20, ఆగస్టు 2016, శనివారం

తేడా

ఆసేతుహిమాచలం ‘సింధు’నామ జపంతో పులకాంకితమైంది.
యావత్ మీడియా సింధు స్మరణతో ధన్యమైంది.
నయీం అనే రెండక్షరాలకు, సింధు అనే మరో రెండక్షరాలకు వున్న తేడా ఏమిటో జనాలకు తెలిసిపోయింది.

మంచిని తలచుకోవడంలో వున్న ఆనందమే వేరు కదా!

19, ఆగస్టు 2016, శుక్రవారం

మారుతున్న తరాలు

మారుతున్న తరాలు

“తనకు అందరూ తెలుస్తారు. కానీ తనెవరో అందరికీ  తెలియదు.
అందర్నీ తను గుర్తుపడతాడు, గుర్తుంచుకుంటాడు, కానీ తానెవరో వారికి గుర్తుండకపోవచ్చు.”
ఈ పొడుపు కధకు సమాధానం ‘జర్నలిష్టు’. మరీ ఖచ్చితంగా చెప్పాలంటే మాజీ జర్నలిష్టు. అంటే రిటైరయిన జర్నలిష్టు.
అతడికి ఎప్పటికీ మిగిలేవి జ్ఞాపకాలే.
జర్నలిష్టుగా వున్న రోజుల్లో వృత్తి రీత్యా  అనేకమందితో ముఖపరిచయం సహజం. మరి  కొందరితో అతి పరిచయం కూడా అంతే సహజం.
బాగా పాత తరానికి చెందిన జలగం వెంగళరావు, అంజయ్య, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, రోశయ్య మొదలయిన వారితో చాలా సాన్నిహిత్యం వుండేది.  మరో ముగ్గురు ముఖ్యమంత్రులు  చంద్రబాబు, వైయస్సార్ లతో  చెప్పుకోదగ్గ పరిచయం వుండేది. కేసీఆర్ గతంలో మంత్రిగా వున్నప్పుడు మిగిలిన జర్నలిష్టులతో పాటే నాకూ ఆయనతో మంచి పరిచయమే వుండేది.
వీరి వారసులు, నేటి తరం యువ నాయకులు  జగన్, కేటీఆర్, లోకేష్ లతో ముఖ పరిచయం కాదుకదా ఎన్నడూ ఎదురుపడి  కలుసుకోవడం కూడా జరగలేదు. ప్రెస్ క్లబ్ పుణ్యమా అని కేటీఆర్ ని ఓసారి  కలిసాను. జగన్ మోహన రెడ్డిని  టీవీల్లో చూడడమే.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు లోకేష్ చిన్న పిల్లవాడు. జూబిలీ హిల్స్  లోని  వాళ్ళ ఇంటికి  తరచూ వెడుతూ వున్న రోజుల్లో బయట  కనబడేవాడు. పెద్దయి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కలిసే సందర్భం ఎన్నడూ  తారసపడలేదు.
రాత్రి జనార్ధన్ అమ్మాయి పెళ్ళిలో కనబడ్డారు. టీడీపీ నాయకుడు  దినకర్, ఎన్టీవీ రుషినీ, నన్నూ  పలానా అని ఆయనకి పరిచయం చేశారు.
అంత హడావిడిలో కూడా ఆయన మా దగ్గర కాసేపు  ఆగి,  ‘అమరావతికి ఎప్పుడు వస్తున్నారు అని రుషిని ప్రశ్నిస్తూ  నా వైపు చూసి, టీవీ ఎనలిష్టు  అంటూ చిరునవ్వుతో పలకరించి ముందుకు వెళ్ళిపోయారు.
మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన రేడియో, డీడీ ‘చెవులు’ ఎటుపోయాయో, కొత్తగా వచ్చిన ఈ టీవీ ఎనలిష్టు ‘కొమ్ములు’ ఏవిటో! ముందు బోధపడలేదు.
ఆలోచిస్తే  అర్ధం అయింది. నిజమే. నేనూ  ఇలా ప్రవర్తించిన వాడినే.
నాకంటే  పాతతరం వాళ్ళు  ఎప్పుడూ నాగయ్య, నారాయణరావు, శ్రీ రంజని గురించి మాట్లాడుతుండేవాళ్ళు. అప్పటికే ఏ యెన్ ఆర్, ఎన్టీఆర్  తరం వచ్చేసింది. నాగయ్య  అనగానే  మంచం మీద దగ్గుతూ, గెడ్డం నెరిసిన మనిషే  కళ్ళల్లో మెదిలేవాడు. గతంలో ఆయన తారాపధంలో  ఓ వెలుగు వెలిగిన సంగతులు  మా  పాత తరం వాళ్లకు  తెలుసు కానీ  మాకు తెలియవు. అలాగే  నేటి తరం అస్తమానం తలచుకుండే తారలని  సినిమాల్లో చూసినా  గుర్తు పట్టలేని  పరిస్తితి  మా తరానిది.
ఈ సత్యం బోధపడితే  తరాల  అంతరాల్లో తేడాలని సరిగ్గా అర్ధం చేసుకోవచ్చు. లేకపోతే మిగిలేవి అపార్ధాలే!       


18, ఆగస్టు 2016, గురువారం

అక్షరాలా ఆరులక్షలు


కొన్నేళ్ళ క్రితం ఈ బ్లాగు ప్రపంచంలో కొత్తగా అక్షరాలు దిద్దడం మొదలు పెట్టినప్పుడు, ఇన్నిన్ని అంశాలపై ఇన్ని వ్యాసాలు రాస్తానని,  రాయగలుగుతానని నేను కలలో కూడా  అనుకోలేదు. ఎందుకంటే అప్పటికి నాకు అన్నీ కొత్తే. కంప్యూటర్ కొత్త. కంప్యూటర్ లో తెలుగు అక్షరాలు టైప్ చేయడం కొత్త. నేర్చుకున్న తరువాత కూడా వేగంగా రాయడం కొత్త.
అయినా కొన్నాళ్ళకే అన్నీ పాతపడిపోయాయి. నేనూ అలవాటు పడిపోయాను.
ఫలితం ఇదిగో ఇవ్వాళ కళ్ళారా చూస్తున్నాను.


ఆరు లక్షల హిట్లు. రెండు వేల రెండువందల పై చిలుకు పోస్టింగులు. పాఠకులనుంచి వందలాది వ్యాఖ్యలు, స్పందనలు, అభినందనలు, చురుక్కుమనిపించే విమర్శలు. అర్ధవంతమయిన సమీక్షలు. తప్పులు దిద్ది సరిదిద్దుకునేలా చేసిన హితవరులు. అబ్బో! చాలా సంపదే కూడబెట్టుకున్నాను.
రాయడం సంగతేమో కానీ, చదవడానికి మాత్రం చాలా కష్టపడాలి. అనుభవం బోధించిన వాస్తవం ఇది. అంచేత...

కష్టపడి నన్నింత  సంపన్నుడిని చేసిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 

(COURTESY IMAGE OWNER)

17, ఆగస్టు 2016, బుధవారం

మరుగున పడిన అసలు పేర్లు

నిన్ననే ఆదిరాజు పుస్తకంలో చదివాను. మర్రిచెన్నారెడ్డి పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ప్రకారం అచ్యుతరెడ్డి అని నామకరణం చేసారు. తల్లి శంకరమ్మ, చనిపోయిన తన తండ్రిని తలచుకుంటూ పిల్లవాడిని చెన్నారెడ్డి అంటూ పిలిచేది. చివరికి ఆ పేరే స్థిరపడిపొయిందట.
అలాగే  ద్రోణంరాజు  సత్యనారాయణ ఇంటి పేరు దిట్టకవి, ద్రోణంరాజు కాదు.

కంప్యూటర్ ఆడా మగా ......


.......అనే ధర్మసందేహం ఒక టీచరుకు కలిగింది. టీచరు తలచుకుంటే టెస్టులకు కొదవేమిటి? వెంటనే క్లాసులో పిల్లల్ని కంప్యూటర్ ఆడా, మగాఅనే ప్రశ్నకు జవాబులు కారణాలతో సహా కోరింది.


క్లాసులోని ఆడపిల్లలు అందరూ కంప్యూటర్ ‘మగ’ అని రాస్తే,  మగపిల్లలు ‘ఆడ’ అని రాశారు.
ఆడపిల్లలు చెప్పిన కారణాలు:
“ఏపని చేయించాలన్నా ముందు కంప్యూటర్లను ఆన్ చేసి వుంచాలి. మగవాళ్ళు  అదే బాపతు. లేకపోతే ఎక్కడి గొంగడి అక్కడే అన్న సామెతే.
“ఏ సమస్య వచ్చినా నిజానికి అవి పరిష్కరించాలి. కానీ మగ జాతి కదా! అవే ఎప్పుడూ  ఒక సమస్యగా మారతాయి.”
“మంచి కంప్యూటర్  అని కొనుక్కుంటాము. అదేవిటో మరో జెనరేషన్ కంప్యూటర్  కళ్ళబడగానే, ‘తొందరపడ్డామేమో, కొన్నాళ్ళు ఆగితే బాగుండేదేమో అని మనసులో తొలుస్తుంది.
అంచేత కంప్యూటర్ మగ పురుగే. సందేహం లేదు”

ఇక మగపిల్లలు పేర్కొన్న కారణాలు:
“పుట్టించిన దేవుడు లేదా వాటిని తయారుచేసిన వాడు తప్పిస్తే చస్తే వేరెవ్వరూ వాటి మనసులో ఏముందో కనుక్కోలేరు. ఈ విషయంలో ఆడవాళ్ళు, కంప్యూటర్లు ఒక్కటే.
“చిన్న చిన్న తప్పుల్ని  కూడా గుర్తుపెట్టుకుని అవసరమైనప్పుడు వాటిని ఎత్తి చూపే సామర్ధ్యం కంప్యూటర్లకు  వుంది. ఇక అనుమానం ఏల?
కంప్యూటర్ ఖచ్చితంగా   ఆడజాతే.”

NOTE: COURTESY IMAGE OWNER



పరాశర గోత్రోద్భవ......

(నిన్న మంగళవారం మా అమ్మగారి తిధి. పితామహః, ప్రప్రితా మహః అంటూ పూర్వీకులను స్మరించేటప్పుడు ఈ  విషయాలు స్పురణకు వచ్చాయి)

"ఖ్యాతి, భృగువు భార్య. ఆమె యందు భృగువు ఇద్దరు పుత్రులనుకన్నాడు. వారు పేర్లు ధాత, విధాత. వారి పుత్రులు ప్రాణుడు, మృకండుడు.
ఇద్దరికీ జన్మించిన  పుత్రసంతానం ఇలా వుంది....ప్రాణుని కొడుకు ద్యుతిమంతుడు. అతడి కుమారుడు  అజావంతుడు, అజావంతుని పుత్రుడు వంశుడు. పొతే,  మృకండుముని పుత్రుడు మార్కండేయుడు. మహామునికి జన్మించినవాడు వేదశిరుడు. ఇక్కడికి ఇలా ఉండనీ!
నవబ్రహ్మల్లో ఇంకొకడు మరీచి మహర్షి. మహర్షికి సంభూతి భార్య. వీరి సంతానం పౌర్ణమాసుడు. ఇతడికే విరజుడు పర్వతుడు అని ఇద్దరు పుత్రులు.
ఇట్లాగే మరొక బ్రహ్మ అంగీరసుడున్నాడు. ఈతని భార్య స్మృతి. సినీవాలి, కుహువు, అనుమతి అనే కన్య వీరి సంతానం.
అత్రి మహర్షి అనే బ్రహ్మకు అనసూయ సతి. మహాసాధ్వి ఈమె. వీరికి సోముడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు జన్మించారు. స్వాయంభువ మన్వంతరంలో ఇతడే అగస్త్యమహర్షి.
పులహునికి క్షమ యందు కర్దముడు, చార్వరీవంతుడు, సహిష్ణువు అని ముగ్గురు పుత్రులు జన్మించారు.
క్రతువునకు సంనతి అనే భార్య వల్ల బొటనవ్రేలి కణుపు ఎంత పరిమాణంలో ఉంటుందో, అంత ప్రమాణంలో వాలభిల్యుడు మొదలైన 60 వేల మంది పుత్రులు కలిగారు.
వసిష్ఠునికి ఊర్జవల్ల ఊర్థ్వబాహుడు, రజుడు, అనఘుడు, గోత్రుడు, సవనుడు, సుతపుడు, శుక్రుడు జన్మించారు. వీరు ఉత్తమ మనువుకాలంలో సప్తర్షులు.
బ్రహ్మ పెద్దకొడుకు వహ్నికి, స్వాహావల్ల గొప్ప ఓజస్సంపన్నులైన ముగ్గురు పుత్రులు కలిగారు. వీరే శుచి, పావకుడు, పవమానుడు. వీరికి తిరిగి జన్మించిన సంతానం 45 మందికి,  వహ్ని మొదలగు అగ్నులు కలిసి మొత్తం 49 మంది అగ్నులుగా సుప్రసిద్ధులు.
బ్రహ్మవల్ల సృజింపబడిన అగ్నిష్వాత్, బార్హిషద్, అనగ్న, సాగ్నాది సంతతి తెలిసింది కదా! స్వధాదేవికి పితృదేవుని వల్ల పితృగణాలు, మేన - వైతరణి అనే యిద్దరు బ్రహ్మవాదినులైన కన్యలు కలిగారు. సర్వశుభలక్షణలు, గొప్పజ్ఞానవంతురాళ్లు. దక్షకన్యల గురించిన సంగతులన్నీ విన్నావు కదా! వైనం శ్రద్ధగా స్మరించిన వారికి సంతానహీనత కలుగదు" అని చెప్పాడు "పరాశరుడు".


ఇదంతా అందరికీ అర్ధం అయ్యే రీతిలో చెప్పింది ఎవరో చెప్పాల్సిన పనిలేదు. ఇలా చెప్పగలిగిన ఒకే ఒక్కరు అందరికీ తెలిసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే మా గోత్రం "పరాశర" - అదీ విషయం - ఇంకో విషయం ఇది మోచర్ల  కృష్ణమోహన్ గారి  సౌజన్యం - భండారు శ్రీనివాసరావు