16, మార్చి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (117) – భండారు శ్రీనివాసరావు

 లెనిన్ సమాధి

మేము మాస్కోలో వున్న అయిదేళ్ళ కాలంలో గమనించింది ఏమిటంటే, వానయినా, ఎండయినా (ఎండలకు చాన్స్ లేదనుకోండి) వానయినా వంగడి అయినా, మంచు అయినా, మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో గడ్డకట్టే చలి అయినా, అయినా కొనుగోళ్ల కోసం, జనాలు క్యూల్లో వుండడం చూశాను కానీ, కావాలని వెళ్లి, ఆరుబయలు మంచు మైదానంలో  గంటల తరబడి క్యూలో నిలబడి తమవంతు కోసం  వేచి చూసే సీను ఒక్క చోటే కనబడింది. అది రెడ్ స్క్వేర్ లోని లెనిన్ సమాధి దగ్గర.  

1924 జనవరి 21 వ తేదీన సోవియట్ వ్యవస్థ  నిర్మాత,  అక్టోబర్ విప్లవ సారధి అయిన   వ్లాదిమిర్ లెనిన్ మరణించారు. స్టాలిన్ ఆదేశాలపై  ఆయన  శరీరాన్ని రసాయనిక ప్రక్రియల  ప్రకారం   భద్రపరచి ప్రత్యేకంగా నిర్మించిన మసోలియంలో  ప్రజల సందర్శనార్ధం వుంచారు.

ఆ రోజుల్లో ఈ సమాధి చెంత సైనికులు  నిర్వహించే గార్డ్ ఆఫ్ ఆనర్ (గౌరవ సూచకమయిన కవాతు)ని చూడడానికి జనం ఎగబడేవారు. సుశిక్షితులయిన సైనికులు, చేతుల్లో తుపాకులతో మసోలియం ప్రధాన ద్వారం వద్ద  పోతపోసిన విగ్రహాల్లా నిలబడి వుండేవారు. వంతులవారీగా  విధి నిర్వహణ సమయం ముగిసిన తరువాత  వారినుంచి బాధ్యతలు  స్వీకరించడానికి వచ్చిన వారి సహచరులు మరబొమ్మల మాదిరిగా దూరం నుంచి  కవాతు చేస్తూ వచ్చేవారు. కనుమూసి తెరిచేటంతలో వారి స్థానాలకి వీళ్ళు, వీళ్ళ స్థానాలలోకి వాళ్లు తటాలున మారిపోయే దృశ్యాన్ని రెప్పలార్పకుండా చూడడానికి సందర్శకులు చలినీ, మంచునీ లెక్కచేయకుండా అధిక సంఖ్యలో గుమికూడేవారు.

 

సోవియట్ యూనియన్  విచ్చిన్నం తరువాత  ఏర్పడ్డ  కమ్యూనిస్టేతర ప్రభుత్వాలు  ఈ సైనిక కవాతుకు స్వస్తి చెప్పాయి. అంతేకాదు,  రష్యన్ ప్రభుత్వం 1991 నుంచి  లెనిన్  మసోలియం నిర్వహణ వ్యయంకోసం ఇచ్చే  నిధులను నిలుపు చేసింది కూడా.  తదాదిగా,   అభిమానుల విరాళాలతోనే   నెట్టుకు వస్తున్నారు.

మసోలియం తెరిచి వుంచే  సమయాన్ని కూడా  బాగా తగ్గించారు. అయినా సందర్శకుల  సంఖ్య  తగ్గలేదు. భద్రతా కారణాల రీత్యా,  రెడ్ స్క్వేర్ లోకి ప్రజలను అనుమతించడంపై తరచుగా విధిస్తున్న  ఆంక్షల  వల్ల కూడా  లెనిన్ మసోలియం  సందర్శన  అనేది ఇప్పుడంత సులువయిన వ్యవహారం కాదు.

గత వంద సంవత్సరాల నుంచి మసోలియంలో లెనిన్ శరీరాన్ని భద్రపరుస్తూ వస్తున్న తీరే  అపూర్వం. ఇన్నేళ్ళ నుంచి,  క్రమం తప్పకుండా ప్రతివారం  నిపుణులు లెనిన్ పార్ధివ  శరీరాన్ని  ప్రత్యేకించి చర్మాన్ని  చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చర్మం ఏమాత్రం పొడిబారకుండా తగిన  జాగ్రత్తలు తీసుకుంటారు.

పద్దెనిమిది నెలలకు ఒక పర్యాయం లెనిన్ కాయానికి   రసాయనాలతో  ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.  ఇందుకోసం రెండు నెలలపాటు సమాధిని మూసివేస్తారు. ఆ సమయంలో  లెనిన్ భౌతికకాయాన్ని నెల రోజులపాటు ప్రత్యేక ద్రావణంలో ముంచి వుంచుతారు. చర్మం నెమ్మది నెమ్మదిగా ఆ ద్రావణాన్ని పీల్చుకుని మళ్ళీ సరయిన రీతిలో  తేమను పొందేలా చేయడం ఈ శుద్ధి తతంగం  ఉద్దేశ్యం.

 

డాక్టర్ ఇల్యా  జబ్రస్కీ అనే 90 సంవత్సరాల  నిపుణుడు 1934 నుంచి   1952 వరకు లెనిన్ భౌతిక కాయాన్ని కనిపెట్టుకుని వున్నవారిలో  వున్నారు.   ఆయన తండ్రి బోరిస్1924 లో లెనిన్ మరణించినప్పుడు ఆయన  శరీరాన్ని భవిష్యత్ తరాలకోసం భద్రపరచిన తొలి బృందంలో పనిచేశారు.

ఈ డాక్టర్  చెప్పిన దాని ప్రకారం లెనిన్ భౌతిక కాయంలో పైకి కనిపించే చర్మం తప్ప వేరే శరీర భాగాలు ఏవీ లేవు.  మొదటిసారి ఎంబామింగ్  (embalming - రసాయనిక పూత)  చేసినప్పుడే వాటినన్నింటినీ  తొలగించారు. కాకపొతే కనుబొమలు,  మీసకట్టుతల వెంట్రుకలను మాత్రం  యధాతధంగా వుంచేశారు.

పోతే,  లెనిన్ శరీరాన్ని మసోలియం నుంచి తొలగించి వేరేచోట ఖననం చేయాలన్న డిమాండ్ ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తోంది. ఈ విషయంపై  ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపారు. యాభయ్ ఏళ్ళకంటే  తక్కువ వయసున్న రష్యన్లలో అరవై శాతం మంది ఈ ప్రతిపాదనను బలపరుస్తూవుండడం విశేషం. లెనిన్ ని ఆరాధ్య దైవంగా కొలుస్తున్న రోజుల్లో కూడా ఒకసారి మసోలియం నుంచి లెనిన్ భౌతిక కాయాన్ని  తొలగించి  సైబీరియా ప్రాంతానికి తరలించారు. కాకపొతే, ఆ  కారణం వేరు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో  నాజీల నుంచి  బాంబు దాడి ముప్పు వుండగలదన్న భయంతో ఆ పని చేశారు.

‘లెనిన్ మసోలియం నుంచి ఆయన  శరీరాన్ని  తొలగించాలి. ఆ ప్రదేశాన్ని ఒక ఆరాధనీయ స్థలంగా పరిగణించడాన్ని ఇక ఎంత మాత్రం అనుమతించకూడదు’  అనేవారి సంఖ్య  ఇప్పుడు ఆ దేశంలో  క్రమంగా పెరుగుతోంది.  నిజానికి లెనిన్ కూడా తన తదనంతరం  తన భౌతికకాయాన్ని ఇలా భద్రపరచాలని  ఎన్నడు  కోరుకోలేదు. లెనిన్ చనిపోయిన వెంటనే ఆయన  భార్య  నదేజ్డా కృపస్కయా చేసిన విజ్ఞప్తి  కూడా అదే.  లెనిన్ పేరు మీద ఏవిధమయిన  స్మృతి కట్టడాలు నిర్మించవద్దని ఆనాటి ప్రభుత్వ పెద్దలను  ఆవిడ కోరారు.

కానీ, అప్పటి  సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ మాత్రం లెనిన్ భౌతికకాయాన్ని భద్రపరిచే ప్రతిపాదన పట్లనే మొగ్గు చూపారు. దానితో  ఆవిడ సూచనలను  ఎవరూ  పట్టించుకోలేదు.

స్టాలిన్  చొరవతో పనులు శరవేగంతో సాగాయి. ముందు రెడ్ స్క్వేర్ లో చెక్కతో ఒక మసోలియాన్ని తాత్కాలికంగా నిర్మించారు.

ఇందుకోసం ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేశారు. జర్మనీ నుంచి   ఫ్రీజర్ సదుపాయం కలిగిన ఒక పెద్ద  పేటికను తెప్పించడానికి ఉత్తర్వులు కూడా  జారీ అయ్యాయి. అయితే ఇందుకు   చాలా సమయం పట్టేట్టు వుండడం,  లెనిన్ భౌతిక కాయం శిధిలం అయ్యే సూచనలు కానరావడంతో  ఆ ప్రయత్నం మానుకున్నారు. ఎంబామింగ్  చేసి,  రసాయనిక చర్యల ద్వారా శరీరాన్ని భద్రపరిచే పనికి పూనుకున్నారు.   కొద్ది రోజులపాటు మృత శరీరాన్ని చెడిపోకుండా చూడడం  ఈ విధానం ద్వారా సాధ్యం. ఇది అప్పటికే తెలిసిన ప్రక్రియ. కానీ రసాయనిక చర్యల ద్వారా మరణించిన వ్యక్తి శరీరాన్ని శాశ్వత ప్రాతిపదికపై  ఏళ్ళ తరబడి పాడయిపోకుండా  చేయడం ఎలా అన్నది ఆనాటికి  కనీవినీ ఎరుగని  విషయం.

ఉక్రెయిన్ లో (అప్పటికి సోవియట్ యూనియన్ లో భాగం)  అనాటమీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్  వ్లాదిమిర్ వోరోబియోవ్ నాయకత్వంలోని ఒక నిపుణుల బృందం ఈ బృహత్తర  కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. అంతేకాదు, అసాధ్యం అనుకున్న ఈ పనిని  జయప్రదంగా పూర్తిచేసింది.

అనితర సాధ్యం అనుకున్నది సాధ్యపడడంతో  ప్రభుత్వం చురుగ్గా కదిలింది.  సోవియట్  సైనికులు నిరంతరాయంగా శ్రమించి అరుణవర్ణం కలిగిన చలువరాతితో మరో మసోలియాన్ని క్రెమ్లిన్ గోడ దాపునే  ఆఘమేఘాలమీద నిర్మించారు. లెనిన్ బౌతిక కాయాన్ని అందులోకి తరలించారు.

1953 లో స్టాలిన్ మరణించినప్పుడు ఆయన శరీరాన్ని కూడా ఎంబామింగ్  చేసి లెనిన్ మసోలియంలోనే  ఆయన దేహం  సరసనే  భద్రపరిచారు.  ఆ తరువాత కృశ్చేవ్ హయాంలో స్టాలిన్ భౌతికకాయాన్ని అక్కడనుంచి తొలగించి  క్రెమ్లిన్ గోడ పక్కన  ఖననం చేశారు.

గోర్భచెవ్ తరువాత అధికారానికి వచ్చిన బోరిస్ ఎల్త్ సిన్,  ‘రెడ్ స్క్వేర్ అనేది ఒక శ్మశాన వాటికను  తలపించేదిగా వుండరాదని’  అభిప్రాయపడ్డారు. అయితే,  లెనిన్ శరీరాన్ని అక్కడనుంచి తొలగించడం  అప్పట్లో సాధ్యం కాలేదు. 

2024 సంవత్సరానికి  కామ్రేడ్  లెనిన్ కన్ను మూసి వందేళ్ళు  పూర్తయ్యాయి. పుతిన్ హయాములో  లెనిన్ భౌతిక కాయాన్ని అక్కడ నుంచి తొలగించే ఆలోచనలు జరిగాయి కానీ ప్రయత్నాలు మొదలుకాలేదు.

లెనిన్ నాయకత్వం వహించిన కమ్యూనిస్ట్ పార్టీకి ప్రస్తుతం రష్యన్ పార్లమెంటులో ప్రాతినిధ్యం తక్కువ.

‘ కామ్రేడ్ లెనిన్ చల్లని గుండె కొట్టుకోవడం ఆగిపోయి వందేళ్ళు గడిచాయి. కానీ, అజరామరుడయిన లెనిన్ కు సంబంధించి  మరో శతాబ్ది మొదలయింది” అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు గెన్నడి జుగనోవ్ అన్నారు.  

లెనిన్ చనిపోయినప్పుడు, వ్లాదిమిర్ మయాకోవిస్కి  అనే కవి ఇలా రాశారు. “లెనిన్ వున్నాడు, ఉంటాడు, ఇక ముందు కూడా వుంటాడు”

ఆ కవి అన్నట్టే లెనిన్ భౌతిక కాయం ఇంకా వుంది. ఆయన సిద్ధాంతాలే ఆ దేశంలో లేకుండా పోయాయి.

 

కింది ఫోటోలు:

మాస్కోలో లెనిన్ మసోలియం  వద్ద క్యూలో జనం. మా ఆవిడ నిర్మల, కన్నడ న్యూస్ రీడర్ రామకృష్ణ గారి భార్య శ్రీమతి సరోజ






(ఇంకా వుంది)

15, మార్చి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (116) – భండారు శ్రీనివాసరావు

 

మాస్కోలో శంకరాభరణం

మాస్కోలో మా  ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. కానీ టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలల ముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే, వాళ్లే తెప్పించి పెడతారు. అలా  ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.
రాజ్ కపూర్ నిర్మించిన మహత్తర దృశ్య కావ్యం మేరా నామ్ జోకర్ సినిమా పతాక సన్నివేశాలు  రష్యన్ సర్కస్ డేరాల్లోనే చిత్రీకరించారు. సర్కస్ లకు విశేష ప్రజాదరణ వున్న ఒకానొక కాలంలో రష్యన్ సర్కస్ అంటే జనాలు విరగబడి చూసేవారు.


రష్యన్ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయిన రష్యన్ సర్కస్, కేధరిన్ ది గ్రేట్,  కాలం నుంచే వుంది. ఇంగ్లీష్ భాష తెలియని రష్యాలో,  రష్యన్ సర్కస్ ఆవిర్భావానికి  ఒక ఇంగ్లీష్ పౌరుడే కొంత మేరకు దోహద పడడం ఒక విశేషం. చార్లెస్ హగెస్ అనే ఆంగ్లేయుడు,  కేధరిన్ ది గ్రేట్ క్వీన్  రాణి గారి సమక్షంలో ఒక చక్కని ప్రదర్సన ఇచ్చాడట. దాంతో ముచ్చట పడిపోయిన రాణి గారు,  అతగాడికోసం రెండు సర్కస్ డేరాలు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారట. రాణి తలచుకుంటే డేరాలకు కొదవేముంది. అతడికోసం సెంట్ పీటర్స్ బర్గ్,  కమ్యూనిస్టుల ఏలుబడిలో 'లెనిన్ గ్రాడ్' గా పేరుమార్చుకుని,   తదనంతర కాలంలో తిరిగి సెంట్ పీటర్స్ బర్గ్ అన్న పాత పేరుకు మారిన నగరంలో,  సర్కస్ డేరాలు నిర్మించి పెట్టారు. కొన్నేళ్ళ తరవాత ఆ ఇంగ్లీష్ దొరవారు ఇంగ్లాండ్ కు వెళ్ళిపోయాడు. కానీ అతడి బృందంలోని సభ్యులు మాత్రం రష్యన్ల ఆదరాభిమానాలకు కట్టుబడిపోయి ఆ దేశంలోనే వుండిపోయారు. అలా చిగురించిన రష్యన్ సర్కస్ వటవృక్షం మాదిరిగా విస్తరించి, సోవియట్ల కాలంలో ఖండాంతరఖ్యాతిని సముపార్జించుకుంది. తొంభయ్యవ దశకం దాకా ఒక వెలుగు వెలిగింది.


గ్రేట్ మాస్కో స్టేట్ సర్కస్ ని 1971  లో మాస్కోలోని వేర్నాద్ స్కీ ప్రాస్పెక్ట్ లో ప్రారంభించారు. 3400 మంది వసతిగా కూర్చుని తిలకించగల విశాలమయిన ఎయిర్ కండిషన్ డేరాను నిర్మించారు. దీని ఎత్తు 36 మీటర్లు. ఇందులో అయిదు ఎరీనాలు వున్నాయి. సర్కస్ జరిగే ప్రధాన వేదికకు 18 మీటర్లు దిగువన వీటిని ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి,  ఈ ఎరీనాలు ఒక దాని వెంట మరొకటి పైకి వస్తాయి. అందువల్ల అట్టే వ్యవధానం లేకుండా,  రంగ స్తలాల రూపురేఖలు వాటంతట అవే మారిపోతుంటాయి. మన వైపు సురభి కంపెని నాటక ప్రదర్శనల మాదిరిగా.

రష్యన్ సర్కస్ చూడకుండానే ఇండియాకు తిరిగివచ్చేస్తామేమో అన్న బెంగ ఆవిధంగా తీరిపోయింది. సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది. టికెట్లు కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా,  అది మన శంకరాభరణం సినిమా.  హాల్లో జనం పలచగానే వున్నా తెలుగు సినిమాకు ఆ మాత్రం జనం రావడం ఆశ్చర్యం అనిపించింది. రష్యన్ డబ్బింగ్ కాబట్టి రష్యన్లు కూడా కనిపించారు ప్రేక్షకుల్లో. సినిమా మొదలుకావడానికి ఇంకా వ్యవధానం వుంది. ఈ సినిమా గురించిన పాత జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.

ఆ సినిమా చూసింది సరిగ్గా నలభయ్  అయిదేళ్ళ  కిందట, హైదరాబాదులో.

మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లిఅశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరంసుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లోహనుమాన్ వ్యాయామశాలకు దగ్గర్లోకందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీఆ హాల్లో కర్టెన్లుకుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయనిఅంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడుసినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు)

సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతంపాటలుహీరోయిన్ కి మాటలే లేవుఏవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. ( బీకాంలో నా క్లాస్ మేట్ జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడుకధానాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది,  తీరు చూస్తుంటే రెండోవారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.

ఆశ్చర్యంగా రెండోవారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.

కొన్నిరోజులు పోయాకవిలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. ప్రీ వ్యూ (PRE VIEW) కాదు,  ఫ్రీ వ్యూ (FREE VIEW).

నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటుకాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చునికన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయన గారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.

ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!

కట్ చేస్తే.....

మళ్ళీ 2017లో...

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకుసన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకా రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ గారు మాత్రమే. వరస సన్మాన పరంపరలతోటీవీ ఇంటర్యూలతో తీరికలేని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.

శంకరాభరణం గురించి కూడా చెప్పారు.

ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్నిసార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ‘ఏమోసారూఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మధన్యం అవడం అంటే ఇదే కాబోలు”

ఈ సినిమాలో మా రేడియో సహోద్యోగి ఒక పాత్ర వేశారు.
ఏవిటో ఈయన పాటా అర్ధం కాదుమాటా అర్ధం కాదు” అంటూ శంకరాభరణం సినిమాలో వీధిఅరుగు మీద సంగీతం పాఠాలు చెబుతూ శంకరశాస్త్రి గారిని ఎద్దేవా చేస్తూ,  తనదయిన బాణీలో తెలుగు ప్రేక్షకులను ఆహ్లాదపరచిన పొట్టి (సంగీతం) మేష్టరు గుర్తున్నాడా. గుర్తుంచుకోని ప్రేక్షకుడంటూ వుండరు. అతడే శ్రీ గోపాల్. పొతేపేరులో వున్న ఈ శ్రీ అనేది ఆయన పేరుకు ముందు గౌరవ వాచకం కాదుఅసలు పేరులో భాగమే.

శ్రీ గోపాల్ తో నాకు పరిచయం వుంది. ఆయన ఎక్కడ వుంటే అక్కడ ఉత్సాహం వెల్లివిరిసేది. మాటల పోగు. పరిచయం అయిన వారందరూ ఆయనకు  స్నేహితులే. చొరవతో నలుగురిలో దూసుకుపోయే తత్వం. మాటల్లో హాస్యం చిప్పిల్లేది.

నా పేరు బుడుగుఅసలు పేరు చాలా పొడుగు’ అని  ముళ్ళపూడి వారన్నట్టు శ్రీగోపాల్ అసలు పేరు కొంపెల్ల శ్రీ గోపాలకృష్ణమూర్తి. చేసే ఉద్యోగం ఒకటే అయినా ఆయన బహురూపి. రచయితకార్టూనిస్టుఫ్రీలాన్స్ జర్నలిస్టు. రంగస్థలచలన చిత్ర నటుడు. ఇన్ని కోణాలు ఉన్న మనిషి కాబట్టే ఆ శరీరం త్వరగా అలసినట్టుంది. విశ్రాంతి కోరుకుంది. అందుకేయాభయ్ ఏళ్ళు కూడా నిండకుండానే నలభయ్ ఎనిమిదో ఏటనే ఆయనకు నిండు నూరేళ్ళు నిండాయి.           

కడప ఆకాశవాణిలో పనిచేస్తూ అనారోగ్యంతో 1986 మే 18న హైదరాబాద్ లో శ్రీ గోపాల్ తుది శ్వాస విడిచారు.

జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శంకరాభరణం చిత్రంలో సంగీతం మాష్టారు దాసుగా శ్రీ గోపాల్ పాత్రపోషణ ప్రేక్షకులకు చిరకాలం గుర్తువుంటుంది. ఆయన ఆ సినిమాలో ఆండాళ్ అనే పాపకు సంగీతం నేర్పుతూసంగీతంలో వేగం పెరిగిందనిబ్రోచేవారెవరు రా అంటూ ఆ  పాటను విరిచివిరిచి పాడుతుండగాశంకర శాస్త్రిగారు వచ్చి, ‘సంగీతాన్ని ఖూనీ చెయ్యొద్దు దాసూ’ అని హెచ్చరిస్తారు.

మాస్కో థియేటర్ లో శంకరాభరణం సినిమా చూస్తూ ఈ సంభాషణలు అన్నీ రష్యన్ భాషలో వింటుంటే భలే అనిపించింది.

 పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో వుంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) పాత్ర నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమాలో నటించిన నటీ నటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల,  సోమయాజులు గారు, ఆ సినిమాలో నటించిన తదితరులు అందరూ  అచ్చు రష్యన్ లో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది.


 
మాస్కోలో ధియేటర్ లో శంకరాభరణం సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను. ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు.

 

కింది ఫోటో:

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత కె. విశ్వనాధ్ గారితో నేను

రష్యన్ సర్కస్ చూడడానికి వెళ్లేవారికి ఇలా కొండచిలువలతో ఆడుకునే అవకాశం కల్పిస్తారు. 35 ఏళ్ళ క్రితం  అలా నేను.









(ఇంకావుంది)

14, మార్చి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (115) – భండారు శ్రీనివాసరావు

 

మెట్రో డిజైన్  మార్చిన స్టాలిన్ కాఫీ కప్పు

మాస్కో మెట్రో పట్ల స్టాలిన్ యెంతో శ్రద్ధ కనబరిచేవారని చెబుతారు. రోజూ ఏదో ఒక వీలు చూసుకుని మెట్రో నిర్మాణ పురోగతిని అధికారులతో, ఇంజినీరులతో సమీక్షించేవారు. అంతకుముందు ఏటవాలుగా, నిలువుగా, అడ్డంగా మెట్రో రైలుమార్గాలను డిజయిన్ చేశారు.వాటిని స్టాలిన్ కు చూపించి, ఆ మాపులపై స్టాలిన్ అభిప్రాయం కోసం అధికారులు ఎదురుచూస్తున్న సమయంలో కాఫీ తాగుతున్న స్టాలిన్-ఆ కప్పును ఒక మ్యాప్ మధ్యలో వుంచారుట. కప్పుకు వున్న కాఫీ మరక గుండ్రంగా దానిపై పడింది. దాన్ని స్టాలిన్ అభిప్రాయంగా పరిగణించిన ఇంజినీర్లు - వృత్తాకారంలో మరో మెట్రో మార్గాన్ని- మిగిలిన అన్ని మార్గాలను కలుపుతూ 'మెట్రో రింగ్ రూట్' కు రూపకల్పనచేసి నిర్మించారు. భూగర్భంలో రైల్ జంక్షన్ ల నిర్మాణానికి స్టాలిన్ ' కాఫీ కప్పు మరక' పరోక్షంగా దోహదం చేసిందన్న ఒక కధ
ప్రచారంలోకి వచ్చింది.

రష్యన్ ఒక్క అక్షరం ముక్క  తెలియకపోయినా, మెట్రో లో తేలిగ్గా ప్రయాణాలు చేసేందుకు అక్కడి రవాణా వ్యవస్థ అధికారులు ఒక చక్కటి మెట్రో మ్యాప్ తయారు చేశారు. ఇది దగ్గర వుంచుకుంటే స్టేషన్లు గుర్తించడం సులభం అవుతుంది.

మేమున్న రోజుల్లోనే మాస్కో మెట్రోలో నూటయాభయి స్టేషన్ల దాకా ఉండేవి. మాఇంటికి దగ్గరలో ప్రొఫ్ సోవూజ్నయా (నిజానికి ఆ స్టేషన్ ని రష్యన్ లో ఎలా ఉచ్చరిస్తారో తెలియదు) అనే మెట్రో స్టేషన్ వుంది. అక్కడిదాకా నడిచి వెళ్ళి మెట్రో ఎక్కేవాళ్లము.

 మాస్కో రేడియోకు వెళ్ళాలంటే త్రేత్యా కోవోస్కయా అనే పేరుకలిగిన మెట్రో స్టేషన్ లో దిగాలి. అక్కడ ఎస్కలేటర్ ద్వారా పైకి వస్తే పక్కన పది అడుగుల దూరంలో మాస్కో రేడియో భవనం. ఈ మధ్యలో మరో అయిదు స్టేషన్లు వున్నాయి. అకడమిస్కయా , లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్, షావోలోస్కయా, అక్త్యా బ్రస్కయా (రింగ్ లైన్ లో వున్న మెట్రో జంక్షన్ ), నోవో కుజ్నిస్కయా అనేవి ఈ స్టేషన్ల పేర్లు .టంగ్ ట్విష్ట్ పదాలకోసం వెతుక్కోనక్కరలేదు. మాస్కో మెట్రో స్టేషన్ల పేర్లు సరిపోతాయి.

 ముందే చెప్పినట్టు,  మెట్రో రైళ్లల్లో, ట్రాముల్లో, ట్రాలీ బస్సుల్లో, సిటీ బస్సుల్లో,  అన్నిటిలో పనికొచ్చే పాస్ వుంటుంది. అంటే, మూడు రూబుళ్ళు పెట్టి అతి సులభంగా లభించే ఈ పాస్ కొనుక్కుంటే, నెల పొడుగునా మాస్కో అంతా వీర విహారం చేయవచ్చు. నెలసరి పాస్ అనవసరమనుకున్న వాళ్ళు,  అంటే మాస్కోకి పనులమీద వచ్చే వాళ్ళు,  ఒకే ఒక్క రూబుల్ తో పదిరోజులు వాడుకునే పాస్ కొనుక్కోవచ్చు. ఇన్ని సదుపాయాలతో, ఇంత చవకగా ప్రయాణించడానికి వీలున్న మెట్రో ప్రపంచంలో మరొకటి లేదన్న మంచి పేరు ఒక్క మాస్కో మెట్రోకే దక్కింది.


