20, నవంబర్ 2020, శుక్రవారం

మొదటి సంబంధం పెళ్లి – భండారు శ్రీనివాసరావు

 మితృలు మురళీకృష్ణ గారు తమ పెళ్లి చూపుల వార్షికోత్సవం సందర్భంగా ఒక పోస్టు పెట్టారు.

ఆయనకూ, వారి శ్రీమతికీ అవే మొదటి పెళ్లి చూపులు కనుక వార్షికోత్సవం చేసుకునే భాగ్యం వారికి దక్కింది. ఇన్నేళ్ళుగా దక్కుతూ వచ్చింది. చాలామంది విషయంలో ఇది పేరాశే! ఎందుకంటే బోలెడు చూపులు చూస్తేనే కాని ఓ పెళ్లి కాదు.
మురళీకృష్ణ గారికి 1983 నవంబరు ఇరవైన ఆ మొదటి పెళ్లి చూపులు జరిగితే, ఎన్నికయిన మూడునెలల పిదప అమెరికా అధ్యక్షుని పదవీస్వీకారం మాదిరిగా, తమ పెళ్లి మాత్రం అయిదారు నెలల తర్వాత 1984 మే నెల 5 వ తేదీన జరిగిందని రాసుకొచ్చారు. ఆ దంపతులు అదృష్టవంతులు. ఇలా పెళ్లి చూపులకీ, పెళ్ళికీ వార్షికోత్సవాలు చేసుకుని పెద్దల ఆశీర్వచనాలు, పిన్నల శుభాకాంక్షలు ఏటా అందుకునే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
ఇది చదివి ఆనందించి అభినందిస్తే పోయేది. ఉన్నవాడిని ఊరుకోక మాది పెళ్లి చూపులు లేని పెళ్లి అని కామెంటు పెట్టాను. అదేమిటి? అన్నారాయన మర్యాదగా. పెళ్ళికాని పెళ్లి కూడా అని రెట్టించాను. అదెలా, కమ్యూనిస్టు పెళ్ళా అన్నారాయన ఒకింత సందేహంతో.
‘కళ్ళనీళ్ళ పెళ్లి’ అన్నాను
మళ్ళీ ఇదేమి పితలాటకం ఆయన అనకముందే అదెలాగో చెప్పేశాను.
గతంలో చెప్పిందే. మురళీకృష్ణ గారిలాగా అది చదవని వారికోసం కూడా.
అదే ఇది :

1971 డిసెంబరు 15 వ తేదీ రాత్రి మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులు. మధ్యమధ్యలో ఆగుతూ తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఎస్వీ కాటేజీలో పైన గదులు తీసుకున్నాము. పురోహితుడు ఎలా దొరికాడో తెలవదు. మా ఆవిడ పిన్ని వసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరె పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టు తో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి. తొమ్మిదీ పది గంటల నడుమ పెళ్లి జరిగిపోయింది. ఫోటోలు లేవు, వీడియోలు ఎట్లాగో లేవు. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము. ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. “నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావ"ని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.

రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత 16 వ తేదీ రాత్రి బయలుదేరి రైల్లో మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము. మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది. మమ్మల్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
పెళ్లోద్దు పెళ్ళాం కావాలి’ అనే నా మొండి పట్టుదల ఫలితం మా పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళనీళ్ళు పెట్టించింది కూడా. బహుశా అదే ఆఖరిసారి కావచ్చు.
మా పెళ్ళికి పెద్దల ఆమోదం లభించింది అన్న సంతోషంలో ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకుని మా పెళ్లి వృత్తాంతం తెలియచేశాము. ఆయన మా ఇద్దర్నీ మెచ్చుకోలుగా చూస్తూ, ‘రోజూ ఎన్నో ఆదర్శాలు వల్లె వేస్తుంటాము. నువ్వు చేసి చూపించావు. వెళ్ళండి. హాయిగా కాపురం చేసుకోండి. మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరుతున్నాను, అని చెప్పేవరకు నీకు సెలవు ఇస్తున్నాను. ఇదే మీకు నా పెళ్లి కానుక’ అన్నారాయన.


వాసికెక్కిన వేణుగోపాల్

 “మీది కంభంపాడు కదా!”

చాలా ఏళ్ళ క్రితం  హైదరాబాదులోని ఆర్టీసీ  కళ్యాణమండపం దగ్గర ఉన్న  10 టీవీ స్టూడియోలో ఉదయం డిబేట్ అయిన తర్వాత లిఫ్ట్ వైపు వెడుతుంటే వినపడ్డ పలకరింపు.

పక్కకు తిరిగి చూస్తే నవ్వు మొహంతో కనపడ్డాడు వేణుగోపాల్.

“నా పేరు వాసిరెడ్డి వేణుగోపాల్” అని  పరిచయం చేసుకున్నాడు.

జర్నలిస్టు వేణుగోపాల్ గురించి గొప్ప విషయాలు చాలా విన్నాను కానీ ఎలా ఉంటాడో తెలియదు. అంతటి మనిషిలో ఈ నమ్రత ఏమిటి?

“మీకెలా తెలుసు మాది కంభంపాడు అని?”

నా ప్రశ్నకు ఆయన భళ్ళున నవ్వాడు.

”అదంతా ఓ కధ మరోసారి చెబుతా” అన్నాడు.

మా ఊరు ప్రస్తావన తేగానే నేనే అడిగి ఆయన నెంబరు తీసుకున్నాను.

తర్వాత మళ్ళీ కలిసింది లేదు, ఏదో అప్పుడప్పుడూ ఫోన్లో పలకరింపులు తప్ప.

అలా అలా కాలం గడిచి పోతుండగా మళ్ళీ వేణుగోపాల్ తారసపడ్డాడు. ఈసారి బయట కాదు, ఫేస్ బుక్ లో. అదీ ఓ చేతిలో రోలు, మరో చేతిలో రోకలి పట్టుకుని. వేణు విశ్వరూపాన్ని ఆయన రాతల్లో చూశాను.

ఇంత గొప్పవాడు మా ఊరు గురించి ప్రస్తావించాడు అదేదో తెలుసుకోవాలని మళ్ళీ  నేనే ఫోన్ చేశాను. అప్పుడు తెలిసింది ఆయన కూడా చిన్నప్పుడు కొంత కాలం మా ఊరు కంభంపాడులో గడిపాడని. ఆ వివరాలన్నీ వారి సోదరి వాసిరెడ్డి పద్మగారు ఓ ఉదయం టీవీ చర్చల్లో కనబడి, నా ఆహ్వానం మేరకు మా ఇంటికి వచ్చి మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూ చెప్పారు. వారి అమ్మగారితో కూడా ఫోనులో మాట్లాడించారు.  

ఇక అప్పటినుంచీ ఆయన గురించి తెలుసుకోవడం నా వ్యాపకం అయిపోయింది. ఇదంత పెద్ద కష్టం అనిపించలేదు. ఫేస్  బుక్ లో ఆయన పోస్టింగులు చదివితే చాలు ఏరోజుకారోజు ఆయన దినవారీ వ్యవహారాలన్నీ తెలిసిపోతాయి. ఎక్కడ ఉన్నదీ, ఏం చేస్తున్నదీ ఏ ఊరు ఎప్పుడు వెళ్ళింది, ఏ గుడి వెనక ఏ చరిత్ర వుంది అన్నీ సవివరంగా రాసేవారు. ఏదీ దాచుకునే బాపతు మనిషికాదు. ఏదీ గోప్యం కాదు. అన్నీ బహిరంగమే. అన్నీ బాహటమే. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించేంతగా వుండేది వాసిరెడ్డి వేణుగోపాల్ రాతల తీరు.

కుక్కలంటే ఇష్టం. మొక్కలంటే ఇష్టం. చుట్టుపక్కల వుండే పిల్లలంటే ఇష్టం. వాళ్ళలో  ఒకడై ఆటలాడడం ఇష్టం.

పుస్తకాలంటే ప్రాణం. చదవడం ఇష్టం. చదివింది రాయడం ఇష్టం. రాయడంలో తృప్తిని ఆసాంతం ఆస్వాదించడం ఇష్టం.

ఇన్ని ఇష్టాలు వున్న మనిషి కాబట్టే అందరికీ ఇష్టుడు అయ్యాడు. రోలూ రోకలితో ఫేస్ బుక్ లో చెలరేగిపోయాడు. రోటి పచ్చడి అనేది ఆయన ఇంటి పేరుగా మారేంత స్థాయిలో వాటికి ప్రాచుర్యం కల్పించాడు. ఇదేమంత మామూలు విషయం కాదు. ఒకరకంగా వాటికి బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చాడు.

వేణుగోపాల్ జర్నలిస్టు అనేవాడికి  ఎడమ కాలి దురద వుండాలని చెప్పేవాడు. తనకు ఆ దురద పుష్కలంగా వుందని నిరూపిస్తూ,  చేసిన ప్రతి ఉద్యోగాన్ని ప్రత్యామ్నాయం చూసుకోకుండానే ఎడమ కాలితో తన్నేసేవాడు. ఇలా ఎన్ని ఉద్యోగాలు ఆయన పాదతాడనానికి గురయ్యాయో నాకైతే లెక్క తెలియదు.

పుస్తకాలమీద ఉన్న పిచ్చిఆపేక్షతో సొంతంగా వాసిరెడ్డి పబ్లికేషన్స్ పెట్టి, వ్యాపార సులువులు తెలియక  రెండు చేతులూ  మోచేతుల దాకా కాల్చుకున్నాడు. కానీ నో రిగ్రెట్స్. ఇష్టంతో చేసే పనిలో కష్టం ఎదురైనా పరవాలేదనే తత్వం.

అలాంటి మనిషిని ఓ జబ్బు వశపరచుకుంది. అలాంటి మనిషిని ఆ జబ్బు కుంగతీసింది. తీశానని అనుకుంది. కానీ వేణు అట్లాంటి ఇట్లాంటి మనిషి కాదని, దానికీ తెలిసివచ్చింది. వేణుని వెంటబెట్టుకుని వెళ్ళడానికి నెలల తరబడి శ్రమించింది. దాని పోరాటం చూసి దయాళువు అయిన వేణు గోపాలే చివరికి లొంగిపోయాడు.

పరిచయం ఉన్న వ్యక్తుల్నీ, ఆయనంటే పడిచచ్చే స్నేహితుల్నీ, ఆడుకున్న పిల్లల్నీ, దాచుకున్న పుస్తకాల్నీ, పెంచుకున్న కుక్కల్నీ, మొక్కల్నీ అందరినీ, అన్నింటినీ బాజాప్తాగా ఒదిలేసి , తన అలవాటు ప్రకారం ఈ లోకాన్ని ఎడంకాలితో తన్నేసి వెళ్ళిపోయాడు వాసిరెడ్డి వేణుగోపాల్.  

ఆ కుక్కల, మొక్కల కన్నీరు తుడిచేది ఎవరు?


(వాసిరెడ్డి  వేణుగోపాల్ సంస్మరణ సంచిక కోసం)

18, నవంబర్ 2020, బుధవారం

కాంగ్రెస్ కోలుకుంటుందా ? - భండారు శ్రీనివాసరావు

 ఈ అంశంపై 10 టీవీ వాళ్ళు ఇంటికి వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు రికార్డు చేసుకుని వెళ్ళారు. భస్మాసుర హస్తం అనే శీర్షికతో ఈ సాయంత్రం ప్రసారం చేసిన వైడ్ యాంగిల్ కార్యక్రమంలో దాన్ని ప్రసారం చేశారని ఓ మిత్రుడు ఫోన్ చేసి చెప్పారు. ఆ ఫోటో క్లిప్పింగ్ పంపారు. రికార్డు చేసిన అభిప్రాయంలో ఎంత టెలికాస్ట్ చేసారో తెలియదు. ఇలా రికార్డు చేసినవన్నీ ప్రసారం చేయాలని రూలేమీ లేదు కూడా.



పోతే నాకు గుర్తు ఉన్నంత వరకు వాళ్ళ ప్రశ్నలకు  నా జవాబులు:

“కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయిలో ఆల్టర్ నేటివ్ పాలిటిక్స్ మీద ఆధారపడడం మొదలయింది. ‘ఈసారి మనల్ని కాదని వేరే పార్టీని ఎన్నుకున్నారు. వచ్చేసారి ప్రజలకు మనమే  ప్రత్యామ్నాయం అనే ధోరణి’ అన్నమాట. రెండే రెండు పార్టీల వ్యవస్థ వున్నప్పుడు ఈ లెక్క సరి కావడానికి అవకాశం వుండేదేమో. బహుళ పార్టీల వ్యవస్థ ఆవిర్భావం తరవాత ఈ లెక్క తప్పుతూ వచ్చింది. మరోపక్క దేశంలో  ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరుగుతున్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లెక్కపెట్టలేదు. తమిళనాడులో పరిస్థితి చూసిన తర్వాత అయినా  దిద్దుబాటు చర్యలు తీసుకుని వుంటే ఎలా ఉండేదో. అప్పుడెప్పుడో పార్టీకి  స్వర్ణ యుగం నడిచిన కాలంలో అక్కడ కట్టుకున్న పార్టీ ప్రధాన  కార్యాలయం తప్పిస్తే , పార్టీకి చెప్పుకోతగ్గ  నాయకులు కానీ, కార్యకర్తలు  కానీ వున్నారా అంటే అంటే చప్పున జవాబు చెప్పలేని పరిస్థితి”

 

“జాతీయ స్థాయిలో కూడా పార్టీది అదే స్థితి. రాహుల్ వయసులో చిన్నవాడు. భార్యా పిల్లల బాధ్యత కూడా లేనివాడు. పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించగలిగిన  వెసులుబాటు  వున్నవాడు.  రాజకీయంగా మోడీని ఎదుర్కోవడానికి అన్ని అర్హతలు హంగులు రాహుల్  గాంధీకి, ఆయన పార్టీకి  వున్నాయి. అనుభవం అందామా మోడీ కంటే ముందునుంచే, సుదీర్ఘ చరిత్ర కలిగిన కలిగిన  ఒక జాతీయ  పార్టీకి నాయకత్వం వహిస్తూవస్తున్నవాడు. పార్టీలో ఆయన మాటకు ఎదురు చెప్పేవారు లేరు. అయినాసరే, పార్టీకి అత్యున్నత నేతగా ఆయన కొనసాగిన కాలంలో ఏ ఒక్క ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ గణనీయమైన విజయాన్ని సాధించలేకపోయింది. కొన్ని రాష్ట్రాలలో పై చేయి అనిపించుకున్నా, బీజేపీ రాజకీయ చతురంగపు ఎత్తుగడల్లో అధికారంతో పాటు సమర్ధులైన  నాయకులను కూడా ఆ రాష్ట్రాల్లో  కోల్పోయింది. ఒకానొక సమయంలో ప్రధాని అయ్యే అవకాశాన్ని కూడా రాహుల్, తన తల్లి సోనియా మాదిరిగానే వదులుకున్నాడు. నేటి రాజకీయ ప్రమాణాలతో పోలిస్తే  నిజానికి ఇది ఎంతో పెద్ద త్యాగం. మామూలు విషయం కాదు. దేశ ప్రధానిగా కొద్ది రోజులు వున్నా చాలు అని ఆశ పడే రాజకీయ నాయకులకు  కొదవ లేని దేశం మనది. అంత త్యాగనిరతిని ప్రదర్శించి కూడా ఆ విషయం ప్రజల గుండెలకు తాకేలా చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు.

“కాంగ్రెస్  పార్టీకి  చాలా రాష్ట్రాలలో పటిష్టమైన స్థానిక నాయకత్వం వుంది. కానీ ఆ నాయకులు మరింత బలపడితే తమకు ఇబ్బంది అని భావించే  వృద్ధ నాయకుల మాటకే  ఆ పార్టీలో పెద్దపీట. దాని ఫలితమే ఈనాటి దుస్థితి.

“ఇక తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోవడం అనేది  కేవలం స్వయంకృతాపరాధమే. దేశమంతా పార్టీ తుడిచిపెట్టుకుని పోయిన రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రజలు ఆ పార్టీని అక్కున చేర్చుకుని అందలం ఎక్కించారు. అలాంటి రాష్ట్రాలలో కూడా పార్టీ ఉనికి ప్రశ్నార్ధకం కావడం చేజేతులా చేసుకున్నదే.

“తెలంగాణా ఇచ్చింది సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్ అయినప్పటికీ అది ఇచ్చిన తీరును తెలంగాణా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఉదాహరణ చెప్పాలంటే ఒక పిల్లవాడు తల్లిని చాక్ లెట్ కొనిపెట్టమంటాడు. తల్లికి అదేమంత పెద్ద విషయం కాదు, పిల్లవాడు అడిగింది కూడా కొండమీది కోతిని కాదు. అయినా పిల్లవాడు పొర్లిపొర్లి ఏడ్చినదాకా ఆగి, ఆ తల్లి  అప్పుడు కొనిపెట్టిందనుకోండి, ఆ పిల్లాడు కూడా నేను అడిగితే  కొనలేదు, గుక్కపట్టి ఏడిస్తే కొనిచ్చింది అనే అభిప్రాయంలోనే ఉంటాడు. అదే జరిగింది.  ఇచ్చిన వరదాన  ఫలం తెలంగాణాలో లభించలేదు. అటు ఆంధ్రా ప్రాంతంలోని  ప్రజలు, కాంగ్రెస్ రాష్ట్రాన్ని నిలువునా చీల్చింది అనే ఆగ్రహంతో ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. చివరికి  ఉభయ భ్రష్టత్వం అనే సామెత నిజమైంది”

“అయితే ఇంతటితో కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది అనే నిర్ధారణకు రానక్కర లేదు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, యువరక్తంతో పార్టీని నింపి, ప్రజల సమస్యలను పట్టించుకుంటూ, నవతరం ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ విధి విధానాలను తీర్చి దిద్దగలిగితే. ....ఏమో గుర్రం ఎగరావచ్చు.

“ఒకప్పుడు లోకసభలో రెండే రెండు సీట్లున్న బీజేపీ, ఈనాడు అత్యధిక మెజారిటీతో దేశాన్ని పాలిస్తోంది. కంటికి కనబడుతున్న ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం గుర్తు పెట్టుకోవాలి”  (18-11-2020)         

ఢిల్లీ తెలుగు అకాడమి నాగరాజు ఇకలేరు

 

ఢిల్లీలో తెలుగు వారి  మరో సాంస్కృతిక కార్యశూరుడు కన్ను మూశారు.

ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్.వి.ఎల్. నాగరాజు కరోనా కాటుకు బలయ్యారు. సన్ షైన్ ఆసుపత్రిలో గత పదమూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ కొద్ది సేపటి క్రితమే మరణించినట్టు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఆనంద కుమార్ తెలియచేసారు. విషాదం ఏమిటంటే నాగరాజు అమ్మగారు కూడా కరోనా చికిత్స తీసుకుంటూ వారం క్రితమే చనిపోయారు.


(ఢిల్లీ తెలుగు అకాడమి  నాగరాజు)


ఢిల్లీ కేంద్రంగా తెలుగు అకాడమీ స్థాపించి పెద్ద సంఖ్యలో సాంస్కృతిక కార్యక్రమాలను ఒంటి చేత్తో నిర్వహించిన నాగరాజు మృతి తెలుగు సాంస్కృతిక లోకానికి తీరని లోటు.

ఆలిండియా రేడియో న్యూస్ రీడర్ గా ఉంటూ ఢిల్లీలో తెలుగువారికి తలలో నాలుకలా మసలుకున్న ఏడిద గోపాల రావు మరణించిన కొద్ది రోజులకే నాగరాజు కూడా కన్నుమూయడం సాంస్కృతిక  ప్రియులకు తట్టుకోలేని విషాదం.

(17-11-2020)

16, నవంబర్ 2020, సోమవారం

బెదురుగొడ్డు (కథానిక) - భండారు శ్రీనివాసరావు

 

పొద్దున్నే సెల్ మూగడంతో సుబ్బారావుకు మెలకువ వచ్చింది.
‘కరోనా భయంతో ఎన్నాళ్ళు అలా కొంపలో పడుంటావు. మధ్యాన్నం అలా శేఖరం ఇంటికి పోయొద్దాం, రెడీగా వుండు, ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను’ అని కట్ చేశాడు సుందరం.
సుబ్బారావు ఎప్పుడూ ఇంతే! అవతలవాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించడు.
స్నానం చేస్తుంటే రాత్రి అనుభవం గుర్తుకు రావడం మొదలయింది సుబ్బారావుకి. రాత్రి గడుస్తుందా లేదా అనేంత భయకరమైన అనుభవం.

తెల్లవారుతుండగా కాబోలు తల భారంగా అనిపించింది. ముక్కు పూడుకుపోయినట్టు శ్వాస పీల్చడం కష్టం అయింది. పక్క మీద నుంచి లేచి కూర్చోలేకపోయాడు. కరోనా లక్షణాలేమోనని దడ పట్టుకుంది. భార్యను లేపి చెప్పడానికి కూడా భయపడ్డాడు. ఎందుకంటే ఆవిడ తనలా కంగారు పడకపోగా తేలిగ్గా తీసుకుని ఎదురు అక్షింతలు వేస్తుంది. ‘మీకు అన్నీ అనుమానాలే! కరోనా లేదు, పాడూ లేదు. మీకేదో కల వచ్చింది. కాసిని మంచి నీళ్ళు తాగి పడుకోండి’ అంటుంది, తనకు తెలుసు.

సుబ్బారావు ఫోనుకు మెలకువ వచ్చి లేచినప్పుడు మళ్ళీ ఏమీ లేదు. అంతా మామూలుగానే వుంది. బహుశా కరోనా గురించే అస్తమానం ఆలోచిస్తూ వుండడం వల్ల ఇలాటి కల వచ్చిందేమో. అందరూ అంటున్నట్టు.
స్నానం చేసి భార్య పెట్టిన టిఫిన్ తినేసరికి సుందరం రానే వచ్చాడు. చేతులు శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కుని, మొహానికి కొత్త మాస్కు తొడుక్కుని సుబ్బారావు కారెక్కాడు. ఎక్కడో వూరి బయట ఓ గేటెడ్ కమ్యూనిటీలో శేఖరం విల్లా కొనుక్కున్నాడు.
కారులో వెడుతుంటే చెప్పాడు సుందరం, శేఖరానికి కేన్సర్ పాజిటివ్ అని. అది విని నివ్వెరపోయాడు సుబ్బారావు. శేఖరం సిగరెట్ తాగడు, మందు అలవాటు లేదు, కనీసం పాన్ కూడా వేసుకోడు. అతడికి కేన్సర్ రావడం ఏమిటి?
ముగ్గురూ బాల్యం నుంచి స్నేహితులు. ఉద్యోగాలు కూడా ఉన్న ఊళ్లోనే రావడంతో ఆ స్నేహం మరింత బలపడి కొనసాగుతూ వచ్చింది. కాకపోతే చిన్నతనంలో వారిమధ్య ఈగోలు లేవు. ఇప్పుడు అవి వచ్చిపడ్డాయి.

శేఖరం అంటే సుబ్బారావుకు కాసింత అసూయ. ఎవర్నీ మాట్లాడనివ్వడు. తను చెప్పిందే వేదం అన్నట్టుగా వుంటుంది అతడి వ్యవహారం. అది సుబ్బారావుకు నచ్చదు, కానీ పైకి చెప్పలేడు. అది అతడి బలహీనత.

కేన్సర్ పేరు వెంటే చాలు జనం డీలా పడిపోతారు. సుబ్బారావు కజిన్ కు డాక్టరు బయాప్సీ చేయాలని చెప్పగానే ఇంటిల్లిపాదీ కుంగిపోయారు. ఒకపూట భోజనాలే చేయలేదు. బయాప్సీ రిపోర్ట్ వచ్చి ఏమీ లేదని తెలిసేదాకా ఎవ్వరూ సరిగా ఊపిరే పీల్చుకోలేదు. కేన్సర్ అంటే అంత భయం. ఎందుకంటే దానికి చికిత్స లేదని తెలిసి కూడా చేయించాలి. మనిషి చనిపోతాడని తెలిసి కూడా చివరిదాకా బతికించుకునే ప్రయత్నం చేయాలి. జబ్బుతో రోగి, ఖర్చుతో ఇంటివాళ్ళు కుంగి కృశించిపోతారు. ఫలితం లేని ప్రయత్నం. అయినా చేయక తప్పదు.
మరి శేఖరం ఎలా ఉన్నాడో. బతకడం కష్టం అని తెలిసిన వ్యాధి పట్టుకున్నదని తెలిసినప్పుడు, ఆ మనిషిలో వెనుకటి గాంభీర్యం అలాగే వుండదు. ఆ స్థితిలో అతడ్ని ఎలా పలకరించాలి? ఎలా ద్జైర్యం చెప్పాలి?

“చూడు సుబ్బారావ్!”
సుందరం పిలుపుతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు.
‘అతడికి కేన్సర్ అని మనకు తెలిసినట్టు అతడికి తెలియదు. కాబట్టి తొందరపడి నోరు జారకు’ అని హెచ్చరించాడు సుందరం.

గేటెడ్ కమ్యూనిటీ ఎంట్రెన్స్ లో కరోనా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని శేఖరం విల్లాకు చేరుకున్నారు.
ఇద్దరూ మెట్లెక్కి డోరు దగ్గర నిలబడి కాలింగు బెల్ నొక్కారు.

లోపల ఓ గదిలో శేఖరం పక్క మీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాడు. పక్కన స్టూలు మీద మందు సీసాలు, బత్తాయి రసం గ్లాసు.
ఇలా ఊహించుకుంటున్న సుబ్బారావుకు ‘తలుపు తీసే వుంది, లోపలకు రండి’ అని ఖంగున వినపడింది శేఖరం గొంతు. సుబ్బారావు ఆశ్చర్యపోతూ సుందరంతో కలిసి లోపలకు అడుగుపెట్టాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతడ్ని మరింత నిశ్చేష్టుడిని చేసింది.

శేఖరం. అతడి భార్య సోఫాలో కూర్చుని నెట్ ఫ్లిక్స్ లో Bad Boy Billionaires: India వెబ్ సీరియల్ ఎపిసోడ్ ఏదో చూస్తున్నారు.
‘ఈ బయో పిక్ సీరియల్ బాగా తీశారు. ఇలాంటివి తీయాలంటే కాస్త గుండె ధైర్యం కావాలి. అప్పటికీ ఎన్నో కోర్టు కేసులు. అన్నీ తట్టుకుని ఈ నెల మొదట్లో టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు” అంటున్నాడు శేఖరం టీవీ ఆపుచేస్తూ.

సుబ్బారావుకి అసలేం జరుగుతున్నదీ అర్ధం కావడం లేదు. శేఖరాన్ని ఎలా ఓదార్చాలి అని వస్తే అతగాడేమో బయో పిక్ సీరియల్స్ గురించి మాట్లాడుతున్నాడు.

“రైట్ సుందరం మంచి పని చేసావు, బెదురుగొడ్డును కూడా వెంటబెట్టుకు వచ్చావ్”
సుబ్బారావుకు రోషం పొడుచుకు వచ్చింది. కానీ శేఖరం ప్రవర్తన వల్ల కలిగిన ఆశ్చర్యం దాన్ని పక్కకు నెట్టేసింది. సుందరం తప్పకుండా పొరపడివుంటాడు, సందేహం లేదు. శేఖరం నిక్షేపంగా వున్నాడు, పైగా అతడి పొగరు కూడా ఏమీ తగ్గలేదు, లేకపోతె తనని అంత మాట అంటాడా! బెదురుగొడ్డట బెదురుగొడ్డు.

ఇంతలో సుబ్బారావు ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తూ శేఖరం భార్య మాట వినపడింది.
“ఏమండీ ఈ కరోనా కారణంగా మీరిద్దరూ మా ఇంటికి రావడమే మానేశారు. మామూలుగా అవుతే మిమ్మల్ని భోజనం చేసిపోమ్మనేదాన్ని. కానీ మీరు ఏమంటారో అని సంక్షేపించాను” అంటూనే శేఖరం భార్య మూడు గాజు గ్లాసులు తెచ్చి మేజా బల్ల మీద పెట్టింది.
“కరోనా అయినా వీటికి ఇబ్బంది లేదు కదా! మా వారికి కూడా మంచి కంపెనీ” అన్నదావిడ.

“అరేయ్ మీకు తెలియదు కదా మా డాక్టరు చెప్పాడు, మీరేం చేయాలనుకుంటే అది చేసేయండి. అసలే కరోనా రోజులు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ మధ్యనే మా బావమరది మంచి బాటిల్ తెచ్చి పెట్టాడు. ఇవ్వాళ మీరు నాకు కంపెనీ ఇచ్చి తీరాలి” అన్నాడు శేఖరం, బల్ల మీద సోడాలు సర్దుతూ.

సుబ్బారావు ఇదంతా నిలువుగుడ్లు వేసుకుని చూస్తున్నాడు. బీరుకు, విస్కీకి తేడా తెలియని శేఖరం మందు పార్టీ ఇవ్వడం ఏమిటి? ఇచ్చెనుబో తను కూడా తాగుతాను అనడం ఏమిటి? అదీ భార్య ముందే. ఏమిటో, అంతా విచిత్రంగా వుంది. కేన్సర్ భయంతో వచ్చిన మతి చాంచల్యం కాదుకదా!

