19, జూన్ 2021, శనివారం

థర్డ్ వేవ్ లో వీళ్ళే సూపర్ స్ప్రెడర్స్ .. తస్మాత్ జాగ్రత్త | MAHAA NEWS

థర్డ్ వేవ్ పక్కా.. డేంజర్ లో భారత్.. డాక్టర్ సంచలనం | MAHAA NEWS

సుదీర్ఘ విరామం తర్వాత సాధారణ జనజీవనం దిశగా తెలంగాణా – భండారు శ్రీనివాసరావు

 లాక్ డౌన్ విధించడానికన్నా లాక్ డౌన్ ఎత్తివేయడానికి ముందు చూపు కావాలి. లాక్ డౌన్ కాలంలో ఆంక్షలు పాటించేలా చూస్తే సరిపోతుంది. కానీ ఎత్తివేసినప్పుడు జనం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం వుంది. పైగా మూడో వేవ్ ముంచుకు వస్తోందని హెచ్చరికలు వస్తున్న తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా, జాగరూకులుగా ఉండాల్సి వుంటుంది. గతంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన సమయంలో చూశాము. జనం ఒక్కసారిగా వీధుల్లోకి ఎగబడ్డారు. రేపటి నుంచి ఎలాటి ఆంక్షలు ఉండవని అంటున్నారు. సినిమా హాళ్ళు తెరవడానికి సిద్ధం అంటూ అప్పుడే ప్రకటనలు వెలువడుతున్నాయి. విధి విధానాలు ఏమిటో పూర్తిగా ఇంకా వెలుగులోకి రాలేదు. కానీ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. జులై నుంచి స్కూళ్ళు తెరుస్తారు. అలాగే సినిమా హాళ్ళు, జనం పోగయ్యే బార్లూ, క్లబ్బులూ తెరుచుకోవచ్చు. వాళ్ళు వరసలో మొదటే వుంటారు. మెట్రో రైళ్లు, లోకల్ రైళ్లు, సిటీ బస్సులు, జిల్లాల బస్సులు యధాతధంగా నడిచే అవకాశం వుంది. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర మంత్రివత్గం తీసుకున్న ఈ నిర్ణయంలోని పూర్తి వివరాలు వెల్లడవుతాయి. లాక్ డౌన్ ఎత్తివేయడం అంటే నిరుడు మార్చిలో లాక్ డౌన్ విధించడానికి ముందున్న పరిస్థితి అన్నమాట. అంటే పదిహేను మాసాల క్రితం రాష్ట్రంలో జనజీవనం ఎలా సాగేదో మళ్ళీ అలాగే మొదలవుతుందని అర్ధం చేసుకోవచ్చు.

ఒక పక్క కేంద్రం మూడో వేవ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. లాక్ డౌన్ విడతల వారీగా సడలిస్తే మంచిదని సూచనలు చేస్తోంది. అయితే ఈలోగా రాష్ట్ర మంత్రివర్గం లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది.
ఇక ఇప్పుడు బంతి ప్రజల కోర్టులో పడింది. స్వీయ నియంత్రణ పాటించాల్సిన బృహత్తరమైన బాధ్యత వారిపై వుంది. ఎవరు తేలిగ్గా తీసుకున్నా దాని దారుణ ప్రభావం సమాజం మొత్తం పైనా పడుతుంది.
స్కూల్లు తెరవడానికి మరో పది రోజుల వ్యవధానం వుంది. ఈ లోగా వాటిని పరిసరాలను పూర్తిగా శానిటైజ్ చేయించాలి. అలాగే సిటీ బస్సులు, రైళ్లు. సినిమా హాళ్ళు తెరవడానికి సిద్ధం అని యజమానులు అంటున్నారు. ఇన్నాళ్ళు మూతపడిన వాటిని తెరిచేముందు మళ్ళీ జాగ్రత్తగా శానిటైజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. అలాగే క్లబ్బులు, బార్ల యజమానులు కూడా.
జనం కూడా తెరవగానే వాటిపై విరగబడడం మానుకోవాలి. కొన్నాళ్ళు వేచి చూసిన తర్వాతనే బార్లకు, క్లబ్బులకు, సినిమాలకు వెళ్ళడం మంచిది.
(19-06-2021)

18, జూన్ 2021, శుక్రవారం

విగ్రహాలు, వివాదాలు – భండారు శ్రీనివాసరావు

 రాజకీయ నాయకుల విగ్రహాలు మన రాష్ట్రంలో ఏమూలకు పోయినా కానవస్తాయి. ఎవరి మీది అభిమానంతో ఈ విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారో వారి కనీస పోలికలు చాలా వాటిల్లో  మచ్చుకు కూడా కానరావు. కొన్నింటిని ప్రతిష్టించి ఆవిష్కరించాల్సిన వీఐపీకి తీరుబడి దొరకలేదనే కారణంతో వాటికి ముసుగుకప్పి నడిబజారులో ముసుగు వీరుల్లా  వొదిలేస్తారు. వారి భక్తి తాత్పర్యాలు విగ్రహం తాలూకు నాయకుడి మీదో, సమయం దొరకని ప్రస్తుత నాయకుడి మీదో తెలియక దారినపోయే దానయ్యలు తలలు పట్టుకుంటారు. ఆ విగ్రహాల కారణంగా సామాన్య జనజీవనానికి ఏమైనా అసౌకర్యం కలుగుతోందా అన్న విషయం కూడా వారికి పట్టకపోవడం మరో దౌర్భాగ్యం.  

   

'విగ్రహారాధన కూడదు' అని ప్రబోధించిన గౌతమ బుద్దుడు జన్మించిన  పుణ్య భూమి మనది. అయినా  విగ్రహాలకు మాత్రం  ఏమాత్రం కొరత లేదు. విగ్రహాలు వద్దన్న బుద్దుడి  విగ్రహాలే భారీ సైజుల్లో దేశం నలుమూలల్లో కానవస్తాయి. ఇక  ప్రసిద్ధ హిందూ  ఆలయాల్లో కొలువై వున్న దేవతా విగ్రహాలు చాలావరకు స్వయంభూవిగ్రహాలుగా అవతరించాయని చెబుతారు. ఇవి కూడా జన సంచారానికి దూరంగా అధిక భాగం కొండలు, కోనల్లో వెలిశాయి. కాలక్రమేణా ప్రసిద్ధ ఆలయాలుగా ప్రాచుర్యం పొందాయి. లౌకిక వ్యవస్థకు పెద్ద పీట వేసిన స్వతంత్ర భారతంలో ఆయా మత విశ్వాసాలకు తగిన ఆలయాలు అనేకం వున్నాయి. దైవానికి ఒక రూపం అంటూ లేదని నమ్మే మతాలవారు కూడా విగ్రహాలు లేని ప్రార్ధనా మందిరాలు అనేకం ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఆలయాలను సందర్శించే  యాత్రీకుల సంఖ్య సయితం  నానాటికీ బాగా పెరుగుతూ వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాల పుణ్యమా అని కుల మతాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తమ అవసరాలకోసం రాజకీయ పార్టీలు కూడా ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. మతం అనేది ఒక జీవన విధానంగా రూపుదిద్దుకున్న దేశంలో, ఈనాడు మతం దేశాన్ని ముక్కలుచేసే ప్రతీప శక్తిగా మారుతూ వస్తోంది. రాజకీయాల రణగొణ ధ్వనుల్లో ఈ సంకేతాల సవ్వడులు వినరాకుండా పోతున్నాయి.

 

మత ప్రాతిపదికగా దేవాలయాల్లో వుండే ఈ విగ్రహాలవల్ల జనాలకు కలిగే ఇబ్బంది ఏమీ లేదు. కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు అనేవే ఇటీవలి కాలంలో వివాదగ్రస్తం అవుతున్నాయి. ఒకప్పుడు  మూడుపూలు ఆరుకాయలుగా ప్రాభవం పొంది మహనీయులుగా, మానవీయులుగా  వెలుగొందిన వ్యక్తుల విగ్రహాలు తదనంతర కాలంలో వారు నడిపిన రాజకీయాలకు కాలం చెల్లగానే, ఆ విగ్రహాలు కూడా చెల్లని కాసుల్లా తయారవుతున్నాయి. మన దేశంలోనే  కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ఇటువంటి పరిణామాలు పలుచోట్ల చోటు చేసుకున్న సందర్భాలు వున్నాయి. మునుపటి సోవియట్ యూనియన్ లో,  స్టాలిన్ శకంలో ఊరూరా వెలిసిన అయన విగ్రహాలకు తదనంతర కాలంలో పట్టిన దుస్తితి చరిత్ర రికార్డుల్లో  నమోదయివుంది. ఆఖరికి లెనిన్  మసోలియంలో అయన భొతిక కాయం సరసనే భద్రపరచిన స్టాలిన్ శరీరాన్ని వెలికి తీసి వేరే చోట ఖననం  చేయడం కూడా జరిగింది. కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా రాజకీయాలు చేసిన వాళ్ళకు వర్తమానం మినహా భవిష్యత్తు ఉండదని చరిత్రచెప్పే పాఠాలు తలకెక్కించుకునే విజ్ఞత లోపిస్తోంది.  కొందరు మరణించిన తరువాత కూడా జీవిస్తారు. కొందర్ని జీవించి ఉండగానే జనం జ్ఞాపకాల్లో వారి ఆనవాళ్ళు  లేకుండా చేస్తారు. రాజకీయానికి జాలీ దయా వుండవు.       

మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 'విగ్రహారాధన' అంబరాన్ని తాకింది. నాటి గౌతమ బుద్దుని నుంచి మొదలుకుని  బడుగు బలహీన వర్గాల నాయకులు రవిదాస్, నారాయణ గురు, జ్యోతీరావు పూలే, షాహూజీ మహారాజ్, పెరియార్ రామస్వామి, బాబా సాహెబ్ అంబేద్కర్, బీ.ఎస్.పీ. సంస్థాపకుడు కాంషీరామ్ విగ్రహాలను కూడా మాయావతి ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నెలకొల్పారు. మరీ విచిత్రం ఏమిటంటే తన విగ్రహాల ఏర్పాటు పట్లకూడా మాయావతి మక్కువ ప్రదర్శించడం.  2007 నుంచి రెండేళ్ళ  కాలంలో మాయావతి ఈ నాయకుల  స్మారక చిహ్నాల నిర్మాణాలపై వందలకోట్లు ఖర్చు చేసారు.  

ఇక మీరట్ లో అఖిల భారత హిందూ మహాసభ, ఓం శివ మహాకాల్ సేవా సమితి కలిసి ఏకంగా నాధూరాం గాడ్సే విగ్రహ స్థాపనకు నడుం బిగించాయి. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే విగ్రహం ఏర్పాటు అయితే అది మొత్తం దేశంలోనే మొట్టమొదటి గాడ్సే విగ్రహం అవుతుంది. మీరట్ లో ఇందుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం  పోలీసు బందోబస్తు నడుమ ఇటీవల పూర్తయింది కూడా.

కేరళ లోని కోజికోడ్ పట్టణానికి ఏకంగా విగ్రహాల నగరం అనే పేరు కూడా వుంది.

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రానికి రాజధాని నగరంగా వున్న హైదరాబాదు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కూడా రాజధాని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయనకు ఒక భారీ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం కలిగింది. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో జిబ్రాల్టర్ రాక్ అనే పేరు కలిగిన ఒక రాతి గుట్ట మీద ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాలని సంకల్పించారు. ఇందుకోసం జిబ్రాల్టర్ రాక్ పై పదిహేను అడుగుల ఎత్తులో ఒక వేదికను నిర్మించారు. భారీ విగ్రహానికి కావాల్సిన  ఏకశిలను  నల్గొండ జిల్లాలో స్థపతులు ఎంపికచేసి విగ్రహ నిర్మాణం మొదలు పెట్టారు. వందలాదిమంది పనివారలు, శిల్పుల సాయంతో అయిదేళ్లపాటు శ్రమించి స్థపతి గణపతి ఆ రాతిని తొలిచి యాభై ఎనిమిది అడుగులు ఎత్తయిన భారీ బుద్ధ విగ్రహాన్ని చెక్కారు. అనేక వ్యయప్రయాసల అనంతరం మూడువందల యాభై టన్నుల బరువున్న ఆ విగ్రహం సుమారు నలభై మైళ్ళు ప్రయాణించి హైదరాబాదు చేరుకుంది. విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమైన భారీ క్రేన్లు స్థానికంగా లభ్యం కాకపోవడంతో వాటిని ముంబై నుంచి తెప్పించారు.

ఈలోగా సంభవించిన రాజకీయ పరిణామాల ఫలితంగా విగ్రహ వ్యూహకర్త ఎన్టీ రామారావు పదవి నుంచి దిగిపోయారు. కొత్త ప్రభుత్వం దీనిపట్ల పెద్ద ఆసక్తి చూపలేదు. విగ్రహ ప్రతిష్టాపన కాంట్రాక్ట్ తీసుకున్న ఏబీసీ కంపెనీ ఈ పని పూర్తిచేసే పనికి పూనుకుంది. 1990, మార్చి పదో తేదీన విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ జలాలమీదుగా తరలిస్తుండగా వంద గజాల దూరం దాటకుండానే ప్రమాదవశాత్తు విగ్రహం నీటిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో పదిమంది మరణించారు. దానితో బుద్దవిగ్రహ ప్రతిష్టాపన వాయిదా పడింది. కల్మషం ఎరుగని బుద్ధ భగవానుడు కల్మష జలాలలో దాదాపు రెండేళ్ళు ఉండిపోయాడు. చిట్టచివరకు  1992 డిసెంబరు ఒకటో తేదీన తధాగతుడు జలసమాధి నుంచి బయటపడి తనకోసం సిద్ధంగా వుంచిన విశాలమైన వేదికమీద నిటారుగా నిలబడగలిగాడు.  2006 లో బౌద్ధ గురువు దలై లామా బుద్ధుడి విగ్రహానికి సంప్రోక్షణ నిర్వహించారు.

హైదరాబాదు టాంక్ బండ్ మీద ఎన్టీయార్ హయాములోనే తెలుగువెలుగుల విగ్రహాలు వెలిశాయి. మొత్తం ముప్పై మూడు విగ్రహాలను ఒకే వరుసలో రాకపోకలకు అంతరాయం కలగని రీతిలో ఏర్పాటు చేసిన విధానం హర్షణీయం. అనుసరణీయం. అయితే ఆ విగ్రహాలకు ఎంపిక కూడా వివాద గ్రస్తం అయింది. ఒక ప్రాంతానికి చెందిన గొప్ప వ్యక్తులను పట్టించుకోలేదన్న విమర్శలు తారాస్థాయికి చేరాయి. ప్రత్యెక రాష్ట్ర ఉద్యమ సమయంలో మరోసారి ఈ అంశం వెలుగులోకి రావడమే కాకుండా విభజనవాదులు వాటిల్లో కొన్నింటిని విధ్వసం చేసేవరకు విషయం ముదిరిపోయింది.

అభివృద్ధి చెందిన  అనేక దేశాల్లో రోడ్ల కూడళ్ళలో కాకుండా రహదారికి ఒక పక్కగా విగ్రహాలు  ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయాలు లేకపోవడమే కాకుండా చూపరులకు కంటికి విందు గొలుపుతాయి. అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉట్టిపడే విగ్రహాలు ప్రపంచంలో వివిధనగరాలకు  ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా విలసిల్లుతున్నాయి.

విగ్రహాలకు సుదీర్ఘ చరిత్ర వుంది. పాత రాతి యుగం నుంచి విగ్రహారాధన ఏదో ఒక రూపంలో సాగుతూనే వస్తోంది. అతి పురాతన విగ్రహం ముప్పయి వేల సంవత్సరాల నాటిదని చరిత్ర కారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో ఎత్తయిన విగ్రహం, అదీ గౌతమ బుద్దుడి విగ్రహం చైనాలో వుంది. ప్రస్తుతం ఆ రికార్డు మోడీ ప్రభుత్వం స్వంతం చేసుకుంది. గుజరాత్ లో  అతి ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేసింది. నర్మదా డామ్ ఎదురుగా ఏర్పాటయిన ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం యావత్ ప్రపంచంలో అతి ఎత్తయిన విగ్రహంగా  పరిగణించబడుతోంది.

 

అనేక చారిత్రిక ఘట్టాలకు ఆనవాలుగా విగ్రహాలను ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే సమాజాన్ని బాగా ప్రభావితం చేసిన మహనీయుల పట్ల గౌరవ సూచకంగా విగ్రహాలను ప్రతిష్టించడం పరిపాటి.  అమెరికా అధ్యక పదవి రేసులో దేశాన్ని చుట్టబెడుతున్న రోజుల్లో ప్రెసిడెంట్ ఒబామా ఇలినాయిస్ రాష్ట్రంలోని, మెట్రోపాలిస్  నగరంలో  ఏర్పాటు చేసిన హాలీవుడ్ చిత్ర కధానాయకుడు 'సూపర్ మ్యాన్' విగ్రహం ఎదుట నిలబడి ఫోటో తీయించుకుని మరీ తన ముచ్చట తీర్చుకున్నారు. న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పర్యాటక ఆకర్షణకు మరో మచ్చు తునక.   లండన్ లో వున్న మైనపు విగ్రహాల మ్యూజియం సంగతి చెప్పక్కరలేదు. అందులో తమ బొమ్మ చూసుకోవడానికి ఎందరెందరో సెలబ్రిటీలు ఎంతో ముచ్చటపడుతుండడం కద్దు.

ఇలా విగ్రహాలు ఆహ్లాద కారకాలుగా వుంటే పర్వాలేదు.

వివాద కేంద్రాలుగా మారకూడదు.

ఇప్పుడు కొత్తగా టిప్పు సుల్తాన్ విగ్రహం మరో వివాదం రేపుతోంది. ఇది టీవీ చర్చల వరకు పరిమితం అయితే పర్వాలేదు. ఏ రూపం తీసుకుంటుందో చూడాలి.

(18-06-2021)

 

మేము నమ్ముతున్నాం మీరూ నమ్ముతున్నారా!

 యాంకర్ : చర్చలోకి    వెళ్ళే ముందు ఓ వార్తా కధనం ప్రసారం చేస్తాము. శ్రద్ధగా చూడండి. ఎందుకంటే మనం చర్చించబోయేది ఈ అంశం మీదనే.... చూసారు కదా! ఈ కధనానికి రుజువులు లేవు. సాక్ష్యాలు లేవు. సాక్షులు లేరు. ఇది ఎక్కడా మీడియాలో రాలేదు. కోర్టుకు పొతే నిలవదు. అది ముందే చెబుతున్నాను. కానీ ఇది నిజమని మా సిక్స్త్ సెన్స్ చెబుతోంది. కానీ మా దగ్గరా ఆధారాలు లేవు. 

ఆ  ఇద్దరు  రాజకీయ నాయకులు   ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. వున్నట్టుండి విడిపోయారు. బద్ధ శత్రువులుగా మారిపోయారు. వీళ్ళిద్దరూ విడిపోవడానికి  డబ్బు లావాదేవీల్లో వచ్చిన తగాదా. అలా అనడానికి కానీ,   డబ్బులు ఇచ్చి పుచ్చు కున్నారనడానికి చెప్పడానికి కానీ  ఎలాంటి ఆధారాలు లేకపోయినా అదే కారణం అని మా నమ్మకం.

“ఇప్పుడు చెప్పండి మీమీ పార్టీల అభిప్రాయాలు. వాళ్ళు విడిపోవడానికి డబ్బే కారణం అని మీరు కూడా  నమ్ముతున్నారా! నమ్మితే ఎందుకు నమ్ముతున్నారు. అందుకు మీ వద్ద వున్న ఆధారాలు ఏమిటి?”

భవిష్యత్తులో దీన్ని మించిన ఊహాగానాల చర్చలు వచ్చినా ఆశ్చర్యం లేదు.

రాజకీయుల లేఖాస్త్రాలు

17, జూన్ 2021, గురువారం

సూటిగా...సుతిమెత్తగా

 అనే శీర్షికతో గతంలో వారానికి రెండు ఆర్టికిల్స్ చొప్పున ఓ దశాబ్దం పాటు సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో  వర్తమాన రాజకీయాలు గురించి వ్యాసాలు రాసేవాడిని. సుదీర్ఘ కాలం ఆకాశవాణిలో పనిచేయడం వల్ల కఠినంగా రాయడం అలవాటు కాలేదు. అంచేతే  ఈ శీర్షికకు అలా పేరు పెట్టుకున్నాను.

అయినా ఒక్కోసారి రాతల్లో, మాటల్లో ఒకింత  కాఠిన్యం, కాసింత  పరుషత్వం తొంగిచూడడం అనేది జరుగుతూనే వచ్చింది. అది ఈ నడుమ మరింత పెరిగిందేమో అనిపిస్తోంది. కారణం అనేక వాణిజ్య సంస్థల నుంచి వస్తున్న టెలిఫోన్ కాల్స్. ఆ కాల్స్ చేసేవారిపై నాకు మొదట్లో జాలి వుండేది. దానికి కారణం నా భార్య. ‘ఏదో వాళ్లకి అది ఉద్యోగం. కాసేపు వాళ్ళు చెప్పేది మీరు ఓపిగ్గా వెంటే  సరిపోతుంది కదా! అనేది.

నిజమే! కానీ ఈ కాల్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రాసుకుంటున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, నిద్ర పోతున్నప్పుడు వరసగా ఈ కాల్స్ వస్తుంటే ఎంత అణచి పెట్టుకుందామని అనుకున్నా చిరాకుగా ఉంటోంది. మళ్ళీ అనిపిస్తుంది, వాళ్ళు ఈ కాల్స్ చేసేది వాళ్ళ ఉద్యోగ బాధ్యతల్లో  భాగంగానే కదా అని. అది కాసేపే! కాల్ రాగానే ఈ ఆలోచన ఆవిరైపోతుంది. విసుగు వేసి ఏదో అనడం, తర్వాత అలా విసుక్కోకుకండా వుంటే బాగుండేదేమో అనుకోవడం.

ఈ కరోనా కాలంలో ఇది నిత్యకృత్యమైపోయింది.

(17-06-2021)