21, ఆగస్టు 2024, బుధవారం

శిలాక్షరం - భండారు శ్రీనివాసరావు



ఆయనకిప్పుడు కొంచెం అటూఇటూగా ఎనభై ఏళ్ళు. నలభై ఏళ్ళ కిందట క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. అనేక ముఖ్యమైన శాఖలు నిర్వహించారు. రెండు మూడేళ్ళ క్రితం కలిసినప్పుడు జరిగిన మాటామంతిలో ఒక విషయం చెప్పారు.  ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా వున్నప్పుడు ఓ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మించి ఆయన చేతులమీదుగా ప్రారంభోత్సవం చేశారట. మాజీ మంత్రి అవతారంలో మళ్ళీ అదే వూరికి సొంత పని మీద వెళుతూ తెలిసిన ఎమ్మెల్యేతో చెప్పించుకుని అదే గెస్ట్ హౌస్ లో గది బుక్ చేసుకున్నారు. తీరా వెడితే గదులు ఖాళీ లేవంటూ, మీరెవరని ప్రశ్నించారట. అడిగినవాడిని కాలరు పుచ్చుకుని లాక్కెళ్ళి గెస్ట్ హౌస్ బయట శిలాఫలకంపై వున్న తన పేరు చూపించాలన్నంత కోపం వచ్చిందట. కానీ తమాయించుకుని అక్కడ నుంచి బయటపడి ఏదో హోటల్లో ఆ రాత్రి బస చేసి వచ్చేశారట.
చివరకు ఆయన చెప్పిందేమిటంటే శిలాఫలకాలమీద పేరు వేశారని సంతోషపడడమే కానీ ప్రజలకు అదేమీ పట్టదు.

20, ఆగస్టు 2024, మంగళవారం

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం


అమెరికాలో నవంబర్ లో  జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల హోరు క్రమంగా ఊపందుకుంటోంది.
ఈరోజు చికాగోలో డెమొక్రాటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ మొదలయింది. 
ప్రెసిడెంట్ పదవికి ఆ పార్టీ తరఫున పోటీ పడుతున్న కమ్లా హారిస్ (ప్రసంగించిన వక్తలలో చాలా మంది ఆమె పేరుని ఇలాగే ఉచ్చరించారు) తో పాటు, గత నాలుగేళ్లుగా అమెరికాను పాలించిన ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా హాజరై ప్రసంగించారు. 
ఒకరకంగా ఇది ఆయనకు వీడ్కోలు కార్యక్రమం అనిపించింది. ఆయన మైకు పట్టుకోగానే హాలు లోని వేలాది మంది వుయ్ లవ్ బైడెన్ అనే ప్లే కార్డు పట్టుకుని లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. 
ప్రస్తుత వైస్ ప్రెసిడెంటు కమ్లా హారిస్ కూడా హాజరయ్యారు. కాకపోతే ఆమె ప్రసంగం ఈ రాత్రి వుండక పోవచ్చు.
రెండు ప్రధాన పార్టీలు ఇలాగే సభలు సమావేశాలు నిర్వహిస్తాయి కానీ బహిరంగంగా కాదు. ఏదో ఒక నగరంలో, అదీ ఒక సమావేశ మందిరంలో.
దేశ ప్రెసిడెంటు పాల్గొంటున్న సభను  టీవీలో వీక్షిస్తున్న నా కంటికి ఎక్కడా సెక్యూరిటీ సిబ్బంది కనపడలేదు. సీక్రెట్ సర్వీసు వాళ్ళు వుంటే వుండవచ్చు. కానీ ఆ వ్యవహారం అంతా సీక్రెట్.
ఇలాంటి పద్ధతులు మన దేశంలో కూడా రావాలని ఆశించడం అత్యాశ కాదు కదా!

19, ఆగస్టు 2024, సోమవారం

ఫొటో

 

నా చిన్ననాటి స్నేహితుడు, సహాధ్యాయి ప్లస్ మేనల్లుడు అయిన తుర్లపాటి సాంబశివరావు (శాయిబాబు, ఇప్పుడు లేడు) దగ్గర ఒక డబ్బా డొక్కు కెమెరా వుండేది. అది పనిచేసేదా కాదా తెలుసుకోవాలి అంటే పదో పదిహేనో రూపాయలు కావాలి. రీలు కొనడానికి ఓ పది, కడిగించి ప్రింట్లు వేయడానికి మళ్ళీ కొంతా ఇల్లాగన్న మాట.  అంత మొత్తం మాదగ్గర ఎలాగూ వుండదు కాబట్టి, అదో టాయ్ కెమేరాలాగా శాయిబాబు వద్ద చాలా కాలం ఉండిపోయింది.
ఒకరోజు దాని అవసరం వచ్చింది. అప్పటికి చదువు  పూర్తి కాకుండా, ఉద్యోగం సద్యోగం కనుచూపుమేరలో లేదన్న సంగతి నిర్ధారణగా తెలిసిన రోజుల్లో అన్నమాట, పక్కింటి అమ్మాయితో (అంటే తదనంతర కాలంలో మా ఆవిడ) నా ప్రేమ వ్యవహారం నిరాఘాటంగా సాగిపోతున్న అద్భుత కాలంలో నాకు ఆ కెమెరా కావాల్సి వచ్చింది. కృష్ణా  బ్యారేజి దాకా నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి గూడు రిక్షాలో మంగళగిరి పానకాల స్వామి దర్శనం చేసుకుని రావాలనేది నా ప్లాను. మరో మేనల్లుడు రామచంద్రం మన కూడా వస్తేనే తను వస్తానని నాకు కాబోయే ఆవిడ  షరతు పెట్టడంతో,  ముగ్గురం కలిసి వెళ్ళాము.  దర్శనం అదీ అయిన తర్వాత అక్కడి కొండపై ఇదిగో ఈ కింది ఫోటో దిగాము. తీసింది రామచంద్రం. కెమెరా ఇచ్చేటప్పుడే చెప్పాడు శాయి బాబు, రీల్లో ఆల్రెడీ తీసిన ఫోటోలు కొన్ని వున్నాయి. డబ్బులు లేక కడిగించలేదు, కాబట్టి ఒకటీ లేదంటే రెండు, అంతే! అంతకంటే ఎక్కువ దిగకండి అని. దాంతో ఒక్కటంటే ఒక్క ఫొటోనే దిగి కెమెరా తిరిగి ఇచ్చేశాను. 
ఆ రీలు కడిగించే డబ్బులు కూడబెట్టడానికి మరి కొన్ని నెలలు ఆగాల్సివచ్చింది. వీరన్న స్టూడియోలో ఇచ్చాము. రెండు రోజుల తర్వాత చూస్తే రీల్లో చాలా ఫోటోలు  ప్రింటుకు పనికిరానివని తేలింది. చివరికి ఐదో ఆరో బాగున్నాయి. కానీ అన్నీ ప్రింటు వేయించాలి అంటే డబ్బులు సరిపోవు. అంచేత ఓ మూడు వేయించాము. అందులో ఇదొకటి.
పెళ్ళికి ముందు ఫోటో కదా! అదో స్వీట్ మెమొరి.
(ఆగస్టు 19, వరల్డ్  ఫోటోగ్రఫీ డే అట కదా!)

17, ఆగస్టు 2024, శనివారం

నువ్వు లేని నేను


అప్పుడే ఐదేళ్ల కాలం నువ్వు లేకుండా గడిచి పోయింది.  మరి కొన్ని యేళ్ళు ఇలాగే గడిచి పోతాయి. ఎన్నాళ్లు అన్నదే తెలియదు. 
అమెరికాలో   పదేళ్ల  క్రితం,  మనిద్దరం  కలిసి తిరిగిన దారుల్లో నీ అడుగు జాడలు వెతుక్కుంటూ.. నా పిచ్చి కానీ కాంక్రీట్ దారిలో అవి ఎలా కనపడతాయి?

 (17/18-08-2019 - 17/18-08- 2024)

16, ఆగస్టు 2024, శుక్రవారం

జయ జయ జయ భారత జనయిత్రీ


అందరూ ఆఫీసుల నుండి వచ్చి బయలు దేరి వెళ్ళేసరికి, బెల్ వ్యూ సిటీ హాల్ పార్కింగ్ లాట్ వందలాది కార్లతో నిండి పోయి ఉంది.
దాంతో పక్క వీధిలో వున్న పెయిడ్ పార్కింగ్ లో కారు పెట్టి తిరిగి వస్తుంటే పేవ్ మెంట్ మీద గుంపులు గుంపులుగా రకరకాల భారతీయ వస్త్ర ధారణతో ఆడా మగ ఉత్సాహంగా నడుస్తూ కనిపించారు. త్రివర్ణ పతాకాలతో సిటీ హాల్ ప్రాంగణం నిండి పోయింది. జాతీయ జెండా కట్టుకుని వెడుతున్న ఒక సిటీ బస్సు కనిపించింది.
వచ్చిన జనం మూడు నాలుగు వేల మంది వుండ వచ్చు. ప్రధాన రహదారిలో ప్రదర్శన. ఆ రోడ్డును కొన్ని గంటల పాటు మూసివేశారు. చాలా మంది సాయుధులు అయిన పోలీసులు వున్నారు కానీ వాహనాలు, పాద చారుల రాకపోకల క్రమబద్ధీకరణకు మాత్రమే పరిమితం అయ్యారు. ఫైర్ సర్వీసు వారు తమ భారీ వాహనాలతో సిద్ధం అయ్యారు. వ్యక్తిగత తనిఖీలు లేవు. అమెరికాలో ప్రవేశించే ముందే ఏ తనిఖీ అయినా. ఒక్కసారి ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత మాల్స్, సినిమా హాల్స్ ఎక్కడా ఏవిధమైన చెకింగులు ఉండకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రోడ్డు దాటేటప్పుడు జాన్ సన్ అనే పోలీసు అధికారి నా చేయి పట్టుకుని దాటించాడు. ఇండియా అంటే సౌతా అని అడిగి, ఓహ్ స్పైసీ అంటూ నవ్వాడు. 
మా అబ్బాయి బోయింగ్ లో పనిచేసేటప్పుడు సహోద్యోగి ఇప్పుడు డిప్యూటీ మేయర్. అంత హడావిడిలో కూడా సందీప్ తో తీరిగ్గా మాట్లాడారు. నన్ను పరిచయం చేస్తే భారతీయ పద్ధతిలో చేతులు జోడించి నమస్కారం చేసారు. 
రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వేదికపై ఇండియన్ కాన్సులేట్ ఉన్నతాధికారులు ఆసీనులు అయ్యారు.  వేదికపై ఒక పక్కగా కూర్చుని రెండు గంటలు ఆసక్తిగా ప్రదర్శన తిలకించిన వారిలో ఒకరిని మాత్రం నేను గుర్తు పట్ట గలిగాను. ఆయన ఎవరో కాదు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్. తరువాత వివిధ రాష్ట్రాల వారు తమ సంస్కృతిని ప్రతిబింబించే వాహనాల ప్రదర్శన జరిగింది. వీటిల్లో తెలంగాణా, ఆంధ్రా లకు చెందినవి కూడా వుండడం సంతోషం కలిగించింది. ప్రదర్శన ముగిసిన తర్వాత వారితో ఫోటోలు దిగాము.
వచ్చిన వారందరికీ స్టార్ బక్స్ వారు తీయటి పానీయాలు అందించారు.
ఇంటికి వెళ్ళే ముందు దగ్గర్లోని ఓ అమెరికన్ రెస్టారెంట్లో భోజనం చేసాము. ఆగష్టు 15 ఇండియన్ రెస్టారెంట్ లకు సెలవు.
మెన్యు కార్డులో కుడి వైపు చూడవద్దు, ఎడమవైపు వున్న వాటిలో మీకు ఇష్టమైనవి ఆర్థర్ చేయండి అనేది మొదటి రోజే మా అబ్బాయి చేసిన సూచన. ఎంత ఖరీదు అనేది పట్టించుకోవద్దు అనేది దాని టీకా తాత్పర్యము.

15, ఆగస్టు 2024, గురువారం

ఆ రోజు ఏం జరిగింది అంటే...



ఆగస్టు 15 అనగానే చటుక్కున అందరికీ గుర్తుకు వచ్చేది ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై భారత ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే
మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కూడా వున్నారు. ఆ బహిరంగ కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. సుమారు అయిదు లక్షల మంది ఆ ప్రాంతానికి ఉత్సాహంగా చేరుకున్నారు. వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము కావడంతో పోలీసులు చేతులు ఎత్తేసారు. కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అనేకమంది విదేశీ దౌత్య వేత్తలు, మంత్రులు, ఇతర ప్రముఖులు, జన సందోహంతో నిండిపోయిన ఆ ప్రదేశానికి చేరుకోలేక వెనక్కి మళ్ళాల్సి వచ్చింది. ఆ జన సమ్మర్దంలో తప్పిపోయిన పిల్లలను వెతికే కార్యక్రమంలో నెహ్రూ, మౌంట్ బాటెన్ కూడా ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఆ మరునాడు అంటే 1947 ఆగస్టు 16 వ తేదీన నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట వద్ద జరిగిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు కానీ పతాకాన్ని ఎగురవేయలేదు. మరో నమ్మ లేని నిజం ఏమిటంటే ఆనాడు ఎర్రకోటపై పతాకాన్ని ఎగురవేసింది ఆ పనికోసం నియోగించబడ్డ ఒక ఆర్మీ అధికారి. అప్పుడు జరిగిన ఏర్పాట్ల గురించి ఒక ఆర్మీ అధికారి రాసిన పుస్తకంలో ఈ వివరాలు వున్నాయి. బురుజుపై నిలబడి ప్రధాని నెహ్రూ ఒక స్విచ్చి నొక్కగానే బురుజు కింద గంట మోగే ఏర్పాటు చేసారు. నెహ్రూ స్విచ్చి నొక్కి గంట మోగించగానే ఆ సంకేతాన్ని అందుకుని ఆర్మీ అధికారి వెంటనే జాతీయ జెండాను ఎగురవేశారని ఆయన ఆ పుస్తకంలో తెలిపారు.
మరో విశేషం ఏమిటంటే త్రివర్ణశోభితమైన జాతీయ పతాకం వినువీధుల్లోకి ఎగరగానే చిరుజల్లులు కురిశాయి. గగన తలంలో ఇంద్రధనుస్సు దర్శనమిచ్చింది. ఒకవైపు త్రివర్ణ పతాకం, మరో వైపు రంగురంగుల ఇంద్ర ధనుస్సు. నయనానందకరమైన ఆ దృశ్యాన్ని చక్కటి శుభసూచనగా ప్రజలు భావించారు.
1947 దాదిగా స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే సాంప్రదాయం ఈనాటికీ కొనసాగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి మొఘల్ చక్రవర్తుల కోటను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే విషయంపై సరయిన వివరాలు లభించడం లేదు. 1857లో జరిగిన ప్రధమ స్వాతంత్ర పోరాటాన్ని బహదూర్ షా జాఫర్ ఈ లాల్ ఖిలా నుంచే మొదలుపెట్టారని, అందుచేత స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎర్రకోట నుంచి ఎగురవేయడం సముచితంగా ఉంటుందన్న భావనతో ఈ సాంప్రదాయం మొదలయిందని కొందరు వివరిస్తున్నారు.
ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి (తెల్లవారితే పదిహేనవ తేదీ) పార్లమెంటు హౌస్ లో జరిగిన భారత రాజ్యాంగపరిషత్తు ఐదో సమావేశంలో, భారత దేశానికి స్వతంత్రం ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది. ఈ సమావేశం పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటలకు సుచేతా కృపాలాని వందేమాతరం గీతాలాపనతో మొదలయింది. రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. పండిట్ నెహ్రూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది “ప్రపంచం యావత్తూ నిద్రిస్తున్న వేళ, స్వతంత్ర వాయువులు పీలుస్తూ భారత దేశం మేలుకుంటోంది” అనే అర్ధం వచ్చేలా చేసిన ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
అనంతరం బొంబాయి (ఇప్పుడు ముంబై) కి చెందిన విద్యావేత్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు హంసా మెహతా, దేశంలోని మహిళలు అందరి తరపున భారత జాతీయ పతాకాన్ని జాతికి సమర్పించారు. సుచేతా కృపాలానీ ‘సారే జహాసే అచ్చా’ గేయం పాడి అలరించారు. ‘జనగణమన’ (అప్పటికి అది జాతీయ గీతం కాదు) గీతాలాపనతో నాటి సమావేశం ముగిసింది.
మరునాడు అంటే ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ హరిలాల్ కనియా, నూతన గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మౌంట్ బాటెన్ నెహ్రూ మంత్రివర్గంతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. జగ్జీవన్ రాం ఆసుపత్రిలో చేరిన కారణంగా ఆయన ఆ రోజున ప్రమాణస్వీకారం చేయలేకపోయారు.

13, ఆగస్టు 2024, మంగళవారం

ఆగస్టు అంటేనే జ్ఞాపకాలు



అందించడం అంటే మాటలు కాదు.
రెండూ రెండున్నర గంటల కార్యక్రమమే అయినా ఇల్లాలు మాత్రం  శతావధానం చేయాల్సిందే.
‘ఆవు నెయ్యి, నల్ల నువ్వులు చెప్పాను, తెచ్చి ఇక్కడ పెట్టండి. భోక్తలు భోజనాలు చేసే చోట తడిగుడ్డతో తుడవండి, ఓ నిమ్మకాయంత అన్నం తెచ్చి విస్తట్లో ఆ మూల వుంచండి, చిల్లర డబ్బులు అక్కడ పెట్టండి, ఆధరువులు అన్నీ వరసగా తెచ్చి వడ్డించండి. జాగ్రత్తగా కనుక్కుని మారు వడ్డన చేయండి’ 
కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన బ్రహ్మగారు ఇలా విరామం లేకుండా ఏదో ఒకటి   అడుగుతూనే వుంటారు. తడిపొడి మడిచీర కట్టుకున్న ఇంటి ఇల్లాలు మరో ముచ్చట లేకుండా వాటిని చప్పున తెచ్చి అందిస్తుండాలి. పేరుకు ఆరోజున ఓ వంటమ్మగారు వచ్చి వంటలు చేసినా, ఈ అందింపు, వడ్డింపుల  బాధ్యత మాత్రం ఇల్లాలిదే. తద్దినానికి కర్తగా కూర్చొన్న భర్త మాత్రం  సవ్యం, అపసవ్యం అంటూ పురోహితుల వారు చెప్పినప్పుడల్లా భుజం మీది  జంధ్యాన్ని మారుస్తూ ఉంటాడు. 
మా అమ్మానాన్నల ఆబ్డీకాల సమయంలో కొన్ని దశాబ్దాలుగా మా ఇళ్ళల్లో జరుగుతూ వచ్చిన తంతు ఇదే.
 డ్రెస్సులకు అలవాటు పడిన యువతరం  కోడలు అయినా అలవాటులేని  చీరకట్టుతో  పడిన ఇబ్బందినీ,  కష్టాన్ని కళ్ళారా చూసినప్పుడు కానీ,  ఇన్నేళ్ళుగా మా ఆవిడ ఇంతగా  కష్టపడిందా అనే ఎరుక నాకు కలగకపోవడం ఆశ్చర్యం. 
నిజానికి ఇందులో  విడ్డూరం ఏముంది! ఆడవాళ్ళ కష్టాలు మగవాళ్లు  తెలుసుకోగలిగితేనే ఆశ్చర్యపడాలి.    
   
 
నిరుడు అయినా ఈ ఏడాది అయినా, వచ్చే యేడు అయినా  మరచిపోవాలని అనుకుని మరచిపోలేని  ఈ జ్ఞాపకాలు బతికి వున్నంత కాలం వెంటాడుతూనే వుంటాయి.