28, నవంబర్ 2020, శనివారం

నా గురించి నలుగురూ

“నీ గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. మంచి చెప్పుకుంటే ఎవరూ నమ్మరు. చెడు చెప్పుకుంటే ఇంకా ఎంత వుందో అని రాగాలు తీస్తారు.”

ఎప్పుడో రేడియోలో పనిచేసే రోజుల్లో నా బల్ల మీద నేను రాసిపెట్టుకున్న సూక్తి. మనం ఎవ్వరం అనేది మనం ఎంత తక్కువ చెప్పుకున్నా ఇతరులకు అది ఎక్కువగానే అనిపిస్తుంది. అది మానవ సహజం. మన గురించి నలుగురూ ఏమనుకుంటున్నారో అదే నిజమైన ‘మనం

ఒకప్పుడు ఈనాడు  పత్రికకు  న్యూస్  బ్యూరో చీఫ్ గా చేసి, ఎన్. జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనకు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన ఏ. రజా హుస్సేన్ ప్రముఖ రచయిత, ప్రసిద్ధ కవి, భావుకుడు కూడా. ఆయన నా గురించి, నా రచనలు గురించి సవివరంగా రాసిన పోస్టు ఒకటి గ్రూపుల్లో  చక్కర్లు కొడుతూ  నా దృష్టికి వచ్చింది.  ఇందులో అతిశయోక్తులుగా మీకు అనిపించినవి వడపోసి చదువుకుంటే ఎక్కడో అక్కడ  ‘నేను నా సూక్ష్మ రూపంలో కనపడతాను)    

కరోనా...కాలమ్.. – ఏ. రాజాహుస్సేన్

*ఆయన 'భండారు ' మాత్రమే కాదు...సమాచార 'భాండాగారం ' కూడా…!!

ఆయన రాతలకు కొన్ని మచ్చుతునకలు :

*దేవుడా! నాకు డబ్బివ్వు. ఎంతంటే, అవసరంలో ఉన్నవారికి సాయపడేటంత…!!

*దేవుడా! నాకు అధికారం ఇవ్వు. ఎంతంటే, అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడేటంత !!.

*దేవుడా! నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు. వయసు మళ్ళినప్పుడు ఎవరిమీదా ఆధారపడకుండా వుండేటంత'!

*నిర్ణయం మంచిది అయినప్పుడు అది పలానా వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాబట్టి మంచిదనే నిర్ణయానికి రావద్దు. పలానా వ్యక్తి చేసిన నిర్ణయం కాబట్టి మంచిదయినా కాదని తప్పు పట్టవద్దు.

*నిజానికి రూలు అందరికీ ఒకటే. మన దేశంలో ఇబ్బంది ఏమిటంటే దాన్ని అమలు చేసే అధికారి/సిబ్బంది దయాదాక్షిణ్యాలను బట్టి రూలు రంగూ రుచీ మారుతుంటుంది.

*ఆరోపణలు చేయడానికి ఆధారాలు అక్కరలేదు. వాటిని ప్రసారం/ప్రచారం చేసే మాధ్యమాలు వుంటే చాలు

*'మీడియా మేనేజ్ మెంట్, మీడియా కంట్రోల్! ఈ రెండూ మీడియా స్వేచ్ఛను హరించేవే!'

*మూడు స్థంభాలకు జరూరుగా మరమ్మతులు జరగాలి. నాలుగోది అంటారా?Beyond Repair

*దేశంలో కావాల్సింది చమురుశుద్ధి కర్మాగారాలు కాదు, చిత్తశుద్ధి కర్మాగారాలు. ఎందుకంటే పూర్తి కొరత వున్నది దానికే్!

*ఒక సామాన్యుడి విషయంలో చట్టం ఎలా అమలవుతుందో అదే చట్టం అసామాన్యుల పట్లకూడా అదేవిధంగా వర్తిస్తే అప్పుడు చట్టం ముందు అందరూ సమానులు అనే సూక్తికి అర్ధం వుంటుంది.లేని పక్షంలో దేశంలో రెండు చట్టాలు వున్నట్టే లెక్క.

ఆకాశవాణి ఇంటి పేరుగా మార్చుకున్న భండారు శ్రీనివాసరావు,

*అతడజాత శత్రువు....అతడు ఆకాశవాణి విలేకరి.. అతడు హాస్య చతురుడు.. అతడు సహృదయుడు.. అతడు హితుడు…సన్నిహితుడు...

"మనిషి మెత్తన .. మాట మెత్తన... మృదు స్వభావి...వివాదరహితుడు!!

ఓ మనిషిలో ఇన్ని సుగుణాలుండటం
విశేషమే సుమా..?
మా భండారు శ్రీనివాసరావులో ఇవన్నీ
రాశిగా పోసివున్నాయి.

కానీ... భండారు శ్రీనివాసరావు మాత్రం…….
తాను సకల గుణ సంపన్నుడినేం కాదు అంటాడు..

"నాకు వుండకూడని అవగుణాలు అన్నీ ఉన్నాయి. కోపం, ఉక్రోషం, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట తూలడం ఇలా అనేకం. కానీ దేవుడు నాయందు దయతలచి అసూయ ఇవ్వలేదు. అంచేత నిలువునా తగలబడి పోకుండా ఇలా నిలబడి వున్నాను".!! అంటాడు శీను.

ఆకాశవాణి విలేకరి అంటే .".కట్టె కొట్టె చెప్పె" అన్నట్లుంటారు. కానీ శ్రీనివాసరావు ఇందుకు మినహాయింపు.

వార్తను క్షుణ్ణంగా అర్థంచేసుకోనిదే ఫోన్ ఎత్తేవాడు కాదు. ఫ్లాష్ న్యూస్ ఆగమేఘాల మీద అందించే వాడు. రేడియోకి ఎంత అవసరమో అంతే..

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా, వైస్ ప్రెసిడెంట్ గా, కార్యవర్గ సభ్యుడిగా, ప్రెస్ క్లబ్ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్ గా వివిధ హోదాల్లో పనిచేశాడు ..

సూర్య దినపత్రికలో అయిదారేళ్ళపాటు "సూటిగా..సుతిమెత్తగా" శీర్షికతో వారానికి రెండురోజులు
వివిధ విషయాలపై వ్యాసాలు రాశాడు. సాక్షి, ఆంధ్రప్రభ , జ్యోతి, భూమి  వంటి పత్రికల వాళ్ళు ఆయనచేత అడిగి మరీ రాయించుకుంటారు. తెలుగు యూనివర్సిటీవారు తాపీ ధర్మారావు పేరిట పత్రికా రచనకు ఇచ్చే కీర్తి పురస్కారానికి ఎంపికయ్యాడు.


ఈయనది పండిత వంశం. పాత్రికేయుడిగా, వార్తల చదువరిగా, రచయితగా ఆయనది యాభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. ఎందరో  ముఖ్యమంత్రులకు  ఫోన్  చేసి పలకరించగల చనువు వున్నా ఏనాడూ తన పరిధి దాటలేదు. వారితో కూర్చుని విందు భోజనాలు చేసినా ఏనాడూ నాకిది చేసిపెట్టమని ఎవరినీ అర్థించలేదు. ఇప్పటికీ శ్రీనివాసరావు వుండేది అద్దె ఇంట్లో ఉంటున్నాడు అంటే నాకే నమ్మకం కుదరదు. కానీ అది వాస్తవం.  అందుకే రాజకీయ నాయకులకే కాదు, జర్నలిజం ఫీల్డ్ లో దిగ్గనాధీరులయిన వారికి కూడా ఆయనంటే అంత గౌరవం.

రష్యా రేడియో లో చాలా సంవత్సరాలు తెలుగు వాణిని వినిపించాడు. ఆ నాలుగేళ్ళ సమయంలో వారికి  మాస్కోలో ఎదురైన తియ్యని అనుభూతులను పంచదార పాకంలో వేసి ద్రాక్షపాకంలో కలిపి పాఠకులకు అందించారు. 2012,లో వచ్చిందీ పుస్తకం.. ‘మార్పు చూసిన కళ్ళు పేరుతొ.
ఆయన పదవీవిరమణ చేసి పుష్కరం దాటిపోయింది.
టివీ చర్చాకార్యక్రమాల్లో విశ్లేషకుడిగా ఇప్పటికీ ఈ వయసులో కూడా క్రియాశీలకంగా వుండడం ఆశ్చర్యం.  ఉన్నంతలో విషయాన్ని ఉన్నదున్నట్లు చెప్పే ఒకే ఒక్క విశ్లేషకుడు  అనే పేరు తెచ్చుకున్నాడు. టీవీల వారే  ఆయన్ని అడిగిమరీ చర్చలకు  పిలిపించుకుంటారు. రోజుకు  మూడు   ఛానళ్ళ చర్చల్లో  పాల్గొనేవాడు. విభిన్న రాజకీయ దృక్పధాలు కలిగిన ఛానళ్ళు ఆయన్ని ఆహ్వానించడం శ్రీనివాసరావు నిష్పాక్షికతకు నిదర్శనం. భార్యా వియోగంతో ..ఏడాది నుంచీ  టీవీ చర్చలకు దూరమయ్యాడు. అయినా ఛానళ్ళవాళ్ళు ఇంటికి వెళ్లి మరీ ఆయన అభిప్రాయాలు రికార్డు చేసుకుంటారు.

విషయాన్ని విడమరిచి నిష్పక్షపాతంగా తన అభిప్రాయం చెప్పడం, చర్చల్లో హుందాగా వ్యవహరించడం..ఎదుటి వారిని నొప్పించకుండా..విషయాన్ని విపులంగా వివరించడం శీను ప్రత్యేకత!!

భండారు శ్రీనివాసరావు నాకంటే వయసులోనే కాదు, ప్రొఫెషన్ గా కూడా సీనియరే. అయినా ఎందుకనోమొదటి నుంచీ ఆయన్ను " శీను" అనిపిలవడం అలవాటైంది. ఆయన దగ్గర అంత చొరవ ఎందుకు అంటే,  చెప్పడం కష్టమేమీ కాదు...అది ఆయన మంచి
తనం..సహృదయత..అంతే..!

శ్రీనివాసరావు పేరుకు ఆల్ ఇండియా రేడియో రిపోర్టరే.  కానీ..నిజానికి సకలకళావల్లభుడు. రాజకీయం,
సాహిత్యం, శాస్త్రం, కళలు, సామాజికం,..ఇలా రంగమేదైనా...ప్రవేశం, పరిజ్ఞానం అపారం. అందుకే నేను
శీను ను "అల్ ఇన్ ఒన్ "అంటాను…

ఆలిండియా రేడియో శ్రీనివాసరావు ఇప్పుడు ఫేస్ బుక్ శ్రీనివాసరావుగా మారిపోయాడు. ఆయన పోస్టులకోసం చకోర పక్షులుగా ఎదురు చూసేవారు కోకొల్లలుగా వున్నారు. ఆయన ఏదైనా ప్రజా సమస్య  గురించి రాసారు అంటే ప్రభుత్వాలు దిగివచ్చి దిద్దుబాటు చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం.  ఆయన కలం అంత పవర్ ఫుల్. తెలంగాణా మంత్రి కేటీఆర్   ఒకసారి బీబీసీ ఇంటర్వ్యూ లో  శ్రీనివాసరావు పేరు ప్రస్తావించి మరీ  చెప్పారు ఈ సంగతి.

భండారు శ్రీనివాసరావు అప్పుడప్పుడూ ‘ గీత’’ కారుడైపోతుంటాడు. వివిధ విషయాలు, సంఘటనలపై భాష్యం చెబుతుంటాడు.

ఫేస్బుక్ పై శీను భాష్యం చూడండి..!!

“ఇది జుకెర్ బర్గ్ సృష్టించిన వింత ప్రపంచం. ఇక్కడ వయస్సుతో నిమిత్తం లేదు. అనుభవంతో నిమిత్తం లేదు. అందరూ సమానమనే గొప్ప ప్రపంచం. ఒకరకంగా మనం ఎవరం ఎప్పుడూ చూడని కొత్త ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎంత జాగ్రత్తగా మసలుకోవాలో
ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు”

ఆఖరికి  తను పనిచేసిన మీడియా రంగాన్ని కూడా ఆయన వదలకుండా తన రాతలతో  దుమ్ము దులిపారు.

మచ్చుకు  చూడండి ఆయన మాటలు ఎంత ఘాటుగా ఉంటాయో.

“సరే! జగను, బాబు, కేసీఆర్, మోడీ, రాహుల్ అంటే మీ లెక్కలేవో మీకున్నాయి. నిష్పక్షపాతంగా రాయాలి అంటే మీ ఇబ్బందులేవో మీకున్నాయి. అలాగే, ఆర్ధిక సంబంధాలు, రాజకీయ అనుబంధాలు వగైరా వగైరా!

“మరి ఎవరి కొమ్మూ కాయల్సిన అవసరం లేని సందర్భం వచ్చినప్పుడు కూడా మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా, భయమూ, బెదురూ లేకుండా వార్తను వార్తగా రాయడానికి ఏమి అడ్డం వస్తోంది. అమెరికా ఎన్నికల్లో ట్రంపునో, బైడన్ నో మోయాల్సిన అవసరం ఏమొచ్చింది?

“ట్రంపు మేనమామ కొడుకూ కాదు, బైడన్ మేనత్త కొడుకూ కాదు. వాళ్ళు మీకు ఇచ్చే ఆర్ధిక వత్తాసూ ఏమీ లేనప్పుడు మీ కలాలకు బానిస సంకెళ్ళు దేనికి? ఎందుకోసం?

"మీడియాను కట్టడి చేయడంవల్ల అధికారంలోవున్నవాళ్ళు శాశ్వతంగా అధికారంలో కొనసాగుతారా? అంటే గ్యారెంటీ లేదు" -

*ప్రభుత్వ తాయిలాలతో మీడియాను తమ కనుసన్నల్లో వుంచుకునే పార్టీలు శాశ్వతంగా అధికారంలో వుండగలవా? అంటే ఆ గ్యారెంటీ అస్సలు లేదు" -

*అధికార పార్టీని ఓడించడానికి వ్యతిరేకత ఒక్కటే సరిపోదు. ఆ వ్యతిరేకత నుంచి అసహనం పుట్టాలి. ఆ అసహనం నుంచి అసహ్యం పుట్టాలి. ఆ పార్టీని ఓడించి తీరాలి అనే కసి పుట్టాలి. ఎన్నికల చరిత్రలో ఘోర పరాజయాలకు, ఘన విజయాలకు ఇదే మూల సూత్రం. వ్యక్తుల పాత్ర కేవలం కాకతాళీయం.

*"అదేమిటండీ. ప్రెస్ ని ఎదురుగా పెట్టుకుని అంతేసి అబద్ధాలు అలవోకగా చెప్పేశారు?"
"
చూడూ. రాజకీయాల్లో నేనెక్కడ వున్నాను? నువ్వెక్కుతున్న నిచ్చెన పైమెట్టు మీద. నువ్వేమో ఇంకా మొదటి మెట్టు దాటలేదు. ఒక నీతిపాఠం చెబుతా, గుర్తెట్టుకో. అబద్ధం చెప్పు. కానీ గోడ కట్టినట్లు ధాష్టీకంగా చెప్పు. జనం అప్పుడే నమ్ముతారు. అది అబద్దమో కాదో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎదుటి పార్టీ మీద వుంటుంది. ఇంకో సంగతి. ప్రెస్ కి కూడా ఇలాంటి సంగతులే కావాలి. పెద్దగా కష్టపడకుండా పెద్దగా ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ రావాలంటే ఇదే ఉత్తమ మార్గం. సరే పోయి వాళ్ళకి ఏమేం కావాలో దగ్గరుండి చూసుకో. పో."

"విరిగి పెరిగితి, పెరిగి విరిగితి - కష్టసుఖముల సారమెరిగితి’ అన్న గురజాడ వాక్కు కొందరి విషయంలో అక్షర సత్యం.!

కొందరు సుఖపడడానికి పుడతారు. తాము సుఖపడుతూ ఇతరులను కూడా సుఖపెడతారు. ఇంకొందరు తాము సుఖపడుతూ ఇతరులను కష్టపెడతారు. మరికొందరు కష్టపడడానికి పుడతారు. వారిలో కొందరు కష్టపడుతూ తోటివారిని సుఖపెడతారు.పైన చెప్పిన కవి వాక్కు ఇలాటివారిని గురించే. బహుశా ఈ చివరి తరగతి వారు ఆడవారయివుంటారు.

*అస్తు..అస్తు..జబరదస్తు….!

“పూర్వం వీధి నాటకాల్లో కేతిగాడు అనేవాడు రంగ ప్రవేశం చేసి తన వెకిలి చేష్టలతో గ్రామీణ ప్రజల్ని నవ్వించేవాడు. ఈటీవీలో ఓ ప్రోగ్రాం వస్తుంటుంది. దాన్ని చూస్తుంటే అది జ్ఞాపకం వచ్చింది. ఈ ప్రోగ్రాం, పేరేమిటో తెలియదు కాని, ఇందులో ఒకరా ఇద్దరా అనేకమంది కేతిగాళ్ళు. వీళ్ళ చేష్టలు, ఆకారాలు వెకిలిగా, వికృతంగా వున్నాయి. దీనికి తోడు ఆ కార్యక్రమానికి జడ్జీలుగా వచ్చిన ప్రసిద్ధ నటీనటులు పగలబడి నవ్వుతుండడం చూసి మరింత రోతగా అనిపించింది. దీన్ని నేను ఇంతవరకు చూడలేదు, కానీ వింటూ వస్తున్నాను.

రామోజీ రావు గారు తమ ఛానల్లో వచ్చే ప్రతిదీ చూసి ఓకే చేస్తారని చెబుతుండగా విన్నాను. నేను విన్నది నిజం కాదేమో అనిపిస్తోంది " .. !!

మీడియా మొఘల్ కు ఎవరైనా ఇలా ఓపెన్ గా సలహా ఇవ్వగలరా!

శీను...మీరిలానే ఎప్పుడూ... మీలానే వుండండి.!!

ఏ.రజాహుస్సేన్.!

Top of Form



27, నవంబర్ 2020, శుక్రవారం

ఒకే దేశం ఒకే ఎన్నిక – భండారు శ్రీనివాసరావు

 ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ గారి ఈ ప్రతిపాదన ఆహ్వానించతగింది. నిజానికి మనదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. లోకసభకూ, ఆయా రాష్ట్రాల శాసన సభలకు కలిపి ఒకేసారి, కాకపొతే వివిధ దశల్లో ఎన్నికలు నిర్వహించేవారు. ఇది కొత్త పద్దతి కాదు, కొత్త సంప్రదాయమూ కాదు.

నెహ్రూ హయాములో ఒకసారి 1959 లో  కేరళ రాష్ట్రంలో అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తొలగించి మొట్టమొదటిసారి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టారు. తదాదిగా, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీన పడడం, అక్కడ నిలదొక్కుకున్న స్థానిక నాయకత్వాలను, ప్రాంతీయ, సంకీర్ణ ప్రభుత్వాలను దెబ్బతీయడానికి, లేదా తొలగించడానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగంలోని 356 అధికరణాన్ని విచ్చలవిడిగా, విశృంఖలంగా వాడుకునే కొత్త వికృత సాంప్రదాయానికి తెర లేచింది. ఈ విధంగా చేయడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని విపరీతంగా విమర్శలు చేసి. కాంగ్రెస్  పార్టీని ఎన్నికల్లో మట్టి కరిపించి  కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనత పార్టీ కూడా కాంగ్రెస్ పాలనలో ఉన్న అనేక రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్య హననంలో తామూ తక్కువ తినలేదని రుజువు చేసింది.

ఈ గత అనుభవం నేర్పే పాఠం ఏమిటంటే, ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’, అదీ ఒకేసారి అనే విధానం సక్రమంగా అమలు కావాలంటే ముందు రాజ్యాంగంలో ఉన్న రాష్ట్రపతి  పాలన విధింపుకు అవకాశం ఇచ్చే  356వ అధికరణాన్ని రద్దు చేయాలి. దానికి ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించాలి. ఒకవేళ శాంతి భద్రతల కారణంగానో, లేదా రాజకీయాలకు అతీతమైన సహేతుక కారణంతోనో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఎదురైతే, ఏం చేయాలి అనేదానిపై దేశవ్యాప్త చర్చ జరగాలి.

రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనకు అవకాశం వుంది కాని కేంద్రంలో ఇందుకు అవకాశం లేదు. ఏదైనా  కారణంతో ప్రభుత్వం పడిపోతే  మళ్ళీ ఎన్నికలకు పోవడం మినహా వేరు గత్యంతరం లేదు. ఈనాటి  కలగూరగంప రాజకీయాల్లో, సంకీర్ణ ప్రభుత్వాల శకంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు మరీ ఎక్కువ. వీటిని నిరోధించకుండా, వీటికి ఒక పరిష్కారం  కనుగొనకుండా ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే విధానం ఆచరణలో  సఫలం కాదు. ఇందుకు ముందు కావాల్సింది ఎన్నికల సంస్కరణలు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి మరిన్ని పటిష్టమైన సవరణలు చెయడం.  ఇవన్నీ జరిగిన తర్వాతనే ముందుకు పోవడం అవసరం.

అలాగే, ఈ విధానం  ఎప్పటి నుంచి అమలుచేయాలి అనేది కూడా దుస్తరమైన నిర్ణయమే. ఎందుకంటే ఉదాహరణకు 2023నుంచి అనుకుంటే,  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పదవీ కాలానికి చాలా ముందు గానే అధికారం నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఈ లెక్కలు ముందు సరిచేయాలి.

‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ నినాదం ఆకర్షణీయమైనదే. ఇది అమలు చేస్తే  ఎన్నికల వ్యయం తగ్గుతుంది. అభివృద్ధి అవాంతరాలు లేకుండా సాగుతుంది. అనేక దేశాల్లో ఈ పద్దతి జయప్రదంగా అమలు అవుతోంది. కానీ ఒకసారి  దారి తప్పిన ఈ విధానాన్నిమళ్ళీ దారిలోకి తేవాలంటే అనేక అడ్డంకులు ఉన్న వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాలి.

లేనిపక్షంలో గుర్రం ముందు బండి కట్టిన చందం అవుతుంది.   (27-11-2020)   

26, నవంబర్ 2020, గురువారం

TO WHOMSOEVER IT MAY CONCERN - BHANDARU SRINIVAS RAO

 

“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు”
ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం.

ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక వారి చేత హామీల వర్షం కురిపిస్తుంది. ఒకటా రెండా, సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న ఉచిత సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న మేనిఫెస్టోలకు కొరత లేదు. ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ప్రభుత్వ ఖజానా డబ్బులతో, ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎన్నికల హామీల తాయిలాలను ఎలా ఇస్తారన్నడానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నడానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు.

అందుకే అయ్యలూ! ఓ పని చేయండి. ఇలా చేస్తే, మీకూ, ఓటర్లకు మాత్రమే కాకుండా ప్రభుత్వాలకు కూడా ప్రయోజనకరంగా వుంటుంది. మీ మీ పార్టీలు ఏమీ బీదవి కావు. అందరికీ తెలిసిన విషయమే. ఓట్లకోసం మీరు పెట్టే ఖర్చే ఈ వాస్తవాన్ని తెలుపుతుంది. గెలిచిన పక్షంలో ఒక్క ఏడాది పాటు మీరిచ్చిన ఈ ఉచిత హామీలను మీ పార్టీ నిధులతో అమలు చేయండి. ఆ తర్వాత సర్కారు ఖజానా నుంచి ఖర్చు పెడుదురు కాని.

మీకు ప్రజాధనం విలువ తెలిసిరావాలంటే ఇంతకంటే వేరు మార్గం కనబడడం లేదు.
ఏమంటారు?

హైదరాబాదు ఇప్పుడూ, ఒకప్పుడూ – భండారు శ్రీనివాసరావు

 (Published in today's,26-11-2020, 'నమస్తే తెలంగాణ' )

ముందు ఒకప్పటి సంగతి చెప్పుకుందాం.
రేడియో మాస్కోలో నాకు ఉద్యోగం వచ్చింది. ఢిల్లీ నుంచి ఏరోఫ్లోట్ విమానంలో మాస్కో వెళ్ళాలి. దానికి ముందు ఢిల్లీ రైల్లో వెళ్ళాలి. తెల్లారి ఉదయం భార్యాపిల్లలతో సహా బయలుదేరి సికిందరాబాదు స్టేషన్ లో రైలెక్కాలి. వీడుకోలు చెప్పడానికి చుట్టపక్కాలు చాలామంది మా ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్లకు కప్పు కాఫీ ఇవ్వడం మర్యాద. కానీ కాఫీ డికాషన్ పెట్టడానికి ఇంట్లో నీళ్ళు లేవు. రోజు విడిచి రోజు నల్లా వదిలేవాళ్ళు. అదీ ఓ అరగంట సేపు. అదీ తెల్లవారుఝామున నాలుగు గంటలకు. ఆ కాసేపటి వ్యవధానంలో ఆరు కుటుంబాల వాళ్ళు నీళ్ళు పట్టుకోవాలి. మాకు తెల్లారి ప్రయాణం కాబట్టి మిగిలిన వాళ్ళు మాకు ముందు అవకాశం ఇచ్చారు. లేని పక్షంలో కాఫీ డికాషన్ వేయడానికి కూడా నీళ్ళకు కటకట. అప్పట్లో మరో సమస్య కరెంటు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలవదు. దీనికి తోడు అధికారిక, అనధికారిక విద్యుత్ కోతలు. వోల్టేజి సమస్యలు. ఇంట్లో అన్ని లైట్లు వేస్తె, ఇంట్లోదే కాదు, వీధిలో కరెంటు స్తంభం పైన ఫ్యూజు కూడా పోతుందని చెప్పుకునే రోజులు అవి. పొద్దున్నే కరెంటు వుంటుందో ఉండదో అని కొవ్వొత్తులు కొని సిద్ధంగా పెట్టుకున్నాము, ఎందుకైనా మంచిదని. అదృష్టవశాత్తు వాటి అవసరం పడలేదనుకోండి.
మూడో రోజు మాస్కో చేరాము. అక్కడ రేడియో మాస్కోలో పనిచేసే విదేశీ ఉద్యోగుల కోసం పదమూడు అంతస్తుల భవనంలో చిట్ట చివరి అంతస్తులో మాకు అపార్ట్ మెంటు కేటాయించారు. ఇంత ఎత్తుకు నీళ్ళు వస్తాయా! రాకపోతే ఇక్కడ కూడా హైదరాబాదు నీళ్ళ కష్టాలేనా, అనుకుంటూ లోపలకు వెళ్ళాము. వెళ్ళగానే చేసిన మొదటి పని నల్లా తిప్పి చూడడం. ధారగా నీళ్ళు వచ్చాయి. ప్రతి పంపు తిప్పి చూశాము. అన్నిట్లో నీళ్ళు. ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు.
ఇలాంటి పరిస్థితి హైదరాబాదులో చూడడం అసాధ్యం అనుకున్నాము ఆ రోజు.
ఇదేదో ఉత్ప్రేక్ష కోసం రాయడం లేదు. ఆ నాటి పరిస్థితులు, మంచి నీళ్ళ కష్టాలు ఈ తరానికి తెలియచెయ్యడం కోసం ఈ ప్రయత్నం.
ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఇది కళ్ళ ముందు జరిగిన అభివృద్ధి. కానీ కనబడదు.
ఎందుకో చెబుతాను. ఇంట్లో పిల్లాడు పెరుగుతూ ఉంటాడు. కాలం గడిచిన కొద్దీ కొద్దోగొప్పో వళ్ళు చేస్తాడు. సహజం. అది రోజూ చూసేవారికి కనబడదు. ఎప్పుడో ఒక చుట్టం దిగబడతాడు. పిల్లాడ్ని చూసి ‘అరె! వీడేనా వాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. పీలగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త కండ పట్టి ముద్దొస్తున్నాడు’ అంటాడు. నిజమేనా బాబాయ్ అంటుంది తల్లి అనుమానంతో కూడిన ఆనందంతో. అలాగే ఒక నగర వాసులకు తమ చుట్టుపక్కల జరిగే అభివృద్ధి కంటికి ఆనదు.
హైదరాబాదులో జీవితం గురించి, జీవనం గురించి బాగా మధన పడిన సందర్భం ఒకటుంది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయి? ఎలా మారతాయి? నేను చెప్పేది వేరే ప్రాంతాలనుంచి వచ్చి నగరంలో స్థిర పడిన వారి భయసందేహాలు గురించి కాదు. ఇక్కడే పుట్టి పెరిగిన తెలంగాణా వాసుల సంగతి.
తెలంగాణా రాష్ట్రం ఎదుర్కోబోయే బాలారిష్టాలు గురించి అనేకమంది ఆర్ధిక నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేసారు. నవజాత రాష్ట్రంలో, ‘కారు’ చీకట్లు కమ్ముకుంటాయన్నారు. విద్యుత్ కొరతతో పరిశ్రమలు, వ్యవసాయ రంగం ఇక్కట్లపాలవుతుందన్నారు. హైదరాబాదులో వున్న ప్రముఖ కంప్యూటర్ సంస్థలు బిచాణా ఎత్తేసి బెంగుళూరో, మరో వూరో తరలి వెడతాయని జోస్యం చెప్పారు.
అసలు అన్నింటికీ మించి మరో భయం పెట్టారు. హైదరాబాదులో ఏళ్ళతరబడి నివాసం వుంటున్న సీమాంధ్ర ప్రజానీకం దిక్కుతోచని స్తితిలో, బిక్కుబిక్కుమంటూ అభద్రతాభావంతో రోజులు లెక్కించే పరిస్తితి ఏర్పడగలదని లెక్కలు వేసారు.
ఇలా లేనిపోని అనేక అనుమానాలతోనే రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. ఆరేళ్ల పైచిలుకు కాలం గతంలో కలిసిపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ అనుమానాలు పటాపంచలు అయ్యాయి. సందేహాలు తొలగిపోయాయి. అభద్రతాభావం అంతరించింది. అల్లర్లు, ఆందోళనలు కనుమరుగయ్యాయి. మొన్నీమధ్య కరోనా కర్ఫ్యూ అనే మాట వినబడింది కానీ గతంలో బాగా అలవాటయిన ఈ పదాన్ని నగర పౌరులు దాదాపు మరిచే పోయారు. రవాణా సదుపాయాలు మెరుగు పడ్డాయి. నలుమూలల్నీ కలుపుతూ మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. లింకు రోడ్లు, ఫ్లై ఓవర్లు, కాలి వంతెనల నిర్మాణంతో ట్రాఫిక్ ఇబ్బందులు అదుపులోకి వచ్చాయి.
వీటితో పూర్తిగా సమస్యలు మటుమాయం అయిపోతాయా అంటే సాధ్యం కాకపోవచ్చు. అభివృద్ధి వేగాన్ని మించి పౌర అవసరాలు త్వరితగతిన పెరిగిపోతూ ఉండడమే దీనికి కారణం.
నేను వుండేది అద్దె ఇల్లు కాబట్టి, మారాల్సిన అవసరం పడ్డప్పుడల్లా నగరంలో అనేక ప్రదేశాల్లో, ప్రాంతాల్లో నివసించే అదృష్టం పట్టింది. అన్ని చోట్లా పౌర సదుపాయాలు అద్భుతంగా వున్నాయి అని చెప్పను కానీ, మునుపటితో పోల్చుకుంటే వంద రెట్లు మెరుగు. మంచి నీళ్ళ కష్టాలు చాలావరకు తీరాయి. ఇబ్బందులు ఉండొచ్చు కానీ కటకటలు లేవు. రోజు విడిచి రోజు మంచినీళ్ళు కాకుండా ప్రతిరోజూ నల్లాలలో నీళ్ళు వదులుతున్నారు. ఏటా మేముంటున్న ఎల్లారెడ్డి గూడా అపార్ట్మెంటులో నీళ్ళ ట్యాంకులు కొనేవాళ్ళు. ఈ ఏడాది వేసవిలో ఆ అవసరం పడలేదు. బోరు బావిలో సమృద్ధిగా నీళ్ళు వచ్చాయి. ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇక్కడ హైదరాబాదులో భూగర్భ జలాల మట్టం పెరిగిందని ఒకాయన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. ప్రధానమైన రహదారులు, కాలనీ రోడ్లు బాగుపడ్డాయి. ఇక కరెంటు సంగతి చెప్పక్కర లేదు. అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటి నుంచీ ఉన్న పరిస్థితులతో పోల్చుకున్నాకూడా ఇప్పుడు రాజధాని నగరంలో విద్యుత్ సరఫరా గణనీయంగా మెరుగుపడింది. కరెంటు కోతలనేవి గతకాలపు ముచ్చటగా మారాయి. ఓల్టేజి సమస్యలు బాగా తగ్గిపోయాయి. గత అయిదారేళ్ళలో వచ్చిన అద్భుతమైన మార్పు ఇది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సమాచార సలహాదారుడు, ఆర్ధిక వ్యవహారాల నిపుణుడు అయిన సంజయ్ బారు వరాలమూట లాంటి ఒక మాట అన్నారు.
నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ వ్యతిరేకి. కరడుగట్టిన సమైక్యవాది. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని ఆయన ఏనాడూ దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత అన్నమాట ఇది. నిజానికి ఒక వ్యాసంలో అక్షరాలా రాసిన మాట ఇది.
‘డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం ఇవేవీ చెరిగిపోలేదు. (తెలంగాణా ఏర్పడ్డ తరువాత) ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
సమైక్యవాద భావజాలం కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి నుంచి ఇటువంటి కితాబు అంటే, హైదరాబాదు నగరం అందరికీ నివాసయోగ్యం అనే యోగ్యతాపత్రం అన్నమాట.

తోకటపా: ఆకస్మికంగా ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కొంత అంతరాయం కలిగిన మాట వాస్తవం. అలాగే, గత వందేళ్ళలో కనీవినీ ఎరుగని వర్షాల వల్ల నగర జీవనం అస్తవ్యస్తం అయింది. రహదారులు దెబ్బతిన్నాయి. అనేక కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ స్థాయిలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం, వాటివల్ల కలిగిన కష్టనష్టాలను పూర్తిగా పూడ్చుకోవడం ఎవరివల్లా కానిపని.