15, నవంబర్ 2016, మంగళవారం

ఒకరికి ఇబ్బంది, మరొకరికి కష్టం

నోట్ల రద్దు అంశం కేవలం మోడీకి, ఆయన ప్రత్యర్ధులకు సంబంధించింది కాదు. యావత్ ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తున్న సమస్య. ఇబ్బందులకు, కష్టాలకు తేడా వుంది. మనం ఇబ్బంది అనుకున్నది వేరొకరికి కష్టంగా వుంటుంది. మన జీవన సరళిని బట్టి ఈ భావన మారుతూ వుంటుంది. తినడానికి రొట్టె లేదని ఒక పేద పిల్ల  ఆకలితో ఏడుస్తుంటే ఓ  రాజకుమారి,  'రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా నా లాగా' అందట. 
మీడియా పనికట్టుకుని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని అంటున్నారు. మీడియా వ్యతిరేకం అయినంత మాత్రాన పిడుగులు పడవు. ట్రంప్ కు మీడియా పూర్తిగా వ్యతిరేకం. అయినా అక్కడ ఏం జరిగింది? మీడియాని పక్కన పెట్టండి.
దేశంలో సామాన్యుడికి ఊరట కలిగించేవి చిన్న చిన్న  కార్టూన్లు, జోకులు. సీరియస్  వాతావరణం నుంచి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. రాజకీయ నాయకుల్లో సెన్స్ ఆఫ్  హ్యూమర్ రోజురోజుకీ తగ్గిపోతోంది. ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో  ఇదొకటి. ఒక పాత సంగతి ముచ్చటించుకుందాం.   1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి  ఘోర పరాభవం ఎదురయినప్పుడు,  ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్,  నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్  కారణంగా ఆయన అభిమానులనుంచి దాడి తప్పదు అని  అనుకుంటుంటే, లక్ష్మణ్ గారికి  నెహ్రూ నుంచి ఉత్తరం వచ్చింది.
‘పొద్దున్నే పత్రికలో మీ కార్టూన్ చూసి నాకెంతో సంతోషమయింది. అది చూడగానే నా మనసుకు ప్రశాంతత చిక్కింది.  దాన్ని కొంత పెద్దదిగా గీసి పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అని రాశారు నెహ్రూ.
ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు  కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.
బాపూ సినిమాలో రావు గోపాల రావు అన్నట్టు మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి.

అది కూడా రాజహంస మాదిరిగా పాలను నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.

వ్యాధికంటే చికిత్స ప్రమాదం కాకూడదు



రోగికి తక్షణం శస్త్రచికిత్స అవసరం అని వైద్యుడు నిర్ణయించాడు. దుష్టాంగాన్ని ఖండించి శిష్టాంగాన్ని కాపాడాలని అనుకున్నాడు. రోగి బంధువులు అంగీకరించారు. ఆపరేషన్ థియేటర్  లోకి తీసుకు వెళ్ళే ముందు బీపీ, షుగర్ పరీక్షలు చేస్తారు. అవి అదుపులో వుంటే తప్ప లేదా  ఎంతో అవసరం అనుకుంటే తప్ప వైద్యుడు రోగి శరీరంపై కత్తి పెట్టడు.
ఇన్నేళ్ళ స్వతంత్ర  భారతం రుజాగ్రస్తం అయిపొయింది. నల్ల ధనం అనే మాయ  రోగం జాతి ఒళ్ళంతా పాకింది. ఈ స్తితిలో వున్న దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలంటే పెద్ద నోట్ల రద్దువంటి శస్త్రచికిత్సలు అవసరమే. సందేహం లేదు. అయితే అందుకు జాతి సంసిద్ధంగా ఉందా! ఆ ‘ముందు’ జాగ్రత్తలు తీసుకోకుండా అడుగు ముందుకు వేయడం సబబేనా! ఇప్పుడు జరుగుతున్నది గమనిస్తుంటే జరిగింది సరయినదేనా అన్న అనుమానం కలిగితే దాన్ని సందేహించాలా!
రాజకీయ ‘శంక’ర్రావుల సంగతి పక్కన బెట్టండి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి.
ఉపసంహరణకు అవకాశం లేని బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిపోయింది.అది  గురితప్పకుండా చూసుకుంటూ,    సమస్యతో నేరుగా సంబంధం లేని వాళ్లపై దాని పరిణామాలు  పడకుండా చూడడం పాలకుల బాధ్యత.

       

11, నవంబర్ 2016, శుక్రవారం

నల్ల కుబేరులపై మోడీ బ్రహ్మ శిరోనామకాస్త్రం - భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 13-11-16, SUNDAY)

1978 వ సంవత్సరం. జనవరి నెల. 14 వ తేదీ ఉదయం.
ముంబై (అప్పుడు బొంబాయి) లో వున్న రిజర్వ్ బ్యాంకు  చీఫ్ అక్కౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం.
జానకి  రామన్ బొంబాయి నుంచి బయలుదేరి  ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు ఒక ఆర్డినెన్స్  ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువకలిగిన  కరెన్సీ నోట్లని చెలామణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని, ఇదంతా చాలా గోప్యంగా జరగాలని  రామన్ ను ఆదేశించారు.
ఇప్పట్లా ఆరోజుల్లో సెల్ ఫోన్ వంటి కమ్యూనికేషన్ సదుపాయాలు లేవు. అయినా ఆర్బీఐ  కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం బయటకి పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
అనుకున్న పద్దతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారుఝాముకల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది.  ముందు జాగ్రత్తగా జనవరి పదిహేడునాడు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, ప్రభుత్వ ట్రెజరీలు మూసివేశారు.
అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్ కు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నది ఆయన అభిప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు.
భారతీయ ఆర్ధిక విధానాలు అనే అంశంపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు.
“పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్ధిక మంత్రి హెచ్.ఎం.పటేల్ నాతొ ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.
“సాధారణంగా అవినీతి, అక్రమ  పద్ధతుల్లో భారీఎత్తున  డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను  కరెన్సీ రూపంలో  ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు” అన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పటేల్ అభిప్రాయం.
“నల్ల డబ్బును సూట్ కేసుల్లో, దిండ్ల కవర్లలో కుక్కి దాస్తారని అనుకోవడం అజ్ఞానమే అవుతుంది” అని కూడా పటేల్ మహాశయులు అభిప్రాయపడ్డారు.
ఇది జరిగి  38 ఏళ్ళు అవుతోంది.
నాడు  1978లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం ముగిసిన తరువాత ప్రజల తీర్పుతో కేంద్రంలో  అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కాంగ్రెసేతర జనత ప్రభుత్వం వెయ్యి, అయిదు వేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేయాలని సంకల్పించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసింది. అప్పుడు జనత ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్  కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత అయిదువందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో కొలువు తీరి వున్నప్పుడు తీసుకోవడం కొట్టవచ్చినట్టు కానవచ్చే మరో పోలిక.
కాకపొతే అప్పటికన్నా ఈసారి మోడీ ప్రభుత్వం  గోప్యతను మరింత పకడ్బందీగా పాటించినట్టు కనబడుతుంది.

గత మంగళవారం సాయంత్రం  ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. అంతకు ముందు ప్రధాని త్రివిధ సైనిక దళాల అధిపతులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఏర్పడి వుండడం చేత ప్రధాని అనుకు సంబంధించి ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. క్యాబినెట్  ఎజెండాలో ఈ నిర్ణయానికి సంబంధించి కానీ, సరిహద్దులలో తీవ్రత గురించిన   అంశం కానీ  ఏదీ లేదు. సమావేశం ముగిసే సమయంలో ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల చెలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చోబెట్టి ప్రభుత్వ  సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియచేడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజల నుద్దేశించి రేడియో, దూరదర్సన్ లలో ప్రసంగించారు. ఆ సంస్థల అధికారులకికూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. మంత్రులు కూడా సమావేశ మందిరం నుంచే ప్రధాని ప్రసంగం విన్నారు.  ఆ తరువాతనే వారు బయటకు వెళ్ళారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ ఆరుమాసాల క్రితమే తీసుకున్నారని, అప్పటినుంచి దాన్ని అమలు చేయడానికి దశలవారీ ప్రణాళిక రూపొందించుకున్నారని భోగట్టా. అందులో భాగమే మొన్నీ మధ్య అమలు చేసిన స్వచ్చంద ఆదాయ వెల్లడి పధకం. గోప్యత చాలా కీలకం అని భావించిన నరేంద్ర మోడీ, చాలా కాలంనుంచే మంత్రివర్గ సమావేశాలకు మంత్రులుఎవరూ తమవెంట సెల్ ఫోన్లు తెచ్చుకోకుండా కట్టడి చేసారు.
నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అని,  రిజర్వ్ బ్యాక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరని  తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. మొత్తం వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా ఉంచినా ఇలాంటిది ఏదో జరగబోతోందన్న సంకేతాలు మాత్రం గత కొద్ది కాలంగా వెలువడుతూనే వున్నాయి. కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారుచేయడం, ఆమోదించడం, ఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం జరిగిపోయాయి. అయితే ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇది షరా మామూలుగా జరిగే నోట్ల ముద్రణగా భావించారు కానీ దీని వెనుక ఇంత భారీ నిర్ణయం వుందని అంచనా వేయలేకపోయారు.     
ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనే దాన్ని విన్న ఆసేతుహిమాచలం ప్రజలందరికీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోడీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభిప్రాయం కలిగింది. మొనగాడంటే మోడీ అనే రీతిలో సాంఘిక మాధ్యమాల్లో మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. “కొద్ది రోజులు కటకటపడితే పడదాము, కష్టాలు శాస్వితంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దు” అనే భావన సర్వత్రా కనబడింది.
రాత్రంతా సాగిన ఆ భావనలు మర్నాడు కూడా కొనసాగి, నిర్ణయ ప్రభావం కొద్దికొద్దిగా అనుభవంలోకి రావడం మొదలుకాగానే  అవి మనస్సులో నుంచి వైదొలగడం మొదలయింది.  సంపన్నులపై  ముఖ్యంగా నల్ల కుబేరులపై ప్రధాని మోడీ ప్రయోగించిన ఈ సర్జికల్ స్ట్రైక్  గురి తప్పి సామాన్యులను తాకిందేమో అనే సంశయం సన్నగా మొదలయింది. మీడియా వార్తలు దానికి ఆజ్యం పోసి మరింత పెంచాయి. మోడీ ఈ అస్త్రాన్ని యూపీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని వాడారనే ఆరోపణలు అనుమానాలను రగిలించాయి. బీజేపీ సహజంగా సంపన్న వర్గాల కొమ్ము కాస్తుందనే అపప్రధను ప్రత్యర్ధులు మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. ఏటీఎం లలో డబ్బు లేకపోవడం, బ్యాంకులకు సెలవు ప్రకటించడం, నోట్ల మార్పిడికి వ్యవధానం అతి తక్కువగా వుండడం వెరసి ఇవన్నీ మోడీ నిర్ణయాన్ని తప్పుపట్టే దిశగా సాగాయి. అయితే ప్రభుత్వం ముందే చెప్పినట్టు గంటలు గడుస్తున్న కొద్దీ పరిస్తితుల్లో ముందు కానవచ్చిన తీవ్రత  కొద్దికొద్దిగా తగ్గడం మొదలయింది. అనుకున్నంత కాకపోయినా కొద్ది కొద్ది మొత్తాలలో చెలామణీలో వున్న కరెన్సీ చేతుల్లో పడడంతో జనం ఊపిరి పీల్చుకోవడం మొదలెట్టారు. అయినా శంకలు పూర్తిగా తొలగిపోలేదు. జవాబు దొరకని ప్రశ్నలు కొన్ని జనం మెదళ్ళలో మెసులుతూనే వున్నాయి. ఒక చేత్తో వెయ్యి నోటు రద్దు చేసిన ప్రభుత్వం ఆ ఉత్తర్వుపై చేసిన  సంతకం తడి ఆరకముందే మరో చేత్తో రెండువేల రూపాయల నోటును చెలామణీ లోకి ఎందుకు తెచ్చినట్టు? అయిదు వందల పాత నోటును తీసేసి, కొత్త అయిదు వందల కరెన్సీ నోటు తేబోతున్నట్టు ప్రకటించడం ఎందుకు? జనాలను ఇంత లాయలాసకు గురిచేసి, దేశంలో నల్లధనం  మళ్ళీ రాశులుగా  పోగుపడడానికి ఉపకరించే రెండు వేల నోటు తేవడం ఎందుకు?
ఇవన్నీ జవాబు తెలియని ప్రశ్నలే కానీ నిజానికి సమాధానం లేనివి కావు. సమాధానం చెప్పేవాళ్ళు లేకపోతే అది సందేహంగా మారుతుంది. క్రమంగా అనుమానం రూపం సంతరించుకుంటుంది. ఆ క్రమాన్ని అడ్డుకోకపోతే ఆగ్రహంగా పరిణమిస్తుంది.
ప్రస్తుతానికి అయితే జనాల మనస్సులో ప్రశ్నలు మాత్రమే వున్నాయి.
బంతి ప్రభుత్వం కోర్టులోనే వుంది. 
ఉపశృతి:
మహా భారత యుద్ధ పరిసమాప్తి కాలంలో అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం, అభిమన్యుడి అర్ధాంగి ఉత్తర గర్భంలో పెరుగుతున్న పాండవ వంశాంకురాన్ని తుదముట్టించబోయేటప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రం అడ్డువేసి తల్లీకొడుకులను కాపాడతాడు. అసలీ అస్త్ర మహత్యమే అద్భుతం. ప్రయోగించిన వీరుడు మంత్రశక్తితో ఆవాహన చేసి నిర్దేశించిన లక్ష్యానికి మినహా మరెవరికీ హాని కలిగించక పోవడం ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రత్యేకత. ఒకరకంగా చెప్పాలంటే, మోడీ పుణ్యమా అని ఈనాడు బహుళ  ప్రాచుర్యంలో వున్న’సర్జికల్ స్ట్రైక్’  లాంటిదని  చెప్పుకోవచ్చు.
(11-11-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:98491 30595 

10, నవంబర్ 2016, గురువారం

కరెన్సీ నోట్లను ప్రభుత్వాలు రద్దు చేయొచ్చా! అటువంటి అధికారం వాటికి ఉందా!


ఈ  అంశాలపై  తీవ్రమైన చర్చ సాగుతోంది.
రద్దు చేసే అధికారం వుంది అని వాదించేవాళ్ళతో ఏ చిక్కూ లేదు. కానీ లేదనే వాళ్ళు ఒక వాదం చెబుతున్నారు. ఒక రూపాయి నోటు మీద ఫైనాన్స్ సెక్రెటరీ సంతకం వుంటుంది. అదే అంతకు మించిన విలువకలిగిన నోట్లమీద ‘ఇది ప్రామిసరీ నోటు. ఇది కలిగిన వాళ్లకు అదే విలువను తిరిగి చెల్లిస్తామని రిజర్వ్ బ్యాంకు పూచీ ఇస్తున్నట్టు రాసివుంటుంది.

(I PROMISE TO PAY THE BEARER THE SUM OF ONE HUNDRED RUPEES/ FIVE HUNDRED RUPEES/ ONE THOUSAND RUPEES) ప్రామిసరీ నోటు చెల్లుబడికి కొంత కాల వ్యవధి వుంటుంది. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోటు కు కాల వ్యవధి వుండదు. ఒకవేళ కాలదోషం పడితే అంటే బాగా నలిగిపోయి చిరిగిపోయే స్థితికి చేరుకుంటే దాన్ని రిజర్వ్ బ్యాంకులో ఇచ్చి కొత్త నోటు తీసుకునే వీలుంది. ప్రభుత్వాలకు కరెన్సీని   చెలామణీ నుంచి తప్పించే అధికారం వుంటుంది కానీ వాటిని పూర్తిగా రద్దుచేసే అధికారం లేదన్నది వారి వాదన. పాత నోటు అంటే చెలామణీ నుంచి తప్పించిన నోటుకి బదులు వేరే నోటు ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సి వుంటుంది.  బ్యాంకులు డిపాజిట్ చేయడానికి తిరస్కరించ కూడదు అనేది వారి అభిప్రాయం. కాకపొతే, అలాంటి డిపాజిట్ దారులని ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించే వీలుంటుంది.

ఈ వాదన ఎంతవరకు సబబు అనేది ఇటువంటి ఆర్ధిక విషయాల్లో నిష్ణాతులయిన వాళ్ళే చెప్పాలి

NOTE: COURTESY IMAGE OWNER       

9, నవంబర్ 2016, బుధవారం

బిచ్చగాడి వీలునామా!


ఓ బిచ్చగాడు వీలునామా రాసి చనిపోయాడు.
“ నా ముల్లెలో మూడు వేల అయిదు రూపాయల నోట్లు, ఆరు వేల పది రూపాయల నోట్లు, ముప్పయివేల వంద రూపాయల నోట్లు ఇంకా బోలెడు చిల్లర పైసలు వున్నాయి. ఈ సంపద కూడబెట్టడానికి నేను జీవితాంతం రేయింబవళ్ళు కష్టపడ్డాను. అయితే ఇది అనుభవించడానికి నాకు వారసులు ఎవరూ లేరు. అందుకే, ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏవైనా సంక్షేమ కార్యక్రమాలకు  వాడాలని వీలునామా రాస్తున్నాను.”
చిత్రం! ఈ వార్త అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ప్రముఖంగా వచ్చింది.  


Modi's Surgical Strike

Prime Minister Narendra Modi's Surgical Strike on BLACK MONEY 

8, నవంబర్ 2016, మంగళవారం

నేను సైతం.....

నేను సైతం ఈరోజు నా దేశ ఋణం కొద్దిగా తీర్చుకున్నాను
ఈరోజు ఊబెర్ అద్దె వాహనంలో ప్రయాణించాను. అతడికి బిల్లు చెల్లించాను. తరువాత ఊబెర్ కంపెనీ నుంచి నాకు వచ్చిన మెయిల్ లో ఇలా వుంది:
Before Taxes
112.26

Service tax (4.2%)
4.71

Swachh Bharat Cess (0.15%)
0.17

Krishi Kalyan Cess (0.15%)
0.17
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEj2xvmyRz4n7U92_ulsVgfeEe-7sD20GewQaPtLOLB7AGFahrIp0mf-e5LdYf2Sq7HHWWGqehJqjPdVkfuzGii0KpjUfcK-fPNX_TKgrEpb6oteLLhMKGP6PRc-ys202znBWoRlzuf0swzTtvoTpieBs-NSwEUpjZweiJpDw3mu=s0-d-e1-ft

COLLECTED
₹ 117.31



అంటే ఏమిటన్నమాట. సర్వీసు టాక్స్ 4.2 శాతం , నాలుగు రూపాయల డెబ్బయి ఒక్క పైసలు, స్వచ్చ భారత్ సెస్సు  0.15 శాతం పదిహేడు పైసలు, క్రిషి కళ్యాణ్ సెస్సు 0.15  శాతం  మరో పదిహేడు పైసలు  చెల్లించినట్టు రసీదులో వుంది. నా దగ్గరనుంచి వసూలుచేసిన ఈ సొమ్ము క్షేమంగా సర్కారు ఖజానాకు చేరుతుందని ఆశించడం సగటు పౌరుడిగా నా ధర్మం. ఇలా ప్రతి రోజూ, ప్రతి పౌరుడు తాను పెడుతున్న ప్రతి ఖర్చులో   సర్కారుకు చెల్లించే పన్ను, సెస్సు  వివరాలు ఎప్పటికప్పుడు ఇలా తెలియచేస్తూ సర్కారు ఖజానాలో మనకో ఖాతా తెరిచి అందులో నమోదు చేస్తుంటే కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. ఎందుకంటే ఈదేశంలో ప్రతి ఒక్కరూ అనుమానం ముందు పుట్టి తరువాత వాళ్ళు పుడతారు. ఇంతకీ ఈ సొమ్ము( అక్షరాలా అయిదు రూపాయల అయిదు పైసలు) ఖజానాలో జమ అయినట్టేనా!