అమ్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమ్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, సెప్టెంబర్ 2021, గురువారం

నర్సుని కావాలని వుంది

 

 “పెద్దయిన తర్వాత ఏమవుదామని అనుకుంటున్నావ్? అనే ప్రశ్నకు నేను చెప్పిన ఈ  జవాబు విని క్లాసులో, టీచరుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు.”

“దేవుడికి నా కోరిక సగమే అర్ధం అయినట్టు వుంది. అందుకే ఇలా నాచేత ఈ చైల్డ్ కేర్ సెంటర్ పెట్టించి ఇంతమంది పిల్లల్ని ఇచ్చాడు, వారి ఆలనా పాలనా చూడమని”

ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం, 1980లో అనుకుంటాను, వాసిరెడ్డి కాశీ రత్నం గారు మా ఇంటికి వచ్చారు,  ఆంధ్రజ్యోతి  గ్రూపు తరపున  వెలువడే  వనితా జ్యోతి  పత్రిక కోసం మా ఆవిడను  ఇంటర్వ్యూ చేయడానికి. ఆ సందర్భంలో  మా ఆవిడ నిర్మల నడిపే  అమ్మవొడి గురించి కాశీరత్నం గారు అడిగినప్పుడు మా ఆవిడ చెప్పిన మాటలు ఇవి.

అప్పుడు మేము చిక్కడపల్లి త్యాగరాయ గానసభ దగ్గర్లో  పర్చా కిషన్ రావు గారింట్లో అద్దెకు ఉంటున్నాము. నాకు రేడియోలో ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. దగ్గరలో ఉన్న  సెంట్ ఆంథోని స్కూల్లో చేర్చాము. రానూ పోనూ నెలవారీగా రిక్షా మాట్లాడాము.

ఆరోజుల్లో ఆదాయ వ్యయాలు ఎలా ఉండేవి అంటే  జీతానికి, జీవితానికీ పొంతన వుండేది కాదు. అంచేత కరెంటు బిల్లు (అప్పట్లో రెండు నెలలకోమారు వచ్చేది) కడితే, ఆ నెల ఇంటి రెంటు బాకీ పడేది. పాపం ఆ పెద్దాయన ప్రై నెలా మొదటివారంలో తను ఉంటున్న బర్కత్ పురా ఇంటి నుంచి చేతికర్ర  పొడుచుకుంటూ, జాగ్రత్తగా  నడుచుకుంటూ చిక్కడపల్లి వచ్చేవారు అద్దె వసూలు కోసం.  మళ్ళీ ఉసూరుమంటూ వెళ్ళిపోయేవారు, సమయానికి  అద్దె కట్టలేని మా పరిస్థితి చూసి కొంత జాలిపడి, మరికొంత చీకాకు పడి.

ఈ నేపధ్యంలో మరో దారి కనపడక, మా ఆవిడ ఈ అమ్మఒడి దారి ఎంచుకుంది.

ఉన్న రెండు గదుల్లో ఒకదాన్ని ఈ కేర్ సెంటర్ కోసం కేటాయించాము. బయట, రోడ్డు మీద వెళ్ళే వారికి కనబడేటట్టు ‘తల్లి ఒడి విడలేని చిన్నారుల బడి’ అనే ట్యాగ్  లైన్ తో  ‘అమ్మవొడి, చైల్డ్ కేర్ సెంటర్’ అనే బోర్డు రాయించాము.

రెండు వారాలు గడుస్తున్నా మా ఆవిడ అమ్మ ఒడిలో తమ పిల్లల్ని చేర్చడానికి ఎవరూ ముందుకు రాలేదు. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కానీ, ఉయ్యాలలు  కానీ లేవు. కనీసం ఆయా కూడా లేదు. అలాంటి సెంటర్ లో ఎవరు మాత్రం తమ పిల్లల్ని వదిలి వెడతారు? కానీ అవన్నీ అమర్చడానికి ఆర్ధిక వనరులు లేవు.

అలా ఎదురు చూస్తుంటే ఒక రోజు ఉదయం ఇంకా ఎనిమిది కూడా కాలేదు ఒక జంట హడావిడిగా వచ్చి మా ఆవిడ చేతిలో వాళ్ళ నెలల పిల్లవాడిని, ఓ పాలసీసాను పెట్టి, ‘ఇప్పుడు టైము లేదు, సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చినప్పుడు వివరాలు చెబుతామంటూ’ అంతే హడావిడిగా వెళ్ళిపోయారు.

వాళ్లెవరో తెలియదు. ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో తెలియదు. ఆ పిల్లవాడి పేరేమిటో తెలియదు. గంటలు గడిచిపోతున్నాయి, సాయంత్రం అయింది. మా పిల్లలు స్కూలు నుంచి వచ్చారు. నేను కూడా ఆఫీసు నుంచి వచ్చాను. ఏడుస్తున్న పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని  సముదాయిస్తూ తను ఒక్కత్తీ కూర్చుని వుంది. రాత్రి తొమ్మిది దాటుతోంది. కానీ ఆ తలితండ్రుల జాడ తెలియదు. నాలో ఆరాటం పెరిగింది. ‘పోలీసులకు చెప్పనా!’ అన్నాను. తల అడ్డంగా ఊపింది. ‘వద్దు. వాళ్ళ మొహాలు చూస్తే మంచివాళ్ళుగానే అనిపించారు. ఏమి ఆటంకం వచ్చిందో తెలవదు కదా! చూద్దాం. మీరు అన్నట్టు రేపటికి కూడా రాకపోతే ముగ్గురు పిల్లలు అనుకుని వీడిని కూడా మన పిల్లలతో పాటే పెంచుతాను’ అంది స్థిరంగా, మరో మాట లేదన్నట్టు.

మా ఆవిడ అన్నట్టే వాళ్ళు చాలా మంచివాళ్ళు. రాత్రి పదిన్నరకు వచ్చారు, బోలెడు క్షమాపణలు చెప్పుకుంటూ. ఆయనకి  ఆఫీసు ఆరుకే అయిపోయిందట. కానీ ఆమెకు పెండింగ్ ఫైల్స్ పని పడి పొద్దు పోయిందట. ఈ సంగతి చెబుదామంటే మా ఫోను నెంబరు పొద్దున్న హడావిడిలో తీసుకోవడం కుదరలేదట.

బాబు పేరు జేమ్స్. మా ఆవిడ పెట్టిన అమ్మఒడిలో చేరిన  మొదటి పిల్లవాడు.

తరువాత కొన్ని రోజులకి మరో పిల్లవాడు. అలా రెండు నెలలు తిరిగేసరికి పనిపిల్లను పెట్టుకునే స్థాయిలో పిల్లల సంఖ్య పెరిగింది. మా ఆవిడకు పని భారము పెరిగింది. పని మనిషి  రాని రోజున చూడాలి మా ఆవిడ అవస్థ. పదిమంది తల్లుల పాత్రలతో ఏకపాత్రాభినయం చేసేది.  కావాలని కోరి ఎంచుకున్న మార్గం కాబట్టి కష్ట నష్టాలు, లాభ నష్టాలు చూసుకోలేదు. ఎవరినీ ఇంత కావాలని అడిగేది కాదు. ఇచ్చినది పుచ్చుకునేది. కొందరు పద్దతిగా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఏమీ అనేది కాదు.

‘మనం అంతేగా! నెలనెలా  అద్దె కట్టడానికి ఇబ్బంది పడడం లేదా. వాళ్ళూ అలాగే. ఖర్చులకు సరిపోకనే కదా, ఇద్దరూ ఉద్యోగాలు చేసేది’ అని వారినే సమర్ధించేది.

అలా మొదలైన అమ్మఒడి క్రమంగా పేరు పెంచుకుంటూ పెరుగుతూ వచ్చింది. చిక్కడపల్లిలో ఒక లాండ్ మార్కుగా మారింది. మేము 1987లో మాస్కో వెళ్ళిన తర్వాత అమ్మఒడి బాధ్యతలు  నా మేనకోడలు ఫణి కుమారి తన భుజాలకు ఎత్తుకుంది.

అమ్మఒడిలో పెరిగిన పిల్లలు చాలా మంది ఇప్పుడు విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ తలితండ్రులు వచ్చి వాళ్ళ పిల్లల పెళ్లిళ్లకు పిలుస్తుంటే తను చాలా సంబర పడేది.

అలా మొత్తం మీద, అనాథాశ్రమంలో నర్స్  కావాలనుకున్న తన చిన్ననాటి కోరికను మా ఆవిడ నిర్మల తన  అమ్మఒడి ద్వారా తీర్చుకుంది.

ఆమె సేవాభావం నాకు అంటలేదు కానీ, కన్న పిల్లలు ఇద్దరికీ కొంచెం పంచిపెట్టే వెళ్ళింది, నేను పంచడానికి ఏమీ లేదని తెలుసు కనుక.



10, మే 2014, శనివారం

అమ్మ

  


అమ్మ అన్న దేవత లేకపోతే-
ఇది రాస్తున్న నేనూ లేను. చదువుతున్న మీరూ వుండరు.


రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడయినా  తలచుకునేందుకు ఈ నాటి నాగరికత మనకో రోజును ఇచ్చింది.
అదే  మదర్స్ డే   మాతృమూర్తి దినోత్సవం.
దేశదేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారయింది.
అయితే, భారత దేశంతో సహా అనేక దేశాలలో ఈనెలలోనే  అదీ రెండో ఆదివారం నాడే    ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు.
తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుంచుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు మనకు విదేశాలనుంచే దిగుమతి అయ్యాయి.
సంవత్సరంలో ఒక రోజుని మదర్స్ డే గా గుర్తింపు సాధించడానికి  దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే  తల్లులపట్ల సమాజానికి వున్న చిన్న చూపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
అన్నా జార్విస్ అనే ఈ అమ్మడు  1890  లోనే తాను నివసిస్తున్న   గ్రాఫ్టన్ నగరం వొదిలి  ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే  ఏకైక లక్ష్యంతో వొంటరి పోరాటం ప్రారంభించింది. 1905 లో తన తల్లిని ఖననం చేసిన స్మశాన వాటికలో అమ్మ సమాధి ఎదుట నిలబడి  చనిపోయిన లేదా జీవించివున్న మాతృమూర్తులపట్ల గౌరవపురస్సరంగా ఏడాదిలో ఒక రోజుకి  మదర్స్ డే గా గుర్తింపు తీసుకువస్తానని ప్రతిన పూనింది. దీనికో బలమయిన కారణం వుందని కూడా చెప్పుకుంటారు. ఈవిడ తల్లి  అన్నా రీవేస్ జార్విస్ మరణానికి ముందు ఏదో ఒక విషయంలో తల్లీ కూతుళ్ళ నడుమ వాదులాట జరిగిందట. ఆ తరవాత కొద్దిసేపటికే తల్లి మరణించడం - కూతురు అన్నా జార్విస్ కి తీరని మనస్తాపాన్ని కలిగించిందట. ఇందులో నిజానిజాల సంగతి ఎలావున్నా  ఆ తరవాత రోజుల్లో జార్విస్ సాగించిన పోరాటం చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది.

ఈ క్రమంలో ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని  వొదిలిపెట్టింది. రాజకీయ నాయకులకు, చర్చి అధికారులకు, ప్రభుత్వంపై వొత్తిడి తీసుకురాగల అవకాశం వున్న బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు  రాసింది. విజ్ఞప్తులు చేసింది. దరిమిలా వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి ఆ రాష్ట్రంలో మదర్స్ డే అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ తరవాత 1914 లో  అమెరికా కాంగ్రెస్ కూడా మెట్టుదిగివచ్చి  ఈ దిశగా ఒక తీర్మానం ఆమోదించడం  ఆనాటి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. అన్నా జార్విస్ పట్టుదలపై అమల్లోకి వచ్చిన ఈ మదర్స్ డే ఉత్తర్వులో ఒక విశేషం వుంది.  మొత్తం కుటుంబం శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే అమ్మకే ఈ గౌరవం దక్కాలన్నది జార్విస్  ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే  ప్రజా రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళామణులను మాత్రమె గౌరవించుకునే రోజుగా  కాకుండా  అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా మదర్స్ డే ని జరుపుకోవడమే అందులోని విశిష్టత. అందుకే ఇంగ్లీషులో మదర్స్ డే రాసేటప్పుడు  ఏకవచనంలో అంటే తల్లి దినోత్సవంగా పేర్కొంటారు.
మదర్స్ డే సాధించాలన్న అన్నా జార్విస్ పట్టుదల అయితే నెరవేరింది కానీ ఆమె కన్న మరికొన్ని కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. మదర్స్ డే నాడు తల్లులకు కానుకలుగా పూలూ గ్రీటింగ్ కార్డులూ పంపకండి, ఆమె పట్ల మీ ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ సొంత దస్తూరీతో నాలుగు వాక్యాల ఉత్తరం ముక్క రాయండన్న అన్నా జార్విస్ వేడుకోలు గాలిలో కలిసిపోయింది. గ్రీటింగ్ కార్డుల్లో వ్యక్తమయ్యేది  మొక్కుబడి ప్రేమేననీ, సొంతంగా ఉత్తరం రాస్తే తల్లికి కలిగే తృప్తి వేరనీ -  జార్విస్ చేసిన  విజ్ఞప్తులన్నీ  తల్లి పాలను సయితం లాభాలకు అమ్ముకోవాలనే మార్కెట్ శక్తుల ఎత్తుగడలముందు వెలతెలా పోయాయి. మాతృమూర్తి దినోత్సవం కోసం నిర్విరామగా పోరాడిన అన్నా జార్విస్  పిల్లలు లేకుండానే, తల్లి కాకుండానే  1948 లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుమాలిన  పరిస్తితుల్లో కన్నుమూసింది. ఏ తల్లి కోసం ఆమె అంతగా పోరాడిందో  ఆ తల్లి సమాధి చెంతనే అన్నా  జార్విస్ ని    ఖననం చేయడం ఒక్కటే ఆమెకు దక్కింది.
అన్నా జార్విస్ కోరుకున్నట్టుగా  మదర్స్ డే జరుపుకోవడం అనేది ఒక మొక్కుబడి వ్యవహారం కాకుండా చూడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని ఆనాడు అమలుపరచాలి.
మదర్స్ డే నాడు  తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజల్లా  ఆమెతో గడపగలిగితే అంతకు మించిన సార్ధకత వుండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి  ఆమెతో తినిపించగలిగితే మాతృరుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే.     అలా కుదరని పక్షంలో  గ్రీటింగ్ కార్డుతో పాటు స్వయంగా అమ్మకు  రాసిన ఉత్తరాన్ని కూడా జతపరచాలి. తల్లి మనసు తెలుసుకుని ఆమె కోరుకున్న విధంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్తలకు విరాళం పంపాలి. తల్లీ తండ్రి లేని అనాధ

పిల్లలను చేరదీయాలనే నిర్ణయం తీసుకోగలిగితే అంతకు మించిన కానుక ఏ తల్లీ ఆశించదు.

27, జూన్ 2010, ఆదివారం

అమ్మ – మదర్స్ డే – భండారు శ్రీనివాసరావు





                                                                         అమ్మ        
  



అమ్మ అన్న దేవత లేకపోతే-
ఇది రాస్తున్న నేనూ లేను. చదువుతున్న మీరూ వుండరు.
రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడయినా  తలచుకునేందుకు ఈ నాటి నాగరికత మనకో రోజును ఇచ్చింది.
అదే,  మదర్స్ డే –  మాతృమూర్తి దినోత్సవం.
దేశదేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారయింది.
అయితే, భారత దేశంతో సహా అనేక దేశాలలో ఈనెలలోనే  అదీ రెండో ఆదివారం నాడే    ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు.
తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుంచుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు మనకు విదేశాలనుంచే దిగుమతి అయ్యాయి.
సంవత్సరంలో ఒక రోజుని మదర్స్ డే గా గుర్తింపు సాధించడానికి  దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే – తల్లులపట్ల సమాజానికి వున్న చిన్న చూపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
అన్నా జార్విస్

అన్నా జార్విస్ అనే ఈ అమ్మడు – 1890  లోనే తాను నివసిస్తున్న   గ్రాఫ్టన్ నగరం వొదిలి  ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే  ఏకైక లక్ష్యంతో వొంటరి పోరాటం ప్రారంభించింది. 1905 లో తన తల్లిని ఖననం చేసిన స్మశాన వాటికలో అమ్మ సమాధి ఎదుట నిలబడి – చనిపోయిన లేదా జీవించివున్న మాతృమూర్తులపట్ల గౌరవపురస్సరంగా ఏడాదిలో ఒక రోజుకి  మదర్స్ డే గా గుర్తింపు తీసుకువస్తానని ప్రతిన పూనింది. దీనికో బలమయిన కారణం వుందని కూడా చెప్పుకుంటారు. ఈవిడ తల్లి – అన్నా రీవేస్ జార్విస్ మరణానికి ముందు ఏదో ఒక విషయంలో తల్లీ కూతుళ్ళ నడుమ వాదులాట జరిగిందట. ఆ తరవాత కొద్దిసేపటికే తల్లి మరణించడం - కూతురు అన్నా జార్విస్ కి తీరని మనస్తాపాన్ని కలిగించిందట. ఇందులో నిజానిజాల సంగతి ఎలావున్నా – ఆ తరవాత రోజుల్లో జార్విస్ సాగించిన పోరాటం చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది.

ఈ క్రమంలో ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని  వొదిలిపెట్టింది. రాజకీయ నాయకులకు, చర్చి అధికారులకు, ప్రభుత్వంపై వొత్తిడి తీసుకురాగల అవకాశం వున్న బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు  రాసింది. విజ్ఞప్తులు చేసింది. దరిమిలా వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి ఆ రాష్ట్రంలో మదర్స్ డే అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ తరవాత 1914 లో  అమెరికా కాంగ్రెస్ కూడా మెట్టుదిగివచ్చి  ఈ దిశగా ఒక తీర్మానం ఆమోదించడం – ఆనాటి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. అన్నా జార్విస్ పట్టుదలపై అమల్లోకి వచ్చిన ఈ మదర్స్ డే ఉత్తర్వులో ఒక విశేషం వుంది.  మొత్తం కుటుంబం శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే అమ్మకే ఈ గౌరవం దక్కాలన్నది జార్విస్  ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే – ప్రజా రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళామణులను మాత్రమె గౌరవించుకునే రోజుగా  కాకుండా – అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా మదర్స్ డే ని జరుపుకోవడమే అందులోని విశిష్టత. అందుకే ఇంగ్లీషులో మదర్స్ డే రాసేటప్పుడు  ఏకవచనంలో అంటే తల్లి దినోత్సవంగా పేర్కొంటారు.
మదర్స్ డే సాధించాలన్న అన్నా జార్విస్ పట్టుదల అయితే నెరవేరింది కానీ ఆమె కన్న మరికొన్ని కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. మదర్స్ డే నాడు తల్లులకు కానుకలుగా పూలూ గ్రీటింగ్ కార్డులూ పంపకండి, ఆమె పట్ల మీ ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ సొంత దస్తూరీతో నాలుగు వాక్యాల ఉత్తరం ముక్క రాయండన్న అన్నా జార్విస్ వేడుకోలు గాలిలో కలిసిపోయింది. గ్రీటింగ్ కార్డుల్లో వ్యక్తమయ్యేది  మొక్కుబడి ప్రేమేననీ, సొంతంగా ఉత్తరం రాస్తే తల్లికి కలిగే తృప్తి వేరనీ -  జార్విస్ చేసిన  విజ్ఞప్తులన్నీ – తల్లి పాలను సయితం లాభాలకు అమ్ముకోవాలనే మార్కెట్ శక్తుల ఎత్తుగడలముందు వెలతెలా పోయాయి. మాతృమూర్తి దినోత్సవం కోసం నిర్విరామగా పోరాడిన అన్నా జార్విస్ – పిల్లలు లేకుండానే, తల్లి కాకుండానే – 1948 లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుమాలిన  పరిస్తితుల్లో కన్నుమూసింది. ఏ తల్లి కోసం ఆమె అంతగా పోరాడిందో – ఆ తల్లి సమాధి చెంతనే అన్నా  జార్విస్ ని    ఖననం చేయడం ఒక్కటే ఆమెకు దక్కింది.


అన్నా జార్విస్ కోరుకున్నట్టుగా – మదర్స్ డే జరుపుకోవడం అనేది ఒక మొక్కుబడి వ్యవహారం కాకుండా చూడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని ఆనాడు అమలుపరచాలి.
మదర్స్ డే నాడు  తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజల్లా  ఆమెతో గడపగలిగితే అంతకు మించిన సార్ధకత వుండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి  ఆమెతో తినిపించగలిగితే మాతృరుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే.     అలా కుదరని పక్షంలో – గ్రీటింగ్ కార్డుతో పాటు స్వయంగా అమ్మకు  రాసిన ఉత్తరాన్ని కూడా జతపరచాలి. తల్లి మనసు తెలుసుకుని ఆమె కోరుకున్న విధంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్తలకు విరాళం పంపాలి. తల్లీ తండ్రి లేని అనాధ
పిల్లలను చేరదీయాలనే నిర్ణయం తీసుకోగలిగితే అంతకు మించిన కానుక ఏ తల్లీ ఆశించదు.
మదర్స్ డే నాడు గుడికి వెళ్ళాల్సిన పనిలేదు. ఇంట్లో వెలిసివున్న మాతృదేవతకు నమస్కరించండి. ముక్కోటి దేవతలు మీ పూజలందుకుంటారు. ఇది సత్యం.

NOTE: All the images in this blog are copy righted to their respective owners.