ఈ చట్టానికి మరో రాజ్యాంగ సవరణ చేసారు. దీని ప్రకారం 'పార్టీ మార్పిడి పిరాయింపు కాదు, మరో పార్టీలో విలీనం కావడం' అని చట్టం దృష్టిలో అనిపించుకోవాలంటే ఆ పార్టీలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు సమ్మతించాలి. ఈ సవరణ ప్రకారం విడిగా కానీ, బృందాలుగా కానీ, పార్టీ మారే చట్టసభల సభ్యులు తమ సభ్యత్వానికి ముందు  రాజీనామా చేయాలి.  అలా రాజీనామా చేసినవారు, ఆ తరువాత ఎటువంటి లాభదాయక పదవులు పొందడానికి వీలుండదు. నిజానికి ఈ రాజ్యంగ  సవరణ ద్వారా పార్టీ మార్పిళ్లు అనేవి దుర్లభంగా మారాయి. కానీ, రాజకీయాల్లో వున్నవాళ్ళు ఘటనాఘటన దురంధరులు. అడ్డువచ్చిన వాటిని ఎలా అడ్డు తొలగించుకోవాలో, అదీ చట్టబద్ధంగా, వారికి కరతలామలకం. ఎన్నికలు కాగానే, గెలిచినవాళ్ళల్లో కొందరు, తాము అధికారం దక్కని పార్టీలో ఉన్నామని గ్రహించిన మరుక్షణం నుంచే గోడదూకే సన్నాహాలు మొదలుపెడతారు.  ఎందుకంటే, ఎన్నికల్లో గెలవడం ఒక్కటే వారికి ముఖ్యం కాదు, పాలకపక్షం అండ దొరికితేనే 'ప్రజాసేవ' చేయడానికి వీలుంటుంది అన్న నమ్మకం పుష్కలంగా పెంచుకున్నవాళ్ళు వారు. అందుకే అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరిపోయి, తమ రాజీనామా ద్వారా ఉత్పన్నమైన ఖాళీలో జరిగే ఉపఎన్నికలో  పోటీ చేసి,  అధికార పార్టీ ప్రాపకంతో మళ్ళీ  అనతికాలంలోనే చట్టసభల్లో ప్రవేశించిన ఉదాహరణలు  కోకొల్లలు.  పార్టీ పిరాయింపులను నిరోధించడానికి రూపొందించిన చట్టాన్ని ఆ విధగా కొందరు నీరుకార్చి వేస్తున్నారు. 'ఇది నైతికమా కాదా' అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కానీ, అంతటి  సావధానం కానీ వారికి ఉంటుందనుకోలేము. ఇక, 'ఇలా చేతికి అందిన రాజీనామాలు ఆమోదించాలా తిరస్కరించాలా లేదా పెండింగులో పెట్టాలా' అనే విషయంలో స్పీకర్లదే తుది నిర్ణయం. ఆ నిర్ణయాలను  సమీక్షించే లేదా తిరగతోడే అవకాశం న్యాయస్థానాలకు  కూడా లేదు. గత అయిదారేళ్ళ కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలను సునిశితంగా గమనిస్తూ వస్తున్నవారికి  ఇటువంటి సందర్భాలు లెక్కకు మిక్కిలి అన్నవిషయం తేలిగ్గానే బోధపడుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా అధికారంలో వున్న పార్టీదే పైచేయి.  అందువల్ల, పిరాయింపులు అనేవి పాలకపక్షాల ఇష్టాఇష్టాల ప్రకారమే అటు చట్టబద్దం కావడమో, ఇటు చట్ట విరుద్ధం కావడమో జరుగుతోంది. అయితే, చట్టంలో వున్న  ఈ లొసుగుకు  సుప్రీం కోర్టు ఓ మేర అడ్డుకట్టవేసింది. గతంలో గోవా శాసనసభ స్పీకర్ ఇద్దరు సభ్యులపై వేసిన 'అనర్హత వేటు'ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.  కానీ రాజ్యాంగం పదో షెడ్యూల్లో పొందుపరచిన మిగిలిన అధికరణాలను మాత్రం సుప్త్రీంకోర్టు తప్పుపట్టలేదు.

మంచి చేయబోతే చెడు ఎదురయినట్టు, ఈ చట్టం వల్ల కొందరు నిజాయితీపరులయిన సభ్యులు ఇబ్బంది పడే అవకాశం వుంది.  అనర్హత వేటుకు భయపడి, ఇష్టం వున్నా లేకపోయినా పార్టీ అధినాయకత్వం తీసుకునే అన్ని నిర్ణయాలను, బిల్లులను, వాటి  మంచి చెడులతో నిమిత్తం లేకుండా సమర్ధించాల్సిన పరిస్తితి వారిది.

ఇండిపెండెంటు సభ్యులకు  ఈ చట్టంలో కొంత వెసులుబాటు వుంది. వారు తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు తెలపవచ్చు. కానీ అందులో చేరడానికి వీలులేదు. ఇండిపెండెంటుగా గెలిచినా వాళ్ళు ఇండిపెండెంటు హోదాలోనే కొనసాగాలని   చట్టం నిర్దేశిస్తోంది. హర్యానాలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఇండిపెండెంటుగా గెలిచిన అభ్యర్ధులు   అధికార పార్టీలో చేరినట్టు టీవీల్లో వార్త  ప్రసారం అయింది. ఒక టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  ఏకంగా వారే ఈ విషయం చెప్పినట్టు వచ్చింది. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించారు. వారు కోర్టును ఆశ్రయించారు. చివరికి  సుప్రీం కోర్టు కూడా  స్పీకర్ నిర్ణయాన్నే  సమర్ధించింది.

పొతే, మనం సాధారణంగా  'పాలిటిక్స్' అని వాడే ఇంగ్లీష్ పదం  గ్రీకు భాషలోని 'పొలిటికా' అనే పదం నుంచి వచ్చింది. అమెరికా దేశపు మొదటి  అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహాం లింకన్  ప్రజాస్వామ్య ప్రభుత్వానికి  ఇచ్చిన నిర్వచనాన్నే మన రాజకీయ నాయకులు తరచూ ఉటంకిస్తుంటారు. 'ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం' అని. పొలిటికా అనే  ఈ గ్రీకు పదానికి దాదాపు అదే అర్ధం. అయితే కాలక్రమంలో 'నేతిబీరకాయ సామెత' మాదిరిగా ప్రజాస్వామ్యంలో 'ప్రజలు' అడుగంటి పోయి 'నాయకస్వామ్యం'గా మారడం మొదలయింది. 'దీనికి ఎవ్వరు కారకులు? ప్రజలా? పాలకులా? పార్టీలా?' అంటే, 'తిలాపాపం తలా పిడికెడు' అన్నట్టు అందరికీ ఇందులో భాగం వుంది.  ఎవరో అన్నట్టు రాజకీయాలు అనేవి ఒక బుడుగు మాదిరి. దాంట్లోకి ఒకసారి దిగితే అంతే  సంగతులు. తిరిగిరావడం వారి చేతిలో వుండదు. అందుకే,  ఒక పార్టీలో తమకు భవితవ్యం  లేదనుకున్నప్పుడు సిద్దాంతాలు, సూత్రాలు గాలికి వొదిలేసి వేరే పార్టీలోకి దూకుతున్నారు. ఇలా గోడలు దూకేవాళ్ళు కొందరయితే, దూకడానికి తటపటాయించేవారిని దింపడం కోసం గోడలకు నిచ్చెన వేసే పార్టీలు మరికొన్ని. చేపలకు 'ఎర'  వేస్తున్నారా, లేక చేపలే వచ్చి గాలానికి చిక్కుకుంటున్నాయా అనేది జవాబు దొరకని ప్రశ్న.

చివరికి  చెప్పేదేమిటంటే, చట్టాలు చేసేవారే వాటిని 'ఎలా ఉల్లంఘించాలా' అనే దారులు వెతకడం మొదలు పెడితే, అసలు వాళ్ళు చేసిన చట్టాలకు అర్ధం వుండదు, అవి తయారయ్యే చట్టసభలకూ  అర్ధం వుండదు. తరువాత తీరిగ్గా విచారించినా ప్రయోజనం వుండదు.

అన్ని రాజకీయ పార్టీలు ఈ వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడే మన ప్రజాస్వామ్య సౌధం పునాదులు బీటలువారకుండా వుంటాయి.




(01-09-2022)