మా కుటుంబంలో ఇద్దరు ప్రసిద్దులయిన స్త్రీ మూర్తులు వున్నారు. ఇద్దరి పేర్లు ఒకటే అచ్చమాంబ. ఒకరు భండారు అచ్చమాంబ. రెండవవారు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ. మొదటి ఆవిడ రెండో అచ్చమాంబకు స్వయానా మేనత్త.
10, డిసెంబర్ 2022, శనివారం
ఇద్దరు అచ్చమాంబలు - భండారు శ్రీనివాసరావు
విని వూరుకున్నంత సుఖం లేదు - భండారు శ్రీనివాసరావు
4, డిసెంబర్ 2022, ఆదివారం
శనివారం రాత్రి వాట్సప్ రాలేదు
ప్రతి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడూ మూడున్నర ప్రాంతంలో వాట్సప్ మెసేజ్ చప్పుడు చిన్నగా వినపడేది. నాకు తెలుసు అది ఖమ్మం నుంచి దుర్గా ప్రసాద్ పంపింది అని.

3, డిసెంబర్ 2022, శనివారం
ఆఖరి ప్రయాణానికి అంతా సిద్ధం.
పుట్టినప్పుడే టిక్కెట్టు కొన్నాను, ఏం లాభం అంత ముందుగానే కొన్నా, ఆర్ ఏ సీ పొమ్మన్నారు. రైలు బయలు దేరడానికి కొద్ది ముందుగా వచ్చి ఎవరైనా కేన్సిల్ చేసుకుంటే ఆ బర్త్ ఖాయం చేస్తారుట. చాలా కాలం వెయిట్ చేసి ఇక లాభం లేదనుకుని ప్రతి రోజూ వెళ్లి నా అదృష్టం పరీక్షించుకుంటున్నాను. ఏం లాభం. ఎక్కడెక్కడి వాళ్ళో వస్తున్నారు. నాకంటే ముందే రైలు ఎక్కుతున్నారు. ఎలా అంటే అదేదో ఈ క్యూ అంటారు. అదేదో తెలియకే ఇన్నాళ్ళు ఇలా ప్లాట్ ఫారం మీదే గడ్డాలు పెంచుకుంటూ వేచి వున్నాను. వెంట తీసుకువెళ్ళే లగేజ్ లేదు, అదో అదృష్టం. నేనొక్కడినే కాదు. ఎక్కడ చూసినా అదే జనం. వారిలో కొందరికి ఎలాగైనా రైలు ఎక్కాలని వుంది. కొందరికి ఈ రైలు తప్పిపోతే బాగుండు అనిపిస్తోంది.
కానీ రైలు రావడం, బెర్త్ కన్ఫర్మ్ కావడం ఎవరి చేతిలో లేదుగా!
(ఈ
రాతలు ఇప్పుడు పిచ్చిగా అనిపించినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మంచిగా అనిపిస్తాయి,
జీవితం అంటే అదే!, నేనూ అలాగే అనుకున్నాను వయసులో వున్నప్పుడు)
03-12-2022
ఆగిపోయిన దరహాసం – భండారు శ్రీనివాసరావు
ఈరోజు శనివారం ఉదయం ఎప్పటిలాగే ఇంటి ముందు వరండాలో (మామూలుగా అపార్ట్ మెంట్ కల్చర్ లో వరండాకు వీలుండదు, కానీ ఏరికోరి ఆ ఏర్పాటు చేసుకున్నాడు) కుర్చీలో కూర్చుని ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాడు మా మేనల్లుడు కౌటూరి దుర్గా ప్రసాద్. అలా మాట్లాడుతూనే ఓ పక్కకు ఒరిగిపోయాడు. దగ్గరలో ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు కానీ ఫలితం దక్కలేదు. ఏకాదశి పుణ్య తిధినాడు అనాయాసంగా కన్ను మూశాడు నా మేనల్లుడు, ఆప్త మిత్రుడు పెద్దబాబు. పెద్ద బాబు ఇక లేడు అనే వార్తతో ఇంటిల్లిపాదీ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.
నాకంటే వయసులో చాలా చిన్న. కానీ ఆ చిన్నవయసులోనే
ఒక మనిషి సాధారణ జీవితంలో ఏమి సాధించవచ్చో
అన్నీ సాధించే ప్రయత్నం చేశాడు.
డిగ్రీ పాసవుతూనే ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం, ఏడాది
తిరగకుండానే ఖమ్మం నాగార్జున గ్రామీణ బ్యాంకులో ఆఫీసరు కొలువు, అది
వదిలేసి ప్లీడరు ప్రాక్టీసు, ఆ పిదప రాజకీయ రంగ ప్రవేశం, జలగం వెంగళరావుకు
అత్యంత ఆత్మీయుడుగా మారి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరో అవతారం,
ఢిల్లీ దాకా వెళ్లి నానా ప్రయాస పడినా అసాధ్యం అనుకునే కాంగ్రెస్ టిక్కెట్టు, అదీ
ఎమ్మెల్యే టిక్కెట్టు ఇంటికే వచ్చి వొళ్ళో పడడం, రాజకీయం రంగూ రుచీ వాసనా తెలియని
వయసులో అసెంబ్లీకి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోవడం అలా అన్నీ పాతిక ముప్పయి వయసు లోపలే
జరిగిపోయాయి.
ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల
ప్రచారానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల కారణంగా ఆవిడను
ఘనంగా కాకపోతే పోనీండి, ఓ మోస్తరుగా
రిసీవ్ చేసుకునే నాయకులు కూడా లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు
అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వర్ లింగం ఆమె బ్రేక్ ఫాస్ట్ కోసం
దగ్గర్లో ఓ హోటల్ నుంచి ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు
ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక ఇందిరాగాంధి చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి
దుర్గాప్రసాద్ ప్రత్యక్ష సాక్షి. ఆవిడ
టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి
సత్యనారాయణ రావు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావు తండ్రి) వున్నారు.
ఆరోజుల్లో శ్రీమతి గాంధి
రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ
ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు
ఆమెతో విభేదించి పాత కాంగ్రెసు (కాంగ్రెస్ – ఓ) లో కొనసాగుతున్నారు. ఇక
ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?
ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి ప్రభ్రుతులు శ్రీమతి గాంధీని
హిల్ బంగ్లా లో దింపి వసతి సరిపోకనో యేమో మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు.
అంచేత ఆవిడ బ్రేక్ ఫాస్ట్ బాధ్యత చోటా మోటా స్థానిక నాయకుల మీద పడింది.
రాజకీయాల్లో ఆటుపోట్లన్నీ తట్టుకుని నిబ్బరంగా
నిలబడ్డాడు. అందులో పైకి రాలేకపోయినా మొత్తం కుటుంబానికి మంచీచెడూ కనుక్కునే పెద్ద
దిక్కుగా మారాడు.
తనపై తనకు అంతులేని ఆత్మ విశ్వాసం, దాన్ని
వ్యక్తీకరిస్తున్నట్టు ఎన్నడూ చెరగని దరహాసం. పెద్దబాబును చూస్తుంటే ఒక్కోసారి
ఆశ్చర్యం వేసేది,
ఒక్కోసారి భయం వేసేది. చాలాసార్లు ధైర్యం
కలిగేది.
ఎవరు ఏ సమస్యలో వున్నా సరే, అదో
సమస్యా అని తేలిగ్గా అంటూ మనసుల్ని తేలిపరిచేవాడు. తనకు చేతనైన సాయం అడగకుండానే
చేసేవాడు. తన సమస్యలను ఎవరి వద్దా ప్రస్తావించేవాడు కాదు.
1992 లో వివాహ
రజతోత్సవం నాడు, ఖమ్మం నుంచి హైదరాబాదుకు ఓ గజమాలతో వచ్చి, దండలు
లేని పెళ్లి చేసుకున్నానని అదే పనిగా గొప్పలు చెబుతుంటావు కదా! ఈరోజు మీ పెళ్లి
నేను దగ్గర వుండి జరిపిస్తాను” అన్న పెద్దబాబును మరచిపోవడం సాధ్యం అయ్యే పనికాదు, వాడి
మాటల్ని పదేపదే గుర్తు చేసుకోవడం తప్ప.
“అనాయాసేన మరణం, వినా ధైన్యేన జీవనం” ఈ సూక్తికి
పెద్దబాబే పెద్ద ఉదాహరణ.
(03-12-2022)
27, నవంబర్ 2022, ఆదివారం
బుధజన దర్శనం
నిన్న శనివారం అంతా బంధుజన, బుధజన దర్సనాలతో గడిచిపోయింది.
జ్వాలాతో
కలిసి మా కుటుంబపు 108 (పిలిస్తే
పలకడమే కాదు, వచ్చే
పిల్లల డాక్టరు, మేనల్లుడు) డాక్టర్ ఏవీ మనోహర్ రావును అశోక్ నగర్ లోని వాళ్ల
ఇంటికి వెళ్లి కలుసుకున్నాము. పిచ్చాపాటి
అనంతరం అక్కడే భోజనం చేసి, గాంధీ
నగర్ లో ఉంటున్న డాక్టర్ మాడభూషి శ్రీధర్
ఇంటికి ఫోన్ చేసి వెళ్ళాము. మా కోసం
వరండాలో ఎదురుచూస్తూ వున్న శ్రీధర్ ని చూడగానే ప్రాణం లేచొచ్చింది. నన్నూ, జ్వాలాను, జ్వాలా శ్రీమతి విజయలక్ష్మిని
చూడగానే శ్రీధర్ మొహం వెలిగిపోయింది. శ్రీధర్
శ్రీమతి కల్యాణి గారు చాలా ఆపేక్షగా పలకరించారు. శ్రీధర్, కల్యాణి కబుర్లు చెబుతుంటే అలా
వింటూ పోయాము. ఇన్నాళ్లుగా పెదాలు దాటకుండా, కడుపులో దాచుకున్న మాటలన్నీ శ్రీధర్
నోట వెంట ధారాపాతంగా వెలువడుతుంటే చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా తన తల్లిగారు
గురించి చెబుతుంటే కంటి వెంట నీళ్ళు తిరిగాయి.
కొడుకుని గుర్తు పట్టలేని అమ్మ, అమ్మ ఏమంటున్నదో అర్ధం కాని కొడుకు, వీళ్ళ పరిస్థితి ఏమిటో అర్ధం కాని
కోడలు. నిజంగా సినిమా కధను తలదన్నేలా జరిగిపోయాయి వారి జీవితాల్లో సంఘటనలు.
కల్యాణి గారు తమ జీవితంలో అత్యంత దురదృష్టపు ఘడియలను గుర్తు తెచ్చుకుని చెప్పారు.
మొత్తం మీద శ్రీధర్ ఆధ్యాత్మిక భావాలు, కల్యాణి గారి మనో ధైర్యం శ్రీధర్ ని మళ్ళీ మామూలు మనిషిని చేసాయి.
(ఇదంతా
ఏమిటి అయోమయంగా వుంది అనుకునే వాళ్ళు ఈమధ్య శ్రీధర్ రాసిన పెదవి దాటని మాటలు
వ్యాసం చదవండి)
దంపతులిద్దరూ
నాకంటే వయసులో చిన్నవాళ్లు. లేకుంటే
కల్యాణి గారి పాదాలకు నమస్కారం చేసేవాడిని.
అదే
రోజు సాయంత్రం ఒక మిత్రుని కుమారుడి పెళ్లి రిసెప్షన్. ప్రముఖ సీ పీ ఎం నాయకుడు
శ్రీ సీతారాం ఏచూరి కలిశారు.
(26-11-2022)
తెగుతున్న తీగెలు