5, సెప్టెంబర్ 2022, సోమవారం

ముగ్గురు గురువులు - భండారు శ్రీనివాసరావు

 (సెప్టెంబరు అయిదు- ఉపాధ్యాయ దినోత్సవం)

‘సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి

యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః’

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.

ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ  పడనివాడే ఉత్తమ గురువు. ‘నేను  పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నాను’ అని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా  వుంటుంది. అలాగే ‘పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడు’ అని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.

గురు శిష్యుల గురించి  చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్  పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న వృత్తాంతం గుర్తుకువస్తోంది.

“ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి  విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు  చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.

“తమరు నాకు పనికి వచ్చే చదువు  చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు”

ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.”

మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.

1921 వ  సంవత్సరం. అంటే వందేళ్ళ కిందటి మాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.”

పంతుళ్ళ చెవులకు శిష్యులు  తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.

ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.

ఈ రోజు సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.

అక్షరబిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.

నా చిన్నతనంలో మా ఊరిలో షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది.  ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరు టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు.  బ్లాకు బోర్డులు లేవు. విద్యార్ధులలో చాలామందికి పలకా బలపాలు ఉండేవి కావు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ, ఇవి వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.

అప్పయ్య మాస్టారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించేవారు. అంతసేపు నాకు ఒంట్లో వణుకు. అసలు ఆయన్ని చూస్తూనే భయం. కానీ అప్పయ్య మాస్టారు కొట్టో, తిట్టో నేర్పించిన నాలుగు అక్షరాలే నాకు జీవితంలో ఒక మార్గం చూపాయి. వీడికి పొట్ట కొస్తే అక్షరం ముక్క రాదు అనే మాటలు పడకుండా కాపాడాయి. 

ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడిలో పడి,  ఏ రోగం రొష్టు బారినపడకుండా అనాయాస మరణానికి నోచుకున్నారు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది.  మాకు ఇంత అక్షరభిక్ష పెట్టిన మహానుభావుడు కనుకే మహానుభావులకు మాత్రమే లభించే సునాయాస మరణం ఆయనకు దక్కింది.

మరో యాదృచ్చికం. అప్పయ్యగారి మరణ వార్త గురించిన ఫోను వచ్చినప్పుడు నేను ‘రేడియో రోజులు’ మరో భాగం మొదలు పెడుతున్నాను. ఇందులో కాకతాళీయం ఏమిటంటే అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్ అనే విషయం రాస్తున్నాను.   అదేమిటంటారా!

మాచిన్నప్పుడు గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంద్రపత్రిక దినపత్రికను  పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు  మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. ‘అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్. కెనడీ ఎన్నిక. ఓటమి అంగీకరిస్తూ రిచర్డ్ నిక్సన్  ప్రకటన’ అంటూ ఆయన చదివే వార్తలు వింటుంటే, అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.

ఉపాధ్యాయ దినోత్సవంనాడు ఆయన్ని సంస్మరించుకుంటూ -    

గురుద్దేవో నమః

కింది ఫోటో: కీర్తిశేషులు శివరాజు అప్పయ్య పంతులు గారు




కామెంట్‌లు లేవు: