3, అక్టోబర్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (226) : భండారు శ్రీనివాసరావు

 మా బామ్మ మంచం, నా కంచం  

కాదేదీ కవితకనర్హం అన్నట్టు,  డెబ్బయ్ ఏళ్ళ కిందటి జ్ఞాపకం.

మా బామ్మగారు రుక్మిణమ్మ గారికి అప్పుడు అరవై ఏళ్ళు పైమాటే.  మొత్తం కుటుంబానికి ఆవిడ విక్టోరియా మహారాణి. నాన్న నాకు ఎరుకలేని చిన్నవయస్సులోనే పోయారు. ఆయనకు ఏడుగురు ఆడపిల్లలు. నలుగురు మగపిల్లలం. అయిదుగురు అక్కయ్యలకు ఆయన హయాములోనే పెళ్ళిళ్ళు అయ్యాయి. మగపిల్లలం చాలా చిన్నవాళ్ళం. మగ దక్షత లేని కుటుంబ భారాన్ని ఆవిడ అప్పటినుంచీ భుజాలకు ఎత్తుకుంది. లెక్కలు చెప్పుకోవడానికి పెద్ద ఆస్తి. కానీ లెక్క తీస్తే, కనబడే  అయివేజు అంతంత మాత్రం.

ఇదంతా ఎందుకంటే మా ఇంటికి మా బామ్మగారే మకుటం లేని రాణి అని చెప్పడానికి. ఇంట్లో ఆవిడకూమా అమ్మగారికీ వెండి భోజనం పళ్ళేలువాటి మధ్యలో ఒక బంగారం పువ్వు. పక్కనే వెండి గ్లాసులు. ఇంకా వెండి సామాను వుండేది కానీ అవన్నీ ఇనప్పెట్టె లో, వాటి తాళం చెవులు మా బామ్మగారి దిండు కిందా.

ఇంట్లో మిగిలిన వాళ్ళ కంచాలు అన్నీ రాతెండివే. బయటనుంచి వచ్చిన వాళ్ళకోసం  అమ్మ దొడ్లో ఉన్న బాదం చెట్టు ఆకులతో విస్తళ్ళు కుట్టేది.

కంచమే కాదుమా బామ్మ మంచం కూడా సపరేటే. ఇంట్లో చాలా మంచాలునవారువీనులకవీ ఉండేవి. ఆమె మంచం మాత్రం ఆమెకే ప్రత్యేకం. మిగిలిన మంచాల మీద ప్రోటోకాల్ ప్రకారం దిండ్లూదుప్పట్లూ మారుతుండేవి. అంటే బావగార్లు కానీ అతిధులు కానీ వస్తే వాళ్లకు నవారు మంచాలు. మిగిలిన వాళ్లకి నులక మంచాలు. ప్రతి రోజూ ఉదయం పూట ఈ మంచాలకు సళ్ళు లాగి బిగించే కార్యక్రమం ఒకటి నడుస్తుండేది. దాన్ని మా ప్రేమక్కయ్య పర్యవేక్షించేది. లాంతర్లుబుడ్డి దీపాలను ముగ్గుతో తుడిచి శుభ్రం చేసికిరసనాయిల్ పోసి సిద్ధం చేసే పని చిన్నక్కయ్య  భారతక్కయ్య మీద పడేది. అప్పటికి వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు కాలేదు.

 

కంచాలతో కదా మొదలు పెట్టింది. అప్పుడప్పుడే స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. అప్పటికి అవి మా  గృహ ప్రవేశం చేయలేదు. శారదక్కయ్య ఓసారి పండక్కి వస్తూ రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ మూడో అన్నయ్య వెంకటేశ్వరరావుకూ (వెంకప్ప) ఒకటీ ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు రెండూ కలిపి పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు నాన్న మూడు నెలల జీతం అన్న మాట. ఇహ అప్పుడు చూడాలి మా మొహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో తెలవదు కానీ అదెక్కినంత ఆనందం.

శారదక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు మోహం ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్ ఏళ్ళకు పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు లగేజి సమస్య కారణంగా ఆ కంచంతో నా రుణానుబంధం తెగిపోయింది.

తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది. డిన్నర్ ప్లేట్లుడిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాతచాలా కొద్ది మంది ఇళ్ళల్లో తప్పఇప్పుడు ఈ విడికంచాల గోల లేదు.

మళ్ళీ ముప్పయ్యారేళ్ళ తర్వాత మా ఆవిడకు కలిగిన వింత కోరిక పుణ్యమా అని నాకు తిరిగి సొంత కంచం వైభోగం వచ్చిపడింది. ఓ దసరా పండుగ సందర్భంగా ఆమె  చేసిన కొనుగోళ్లలో భాగంగా నాకు ఒక స్టీలు కంచం కొనుక్కొచ్చింది.

దానికి ప్రారంభోత్సవం చేయాలని సంకల్పం. దేవుడు మరోలా అనుకున్నాడు. కంచం మధ్యలో ఆ స్టీలు కంపెనీ వాడు ఒక పెద్ద స్టిక్కరు అతికించి కూర్చున్నాడు. దాన్ని తీయాలని మా పనిమనిషి గోటితో ప్రయత్నించింది. ఆ స్టిక్కరు ఊడిరాకపోగా అది వికటించి మరింత వికార స్వరూపం సంతరించుకుంది. ఇరుగింటి పొరుగింటి చిన్న ఆడ లేడీస్ (మరి మేము మాత్రమే ఈ అపార్ట్మెంట్లో అందరికీ ఆంటీలం, అంకుళ్ళం!) మరీ అంత చిన్నవాళ్ళేమీ కాదులెండిపిల్లలకు పిల్లలు ఉన్నవాళ్ళేకానీ ఆంటీ అంటే మాత్రం ఎంతో నొచ్చుకుంటారు, మధ్యలో కలగచేసుకునినీళ్ళు సలసలా మరగబెట్టిఆ వేడి వేడి నీళ్ళు గుమ్మరించి ఆ కంచానికి అభ్యంగన స్నానంసంప్రోక్షణ వగైరా సలక్షణంగా పూర్తి చేశారు కానీఆ స్టిక్కరు మాత్రం పోలింగు బూతులో వేలికి అసహ్యంగా అంటించిన ‘గుర్తు’ మాదిరిగా అలాగే వుండిపోయింది.

ఓ డౌటనుమానం కూడా మనసులోనే మిగిలి పోయింది.

అవునూ! ఈ స్టెయిన్ లెస్ స్టీల్ కంపెనీల వాళ్లు తమ కంపెనీ స్టిక్కరు, కంచాలకు వెనుక భాగంలో అరచేతి మందాన అంటిస్తే వాళ్ళ సొమ్మేమయినా పోతుందా!’

ఇప్పుడివన్నీ మరిచిపోలేని జ్ఞాపకాలు. కంచం వుంది. ముచ్చట పడి కొన్న మనిషే లేదు.

 

ఇక మంచం కధ

 

రేడియో ఉద్యోగం కోసం హైదరాబాదులో మేము కాపురం పెట్టిన పదేళ్లకు కాబోలు మొట్టమొదటిసారి మొదటి మంచం కొనుక్కున్నాము. ఇందుకోసం నేనూ మా ఆవిడా కలసి పెద్ద సర్వేనే చేసాం. ఎక్కడ మంచివి కొనుక్కోవచ్చని కాదు, ఎక్కడ కారు చౌకగా దొరుకుతాయాయని.

మొత్తం మీద లక్ డి కా పూల్  టెలిఫోన్ భవన్ దగ్గర మాకు తగ్గ షాపువాడు ఒకడు దొరికాడు. డెకొలం షీట్ వేసిన సింగిల్ కాట్స్ రెండూ కలిపి రెండు వందల యాభయ్ రూపాయలు. షాపువాడే రిక్షాలో వేసి పంపిస్తానన్నాడు. సాయంత్రానికల్లా అవి దిగాయి. వున్న రెండు గదుల్లో ఒక రూమును ఫినాయిల్ వేసి కడిగి సిద్ధంగా ఉంచాము. మంచాలు  వేయగా కాస్త కాళ్ళు కదపడానికి కాసింత జాగా మిగిలింది. మంచాలు అయితే వచ్చాయి కానీ వాటిమీద  దూది పరుపులు కొనడానికి మళ్ళీ ఒక నెల ఆగాల్సి వచ్చింది. ఏ పని చేయాలన్నా ఫస్ట్ తారీకు రావాలి కదా.

మొత్తం మీద పరుపులు కూడా అమిరాయి. ఇక ఆ మంచాలే మాకు సర్వస్వం అయిపోయాయి. నలుగురు కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవాలన్నా, చీట్ల పేకలు ఆడుకోవాలన్నా, ఆ మంచాల మీదనే. డైనింగ్ టేబుల్ అమిరే వరకు టిఫిన్లు, భోజనాలు కూడా వాటిమీదనే. నిజం చెప్పొద్దూ భోజనాల బల్లలు కొనుక్కున్న తర్వాత కూడా మంచాల మీద కూర్చునే అన్నాలు తినేవాళ్ళం.

ఉండడానికి మరో రూము వుంది కానీ, ఆ గది పగలల్లా అమ్మవొడి. అంటే మా ఆవిడ నడిపే చైల్డ్ కేర్ సెంటర్ అన్నమాట. పదిహేను ఇరవైమంది పసిపిల్లలు, చిన్న పిల్లలతో కీసర బాసరగా వుండేది. సాయంత్రం కాగానే శుభ్రంగా కడిగించి వుంచేది. ఇక అప్పటినుంచి అది పర్మిషన్ అక్కరలేని పేకాట క్లబ్ గా మారిపోయేది. పెద్ద పెద్ద వాళ్ళు సాయంత్రానికల్లా అక్కడ జమయ్యే వాళ్ళు. అలా  కాలక్షేపం చేసిన వాళ్ళు చాలామంది జీవితంలో చాలా  పెద్ద స్థానాలలోకి చేరుకున్నారు. ఇక మా ఆవిడ అమ్మవొడిలో పెరిగిన  పిల్లలు అనేకమంది ఇప్పుడు విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

ఇలా అందరికీ కలిసొచ్చిన ఆ చిక్కడపల్లి ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్ మెంటుగా మారిపోయింది. మాస్కో వెళ్ళేంత వరకు మేము ఆ ఇంట్లోనే అద్దెకు ఉన్నాము. ముప్పయ్యేళ్ళ తరవాత కూడా ఆ ఏరియాలో అమ్మవొడి అంటే గుర్తుపట్టే వాళ్ళు వున్నారు.

సందర్భం వచ్చింది కాబట్టి ఓ విషయం చెప్పుకోవాలి. ఇరుకూ పొరుగూ ఎవరూ నిద్ర లేవకముందే, నేను ఉదయం అయిదున్నరకల్లా బయలుదేరి, ఆఫీసు కారులో రేడియో స్టేషన్ కు వెళ్లి,   పొద్దుటిపూట ప్రసారం అయ్యే న్యూస్ బులెటిన్ తయారుచేసి, ప్రాంతీయ  వార్తల అనంతరం ఏడున్నర కల్లా మళ్ళీ ఇంటికి చేరేవాడిని. అలా వచ్చినవాడిని  అప్పుడు  పక్కఎక్కితే,  మళ్ళీ మిట్ట మధ్యాన్నమే దిగడం. తర్వాత భోజనం చేసి,  సెక్రెటేరియేట్, ఆఫీసు చూసుకుని సాయంత్రం వచ్చేవాడిని. ఇది ఎవరి కంటా పడలేదు కానీ, నేను  మిట్ట మధ్యాన్నం వరకూ ఇంట్లో పడివుండడం మాత్రం ఇరుగింటి పొరుగింటి అమ్మలక్కల కంటపడింది. నాకు ఉద్యోగం లేదనీ, అందుకే ఇల్లు నడపడానికి మా ఆవిడ ఇలా కేర్ సెంటర్ నడుపుతోందని (ఒక రకంగా నిజమే) వాళ్లకి వాళ్ళే తీర్మానించుకుని మా ఆవిడమీద బోలెడు జాలి, నా మీద లేనిపోని అక్కసు పెంచుకున్నారు (ట). ‘ సెక్రెటేరియేట్ లో మా వారికి తెలిసిన వాళ్ళు వున్నారు. ఏదో కొలువు ఇప్పిస్తారు, మీ వారిని  ఓసారి కలవమని చెప్పండి’ అన్నదో ఆవిడ  నేరుగా మా ఆవిడతోనే.           

ఆ అమ్మలక్కలు అందించిన ఆ ఆయుధం నన్ను ఆట పట్టించడానికి మా ఆవిడకు కొన్ని రోజులు  బాగా ఉపయోగపడింది.

కింది ఫోటోలు:

మా బామ్మగారి మంచం

ఇంట్లో చిక్కడు, బయట దొరకడు అనే పేరున్న నేను  ఎప్పుడో అప్పుడు ఇలా  ఎవరి కెమెరా కంటికో చిక్కిపోతుంటాను.






(ఇంకావుంది)

1, అక్టోబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (225) : భండారు శ్రీనివాసరావు

కరెంటులో బల్లి పడింది

‘హైదరాబాదులో మీకు ఒక్కరికే అధికారులు స్పందిస్తారా’ అని ఒక మిత్రుడు మెసేజ్ పెట్టారు. ఒక్కోసారి నాకూ ఈ అనుమానమే వస్తుంటుంది. జర్నలిస్టు అవతారం చాలించి జనసామాన్యంలో నలుగురితో నారాయణ అంటూ జీవితం ప్రారంభించి కూడా ఇరవై ఏళ్ళు దాటిపోయింది. నాకు తెలిసిన అధికారులు కూడా తదనంతర కాలంలో రిటైర్డ్ జాబితాలో చేరిపోయారు.
పూర్వకాలంలో అంటే సుమారు యాభయ్ ఏళ్ళ క్రితం, ట్రాన్స్కో , జెన్కోల ఆవిర్భావానికి ముందు, ఉమ్మడి రాష్ట్రంలో ఈ రెంటికి కలిపి ఒకే ఒక సంస్థ, రాష్ట్ర విద్యుచ్ఛక్తి సంస్థ వుండేది. దానికి చైర్మన్ డాక్టర్ నార్ల తాతారావు.
అందులో ఎంతమంది పనిచేస్తున్నా, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎవరు పవర్ ఫుల్ అంటే చైర్మన్, తరువాత లైన్ మన్ అనే వారు. ముఖ్యమంత్రి మాట కూడా చైర్మన్ తాతారావు గారి తర్వాతనే చెల్లుబడి అయ్యేది. ఆయన సమర్థతే ఆయనకు ఈ హోదా తెచ్చిపెట్టింది.
నేను రేడియోలో చేరిన కొద్ది కాలం తర్వాత ఆయన్ని కలుసుకునే అవకాశం నాకు లభించింది. ఏదో ఒక సందర్భంలో తాతారావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆఫీసులో చిన్న హాలు లాంటి సమావేశ మందిరం. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ పత్రికల ప్రతినిధులు అందరూ వచ్చారు. అయినా కొన్ని కుర్చీలు ఖాళీగానే వున్నాయి. ఆ రోజుల్లో విలేకరుల సంఖ్య తక్కువ కావడం వల్ల అధికారులకు విలేకరులను పేరుతొ పలకరించేంత చనువు వుండేది.
ఎదురుగా కూర్చొన్న విలేకరులలో అధిక శాతం నెల సరి వేతనాల దృష్ట్యా బీపీఎల్ బాపతు అని తాతారావు గారికి కూడా తెలుసల్లే వుంది. అంచేత తాను చెప్పాల్సింది తాను చెప్పిన తర్వాత, విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా, లేవనెత్తిన సమస్యలకు సానుభూతిగా జవాబులు చెబుతూ, ‘మీలో ఎవరికైనా కరెంటు సమస్య వస్తే, ఇదీ నా ఇంటి నెంబరు, (ఆ రోజుల్లో అందరికీ ల్యాండ్ లైన్ ఫోనులే) ఏ సమయంలో అయినా ఫోన్ చేయండి’ అని ఉదారంగా ప్రకటించి, అందరికీ ఆ నెంబరు ఇచ్చారు.
ఆ రోజుల్లో త్రీ ఫేజ్ కరెంటు అనేది చాలా అరుదైన గృహాలలో మాత్రమే వుండేది. చాలా ఇళ్లకు టు ఫేజ్ కావడంతో సరఫరాలో హెచ్చుతగ్గులు బాగా వుండేవి. కరెంటు రాకడ పోకడ ఎవరు చెప్పగలరు అనుకునే వాళ్ళు.
మరి విలేకరులలో ఎంతమంది తాతారావు గారు ఇచ్చిన ఈ వెసులుబాటును ఉపయోగించుకున్నారో లేదో నాకు తెలియదు కానీ, నా నుంచి ఆయనకు తాకిడి ఎక్కువైంది. చివరికి ఆయన విసుగు నషాళానికి అంటిందేమో, ‘ఇక ఇలా తడవతడవకు ఫోన్ చేయకుండా మీ ఇంటి దగ్గరే ఒక ట్రాన్స్ ఫార్మర్ వేయిస్తాను’ అని చెప్పారు. చెప్పడమే కాదు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వేయించారు కూడా.
ఆ వైభోగం కొన్నాళ్ళు అనుభవించిన తర్వాత, కుటుంబ సమేతంగా మాస్కో వెళ్ళడం, అక్కడ ఓల్టేజ్ హెచ్చుతగ్గులు లేని, కన్నుకొట్టని కరెంటు దీపాల భాగ్యాన్ని అయిదేళ్లు అనుభవించి హైదరాబాదు తిరిగి వచ్చాము. అప్పటికి దాదాపు అన్ని గృహాల్లో త్రీ ఫేజ్ సదుపాయం వచ్చింది. అయినా కరెంటు కోతల సమస్య తప్పలేదు.
కొన్నేళ్ళ క్రితం, మా అపార్ట్ మెంటులో తరచుగా ఈ సమస్య ఏర్పడేది. అన్ని ఫ్లాట్స్ లో ఇన్వర్టర్లు వున్నాయి. లిఫ్ట్ పనిచేయాలి అంటే మాత్రం కరెంటు కావాలి. ఇలా ఒకదానితో మరొకటి ముడి పడి వున్న సమస్యలతో చాలా ఏళ్ళుగా నెట్టుకు వస్తున్నాము.
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి నాకు తెలిసిన దారి, మిగిలిన దారి ఒక్కటే, సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టి ఊరుకోవడం. అదే చేశాను. నా పోస్టుకు ముగ్గురు, నలుగురు ఉన్నతాధికారులు తక్షణం స్పందించడం నాకు ముచ్చటేసింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను వాళ్లకి ఒకటే చెప్పాను. కరెంటు సమస్య కంటే కూడా మీ ప్రతిస్పందన నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని.
అందరికీ ఇలా జరుగుతుందా అనేది నిజంగా శేష ప్రశ్నే. నా దగ్గర కూడా జవాబు లేదు.
ఒక రోజు మళ్ళీ కరెంటు పోయింది. కాకపోతే ఈసారి చాలాసేపు పోయింది. కరెంటు లేకపోయినా నెట్ పనిచేస్తోంది. ఇకనేం నా చేతిలో వున్న పనిచేశాను. చేతులకు పని చెప్పి ఒక పోస్టు రాశాను.
ఆనంద్ గారనే పెద్దమనిషి ఫోన్ చేశారు. ఆయన పెద్ద మనిషే కాదు, విద్యుత్ శాఖలో పెద్ద అధికారి కూడా. SE. (ఇప్పుడు చీఫ్ ఇంజినీర్).
ఓ బల్లి కారణంగా విద్యుత్ సరఫరాకు కొంత అంతరాయం కలిగిందని చెబితే ఆశ్చర్యపోయాను. చెట్ల కొమ్మల రాపిడి వల్ల అప్పుడప్పుడూ ఇలా జరుగుతుందని తెలుసు. కానీ బల్లి పాటు వల్ల కూడా కరెంటు ట్రిప్ అవుతుందన్న మాట.
సరే! ఈ సంగతి పక్కనపెడితే నేను చెప్పేది ఒక్కటే. స్పందించే అధికారులు, సిబ్బంది వుంటే ప్రజలకు ఓ భరోసా వుంటుంది. చెప్పింది వినే నాధుడు వుంటే సగం సమస్య తీరుతుందంటారు.
ఈసారి ఏకంగా ట్రాన్స్ ఫార్మర్ సమస్య వచ్చింది. దాని కారణంగానో ఏమో తెలియదు, లిఫ్ట్ పనిచేయడం మానేసింది. ట్రాన్స్ ఫార్మర్ మార్చాలి అన్నారు. ఎలా అన్నది మరో సమస్య.
కిందటి పోస్టులో ఇదే సమస్య రాశాను.
‘ఈ రోజు దుర్గాష్టమి. రేపు నవమి నాడు ఫస్ట్ అవర్ లో కొత్త ట్రాన్స్ ఫార్మర్ వేయిస్తాము’ అని మెసేజ్ వచ్చింది.
ఏమీ మా అదృష్టం అనుకున్నాను.
ఈరోజు నవమి బుధవారం. మధ్యాన్నం అయింది కానీ ట్రాన్స్ ఫార్మర్ జాడ లేదు. మూడయింది. అదే ఎదురుచూపు.
నేను అన్నం వండుకునేది ఎలక్ట్రిక్ కుక్కర్ లో. కూరలు అవీ ఇంటి దగ్గరలో వున్న ఫుడ్ కేటరర్స్ వాళ్ళు క్యారేజీలో పంపిస్తారు. అవి వచ్చాయి. వంటమనిషి ఉదయం వచ్చి టిఫిన్ చేసిపెట్టి, బియ్యం కడిగి గిన్నెలో పెట్టి వెడుతుంది. తినడానికి ఒక అరగంట ముందు కుక్కర్ ఆన్ చేస్తాను.
చూసి చూసి కుక్కర్ ఆన్ చేశాను. అది ఆన్ అయి వెంటనే ఆఫ్ అయింది. ట్రాన్స్ ఫార్మర్ రాకపోగా వున్న కరెంటు పోయింది. ఇదేమిటి అని అడగడానికి ఒక అధికారికి ఫోన్ చేయబోయాను. కానీ లైను కలిసే లోగా ఆయనే ఫోన్ చేశారు. ‘మా వాళ్ళు వచ్చారు. పని పూర్తయిందని చెప్పారు’.
ఇంతలో కరెంటు కూడా వచ్చింది. దానితో పాటు నలుగురు ట్రాన్స్ కో సిబ్బంది మా ఫ్లాట్ లోకి వచ్చారు. తమని తాము పరిచయం చేసుకున్నారు. ‘అరె! పైకి ఎలా వచ్చారు, మెట్లెక్కి వచ్చారా’ అని నా పలకరింపు. ‘కాదు, లిఫ్ట్ లో వచ్చాము. కొత్త ట్రాన్స్ ఫార్మర్ వేశాము. అందుకోసమే ఒక అరగంట సప్లయి ఆపేశాము’ అన్నారు.
‘పన్నెండు గంటల లోపే క్రేన్ తీసుకుని వచ్చాము. అప్పటికే మీ పక్క గుడి వాళ్ళు భక్తులకు అన్నవితరణ చేస్తున్నారు. అది పూర్తయ్యే వరకు పక్క వీధిలో వెయిట్ చేశాము’ అని ఆలస్యానికి వివరణ ఇస్తుంటే, ‘ఇంకా నయం మాట తూలినవాడిని కాదు’ అని మనసులో అనుకున్నాను.
అతిథి మర్యాదలు చేయడానికి ఇంట్లో వసతి లేని వాడిని కనుక వారిలో ప్రతి ఒక్కరికీ మనఃస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పాను.
వారితో ఫోటో దిగాను.
కింద ఫోటో అదే:








శ్రీయుతులు మల్లేశం (ఫోర్మన్), వెంకటనారాయణ (లైన్ మన్), ఆకాష్ ( జూనియర్ లైన్ మన్), సురేశ్ (ఆర్టిజన్)
(ఇంకా వుంది)
01-10-2025

29, సెప్టెంబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (224) : భండారు శ్రీనివాసరావు

 మై హు నా!

“Today again lots of fluctuations happening, please find the solution for transformer. We already lost 1.5 lakh worth of electric items due to these fluctuations.”

నేను వుంటున్న మధుబన్ అపార్ట్మెంట్ నివాసితుల గ్రూపులో మొన్న శనివారం నాడు నాకు కనపడిన మెసేజ్ ఇది. శని ఆది సెలవు రోజులు.  సోమవారం వర్కింగ్ డే కాబట్టి దాన్ని గురించి ఆలోచించలేదు.

ఈరోజు సోమవారం. నాకున్న మతిమరపు కారణంగా మరచిపోయాను. సాయంత్రం గుర్తుకు వచ్చి నాకు కొంత పరిచయం వున్నఒక ఉన్నతాధికారికి వాట్సప్ మెసేజ్ పెట్టాను. పెట్టిన సంగతి మరచిపోయాను.

 

మూడు దశాబ్దాలకు పూర్వం మాస్కోలో, రేడియో మాస్కోలో పనిచేసే అవకాశం నాకు లభించింది. 1990 లో ఓ సెలవు రోజున ఢిల్లీ నుంచి మాస్కో  వస్తున్న ఓ మిత్రుడిని రిసీవ్ చేసుకోవడానికి భార్యా పిల్లలతో కలిసి మాస్కో నగర పొలిమేరల్లో వున్న షెర్మేతోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి టాక్సీలో బయలుదేరాను. విపరీతంగా మంచు కురుస్తోంది. మార్గమధ్యంలో వుండగా కారు టైర్లు మంచులో  జారిపోయి ఓ పక్కకు వెళ్లిపోయింది. ఏం జరిగిందా అని ఆందోళన మొదలయ్యేలోగా, మంచుపొర  కమ్మిన కారు కిటికీ అద్దం వెనుక,  ఆరున్నర అడుగుల భారీ శరీరం కనిపించింది. నల్లటి యూనిఫారం చూడగానే అతడు ట్రాఫిక్ పోలీసు అని గుర్తు పట్టాను. ఇంత  మంచు వర్షంలో హఠాత్తుగా ఇతడెలా ప్రత్యక్షం అయ్యాడో అర్ధం కాలేదు. ఇప్పుడీ కేసు తేలేదాకా రోడ్డు మీద, పిల్లలతో  నానా అవస్థలు తప్పవేమో అని భయపడుతున్న సమయంలో, ఆ పోలీసు రెండు కాళ్ళు నేల మీద గట్టిగా చరిచి, ఫుల్ సెల్యూట్ చేయడంతో మా మొహాల్లో  భయం తగ్గిపోయి ఆశ్చర్యం ఆవరించింది. పౌరులకు అక్కడి పోలీసులు ఇచ్చే మర్యాద అని తరువాత తెలిసింది. అతడు ఆ మంచులో కారు దిగవద్దని మాకు  సైగలు చేస్తూ, వాకీ టాకీలో  మాట్లాడుతున్నాడు. కొద్ది నిమిషాల్లో మరో టాక్సీ వచ్చి ఆగింది. అందులోకి మమ్మల్ని ఎక్కించిన తర్వాతనే అతడు ట్రాఫిక్ కేసు విషయం చూసుకోవడం మొదలు పెట్టాడు. కేసు విచారణ పేరుతొ మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించని అతడి తీరు, మమ్మల్ని ఎంతగానో  విస్మయపరచింది.

చాణక్యుడు చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. 

 

యాభయ్, అరవై  ఏళ్ళ క్రితం: 

ఒకసారి మా వూరికి  పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. 

ప్రోగ్రాం ప్రకారం  ఆయన మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.

మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో దూరంగా  జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది, మంత్రిగారు  వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు ఆకాశంలో చుట్టూ గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.

ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.

అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. ఊరి పోలిమేరల వరకూ వచ్చి కూడా  ఊరిలోకి వెళ్ళే  దారి తెలియక చాలాసేపు ఇబ్బంది పడిన విషయం ఆయన చెప్పేదాకా తెలియదు. అంత అధ్వాన్నంగా ఉండేవి ఆ రోజుల్లో  రహదారి సౌకర్యాలు. మా ఊరికి అయితే బండ్ల బాట మినహా వేరే దారిలేదు. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి మంత్రిగారు  నిష్క్రమించారు. 

సరైన రోడ్డు సదుపాయం లేక  ఆ ప్రాంతపు ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా అనుభవం లోకి రావడం వల్లనేమో, ఢిల్లీ వెళ్ళగానే ఆ విషయంపై దృష్టి పెట్టినట్టున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక  గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి. స్తంభాలు, కంకర, సిమెంటు వగైరా ప్రభుత్వం ఇస్తుంది.

కే ఎల్ రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు. ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆ గ్రామాల ప్రజలు ఆ రోడ్డుని కేఎల్ రావు గారి రోడ్డనే పిలుస్తారు.

ఇది గుర్తుకు వచ్చినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చేది చాణక్యుడి సూక్తే. 

ఇదీ పాత ముచ్చటే.  

కొన్నేళ్లుగా  జంట నగరాల్లో కరెంటు కోతలు లేకుండాపోయాయి. 

అయినా కానీ, ప్రజలకు కరెంటు కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పే పరిస్థితి లేదు.

అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలకు కూడా ఈ అవస్థలు తప్పడం లేదు.

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. పౌరుడికి ఒక సమస్య ఎదురయినప్పుడు

దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెడదామని అనుకుంటాడు. స్పందించే అధికారి వుంటే చాలు, సగం సమస్య తీరిపోయినట్టుగా అతడు భావిస్తాడు. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కారం అంటూ వుంటుంది. కొన్నిటికి తక్షణ ఉపశమనం లభిస్తే మరి కొన్ని నిదానంగా

పరిష్కారమవుతాయి.

మేము ఉంటున్న ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో కోతలు లేవు. కానీ అంతరాయాలు

వున్నాయి. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి ఇప్పుడు సాంఘిక మాధ్యమాలు అందుబాటులో వున్నాయి. 

నాకు తెలిసిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం చేస్తూ వస్తున్నాను. గతంలో కూడా మా ప్రాంతవాసుల సమస్యలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే కొన్ని సార్లు మునిసిపల్ అధికారులు తక్షణం స్పందించారు. అలాగే మరో అనుభవం.

ఒకరోజు రాత్రి కాసేపు కరెంటు పోయింది. లిఫ్ట్ లో ఒక పెద్దావిడ చిక్కుకు పోయింది.

కాసేపటికి కరెంటు వచ్చింది. ఆ పెద్దావిడ మా అపార్ట్ మెంటులో ఎవరినో

చూడడానికి వచ్చింది. లిఫ్ట్ ఇబ్బంది పెట్టడంతో గాభరా పడిపోయింది. ఇది

చూసి రాత్రి పొద్దుపోయిన తర్వాత నేను ఒక పోస్ట్ పెట్టాను.

వేసవికాలం ప్రవేశించింది. నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో పౌరుల

ప్రేమయాత్ర ముగిసింది అనుకోవాలా!  అటక ఎక్కించిన పవర్ ఇన్వర్టర్లను, జెనరేటర్లను

మళ్ళీ కిందికి దింపాలేమో! ఇలా చెప్పడానికి కాసింత  సిగ్గుపడుతున్నాను”

కఠినంగా రాశానేమో అని నాకే తరువాత అనిపించి ఆ పోస్ట్ తీసి వేశాను.

యథావిధిగా ఆవిషయం మరచిపోయాను.

మరునాడు మధ్యాన్నం కాబోలు అయిదారుగురు మా ఇంటికి వచ్చారు.

పొద్దున్న చైర్మన్ ప్రభాకరరావు గారు ఫోన్ చేశారు”

వారిలో ఒకరు ఈ మాట అంటూ, తనని తాను పరిచయం చేసుకున్నారు.

ఆయన గారి పేరు ఆనంద్. ట్రాన్స్ కోలో  సూపర్ ఇన్ టె౦డింగ్ ఇంజినీరు.

మిగిలినవాళ్ళు డీఈ, ఏడీయీలు, ఏఈలు.

సమస్య ఏమిటని అడిగారు. నేను చెప్పింది విన్నారు. అప్పటికే ఆశ్చర్యంలో

మునిగిపోయి ఉన్న నాకు ఆయన తన సెల్ ఫోన్ లో రికార్డ్ అయిన కొన్ని విషయాలు

చెప్పారు. అది వింటుంటే నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. 

మా ప్రాంతంలో ఈ నెలలో అయిదు సార్లు కరెంటు పోయిందని చెబుతూకరెంటు పోయిన

టైమును, మళ్ళీ వచ్చిన సమయాన్ని వివరాలతో సహా చూపించారు. నాలుగుసార్లు ఈ

ఎల్ (ఎర్త్ లీకేజీ), ఒకసారి ఓఎల్ (ఓవర్ లోడ్) వల్ల సరఫరాకు అంతరాయం

కలిగినట్టు రికార్డులలో వుంది.

ఎస్ ఈ గారి అధీనంలో మొత్తం 38 సబ్ స్టేషన్లు వుంటాయిట. ప్రతిరోజూ ఆ

ఏరియాల్లో ఎక్కడ, ఎన్నిసార్లు కరెంటు పోయిందనే వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్

అవుతాయట. ఆ సమాచారం ఆధారంగా వెనువెంటనే సరఫరా పునరుద్ధరణకు రాత్రీ పగలూ ఇరవై నాలుగు గంటలు సిబ్బంది సిద్ధంగా వుంటారట.

సాధారణంగా చెట్ల కొమ్మలు నరికే సమయాలను ముందుగానే ఆయా వినియోగదారులకు

ఎస్సెమ్మెస్ ద్వారా తెలియచేస్తారట.

ఎంత ప్రయత్నం చేస్తున్నా తమ చేతిలో లేని కారణాల వల్ల సరఫరాలో ఆటంకాలు

కలుగుతున్న మాట నిజమే అని చెబుతూ, వాటిని సాధ్యమైనంత మేరకు తగ్గించడానికే

తాము, తమ సిబ్బంది నిరంతరంగా పనిచేస్తున్నామని చెప్పారు.

మా ప్రాంతంలో కరెంటు సరఫరాలో అంతరాయాలు లేకుండా చేయడానికి చేయవలసినది

చేస్తామని హామీ ఇచ్చారు.

ముందే చెప్పినట్టు సమస్య పరిష్కారం ముఖ్యమే కావచ్చు కానీ, సమస్యను విని,

నేనున్నాను కదా!’ అని భరోసా ఇచ్చేవాళ్ళు కూడా అంతే ముఖ్యం. అప్పుడే ప్రభుత్వం పనిచేస్తోందని జనం అనుకుంటారు. పనిచేసే ప్రభుత్వం అని మెచ్చుకుంటారు.

మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అదే జరిగింది. నేను మెసేజ్ పంపిన ఆ ఉన్నతాధికారి అది చూశారు, చూసి వదిలేయ లేదు. తన సిబ్బందికి తగు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు వచ్చారు. సమస్య విన్నారు. అర్ధం చేసుకున్నారు. వారు చేయగలింది చేశారు, ఇంత రాత్రా, రేపు వచ్చి చూస్తాం అనకుండా!  

మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత, చాణక్యుడి సూక్తి మరోమారు స్పురణకు వచ్చింది.

ఇంతకీ చాణక్యుడు ప్రవచించిన ఆ సూక్తి ఏమిటంటారా!

“సుపరిపాలన అంటే ప్రభుత్వ (రాజు)  ప్రమేయం లేని సాధారణ జన జీవితం, తక్షణం స్పందించే వ్యవస్థ”

వినడానికి బాగానే వుంది.

ఇలా అడపా దడపా కాకుండా చాణక్యుడి సూక్తి అనుదినం గుర్తుకు వచ్చే బంగారు రోజులు వస్తే ఎంత బాగుంటుందో!

(ఇంకావుంది)