ఈరోజు రాజ్యసభకు ఎన్నికయిన శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ చాలా సౌమ్యులు. రేడియో విలేకరిగా నాకు కొంత పరిచయం వుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన రోజుల్లో కూడా ఆయన నిరాడంబరంగా వుండడం నాకు తెలుసు. వై.ఎస్.ఆర్.కు, ఆయన కుటుంబానికి బాగా కావాల్సిన వారు. గతంలో జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిపోయారు.
రాజ్యసభకు ఎన్నిక అయిన అనంతరం సుభాష్ చంద్ర బోస్ మాట్లాడిన విషయాలు విన్నప్పుడు తనని రాజకీయాల్లో ప్రోత్సహించిన వారిని ఆయన ఎలా గుర్తుంచుకున్నదీ తెలిసి ఆశ్చర్యం వేసింది. ఇలాంటి సందర్భాలలో ఎవరయినా సరే, ముందు తమ పార్టీ నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తిన తర్వాతనే ఇతరులను తలుచుకుంటారు.
ఆయన ఈరోజు ముందుగా తలచుకున్న రాయవరం మునసబు ఎవరన్నది ఈ తరం వారికి తెలియదు. ఆయనే తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించారన్నారు. ఒకానొక కాలంలో రాయవరం మునసబు అంటే జిల్లామొత్తానికి తెలిసిన పేరు. ఆయన జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. కానీ రాష్ట్ర రాజధానివరకు ఆయన ఎవరో తెలుసు.
తర్వాత తలచుకున్న పేరు వై.ఎస్. ఆయన తనను రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ని చేశారని సుభాష్ చంద్ర బోస్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ పిదప వై.ఎస్. జగన్ వల్లనే తనకు ఇన్ని రాజకీయ పదవులు వచ్చాయని చెప్పుకొచ్చారు.
పదవిని అనుభవించిన రోజుల్లో నాయకుడే తమ అధినాయకుడని ప్రస్తుతించి పదవి పోగానే అతడెవరో తెలియనట్టుగా ప్రవర్తించే రాజకీయ నాయకులు కోకొల్లలుగా ఉన్న నేటి రాజకీయాలు మాత్రమే తెలిసిన ఈనాటి తరానికి ఈ రకం నాయకులు నిజంగా కొత్తే.
ఈ విధేయతలు అనేవి పార్టీ వ్యవహారాలు. అవి పక్కన పెడదాం. మరి ఆయన నిరాడంబరత్వం. దాన్ని గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి.
గతంలో పిల్లి సుభాష్ చంద్ర బోస్ మంత్రిగా వున్నప్పుడు మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారు మా వదినె గారితో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాదు రైల్లో వస్తున్నారు. ఇద్దరికీ ఏసీ సెకండ్ క్లాసులో అప్పర్ బెర్తులు దొరికాయి. కింద బెర్తులు ఖాళీగా వుంటే టీసీని అడిగారు. రాజమండ్రిలో ఒక మంత్రి గారి కోసం రిజర్వ్ అయ్యాయి, లాభం లేదు అన్నాడాయన. మంత్రి గారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వుంటుంది కదా, ఈ సెకండ్ ఏసీ ఎందుకు అనేది మా అన్నయ్య అనుమానం.
రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటింది. మంత్రిగారు భార్యతో కలిసి బోగీలోకి వచ్చారు. సామాన్లు సర్దుకున్న తరువాత ఆయన మా అన్నయ్యని అడిగారట. మీ మిసెస్ పైకి ఎక్కి పడుకోవడం కష్టం, ఆవిడ, మా ఆవిడ కింద బెర్తుల్లో పడుకుంటారు, మనం పైన సర్డుకుందాం అన్నారట ఆ మంత్రిగారు. ఇది విని మా అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయారు.
ఆయన ఎవరో కాదు, ఈరోజు రాజ్యసభ సభ్యులు అయిన పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు.
“మంత్రిగారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వున్న మాట నిజమే. కానీ మా మేడం గారు ఆయనతో ప్రయాణం చేస్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేయమంటారు”
మర్నాడు ఉదయం సికిందరాబాదులో రైలు దిగిన తర్వాత మంత్రిగారి పియ్యే మా అన్నగారి అనుమానం తీర్చారు.
(19-06-2020)