ఇప్పుడు ఇదంతా గతం. గత కీర్తి మరింత ఘనం. మాస్కో మెట్రో గురించి  జనం మంచిగా చెప్పుకునే రోజులకు నూకలు చెల్లిపోయాయి. అయితే ఇది నా కళ్ళతో చూసి చెబుతున్నది కాదు. చెవులతో విన్నది, వింటున్నది.

1935 లో మాస్కో మెట్రో తొలిసారి ప్రారంభమయినప్పుడు దాని టికెట్ ధరను యాభయి కోపెక్కులుగా నిర్ణయించారు. 1961 లో దాన్ని అయిదు కోపెక్కులకు తగ్గించారు. అప్పటినుంచి  1991 వరకు అంటే ముప్పయి సంవత్సరాలపాటు మెట్రో టికెట్ ఖరీదుని ఒక్క పైసా కూడా పెంచలేదు. గోర్భచేవ్ ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో 1991 లో 15  కోపెక్కులకు, 1992 లో  యాభయి కోపెక్కులకు,  అదే ఏడాదిలో  ఒక్కసారిగా మూడు రూబుళ్ళకు పెంచేశారు. అంటే రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో,  అమాంతం అరవై రెట్లు పెంచారన్న మాట. అంతటితో ఈ పెరుగుదల ఆగలేదు. అలా పెరుగుతూ పోయి మెట్రో టికెట్ ధర 1994 లో   నాలుగువందల రూబుళ్లకూ, 1995 లో  ఆరు వందలనుంచి పదిహేను వందల రూబుళ్లకూ, 1997 సంవత్సరం నాటికి ఏకంగా రెండువేల రూబుళ్లకూ పెరిగి ఇక పెరగడానికి వీలులేక కాబోలు ఆగిపోయింది. పెరుగుట విరుగుట కొరకే అన్న సుమతీ శతకకారుడి సూక్తిని నిజం చేస్తూ ప్రస్తుతం మాస్కో మెట్రో టికెట్ ధర,  మెట్రో  రైలులో  ఒకసారి ప్రయాణానికి 26  రూబుళ్ల వద్ద  నిలకడగా నిలచిపోయింది. ఇంతటి స్థాయిలో,  అనేక వందల  రెట్లు, అదీ అతి తక్కువ వ్యవధిలో ధరలు ఆకాశాన్ని దాటి చుక్కలను తాకినప్పటికీ కూడా నిబ్బరంగా  తట్టుకున్న మాస్కో పౌరులను అభినందించి తీరాలి కదూ. అంతేకాదు, అంతటి ద్రవ్యోల్బణం  ఉత్పాతాన్ని పది పదిహేనేళ్ళ వ్యవధిలోనే అధిగమించగలిగిన   లేదా  తట్టుకోగలిగిన విధంగా 'కుషన్' ఏర్పాటు చేసిన  'సోవియట్ ఎకానమీ'ని  అభినందించాలి.
నిశ్చింతగా ప్రయాణాలు సాగిన ఆ నాటి మాస్కో మెట్రో స్టేషన్లలో ప్రయాణాలు చేయాలనుకునే విదేశీయులకు, ఈనాడు  వారి ఎంబసీలు ఇస్తున్న ఉచిత సలహా వింటుంటే కడుపు తరుక్కుపోతుంది. అదేమిటంటే, 'మాస్కో మెట్రోల్లో జేబు దొంగలుంటారు జాగ్రత్త'.

కళ్ళెదుటే  కలల సామ్రాజ్యం కనుమరుగు కావడం అంటే ఇదే.

ఆనాడు నేను చూసింది మరో ప్రపంచం.

అప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా.

కింది ఫోటో:

మాస్కో మెట్రో మ్యాప్ ( 1980లో)



 

(ఇంకావుంది)