20, జులై 2021, మంగళవారం

సెంఛురీ దాటిన పెట్రోలు ధర

(ఈరోజు 25-07-2021 ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం) 

పెట్రోలుకు మండే గుణం వుంది. గులాబీ సువాసన గులాబీ ముల్లుకు అంటినట్టు ఈ మండే గుణం పెట్రోలుతో పాటు దాని ధరకు కూడా అబ్బింది. అందుకే  పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా పెట్రో మంటలు అని మీడియాలో చమత్కరిస్తుంటారు.

పెట్రోలు ధర వంద రూపాయలు దాటిపోయింది. దాంతో పాటే డీసెలు ధర కూడా పోటీ పడుతోంది. ఇంకా పెరగడానికి అవకాశం ఉన్న నిత్యావసర వస్తువుల్లో ఈ రెండూ ఏనాడో చేరిపోయాయి. అంచేత ఆశ్చర్యం అనిపించలేదు.

పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటి. నిజానికి ఈ ధరవరల వ్యవహారం ప్రభుత్వం చేతిలో లేకపోయినా ఆ నింద మోయక తప్పదు. ఎందుకంటే ఎంత చేతిలో లేని సంగతి అయినా, ప్రభుత్వం తలచుకోకుండా ఇలాంటివి జరగవు అని స్కూల్లో చదివే పిల్లాడు కూడా చెబుతాడు.

గతంలోను గత ప్రభుత్వాలు ఈ విమర్శలు ఎదుర్కున్నాయి. ఇప్పటి ప్రభుత్వానికీ ఇవి తప్పని తలనొప్పే.

ఈ విమర్శకులు సాధారణంగా తమ వాదనకు మద్దతుగా చెప్పే విషయం ఒకటుంది. అది క్రమంగా ఓ పడికట్టు పదంగా మారిపోయింది. అదేమిటంటే అంతర్జాతీయ చమురు ధరలు, తగ్గుతున్నప్పుడు, లేదా మనం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధరలు పడిపోతున్నప్పుడు, పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎలా పెరుగుతున్నాయి? ఎవరూ వంక పెట్టడానికి వీల్లేని వాదన.

ఒకానొక కాలంలో (అప్పటికే ఈ ఆటోమేటిక్ ధరవరల విధానం అమల్లోకి వచ్చింది, ఇదేమీ కొత్త విషయం  కాదు) అంటే నేను రేడియోలో విలేకరిగా పనిచేస్తున్నప్పుడే నేనూ ఇలాంటి వాదన నెత్తికెత్తుకుని పెట్రోలియం శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారిని అడిగాను.

ఆయన ఏం చెప్పారు అంటే:

“దేశం ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాధన దిశలో వెడుతోంది. కొత్త చమురు నిక్షేపాల అన్వేషణకు, ముడి చమురు వెలికి తీయడానికి, దాన్ని శుద్ది చేయడానికీ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. ఈ పెంచిన ధరల ద్వారా వచ్చిన ఆదాయంలో  కొంత మొత్తాన్ని ఆ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఒక్కసారి ఈ లక్ష్యం నెరవేరితే ఇక దిగుమతుల భారం లక్షల కొట్లలో తగ్గే అవకాశం వుంటుంది”

అంటే అప్పటిదాకా ప్రజలు ఈ పెంచిన ధరలు భరిస్తూ కొంత త్యాగం చేయాల్సి వుంటుంది.

‘బాగానే వుంది మీరు చెప్పిన సంగతి. కానీ భారతీయ పెట్రో సంస్థలు వ్యయ నియంత్రణ పాటిస్తున్నట్టు కనపడదు. పలానా బ్రాండు చమురు (వాహనాల్లో వాడేది) కొనండి అని పత్రికల్లో, మీడియాలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తుంటారు. ఆ ఖర్చు అవసరమా! ఏ ప్రచారం లేకపోయినా, అవసరానికి  కొనే ఉత్పత్తులు అవి. ఇది సరే! ఇంత పేద దేశంలో ఇన్ని రకాల ప్రభుత్వ సంస్థలు అవసరమా! చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు సిబ్బంది, ఇవన్నీ వ్యయాన్ని పెంచేవే కదా!’

ఆ అధికారి నుంచి మందహాసం తప్ప సమాధానం లేకపోవడంతో నేను కాస్త రెచ్చిపోయాను.

‘పెట్రోలు బంకుల ఆధునీకరణ పేరుతొ చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. చైర్మన్లు మారినప్పుడల్లా లోగోలు దేశ వ్యాప్తంగా మారుస్తున్నారు. ఇవన్నీ అవసరమా! పెట్రో ధరలు పెంచడానికి ఇలాంటి అనవసరపు ఖర్చులు కారణం అని ఎవరైనా అనుకుంటే తప్పు పట్టగలరా”

సరే! ఆయన మాత్రం ఏం చెప్పగలరు? 

పెట్రోధరలు పెరిగినప్పుడల్లా  మరోసారి పెరిగాయి అనుకోవడం ఆనావాయితీగా మారింది. అయితే, ఈ ధరల పెరుగుదల  పెట్రోలు, డీసెలుతో ఆగిపోదు. ఈ ప్రభావం పలురంగాలపై పడుతుందన్నది అందరికి తెలిసిందే. ఏతావాతా సామాన్యుడి జీవితంఅలాగే అదనపు ఆదాయానికి ఏమాత్రం అవకాశంలేని స్తిర వేతన జీవుల జీవితం అస్తవ్యస్తమవుతాయి. అసలు ఆదాయాలే ఎరుగని నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గొడవే పట్టదు.

పొతేఈ విషయంపై హోరాహోరి చర్చలు జరిపే వాళ్ళుతమ తమ పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలుప్రతివిమర్శలు చేసేవాళ్ళు యధావిధిగా టీవీ స్టూడియోలకు ఏసీ కార్లలో వెళ్ళివస్తుంటారు. ధర్నాలురాస్తా రోఖోలు ఎటూ తప్పవు. ధరల పెరుగుదలతో వాస్తవంగా దెబ్బతినే కష్ట జీవులను ఈ ఆందోళనలు మరింత కష్టపెడతాయి. కానీఇది ఎవరికీ పట్టదు.

 

ధరలు పెంచినప్పుడల్లా ప్రభుత్వం తను చెప్పాల్సిన లెక్కలు చెబుతుంది. ఎందుకు పెంచాల్సి వచ్చిందోఏ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందో వివరిస్తుంది. (ఈమధ్య అదీ మానేశారు, రోజూ చనిపోయేవాడికోసం  ఏడ్చేవారు ఎవరన్న చందంగా)

పాలక పక్షానికి చెందిన ప్రతినిధులు టీవీ తెరలపై వాలిపోయిఇప్పుడు ఇలా అడ్డగోలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో వున్నప్పుడు ఎన్నిసార్లు పెంచిందీయెంత ఎక్కువగా పెంచిందీ గణాంకాలతో సహా వివరించి వారి నిర్వాకాన్ని ఎండగట్టడం ఒక రివాజుగా మారింది. విపక్షాలు కూడా ఇదే అదననిఎడ్ల బళ్ళురిక్షా బళ్ళు ఎక్కి వూరేగింపులు నిర్వహిస్తూ తమ నిరసనను ఒకటి రెండు రోజుల్లో ముగిస్తారు. ఏనాడూ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలువెచ్చాలు కొనని కొందరు రాజకీయ ఆడంగులు బుల్లి తెరలపై ప్రత్యక్షమై, ‘ఏమీ తినేట్టు లేదు, ఏమీ కొనేట్టులేదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. పెట్రోలు బంకుల దగ్గర టీవీ ఛానళ్ళకు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాళ్ళు ‘ఇదే ఆఖరుసారి బైకు పై తిరగడం’ అన్న తరహాలో మాట్లాడుతారు. ఆటోవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టించుకోరు. ప్రయాణీకుల ముక్కు పిండిపెరిగిన ధరలకు రెండింతలు చార్జీలు వసూలు చేస్తారు.

 

పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారితే మళ్ళీ అన్ని వాహనాలు రోడ్లమీదే. ట్రాఫిక్ జాములు మామూలే. ప్రత్యక్షంగా భారం పడ్డవాళ్ళు పది రోజుల్లో మరచిపోయి మామూలుగా మనుగడ సాగిస్తుంటారు. పరోక్షంగా భారం పడ్డవాళ్ళు మౌనంగా భరిస్తుంటారు. ప్రతిదీ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలభారం అంతా మోస్తున్నట్టు నటిస్తుంటారు. పెంచి కూర్చున్న సర్కారువారు మాత్రం అంతా అదే సర్దుకు పోతుందిలే అన్న నిర్వికార ధోరణి ప్రదర్శిస్తూవుంటారు. 

ఇదంతా ఎందుకు జరుగుతోంది ? 

మన చేతుల్లో వున్నదాన్ని పక్కవాళ్ళ చేతుల్లోపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడంవల్ల. 

వున్న దానితో సర్దుకుపోవడం మాత్రమే కాకుండా ఎంతో కొంత వెనకేసుకునే పాతతరం నుంచివున్నదంతా ఖర్చుచేసుకుంటూ జల్సాగా బతకాలనే మరోతరం నుంచిఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవాలనే ఇంకోతరం నుంచిఅలా పెంచుకోవడానికి అడ్డదారులతో సహా ఏ దారయినా సరయిన రాదారే అని అనుకునే ప్రస్తుత తరం దాకా విషయాలను విశ్లేషించుకోగలిగినవారికి ఇదేమంత వింతగా తోచదు. అమ్మేటప్పుడు ధర పలకాలికొనేటప్పుడు చవుకగా దొరకాలి అనే తత్వం నుంచి బయటపడగాలి.

‘ధరలన్నీ చుక్కలు తాకుతున్నాయిఎగష్ట్రా ఇవ్వకపోతే యెట్లా’ అనే ఆటో డ్రైవర్, సిటీ బస్సుల స్ట్రయిక్ అనగానే ఆటో చార్జీలు అమాంతం పెంచడం అందరికీ తెలిసిందే. అంటేఅవకాశం దొరికితే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం తప్పుకాదనే ధోరణి ప్రబలుతోంది.

ఇది సమాజంలోని అన్ని వర్గాలకు వర్తిస్తుందికాణీకి టిఖానా లేని దరిద్రనారాయణులకు తప్ప.

19, జులై 2021, సోమవారం

అభ్యసన అనగానేమి? – భండారు శ్రీనివాసరావు

భాష పరిపుష్టి కావాలంటే కొత్త పదాలు పుట్టాల్సిందే. అలా పుట్టించిన వాళ్లకి వీర తాళ్ళు వేయాల్సిందే. కాదనను. కానీ అనువాదం పేరుతొ పుట్టించే కొత్త అనువాద పదాలతోనే చిక్కంతా.

అభ్యసన అనే పదం ఇంతవరకు లేదు అని కానీ, అది తెలుగు పదం కాదని కానీ నేను అనను. కానీ అటువంటి పదాలు కేవలం అనువాదం కోసమే వాడడం అంత శోభస్కరం కాదేమో.
ఈ వార్త చూడండి.



“ఆన్ లైన్ లో అభ్యసన అంతంతే!”
అదీ ఈ వార్తకు పెట్టిన శీర్షిక.
ఆన్ లైన్ అనే ఇంగ్లీష్ పదానికి, ఒక ‘లో’ అనే అక్షరం చేర్చి దాన్ని అలవోకగా తెలుగు పదంగా చేసుకోగలిగినప్పుడు ఈ అభ్యసనకు మూలమైన ఆంగ్ల పదాన్ని ఎందుకు తెలుగుగా మార్చుకోకూడదు అనేది నా ప్రశ్న.
పోనీ ఎలాంటి పరిస్థితిలో కూడా ఆంగ్ల పదాలు రాకుండా చూడాలి అనే తపన వుంటే అదో మాట.
ఇదే వార్తలో ఎన్ని ఆంగ్ల పదాలు వున్నాయో ఒకసారి చూస్తే ఆ ఉద్దేశ్యం కూడా లేనట్టు అనిపిస్తుంది.
ఈ-తరగతి, క్లాసు, సర్వే, యూనివర్సిటీ, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, సొల్యూషన్, ప్రొవైడర్, టీం లీజ్ ఎడ్ టెక్, ప్రమోట్, రిజిస్ట్రార్, డైరెక్టర్ ఇలా అనేకానేక ఇంగ్లీష్ పదాలతో ఈ వార్తను కూర్చినప్పుడు, ఒక్క అభ్యసన అనే పదానికి మూలమైన ఆంగ్లపదం ఏం పాపం చేసుకున్నట్టు?
సాటి జర్నలిస్ట్ సోదరులను ఎద్దేవా చేయడం కోసం రాసింది కాదిది.
పాఠకులకు అర్ధం అయ్యే అనువాదాలు చేయాలని మాత్రమే కోరేది.
(19-07-2021)

పార్లమెంటు సమావేశాలు

 ఈరోజు  సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు.

సాంప్రదాయకంగా  జరిగే అఖిలపక్ష సమావేశం ఒక రోజు ముందుగా  నిర్వహించారు. సభ సజావుగా సాగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం, ప్రజాసమస్యల ప్రస్తావన చేయడానికి తమకు తగినంత వ్యవధానం ఇవ్వాలని విపక్షాలు పరస్పరం విన్నవించుకున్నాయి. అలా ఈనాటి సమావేశంలో ఉభయులు అంగీకారానికి వచ్చినట్టు టీవీల్లో స్క్రోలింగులు అయితే పరుగులు తీసాయి.

ఈ బుద్ధి బుధవారం దాకా వుంటే బూరెలు వండి పెడతాను అందట ఓ భార్య మొగుడితో.

చూద్దాం ఏం జరుగుతుందో!

 

17, జులై 2021, శనివారం

దేవుళ్ళు మిస్సింగ్

 ఏదో ఛానల్ కు వెళ్ళి ఇంటికి తిరిగొచ్చేసరికి ముక్కోటి దేవుళ్ళందరూ హూష్ కాకి.



మిస్సింగ్ కేసు కాదనీ,

వాళ్ళందరికీ మా ఆవిడ గ్రహణం విడుపు అభ్యంగనస్నానం చేయిస్తోందని ఆలస్యంగా అందిన సమాచారం.



అమ్మయ్య! గ్రహణం విడుపు స్నానాలు పూర్తయి దేవుళ్ళందరూ తమ గూటికి చేరారు. పుష్పా‌లంకరణ ఒక్కటే ఈ పూటకి మిగిలింది.

ఆ పని కూడా పూర్తి చేస్తేనే కానీ మా ఆవిడ టీవీ రిమోట్ ముట్టుకోదు. సీరియళ్ళ రేటింగుల్లో కాస్త ఆటుపోట్లు వుండే అవకాశం వుంది.

 

17-7-2019

 

సరిగ్గా నెల తర్వాత ఆ దేవుళ్ళు అందరూ వున్నారు, ఒక్క మా ఆవిడ తప్ప.

 

16, జులై 2021, శుక్రవారం

మా ఆవిడతో మాట్లాడాలని వుంది

 

ఒకటే హడావిడి. ఒక్క నిమిషం టైం లేదన్నట్టు రోజులు గడిచిపోయాయి. ఆఖరికి భార్యతో ఒక మాటా లేదు, ముచ్చటి లేదు.
జర్నలిస్టుల జీవితాలే అంతా. లేక నా బతుకే అంతా.
కరోనా అంటే ఏమిటో తెలియకుండా తను దాటి పోయింది. ఒక రకంగా అదృష్టవంతురాలు అన్నారు. అందరు చుట్టపక్కాలు, బంధు మిత్రుల నడుమ ఆమె అంత్యక్రియలు జరిగాయి. అదే ఇప్పుడయితే!
అంతవరకూ ఆమె అదృష్టవంతురాలే. అసలు దురదృష్టవంతుడిని నేను. కాలికి బలపం కట్టుకుని తిరిగిన నేను గత రెండేళ్లకు పైగా ఇంటిపట్టునే పడి ఉంటున్నాను. ఆమె ఎప్పుడూ కోరుకుని, పైకి చెప్పని కోరిక అది.
ఒకప్పుడు అది అసాధ్యం. ఎప్పుడూ ఎవరో ఒకరు. ఏదో ఒక ఫోను. పగలు లేదు, రాత్రి లేదు. ఎక్కడో ఒక చోట గంటలు గంటలు వుండిపోవడం. ఇంటికి వస్తే వెంట నలుగురు. కాఫీలు, టీలు, భోజనాలు. నాకు తీరిక లేదు. అంచేత ఆమెకు తీరిక వుండేది కాదు.
అంతా అయిన తర్వాత, అందర్నీ పంపించిన తర్వాత ఏమిటి ఈరోజు విశేషాలు అని అడిగేది. చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, రాజకీయాలు ... ఈ సంగతుల మీద ఆమెకు ఏమి ఆసక్తి.
రిటైర్ అయిన తర్వాత కూడా ఇదే తీరు. ఉదయం ఆరింటికి లేస్తే ఏదో ఒక టీవీ. తను నాకంటే ముందే లేచి కాఫీ పెట్టి ఇస్తే తాగి బయట పడితే మళ్ళీ ఎప్పుడో.
‘అత్తయ్య! చూస్తున్నావా మామయ్య టీవీలో మాట్లాడుతున్నాడు’
ఫోన్లో నా మేనకోడళ్ళు ఎవరో అడిగేవాళ్ళు.
‘ఏఛానల్లో’ అనేది తను నిరాసక్తంగా.
నేను ఏ ఛానల్ కు వెడుతున్నానో తనకి తెలియదు. తెలిసినా చూసేది కాదు.
‘ఏమిటండీ ఆ పోట్లాటలు. అంతోటి వాటిని పనికట్టుకుని చూడాలా’ అనేది.
ఈ కరోనా కాలంలో తను ఉన్నట్టయితే ఎంత బాగుండేదో. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వుండేవాళ్ళం.
అది కూడా నేను బయటకు పోయే ఛాన్స్ లేదు కాబట్టి.



(16-07-2021)

కాలం చెల్లినవాటికి చెల్లుచీటీ – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhraprabha dated 18-07-2021, SUNDAY)

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చక్కని మాట చెప్పారు.

కాలం చెల్లిన చట్టాలకు ఇకనైనా చెల్లు చీటీ రాయాలని.

భేషైన మాట. అందరి మనసులో వున్న మాట.

భారత శిక్షాస్మృతి లోని 124 -ఏ సెక్షన్ అనేది ఈనాటిది కాదు. దేశానికి స్వాతంత్రం రానప్పుడు, 1860 లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారి శిక్షాస్మృతిని అమల్లోకి తెచ్చింది. మొదట్లో దేశద్రోహ నేరానికి సంబంధించిన ఈ 124 -ఏ సెక్షన్ అనేది భారత శిక్షాస్మృతి (ఐ.పి.సి.) లో లేదు. తర్వాత పదేళ్లకు అంటే 1870లో ఈ నిబంధనను కొత్తగా చేర్చారు. జాతిపిత గాంధీజీ  పుట్టి ఆనాటికి ఏడాది మాత్రమే అయింది. తదనంతర కాలంలో అంటే స్వాతంత్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజుల్లో ఈ సెక్షన్ ను నాటి బ్రిటిష్ పాలకులు దుర్వినియోగం చేస్తున్న తీరుకు కినిసి, మహాత్మా గాంధి సయితం ఈ సెక్షన్ ను గట్టిగా వ్యతిరేకించారు. పౌరుల స్వేచ్ఛను అణచివేయడానికే దీన్ని రూపొందించారని ఆయన పలుమార్లు విమర్శించారు. గాంధీజీ ఒక్కరే కాదు, స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సయితం, ప్రధాని హోదాలోనే ఈ  125 -ఏ సెక్షన్ ను తప్పుబట్టారు.

”ఇది చాలా చెడ్డది. ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది” అని అనేవారు.

నెహ్రూ చనిపోయి ఏండ్లూపూండ్లు గడిచిన తర్వాత కూడా ఏ పాలకులు కూడా ఈ సెక్షన్ గురించి పట్టించుకోకపోవడంతో ఈ బ్రిటిష్ చట్టం 150 ఏళ్ళ నుంచి అమల్లోనే వుంది. ఉపయోగించిన సందర్భాలు, విచారణ జరిగి శిక్షలు పడిన సందర్భాలు తక్కువే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో ఇంకా రాజద్రోహ చట్టం ఏమిటి అనే ప్రశ్నకు సరయిన జవాబు ఇంకా దొరకలేదు.

గతంలో కూడా  124 -ఏ సెక్షన్ న్యాయస్థానాల దృష్టికి రాకపోలేదు. 1958 లోనే అలహాబాదు హైకోర్టు ఈ సెక్షన్ రాజ్యాంగ వ్యతిరేకమని అంటూ దాన్ని కొట్టివేసింది. దరిమిలా పంజాబు హైకోర్టు సయితం కొట్టివేసింది. అయితే సుప్రీంకోర్టు ఒక కేసును విచారిస్తూ ఈ రెండు హైకోర్టుల తీర్పులను పక్కన పెట్టింది. ఈ సెక్షన్ రాజ్యాంగపరంగా చెల్లుతుందని, అయితే అదొక మినహాయింపు మాత్రమేనని పేర్కొంది. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది రాజద్రోహ నేరం కాదని స్పష్టం చేసింది. దాంతో ఈ చట్టానికి మళ్ళీ సంజీవని పుల్ల తాకించినట్టు అయింది.

ఇప్పుడు మళ్ళీ ఎడిటర్స్ గిల్డ్ తో పాటు ఒక మాజీ సైనికాధికారి ఈ అంశంపై వేసిన పిటీషన్లను సుప్రీం ధర్మాసనం గత గురువారం నాడు విచారణకు స్వీకరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంతో ఈ అంశం మళ్ళీ దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్రమైన వాడివేడి చర్చలకు కారణమయ్యాయి.

“వలసవాద ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం ఇంకా ఎన్నాళ్ళు? రాజద్రోహం సెక్షన్ ను ఎందుకు రద్దు చేయడం లేదు? స్వాతంత్రోద్యమ కాలంలో గాంధి, బాలగంగాధర్ తిలక్ వంటి నాయకుల నోళ్ళు నొక్కడానికినాటి ప్రభుత్వం ఈచట్టాన్ని వాడుకుంటే, ఈనాడు అదే చట్టాన్ని అధికారులు ఎడాపెడా వాడేస్తున్నారు” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ అని వ్యాఖ్యానించారు.

సుప్రీం తన అభిప్రాయం తెలిపింది. అయితే దీనిమీద కేంద్రం ఏ చర్య తీసుకుంటుందో చూడాల్సివుంది. సుప్రీం సూచనలకు అనుగుణంగా 124 -ఏ సెక్షన్ ను రద్దు చేయాలని నిర్ణయిస్తే ఏ పేచీ వుండదు.

ఏ చట్టాన్ని  అయినా దాన్ని రద్దు చేసేంతవరకు అది చట్టం దృష్టిలో చెల్లుబాటు అయ్యే చట్టమే అని కొందరు న్యాయ కోవిదులు అంటున్నారు.

లోగడ కృష్ణయ్యర్ గారని ఓ న్యాయాధిపతి వుండేవారు. ఆయనది ఓ కొత్తదారి. పేరుకు ముందు జస్టిస్ అని తగిలించకపోయినా ఏమీ అనుకునేవారు కాదు. జడ్జీలకు, న్యాయవాదులకు మధ్య సాంప్రదాయ గౌరవవాచకాలు ఆయనకు గిట్టేవి కావు. న్యాయమూర్తులు  పొడుగుపాటి గౌన్లు, రోబ్స్ ధరించాలనే సాంప్రదాయాలు ఆయనకు నచ్చేవి కావు. అంతే కాదు, న్యాయ పీఠం మీద కూర్చున్న న్యాయమూర్తికి, కోర్టులో వాదించే న్యాయవాదులకు నడుమ దూరం పాటించడం, జడ్జీలు తమ ఆసనాలపై  కూర్చునేటప్పుడు, తిరిగి లేచేటప్పుడు  బంట్రోతులు వారు ఆసీనులు కావడానికి, లేవడానికి  వీలుగా వారి ఆసనాలను వెనక్కీ ముందుకు జరపడం అసలు ఇష్టపడేవారు కాదు. ‘లీగల్లీ స్పీకింగ్’  అనే పేరుతొ రాసిన పుస్తకంలో జస్టిస్ కృష్ణయ్యర్ ఈ అంశాలను పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో ఇటువంటి సమూల సంస్కరణలు రావాలని ఆయన కోరుకున్నారు కానీ ఆయన జీవిత కాలంలో నెరవేరలేదు.

ఇప్పుడు మళ్ళీ న్యాయ వ్యవస్థలో సంస్కరణలు గురించిన మాటలు వినబడుతున్నాయి. మంచిదే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా పలుసందర్భాలలో ఈ విషయం ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఒక అడుగు అంటూ ముందుకు పడితే అది భారీ సంస్కరణలకు దోహదపడే అవకాశం వుంటుంది.

అచ్చంగా ఇలాంటిది కాకపోయినా కాలం చెల్లిన తర్వాత కూడా చెల్లుబాటులో ఉన్న కొన్ని అంశాలు మనకు చరిత్రలో దొరుకుతాయి.

వాటిల్లో కొన్ని.

ఉద్యోగం వుండదు కానీ ఉద్యోగం చేసే ఉద్యోగి ఉంటాడు. ఇదెక్కడి విరోధాభాసం అంటారా!

మనలో చాలామంది హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రాన్ని ఎప్పుడో ఒకప్పుడు సందర్శించే వుంటారు. రేడియో కేంద్రం సింహద్వారం పక్కనే ఓ స్తంభానికి వేలాడుతూ తళతళ మెరుస్తూ వుండే ఓ ఇత్తడి గంట కనిపిస్తుంది.

రేడియో స్టేషన్ లో ఈ ధర్మగంట అవసరం ఏమిటి? అనే ఆలోచన నిత్యం  నన్ను వేధిస్తూ వుండేది.(అక్కడ పనిచేసే రోజుల్లో)

విచారించగా తెలిసింది ఏమిటంటే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినప్పుడు, అదే సమయంలో  కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అందరినీ అప్రమత్తం చేయడానికి ఆ గంటను మోగిస్తారని  తెలిసింది.  మూడు దశాబ్దాల నా ఉద్యోగపర్వంలో ఒక్కసారి కూడా ఆ గంట మోగించిన దాఖలా లేదు. ఆ గంటను శుభ్రంగా తుడిచి పదిలంగా కాపాడడానికి  ప్రత్యేకంగా ఓ ఉద్యోగి వుండేవాడేమో కూడా తెలియదు.

ఒకానొకకాలంలో, బహుశా స్వాతంత్రానికి పూర్వం అనుకుంటాను,  భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వ వైద్యులకు రవాణా సదుపాయాలు సరిగా ఉండేవి కావు. రహదారులు అధ్వానంగా ఉండేవి. ఎటు పోవాలన్నా ఎడ్ల బండ్లే శరణ్యం. ఆ రోజుల్లో, అలాంటి ప్రాంతాల్లో  ప్రభుత్వ వైద్యులకు జీపు బదులు ఎడ్ల బండి ఏర్పాటు వుండేది. ఒక బండి, అది సర్కారు వాహనం కాబట్టి  జత ఎడ్లు,  వాటికి  గ్రాసం, బండిని నడపడానికి జీపు డ్రైవర్ మాదిరిగా ఒక పనివాడు, ఈ తతంగం అంతా నడవడానికి ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల చెల్లింపు  ఇలా సాగిపోయేది.

కొన్నేళ్ళ తరువాత ఆ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కొద్దో గొప్పో మెరుగు పడడం వల్ల సర్కారీ విల్స్  జీపులు రంగ ప్రవేశం చేయడంతో, ఎడ్లబండ్ల అవసరం లేకుండాపోయింది. అయినా కూడా చాలా కాలంపాటు ఆ వ్యవస్థ రికార్డుల్లో కొనసాగేది అని చెప్పుకునేవారు. 1970 ప్రాంతాల్లో అక్కడ పనిచేయడానికి వెళ్ళిన ఒక డాక్టరు గారికి మనుషులకు  వైద్యం చేసే  దవాఖానాలో ఈ పశుగ్రాసం బిల్లులేమిటి అని అనుమానం వచ్చి ఆరా తీస్తే ఈ అసలు విషయం బయట పడింది.

మనలో చాలామంది పూర్వపు తహసీల్ కచేరీలు చూసి వుంటారు.  పంకాలు లేని ఆ కాలంలో తహసీల్ దొరగారు కూర్చొనే సీటు మీద ఒక పెద్ద గుడ్డ పంకా వుండేది. ఒక బంట్రోతు దొరవారు దాన్ని అటూఇటూ తాడుతో లాగుతూ వుంటే అయ్యవారు మెల్లగా వీచే ఆ చల్లగాలిలో సేద తీరుతూ రాచకార్యాలు చక్కబెడుతూ వుండేవారు.

తరవాత్తరవాత విద్యుత్ పంకాలు వచ్చాయి కానీ గుడ్డ పంకాలు లాగే కొలువు మాత్రం చాలాకాలం కొనసాగింది.

మన దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని అన్ని స్థాయిల్లో రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు పుట్టుకు వచ్చాయి. మా చిన్నతనంలో మా ఊరికి వి.ఎల్.డబ్ల్యు. అనే  ఉద్యిగి కొత్తగా వచ్చాడు. అప్పటిదాకా కరణం, మునసబు మాత్రమే ప్రభుత్వం అనుకునేవారు. అలాగే బ్లాకు డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీవో) ఉద్యోగం కూడా కొత్తగా వచ్చిందే. ఇప్పుడు అవే ఉద్యోగాలు  పాతపడి పేర్లు మారిపోయి వుంటాయి.

‘ఒక గుంతను తవ్వు. ఆ గుంతను పూడ్చు. గుంత తవ్విన వాడికి ఓ ఉద్యోగం, దాన్ని పూడ్చిన వాడికి మరో ఉద్యోగం” ఈ పద్దతిలో అనేక ఉద్యోగాలు. అయినా దేశంలో నిరుద్యోగ సమస్య అలాగే వుంది.

(EOM)

15, జులై 2021, గురువారం

డాక్టర్ కె.ఎల్. రావు రోడ్డు - భండారు శ్రీనివాసరావు

(జులై,15, డాక్టర్ కె.ఎల్.రావు జయంతి)

హిందూ పత్రిక డిప్యూటీ ఎడిటర్ కీర్తిశేషులు శ్రీ ఆర్. జే. రాజేంద్రప్రసాద్ గారు హైదరాబాదు రాకముందు నుంచి కూడా నాకు తెలుసు. నేను విజయవాడలో ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ఆయన అక్కడే హిందూ పత్రికకు ROVING CORRESPONDENT గా వున్నారు. వార్తలకోసం చుట్టుపక్కల జిల్లాలు తిరుగుతుండేవారు.
ఆ రోజుల్లో ఒకసారి మా వూరికి మా పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. ఆ సందర్భంలో రాజేంద్రప్రసాద్ గారు 'మీ ఊరు పోతున్నాను, మీరూ వస్తారా' అని అడిగారు. 'అది అంత సులభం కాదండీ, ప్రయాణంలో చాలా అవస్థలు పడాలి' అన్నాను. 'అవస్థలు పడితేనే కదా మనకి వార్తలు దొరుకుతాయ'ని ఆయన అన్నారు.
సరే అని ఇద్దరం బెజవాడ నుంచి రైల్లో బయలుదేరాము. ఉదయం నైజాం పాసింజరులో వెళ్లి రెండు గంటల తర్వాత మోటమర్రి (అంతకుముందు అల్లినగరం) స్టేషనులో దిగాము. వర్షాకాలం. దోవ అంతటా చిత్తడి చిత్తడిగా వుంది. నాలుగు మైళ్ళు నడిచి వెడితే మా వూరు కంభంపాడు. చెప్పులు చేతిలో పట్టుకుని నడక మొదలు పెట్టాము. బురద నేలల్లో మోకాళ్ళ దాకా కాళ్ళు కూరుకుపోతున్నాయి. పాపం పట్టణం నుంచి వచ్చి ఎన్ని అవస్థలు పడుతున్నారో అనిపించింది. కానీ ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన మార్కు మందహాసంతో దారిపొడుగునా కబుర్లు చెబుతూనే వున్నారు. జొన్నచేలు దాటి, మా వూరు పొలిమేరల్లో వరిపొలాల గట్ల మీద నడుచుకుంటూ మొత్తం మీద మా వూరు చేరాము.
పల్లెటూరు కదా టిఫిన్ల మాట ఎత్తకుండా మా అమ్మగారు ఏకంగా భోజనాలకే లేపారు. మా బామ్మగారు ఎవర్రా వచ్చింది, తాసీల్ దారా అని అడుగుతోంది. భోజనాలు అయిన తర్వాత ప్రసాద్ గారు వూళ్ళో తిరిగి వద్దామన్నారు. వచ్చింది పేపరు మనిషి అని వూరి వాళ్ళకి తెలిసిపోయింది. ఆయనతో చెప్పుకుంటే పేపర్లో రాస్తారు, తమ కష్టాలు తీరిపోతాయని అందరూ ఆయన చుట్టూ మూగి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రసాద్ గారు పరమ ప్రశాంతంగా వాళ్ళు చెప్పిన ప్రతిదీ ఓపిగ్గా విన్నారు. కే.ఎల్. రావు గారు మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.
మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు ఆకాశంలో చుట్టూ గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.
ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.
అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి నిష్క్రమించారు. వచ్చింది హిందూ కరస్పాండెంటు కాబట్టి ప్రసాద్ గారితో కాసేపు విడిగా మాట్లాడారు.
మర్నాడు బయలుదేరి మేమిద్దరం బెజవాడ వచ్చేసాము.
ఆ తర్వాత మూడో రోజనుకుంటాను హిందూలో ఓ బాక్స్ ఐటం వార్త వచ్చింది. సరైన రోడ్లు లేక దారి తప్పిన కేంద్రమంత్రి అంటూ. కేంద్ర మంత్రి తనతో మాట్లాడిన విషయాలను క్లుప్తంగా ప్రస్తావించి, వూరి వాళ్ళు తనతో చెప్పుకున్న కష్టాలను వివరంగా రాసారు.
ఆ వార్త వచ్చిన కొద్ది రోజులకే, కే.ఎల్. రావు గారు శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి.
కే.ఎల్. రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు.
అయితే దండలో దారం మాదిరిగా ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన వార్త ప్రభావం ఈ అభివృద్ధిలో వుంది.
దానికి ప్రత్యక్ష సాక్షులలో నేనొకర్ని.
తోకటపా: ఆ రోడ్డుకు ఎవరూ పనికట్టుకుని పేరు పెట్టలేదు. ఆ నలభయ్ గ్రామాల ప్రజలే ఈనాటికీ దాన్ని కె.ఎల్.రావు రోడ్డు అని పిలుచుకుంటున్నారు.
(15-07-2021)