27, మార్చి 2022, ఆదివారం

ప్రజల మనిషి బండారు దత్తాత్రేయ – భండారు శ్రీనివాసరావు

 “మనిద్దరం చుట్టాలం అనుకుంటున్నారు చాలామంది” అన్నారు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ.

“కాకపోతే ఏమైంది, మీరు నాకు అంతకంటే ఎక్కువే” అన్నాను నేను.

పదేళ్లు అయిందో, పదిహేను ఏళ్ళు అయిందో  గుర్తు లేదు, దత్తాత్రేయ గారిని నేను కలిసి.

ఈరోజు ఆదివారం సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో జరిగిన  ఒక కార్యక్రమం అనంతరం వేదిక దిగివస్తున్నప్పుడు మా నడుమ నడిచిన ముచ్చట ఇది.

నలభయ్ ఏళ్ళ పై చిలుకు సాగిన పాత్రికేయ జీవితంలో ప్రజల మనిషి అనదగ్గ రాజకీయ నాయకులు ఇద్దరు కనబడ్డారు. ఒకరు మాజీ  ముఖ్యమంత్రి శ్రీ. టి. అంజయ్య, రెండోవారు శ్రీ దత్తాత్రేయ. ప్రజల నడుమ ఉంటేనే ఆక్సిజన్ అందుతుంది అనేట్టు జనంతో మమేకమైన రాజకీయ జీవితాలు వీరిద్దరివి. మనుషులను మనుషులుగా గుర్తిస్తారు కనుకనే సామాన్య జనంలో వీరిరువురికీ అమితమైన ఆదరణ. ఈ కారణం చేతనే ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా నన్ను గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించారు. వయసులో నాకంటే ఆయన ఏడాది చిన్న. ‘గట్టిగానే వున్నావు సుమా ‘ అన్నారు నా చేయి తన చేతిలోకి తీసుకుని చిన్నగా నొక్కుతూ.

ఆరోగ్యంగా వున్నాను అని దత్తాత్రేయ గారెకి అనిపించింది అంటే అది మాత్రం దేవుడి దయే అనుకున్నాను మనసులో.

నాదేముంది, దత్తాత్రేయ గారి లాంటి ప్రజాసేవకులు నాలుగు కాలాల పాటు చల్లగా వుంటే సమాజానికి  మంచి జరుగుతుందని కూడా అనుకున్నాను.



27-03-2022

మిత్రుల మనసుల్లో బతికున్న విద్యారణ్య – భండారు శ్రీనివాసరావు

 మిత్రుడు, పాత్రికేయుడు ఇటీవలే ఆకస్మికంగా మరణించిన విద్యారణ్య సంస్మరణ సభ ఈరోజు ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఎంతో బలమైన ఆత్మీయ బంధం లేనిదే అంతమంది అటువంటి సభలకు రారు. చిన్న వయసులోనే చనిపోయాడు అనే బాధ మినహాయిస్తే తన జీవితకాలంలో సంపాదించుకున్న మంచి పేరే అంతమందిని అక్కడకు చేర్చింది. ఒక్క పాత్రికేయ రంగం నుంచే కాదు అనేక రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులు హాజరై విద్యారణ్య దివ్య స్మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ విషయంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం తీసుకున్న చొరవ హర్షణీయం.

అక్కడ ప్రసంగించిన వారి పలుకులు వింటుంటే నాకు తెలిసిన విద్యారణ్యలో నాకు తెలియని ఇన్ని కోణాలు దాగున్నాయా అనిపించింది. హర్యానా గవర్నర్  శ్రీ బండారు దత్తాత్రేయ తదితరులు విద్యారణ్య గురించి సొంత అనుభవాలు చెబుతుంటే విద్యారణ్య ఎవరన్నది నాకు బోధపడింది. 

విద్యారణ్యతో మూడు దశాబ్దాలకు పైగా పరిచయం. ముందు అంధ్రపత్రిక విలేకరిగా ఉన్నప్పటి నుంచి. మా మధ్య  వృత్తిలో పోటీ లేదు కానీ, చేసే పనిలో కొంత  సారూప్యత వుంది. నేను సాయంత్రం ఆరుంబావు  వార్తల సమయానికి అప్పటికి పోగుచేసిన వార్తలు అందివ్వాలి. విద్యారణ్య పరిస్థితి ఉడ్డుగుడుచుకున్నట్టు వుండేది.   డాక్ (సాయంత్రం) ఎడిషన్ కల్లా ఏదైనా బ్యానర్ వార్త పట్టుకోవాలి. ఆ తాపత్రయంలో అతడు ఉండేవాడు.

రేడియోలో ఏదైనా వార్త మిస్ కాకుండా వుండాలంటే విద్యారణ్య లాంటి మితృలు వుండాలి. ఎప్పుడు ఏ వార్త వివరాలు అడిగినా విసుక్కోకుండా వివరంగా చెప్పేవాడు.  రీజినల్ న్యూస్ యూనిట్ లో విద్యారణ్య వేలు దూర్చని విభాగం లేదు. రేడియో సిబ్బంది  బయట గేటు దగ్గర సెంట్రీ నుంచి అందరూ విద్యారణ్యని చప్పున పోల్చుకునేవారు. అక్కడ పనిచేసే నాకు అలాంటి భాగ్యం లేదు.  చాలాసార్లు మా గేటు దగ్గర కాపలా మనిషి నన్ను ఆపి,  లోపల ఎవరితో మీకు పని, వివరాలు రాయండని  గౌరవించిన అనుభవాలు  కోకొల్లలు. ఎందుకంటే నేను ఆఫీసుకు వెళ్ళే సందర్భాలు చాలా తక్కువ. బయట తిరగడాలు బాగా  ఎక్కువ.

ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం. విద్యారణ్య మా మధ్య లేడు. ఇక ఉండడు.

మరో నిజం ఏమిటంటే విద్యారణ్య ఇక నుంచి మా మనసుల్లోనే ఉంటాడు.  


   

(27-03-2022)

ఆదివారం ఆంధ్రప్రభ – భండారు శ్రీనివాసరావు

 

గత నాలుగయిదు వారాలుగా ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో గతకాలపు అసెంబ్లీ ముచ్చట్లు రాస్తూ వుండడంతో ఉదయం పూట అందుకునే ఫోన్ కాల్స్ తో ఓ కొత్త కాలక్షేపం అవుతోంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ ఫోన్ చేసి అభినందించారు. దానితో పాటు ఆయన కూడా కొన్ని సంగతులు పంచుకున్నారు.
ప్రసిద్ధ సినీ కవి శ్రీ వేటూరి సుందర రామ మూర్తి తన పూర్వాశ్రమంలో ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేసే రోజుల్లో రాసిన ఓ వార్త అసెంబ్లీలో సంచలనం కలిగించింది. ఆ విలేకరిపై వెంటనే చర్య తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ వార్తకు నేపధ్యం ఏమిటంటే:
హైదరాబాదు లక్డి కా పూల్ లోని ద్వారక హోటల్ అసెంబ్లీకి దగ్గరలో వుండడం వల్ల, సమావేశాలు జరిగే రోజుల్లో జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, వారి అనుయాయులు అందులో బస చేసేవారు. అప్పుడు కాంగ్రెస్ ఏకపక్ష పాలన. హోటల్లో దిగిన కాంగ్రెస్ సభ్యులు, వారి అనుయాయులు తెల్లటి ఉడుపుల్లో బయలుదేరి వెళ్ళడం వేటూరిగారికి వార్తకు ముడి సరుకుగా అనిపించింది. అనిపించి వార్తకు ఇలా మకుటం పెట్టారు. “అదిగో ద్వారక! ఆలమందలవిగో!” (ద్వారక హోటల్, తెల్లటి దుస్తుల్లో ఎమ్మెల్యేలు)
“మమ్మల్ని ఆలమందలు అంటూ గొడ్డూ గోదాతో పోలుస్తారా! ఎంత ధైర్యం ఠాట్!” అని హడావిడి చేశారు. అయితే అది తాటాకు మంటలా వెంటనే చల్లారి పోయింది, సభలో పెద్దలు కలగచేసుకుని నచ్చచెప్పడంతో.
ఈ వృత్తాంతం చెప్పి అన్నారు బుద్ధప్రసాద్ నిర్వేదంగా.
“అప్పుడు ఆలమందలు అంటేనే సభాగౌరవానికి భంగం కలిగిందని బాధ పడ్డారు. ఇప్పుడు ఓ పార్టీ నాయకుడు అసెంబ్లీని రెడ్ లైట్ ఏరియాతో పోల్చి హేళన చేసినా కిమ్మిన్నాస్తి”
(27-03-2022)

తెలుగు నాటకం – భండారు శ్రీనివాసరావు

 ( మార్చి, 27, ప్రపంచ రంగస్థల దినోత్సవం)