ఈ ఆలోచనల్లో ఉండగానే శేఖరం తనకు గ్లాసు అందించి చీర్స్ చెబుతున్నాడు.
“మామూలుగా అయితే మా ఆవిడ మంచింగ్ ఏదో చేసేది. కానీ మధ్యలో కరోనా భయం ఒకటి ఏడిసింది కదా! భయం అంటే జ్ఞాపకం వచ్చింది. మన బెదురుగొడ్డు ఈ కరోనా కాలాన్ని ఎలా నెట్టుకు వస్తున్నాడో. వీడి భయం ఏమో కానీ పాపం ఆ మహాతల్లిని ఏం బెదరగొడుతున్నాడో ఏమో”

సుబ్బారావుకు అనుమానం కొండలా పెరిగిపోతోంది. సుందరం చెప్పింది నిజమేనా! శేఖరానికి కేన్సర్ వచ్చిన మాట కరక్టేనా! మరి వీడేమిటి ఆ జబ్బు వచ్చింది తనకు కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. సరే వీడంటే మొండి ఘటం. మరి వాడి భార్య సంగతి. ఆమె మోహంలో లేశమాత్రం కంగారు లేదు. పైగా మొగుడికి కంపెనీ ఇమ్మంటుంది.

ఇంతలో శేఖరం మాట వినపడి సుబ్బారావు ఈ లోకంలోకి వచ్చాడు.
“అరేయ్ కంగార్రావ్ నువ్వు వినాలిరా ఈ సంగతి. మొన్నీమధ్య పొట్టలో అదేపనిగా నొప్పిగా వుంటుంటే తెలిసిన డాక్టరుకి చూపించాను. ఆయన క్రియాటి నైన్ టెస్ట్ చేయించాడు. One point two వుంది. పర్వాలేదు కిడ్నీ ప్రాబ్లం కాదేమో అన్నాడు. బాటిల్ ఇచ్చాడు అని చెప్పానే మా బావమరది, వాడు మిలిటరీలో డాక్టరు. రిపోర్టులు అవీ చూసి ఒకసారి సీటీ స్కాన్ తీయిద్దాము డౌట్ క్లియర్ అవుతుంది అన్నాడు, ఆ డౌటేమిటో చెప్పకుండా. స్కాన్ చేయిస్తే ఇదిగో ఇది బయటపడింది. తరువాత బయాప్సీ అన్నారు. అనగానే అర్ధం అయిపొయింది ఇదేదో కేన్సర్ బాపతు అని. అదే కన్ఫర్మ్ అయింది. ముందే తెలిసింది కాబట్టి కొంత ఛాన్స్ వుంది అంటున్నారు డాక్టర్లు. చాన్స్ అంటే తెలుసు కదా Life Extension అన్న మాట. కాబట్టి నేను కూడా చాన్స్ తీసుకో దలచుకోలేదు. ఇన్నాళ్ళు తాగుడూ గట్రా ఏమీ లేకుండా గడిపేశాను. అ డాక్టర్ గారేమో ఇక నీ ఇష్టం కానీయ్ అని పచ్చ జెండా ఊపాడు. వెంటనే మీ ఇద్దరూ జ్ఞాపకం వచ్చారు. ఇన్నేళ్ళు మీరు ఎప్పుడు అడిగినా నేను కంపెనీ ఇవ్వలేదు, అందుకని నేనే మీకు హోస్ట్ చేయాలని సుందరానికి ఫోన్ చేసి చెప్పాను సుబ్బును కూడా తీసుకురమ్మని. ఇద్దరూ వచ్చారు, సంతోషం. నాకు ఈ ఆట రూల్స్ ఆట్టే తెలియవు. మీరే సెల్ఫ్ హెల్ప్ చేసుకోవాలి, నాకూ చేయాలి. నా భార్య ఏమీ అనుకోదు, ఆమెకు కూడా విషయం అర్ధం అయిపోయింది. మన చేతిలో ఏమీ లేదని. కానీ మన చేతిలో గ్లాసులు వున్నాయి. రైట్! చీర్స్ చెప్పండి ఫర్ మై హెల్త్”

సుబ్బారావుకు ఆ క్షణంలో, శేఖరంలో తను ఇంతకుముందు ఎన్నడూ చూడని కొత్త శేఖరం కనిపించాడు.

(16-11-2020)

12, నవంబర్ 2020, గురువారం

వార్తలు చదివిన ఏడిద గోపాల రావు ఇక లేరు

 “ఢిల్లీలో ఏడిద గోపాలరావు గారని వుంటారు, ఆయన్ని కలవండి”ఇప్పటి పరిస్తితులు వేరు కానీ డెబ్బయ్యవ దశకంలో ఎవరైనా పనిపడి ఢిల్లీ వెళ్ళాల్సివస్తే ముందు వినవచ్చే ఉచిత సలహా ఇది.

ఆ మాట విన్నవాడి పంట పండినట్టే. ఒక్కసారి ఆయన్ని కలిస్తే చాలు మళ్ళీ ఢిల్లీ వదిలి వెళ్ళే వరకు వాళ్ళ బాధ్యతను ఆయన స్వచ్చందంగా, ఆనందంగా భుజానికి ఎత్తుకుంటాడు అని ప్రసిద్ధ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు చెబుతుండేవారు. ఆయన మాట అక్షరాలా నిజం.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఢిల్లీలో తెలుగువాడి కేరాఫ్ అడ్రస్ ఏడిద గోపాలరావు అంటే అతిశయోక్తి కాదు.

ఆయన పనిచేసేది ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తావిభాగంలో. ఉద్యోగం తెలుగు న్యూస్ రీడర్. ముప్పూటలా వార్తలు చదివే డ్యూటీ వుంటుంది. మరి ఈ ప్రజాసేవకు టైం ఎలా సర్దుబాటు చేసుకునే వారో ఆ దేవుడికే తెలియాలి.

1975 లో నేను రేడియోలో చేరిన చాలా కాలం తర్వాత ఆయన్ని కలుసుకునే అవకాశం చిక్కింది. ఒక రోజు నేను సచివాలయం బీట్ పూర్తిచేసుకుని రేడియో స్టేషన్ కు వచ్చేసరికి న్యూస్ రూములో ఎవరో కోటూబూటుతో ఒక కొత్తమనిషి కనిపించారు.

వెంకట్రామయ్య గారు కాబోలు నాకు పరిచయం చేస్తూ చెప్పారు, ఏడిద గోపాలరావని. వార్తల్లో పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. సూటు, టై మినహాయిస్తే (ఢిల్లీలో ఈ ఆహార్యం తప్పనిసరి అని తర్వాత తెలిసింది) చాలా సింపుల్ గా కానవచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ వస్తే కలవమని తన విజిటింగ్ కార్డు ఇచ్చారు. కాసేపు వుండి ఢిల్లీ కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు.

ముందే చెప్పినట్టు గోపాలరావు అనే వ్యక్తి రేడియో వార్తలు చదివేవాడిగా ఎంతటి పేరు సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువ పేరుప్రఖ్యాతులు రంగస్థల నటుడిగా మూటగట్టుకున్నారు. దానికి తోడు దేశ రాజధానిలోని వివిధ తెలుగు సాంస్కృతిక సంఘాలు, సంస్థలకు నడుమ ఒక వారధిగా పనిచేశారు.
శంకరాభరణం వంటి అత్యద్భుత చిత్రాలను రూపొందించిన ఏడిద నాగేశ్వరరావు, గోపాలరావుకు స్వయానా సోదరుడు. సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల పట్ల ఆయనలో అభిరుచి పెంపొందడానికి బహుశా ఈ కుటుంబ నేపధ్యం కూడా దోహదపడి వుంటుంది.
రేడియో ఉద్యోగ పర్వం పూర్తి అయిన పిదప గోపాల రావు ఢిల్లీ జీవితానికి స్వస్తి పలికి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం పెద్ద వయసులో కూడా ఆయన తన సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు. రంగస్థలంపై మహాత్మా గాంధీ వేషం కట్టి రంగస్థల గాంధీగా పేరు తెచ్చుకున్నారు. పన్నెండు గంటల పాటు నిర్విరామంగా వార్తలు చదివి లిమ్కా బుక్ రికార్డులకెక్కారు.

రేడియో వార్తలు చదవడంలో తనదైన ముద్ర వేసిన శ్రీ గోపాలరావు 83 వ ఏట హైదరాబాద్ లో ఈరోజు (గురువారం) కన్నుమూశారు.



(శ్రీ ఏడిద గోపాలరావు)


అబుల్ కలాం అబ్దుల్ కలాం కాదు

 


అందరికీ అన్నీ తెలియాలని లేదు. తెలియని విషయాన్ని తెలిసిన వారిని అడిగి తెలుసుకోవడం మంచిది అనే వారు హైదరాబాదు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ కీర్తి శేషులు శ్రీ ఆర్.జే.రాజేంద్రప్రసాద్.

పొద్దున్న ఏదో ఛానల్ లో స్క్రోలింగ్  కనబడింది ఈరోజు అబ్దుల్ కలాం జయంతిని జాతీయ విద్య దినోత్సవంగా పాటిస్తున్నారని. మొదటి పదం మినహా అన్నీ కరక్టే. పేరే తప్పు. ఆయన పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్. పూర్తిపేరు  మౌలానా సయ్యీద్ అబుల్ కలాం గులాం మొయుద్దీన్ అహ్మద్ బీన్ ఖైరుద్దీన్ ఆల్ హుస్సేనీ ఆజాద్. 1888 నవంబరు 11 వ తేదీన జన్మించారు. గొప్ప విద్యావేత్త. స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి.  ఆయన హయాములోనే జాతీయ విద్య వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. ఈనాడు భారతీయ విద్యాలయాలకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన Indian Institute Of Technology (I.I.T.) University Grants Commission వంటి సంస్థలు ఏర్పాటు చేశారు. ప్రజలందరికీ  ఉచితంగా ప్రాధమిక విద్యను బోధించాలనేది ఆయన ఆశయం. విద్యారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. 1998 లో హైదరాబాదులో మొట్టమొదటి ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు అయింది. ఆయన జయంతి నవంబరు పదకొండో తేదీని జాతీయ విద్య దినోత్సవంగా జరపాలని 2008లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

మాజీ  రాష్ట్రపతి  ఏపీజే  అబ్దుల్  కలాం అనుకుని పొరబడి ఆ టీవీ స్క్రోల్ చేసి ఉండవచ్చు. పొరబాటే కావచ్చు కానీ ఒకింత జాగ్రత్త పడి తెలుసుకుని రాసిఉంటే బాగుండేది అనేది భవదీయుడి అభిప్రాయం.