5, సెప్టెంబర్ 2022, సోమవారం

అడగ్గానే ఇళ్ళు ఇచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు


ఇంటి అద్దెలు భరించలేకపోతున్నాను, ఒక ఇల్లు ఇప్పించండి” అని అడిగాను ముఖ్యమంత్రిని. ఒకరిని కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులను. వాళ్ళూ ఇలా అడగ్గానే అలా ఇచ్చేసారు.

1975 లో బెజవాడ ఆంధ్రజ్యోతి వదిలి హైదరాబాద్ ఆలిండియా రేడియోలో చేరాను అన్నమాటే కానీ, రాజధాని నగరంలో ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే, రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకుని, ఆ కాపీ నాటి  ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి, పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి మేముంటున్న చిక్కడపల్లి నుంచి రిక్షాలో  ఎగురుకుంటూ వెళ్ళాము. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద భవంతి. కిరాయి మాత్రం మేము చెల్లించే దానిలో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తే అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తే ఇంటివాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీతో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. నేను గట్టిగా చెప్పడంతో, ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావు గారు  అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. మొదటి ఇంటి కధ ఆ విధంగా ముగిసింది.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనసులో

ఇంటి పురుగు తొలిచింది. ఆయన్ని కలిసి, అద్దెలు భరించడం కష్టంగా వుంది ఓ ఇల్లు ఇప్పించండి అని అడిగేశాను. ఆయన చిన్నగా నవ్వి, అదెంత భాగ్యం అన్నట్టు చూసి ఓ అధికారికి నన్నూ, నా పనీ ఒప్పచెప్పారు. ఇల్లు అంటే నా ఉద్దేశ్యం గవర్నమెంటు క్వార్టర్ అని. అదయితే ఎంచక్కా  తక్కువ అద్దె కట్టుకుంటూ కాలక్షేపం చేయొచ్చని నా ఆలోచన.  ఆ అధికారికి నా తరహా నచ్చలేదు. క్వార్టర్ అయితే రేపు రిటైర్ కాగానే ఖాళీ చేసిపోవాలి అన్నాడు. నేనన్నాను. 'అదే మంచిది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఈ ఒక్క మినహాయింపు ఇచ్చి క్వార్టర్ అలాట్ చేస్తే నాకూ ఇబ్బంది వుండదు, ముఖ్యమంత్రి గారికి కూడా మాట రాదు. నాకు క్వార్టరే కావాలి అన్నాను. పిచ్చి బ్రాహ్మడిలాగున్నావే అన్నారాయన వెక్కిరింతగా. వాతావరణం చల్లబరచడానికి, ‘నిజమే, క్వార్టర్ సరిపోదు, ఫుల్లు కావాలి’ అన్నాను. ఆయన పెద్దగా నవ్వేశాడు.

ఎర్రమంజిల్ కాలనీలో ఐ.జే. 2 క్వార్టర్ నా పేరు మీద అలాట్ చేస్తూ మర్నాటికల్లా  ఆర్డర్ వచ్చింది.

2005 డిసెంబరులో దూరదర్సన్ నుంచి  రిటైర్ అయ్యేదాకా తక్కువ అద్దె కట్టుకుంటూ, అటూ ఇటూ ఐ.ఏ.ఎస్. అధికారులు, ఐ.పి.ఎస్. అధికారులు వుండే ఆ  కాలనీలో, సెకండ్ క్లాస్ టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణం చేస్తున్న ఫీలింగుతో సందేహిస్తూ కాలం  గడిపాము.

మొత్తం కాలనీలో అధికారిక వాహనం కానీ, సొంత కారు కానీ లేని ఇల్లు మాదే. కారు షెడ్డు ఖాళీగా వుండేది.

(05-09-2022)

 

 


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

సార్ మీరు అన్యధా భావించవద్దు. మీకున్న పరిచయాలతో ఇలా ఇళ్ళు కేటాయింపు చేయించుకోవడం సమంజసమేనా? ఔట్ ఆఫ్ టర్న్ అయితే అది సరికాదు. సీనియారిటీ ప్రకారం వస్తే అది తప్పుకాదు.