16, సెప్టెంబర్ 2021, గురువారం
ఒకనాటి మోడీ
నర్సుని కావాలని వుంది
“పెద్దయిన తర్వాత ఏమవుదామని అనుకుంటున్నావ్?
అనే ప్రశ్నకు నేను చెప్పిన ఈ జవాబు విని క్లాసులో, టీచరుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు.”
“దేవుడికి నా కోరిక సగమే అర్ధం
అయినట్టు వుంది. అందుకే ఇలా నాచేత ఈ చైల్డ్ కేర్ సెంటర్ పెట్టించి ఇంతమంది
పిల్లల్ని ఇచ్చాడు, వారి ఆలనా పాలనా చూడమని”
ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం, 1980లో అనుకుంటాను, వాసిరెడ్డి కాశీ రత్నం గారు మా ఇంటికి
వచ్చారు, ఆంధ్రజ్యోతి గ్రూపు తరపున వెలువడే వనితా జ్యోతి పత్రిక కోసం మా ఆవిడను
ఇంటర్వ్యూ చేయడానికి. ఆ సందర్భంలో మా ఆవిడ నిర్మల నడిపే అమ్మవొడి గురించి కాశీరత్నం గారు అడిగినప్పుడు
మా ఆవిడ చెప్పిన మాటలు ఇవి.
అప్పుడు మేము చిక్కడపల్లి త్యాగరాయ
గానసభ దగ్గర్లో పర్చా కిషన్ రావు
గారింట్లో అద్దెకు ఉంటున్నాము. నాకు రేడియోలో ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. దగ్గరలో
ఉన్న సెంట్ ఆంథోని స్కూల్లో చేర్చాము.
రానూ పోనూ నెలవారీగా రిక్షా మాట్లాడాము.
ఆరోజుల్లో ఆదాయ వ్యయాలు ఎలా ఉండేవి
అంటే జీతానికి, జీవితానికీ పొంతన వుండేది కాదు. అంచేత కరెంటు బిల్లు (అప్పట్లో రెండు
నెలలకోమారు వచ్చేది) కడితే, ఆ నెల ఇంటి రెంటు బాకీ పడేది. పాపం ఆ
పెద్దాయన ప్రై నెలా మొదటివారంలో తను ఉంటున్న బర్కత్ పురా ఇంటి నుంచి చేతికర్ర పొడుచుకుంటూ, జాగ్రత్తగా నడుచుకుంటూ
చిక్కడపల్లి వచ్చేవారు అద్దె వసూలు కోసం.
మళ్ళీ ఉసూరుమంటూ వెళ్ళిపోయేవారు, సమయానికి అద్దె కట్టలేని మా పరిస్థితి చూసి కొంత జాలిపడి,
మరికొంత చీకాకు పడి.
ఈ నేపధ్యంలో మరో దారి కనపడక, మా ఆవిడ ఈ అమ్మఒడి దారి ఎంచుకుంది.
ఉన్న రెండు గదుల్లో ఒకదాన్ని ఈ కేర్
సెంటర్ కోసం కేటాయించాము. బయట, రోడ్డు మీద వెళ్ళే వారికి కనబడేటట్టు
‘తల్లి ఒడి విడలేని చిన్నారుల బడి’ అనే ట్యాగ్
లైన్ తో ‘అమ్మవొడి, చైల్డ్ కేర్ సెంటర్’ అనే బోర్డు రాయించాము.
రెండు వారాలు గడుస్తున్నా మా ఆవిడ అమ్మ
ఒడిలో తమ పిల్లల్ని చేర్చడానికి ఎవరూ ముందుకు రాలేదు. పిల్లలకు కావాల్సిన ఆట
వస్తువులు కానీ, ఉయ్యాలలు కానీ లేవు. కనీసం ఆయా కూడా లేదు. అలాంటి సెంటర్
లో ఎవరు మాత్రం తమ పిల్లల్ని వదిలి వెడతారు? కానీ అవన్నీ అమర్చడానికి ఆర్ధిక వనరులు లేవు.
అలా ఎదురు చూస్తుంటే ఒక రోజు ఉదయం ఇంకా
ఎనిమిది కూడా కాలేదు ఒక జంట హడావిడిగా వచ్చి మా ఆవిడ చేతిలో వాళ్ళ నెలల
పిల్లవాడిని, ఓ పాలసీసాను పెట్టి, ‘ఇప్పుడు టైము లేదు, సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చినప్పుడు
వివరాలు చెబుతామంటూ’ అంతే హడావిడిగా వెళ్ళిపోయారు.
వాళ్లెవరో తెలియదు. ఎక్కడ ఉద్యోగాలు
చేస్తున్నారో తెలియదు. ఆ పిల్లవాడి పేరేమిటో తెలియదు. గంటలు గడిచిపోతున్నాయి,
సాయంత్రం అయింది. మా పిల్లలు స్కూలు నుంచి
వచ్చారు. నేను కూడా ఆఫీసు నుంచి వచ్చాను. ఏడుస్తున్న పిల్లవాడిని ఒడిలో
పెట్టుకుని సముదాయిస్తూ తను ఒక్కత్తీ
కూర్చుని వుంది. రాత్రి తొమ్మిది దాటుతోంది. కానీ ఆ తలితండ్రుల జాడ తెలియదు. నాలో
ఆరాటం పెరిగింది. ‘పోలీసులకు చెప్పనా!’ అన్నాను. తల అడ్డంగా ఊపింది. ‘వద్దు. వాళ్ళ
మొహాలు చూస్తే మంచివాళ్ళుగానే అనిపించారు. ఏమి ఆటంకం వచ్చిందో తెలవదు కదా!
చూద్దాం. మీరు అన్నట్టు రేపటికి కూడా రాకపోతే ముగ్గురు పిల్లలు అనుకుని వీడిని
కూడా మన పిల్లలతో పాటే పెంచుతాను’ అంది స్థిరంగా, మరో మాట లేదన్నట్టు.
మా ఆవిడ అన్నట్టే వాళ్ళు చాలా
మంచివాళ్ళు. రాత్రి పదిన్నరకు వచ్చారు, బోలెడు
క్షమాపణలు చెప్పుకుంటూ. ఆయనకి ఆఫీసు ఆరుకే
అయిపోయిందట. కానీ ఆమెకు పెండింగ్ ఫైల్స్ పని పడి పొద్దు పోయిందట. ఈ సంగతి
చెబుదామంటే మా ఫోను నెంబరు పొద్దున్న హడావిడిలో తీసుకోవడం కుదరలేదట.
బాబు పేరు జేమ్స్. మా ఆవిడ పెట్టిన
అమ్మఒడిలో చేరిన మొదటి పిల్లవాడు.
తరువాత కొన్ని రోజులకి మరో పిల్లవాడు.
అలా రెండు నెలలు తిరిగేసరికి పనిపిల్లను పెట్టుకునే స్థాయిలో పిల్లల సంఖ్య
పెరిగింది. మా ఆవిడకు పని భారము పెరిగింది. పని మనిషి రాని రోజున చూడాలి మా ఆవిడ అవస్థ. పదిమంది
తల్లుల పాత్రలతో ఏకపాత్రాభినయం చేసేది.
కావాలని కోరి ఎంచుకున్న మార్గం కాబట్టి కష్ట నష్టాలు, లాభ నష్టాలు చూసుకోలేదు. ఎవరినీ ఇంత కావాలని అడిగేది కాదు. ఇచ్చినది
పుచ్చుకునేది. కొందరు పద్దతిగా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఏమీ అనేది కాదు.
‘మనం అంతేగా! నెలనెలా అద్దె కట్టడానికి ఇబ్బంది పడడం లేదా. వాళ్ళూ
అలాగే. ఖర్చులకు సరిపోకనే కదా, ఇద్దరూ ఉద్యోగాలు చేసేది’ అని వారినే
సమర్ధించేది.
అలా మొదలైన అమ్మఒడి క్రమంగా పేరు
పెంచుకుంటూ పెరుగుతూ వచ్చింది. చిక్కడపల్లిలో ఒక లాండ్ మార్కుగా మారింది. మేము
1987లో మాస్కో వెళ్ళిన తర్వాత అమ్మఒడి బాధ్యతలు
నా మేనకోడలు ఫణి కుమారి తన భుజాలకు ఎత్తుకుంది.
అమ్మఒడిలో పెరిగిన పిల్లలు చాలా మంది
ఇప్పుడు విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ తలితండ్రులు వచ్చి వాళ్ళ
పిల్లల పెళ్లిళ్లకు పిలుస్తుంటే తను చాలా సంబర పడేది.
అలా మొత్తం మీద, అనాథాశ్రమంలో నర్స్
కావాలనుకున్న తన చిన్ననాటి కోరికను మా ఆవిడ నిర్మల తన అమ్మఒడి ద్వారా తీర్చుకుంది.
ఆమె సేవాభావం నాకు అంటలేదు కానీ,
కన్న పిల్లలు ఇద్దరికీ కొంచెం పంచిపెట్టే
వెళ్ళింది, నేను పంచడానికి ఏమీ లేదని తెలుసు కనుక.
కాగితాన్వేషణ - భండారు శ్రీనివాసరావు
రిటైర్
అయి పుష్కరం దాటింది. ఆ కాలంనాటి రాతలు, కోతలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్.
అన్నీ కంప్యూటర్ల మీదే. అయినా ప్రతిదానికీ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు మాత్రం
తప్పడం లేదు. అదృష్టం! ఎవరూ దక్షిణలు అడగడం లేదు.
పెన్షన్
స్లిప్ మెయిల్ లో పంపారు. (ఇప్పుడు అన్నీ SMS లోనే). వివరాలు అన్నీ సరిగానే
వున్నాయి. కానీ పెన్షన్ నామినీ కాలంలో మా ఆవిడ పేరు లేదు. పెళ్లి నాడు కూడా ఇద్దరం
కలిసి ఫోటో దిగలేదు కానీ, రిటైర్ అయ్యేముందు పెన్షన్ పుణ్యమా అని
ఇద్దరం పొలోమని స్టూడియోకి వెళ్లి మరీ ఫోటో తీయించుకుని ఆఫీసులో ఇచ్చాము. తీరా
ఇప్పుడు చూస్తే నామినీ పేరు గల్లంతు. ఇలాటి విషయాల్లో కాలయాపన పనికిరాదు అనే మా
మాజీ స్టేషన్ డైరెక్టర్ శాస్త్రి గారి మాట విని కోటీలోని స్టేట్ బ్యాంకు ప్రధాన
కార్యాలయానికి వెళ్లాను. 1975లో రేడియోలో చేరినప్పటి నుంచి నా
అక్కౌంటు అక్కడే, అప్పట్లో అన్నీ మానవ సంబంధాలు.
స్లిప్పు రాయడం, టోకెన్ తీసుకోవడం, మన
నెంబరు పిలిచినదాకా ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెబుతూ కాలక్షేపం చేయడం, లేదా
బ్రాంచి మేనేజర్ దగ్గర భేటీ వేయడం అలా కాస్త కాలక్షేపం కాస్త స్వకార్యం. ఇప్పుడు
అలా లేదు. ఒక పెద్ద అధునాతన ఎయిర్ పోర్ట్ మాదిరిగా వుంది. అన్నీ కంప్యూటర్లు, వాటి
వెనక కనీకనపడక సిబ్బంది తలకాయలు. పనిచేస్తున్నారో, సెల్ ఫోన్లు చేస్తున్నారో తెలవదు. అంతా
హడావిడి. బయట కస్టమర్లది కూడా అదే తంతు. ఒకరికొకరు తెలవదు, ఎవరికి
వారికి తమ పని ముందు చక్కబెట్టుకుని చక్కా పోవాలనే ఆత్రుత.
చివరికి ‘ఇక్కడ కాదు, పెన్షనర్ల విభాగం మరో పక్కన అదే ఆవరణలో వుంది, అక్కడికి వెళ్లండ’ని చల్లగా కబురు. ఆ బిల్డింగు పెద్ద పెద్ద పొడవాటి మెట్ల వరుసతో చాలా అందంగా, అధునాతనంగా వుంది. మొదటి అంతస్తులో వుంది ఈ విభాగం. మా ఆవిడను తీసుకుని వెళ్ళిన రోజు జనం లేరు, ఖాళీగా వుంది. బయట రిసెప్షన్ లో ఎవరూ లేరు. గాజు తలుపు నెట్టుకుని లోపలకు వెళ్లి అక్కడ ఒకర్ని వాకబు చేసాను. అతడు ఆశ్చర్యంగా నా వంక చూసి, ‘ఇక్కడి దాకా ఎలా వచ్చారు. లోపలకు ఎవరూ రాకూడదు, బయట రిసెప్షన్ వరకే మీకు అనుమతి’ అంటూ నాకు ఓ క్లాసు పీకాడు. బయటకు వచ్చి చూస్తే రిసెప్షన్ సీటు ఖాళీగా వుంది. కాసేపటికి ఒకావిడ వచ్చి అక్కడ నిల్చుంది. ఆవిడ ఉద్యోగా, నాలాగా వచ్చిన మనిషా అని తేరిపార చూస్తుంటే, ఆవిడ కళ్ళు విప్పార్చి ‘ఏం కావాలి’ అని అడిగింది. వెళ్లి చెప్పాను. పేరు, అక్కౌంట్ నెంబరు వివరాలు అడిగి తెలుసుకుంది. నేను, ‘మా ఆవిడ మా ఆవిడే’ అనడానికి నాదగ్గర ఉన్న అన్ని ఆధారాలు అంటే ఆధార్ కార్డు, పెన్షనర్ కార్డు, ఏళ్ళతరబడి అదే బ్యాంకులో ఉన్న బ్యాంకు జాయింటు అక్కౌంట్ వివరాలు, పాసుపోర్టు ఇలా అన్నీ ఆవిడ ముందు పెట్టాను. ‘పెన్షన్ పేమెంటు ఆర్డరు ఏదీ’ అని అడిగింది. రిటైర్ అయిన తరువాత నాలుగిళ్ళు మారాను. ఈ సంధి కాలంలో ఏటీఎంలు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు వగైరాలు వచ్చిపడి కొన్ని పాత కాగితాలకు కాలం చెల్లిపోయిందని నిర్లక్ష్యం చేసిన జాబితాలో ఈ కాగితం కూడా చేరి పోయివుంటుంది. కానీ ఆ కాగితం లేనిదే పని జరగదు అనే తెలివి తెచ్చుకుని ఇంటికి చేరి ఇంటిల్లిపాదీ ఆ కాగితాన్వేషణ కార్యక్రమంలో తలమునకలు అయ్యాము. ఇల్లంతా చిందర వందర కావడం తప్పిస్తే కాగితం జాడ లేదు. అతి ముఖ్యమైన వాటిని అతి జాగ్రత్తగా దాచే నైపుణ్యం కలిగిన మా ఆవిడే వాటి పత్తా కనుక్కుంది. పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మల్లో దాచినట్టు, పెన్షన్ పత్రాలను ఒక సీనా రేకుల పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భద్రంగా అటక ఎక్కించింది.దాన్ని దింపి చూస్తే ఎప్ప్పుడో పుష్కరం నాడు దిగిన మా దంపతుల ఫోటో ఉన్న పెన్షన్ పేమెంటు ఆర్డరు బుక్కు కనిపించింది.
తెల్లారగానే దాన్ని పట్టుకుని, దారి మధ్యలో జిరాక్స్ కాపీలు తీయించి, అక్కడికి పడుతూ లేస్తూ వెళ్లాను.
పోయి
చూస్తె, ఆ రిసెప్షన్ హాలు మొత్తం పెన్షనర్లతో
కిటకిట లాడుతోంది. నా మొహం చూసి నాలాగే పనిమీద వచ్చిన ఒకాయన, ‘సోమవారం
మాస్టారు, సోమవారం. రష్ ఇలాగే వుంటుంది’ అన్నాడు. కాసేపటి
తరవాత ఆయనే కలిగించుకుని ‘అలా నిలుచుండి పొతే అలాగే వుంటారు. ముందు ఆ రిసెప్షన్
బల్ల మీద ఉన్న రిజిస్టర్ లో మీ వివరాలు రాయండి’ అన్నాడు. “ఇక్కడ నిఘా కెమెరాలు
వున్నాయి, కాస్త నవ్వు మొహం పెట్టండి’ అనే
సెన్సాఫ్ హ్యూమర్ కలిగిన బోర్డులు వున్నాయి కానీ, రాగానే ముందు వివరాలు రాసి వెయిట్ చేయాలి అనే
ముఖ్యమైన సంగతి తెలిపే సమాచార సూచిక అక్కడ ఏమీ కనబడలేదు.
రిజిస్టర్ లో వివరాలు రాసి ఓ పక్కన
నిలుచున్నాను. ఈసారి సీట్లో మరో అమ్మాయి కూర్చుని వుంది. ప్రతి ఒక్కరి కేసు తన
కేసే అన్నంత శ్రద్ధగా వచ్చిన వారిని విసుక్కోకుండా పని చేసి పెడుతోంది. లైన్లో ఉన్న
వాళ్లకు ఈ ఆలస్యం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ పని తీరు నాకు బాగా నచ్చింది.
ఇంతలో ఒక వృద్ధుడు వచ్చాడు. అప్పుడే నా వంతు వచ్చింది. ఆ అమ్మాయి నాతో అన్నది, ‘చూడండి.
నిజానికి వరసలో మీరే వున్నారు. ఈయన రిజిస్టర్ లో రాయలేదు. కానీ పెద్దాయన కదా! మీరు
ఒప్పుకుంటే ముందీ పెద్దమనిషి విషయం కనుక్కుంటాను’
ఈ రకంగా వృత్తిధర్మం నెరవేరుస్తున్న ఒక
ఉద్యోగిని చూడడం చాలా అరుదు. ఆ పెద్ద మనిషి పని పూర్తి చేసిన తరువాత నన్ను పిలిచింది.
వివరాలు అన్నీ మరో మారు పరిశీలించింది. నేను రిటైర్ అయినప్పుడు నామినీ విషయంలో
పుట్టిన తేదీ పట్టింపు లేదు. కానీ అదిప్పుడు తప్పనిసరి. నేను ఏం చెయ్యాలో ఎలా
చెయ్యాలో ఒక వైద్యుడు రోగికి చెప్పినంత వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి పనిచేసే
విధానం చూసిన తరువాత నాకు నా పని కాలేదన్న విచారం కలగలేదు. ధన్యవాదాలు చెప్పి
వచ్చేసాను.
నిజానికి ప్రస్తుతం దేశానికి
కావాల్సింది ఇలాంటి ఉద్యోగులే.
పొతే అంత శ్రమ వృధా అవుతుందని అప్పుడు అనుకోలేదు. నామినీ కాలం పూర్తి
చేయాల్సిన అవసరం లేకుండా తను దాటిపోయింది.
Top of Form
ఇల్లాలి ముచ్చట్లు అనే జ్ఞాపకాల తెరలు
“1968 ప్రాంతాల్లో నేను (అంటే మా ఆవిడ నిర్మల) బెజవాడ మాంటిసోరి స్కూల్లో చదివేదాన్ని. సరస్వతి వొదినె గారి పిల్లలు సత్యవతి, విజయ అంతా ఆ స్కూలే. ఆ స్కూల్లో పిల్లల్ని చదివించడం అనేది ఆ రోజుల్లో చాలా గొప్పగా వుండేది. దానికి కారణం ప్రిన్సిపాల్ కోటేశ్వరమ్మగారు. బెజవాడ కనకదుర్గమ్మ మాదిరిగానే కోటేశ్వరమ్మ పేరు కూడా అంతే ప్రసిద్ధి.
“తుర్లపాటి హనుమంతరావు అన్నగారి మనుమడు, విజయ
కుమారుడు (కార్తీక్) పుట్టినప్పుడు బారసాలకు కోటేశ్వరమ్మగారు కూడా వచ్చారు. మేమంతా
ఆవిడ స్టూడెంట్లం
కాబట్టి భోజనాల సమయంలో (ఆరోజుల్లో ఎవరొచ్చినా నేల మీదనే భోజనాలు, పీటలు వేసి వడ్డించేవారు) ఆమె చుట్టూ
కూర్చున్నాం. చాలా ఏళ్ళ తరువాత కలిసినా, ఆవిడ పేరు పేరునా అందర్నీ ఆప్యాయంగా
పలకరించారు.
‘ఏం
చేస్తున్నావని’ నన్నడిగితే, ‘హైదరాబాదులో
‘అమ్మవొడి’ పేరుతొ చిన్నపిల్లల
కోసం కేర్ సెంటర్ నడుపుతున్నాను’ అని చెప్పా. బహుశా ఆమె
దగ్గర చదువుకున్నవాళ్ళల్లో
చదువులో ఎక్కిరానిదాన్ని నేనే అనుకుంటా. కానీ ఆవిడ మాత్రం నన్ను
అభినందించారు. ‘స్త్రీలు స్వతంత్రంగా ఏదో ఒకటి చేయడం చాలా అవసరమ’ని చెప్పారు. నేను
ఏదో మా అవసరాలకు కేర్ సెంటర్
పెట్టుకుంటే, ఆవిడ
పెద్ద మనస్సుతో ఆశీర్వదించిన విధానం నేను మరిచిపోలేను.
"చివర్లో ఇంకో విషయం. తెలుగు సినిమా రంగంలో హాస్య బ్రహ్మగా పేరు
తెచ్చుకున్న ‘జంధ్యాల’ (జేవీడీఎస్ శాస్త్రి)
కూడా మాంటిసోరి స్కూల్లో మా క్లాసుమేటు. దీనికి కొనసాగింపు లాంటి ముగింపు ఏమిటంటే జంధ్యాల
తదనంతర కాలంలో బెజవాడ ఎస్సారార్ కాలేజీలో మూడేళ్ళు బీకాంలో మా వారికీ
క్లాసుమేటు."
సెప్టెంబర్ 16
సంగీత ధ్రువతార ఎమ్మెస్ సుబ్బులక్ష్మి
15, సెప్టెంబర్ 2021, బుధవారం
సృష్టికి శుభాశీస్సులు
ముందు లేడి పిల్లలా పరుగులు పెడుతున్నది సృష్టి. వెనక వెంట వస్తున్నది సృష్టి తండ్రి సందీప్. ఇది రాస్తున్న నేను, ఆ తండ్రికి తండ్రిని.
