15, ఫిబ్రవరి 2023, బుధవారం

ఈనాటి వార్త: ఓనాటి జ్ఞాపకం

 





ఎక్కడ ? ఎప్పుడు ? 


కొంత కాలం గత కాలంలో కలిసిపోయిన తర్వాత, ఆ నాటి పాత విషయాలను గుర్తు చేసుకుంటూ వుంటే, గుర్తుకు వస్తూ వుంటే, కొంత సంతోషం అనిపిస్తుంది, కొంత తమాషాగా అనిపిస్తుంది.


ఈ ‘ఎక్కడ ఎప్పుడు’ ఇలాటి విషయాల్లో ఒకటి. 

ఈ రెండు పదాలతో రేడియో మార్నింగ్ బులెటిన్ లో ఒక హెడ్ లైన్ వార్త తయారు అయ్యేది.


అర్ధరాత్రో అపరాత్రో మా చిక్కడపల్లి ఇంట్లో ఫోన్ రింగయ్యేది. ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ ఫోన్లే. సెల్ కాలం కాదు.


ఫోను  మంచం పక్కనే  పెట్టుకునేవాడిని. మరీ అర్ధరాత్రి ఫోనయితే అవతల  రైల్వే పీఆర్ఓ మైఖేల్. తెల్లవారుఝామున అయితే సీపీఆర్వో కృష్ణయ్య గారు. అదీ లెక్క.


ఫోను ఎత్తి ‘ఎక్కడ? ఎప్పుడు?’ అని అడిగేవాడిని.

వాళ్ళ నుంచి జవాబు తీసుకుని వెంటనే విజయవాడ రేడియో ప్రాంతీయ వార్తా విభాగం న్యూస్ ఎడిటర్ శ్రీ ఆర్వీవీ కృష్ణారావు గారు లేదా శ్రీ ఏమ్వీఎస్ ప్రసాద్ గారికో ఫోను కలిపేవాడిని. ఎవరు డ్యూటీలో వుంటే వాళ్ళు నా ఫోన్ రిసీవ్ చేసుకుని  'ఎక్కడ? ఎప్పుడు?' అని అడిగేవారు. నేను క్లుప్తంగా ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు ఓ వార్త రూపంలో రాసుకునే వారు.  వాళ్ళిద్దరూ ఎంతటి సమర్ధులు అంటే కొన్ని  క్షణాల్లో నేను చెప్పిన వార్తను విస్తరించి,  మరికొన్ని నిమిషాల్లో ప్రసారం అయ్యే ప్రాంతీయ వార్తల బులెటిన్ లో ప్రాధాన్యతా క్రమంలో చేర్చేవారు. 


“ఆకాశవాణి  ప్రాంతీయ వార్తలు చదువుతున్నది  ప్రయాగ రామకృష్ణ/ కొప్పుల సుబ్బారావు.


“దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒక గూడ్స్ రైలు  రాత్రి పట్టాలు తప్పింది. పలానా  స్టేషన్ల నడుమ జరిగిన ఈ దుర్ఘటన కారణంగా పలు రైళ్ళ రాకపోకలకు  అంతరాయం కలిగిందని, కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారని రైల్వే అధికారులు కొద్దిసేపటి క్రితం మా హైదరాబాదు ప్రతినిధికి తెలియచేసారు. వివరాలు.....”


ఎక్కడో సికిందరాబాదు  రైల్వే క్వార్తర్స్ లో పొద్దున్నే రేడియో పెట్టుకుని వార్తలు వింటున్న రైల్వే అధికారులు, ఎలాంటి పొరబాటు లేకుండా వార్త ప్రసారం అయిన సంగతి తెలుసుకుని ఊపిరి పీల్చుకునే వారు. చెప్పిన వార్త ఎలాంటి తభావతు లేకుండా వస్తుందని తెలుసు కనుక నేను ముసుగు తన్ని నిద్రపోయేవాడిని.

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

నిశ్శబ్దం రాజ్యమేలిన ముఖ్యమంత్రి సభ - భండారు శ్రీనివాసరావు

 (ఫిబ్రవరి 14 దామోదరం  సంజీవయ్య గారి జయంతి)

ఈ విషయం చెప్పే ముందు దీంతో సంబంధం ఉన్న మరో విషయంతో మొదలు పెడతాను.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ స్థాయికి చేరడానికి ముందు ఎక్కిన అనేకానేక నిచ్చెన మెట్లలో నెలకు పాతిక రూపాయల ‘విలేకరి కొలువు’ కూడా వుంది.

ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీ ఎన్ ఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. రామ్మోహనరావు గారు ఆ కాలేజీలో లెక్చరర్. వారి నాన్నగారికి పత్రికల ఏజెన్సీ కూడా వుంది. అప్పట్లో ఆ ఏజెంట్లే పత్రికా విలేకరుల పాత్ర కూడా పోషించేవారు. మా అన్నయ్యకు తెలుగులో ఉన్న ప్రావీణ్యం గమనించి ‘నెలకు ఓ పాతిక ఇస్తాను, నీకు పాకెట్ మనీగా పనికి వస్తుంది, నువ్వు ఆంద్రజ్యోతి పత్రికకు వార్తలు రాస్తుండు. వాళ్ళు వేస్తె వేస్తారు, లేకపోతే లేదు, కానీ నీకు మంచి కాలక్షేపంగా వుంటుంది’ అని ప్రోత్సహించడంతో మా అన్నయ్య ఒప్పుకున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తాను.

నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు అయింది. అప్పటికే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ రెండు వర్గాలుగా విడిపోయివున్నారు. జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి వంటి అతిరధులు కలిగిన ప్రధాన వర్గం అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డికి అనుకూలం. మరో వర్గం సంజీవయ్య వైపు. దీనికి మాకు బాబాయి వరుస అయిన బొమ్మకంటి సత్యనారాయణ నాయకులు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు ఆయన ముఖ్యమంత్రి సంజీవయ్యకు కుడి భుజం. సంజీవయ్యకు సంఘీభావం తెలిపేందుకు గోకినేపల్లిలో జిల్లా దళిత మహా సభ ఏర్పాటు చేశారు. ఈ సభను కవర్ చేయడానికి పాతిక రూపాయల విలేకరి అయిన మా అన్నయ్యను పురమాయించారు రామ్మోహన రావు గారు.

సభ బాగా జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి మైకు ముందు నిలబడ్డారు. సంజీవయ్య స్వతహాగా మంచి వక్త. ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.

నన్ను బాధ పెడుతున్న, నా మనసును కలచి వేస్తున్న ఓ విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇక్కడ పైనా కిందా కూర్చున్న మనుషులం అందరం ఒకే తీరున ఉన్నాము. ఒంట్లో పారే రక్తం రంగు అందరికీ ఎరుపే. కానీ మనలో చాలామందిమి సాటి మనిషిని మనిషిగా చూస్తున్నామా అంటే అనుమానమే. డబ్బున్న ఖామందులు పెంపుడు బొచ్చు కుక్క పిల్లల్ని తమ పక్కలపై పడుకోబెట్టుకుంటారు. ముద్దు చేస్తారు. అదే సాటి మనిషిని తాకడానికి కూడా వారికి అస్పృశ్యత అనే అనాచారం అడ్డం వస్తుంది. కుక్కలపాటి చేయరా ఈ మనుషులు? ఎందుకీ వ్యత్యాసం? ఎందుకీ వివక్ష?’

రెండు చేతులూ గట్టిగా గాలిలో ఊపుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వరం బొంగురుపోయింది. పైకిలేపిన చేతులను అలాగే వుంచి ఆయన కాసేపు మౌనంగా వుండిపోయారు.

సభకు హాజరై ప్రసంగం వింటున్న యావన్మంది చేష్టలు ఉడిగి వుండిపోయారు. అంతటా నీరవ నిశ్శబ్దం.

సరే! ఆ రోజు సభ ముగిసింది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి దామోదరం సంజీవయ్య అంబాసిడర్ కారు ఎక్కారు. ఆయన పక్కనే మా బాబాయి బొమ్మకంటి సత్యనారాయణ. ముందొక పోలీసు జీపు, వెనక మరో జీపు. అదీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోజుల్లో.

మా అన్నయ్య ఖమ్మం చేరుకున్న వెంటనే తన రిపోర్ట్ రాసి మర్నాడు పోస్టులో పంపారు. ఆ మరునాడు అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది.

ముఖ్యమంత్రి దళిత సభలో రాజ్యమేలిన నిశ్శబ్దం’.

వార్తతో పాటు మా అన్నయ్య పెట్టిన హెడ్డింగ్ కూడా యధాతధంగా పత్రికలో రావడం కొసమెరుపు.



 

13, ఫిబ్రవరి 2023, సోమవారం

మాటలు మింగే తిమింగలాలు – భండారు శ్రీనివాసరావు

 

ఈరోజు రేడియోను గుర్తు చేసుకునే రోజు

(ప్రపంచ రేడియో దినోత్సవం)

అంచేత ఓ పాత అనుభవాన్ని పంచుకుంటున్నాను.

మీ గొంతు పీలగా అనిపించింది’

మొదలు పెట్టినప్పుడు దూకుడుగా మొదలెడతారు. పోను పోను తేలిపోతున్నట్టుగా వుంటుంది. ఇక వాక్యం ముగించేటప్పుడు ఆఖరు పదాలు మింగేస్తునారు’

నలభయ్ ఎనిమిదేళ్ల క్రితం నేను రేడియో ఉద్యోగంలో చేరి వార్తావాహిని కార్యక్రమాన్ని వారానికి ఒకసారో, రెండుసార్లో సమర్పిస్తున్నప్పుడు దాన్ని రేడియోలో విని నాతో మా ఆవిడ తరచుగా అంటుండే మాటలు ఇవి.

నా ప్రోగ్రాం వినే అవకాశం నాకు లేకపోవడం వల్ల మా ఆవిడ మాటలే వేదం అనుకుని కొంత బాణీ మార్చుకునే ప్రయత్నం చేశాను. ఈలోగా వారం వారం ‘జీవన స్రవంతి’ మొదలయింది. ‘తినగ తినగ వేము తియ్యనగును’ అన్నట్టు నా గొంతుకు శ్రోతలు అలవాటు పడిపోవడంతో నా భార్య మాటలు చెవిన పెట్టడం మానేసాను.

ఇప్పుడు టీవీల్లో కొందరి స్వరాలు వింటుంటే ఈ పూర్వపు రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒక్కోసారి అనిపిస్తుంది, వీళ్ళకు మంచీచెడూ చెప్పే భార్యలు లేరా, లేక చెవికి ఎక్కించుకుపోవడం అనే నా చెడ్డ అలవాటు వీరికీ ఉందా అని.



13-02-2023

 

9, ఫిబ్రవరి 2023, గురువారం

“నీ ధ్యాసలో నేను, నా శ్వాసలో నీవు”

 

ఈ రోజల్లా జ్ఞాపకాలే భోజనం

జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే.”

ఈ రోజు (9th Feb) మా ఆవిడ నిర్మల పుట్టిన రోజు. ఈ రోజును మరచిపోకపోవడమే ఆమెకు నేనిచ్చే బర్త్ డే గిఫ్ట్ అని అనుకుంటాను.

చూసావా నువ్వు గుర్తు చేయకుండానే నేనెలా గుర్తుంచుకున్నానో’ అని చెప్పాలని వుంది. కానీ వినడానికి ఆవిడ లేదు.

పెళ్ళయిన కొత్తల్లో నాకు దేవుడు అంటే భయం, భక్తీ అంతా ఇంతా కాదు. ఆమెకు పూజా పునస్కారాలు అంతగా లేవు. కానీ కొన్నేళ్ళ తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. ఆమె వుంటే ఇక నాకు దేముడితో పనేమిటి అనే భరోసా నాలో పెరిగితే, ఇల్లూ వాకిలీ పట్టని నాలాంటి మొగుడు దొరికాక, దేవుడి అవసరం ఆమెకు బాగా పెరిగింది.

2019 ఆగస్టు ఏడోతేదీ. ఆరోజు నా పుట్టిన రోజు. పొద్దున్నే టీవీ ఛానల్ డిబేట్ కి వెళ్లి వచ్చాను. తాను తయారుగా వుంది. జూబిలీ హిల్స్ లోని టీటీడీ బాలాజీ దేవాలయానికి వెడదాం అన్నది. నేనూ అంతవరకూ ఆ గుడి చూడలేదు. సరే పదమని బయలుదేరి వెళ్లాం. కొండ మీద గుడి. మంచి దర్శనం అయింది. అర్చన చేయించి, పులిహోర ప్రసాదం తీసుకుని తిరిగి కిందికి వస్తుంటే ఓ పూజారి గారు నన్ను గుర్తు పట్టి పక్కనే ఉన్న మరో గుడి, వినాయకుడి గుడికి తీసుకు వెళ్ళారు. ఈ గుడికీ, ఆ గుడికీ నడుమ ఓ ప్రహరీ గోడ వుండడం వల్ల కాస్త చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. పూజారి గారు ఏదో చెబుతున్నారు, ఒకరిది వైఖానస సాంప్రదాయం, మరొకరిది శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనుకుంటా. ఒకదానికి మరొకటి చుక్కెదురుట. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి వైఖానసులు తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారుట. ఇవన్నీ .నాకు అర్ధం కాని విషయాలే కాదు, అవసరం లేని విషయాలు కూడా. ఎప్పుడైనా గుడికి వెడితే దేముడికి దండం పెట్టి బయటకు రావడమే తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోను.

గుడి మహా ద్వారం దగ్గర ఫోటో తీసుకుందామని అనిపించింది. సెల్ఫీ తీయడం రాదు, తీసేవాడు కనిపించలేదు. కనపడిన వాడిని అడగడానికి మొహమాటం. లేకపోతే ఆ ఫోటో మా జీవితంలో ఆఖరిసారి కలిసి దిగిన ఒక అపూర్వమైన జ్ఞాపకంగా మిగిలిపోయేది.

ఇంటికి వచ్చేముందు జూబిలీ హిల్స్ లోనే ఉంటున్న మా రెండో అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాము, మా కుటుంబానికి పెద్దలు అయిన రామచంద్రరావు గారు, విమల వదినల ఆశీస్సులు తీసుకుందామని. భోజనం చేసిన తర్వాత ఏదో సినిమాకి వెళ్ళిన గుర్తు. ఆ తర్వాత పదంటే పది రోజులకే మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి మా ఆవిడ మరణించడంతో ఆ జ్ఞాపకాలన్నీ అలికినట్టు గజిబిజిగా అయిపోయాయి.

ఈరోజు నేను ఒక్కడినే వెళ్లి దేవుడి గుడిలో కాసేపు కూర్చుని వచ్చాను. శరీరాన్ని ఏదో కట్టడి చేసి భగవత్ సన్నిధానంలో కూర్చోవడమయితే కూర్చున్నా. కానీ, మనసు నా స్వాధీనంలో వుండదు కదా!

చెత్త ఆలోచనలు చుట్టుముడుతూనే వుంటాయి.

మా ఆవిడ చనిపోయి అప్పుడే నాలుగేళ్లా ! అయినా ఇంకా ప్రాణాలతోనే వున్నాను అంటే నా గుండె గట్టిది అయినా అయివుండాలి. లేదా ఆమె మీద నా ప్రేమ వట్టిది అయినా అయివుండాలి”

ఎంతయినా మగవాడిని కదా! రెండూ నిజమే అయివుండాలి.

(09-02-2023)

కింది ఫోటో:

పెళ్ళికాకముందు, ప్రేమలో పడిన కొత్తల్లో మేమిద్దరం (1968)



 

ఏమండీ నేను గుడికి వెళ్లి రానా!’

(కూడా రావడానికి మీకేమైనా  వీలవుతుందా అనేది అందులో అంతరార్ధం)

మా ఇంటికీ, హనుమంతుడి గుడికి మధ్య ప్రహరీ గోడే అడ్డు.  వెళ్ళిరావడం పది నిమిషాల పని.

‘నువ్వు వెళ్ళు. టీవీ వాళ్ళ కారు కూడా వచ్చింది, ఆగమని చెప్పడం బాగుండదు’  అనేవాడిని, ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ. 

కారులో వెడుతుంటే గుర్తుకు వచ్చేది, ఈరోజు మా ఆవిడ పుట్టినరోజు అని. 

గుడికి రమ్మంది ఇందుకా  అని  నా మట్టి బుర్రకు అప్పుడు అర్ధం అయ్యేది. కానీ ఏం లాభం?

ఇప్పుడు బోలెడు  తీరిక. టీవీ చర్చల్ని నాకు నేనుగానే వదులుకున్నాను. 

కానీ, ఇప్పుడు  ఎన్ని గుళ్ళు తిరిగితే, మనసులో పేరుకుపోయిన ఈ క్షోభ సమసిపోవాలి.

దేవుడ్ని నమ్ముకుంది కనుకే, తను ఇబ్బంది పడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా హాయిగా మాట్లాడుతూ మాట్లాడుతూ  దాటిపోయింది.

ముందు ముందు ఎన్ని ఇబ్బందులు పడాలో, ఎంతమందిని ఇబ్బంది పెట్టాలో! ఆ దేవుడు ఏమని నొసట  రాసిపెట్టాడో ఎవరికి తెలుసు.

తెలిసిందల్లా, ఈరోజు ఫిబ్రవరి తొమ్మిది, మా ఆవిడ నిర్మల పుట్టిన రోజు.

ఇప్పుడు అన్నీ బాగానే జ్ఞాపకం ఉంటున్నాయి, అదేమిటో మరి.



(09-02-2023)

8, ఫిబ్రవరి 2023, బుధవారం

వార్తల ధృవీకరణ అనేది విశ్వసనీయతకు గీటురాయి – భండారు శ్రీనివాసరావు


వార్త ఒక్కటే. ఒక్కో టీవీలో ఒక్కోరకం స్క్రోలింగ్.

ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. వార్త ఇచ్చేముందు నిర్ధారణ చేసుకోవడం అనేది ప్రాధమిక సూత్రం. అలాటి అవకాశాలు ఈనాటి పాత్రికేయులకు లేవనుకోవాలా?
చాలా ఏళ్ళ క్రితం సంగతి. ఏదో కేసు విషయంలో హైకోర్టు జడ్జి పలానా తీర్పు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ భోగట్టా. ఇలాటి అంశాలను నిర్ధారించుకోకుండా రేడియో వార్తల్లో చెప్పే వీలు లేదు. సాయంత్రం వార్తల ప్రసార సమయం దగ్గర పడుతోంది. తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడన్నీ ల్యాండ్ లైన్లు. ఫోన్ చేస్తే, జడ్జి గారు బంగ్లా లాన్ లో కూర్చుని టీ తాగుతున్నారని సమాచారం. ఫోను తీసుకుని వెళ్లి ఇవ్వడం కుదురుతుందా అని అనుమానంగానే అడిగాను. ఏ కళన ఉన్నాడో కాని బంట్రోతు ఫోను జడ్జి గారికి ఇచ్చాడు. ఫోన్లో మాటలు వినపడుతున్నాయి. ఎవరది అని జడ్జి గారు అడుగుతున్నారు. రేడియో నుంచి అనగానే లైన్లోకి వచ్చారు. నేను తీర్పు విషయం అడగగానే ఆయన కొంత అసహనానికి గురయ్యారు. అది సహజం కూడా. ‘ఒక న్యాయమూర్తిని ఇలా డిస్టర్బు చేయడం నేరమని తెలుసా’ అంటున్నారు. నేనన్నాను. ‘తెలియదు. కానీ ఇటువంటి వార్తను నిర్ధారించుకోకుండా ప్రసారం చేయడం మాత్రం నేరం’. ఈ జవాబుతో ఆయన మెత్తపడి నేను కోరిన వివరణ ఇచ్చారు. అది వార్తా సంస్థ ఇచ్చిన సమాచారానికి అనుగుణంగానే వుంది. అయినా కొన్ని సంచలన నిర్ణయాలను ప్రసారం చేసేముందు నిజాన్ని నిర్దారించుకోవడం నా విధి. అది నేను పాటించాను. తప్పిస్తే ఆ వార్తాసంస్థ నిబద్ధతను అనుమానించడానికో, మరో దానికో మాత్రం కాదు.
ఇలా ఉండేవి ఆ రోజులు. నిజంగా ఆ రోజులే వేరు.
రేడియోలో మేమే నయం. పొరబాటు జరిగినట్టు గుర్తించగానే వెంటనే 'క్షమించాలి' అంటాము.
ఇప్పుడు ట్వీట్ చేయడం, ఎవరైనా తప్పు పడితే సింపుల్ గా దాన్ని తొలగించి చేతులు దులుపుకోవడం, ఇదీ వరస!

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

శివైక్యం చెందిన కాశీనాధుని విశ్వనాధ్

1979వ సంవత్సరం లో ఒక రోజు.

మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్ వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు) సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, నాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.


ఆశ్చర్యంగా రెండో వారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.

కొన్ని రోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయనగారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.

ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!


కట్ చేస్తే.....

 మళ్ళీ 2017లో...

‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకా  రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ గారు మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.


శంకరాభరణం గురించి కూడా చెప్పారు.

“ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మ ధన్యం అవడం అంటే ఇదే కాబోలు”


చాలామంది చాలా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు.



సీన్  కట్ చేసి  కొంత వెనక్కి వెడితే....

1987- 92 మధ్య రేడియో మాస్కోలో పనిచేసిన కాలం నాటి జ్ఞాపకం. ఊలిచ్చవావిలోవాలోని మాస్కో రేడియో భవనంలో నివాసం వుండేవాళ్ళం. మా ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.

సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది. టిక్కెట్స్ కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా, అది మన శంకరాభరణం సినిమా. 


పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమాలో నటించిన నటీ నటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల, సోమయాజులు గారే కాకుండా, ఆ సినిమాలో నటించిన తదితర నటీనటులు అచ్చు రష్యన్ భాషలో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది. 

సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను. ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు


(Published in Andhraprabha on 05-02-2023, SUNDAY)