అప్పటికి ఇప్పటికి తెలుగులో పౌరాణిక నాటకం అంటే తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలే. వాస్తవానికి వారు ఈ రెండూ విడివిడిగా రాశారు, పాండవోద్యోగం, పాండవ విజయం అని. ఈ రెండు కలిపి, మరికొన్ని నాటకాలలోని పద్యాలు జోడించి ‘కురుక్షేత్రం’గా ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఎన్ని వేలసార్లో, వేలేమిటి లక్షసార్లు అని కూడా చెప్పొచ్చు ఈ నాటకాన్ని తెలుగునాట నాలుగు చెరగులా వేసి వుంటారు. కొన్ని వేలమందికి ఈ నాటకం ఉపాధి కల్పించింది. పేరు తెచ్చి పెట్టింది.
బలిజేపల్లి వారి ‘హరిశ్చంద్ర’, చిలకమర్తి వారి ‘గయోపాఖ్యానం’ కూడా ప్రసిద్ధి పొందినవే.
తర్వాత వచ్చినవి కాళ్ళకూరి నారాయణ రావు గారి ‘చింతామణి’, తాండ్ర సుబ్రహ్మణ్యం గారి ‘రామాంజనేయ యుద్ధం’. అడపా తడపా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారి ‘బాల నాగమ్మ’. మిగతావన్నీ చెదురుమదురుగా ఆడేవి, ‘పాదుకా పట్టాభిషేకం’ వంటివన్న మాట.
బెజవాడ గాంధీ నగరంలో హనుమంతరాయ గ్రంధాలయం వుంది. పేరుకు గ్రంధాలయంకానీ, అక్కడి రంగస్థలం నాటకాలకు ప్రసిద్ధి. అనేక నాటక సమాజాలకు అది ఆటపట్టు. జేవీడీఎస్ శాస్త్రి 'జంధ్యాల' గా ప్రసిద్ధులు కాకపూర్వం, ఎస్సారార్ కాలేజీ విద్యార్ధిగా వున్నప్పుడు రాసిన నాటకం ' సంధ్యారాగంలో శంఖారావం' ఇక్కడే ప్రదర్శనలు ఇచ్చింది. అదే కాలేజీలో ఆయనతో కలిసి చదువుకున్న నేనూ ఆ రిహార్సల్స్ కు వెళ్ళేవాడిని.
పౌరాణిక నాటకాలకు నిజానికి పెద్ద పెద్ద సెట్టింగులూ అవీ వుండాలి. కానీ, పద్యం రాగం ముఖ్యం కావడంతో హంగులను ఎవరూ పట్టించుకొనేవారు కాదు. గుంటూరు అరండల్ పేటలో గుళ్ళపల్లి ఆదిశేషయ్య అని వొకాయన నాటకానికి కావాల్సిన డ్రెస్సులు, తెరలు సప్లయి చేస్తూవుండేవాడు. అన్ని ప్రాంతాలకి, అన్ని నాటక సమాజాలకి ఈయనే దిక్కు. అలాగే బెజవాడ గవర్నరుపేటలో జైహింద్ లాడ్జ్, జైహింద్ ప్రెస్ ఉండేవి. నాటకాల్లో వేషాలు వేసేవారందరికి ఇదే స్థావరం. ఇక్కడ నుంచే నాటకాలు, నటులను బుక్ చేసుకొనేవారు. పోస్టర్లు, కరపత్రాలు, ఇక్కడే ప్రింట్ చేసేవారు. ‘జైహింద్’ సుబ్బయ్యగారు వీటన్నిటికి కంట్రాక్టర్.
స్టేజి కూడా పెద్ద ప్రాముఖ్యం లేనిదే. కావాల్సిందల్లా మంచి మైకు సెట్టు. మైకు బాగా లేకపోతే జనం గోల చేసేవారు. లైటింగ్ కూడా పట్టించుకునేవారుకాదు. వెనక వైపు ఓ తెరా, ముందు మరో తెరా వుంటే చాలు నాటకం వేయడానికి. ముందు తెరను కప్పీ మీద లాగడానికి వీలుగా కట్టేవారు. చూసిన ఏ నాటకాలలోను అది సరిగా పని చెయ్యగా చూడలేదు. దాంతో నాటకం ట్రూపులో ఒకడు స్టేజి ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకు చేత్తోనే తెరను లాగేవాడు. నాటకం మొదలు పెట్టడానికి కొద్ది నిమిషాల ముందు హార్మొనీ వాయించే ఆయన వచ్చేవాడు. తొక్కుడు హార్మొనీ. పెట్టెలోంచి పీకి లేపి క్లిప్పులు పెడితే వాయించడానికి వీలుగా తయారయ్యేది. ఆయన కూర్చోడానికి ఓ మడత కుర్చీ. ఇక నాటకం ఏదయినా, ఎవరు వేసినా ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. ఇది రాసిన మహాను భావుడెవడో ఎవరికీ తెలియదు. ఎంతో మందిని అడిగినా లాభంలేక పోయింది. ఆ మధ్యన ఓ అష్టావధానం లో కూడా ఈ ప్రశ్నవేసారు. సమాధానం ఏమి వచ్చిందో గుర్తు లేదు. ఎవరికయినా తెలిస్తే తెలిస్తే చెప్పండి. రెండు మూడు నిమిషాల ప్రార్ధన తర్వాత, ‘శ్రీకృష్ణ పరమాత్మకీ జై!’ అంటూ నాటకం ఆడేవాళ్ళ సమాజం పేరు చెప్పుకుని దానికి కూడా జై కొట్టే వారు. ప్రార్ధన సమయానికి కొందరు వేషాలు పూర్తి గా వేసుకుని, మరికొందరు సగం వేషాలతోనో, లేదా లుంగీ పంచెలతోనొ పాడేవారు. ఇంత ముద్ద హారతి కర్పూరం వెలిగించి. పాడడం అవగానే ఓ కొబ్బరికాయ స్టేజి మీద గట్టిగా కొట్టేవారు. అప్పడప్పుడు సగం చిప్ప యెగిరి వెళ్లి జనంలో పడేది. ఈ తెరవెనక భాగోతం అంతా మసగ మసగ్గా బయట ప్రేక్షకులకు కనపడుతూనే వుండేది. బెజవాడ ఏలూరు రోడ్ సెంటర్లో ‘రామకృష్ణ మైక్ సర్వీసు’ అని వుండేది. ఆయన దగ్గర మంచి మైకులు ఉండేవి. వాటిని ష్యూర్ మైకులు అనేవాళ్ళు. బాగా లాగుతాయని చెప్పుకునేవాళ్ళు. అంటే ఎంతో దూరం వరకు వినబడతాయన్న మాట, ఇబ్బంది పెట్టకుండా. కరపత్రాల్లో కూడా వేసుకొనే వారు, పలానా వారిదే మైక్ సెట్ల సప్లయి అని.
బెజవాడలో ఇప్పటి నవరంగ్ థియేటర్ని 1960 – 1970 మధ్య షహెన్ షా మహల్ అనే వారు. యాజమాన్యంలో ఏవో గొడవలవల్ల అప్పట్లో థియేటర్ ని మూసేశారు. దానిని నాటకాలకు వుపయోగించుకునేవారు. అలాగే గాంధీ నగర్ లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం హాలు. అప్పడప్పుడు రామ్మోహన్ గ్రంథాలయం పైన వున్నచిన్న హాలు. నాటకాలన్నీ శనివారం నాడే వేసేవారు. తెల్లవార్లు నడుస్తుంది కనుక మర్నాడు ఆదివారం పడుకోవచ్చని కాబోలు.
(విషయ సేకరణలో సహకరించిన ఆర్వీవీ కృష్ణారావు గారికి కృతజ్ఞతలు)

అలనాటి అసెంబ్లీ ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha today, Sunday, 27-03-2022)

1958 - 59 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అంటే దాదాపు అరవై ఏళ్ళ కిందటి ముచ్చట.
ఒక సభ్యుడు లేచి అన్నారు. ' పన్నులన్నీ తెలంగాణపై రుద్దుతున్నారు' అని.
ఆర్ధిక మంత్రి వెంటనే స్పందించారు, 'గౌరవ సభ్యులు వాడిన 'రుద్దుతున్నారు' అనే పదం బయట పర్వాలేదు. కానీ సభలో 'కర్ణ కఠోరం'గా వుంటుంది'
ఆ సభ్యుడు లేచి 'అలా అన్నందుకు' విచారం వెలిబుచ్చారు.
ఆ ఆర్ధిక మంత్రి పేరు బెజవాడ గోపాల రెడ్డి.
ఆ పదం వాడి, తరువాత విచారం వ్యక్తం చేసిన సభ్యుడు ఎవ్వరో కాదు, తదనంతర కాలంలో యావత్ భారత దేశానికి అయిదేళ్ళ పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన పీ.వీ. నరసింహారావు.
అవీ ఆ రోజులు.
అలనాటి, అంటే ఓ నలభయ్, యాభయ్ ఏళ్ళక్రితం జరిగిన శాసన సభ సమావేశాల్లో, తీవ్రమైన చర్చల నడుమ వాతావరణాన్ని చల్లబరచడానికి కొన్ని చలోక్తులు కూడా వినబడేవి.
తెలుగు పత్రికల్లో ఈ ఛలోక్తులను 'బాక్స్' కట్టి మరీ ప్రచురించేవారు. చదువుకోవడానికి తమాషాగానే కాకుండా ఆహ్లాదకరంగా కూడా ఉండేవవి.
1958 లో కళా వెంకటరావు గారు రెవెన్యూ మంత్రి. రాములు అనే సభ్యుడు (ఇంటి పేరు గుర్తు రావడం లేదు) మంత్రిని తమాషా పట్టించాలని 'మంత్రిగారు మాట్లాడుతున్నది కొండ నాలుకతోనా లేక కొన నాలుకతోనా' అని జోకబోయారు. అంటే మంత్రిగారు చెప్పేవన్నీ పై పై మాటలు, ఒక్కటీ కరెక్టు కాదు అనేది ఆ సభ్యుడి ఉద్దేశ్యం.
కళా వెంకటరావు గారు సామాన్యుడు కాదుకదా! వెంటనే తిప్పికొట్టారు.
'మనిషి అనేవాడు ఎవరయినా నాలుకతోనే మాట్లాడుతాడు. కొండ నాలుకతో ఎవ్వరూ మాట్లాడరు. మరి రాములు గారు కొండ నాలుకతో మాట్లాడుతారేమో నాకు తెలియదు'
ఆ దెబ్బతో రాములుగారు కిమ్మిన్నాస్తి. గమ్మున కూర్చుండిపోయారు.
1976 లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో దాదాపు నలభయ్ యాభయ్ మంది సభ్యులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినంత సేపు ముఖ్యమంత్రి సభలో తన స్థానం నుంచి కదల లేదు. మౌనంగా సీట్లో కూర్చుని సభ్యులు ప్రస్తావించిన వివిధ అంశాలపై నోట్స్ రాసుకుంటూ పోయారు. తరువాత తన సమయం రాగానే లేచి సుమారు గంటన్నరపాటు అన్ని అంశాలను స్పృశిస్తూ సమాధానం చెప్పారు. సభలోని యావన్మందీ వెంగళరావు ప్రసంగాన్ని మెచ్చుకున్నారు.
సరే! ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన డాక్టర్ రాజశేఖర రెడ్డికి సయితం పద్యాలు వచ్చన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు ఏకంగా ఒక పద్యం మొత్తం సభలో చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని, భారతంలో తిక్కన విరచిత పద్యం - 'సారపు ధర్మమున విమల సత్యము ....' అని మొదలెట్టి ఒక పద్యం చదివి వినిపించారు.
"ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు దక్షత కలిగిన భీష్మ, ద్రోణుల వంటి వారు కూడా మౌనంగా వుండిపోయారు. అలా ఉపేక్షిస్తే అది వారికే చేటవుతుంది. కానీ ఏదో ఒకరోజున భగవంతుడే కల్పించుకుని సత్యాన్ని, ధర్మాన్ని నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని కూడా ఆ దేవుడే కాపాడాలి" అని ప్రసంగం ముగించారు రాజశేఖర రెడ్డి.
మరోసారి 2003 ఫిబ్రవరిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో పాల్గొంటూ, దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన గేయభాగాన్ని వై.యస్.ఆర్. చదివి వినిపించారు.
'ఒక్క నిరుపేద ఉన్నంతవరకు, ఒక్క మలినాశ్రువు బిందువు ఒరిగినంతవరకు, ఒక్క శుష్క స్థన్య సన్నిధిని క్షుదార్తి ఏడ్చు పసిబాలిక ఉన్నంతవరకు, నాకు శాంతి కలుగదింక నేస్తం ..... ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు, ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు' అంటూ 'పేదవాడి ఆర్తిని వినే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రిగారు, చేయండి ముఖ్యమంత్రిగారు' అని తనదైన శైలిలో ప్రసంగం ముగించారు.
చంద్రబాబు నాయుడుగారిది మరో తరహా. శాసనసభలో ఆయన చేసే ప్రసంగాలలో పద్యాలు, గేయాలు వుండవు. కానీ ఆర్ధిక అభ్యున్నతి గురించి, సంస్కరణలు గురించి, కొందరు ప్రముఖులు ఆయా సందర్భాలలో చేసిన కొటేషన్లు బాగా చోటుచేసుకుంటాయి. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను చేపట్టిన వివిధ అభివృద్ధి పధకాలు గురించి ప్రతిపక్షనాయకుడిగా చేసే ఉపన్యాసాలలో సయితం వివరించే ప్రయత్నం చేస్తారు. అలాగే, ముఖ్యమంత్రిగా సభలో మాట్లాడేటప్పుడు కూడా ఈ పధకాల వివరాలు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడతారు.
1999 నవంబరు 16 వ తేదీన గవర్నర్ ప్రసంగంపై చర్చకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంలో కొన్ని భాగాలు ఇలా సాగాయి.
"నేను రాష్ట్రం అభివృద్ధిని కోరుకుంటున్నాను. నా పట్ల ప్రజలకున్న అభిమానాన్నే నమ్ముకున్నాను. అందువల్లే ఎన్నికల్లో మీ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజల ఆశీర్వాదం నాకుంటుంది అని మొదటినుంచీ చెబుతున్నాను. అదే ఈనాడు నిజమైంది. కుల్ దీప్ నాయర్ మాట్లాడుతూ, 'నేను ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించడం లేదు, ఆంద్ర ప్రదేశ్ ఓటర్లని అభినందిస్తున్నాను. ఒక విజ్ డమ్ ని వాళ్ళు వ్యక్తం చేసారు. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించారు. కర్నాటక, మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆంద్ర ప్రదేశ్ మాకు ఆదర్శం అంటున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా గట్టిగా చెప్పారు. 'దేనికయినా ఆంద్రప్రదేశ్ కొలమానం' అని. 'అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అనుసరించాలి' అని. ఇంటర్నేషనల్ మీడియా కూడా అదే చెబుతోంది. దేశంలో బెస్ట్ విజన్ వున్న వ్యక్తి ఎవరంటే ఆంద్రప్రదేశ్ సీ.ఎం. అని విద్యార్ధులు కూడా చెప్పే పరిస్తితి వుంది.
'ఈ నడుమ ఒక ఎకానమిస్టు చెప్పాడు. ఆంద్రప్రదేశ్ లో నాయుడు కోరుకుంటున్న విప్లవం ఊహల్లో ఊహించుకునేది కాదు, చేసి చూపించగలిగేది, అని. ఇప్పుడు దేశానికి కావాల్సిన సరయిన నాయకుడు చంద్రబాబే అని కూడా ఆయనే చెప్పారు.
'ఆంద్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాము. స్మార్ట్ స్టేట్ అంటే అర్ధం దక్షతతో కూడిన నైపుణ్యం ఆ స్టేట్ కి దిశానిర్దేశం చేస్తుంది. పరిజ్ఞానం దానికి ఇంధనం మాదిరిగా ఉపయోగపడుతుంది. ఇక విజ్ డమ్ దాన్ని ముందుకు నడిపిస్తుంది. అదీ మా ధ్యేయం.
'మహాత్మా గాంధీ అన్నారు. ఒకరికి ఆదర్శం బోధించాలి అంటే ఆ ఆదర్శాన్ని మనమూ పాటించాలి అని. అప్పుడే ఒకళ్ళకు చెప్పినా వాళ్ళు వినే పరిస్తితి వుంటుంది. మా ప్రభుత్వం దరిద్రాన్ని రూపుమాపడానికి కంకణం కట్టుకుంది'
'ప్రతిపక్ష నాయకులు (వై.యస్.ఆర్.) చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తప్పకుండా సహకరిస్తామని. వారిని మనః స్పూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళు సభలో వన్ తర్డ్ వున్నారు. అందుకే అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని అనుకుంటున్నాను.'
శాసనసభ ఆవరణలోని గ్రంథాలయానికి వెళ్లి చదవాలని ఆసక్తి ఉండాలే కానీ ఇలాంటి విషయాలు కోకొల్లలుగా తెలుస్తాయి.
అసెంబ్లీ లోపలా వెలుపలా తమ ప్రసంగాలతో జనాలను ఆకట్టుకున్న నాయకులకు కూడా తెలుగు రాష్ట్రాల్లో కొదవలేదు.
తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఏ పద్యం అయినా రాగయుక్తంగా కాకపోయినా ఎలాటి స్ఖాలిత్యాలు దొర్లకుండా పండిత ప్రకాండులు మెచ్చే విధంగా పాడగలరనేది జగమెరిగిన సత్యం. భారత భాగవతాల్లోని అనేక పద్యాలు కేసీఆర్ కి కంఠోపాఠం. దాశరధి, నారాయణ రెడ్డి వంటి కవుల గేయాలు ఆయన ప్రసంగంలో ఆశువుగా దొర్లుతుంటాయి. శాసన సభలోనే కాదు బయట కూడా కేసీఆర్ ప్రసంగాల తీరు ఇదే. ఒకసారి రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో సినారె పక్కన ఉండగానే కేసీఆర్, నారాయణరెడ్డి గారు రాసిన తొలి సినిమా పాటను యధాతధంగా వినిపించి శ్రోతలను అలరించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య గారు బహిరంగ సభల్లో కూడా పద్యం ఎత్తుకునేవారు. ఆయన ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షులుగా వున్నప్పుడు ఢిల్లీలో సంజీవయ్య గారు వుండే బంగళా సాహిత్య గోష్టులకు వేదికగా ఉండేదని 'కలం కూలీ' జీ. కృష్ణగారు తన అనుభవాల్లో రాసారు.
ఇలాటి జ్ఞాపకాలు ఎన్నో.
తోకటపా:
1975లో నేను రేడియో విలేకరిగా మొదటిసారి శాసన సభ ప్రెస్ గ్యాలరీలో అడుగుపెట్టాను. అప్పటినుంచి 2005లో దూరదర్సన్ లో రిటైర్ అయ్యేవరకు అసెంబ్లీ ఇంచుమించు నా రెండోఆఫీసు అయింది. దాని ఎదురుగానే నేను పనిచేసే ఆకాశవాణి వుండడం వల్ల అనుబంధం మరింత పెరిగింది.
“ఆ రోజుల్లో అసెంబ్లీ పాత భవనంలో వుండేది. సభ్యులకు, ప్రెస్ గేలరీలోని విలేకరులకు నడుమ కొయ్యతో చేసిన గోడ మాత్రమే అడ్డం. మాట్లాడుకోవడానికి కూడా వీలుండేది. అప్పుడప్పుడు ఆఖరి వరుసలోని సభ్యులు తల వెనక్కు తిప్పి విలేకరులతో గుసగుసలాడేవారు. స్పీకర్ చూస్తున్నారు అనే అనుమానం కలగగానే తల ముందుకు తిప్పేవారు. సభలో క్రమశిక్షణ ఎలా ఉండేదో తెలియచెప్పడానికే ఇది చెప్పాల్సి వస్తోంది.
“ఇక్కడ మరో మాట కూడా చెప్పాలి.
“సరిగా వినకుండా రాంగ్ రిపోర్ట్ చేస్తే సభాహక్కుల తీర్మానం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే భయం విలేకరులకు వుండేది. అలాగే, సభలో వున్న సభ్యులు కూడా భయపడేవారు. ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే స్పీకర్ తమ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తే చిన్నతనంగా ఉంటుందని గుంజాటన పడేవారు.
“యాభయ్ ఏళ్ళ ముందు శాసన సభ నడిచిన తీరు అది. యాభయ్ ఏళ్ళ తరువాత ఎలా నడుస్తున్నాయో ప్రత్యక్ష ప్రసారాల్లో జనం చూస్తూనే వున్నారు కదా!
“ఏం రాసినా చెల్లుతుందని వీళ్ళూ, ఏం మాట్లాడినా ఏమీ కాదని వాళ్ళూ.
“స్థూలంగా చెప్పాలి అంటే అప్పటికీ ఇప్పటికీ నాకు కనబడుతున్న తేడా ఇదే”



(25-03-2022)

26, మార్చి 2022, శనివారం

ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం! - భండారు శ్రీనివాసరావు

 దృశ్యం ఒక్కటే.

చూసేవారికి రెండు రకాలుగా కనిపిస్తుంది.
వైద్య పరిభాషలో ఈ జబ్బుని ఏమంటారో జనాలకు తెలవదు.
కానీ, ఒకే వార్త వివిధ పత్రికల్లో వేర్వేరు రూపాల్లో వస్తే మాత్రం – అందుకు కారణాలేమిటో ఇప్పుడు ప్రజలు అర్ధం చేసుకోగలుగుతున్నారు.
ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి – వేర్వేరు పత్రికలు వేర్వేరు కోణాల్లో - వార్తలు వండి వారుస్తున్న తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. యే ఛానల్ మార్చి చూసినా ఇదే వరస.
తాము చదివే పత్రిక, తాము చూసే ఛానల్ వైవిధ్య భరితంగా వుండాలని ఎవరయినా కోరుకుంటారు. అందుకే, ప్రభుత్వ ఆజమాయిషీ లోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేట్ ఛానల్ల శకం ప్రారంభమయినప్పుడు జనం ఆ మార్పుని సాదరంగా ఆహ్వానించారు. కానీ కోరుకున్న మార్పు కోరిన విధంగా కాకుండా గాడి తప్పుతున్నదేమో అన్న పరిణామాన్ని వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు.
ఇరవై నాలుగ్గంటల వార్తా ఛానళ్ళ పుణ్యమా అని ఈనాడు సమాచారం టన్నుల లెక్కల్లో జనాలకు చేరుతోంది. ఇందులో అవసరమయినదెంత? అన్నది ప్రశ్నార్ధకమే! ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు యే మేరకు హరాయించుకోగలదన్నది ఛానళ్ళ వాళ్ళే చెప్పాలి. ఎన్ని విన్నా మెదడు తనకు చేతనయినంతవరకే తనలో నిక్షిప్తం చేసుకుని మిగిలినవి వొదిలేస్తుందని అంటారు. ఇదే నిజమయితే – టీవీ ఛానళ్ళ ద్వారా ప్రజలకు చేరుతున్న సమాచారంలో సింహభాగం వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే రాసిందీ, రాసిన దానికంటే చూసిందీ ఎక్కువకాలం గుర్తు వుంటుందని ఓ సూత్రం. కానీ ఈ సిద్ధాంతానికి సయితం ఈ సమాచార విస్పోటనం చిల్లులు పొడుస్తోంది. ‘పీపుల్స్ మెమోరి షార్ట్’ – అంటే ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తు వుండదు అనే ధీమాతోనే రాజకీయనాయకులు స్వవచన ఘాతానికి పూనుకుంటూ వుంటారు. బహుశా ఈ సూత్రాన్నే ఛానల్స్ పాటిస్తున్నాయని అనుకోవాలి.
ఇంతకీ విషయం ఏమిటంటే- సృష్టికర్త జనాలకు ‘మరపు’ అనే అద్భుతమైన వరాన్ని ప్రసాదించి ఎంతో మేలు చేసాడు. లేకపోతె, ఒకే రోజు ఒకే వార్తను భిన్న కోణాల్లో చదివి చదివి – ఒకే ప్రకటనలోని సారాంశాన్ని వేర్వేరు రకాలుగా చూసి చూసి – ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతుండేవారు.
వెనుకటి రోజుల్లో పత్రికల్లో ‘ఘాటుగా విమర్శించారు’ అని రాస్తే అక్కడికి అదే గొప్ప. ఇక ఇప్పుడో- ‘నిలదీశారు. నిప్పులు చెరిగారు. మండిపడ్డారు’ ఇలాటి విశేషణాలు కోకొల్లలు.
పోతే, టీవీ చర్చల్లో పాల్గొనే వారిని పరిచయం చేయగానే వారు ఏం మాట్లాడబోతున్నారో ఇట్టే తెలిసిపోవడం మరో దౌర్భాగ్యం. ఒక అంశాన్నివిశ్లేషించాల్సివచ్చినప్పుడు అందులోని వివిధ పార్శ్వాలను ప్రస్తావించడం సహజం. కానీ సంబంధం లేని విషయాలను ఎత్తుకుంటూ, చర్చను పక్క దోవ పట్టించేవారిని కట్టడి చేయలేకపోవడాన్నే వీక్షకులు ప్రశ్నిస్తున్నారు.
వీటికి జవాబు దొరకదు. అయితే, ఇష్టం లేకపోతే ‘కట్’ చేయడానికి ‘ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం’ అనే పడికట్టు పదం మాత్రం సదా సిద్ధం.

తోకటపా:
టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్ళు పౌరాణిక నాటకాలనుంచి నేర్చుకోవాల్సిన పాఠం.
"కృష్ణుడు రాగయుక్తంగా పద్యం పాడడం పూర్తయ్యేదాకా సుయోధనుడు తన పద్యం ఎత్తుకోడు"


25, మార్చి 2022, శుక్రవారం

నేను – తెలుగుదేశం

 

1982 లో నాటి ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు  తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో నాకు మొదట పరిచయం అయిన వ్యక్తి కంభంపాటి రామ్మోహన్. ఆయన ఇంటిపేరు మా ఊరి పేరు (కంభంపాడు) ఒకటి కావడం కాకతాళీయం అయినా మా నడుమ ఏర్పడ్డ పరిచయం చక్కని స్నేహంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దీనికి మరో కాకతాళీయ కారణం నేను రేడియో విలేకరిగా పనిచేస్తూ వుండడం, ఆయన టీడీపీలో పత్రికా వ్యవహారాలు చూస్తూ వుండడం.

తదనంతర కాలంలో టీడీపీ అధికారంలోకి వచ్చి  ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం, తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో  చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ వదిలేసి టీడీపీలో చేరడం, పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత రామ్మోహన్, చంద్రబాబు నేతృత్వంలో పార్టీ పత్రికా వ్యవహారాలు చూడడం,  ఈ క్రమంలో రామ్మోహన్ తో నా పరిచయం కొత్త చిగుళ్లు తొడిగింది. దాదాపు ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడడం, నిత్యం హిమాయత్ నగర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కలవడం నాకే కాదు, నాటి తోటి పత్రికా విలేకరులు అందరికీ అనుభవైకవేద్యం.

పార్టీకోసం పడిన శ్రమ ఊరికే పోలేదు. నేను మాస్కో వెళ్ళే ముందో లేక కొద్ది రోజుల తర్వాతో గుర్తు లేదు,  ఆయన పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. తరువాత రాజ్యసభ సభ్యత్వం. ఆ తర్వాత ఢిల్లీలో  క్యాబినెట్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఇలా యుక్తవయసులోనే మంచి పదవులు. బహుశా పదవి వున్నా లేకపోయినా పార్టీని అప్పటినుంచి ఇప్పటివరకు అంటిపెట్టుకుని ఉన్న అతి కొద్దిమంది నాయకుల్లో రామ్మోహన్ ఒకరు అంటే అతిశయోక్తి కాదు.

ఇలాంటి వ్యక్తికి పార్టీతో ఎన్నో అనుభవాలు వుంటాయి.  గ్రంధస్థం చేస్తే బాగుంటుంది అని నేను ఎన్నోసార్లు ఇచ్చిన సూచనకు అన్నిసార్లు చిరునవ్వే సమాధానం.

ఇన్నాళ్ళకు ఆయన మనసులో ఈ ఆలోచన పుట్టినట్టుంది. నేను – తెలుగు దేశం అనే పేరుతొ ఒక పుస్తకం రాసారు.

ఈనెల 28 వ తేదీన పుస్తకం ఆవిష్కరణ. అదీ హైదరాబాదులో. ముఖ్య అతిధులు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు.

All the best Rammohan



(25-03-2022)