24, ఏప్రిల్ 2021, శనివారం

'నేనే!

 


'నేనే! నేను తప్ప వేరు లేదు’ అనుకునే ‘అహం బ్రహ్మాస్మి’ల కోసం, మహాకవి, సంస్కృత పండితుడు భవభూతి ఈకింది సూక్తిని ప్రవచించారు.



'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'.

విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది. వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ వుంటాం.'



(నిజానికి వ్యావహారికంలో అహం బ్రహ్మాస్మి అర్ధం వేరే విధంగా మారింది. నేనే బ్రహ్మం, జీవుడూ, దేవుడూ ఒక్కరే అనేది దీని మూలార్ధం. ఇక్కడ అహం అంటే అహంకారం కాదు)

 

ఏమి బాధలే హలా!

 పూర్వం నేను బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేసే రోజుల్లో ఒకసారి ‘బాధ’ అని రాయడానికి పొరబాటున ‘భాద” అని భా కు ఒత్తు తగిలించాను. అది చూసిన ఎడిటర్ నండూరి రామమోహన రావు గారు, ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత భాదా’ అంటూ సుతారంగా ఆ తప్పును ఎత్తి చూపించారు. యాభయ్ ఏళ్ళ తరువాత కూడా నాకిప్పటికీ ఇది జ్ఞాపకం వుంది.

అది సరే! ఈ ‘భాద’ మహాకవి కాళిదాసుకు కూడా తప్పలేదని చెప్పే ఒక ఐతిహ్యం వుంది.

ఓ పండితుడు ఎలాగైనా సరే పాండిత్యంలో కాళిదాసును ఓడించి తీరాలని పట్టుదలతో వచ్చాడు. ఆయన్ని ఆస్థానానికి తీసుకురావడానికి వెళ్ళిన పల్లకీ బోయీల్లో ఒకడుగా కాళిదాసు కూడా కావాలనే వెడతాడు. పల్లకీ మోత అలవాటులేక మాటిమాటికీ భుజం మార్చుకుంటున్న కాళిదాసుని గమనించి పల్లకీలో విలాసంగా కూర్చున్న ఆ పండితుడు అంటాడు ‘ఏమయ్యా పల్లకీ మోయడం భాదగా ఉందా’ అని.

భాద అన్న ముక్క వినగానే బోయీ వేషంలో వున్న కాళిదాసు, ‘’భాద అనే నీ అపశబ్దం కంటే పల్లకీ కొమ్ము మోయడం బాధగా లేదులే’ అంటాడు.

దానితో పండితుడికి గర్వభంగం కావడం, కాళిదాసు కాళ్ళమీద పడడం వేరే కధ.

 

దొరకని పుస్తకంలో విజయవాడ

 నాలుగున్నర దశాబ్దాల క్రితం. విజయవాడ లబ్బీపేట ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు. లంక వెంకట రమణ నా సహోద్యోగి. ఏమి చదివాడో తెలియదు కాని ఆంద్ర ఆంగ్ల భాషల్లో కొట్టిన పిండి. మధ్యాన్న భోజన సమయంలో దగ్గరలో వున్న మా ఇంటికి పోయే వాళ్ళం. ఒక్కటే గది. కుర్చీలు, మంచాలు ఉండేవి కావు. ఆ గదిలోనే నా భోజనం. ఆయన అక్కడే చాప మీద వరద రాజస్వామిలా పడకేసి, తలకింద మోచేయి పెట్టుకుని అనేక కబుర్లు చెబుతూ ఉండేవాడు. ఆ భాషణలో చక్కని ఇంగ్లీష్ పద ప్రయోగాలు దొర్లేవి.

ఆఫీసులో గుర్రపు నాడా ఆకారంలో ఒక బల్ల వుండేది. పనిచేసుకుంటూ ప్యూన్ నాగేశ్వర రావుతో చీటీలు పంపుకునే వాళ్ళం. “ఒక పాతిక సర్దుతారా, ఇరవైన అడ్వాన్స్ తీసుకోగానే ఇచ్చేస్తాను” అనే అభ్యర్ధనలు వాటిల్లో ఉండేవి. అంతమాత్రం డబ్బు ఎవరి దగ్గరా ఉండదని తెలుసు. అయినా అడక్క తప్పని అవసరాలు. అందరివీ ఒకే అవసరం కనుక ఒకరంటే మరొకరికి జాలి. అందుకని, ‘లేదు’ అనకుండా మరో చీటీ మీద “ఓ యాభయ్ సర్దుతారా” అని రాసి దాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుకు పంపేవాళ్ళం. ఆయన ఆ చీటీలోనే యాభయ్ రూపాయలు  వుంచి తిరిగి పంపేవాడు. అందులో సగం వుంచేసుకుని మిగిలిన పాతిక ముందు అడిగిన వాడికి సర్దుబాటు చేసేవాళ్ళం. ఈ చేబదులు  చక్రభ్రమణం ప్రతినెలా సాగేది. ఇదిగో! ఈ ‘లేని’ తనమే మా స్నేహాన్ని గట్టిగా నిలిపి ఉంచింది. అందరం ఇదే బాపతు కనుక ఇక అసూయలకు ఆస్కారమే వుండేది కాదు.

ఇక అసలు విషయానికి వస్తాను. తరువాత మా దారులు వేరయ్యాయి. నేను హైదరాబాదులో రేడియోలో, ఆయన విజయవాడలోనే ఆంద్రప్రభలో కొత్త జీవితాలు మొదలు పెట్టాము. దరిమిలా పాతికేళ్లలో మేమిద్దరం కలుసుకున్నది ఒకటి రెండు సార్లే.

ఈ మధ్య ఇల్లు మారినప్పుడు పుస్తకాలు సర్దుతుంటే రమణ రాసిన ‘విజయవాడ వీధుల కధలు’ అనే పుస్తకం కనబడింది. చిన్న పుస్తకం అయినా చదవదగిన ఎన్నో విశేషాలు వున్నాయి. 2000 సంవత్సరంలోభారతి’ సాంస్కృతిక సంస్థ వారు ప్రచురించారు. ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలవదు. (రేడియోలో నా సీనియర్ సహచరులు ఎం.వి.ఎస్. ప్రసాద్ గారు చెప్పాలి, ఎందుకంటే ఇందులో వారి ప్రస్తావన వుంది)

ఈ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు కింద పొందుపరుస్తున్నాను.

హువాన్ చాంగ్ చూసిన బెజవాడ”

చైనా యాత్రీకుడు హువాన్ చాంగ్ క్రీస్తు శకం 730లోభారత దేశానికి వచ్చాడు. దేశంలో పర్యటిస్తూ 739లో బెజవాడ చేరుకున్నాడు. తను చూసిన ప్రతిదీ ఆయన గ్రంధస్తం చేసారు. అప్పుడు బెజవాడ ‘తె – న – క – చ – క’ అనే దేశంలో ఉండేదట. ఈ తెనకచక చాళుక్య రాజ్యంలో వుండేది. ‘తె – న – క – చ – క’ ను సంస్కృతీకరిస్తే ధాన్యకటకం అవుతుంది. అంటే నేటి అమరావతి (ప్రస్తుతం రాజధాని అమరావతి కాదు). అప్పటి తెనకచక దేశానికి బెజవాడ రాజధాని. హువాన్ చాంగ్ ప్రకారం అప్పటి మనుషులు చాలా బలిష్టంగా, నల్లగా, మొరటుగా వుండేవాళ్ళు. బౌద్దోపాసకులు బెజవాడ, సీతానగరం, ఉండవల్లి గుహల్లో నివసించేవాళ్ళు. రాత్రి వేళల్లో ఆ సంఘారామాలు బారులు తీరిన దీపాలతో కనుల పండుగగా కానవచ్చేవని చైనా యాత్రీకుడు వర్ణించారు. దక్షిణంగా ఉన్న కొండపై భావ వివేక స్వామి తపస్సు చేసుకున్నాడని ఆయన రాసారు. భావ వివేకుడు కృష్ణా జిల్లా వాడు. ఆయన ధారణి సూత్రాలు తెలుసుకున్నాడని బౌద్ధ గ్రంధాలు చెబుతాయి.

ఇంకో విచిత్రమైన విషయం నూట యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ జనాభా ఎనిమిది వేలకు పై చిలుకు. అదే పదిహేను వందల ఏళ్ళకు పూర్వం ఆ పట్టణ జనాభా లక్షకు పైమాటే. విదేశీ వర్తకులతో కిటకిట లాడిన వాణిజ్య నగరం. కృష్ణలో విదేశీ నౌకలు బెజవాడ వరకు వచ్చేవి. రోమన్, గ్రీకు నాణేలు పలుచోట్ల లభించడం ఇందుకు దృష్టాంతంగా చెబుతారు. ఇక్కడి నుంచి విదేశాలకు తోళ్ళు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యేవి.

ఈ పట్టణానికి అనేక పేర్లు ఉండేవి. బిజియివాడ, విజియివాడ, బెజవాడ, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, మల్లికార్జున మహాదేవ పురం, విజయవాడ ఇలా ఎన్నో. అయినా చరిత్రలో చిరకాలం బెజవాడ అనే పేరే నిలిచింది. విజయవాడ అనే ఇప్పటి పేరు కూడా పన్నెండవ శతాబ్దంలో వాడుకలో వుండేది. ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణు కుండినులు, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, చోళులు, తెలుగు చోడులు, రెడ్డి రాజులు, కాకతీయులు, గజపతులు, దుర్జయులు, నరపతులు, నవాబులు, మండలేశ్వరులు, మహా మండలేశ్వరులు, త్యాగి వంశీయులు, ఇంకా అనేకానేక రాజవంశాల ఏలుబడిలో ఉండేది.

హువాన్ చాంగ్ తో పాటు, ఫాహియాన్, భావదేవర, దిగ్నాగ, మహాపద్మనంద, ఆదిశంకరాచార్య, మహాత్మా గాంధి వంటి వారు ఈ నగరాన్ని దర్శించారు

 

23, ఏప్రిల్ 2021, శుక్రవారం

పేరులో ఏముంది?

 

కొండల మీద, గుట్టల మీద వెలిసిన దేవుడి గుళ్ళకు వెళ్ళడానికి మెట్ల దారులు వుంటాయి. ప్రతి మెట్టు మీద దానికయ్యే ఖర్చు దానం చేసిన వ్యక్తి పేరు చెక్కించే వారు. అంత ప్రచారం అవసరమా అనేది నా సందేహం. ‘వాళ్ళు ప్రచారం కోసం అలా పేర్లు రాయించుకోలేదు, మెట్లెక్కి వెళ్ళే భక్తులు తమ పేర్లను తొక్కుకుంటూ వెడితే పుణ్యం’ అని ఓ వివరణ. సరే! బాగానే వుంది. మరి గుడిలో వుండే పంకాల మీద వాటిని విరాళంగా ఇచ్చిన వారి పేర్లు అవసరమా! ఈ ప్రశ్నకు జవాబు లేదు.

కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. కానీ రోజులు మారాయి. ప్రధాని/ ముఖ్యమంత్రి సహాయ నిధికి పలానా వారి విరాళం ఇంత అని ట్వీట్ ముందు, ఇవ్వడం తరవాత. అంటే ఏమన్నమాట. ప్రచారం లేకుండా ఏ మంచి పని చేసినా శుద్ధ దండగ అనే వారి సంఖ్య పెరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం.

కంచర్ల గోపన్న గారు ఎలాంటి ప్రచార యావ లేకుండా భద్రాచల రాముడికి గుడి కట్టించాడు. భక్త రామదాసుగా మారిన తర్వాత, తానీషా బందికానాలో వేసి పెట్టిన చిత్రహింసలు భరించలేక సీతమ్మ తల్లితో పాటు రామలక్ష్మణులకు, భరత శత్రుఘ్నులకు చేయించిన ఆభరణాలు గుర్తుకు వచ్చి, వాటిని చేయించేందుకు అయిన ఖర్చు అణాపైసలతో(వరహాలు, మొహరీలు) సహా లెక్కలు కట్టి పాటలు పాడుతూ చెప్పిన సంగతి తెలిసిందే.

తిరుమల దేవాలయానికి పునాది రాయి వేసింది ఎవరో తెలియక పోయినా, ఓ చిన్న కాలనీలో కట్టిన ఓ చిన్న గుడికి ఎవరు శంకుస్థాపన చేసారో, ఎవరు ప్రారంభోత్సవం చేసారో తెలిపే ఖరీదైన చలువరాతి ఫలకం గుడి ముఖ ద్వారం కంటే గొప్పగా కనిపించేటట్టు పెట్టడం తెలియని వాళ్ళు లేరు.

ఎవరిదో నాయకుడి పుట్టిన రోజు నాడు ఆసుపత్రులలో రోగులకు పళ్ళు పంచిపెడతారు. మంచి సంగతే.
ఆ ఫోటోలు పత్రికల్లో రావడానికి ఇచ్చే ప్రకటనల డబ్బులతో మరి కొన్ని ఆసుపత్రులలో ఇదే సత్కార్యం చేయవచ్చు కదా అని అడిగితే, ‘అలా ఎలా! పేరూ ఊరూ లేని పనులు చేయడానికి మాకు మరో పని లేదనుకున్నారా’ అన్నట్టు చూస్తారు.

ఇంతెందుకు! ఫేస్ బుక్ లో నేను రాసిన పోస్టును ఎవరో లేపేసి అతడి పేరుతొ పోస్టు చేసుకుంటే నా సొమ్మంతా పోయినట్టు నేనే ఎన్నిసార్లు గగ్గోలు పెట్టలేదు.

పేరులో ఇంత విషయం వుంది కాబట్టే పేరు కోసం ఇన్ని పాట్లు.
ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారా!

ఆక్సిజన్ ట్యాంకుల సరఫరా ఏర్పాట్లు గురించి వేర్వేరు పార్టీల అభిమానులు పోస్టించిన కధనాలే.
(23-04-2021)

ఒక చేదు జ్ఞాపకం ఒక తీపి గుర్తు

 చాలా ఏళ్ళ కిందటిది. ఒక ఫ్రెండ్  షేర్  చేశారు 



“హీనంగా చూడకు దేన్నీ”


అన్నారు మహాకవి శ్రీశ్రీ
పాత కాలపు ప్లాంటు, ఈ కాలానికి పనికి రాదన్నారు. ఏటేటా నష్టాలు గుట్టల్లా పేరుకు పోతున్నాయన్నారు. అమ్మడం మినహా వేరు గత్యంతరం లేదన్నారు. అందులో నిజం లేకపోనూ లేదు.
బేరసారాలు జరిగాయి. బేరం కూడా కుదిరినట్టే వుంది.
నచ్చని వాళ్ళు రోడ్డెక్కారు. అంత కష్టం పడలేని వాళ్ళు మీడియాకెక్కారు.
ఏమైందో తెలవదు. కొంత విరామం వచ్చింది.
ఈలోగా కరోనా సెకండ్ వేవ్ ముంచుకు వచ్చింది. దానితో పాటే ఆక్సిజన్ కొరత వచ్చింది. దానితో పాటే ఆ పాత ప్లాంటుకు కళ వచ్చింది. ఒకరకంగా అదే ఇప్పుడు దేశానికి ప్రాణ వాయువు అందించే సంజీవని అయ్యింది.
శరత్ బాబు నవల భారతిలో ఒక పాత్రకు ఎవరో వాడిపారేసిన గంజాయి పీల్చే గొట్టం కనబడుతుంది. ‘ఏమో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో అని దాన్ని దాచిపెడతాడు.
అందుకే అన్నారు, హీనంగా చూడకు దేన్నీ!
(23-04-2021)

22, ఏప్రిల్ 2021, గురువారం

కరోనాను మించిన వ్యాధి దురాశ – భండారు శ్రీనివాసరావు

 

కరోనా కళ్ళప్పగించి చూస్త్తూ ఇక తోక ముడిచే పనిలో ఉన్నట్టుంది.
కరోనా భయ పడుతోంది దేశంలో ప్రజలూ ప్రభుత్వాలు ఏకమై తనని తరిమి కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసికాదు. బహుశా మన దేశానికి మాత్రమే పరిమితమైన వింత వ్యాధిని చూసి. మందు లేని ఆ వ్యాధి పేరు ఇంగ్లీష్ లో GREED తెలుగులో దురాశ.
కరోనా సెకండ్ వేవ్ కోరలు సాచి విస్తరిస్తున్న సమయంలో ఎవరి ప్రాణానికి పూచీ లేని పరిస్థితి. అయినా తాము మాత్రం చిరకాలం బతుకుతామనే నమ్మకంతో డబ్బులు పోగేసుకుంటున్న జనాలను చూస్తుంటే ఆ కరోనాకే మతి పోతున్నట్టు వుంది. అలా సంపాదించే డబ్బు కట్టుకు పోయేది కాదు, పట్టుకుపోయేది కాదు.
లేకపోతె ఏమిటీ బ్లాక్ మార్కెట్? మందులు, మూతి గుడ్డలు, శానిటైజర్లు, ఆసుపత్రులలో ఎడ్మిషన్లు, బెడ్లు, ఆఖరికి అంబులెన్సులు అన్నిటికీ కృత్రిమ కొరతలు పెరిగాయి. ధరలు పెరిగిపోయాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఒకవైపు ప్రాణాలు పోతున్నా కనికరించని కరకు గుండెలు చూసి గుండెలు బాదుకుంటున్నారు.
ప్రళయం అంటే ఇదే. భూమి బద్దలు కావడం కాదు. సముద్రాలు ఉప్పొంగడం కాదు.
ఈ దురాశే నిజమైన ప్రళయం.
అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం!