22, జూన్ 2020, సోమవారం

పీవీ గారి రెండో కోరిక – భండారు శ్రీనివాసరావు

(శ్రీ పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని)

‘ఏమయ్యా! కృష్ణారావ్! నా కేసెట్ల సంగతేమిటి” అని అడిగారు పీవీ నరసింహారావు గారు మాజీ ప్రధాని హోదాలో అని చెప్పుకున్నాం కదా! ఆ కధే ఇది.

పీవీ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది.

అసలే గతకాలపు ముచ్చట. ఈ ముచ్చట చెప్పుకునే ముందు అంతకు ముందు గతం కొంత చెప్పుకోవాలి. అంటే గతంలోని గతం అన్నమాట, మూగమనసులు సినిమాకి మల్లె.

ఆర్వీవీ కృష్ణారావు గారు. రాయసం వీర  వెంకట  కృష్ణారావు గారు. పేరులో రాయసమే కానీ మనిషిలో ఆ రాజసం కనపడదు.  సాదాసీదా మనిషి. ఇక వీర అనే పేరులోని  మాట పేరులోనే దాగిపోయేలా ఇంటి పేరు ఆర్వీవీ అని రాసుకునేవారు. ఆయనా నేనూ ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తావిభాగంలో బహుకాలం కలిసి పనిచేసాము. మాకు కృష్ణార్జునులు అని పేరు. నేనొకసారి అమెరికా వెళ్ళినప్పుడు అప్పటి ప్రసార భారతి సీఈఓ కంభంపాటి సుబ్రమణ్య శర్మగారు ఆర్వీవీని పట్టుబట్టి హైదరాబాదు దూరదర్శన్ న్యూస్ ఎడిటర్ గా బదిలీ చేశారు. ఆరు మాసాల అనంతరం అమెరికా నుంచి రాగానే నన్నూ అక్కడికే వేశారు. పుట్టిపెరిగిన రేడియో విడిచి రానని నేను  పట్టుబట్టాను. ‘ఈ పోస్టుకోసం ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకుంటారు. నువ్వేమిటి అయాచితంగా వేసినా పోనంటావ’ని హితులు, స్నేహితులు పోరుపెట్టారు. వున్న ఊళ్లోనే ఉన్న డీడీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ మూడు నెలలు చేతిలో పెట్టుకుని సంక్షేపించిన నేను చివరికి దూరదర్శన్ లో చేరిపోయాను. అయితే ఇంటికి ఆఫీసుకి చాలా దూరం. ఆఫీసు వాహన సౌలభ్యం ఉన్న కారణంగా అదో ఇబ్బంది అనిపించక, అప్పటి  రాష్ట్ర (చంద్రబాబు) ప్రభుత్వం కేటాయించిన ఎర్ర మంజిల్ క్వార్టర్స్ లోనే వుండిపోయాను. ఆఫీసు దూరం అనే మాటలు చెవిన పడ్డాయేమో తెలియదు శర్మ గారు ఆలిండియా రేడియో ఆవరణలోనే ఒక చిన్న ఆఫీసు ఏర్పాటు చేశారు. ఉదయం డీడీ వార్తలు తయారు చేయడం, తర్వాత నుంచి నగరంలో వార్తలు సేకరించడం, ఇందుకోసం రేడియో ఆఫీసులో ఒక కెమెరా యూనిట్, ఈ వైభోగం బాగానే వుందనిపించింది.

ఇక సొంత గోల పక్కనబెట్టి అసలు విషయానికి వస్తాను. ఆర్వీవీకి దూరదర్శన్ ఆవరణలోనే ఒక పెద్ద క్వార్టర్ కేటాయించారు. ఆయనకు ఒక పాత అంబాసిడర్ కారు బెజవాడ రోజుల నుంచి వుండేది. ఆ కారు పెట్టుకోవడానికి   

చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఆ క్వార్టర్ లో ఒక కారు షెడ్డు కూడా వుంది. అందులో ఏదో పాత సామాను వేసి తాళం వేశారు. తీసి చూస్తే ఎన్నో అపూర్వమైన కేసెట్లు. మంచి సంగీత కచ్చేరీల రికార్డులు. అవన్నీ అలా పాత సామాను మాదిరిగా పారేయడం చూసి సంగీతం పట్ల మక్కువ ఉన్న కృష్ణారావు గారు చాలా బాధ పడ్డారు. తీరా విచారిస్తే తేలిందేమిటంటే అవన్నీ పాత కాలపు డెక్కులు. అవి ఈరోజుల్లో పనికిరావు. పైగా ఆ పాత రికార్డులను డిజిటలైజ్ చేసి భద్రపరచినట్టు సమాచారం.

ఈ నేపధ్యంలో పీవీ గారు ‘ఏవయ్యా నా కేసెట్లు’ అని అడిగారు. దూరదర్శన్లో, రేడియోలో గాలించారు. అవి దొరికాయా, పీవీ గారికి అందచేసారా అనే వివరాలు తెలవ్వు. ఎందుకంటే తర్వాత కొన్నాళ్ళకే ముందు నేను, తర్వాత ఆర్వీవీ రిటైర్ అయ్యాము.   


పీవీ గారి రెండు కోర్కెలు – భండారు శ్రీనివాసరావు


(శ్రీ పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని)

పీవీ గారు మాజీ ప్రధానమంత్రిగా పాల్గొన్న ఒక సదస్సు హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది. వారికి ఔషధ మూలికలపై ఆసక్తి  మెండు. నిజానికి ఆయన పట్టుదల కారణంగానే ఆ అంశానికి సంబంధించి ఆ జాతీయ సదస్సు ఏర్పాటయింది.

మధ్యాన్నం భోజన విరామ సమయంలో విలేకరులు ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ విభాగంలో పనిచేసే ఆర్వీవీ కృష్ణారావు గారు నేనూ కాస్త వెనగ్గా నిలబడివున్నాం.

చివరికి ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచారు.

‘ఏమయ్యా కృష్ణారావూ. ఢిల్లీలో పద్మనాభరావుకి కూడా చెప్పాను. ఏవయ్యా నా టేపులు?”

కృష్ణారావు గారు ఏదో  చెప్పారు. (ఈ టేపుల విషయం మరోసారి విడిగా)

ఆయన నా వైపు తిరిగారు.

‘మీ అన్నయ్య (కీర్తిశేషులు పర్వతాలరావు గారు) పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?”

‘నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు’

‘అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం  కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు’

నమస్కారం పెట్టి మేము వచ్చేశాము.

పీవీ గారి సందేహానికి మా అన్నయ్య ఆ పుస్తకంలో చాలా పెద్ద వివరణే ఇచ్చారు.

ఓపిక ఉన్న వారు చదువుకోవడానికి పూర్తి పాఠం ఇస్తున్నాను.

“హిరణ్యకశిపుడు స్వతహాగా మహాబలుడు. దానికి తోడు తపశ్శక్తితో పొందిన వరాలు. అతడిని చంపేందుకు వెళ్ళే విష్ణువు నర  సింహ మిశ్రమ రూపం ధరించాల్సి వుంటుంది. అలాంటప్పుడు రెంటిలోనూ గల బలమైన అంశాలనే స్వీకరించాల్సి వుంటుంది. నరుని మేధ సింహపు మేధ కన్నా చురుకు. సింహపు శరీరం నరుడి దేహం కన్నా బలమైనది. కనుక నరుని తల, సింహపు శరీరం కలిస్తే రెండు బలమైన అంశాలను స్వీకరించినట్టు అయ్యేది. కాని విష్ణువు ఈ అవతారానికి సింహపు తల, మనిషి శరీరం ఎన్నుకున్నాడు. రెండు బలహీనమైన అంశాల మిశ్రమం అది. మరి విష్ణువు అలా ఎందుకు చేశాడు? కొందరు కరాటే ఉదాహరణ చెప్పారు. కరాటేలో చేయి బలహీనంగా వుండడంకన్నా ఆ చేయిని ప్రయోగించడంలో చూపే వేగం, గురి, ఏకాగ్రత ప్రధానం. కనుక బలహీనమైన శరీరాన్ని ఎన్నుకున్నా ఇబ్బంది లేదని వారి అభిప్రాయం. అలా అనుకున్నా అట్టి ఏకాగ్రత నరుని మేధ సాధించినట్టు సింహపు మెదడు సాధించగలదా! మానసిక పటుత్వాన్ని సాధించడం నరునికే సాధ్యం కాని సింహానికి కాదు. జంతువు కావాలంటే సింహమే ఎందుకు? జిత్తులమారి నక్క తల అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనకారిగా వుండేదేమో! మరి స్వామి సింహపు తలనే ఎందుకు ఎన్నుకున్నట్టు!

హిరణ్యకశిపుడు యావత్ ప్రకృతిని తన కనుసన్నలలోకి తెచ్చుకున్నాడు. అసలు హిరణ్యకశిపుడు అంటే అర్ధం ఏమిటి? కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శర్మగారీ విషయాన్ని తమ ‘అంతరార్ద భాగవతం’ లో చెప్పారు. హిరణ్యం అంటే ప్రకృతి (బంగారం కూడా). కశిపుడు అంటే హింసించేవాడు. ప్రకృతిని తన దోవన పోనీయకుండా, తాను  చెప్పిన దోవనే అది నడవాలని కట్టడి చేసినవాడు. ప్రకృతిని అలా నిర్బందించడమే హింస. ఆ రాక్షసుడి కట్టడిలో ప్రకృతి విలవిలలాడిపోయింది.

‘అస్మదీయంబగు నాదేశమున గాని

మిక్కిలి రవి మింట మెరయ వెరచు’

అని ప్రగల్భాలు పలికిన వాడు ఆ రాక్షస రాజు.

అలాగే ఇంద్రుడు, యముడు, అగ్ని, వాయువు అంతా గడగడలాడారు.

పృధు చక్రవర్తి కాలంలో కూడా ప్రకృతి అన్నివిధాల ఆయనకు అనుకూలంగా నడిచింది. దున్నకుండానే పంటలు పండేవి. పృధువు పట్ల భక్తీ గౌరవం వల్లనే కాని చండశాసనుడు అనే భయంతో కాదు. రెంటికీ ఎంత తేడా! నియంతృత్వానికి, ఆదర్శ ప్రజాస్వామ్యానికి ఉన్నంత తేడా.

అలా ప్రకృతిని తన కనుసన్నల్లో పెట్టుకోవడం ఎందుకు? ఇంద్రియ సుఖాలను అనుభవించడానికే. ప్రకృతి అందరికీ అవసరమైన మేరకు ఇస్తుంది. కానీ ఆశ పడ్డంత కాదని గాంధీజీ చెప్పారు.

నరసింహావతారంలో విష్ణువుకి మనిషి తల పనికి రాకపోవడానికి ఈ ఆబే (అత్యాశే) కారణం. మనిషికి ‘ఆశాపాశము తా కడున్ నిడుపులేదంతంబు’. అట్టి ఆశలమారి మేధ ఆబను, కక్కుర్తిని మరింత పెంచుతుంది. తృప్తి చెందదు. సింహం అలా కాదు. అది మృగరాజు. దానికి లేకితనం, పేరాశ లేవు. ఏ పూటకు ఎంత అవసరమో ఆ పూటకు అంతే వేటాడి సంపాదించుకుంటుంది. ఆ పైన దాచుకోవడం ఎరగదు. రేపుమాపు అన్న చింత దానికి లేదు. అన్ని జంతువులూ అలా కాదు. పులీ, చిరుతపులి కూడా వేటాడిన జంతువును దాచుకుని తింటాయి. సింహానికి అది పనికిరాదు. తన కడుపు నిండితే పక్క నుంచి పోయే జంతువులను కూడా అది పట్టించుకోదు. రేపుతో లంకె పెట్టుకొని తత్వం. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అంతకన్నా నిస్సంగత్వం లేదు. ఇలాంటి తత్వం సమాజానికి ఎంతో అవసరం. అట్టి సంస్కృతి వుంటే ప్రస్తుత పర్యావరణం ఇంత దెబ్బతినేది కాదు. అనేక పక్షి, జంతుజాలాలు అంతరించిపోయేవి కావు. మనిషిలో ఆబ  పెరగడం వల్లనే ఈ వినాశనమంతా.

అట్టి ఆబ (GREED) లేని సింహం తలను స్వామి ఎంచుకోవడం హిరణ్యకశిపుని ఆబ (GREED) కు వ్యతిరేకంగా వుండే సమాజాన్ని ఆవిష్కరించడం కోసమే. మనిషి శరీరాన్ని ఎంచుకున్నా దాని బలహీనత వల్ల స్వామికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్వామిది సంకల్పబలం. నిజానికి తాను ఎలాంటి చావు చావాలో హిరణ్యకశిపుడే కోరుకున్నట్లయింది. అతడు కోరిన కోర్కెలే, అతడు పెట్టిన నిబంధనలే అతడిని సంహరించే వ్యక్తి ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎక్కడ ఎలా అతడిని చంపాలో నిర్దేశించాయి”

(ఓం నమో శ్రీ నారసింహాయ, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య చరిత్ర, ప్రధమ సంపుటం, రచన: కీర్తిశేషులు భండారు పర్వతాలరావు, సమర్పణ: శ్రీ వేదభారతి, హైదరాబాదు)

(22-06-2020)          


పృచ్చకుడిగా ప్రధానమంత్రి


(శ్రీ పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకుని)

శ్రీ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాదులో నాగఫణి శర్మ గారి మహా శతావధానం జరిగింది. అందులో శ్రీ పీవీ పృచ్చకుడిగా ఒక ప్రశ్న వేయాల్సి వచ్చింది. అప్పుడాయన చెప్పిన మాటలు:

“కొందరు తుపాను బాధితులు, మరికొందరు వర్షాభావ బాధితులు. నేను సమయాభావ బాధితుడిని. ఎటు చూసినా ప్రశ్నలే. నిద్రావస్థలో కూడా ప్రశ్నలే కనపడుతున్ననాకు, ఇన్ని ప్రశ్నల నుంచి ఏ ఒక్క ప్రశ్ననో వేరు చేసి అడగడం అంటే గడ్డివాములో పడిన సూదిని వెతకడమే. అందుకని, కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో తన మనః స్తితికి తట్టిన విధంగా అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్పురిస్తుందో దానికి జవాబు చెప్పాలని కోరుతున్నాను”

దానికి నాగఫణి శర్మ గారి సమాధానం :

”సకల భారతమును శాసింపగల రేడు

ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసె

ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన

ప్రశ్న మిగిలె నాకు ప్రశ్నగాను”      పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాదులో నాగఫణి శర్మ గారి మహా శతావధానం జరిగింది. అందులో శ్రీ పీవీ పృచ్చకుడిగా ఒక ప్రశ్న వేయాల్సి వచ్చింది. అప్పుడాయన చెప్పిన మాటలు:

“కొందరు తుపాను బాధితులు, మరికొందరు వర్షాభావ బాధితులు. నేను సమయాభావ బాధితుడిని. ఎటు చూసినా ప్రశ్నలే. నిద్రావస్థలో కూడా ప్రశ్నలే కనపడుతున్ననాకు, ఇన్ని ప్రశ్నల నుంచి ఏ ఒక్క ప్రశ్ననో వేరు చేసి అడగడం అంటే గడ్డివాములో పడిన సూదిని వెతకడమే. అందుకని, కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో తన మనః స్తితికి తట్టిన విధంగా అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్పురిస్తుందో దానికి జవాబు చెప్పాలని కోరుతున్నాను”

దానికి నాగఫణి శర్మ గారి సమాధానం :

”సకల భారతమును శాసింపగల రేడు

ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసె

ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన

ప్రశ్న మిగిలె నాకు ప్రశ్నగాను”     


20, జూన్ 2020, శనివారం

మంచివాళ్ళు మనచుట్టూ వున్నారు

 

రాజకీయాల్లో నిజాయితీ, నిబద్దత గురించి రాస్తూ శ్రీయుతులు పిల్లి సుభాష్ చంద్ర బోస్, చిక్కాల రామచంద్ర రావులను గుర్తు చేసుకున్న పోస్టులు చదివిన పాత్రికేయ మిత్రుడు ఫోన్ చేసి మరి ఇద్దరి ప్రస్తావన తీసుకుకువచ్చాడు. ఒకరు బత్తిన సుబ్బారావు గారు, మరొకరు చప్పిడి వెంగయ్య గారు. సుబ్బారావు గారు గోదావరి జిల్లానుంచి శాసన సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అతి పేద దళిత కుటుంబం నుంచి మంత్రి స్థాయికి ఎదిగినా ఆయన ఆర్ధిక పరిస్తితిలో ఏమార్పూ లేదు. ఆయన తల్లిగారు కూలీపని చేసుకుని జీవనం గడిపేవారు. రాజ్యసభ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డబ్బు తీసుకుంటారని ప్రచారం సాగే రోజుల్లో, అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో వుండి కూడా వీల్ చైర్ మీద వెళ్లి పైసా తీసుకోకుండా ఓటు వేసి వచ్చారు. చివరకు ఎంతటి గర్భదారిద్య్రంలో కూరుకు పోయారంటే చనిపోయినప్పుడు దహనం చేయడానికి డబ్బులు లేని దౌర్భాగ్య స్తితి.
ఈ విషయాన్ని అప్పటి బీజేపీ శాసనసభ్యులు శ్రీ వేమా, మరికొందరు గోదావరి జిల్లాల సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి ప్రభుత్వం తరపున కొంత ఆర్ధిక సాయం ప్రకటించిన విషయాన్ని దివాకర్ గుర్తు చేసుకున్నాడు.
అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన చప్పిడి వెంగయ్య గారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా సింపుల్ గా వుండేవారు. ‘ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం వుండడం లేదు, కనీసం ఈసారయినా నా పేరు సరిగా రాయండయ్యా’ అని అసెంబ్లీ కవరేజ్ కి వెళ్ళే పాత్రికేయులతో అనేవారు సరదాగా. ఆయన పేరు చప్పిడి వెంగయ్య. అది పొరబాటు అనుకుని విలేకరులు చప్పిడి వెంకయ్య అని రాసేవారు.
వెంగయ్య గారి ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేయడానికి హైదరాబాదు నుంచి డెక్కన్ క్రానికల్ తరపున సుశీల్ కుమార్ (ప్రస్తుతం హైదరాబాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నతోద్యోగంలో వున్నారు) ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. వెంగయ్య గారి ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. రెండే గదులు. టీవీ కాదుకదా, కనీసం రేడియో కూడా లేదు. కాలినడకనే ప్రచారం. అయినా గెలిచారు. కాదు ప్రజలు గెలిపించారు. సుశీల్ ఆ రోజుల్లో వెంగయ్య గారి గురించి క్రానికల్ లో రాసిన రైటప్ చాలా సంచలనాన్ని సృష్టించింది.
‘మరోసారి ఎన్నికల్లో పార్టీ ఫండ్ స్వయంగా అందచేయడానికి ఒక మంత్రిగారు వెళ్ళారు. కానీ ఆయన పైసా కూడా తీసుకోలేదు. చిత్రం! ఆ ఎన్నికల్లో ఓడిపోయారు’ దివాకర్ అన్నాడు. (20-06-2020)

రాజకీయాల్లో కృతజ్ఞత – భండారు శ్రీనివాసరావు

ఈరోజు రాజ్యసభకు ఎన్నికయిన శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్  చాలా సౌమ్యులు. రేడియో విలేకరిగా నాకు కొంత పరిచయం వుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన రోజుల్లో కూడా ఆయన నిరాడంబరంగా వుండడం నాకు తెలుసు. వై.ఎస్.ఆర్.కు, ఆయన కుటుంబానికి బాగా కావాల్సిన వారు. గతంలో జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిపోయారు. 

రాజ్యసభకు ఎన్నిక అయిన అనంతరం సుభాష్ చంద్ర బోస్ మాట్లాడిన విషయాలు విన్నప్పుడు తనని రాజకీయాల్లో ప్రోత్సహించిన వారిని ఆయన ఎలా గుర్తుంచుకున్నదీ తెలిసి ఆశ్చర్యం వేసింది. ఇలాంటి సందర్భాలలో ఎవరయినా సరే, ముందు తమ పార్టీ నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తిన తర్వాతనే ఇతరులను తలుచుకుంటారు.

ఆయన ఈరోజు ముందుగా తలచుకున్న రాయవరం మునసబు ఎవరన్నది ఈ తరం వారికి తెలియదు. ఆయనే  తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించారన్నారు. ఒకానొక కాలంలో రాయవరం మునసబు అంటే జిల్లామొత్తానికి తెలిసిన పేరు. ఆయన జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. కానీ రాష్ట్ర రాజధానివరకు ఆయన ఎవరో తెలుసు.

తర్వాత తలచుకున్న పేరు వై.ఎస్. ఆయన తనను  రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ని చేశారని సుభాష్ చంద్ర బోస్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ పిదప వై.ఎస్. జగన్ వల్లనే తనకు ఇన్ని రాజకీయ పదవులు వచ్చాయని చెప్పుకొచ్చారు.

పదవిని అనుభవించిన రోజుల్లో నాయకుడే తమ అధినాయకుడని ప్రస్తుతించి పదవి పోగానే అతడెవరో తెలియనట్టుగా ప్రవర్తించే రాజకీయ నాయకులు కోకొల్లలుగా ఉన్న నేటి రాజకీయాలు మాత్రమే తెలిసిన ఈనాటి తరానికి ఈ రకం నాయకులు నిజంగా కొత్తే.

ఈ విధేయతలు అనేవి పార్టీ వ్యవహారాలు. అవి పక్కన పెడదాం. మరి ఆయన నిరాడంబరత్వం. దాన్ని గురించి  తప్పనిసరిగా చెప్పుకోవాలి.

గతంలో పిల్లి సుభాష్ చంద్ర బోస్ మంత్రిగా వున్నప్పుడు మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారు మా  వదినె గారితో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాదు రైల్లో వస్తున్నారు. ఇద్దరికీ ఏసీ సెకండ్ క్లాసులో అప్పర్ బెర్తులు దొరికాయి. కింద బెర్తులు ఖాళీగా వుంటే టీసీని అడిగారు. రాజమండ్రిలో ఒక మంత్రి గారి కోసం రిజర్వ్ అయ్యాయి, లాభం లేదు అన్నాడాయన. మంత్రి గారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వుంటుంది కదా, ఈ సెకండ్ ఏసీ ఎందుకు అనేది మా అన్నయ్య అనుమానం.

రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటింది. మంత్రిగారు భార్యతో కలిసి బోగీలోకి వచ్చారు. సామాన్లు సర్దుకున్న తరువాత ఆయన మా అన్నయ్యని అడిగారట. మీ మిసెస్ పైకి ఎక్కి పడుకోవడం కష్టం, ఆవిడ, మా ఆవిడ కింద బెర్తుల్లో పడుకుంటారు, మనం పైన సర్డుకుందాం అన్నారట ఆ మంత్రిగారు. ఇది విని మా అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయారు.

ఆయన ఎవరో కాదు, ఈరోజు రాజ్యసభ సభ్యులు అయిన పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు.

“మంత్రిగారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వున్న మాట నిజమే. కానీ మా మేడం గారు ఆయనతో ప్రయాణం చేస్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేయమంటారు”

మర్నాడు ఉదయం సికిందరాబాదులో  రైలు దిగిన తర్వాత మంత్రిగారి పియ్యే మా అన్నగారి అనుమానం తీర్చారు.

(19-06-2020)           


18, జూన్ 2020, గురువారం

హైదరాబాదులో కాళేశ్వరం గోదావరి జల?

 


 కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పారుతున్న గోదావరి జలాలతో భూగర్భ జలాల మట్టం బాగా పెరిగిందని తెలంగాణా మంత్రి శ్రీ కే.టీ.ఆర్. అన్నట్టు ఆ మధ్య పత్రికల్లో చదివాను. అది నిజమే అనిపిస్తోంది.

హైదరాబాదు ఎల్లారెడ్డి గూడాలో మేముంటున్న మధుబన్ అపార్ట్ మెంట్ బోరు బావి ఎండిపోయి ఏళ్ళు గడుస్తున్నాయి. వున్నవి పన్నెండు కుటుంబాలు మాత్రమే కావడంతో దాని రిపేరు ఖర్చులు భరించలేక అలాగే వదిలేసి మునిసిపల్ వాటర్ తోనూ, రెండ్రోజులకోసారి కొనే మునిసిపల్ వాటర్  టాంక్ లతోను నెట్టుకుంటూ వస్తున్నాము.

ఈసారి వర్షాలు ముందుగానే వచ్చినా కన్నూ మిన్నూ ఏకమయ్యే భారీ వర్షాలు ఏవీ పడలేదు. అయితే ఆశ్చర్యకరంగా అపార్ట్ మెంట్ కమిటీ వాళ్ళు ఒక చల్లని కబురు చెవిన వేసారు. ఎవరి ప్రమేయం లేకుండా బోరు బాగుపడిందనీ, ఇకనుంచీ ఇరవై నాలుగు గంటలు నీళ్ళ సప్లయి ఉంటుందని, వాటర్ ట్యాంకుల అవసరం కూడా ఉండదనీ తెలియచేశారు.

కేటీఆర్ చెప్పినట్టు భూగర్భ జలాల మట్టం కానీ పెరగలేదు కదా! (17-06-2020)


17, జూన్ 2020, బుధవారం

కొన్ని సరికొత్త పాత సంగతులు

  

అదేమిటో చాలా మందికి, నాతో సహా, ఈ మధ్య జరిగిన విషయాలు గుర్తుండడం లేదు. కొందరు చెబుతుంటే కానీ జ్ఞాపకం రావడం లేదు.

ఇప్పుడు అలా విన్న సంగతులు చెప్పుకోవడానికే ఈ ప్రయత్నం. ఇవన్నీ ఏ క్రీస్తు పూర్వం నాటి విషయాలో  కాదు. మహా అయితే ఏడాది, రెండేళ్ళ లోపు సంగతులే.

2019 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ప్రధాన ప్రత్యర్దులమని చెప్పుకునే పార్టీలు ఎన్ని వున్నా నిజానికి పోటీ రెండింటి మధ్యనే. అంటే టీడీపీ, వైసీపీ నడుమనే అసలయిన పోటీ అనేది చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేవాళ్ళు.

ఈ రెండు పార్టీలు ఓటర్ల అభిమానం చూరగొనడానికి రకరకాల పధకాలు ప్రకటిస్తూనే మరో పక్క చాణక్య నీతిని కూడా ప్రదర్శించాయి. ఆ క్రమంలోనే మొదలయ్యాయి పార్టీ మార్పిళ్ల కార్యక్రమం. కాకపోతే ఈ విషయంలో జగన్ మోహన రెడ్డికి ప్రశాంత్ కిషోర్ రూపంలో చక్కని సలహాలు, సూచనలు దక్కాయి. అపర చాణక్యుడిగా తెలుగు రాజకీయాల్లో పేరు పొందిన చంద్రబాబు కొంచెం వెనక పడ్డట్టే లెక్క. (2014లో ఆయన ఈ విషయంలో ముందంజలో వున్నారు).  2019 నాటి ఎన్నికల సమయానికి  ఆయన ఊహించని రీతిలో టీడీపీ నుంచి వైసీపీకి ఎన్నికల ముందే వలసలు సాగాయి. వీటిల్లో చెప్పుకోతగ్గవి  కొన్ని వున్నాయి.

ఆదాల ప్రభాకరరెడ్డి గారు. వీరికి టీడీపీ టిక్కెట్టు కన్ఫర్మ్ అయింది. బీ ఫారం కూడా ఇచ్చినట్టు వున్నారు. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. సరిగ్గా పదిహేను రోజులముందు ఆయన టీడీపీ అధిష్టానానికి ఫోనులో కూడా దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళడం వెళ్ళడం నేరుగా వైసీపీ గూటికే కావడం, ఆయనకు ఆ పార్టీ సీటు ఇవ్వడం అన్నీ మెరుపు వేగంతో జరిగిపోయాయి. టీడీపీ అధిష్టానం అప్పటికప్పుడు ప్రభాకరరెడ్డి స్థానంలో మరొక అభ్యర్ధిని వెతుక్కోవాల్సి వచ్చింది. బీద మస్తాన్ రావుగారిని  ఎంపిక చేసారు. ఆయన గట్టి అభ్యర్దే. కానీ ఫలితం దక్కలేదు. ఆ సీటును టీడీపీ కోల్పోయింది. సీటునేకాదు, చివరి క్షణంలో ఎంపిక చేసి నిలబెట్టిన అభ్యర్ధిని కూడా. ఎన్నికలు కాగానే బీద మస్తాన్ రావుగారు  టీడీపీకి గుడ్ బై చెప్పి తనను ఓడించిన వైసీపీలోకి  చేరిపోయారు.

ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఈయన కూడా టీడీపీని చివరి రోజుల్లో ఒదిలిపెట్టారు. కాకపోతే కాస్త మర్యాదగా. భార్య, పిల్లలతో సహా వెళ్లి అధినాయకుడిని కలిసి టీడీపీ తరపున పోటీ చేయలేను అని ఒక నమస్కారం పెట్టి వచ్చారు. తరువాత కొద్ది రోజులకే లోటస్ పాండులో జగన్ మోహన రెడ్డిని కలిసి ఆ పార్టీ సభ్యత్వాన్ని, పార్టీ టిక్కెట్టును కూడా సంపాదించుకున్నారు. వైసీపీ తరపున నిలబడి  గెలిచారు.

పొతే, రఘురామ కృష్ణంరాజుగారు. వై ఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తవర్గంలోని మనిషి. వై ఎస్ ఆర్ కు అత్యంత ఆత్మీయుడైన కేవీపీ కి స్వయానా  వియ్యంకులు. ఆ బాంధవ్యం పిల్లల ప్రేమ వివాహం  వల్ల ఏర్పడింది కాదు. ఉభయపక్షాల పెద్దలు కలిసి కుదుర్చుకున్న సంబంధం. పైగా పెద్ద కాంట్రాక్టరు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం పెద్ద విషయమూ కాదు, పెద్ద కష్టమూ కాదు. వీటికి తోడు ఎమ్మెల్యే కావాలని రాజుగారికి ప్రబలమైన ఆకాంక్ష వుందని కూడా చెప్పుకునేవారు. ఇన్ని హంగులు ఉన్నప్పటికీ ఎన్నికల బరిలో నిలబడే అవకాశం 2019 దాకా రాకపోవడం విచిత్రం.

వై.ఎస్. మరణించేవరకు కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని వుండి, తర్వాత జగన్ వైసీపీతో కలిసివున్నారు. ఆయన జైలుకు పోయిన తర్వాత వైసీపీని వదిలి బీజేపీతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఆ పార్టీకి  కూడా ఎంపీ టిక్కెట్టు ఆయనకు ఇవ్వాలనే ఆలోచన ఉండడంతో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ కృష్ణంరాజు గారు ఆ నియోజకవర్గంపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేసారు. అయితే చివరి క్షణంలో  బీజేపీ అగ్రనాయకత్వం ఆ సీటును గోకరాజు గంగరాజు గారికి కేటాయించడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇండిపెండెంటుగా నామినేషన్ కూడా వేసి ఉపసంహరించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ విజయం  దరిమిలా ఆయన ఆ పార్టీకి దగ్గరయ్యారు. చంద్రబాబునాయుడు ఆయన్ని తమ పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టాలని బలంగా కోరుకున్నారు. ఆమేరకు రాజుగారికి మాట ఇవ్వడం ఆయన తన నియోజకవర్గంలో పనులు చేసుకోవడం మొదలయింది కూడా. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ రాజుగారికి టిక్కెట్టు ఖాయం చేసింది. ఏం జరిగిందో తెలియదు కానీ, చివర్లో ఆయన టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ టిక్కట్టు మీద లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. (ఇందులో ప్రశాంత్ కిషోర్ పాత్ర వుందని ఇప్పుడు స్వయంగా ఆయనే చెబుతున్నారు). ఏదైతేనేం మొత్తం మీద చట్టసభ సభ్యుడు కావాలనే రాజుగారి కోరిక నెరవేరింది.

పొతే, గత వారం పది రోజులుగా బుల్లితెరలపై సాగుతున్న మరో అంకం గురించి చెప్పాల్సిన పనిలేదనుకుంటా.

(17-06-2020)