(Published in Andhra Prabha today. 11-09-2022, Sunday)
‘ఈ యాత్ర వల్ల రాహుల్ గాంధీకి వ్యక్తిగతమైన లబ్ది చేకూరుతుందా?’
ఒక టీవీ విలేకరి నన్ను ఇంటర్వ్యూలో అడిగిన ఈ ప్రశ్న కొంత ఆలోచింప చేసింది. ఇలాంటి పాదయాత్రల వల్ల ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చి లాభపడిన సందర్భాలు గతంలో వున్నాయి. అయితే వ్యక్తిగతంగా ఒక నాయకుడికి లభించే లాభం ఏమిటి?
సాధారణంగా కష్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేది వాడుక. అయితే, ఈ రాహుల్ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కష్మీర్ వరకు. అంటే ఏమిటన్న మాట. కింది నుంచి పైకి.
జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం చాలా దిగజారివుంది. ఆ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధి ప్రతిష్ఠ కూడా అధమాధమంగానే వుందని వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు. అనడమే కాదు, గులాం నబి ఆజాద్ వంటి సీనియర్లు కూడా పార్టీ విడిచి వెడుతూ కొంత బురదను రాహుల్ గాంధీపై చల్లి వెడుతున్నారు. అందుకే కాబోలు అడుగంటుతున్న వ్యక్తిగత ప్రతిష్టను అట్టడుగునుంచి పైకి తెచ్చుకుంటున్నసంగతి తెలియచెప్పే సంకేతంలా కన్యాకుమారి నుంచి కష్మీర్ వరకు ఈ యాత్ర తలపెట్టారని అనుకోవాలి. యాత్రాఫలం సిద్ధిస్తే అది రాహుల్ కు వ్యక్తిగత లబ్ది కిందికే వస్తుంది కదా! యాత్రాఫలం అంటే కేంద్రంలో అధికార అందలం దక్కడం అనే అర్ధం కాదు. ఒక నాయకుడిగా తన ప్రతిష్టను పెంచుకోవడం, సమర్థతను నిరూపించుకోవడం.
కాంగ్రెస్ పార్టీలో మేధావులకు కొరత లేదు. వాళ్ళ మేధాశక్తి పట్ల సందేహాలు పెట్టుకోనక్కరలేదు కానీ వారికి అట్టడుగు గ్రామ స్థాయిలో పరిస్థితులు, వాస్తవాలు తెలియవన్న సంగతి ఇప్పటికే అనేకసార్లు రుజువయింది. అయితే ఈ భారత్ జోడో యాత్ర అనే ఆయుధాన్ని రాహుల్ చేతిలో పెట్ట్డడం మాత్రం వారి మేధస్సుకు మచ్చుతునక అనే చెప్పాలి.
ఈ యాత్ర సందర్భంగా రాహుల్ 3570 కిలోమీటర్లు నడుస్తారు. పన్నెండు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో రాహుల్ కాలినడకన తిరుగుతారు. పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలని కలుసుకుంటారు. ఈ నెల ఏడో తేదీన కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర సుమారు అయిదు మాసాలు కొనసాగుతుందని చెబుతున్నారు. అన్ని రోజులు దేశంలోని ఆయా ప్రాంతాల్లో రాహుల్ వార్తల లోని వ్యక్తిగా వుంటారు. ఒక జాతీయ పార్టీ నాయకుడికి ఒక రకంగా ఇది రాజకీయంగా లాభదాయకమే.
కాంగ్రెస్ పార్టీది అనువంశిక పాలన అనేది ప్రత్యర్థులు చేసే ప్రధాన అభియోగం. అలాగే నెహ్రూ గాంధి వారసులుగా దేశాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీని ఒక పావులా వాడుకుంటోందని అంటుంటారు. అయితే సోనియా, రాహుల్ వీరిద్దరికీ తీరని అధికారదాహం ఉందనే ఆరోపణలు నిజానికి నిజం కావు. అవకాశం వచ్చినప్పుడు ప్రధాని పదవిని సోనియా వదులుకున్నారు. అవకాశం రాకపోయినా, అవకాశం కల్పించుకుని ప్రధాని పదవి చేపట్టడానికి అన్ని అవకాశాలు సిద్ధాన్నంలా ఎదురుగా ఉన్నప్పటికీ రాహుల్ అప్పట్లో అందుకు సుముఖత చూపలేదు. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో కూడా ఆయనది అదే తీరు. వచ్చే అక్టోబరులో కాంగ్రెస్ అధక్ష ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆయన సుదీర్ఘంగా సాగే ఈ యాత్ర తలపెట్టడం ద్వారా, పార్టీ అధ్యక్ష పదవిపై తనకు మక్కువ లేదని మరోసారి పరోక్షంగా చెప్పదలచుకున్నారేమో తెలియదు. లేదా సమర్ధత నిరూపించుకున్న తర్వాతనే పదవిని కోరుకోవాలనే బలమైన పట్టుదల ఆయన చేత ఈ యాత్ర చేయిస్తున్నదేమో తెలియదు.
సాధారణంగా రాజకీయ నాయకులు పాద యాత్రలు ప్రారంభించాలి అంటే అందుకు కొన్ని కారణాలు వుండి తీరాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అంటూ వాళ్లు పైకి యెంత బింకంగా చెప్పినా దాని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా దాగే వుంటుంది. అయితే, చేసేది రాజకీయమే అయినప్పుడు ఇక ఆ యాత్రల కోణాలను దుర్భిణి పెట్టి శోధించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న వారివద్ద సిద్ధంగానే వుంటుంది.
ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర అంత తేలికయిన విషయమేమీ కాదు. శారీరక శ్రమతో పాటు ఎన్నో వ్యయ ప్రయాసలు ఇందులో ఇమిడి వున్నాయి. ఒక రోజు యాత్రకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. యువకుడు కాబట్టి కాలి నడకలో ఎదురయ్యే శారీరక శ్రమను ఆయన కొంత మేర అధిగమించగలుగుతారని భావించవచ్చు.
ఈ పాదయాత్రల వల్ల రాజకీయ పార్టీలకు వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమీ వుండకపోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా బోలెడు వ్యవధానం వుంది. అయితే, రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి. తమ నడుమ వుండేవారికే జనం ఈ నడుమ పట్టం కడుతున్నారు. ఏసీ గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారు.
ప్రజల ఇబ్బందులను, కడగండ్లను దగ్గరనుంచి కళ్ళారా చూడగలిగే అరుదైన అవకాశం ఈ పాదయాత్రల వల్ల రాజకీయ నాయకులకు లభిస్తుంది. భవిష్యత్తులో అధికారం దక్కినప్పుడు వాటిల్లో కొన్నింటిని అయినా పరిష్కరించ గలిగితే యాత్రా ఫలసిద్ధి కూడా ప్రాప్తిస్తుంది.
2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ‘ప్రజా ప్రస్తానం’ పాదయాత్ర రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు పూర్వం చంద్రబాబు ‘వస్తున్నా ..మీకోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి మొదలై, పదమూడు జిల్లాలమీదుగా 2340 కిలోమీటర్లు సాగి శ్ర్రీకాకుళం జిల్లా ‘ఇచ్చాపురం’లోనే ముగిసింది. ఆ ఊరు పేరుకు తగ్గట్టే, మనోవాంఛాఫలసిధ్యర్ధం ఈ ఇద్దరు నాయకులు తమ తమ యాత్రలకు తుది మజిలీగా ‘ఇచ్చాపురాన్ని ఎంపిక చేసుకున్నారేమో అనిపిస్తుంది. వారు తలపోసినట్టుగానే ఇద్దరికీ కోరిక నెరవేరింది. దానితో రాజకీయ నాయకుల్లో పాదయాత్రల సెంటిమెంటు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఏదయితేనేం, ఏ పేరుతొ అయితేనేం, నాయకులు తమ రమ్య హర్మ్య భవనాలు ఒదిలి, కొద్ది కాలం అయినా సాధారణ ప్రజలతో మమేకం అయ్యే వీలు వీటితో ఏర్పడింది.
రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే అని జనాలు సంతోషించాలి. ప్రజలు అల్పసంతోషులు కదా!
ఉపశృతి:
‘పులి పులే. మేక మేకే. అయితే..’ ఆగాడు ఏకాంబరం.
‘ఈ మాట చెప్పడానికి, అయితే అంటూ ఆ సన్నాయినొక్కులు ఎందుకు? పులి పులే కదా!’ అన్నాడు పీతాంబరం.
‘తొందరపడకు పీతాంబరం. కొన్ని సందర్భాలలో ఇలా అంటే కుదరదు. పులి మేకలకు నాయకత్వం వహించాలి అంటే మేకలకు ముందు నడవాలి. మేకలను ఎత్తుకుపోదామని చూసేవాళ్ళు పులిని చూసి బెదిరి పారిపోతారు. అదే పులి మేకలకు వెనక నడిస్తే, ఆ మేకల మందను చూసి ఎవరూ భయపడరు. కాబట్టి నాయకుడు అన్నవాడు పులి మాదిరిగా అనుచరులకు ముందు నడవాలి. ముందుండి నడపాలి. వెనక వుంటానంటే కుదరదు. వెనక వుంటే పులి కూడా మేక మాదిరే.’
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి