1, ఆగస్టు 2024, గురువారం

పత్రికల మంత్రసాని ఏబీకే


ఆయన ఎన్నో పత్రికలకి పురుడు పోశారు. కానీ మంత్రసాని పాత్రకే ఆయన్ని  పరిమితం చేసారు యజమానులు. పురుడు పోసిన పత్రికలు ఆకాశానికి ఎదిగాయి. కానీ ఆయన మాత్రం నేల మీద తన కాళ్లపై తాను నిలబడే వున్నారు. ఏదన్నా నష్టపోతే ఆ పత్రికలే. ఆయన కాదు.

ఈరోజు తొంభయ్యవ పడిలో అడుగిడుతున్న ఏబీకే ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు - భండారు శ్రీనివాసరావు

30, జులై 2024, మంగళవారం

మా అమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

మా అమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

“ మా అమ్మగారి పేరు వెంకట్రామమ్మ. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907 నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్న తనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్ర రావు కష్టపడి చదువుకుని ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.
“ మా నాన్న గారు భండారు రాఘవ రావు గారు. ఆయన కంభంపాడు కరణం. పర్వతాలయ్య గారి పెద్ద కుమారుడు. ఆయనకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు – వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. ‘యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాద’ని తీర్మానించుకున్న మా తాతగార్లు రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్న గారితో మా అమ్మగారి పెళ్లి. ఈ నాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.
“అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.
“కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన పూర్ణ జీవితం గడిపింది.
“1993 జులై 30 నాడు – ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం – శుద్ద త్రయోదశి, అంతా వరలక్ష్మీ వ్రతం నోచుకున్నారు. ముత్తయిదువలు రావడం, ఫలహారాలు చేయడం, వాయనాలు తీసుకుని వెళ్లడం అంతా అయిపోయింది. ఇల్లంతా సందడి ఓ పక్క. మరో వైపు మరణ శయ్యపై అమ్మ. ఆ రోజు ఉదయం నుండి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వుంది. ఏ క్షణానికి యేమో అన్నట్టుగా వుండడంతో, అందరికీ కబురు వెళ్ళింది. చివరకు ఆ రాత్రి ఎనిమిది గంటల ఇరవై అయిదు నిమిషాలకు, ఇచ్చిన ‘కీ’ అయిపోతే గడియారం దానంతట అదే ఆగిపోయినట్టు అమ్మ ప్రశాంతంగా తుది శ్వాస విడిచింది. మమ్మల్ని అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరం క్రితం కనకాభిషేకం చేసుకున్న ఒక సుదీర్ఘ జీవితం ముగిసిపోయింది. మర్నాడు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగిన అంత్య క్రియలకు అశేష సంఖ్యలో బంధు మిత్రులు తరలి వచ్చారు.
“మూడో రోజు ఉదయం, అస్తి నిమజ్జనం గురించిన ప్రస్తావన వచ్చింది. చిన్న అల్లుడు, భారతి అక్కయ్య మొగుడు తుర్లపాటి పాండురంగారావు గారు ‘కాశీ వెళ్లి గంగలో కలిపితే బాగుంటుంద’ని సూచించారు. దానిపై చర్చ సాగి సాగి అసలు మొత్తం కర్మ కాండ కాశీలోనే చేస్తే బాగుంటుందన్న సలహాను అంతా సమర్ధించారు. ఆ విధంగా కాశీ ప్రయాణం దైవికంగా నిర్ణయం అయిపోయింది. అమ్మ అపర కర్మలు యావత్తు సమీప బంధు జన సమక్షంలో కాశీలో జరగడం ఓ విశేషం ”
( 1987 లో నేను మాస్కో వెళ్లేముందు మా అమ్మగారు జీవించి వున్నప్పుడు కొందరు కుటుంబ సభ్యులతో తీసిన ఫోటో )

అమెరికాలో మొదటి రోజు



రెండో కుమారుడు సంతోష్ మాసికంతో మొదలయింది.
నాకు తోడుగా వచ్చిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి కుమారుడు లాల్ బహదూర్, కోడలు, మేనకోడలు దీపతో కలిసి ఆదివారం ఉదయం వాషింగ్టన్ డి సి విమానాశ్రయం చేరుకున్నాను. మొత్తం ప్రయాణంలో వాళ్ళు కంటికి రెప్పలా చూసుకున్నారు. చిన్న లగేజ్ కూడా నన్ను ముట్టుకోనివ్వ లేదు. అదృష్టం నా మొబైల్ ను మాత్రం నా చేత్తో పట్టుకోనిచ్చారు.
ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగానే బిలబిలమంటూ మా రెండో అన్నయ్య, మూడో అన్నయ్య పిల్లలు లోపలకు వచ్చారు. నన్ను సియాటిల్ కు తీసుకు వెళ్ళడానికి మా వాడు సందీప్ రేపు వస్తున్నాడు. లగేజ్ తో బయటకు రాగానే నాలుగు మత్తేభాలు వంటి పెద్ద వాహనాలు సిద్ధంగా పెట్టారు. వెళ్ళింది ముగ్గురం. రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది పది మంది. ఈ వాహనాల్లో ఒకటి డ్రైవర్ లేని కారు. మా రెండో అన్నయ్య కొడుకు సత్య సాయి ముచ్చటపడి రెండేళ్ళ క్రితం కొనుక్కున్నాడు. డ్రైవర్ సీట్లో మనిషి వుంటాడు కానీ డ్రైవ్ చేయడు. అంతా ఆటోమేటిక్. కారుకు అమర్చిన సూక్ష్మమైన కెమేరాలు దారిలో వచ్చే పోయే వాహనాలను చూసుకుంటాయి. స్పీడ్ లిమిట్స్ వున్న ఇండికేటర్లు కనిపించినప్పుడు అదే వేగాన్ని వాటికి అనుగుణంగా సరిచేసుకుంటుంది. అంచేత ట్రాఫిక్ పోలీసుల ఓవర్ స్పీడ్ చలానాల ( ఇక్కడ టిక్కెట్స్ అంటారు) బెడద ఉండదు. అలాగే నిర్దేశించిన జాగాలో అదే తనను ముందుకు వెనక్కు జరిగి తనను తాను జాగ్రత్తగా పార్కు చేసుకుంటుంది. దీనివల్ల కారుకు సొట్టలు పడవు. అంతా బాగానే వుంది కానీ రయ్యి రయ్యిమని దూసుకు పోతున్న వాహనాల నడుమ మనం ప్రయాణిస్తున్న కారుకు డ్రైవర్ లేడు అనే భావన ( భయం అందామా) వెంటాడుతూనే ఉంటుంది). 
రెండు రాష్ట్రాలు దాటి మూడో రాష్ట్రం మేరీ ల్యాండ్ లో ప్రవేశించి మా మేనల్లుడు రామచంద్రం కుమారుడు కాశ్యప్, వాహిని దంపతుల ఇంటికి చేరాం. ముందూ వెనకా పెరళ్లు. వెనక దట్టమైన అడవి. నింగిని తాకుతున్నట్టు పొడవైన వృక్షాలు. అప్పుడప్పుడు జింకలు, కుందేళ్ళు కనిపిస్తాయి. వృక్ష, వన్య సంపదలను కాపాడు కుంటున్న తీరు ప్రశంసనీయం. ఇలాంటి విషయాలు అన్నీ గతంలో పదేళ్ళ క్రితం నా బ్లాగులో రాశాను. 
బ్రేక్ ఫాస్ట్ సమయంలో నా రెండో కుమారుడు సంతోష్ ఏడో మాసికం ప్రస్తావన వచ్చింది. ఆ వూళ్లోనే మా దగ్గరి బంధువు, నాకు స్కూల్లో క్లాస్ మేట్ వనం వరదా రావు కుమార్తె స్వప్న, అల్లుడు సుగుణాకర రావు దంపతులు చాలా కాలంగా వుంటున్నారు. అక్కడ మన వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆయనే దిక్కు. ఫోన్ చేసి, తిథి చెబితే ఆయన పంచాంగం చూసి ఆదివారం మధ్యాహ్నం నుంచి మరునాడు సోమవారం  ఉదయం ఎనిమిదిన్నర వరకు వుందని అంచేత ఈ రోజే పూర్తి చేయడం మంచిదని సలహా చెప్పారు. అదే వూళ్ళో వివిధ గుళ్ళలో పనిచేస్తున్న ఇద్దరు ముగ్గురు పూజారులను సంప్రదించి చివరకు సాయిబాబా గుడి పూజారిని పట్టుకున్నారు. వెంటనే నాలుగు కార్లలో బయలుదేరి దారి మధ్యలో ఒక ఇండియన్ స్టోర్ లో పూజారి గారు చెప్పిన సంభారాల జాబితా ప్రకారం కొనుక్కుని వెళ్లాం. పేరుకు బాబా గుడి కానీ సమస్త దేవతలు అక్కడ కొలువు తీరి ఉన్నారు. పూజారి గారు నెమ్మదస్తులు. ప్రశాంతచిత్తులు. సావధానంగా కార్యక్రమం ఎలాంటి హడావిడీ చేయకుండా చక్కగా పూర్తి చేసారు. దేశం కాని దేశంలో, వచ్చిన మొదటి రోజునే పని పూర్తి అయ్యేలా చూడడం ఆ పై వాడి పనే అనుకున్నాను.
కాశ్యప్ ఇంట్లోనే లంచ్ పూర్తి చేసి సాయం కాలం దాకా కాలక్షేపం చేసి డ్రైవర్ లేని కార్లో దగ్గరా దూరం కాని మా సాయి ఇంటికి చేరుకుని డిన్నర్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకుని నిద్రకు ఉపక్రమించాము. 
జెట్ లాగ్ బెడద లేని నిశాచరుడుని కనుక అంతా సక్రమంగా జరిగిందని హైదరా బాదులోని మా కోడలు, మా అన్నయ్యకు తెలియచెప్పే పనిలో పడ్డాను.
ఇప్పుడు సమయం  తెల్లవారు ఝామున జస్ట్ నాలుగున్నర.
గత అయిదేళ్లుగా నాకిది అలవాటే.

కింది ఫోటో:
గుడిలో పూజారి గారి ఆశీర్వ చనాలు తీసుకుంటూ.





https://photos.google.com/share/AF1QipMVC654XuBufk7Q22AMfe4h9Z0HL6DY-9u5d3irzPpwEIhuUKi0wOZPVYqKVehjBw?pli=1&key=Ti1paVV4NXVTbnk1bDQxdnZyd2t6ZlI1MmZJR3BB

దుబాయ్ సెక్యూరిటీ బొమ్మ నువ్వు నువ్వుకాదు పో అంది



విదేశీ ప్రయాణాలు కొత్త కాదు కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరుతో చేస్తున్న కొత్త కొత్త సెక్యూరిటీ ప్రయోగాలు ప్రతి ప్రయాణంలో కొత్త గానే వుంటున్నాయి.
మేము ప్రయాణిస్తున్న ఎమిరేట్స్ విమానం అరగంట ఆలస్యంగా హైదరాబాదులో బయలుదేరి దుబాయ్ విమానాశ్రయానికి సకాలంలో కాకపోయినా కనెక్టింగ్ ఫ్లయిట్ తప్పిపోయేంత ఆలస్యం మాత్రం చేయలేదు. 
దుబాయ్ లో సెక్యూరిటీ చెక్ విధానాన్ని అత్యంత ఆధునికం చేయాలని అనిపించడమే తడవు, డబ్బుకు కొరత లేని ఆ దేశపు రాజులు రెండు బొమ్మల్ని తెచ్చి అక్కడ పెట్టారు. ఆ బొమ్మలు సజీవ చిత్రాల మాదిరిగా కళ్ళు కదిలిస్తూ ఎదురుగా నిలబడ్డ మనిషిని ఆపాదమస్తకం పరీక్షించి, అసలు అని తను అనుకుంటే లోపలకు దయచేయమని చేయి చూపిస్తుంది. లేకపోతే బయటకు దయచేయమని వాళ్ల భాషలో వురిమి చెబుతుంది. నా వెంట వచ్చిన( లేదా వాళ్ల వెంట నేను అంటే బాగుంటుంది) మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి మూడో కుమారుడు లాల్ బహదూర్, కోడలు, మేనకోడలు కూడా అయిన దీప ఇద్దరూ నాకు చెరో పక్క నిలబడి నాకు ఏ మాత్రం అలసట రాకుండా, ఎలాగంటే నా మొబైల్ ను మాత్రం నన్ను మోసుకోనిచ్చారు.
ప్రయాణం ఇలా సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఈ దుబాయ్ బొమ్మ వాళ్ళిద్దరికీ పచ్చ జెండా ఊపి నా దగ్గరకు వచ్చి నో, నియత్, నువ్వు నువ్వు కాదు పొమ్మని ఎడమ చేతితో కసిరి పొమ్మంది. అక్కడున్న సెక్యూరిటీ నన్ను వెంటనే బయటకు పొమ్మనకుండా కాళ్ళు ఎక్కడ పెట్టాలి, కళ్ళు కెమెరా లోకి ఎలా చూడాలి అనే విషయాలు బోధ పరిచి మళ్ళీ అక్కడ నిలబెట్టాడు. ఆ బొమ్మ కళ్ళు విప్పార్చి మరీ. నన్ను చూసింది. కనురెప్పలు రెపరెప లాడించింది. బొమ్మ కాస్త మెత్త బడ్డట్టు ఆనిపించింది. కాసేపు అలా చూసి మళ్ళీ కళ్ళు ఉరిమి చూసి నువ్వు నువ్వు కాదు మరొకరివి అని  వాళ్ల భాషలో అరిచి చెప్పింది. 
అప్పుడు లైట్ వెలిగింది. పాస్ పోర్ట్ ఫొటోలో, అమెరికా వీసా ఫొటోలో నాకు మీసం వుంది. ఈ బొమ్మ కానీ ఆ తేడా కనిపెట్టి అలా తేడాగా బిహేవ్ చేస్తోందన్న సందేహం కలిగి ఆ సెక్యూరిటీ అధికారికి మీసాలతో వున్న నా పాత ఐడెంటిటీ కార్డులలోని ఫోటోలు, మీసాలు లేని తాజా ఫేస్ బుక్ ఫోటోలు చూపించి, ఆ బొమ్మ కాదు అంటున్న ఆ నేను ఈ నేనే అని వచ్చీరాని అన్ని భాషల్లో చెప్పేసరికి అతడు కరుణాంత, రంగుడై, ప్రశాంత చిత్తుడై నాకు మాన్యువల్ గా సెక్యూరిటీ చెక్ చేసి మొత్తానికి కథకు శుభం కార్డు వేశాడు. కొన్ని నెలలు నన్ను చూడకుండా వున్న నా రెండేళ్ళ మనుమరాలు జీవిక మొన్నీ మధ్య కటక్ నుంచి వచ్చినప్పుడు హైదారాబాద్ ఎయిర్ పోర్టులో తాతా అంటూ వాళ్ళమ్మ చంకలో నుంచి నా మీదకు ఎగిరి దూకింది. ఈ మాత్రం గ్రహింపు అంత డబ్బు పోసి కొన్న ఆ బొమ్మకు లేకపోవడం విచిత్రమే.

27, జులై 2024, శనివారం

గుర్తుకొస్తున్నాయి - భండారు శ్రీనివాసరావు


నిన్న మధ్యాన్నం భాస్కర శర్మ గారికి నాకిచ్చిన మాట జ్ఞాపకం వచ్చినట్టుంది.
' మీరు సారును కలవాలి అనుకుంటే రెండున్నరకల్లా సెక్రటేరియట్ కి రాగలరా?' 
రాగలరా అనడంలోనే ఆయన సంశయం అర్థం అయింది. వాహన సౌకర్యం లేదు. ఉబెర్ లో వెళ్ళినా గేటు దగ్గర అటకాయింపులు తప్పవు. అప్పటికి భోజనం సరే, స్నానాదికాలు కూడా పూర్తి కాలేదు. 
దేవుడు నాలాంటి వాళ్ల కోసమే కదా వుంది. ఆయనే దోవ చూపించాడు. మా మూడో అక్కయ్య అల్లుడు మా ఇంటికి రావడం ఆయన కార్లో అనుకున్న సమయానికి ఓ అరగంట ఆలస్యంగా వెళ్ళడం జరిగింది.  అయిదారు లిఫ్టులు వున్నా వచ్చే జనం పోయే జనంతో కిటకిట లాడుతున్నాయి. రెండో అంతస్తు తొమ్మిదో నెంబరు గది అన్నారు. మెట్ల మీద వెళ్ళాము. శర్మగారు వచ్చి తీసుకు వెళ్ళడం వల్ల సెక్యూరిటీ బెడద తప్పింది. మమ్మల్ని నేరుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి గారి ఛాంబర్ లోకి తీసుకువెళ్ళారు. ఆయన యాంటీ రూములో మరో మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతున్నారు. బయటకు వస్తూనే భట్టి గారు తనదైన మందహాసంతో పలకరించి తన సీటు వద్దకు తీసుకు వెళ్ళారు. కాఫీ మర్యాదలు, ఆదరింపు మాటలు యధావిధిగా పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో మా వాడు చనిపోయినప్పడు వద్దామనుకున్నా రు కానీ అదే సమయంలో వారి సోదరుడు చనిపోవడం వల్ల స్వగ్రామం వెళ్లాల్సి వచ్చింది. 
పేషీ అఫిషియల్ ఫోటోగ్రాఫర్ తో ఫోటోలు తీయించారు. 
ఆ పేషీలో పనిచేస్తున్న సత్యనారాయణ గారు, శేషుబాబు గారు సాదరంగా పేరుతో పలకరిస్తుంటే నా మతిమరపుకి చచ్చేంత సిగ్గు వేసింది 
రాకరాక వచ్చాను కదా మరో మిత్రుడిని కలిసిపోతే సరిపోతుందని అనిపించి ఫోన్ చేసాను. ఆయన గొంతు తగ్గించి , సీ ఎం గారితో వున్నాను, ఆరో అంతస్తులో నా ఆఫీసులో కూర్చోండి నేను వస్తాను అన్నారు.
సరే అని ఆరో ఫ్లోర్ కు వెళ్ళాము. సెక్యూరిటీ బాగానే వుంది సీ ఎం బ్లాకు కదా. వెళ్లి కూర్చున్న కాసేపటికి చిరు నవ్వు చిందిస్తూ సీ ఎం సీ పీ ఆర్వో అయోధ్య రెడ్డి గారు వచ్చారు. పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా వున్నప్పుడు పాత అంటే మరీ పాత సచివాలయంలో కలిసి వార్తలకోసం తిరిగేవాళ్ళం. ముందు నవ్వు కనపడి తర్వాత మొహం కనపడడం ఆయన ప్రత్యేకత. 
మళ్ళీ పాత కబుర్లు. నలభయ్ ఏళ్ల గతానికి జారిపోయాను. ఆయన పేషీ లోనే మరో మిత్రుడు, సీ ఎంపీఆర్వో గా పనిచేస్తున్న జాకబ్ గారు కనిపించి ఆప్యాయంగా పలకరించారు.
లిఫ్ట్ దిగి వస్తుంటే ఒకనాడు జూనియర్లుగా  పరిచయం అయి ఈనాడు చాలా సీనియర్లు అయిన   ఐఏఎస్ అధికారులు ఇద్దరు కనపడ్డారు. వారు మధ్యలో దిగిపోయారు. కిందికి దిగుతుంటే లిఫ్ట్ బాయ్ పలకరించాడు. మీరు రేడియో శ్రీనివాస్ గారు కదా! అని అడుగుతుంటే కళ్ళు చెమర్చాయి. రిటైర్ అయి దాదాపు ఇరవై ఏళ్ళు. అయినా జనానికి గుర్తు వున్నాను అంటే అది నిజంగా వాళ్ళ గొప్పతనం, మంచితనం.
లిఫ్ట్ బయటకు రాగానే హిందుస్థాన్ టైమ్స్ అప్పరసు శ్రీనివాసరావు గారు, మరో మిత్రుడు సుధాకర్ (ఒకప్పుడు ఆంధ్ర జ్యోతి) కనిపించారు. శ్రీనివాస రావు, వారి అన్నగారు ఆంధ్ర జ్యోతి ఢిల్లీ కృష్ణా రావు గారు చిరకాల మిత్రులు. శ్రీనివాస రావు ఐ ఏ ఎస్ అధికారుల ద్వారా చాలా సమాచారాలు సేకరించేవారు. ఆయనతో పాటు నేను తిరిగేవాడిని. 
బహుశా నా జీవితంలో నడవాల్సిన నడక మొత్తం ఆ రోజుల్లో సచివాలయంలో నడిచి వుంటాను. కొన్ని చోట్ల లిఫ్టులు వుండేవి కాదు. నాలుగయిదు అంతస్తులు ఎక్కి దిగే వాళ్ళం. అలుపు అనిపించేది కాదు. వయసు అలాంటిది.
ఇంట్లో ఒంటరిగా వున్న వాళ్ళని దేవుడు ఇలా ఒక్కోసారి బయట తిరిగి వంట్లో సత్తువ పెరిగేలా చూస్తాడు. 
అసలీ వయసులో దీన్ని మించిన టానిక్ లేదు.
 ఇక వచ్చే రెండు మాసాలు అమెరికాలో. ఈ రాత్రే ప్రయాణం. సెప్టెంబర్ 22 న తిరిగి రాక.
 (27-7-2024)

24, జులై 2024, బుధవారం

పేరెంట్స్ డే



(ఈ పదాన్ని తెనిగించడం నాకు మంచిగా అనిపించలేదు. పైగా అనువదిస్తే దరిద్రమైన అర్ధం వస్తుంది.అందుకే అలానే ఉంచేశాను)  

“చూస్తుండండి. ఏనాటికో ఓనాడు మనవాడు మనం గర్వపడేలా గొప్పవాడు అవుతాడు” అంటుంది తల్లి.
“నాకూ వాడు ప్రయోజకుడు కావాలనే వుంది. కానీ వాడి తరహా చూస్తుంటే నమ్మకం కుదరడంలేదు” అది తండ్రి అభిప్రాయం.
వీరి అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. 
కానీ.. ఆ తల్లిది ఆకాంక్షతో కూడిన అతివిశ్వాసం, ఆ తండ్రిది అపనమ్మకంతో కూడిన అభిలాష . ఇద్దరిదీ ఒకటే కోరిక, తమ పిల్లలు  ప్రయోజకులు కావాలనే. తేడా అల్లా భావవ్యక్తీకరణలో. కల్మషం, కల్తీలేని ప్రేమ కన్నవారిది.
పిల్లలు పిల్లలుగా వున్నప్పుడు అనేకమంది తలితండ్రులది ఇదే పరిస్తితి. పిల్లలందరు పెద్దవాళ్ళు అవుతారు. కొద్దిమందే నిజంగా గొప్పవాళ్ళు కాగలుగుతారు. జీవితంలో బాగా ఎదిగొచ్చిన అనేకమంది సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు పత్రికలకి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఒక మాట చెబుతుంటారు, ‘తలితండ్రులు కష్టపడితే ఇలా  పైకి వచ్చాం, కానీ మా ఎదుగుదలను మా  కన్నవాళ్ళు కళ్ళారా చూడలేకపోయారనే  బాధ మాత్రం మిగిలింది” అని. 
తలితండ్రుల ప్రేమకు గుర్తింపుగా వారి పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఒక దినాన్ని కేటాయించారు.

“ తలితండ్రులను ఆదరించండి, ప్రేమించండి” అనేది ఈ ఏడాది పేరెంట్స్ డే నినాదం.

మన మేలుకోరే శ్రేయోభిలాషులు చాలామంది వుంటారు. కానీ మనం ఈ భూమి మీదకు రాకముందునుంచి  మనల్ని మనసారా ప్రేమించింది, మనం బాగుండాలని కోరుకున్నది  మన తలితండ్రులు మాత్రమే.

లోకం చుడుతున్న వీరుడు రాజేష్ వేమూరి


రాజేష్ వేమూరి అనే పేరు వినగానే నాకు అల్లసాని పెద్దన విరచిత స్వారోచిత మనుసంభవం అనే మనుచరిత్ర  కావ్యంలోని ప్రవరుడు, మహాకవి ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం గుర్తుకు వస్తాయి.
ప్రవరాఖ్యుడి గురించి ఖమ్మం కాలేజీలో మా తెలుగు లెక్చరర్ ఆదినారాయణ గారు చెప్పేవారు.
అరుణాస్పదపురం అనే  ఓ మారుమూల కుగ్రామంలో కాపురం చేసుకుంటూ, తలితండ్రులను పోషించుకుంటూ త్రికాల సంధ్యాదులు సక్రమంగా క్రమంతప్పకుండా  నిర్వర్తించుకుంటూ కాలం గడిపే ఓ శోత్రియ శ్రేష్టుడు ప్రవరుడు.  అతడికి తన ఇల్లే కైలాసం. ఊరు దాటి ఎరుగడు. కానీ లోకం చూడాలనే కోరిక. పొలిమేర దాటలేని ఆశక్తత. అంచేత ఊరిలోకి ఏ కొత్త వ్యక్తి వచ్చినా ఇంటికి పిలిచి ఆతిధ్యం ఇచ్చేవాడు. అతిథి మర్యాదల అనంతరం తాను చూడాలని అనుకుని చూడలేని ప్రదేశాల విశేషాలు వారినుంచి వింటూ తృప్తి పడేవాడు. ఈ క్రమంలో యువకుడు అయిన ఓ యువ సిద్ధుడు తటస్థ పడడం, పరాయి ప్రదేశాలను గురించి అతడు చెప్పిన సంగతులు వింటూ, ఇంత చిన్న వయస్సులో అన్ని ప్రాంతాలు ఎలా తిరిగాడని అబ్బుర పడడం,  సరే ఈ కధ ఇంతవరకే చెప్పుకుందాం. తర్వాత కధ తెలియని వాళ్ళు వుండరు. 
ఇదెందుకు చెప్పాను అంటే, ఈ కావ్యంలోని ప్రవరుడి వంటి వారు అనేకమంది ఈ నాటికీ వుంటారు. దేశాలు చుట్టి రావాలని వారికి  వుంటుంది, కానీ అందుకు అనేక అవరోధాలు. అంచేత రాజేష్ వంటి వారు దేశాలు చుట్టి రాసే పుస్తకాలు చదివి,  సంతోషించడం. ఇంత చిన్న వయస్సులో ఇన్ని దేశాలు ఎలా తిరిగారని ఆశ్చర్యపడడం.
మనుచరిత్రలోని  సిద్ధుడి వద్ద, అనుకున్నదే తడవుగా  లోకాలు చుట్టి రావడానికి పాదలేపనం అనే దివ్యమైన పసరు  వుంది.  మరి రాజేష్ దగ్గర ఏముంది. తిరగాలనే ఆకాంక్ష వుంది. దాన్ని నెరవేర్చుకునే పట్టుదల వుంది. పట్టుదలకు తగ్గట్టు సహకరించే భార్య భార్గవి వున్నారు. పోదాం పద డాడీ అంటూ  సంచి సర్దుకుని, నేనూ రెడీ అనే   చిన్నారి హన్ష్ ప్రోద్బలం వుంది. అన్నింటికీ మించి రకరకాల దేశాలు చూడాలి, అక్కడి ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవాలి అనే బలమైన కోరిక వుంది. విశాలమైన హృదయం వుంది. ఏతావాతా జరిగింది ఏమిటి అంటే ఇరవై రెండు దేశాల వీసా స్టాంపులు వాళ్ళ పాసుపోర్టుల్లో భద్రంగా వున్నాయి. కాణీ ఖర్చులేకుండా మనల్ని కూడా ఆ పుస్తకాల ద్వారా ఆ దేశాలు  తిప్పారు. ఈ పుణ్యం ఎక్కడికి పోతుంది చెప్పండి. ముందు ముందు మరిన్ని దేశాలు తిరుగుతారు. మరిన్ని పుస్తకాలు రాస్తారు. మనమూ  వాటిని చదువుతూ వారితో పాటు ఆయా దేశాలు ఉత్తపుణ్యానికి చదువుతాము. ఉభయతారకం అన్నమాట.
ఇంతకీ దూర్జటి పద్యం గురించి ప్రస్తావించారు కానీ ఆ ప్రసక్తి రాలేదేమిటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నాను. ముగింపు కోసం అట్టే పెట్టాను.
శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఆఖరి నూరో పద్యం ఇది.
“దంతంబుల్పడనప్పుడే తనవునం దారూడి యున్నప్పుడే
 కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే 
విన్తల్మేన చరించనప్పుడే కురుల్వెల్ల గానప్పుడే చింతింపన్వలె
నీ పదాంబుజములన్ శ్రీ కాళ హస్తీశ్వరా!”
ప్రతిపదార్ధం అవసరం అనుకోను.  
తిరగగలిగిన వయసులో తిరగకుండా, ఇప్పుడు 78 ఏళ్ల వయసులో తిరగాలనే  కోరిక ఉన్నప్పటికీ   తిరగలేని అశక్తత కలిగిన మా వంటి వారి గురించే ఆ పద్యం రాసారని అనిపించింది. 
అయినా భక్త గోపన్న అన్నట్టు, తక్కువేమి మనకు, రాజేష్ పుస్తకం చేత వున్నవరకు.
కావున, కాబట్టి దేశాలు  తిరగలేని మా బోంట్ల తరపున వారికి  మనః పూర్వక ధన్యవాదాలు.