ప్రతి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడూ మూడున్నర ప్రాంతంలో వాట్సప్ మెసేజ్ చప్పుడు చిన్నగా వినపడేది. నాకు తెలుసు అది ఖమ్మం నుంచి దుర్గా ప్రసాద్ పంపింది అని.
గత రెండు మూడు ఏళ్లుగా ప్రతి ఆదివారం ఆంధ్ర ప్రభలో నా ఆర్టికల్ వస్తోంది. E Paper చూడడం వస్తుంది కానీ దాన్ని క్రాప్ చేయడం తెలియదు. ఆ పని దుర్గా ప్రసాద్ చేసేవాడు. చాలా తేలిక ఈసారి హైదారాబాద్ వచ్చినప్పుడు నేర్పుతాను అని కిందటి వారమే చెప్పాడు .
రాత్రి మెసేజ్ చప్పుడు రాలేదు. కానీ మెలకువ వచ్చింది. ఇక ముందు అది రాదు అని అర్థం అయి మనసు ఆర్ధ్రం అయింది.
బై పెద్దబాబు బై!
మామయ్య.
రాజకీయ భీష్ముడు రోశయ్య – భండారు శ్రీనివాసరావు
(డిసెంబరు నాలుగు రోశయ్య ప్రధమ వర్ధంతి)
Published in Andhra Prabha today, Sunday.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కానీ, ఆ పిమ్మట తమిళనాడు గవర్నర్ పదవి కానీ కొణిజేటి రోశయ్యకు కోరుకుంటే వచ్చినవి కావు. ఈ పదవులను కోరుకునేవారు, కోరుకున్నవారు ఎంతోమంది ఉన్నప్పటికీ, అవే వెతుక్కుంటూ వచ్చి ఆయన్ని వరించాయి అంటే సబబుగా ఉంటుందేమో.
కీర్తిశేషులు సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ఆచార్య రంగా వంటి ఉద్దండ రాజకీయ నేతలతో సాహచర్యం చేసి, రాజశేఖరరెడ్డి వంటి యువతరం నాయకులతో కలసి మెలిసి పని చేసి, అనేక సంవత్సరాలపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు సారధ్యం వహించి, సర్వం వ్యాపారపరమయిన ప్రస్తుత రాజకీయరంగంలో ఇక ఇమడ లేనని తెలుసుకుని, ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే వయసే కాదు, 'ఆ శక్తులూ, ఆ యుక్తులూ' తనకు లేవని అర్ధం చేసుకుని తనకు తానుగా తప్పుకున్న తత్వం రోశయ్య గారిది. అయినా ఆయన సుదీర్ఘ అనుభవం, అవినీతి మరకలు అంటని రాజకీయ జీవితం అక్కరకు వచ్చి మళ్ళీ ఆయనను రాజకీయ ప్రధాన యవనికపై నిలబెట్టాయి.
ఒక పెనువిషాదం రాష్ట్రాన్ని కమ్ముకున్న దురదృష్ట సమయంలో, మేరు పర్వతం లాంటి ఒక నాయకుడిని రాష్ట్ర కాంగ్రెస్ కోల్పోయిన విపత్కర తరుణంలో ఏ అండా లేని రోశయ్య, ఎవరూ ఊహించని రీతిలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు.
ఈ పదవి శాశ్వతం కాదని, అధిష్టానం ఆదేశిస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా తప్పుకుంటాననీ అంటూ, కావమ్మ మొగుడు సామెతను ఉటంకిస్తూ ఆయనే స్వయంగా అనేక పర్యాయాలు బాహాటంగా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే నీడలా వెంటపడి వచ్చే 'హంగూ ఆర్భాటాలను' సయితం ఆయన చాలా రోజులు దూరం పెట్టారు. అంతేకాదు, లోగడ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాటిస్తూ వచ్చిన సంప్రదాయానికి విరుద్ధంగా, పదవిని స్వీకరించిన వెంటనే ఢిల్లీ విమానం ఎక్కని 'అరుదయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి' అనే రికార్డ్ కూడా ఆయన ఖాతాలో చేరింది. ఇంకా చెప్పాలంటే, కొరకరాని కొయ్య అని పేరుగాంచిన 'పోలీసు బాసు'ని రాత్రికి రాత్రే మార్చేసారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, అంతకుముందు కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులతోను అతి సన్నిహితంగా పనిచేసిన అధికారిని కేవలం సమర్ధత పాతిపదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించగలిగారు. చిన్న పదవిని భర్తీ చేయాల్సి వచ్చిన ఢిల్లీ పెద్దలను సంప్రదించే సాంప్రదాయానికి స్వస్తి చెప్పిన ఘనత కూడా రోశయ్యదే. అనేక జిల్లాలలో కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేశారు. రాజకీయ పార్టీలు అన్నింటికీ 'ఓట్ల వనరు'గా ఉంటూ వస్తున్న తెల్ల రేషన్ కార్డుల ప్రక్షాళనకు సయితం నడుం కట్టారు. జనాకర్షక పధకాలలోని ఆర్దికపరమయిన మంచి చెడుల పట్ల దృష్టి సారించారు.
స్వల్పకాలంలోనే ఇన్ని చేసినా ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి’, 'అసమర్ధ ముఖ్యమంత్రి' అన్న ముద్ర నుంచి తప్పించుకోలేకపోయారు. కాంగ్రెస్ రాజకీయాలు అవపోసన పట్టిన రోశయ్యకు ఈ ప్రచారానికి వెనుక వున్న రాజకీయ కారణాలు తెలియవని కాదు. కానీ గుంభనంగా వుండిపోయారు.
ప్రయత్నం చేయని పదవి అయాచితంగా లభించినా అందులో ఆయన ప్రశాంతంగా గడిపిన సమయం బహు తక్కువ. ఒక దానివెంట మరొకటి చొప్పున సమస్యలు వరదల్లా వెల్లువెత్తాయి.
ఆంద్రప్రదేశ్ వంటి అతి ముఖ్యమయిన రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా వుండడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందరి కళ్ళు నిశితంగా గమనిస్తుంటాయి. రాజకీయ లబ్దినీ, రాజకీయుల ద్వారా లబ్దినీ పొందాలని చూసే శక్తుల 'శక్తియుక్తులు' అన్నీ ముఖ్యమంత్రి పీఠం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. ఈ రకమయిన కుయుక్తి రాజకీయాలు నడిపే శక్తుల స్తాయినీ, స్తోమతనీ, సామర్ధ్యాన్నీ తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.
రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు, తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఆయన్ని 'రోజులు,వారాల ముఖ్యమంత్రి' గానే లెక్కవేశారు. తాత్కాలిక ప్రాతిపదికపైన శాశ్వతంగా కొనసాగే వీలుచాళ్ళు కానరావడంతో సొంత పార్టీలోని ప్రత్యర్దుల నుంచి ముప్పేట దాడులు మొదలయ్యాయి. బయటి పోరుకు ఇంటిపోరు తోడయింది.
ఫలితం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పాత బాటలోనే ముఖ్యమంత్రి మార్పుకు సిద్ధపడింది. దరిమిలా రోశయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాను అని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు.
ముళ్ళకిరీటం వంటి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తరువాత రోశయ్య చాలాకాలం మాజీ ముఖ్యమంత్రిగా వుండి పోయారు. పదవి లేకుండా క్షణం గడవని షరా మామూలు రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా ఆయన తన పార్టీకి వీర విధేయుడిగా ఎంతో ఓపిక ప్రదర్శించారు. ఆ నిరీక్షణ ఫలించింది. తమిళనాడు వంటి కీలక రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు. జయలలిత వంటి ప్రాంతీయ పార్టీ అధినేత్రి ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రానికి గవర్నర్ గా నెగ్గుకు రావడంలో కూడా రోశయ్యకు వున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం అక్కరకు వచ్చింది.
ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ, భగవంతుడు ఇచ్చిన అసాధారణ ధారణ శక్తి, ప్రసంగ పాటవాలను సమయస్పూర్తితో వాడుకుంటూ శిఖరాగ్రాలకు చేరుకున్న కొణిజేటి రోశయ్య ప్రశాంతంగా శేష జీవితాన్ని గడుపుతూ నిరుడు డిసెంబరు నాలుగో తేదీన తన 88వ ఏట కన్నుమూశారు.
ఆయన మరణంతో నిబద్ధత కలిగిన రాజకీయాల శకం ముగిసింది.
(04-12-2022)
EPAPER.PRABHANEWS.COM
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి