6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

చంద్రుడికో నూలుపోగు – భండారు శ్రీనివాసరావు


ట్రిగ్గర్ నిక్కగానే ఒక పిస్టల్ నుంచో లేక ఒక తుపాకీ నుంచో బయటకు దూసుకువచ్చే బుల్లెట్ తొలివేగం గంటకు సుమారు రెండువేల కిలోమీటర్లు ఉంటుందని అంటారు.
చంద్రుడు, చంద్రయాన్ గురించి ముచ్చటించుకునేటప్పుడు ఈ బులెట్ల గోలేమిటంటారా!
1969 లో కాబోలు మొదటి మానవ రహిత ఉపగ్రహం చంద్రుడిమీద దిగింది. ఆ రోజుల్లో సమాచారం తెలుసుకోవాలనే ఉత్సాహం మాత్రం పుష్కలంగా వుండేది. అయితే, సమాచారాన్ని తెలిపే సాధనాలు ఇప్పట్లోలా ఇన్ని లేవు. కొన్ని తెలుగు పత్రికల్లో అనువదించి ప్రచురించే వార్తలు మాత్రమే ఆధారం. అవీ ఈరోజు పత్రిక పల్లెటూళ్ళకు మరునాటి సాయంత్రమో, మూడో రోజు పొద్దున్నో వచ్చేవి. అదే పదివేలనుకుని చదివుకుని మురిసిపోయేవాళ్ళం.
బహుశా ఆంధ్రపత్రికలో కాబోలు ఇలాంటి సమాచారం చదివిన గుర్తు.
ఒక గుండెకు గురి పెట్టి పేల్చిన తుపాకీ గుండు అంత వేగంతో దూసుకుని వెళ్లి, ఒక అరా సెంటీ మీటరు దూరంలో వున్నప్పుడు తన వేగాన్ని పూర్తిగా తగ్గించుకుని ఓ పూవు మాదిరిగా సుతారంగా  గుండెను తాకితే ఎలా వుంటుందో ఊహించుకుంటే చంద్రుడి మీద దిగిన ఆ శాటిలైట్ గొప్పతనం అర్ధం అవుతుందని ఆ వార్త టీకా తాత్పర్యం. ఆ ఉపగ్రహం కూడా చంద్రుడి మీదకు ప్రచండ వేగంతో దిగుతూ చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు (అంటే పైన చెప్పిన అర సెంటీ మీటరు మాదిరిగా, అంతేకాని నిజంగా అర సెంటీ మీటరు కాదు) హఠాత్తుగా తన  వేగాన్ని జీరో స్థాయికి తగ్గించుకుని ఒక పువ్వు మాదిరిగా అక్కడి నేలపై (?) వాలడం అన్నమాట.   ఇందులో అతిశయోక్తి ఏమేరకు వుందో ఇట్టే కనిపెట్టి ఎదురు వాదన చేయడానికి అప్పట్లో ఈ గూగులమ్మ లేదు. అంచేత అలాంటి వార్తలను చాలా ఉత్సాహంతో చదవడమే కాకుండా దాన్ని మరింత ఉత్సాహంతో నలుగురితో పంచుకునేవాళ్ళం. ఈ కాలపు పిల్లలు ఈ థ్రిల్ బాగా మిస్సయితున్నట్టే లెక్క.   
భారత అంతరిక్ష పరిశోధనాసంస్త ఈ అర్ధరాత్రి ఒక గొప్ప కీర్తిని మూటగట్టుకోబోతోంది. తెల్లారే లోపలే ఆ శుభ వార్త తెలుసుకోవాలనే ఉత్సుకతతో లక్షలాదిమంది భారతీయులు ఈ రాత్రి జాగరణకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ పాత జ్ఞాపకం.

తరాల అంతరం – భండారు శ్రీనివాసరావు

చనిపోయే ముందు కొడుక్కు చెప్పాడు తండ్రి.
‘నేను ప్రతి రోజూ ఉదయం స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి ‘సర్వే జనాస్సుఖినో భవంతు’ అని కోరుకుంటూ ఉండేవాడిని. నువ్వూ అలాగే కోరుకో’ అని కన్నుమూశాడు.
కొడుకు తండ్రి చెప్పినట్టే చేశాడు. కాకపోతే కొద్దిగా మార్చి దేవుడ్ని వేడుకున్నాడు.
‘నేను బాగుండాలి. అందరూ బాగుండాలి’
అతడికీ ఒకరోజు చివరి రోజు వచ్చేసింది.
తన కొడుకుని పిలిచి తనకు తన తండ్రి చెప్పినట్టే చెప్పి చనిపోయాడు.
అతడి కొడుకూ తండ్రి చివరి కోరికను కొద్దిగా మార్చి నెరవేర్చాడు.
‘ముందు నేను బాగుంటేనే కదా! ఇతరుల బాగోగులు చూసేది. కాబట్టి నేను బాగుండేటట్టు చూడు స్వామీ!’


అనేది అతడి ప్రార్ధన.

2, సెప్టెంబర్ 2019, సోమవారం

మాట పెగల్లేదు


‘ఏరా సీనప్పా! (మా ఇంట్లో పెద్దవాళ్లందరూ ఇలాగే పిలుస్తారు) ఎలా ఉన్నావురా! హైదరాబాదు వద్దామనుకున్నా. కానీ విషయం నీకూ తెలుసు కదా!’
ఆమె మా పెద్దత్తయ్య కూతురు. వయసు ఎనభయ్  పైమాటే. ఇంట్లో అందరూ చిట్టీ అనేవారు. ఇన్నేళ్ళుగా అదే పేరు. అసలు పేరు అందరూ మరచిపోయారు. పదిహేనో ఏట పెళ్లయింది. పుట్టిల్లు ఖమ్మం మామిళ్ళగూడెం నుంచి అత్తగారిల్లు నల్గొండ రామగిరికి చేరింది. అప్పటినుంచీ ఆ భార్యాభర్తలు విడిగా వున్నది లేదు. ఎక్కడికి వెళ్ళినా కలిసే.
నా భార్య ఆగస్టు పదిహేడో తేదీ రాత్రి చనిపోతే మా చిట్టి వదిన భర్త శ్రీ కొమర్రాజు మురళీధరరావు గారు తన 87వ ఏట ఆగస్టు 24న కన్నుమూశారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న ఈ మనిషి నాకు ఫోను చేసి ఊరడింపు వాక్యాలు చెబుతుంటే నాకు నోటెంట మాట పెగల్లేదు.
కింది ఫోటోలో: మంచం మీద కూర్చుని (ఎర్రచీర) ఆట షో చూపిస్తున్న పెద్దావిడ మా వదిన గారు. భార్య పేకాటలో గెలిచి షో చూపిస్తుంటే మందహాసంతో గమనిస్తున్నది ఎవరో కాదు, పరిపూర్ణ జీవితం గడిపి ఈ మధ్యనే తనువు చాలించిన మురళీధరరావుగారే.  


      

ఆ రాత్రి ఏం జరిగింది?


ఆగస్టు 17 రాత్రి పదిగంటలు. మామూలుగా నిద్రపోవడానికి ముందు ఓ పదాటలు కార్డ్సు ఆడటం, అలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాటలు వినడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు కార్డ్సు ఆడాలని అడగలేదు. అలెక్సా ఆన్ చేశాను. ఎప్పుడూ ఘంటసాల పాత పాటలు వచ్చేవి. ఆ రోజు విచిత్రంగా ఘంటసాల భగవద్గీత మొదలయింది. మనసు ఏదో కీడు శంకించింది. తలనొప్పిగావుంది అమృతాంజనం కావాలంది. అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం. తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్ తెమ్మంది. అత్తయ్య గారి పొటో పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన తర్వాత ఏదీ రాసుకోలేదు. మంచినీళ్ళు, కాదు కాదు ఏదైనా జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా తాగింది. తర్వాత బాగా ఆయాసపడింది. చూడలేక అంబులెన్స్ పిలిపించాను. బాత్ రూం కు పోతానంటే అడుగులు తడబడుతుంటే నేనే తీసుకువెళ్ళి తీసుకుని వచ్చాను. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. 48 ఏళ్ళ సంసార జీవితంలో నాకు నేనై ఆమెకు చేసిన సేవలు ఇవే. 
ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావుకబురు చల్లగా చెప్పారు. 
నిజంగా ఇలా కూడా మనుషులు చనిపోతారా!
Top of Form

1, సెప్టెంబర్ 2019, ఆదివారం

గరుడపురాణం – భండారు శ్రీనివాసరావు


గరుడ పురాణంలో పాపులకు విధించే శిక్షలు జ్ఞాపకం ఉన్నాయా!


అనగనగా ఓ అమ్మాయి. బుద్ధి తక్కువై ఓ అబ్బాయిని ప్రేమించింది. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకుంది. దాంతో మొదలయ్యాయి ఆ అమ్మాయికి అంతులేని కష్టాలు.
అలాగని అతడు పెళ్ళాన్ని రాచిరంపాన పెట్టే బాపతు కాదు. ఆ అమ్మాయి అతడ్ని ప్రేమించినంత గాఢంగా, ఘాటుగా కాకపోయినా  భార్యపై ఓ మోస్తరు ప్రేమకి తక్కువేమీలేదు.
మరిక కష్టాలు ఏమిటంటారా!
అతడికి దేవుడు అంటే నమ్మకమే. కానీ మూఢ భక్తి కాదు. గ్రహణాల పేరుతొ చూలింతలను చీకటి గదిలో పగలంతా  పడుకోబెట్టడం వగయిరాలు నచ్చవు. భార్య తొలిచూలుతో వున్నప్పుడు సూర్య గ్రహణం వచ్చింది. చుట్టపక్కాల మాటల్ని, సలహాల్ని  ఖాతరు చేయకుండా గర్భిణి అయిన భార్య చేత గోధుమ పిండి తడిపించాడు. ముద్దలు చేసి, చపాతీలు చేయించాడు. ఉల్లిపాయలు కోయించాడు.  రోజువారీ పనులన్నీ పట్టుబట్టి అవసరం లేకపోయినా చేయించాడు. మూర్ఖంగా ఇవన్నీ  చేయించాడే కానీ మనసు మూలల్లో ఏదో కలవరం. గ్రహణ కారణంగా పుట్టబోయే శిశువు అవకరంగా పుడితే... ఆ భయం అతడికి ఏ కొద్దోగొప్పో  వుండివుండవచ్చేమో కానీ ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె ప్రేమలో ఏమాత్రం స్వార్ధం లేదు. అందుకే అతడు చెప్పినవన్నీ నిశ్చింతగా చేసేసింది. తన భర్తపై ఆమెకు ఉన్న నమ్మకమే మూఢనమ్మకాలను జయించేలా చేసింది.  మూఢాచారాలపై తన భర్త పెంచుకున్న అపనమ్మకాలకు ఒక విలువ దక్కేలా చూసింది. ఈ క్రమంలో అంత చిన్న వయస్సులోనే అంతులేని ధైర్య సాహసాలను  ప్రదర్శించింది.
ఇప్పుడు చెప్పండి. గరుడ పురాణం నిజమే అయితే,  భార్యను మానసికంగా ఇన్ని చిత్ర హింసలు పెట్టిన నాకు ఆ శిక్షలు పడాలంటారా లేదా!                

30, ఆగస్టు 2019, శుక్రవారం

నేనో బిగ్ జీరో



“ఏదో అనుకున్నాకానీ నువ్వో బిగ్ జీరో”
అన్నారు ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మ గారు.
అప్పుడు నేను ఆయన దగ్గర సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సుదీర్ఘ సెలవులో పోవడం వల్ల నాకు అనుకోకుండా కలిగిన అదృష్టం అది. దినపత్రికలో సబ్ ఎడిటర్ గా ఉన్న నన్ను ఎడిటర్  నండూరి రామ్మోహన రావు గారు కొన్నిరోజులపాటు పురాణం గారికి సాయంగా కొన్నాళ్ళు  ఉండమన్నారు.
ఆరోజుల్లో, పేరు జ్ఞాపకం రావడం లేదు కానీ ఒక తెలుగు చిత్రానికి కధ, మాటలు రాసే అవకాశం పురాణం గారికి  వచ్చింది. బెజవాడ బీసెంటు రోడ్డులోని మోడరన్ కేఫ్ లో ఒక గది ఇచ్చారు నిర్మాతలు. పగలు ఆఫీసు పనిచూసుకుని సాయంత్రానికి పురాణం గారు అక్కడికి వచ్చేవారు. ఆ పని పూర్తికావస్తున్న దశలో కాబోలు నన్ను సాయంగా రమ్మన్నారు.
ఆయన గారి ఆలోచనలు జెట్ స్పీడు. దానికి తగ్గట్టుగా వాటిని కాగితాలపై పెట్టడం నా పని, నన్నయభట్టుకు నారాయణ భట్టు మాదిరిగా. ఆయన చెబుతూ వుండడం నేను రాస్తూ పోవడం. నేను పత్రికా విలేకరినే కానీ తెలుగు షార్ట్ హ్యాండ్ గట్రా ఏమీ తెలవ్వు. అంచేత కొన్ని నట్లు పడేవి. ఆ సందర్భంలో ఒక రోజు పురాణం వారు అక్షింతలు వేస్తూ అన్న మాట ఇది. పెద్దవారి అక్షింతలు ఆశీర్వాదాలే కదా!
ఇంతకీ ఆయన ఆ ఒక్క మాటే అని ఊరుకోలేదు.                              
ఆయన అన్నదేమిటంటే:
“శ్రీనివాసరావ్! నువ్వో జీరో లాంటివాడివి. నీ సంగతి నీకు తెలవదు. ఎవరన్నా నీకు దన్నుగా వుంటే నీ విలువ ఇంకా బాగా పెరుగుతుంది, ఒకటి పక్కన సున్నా లాగా”
ఆయన ఏక్షణంలో అన్నారో తెలవదు.
ఈ సున్నా పక్కన మా ఆవిడ వచ్చి నిలబడిన తర్వాత కానీ  ఆ విషయం బోధపడలేదు.          

22, ఆగస్టు 2019, గురువారం

A honest Confession Of A Husband


‘ఇంతగా ప్రేమించారు. చాలా గొప్ప విషయం’ అంటూ మితృలు కొనియాడుతున్నారు. ఇది కలలో కూడా నేను అంగీకరించను. ఒకవేళ నేను అలా గొప్పలు చెప్పుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే.
మా ఆవిడ స్నేహితురాలు శ్రీమతి వనం గీత ఎప్పుడూ అంటుండేది. ‘నువ్వు మీ ఆయన్ని బాగా గారాబం చేసి చెడగొడుతున్నావు. అందరికీ మొగుళ్ళు లేరా! అందరూ ఇలానే మాలిమి  చేస్తున్నారా! నీకు ఒంట్లో బాగా లేకపోయినా నువ్వే కాఫీ కలిపి ఆయనకు ఇవ్వాలా! వంటింట్లోకి పోయి ఓ కప్పు కాఫీ కలుపుకుని తాగలేరా, మరీ విడ్డూరం కాకపొతే!’
అవును. గీత గారు చెప్పింది అక్షరాలా నిజం. నన్ను చెడగొట్టి ఎందుకూ పనికిరాని ఓ మొగుడ్ని చేసింది. స్టవ్ అంటించడం కూడా రాని మొగుళ్ళ జాబితాలో చేర్చేసింది. సిగ్గు లేకుండా చెబుతున్నాను. నా బనీను సైజు కూడా నాకు తెలియదు. పొరబాటున ఏదైనా వూరు వెళ్లినప్పుడో, స్నేహితులు షాపింగ్ చేస్తున్నప్పుడు కొనుక్కున్నానా ఇక అంతే! లొడుంగు బుడుంగు. ప్యాంటు పైకి లాక్కుంటూ తిరుగుతుంటే తనే తీసుకువెళ్ళి వాటిని ఆల్టర్ చేయించేది.
ఇంటికి ఎవరు  వచ్చినా ‘ఇదిగో ఎక్కడున్నావ్? రెండు కాఫీలు ఇస్తావా?’ అని కేక పెట్టి అడిగే పనే లేదు. వచ్చిన సమయాన్ని బట్టి, వాళ్ళు ఎవ్వరయినా సరే!  కాఫీలో, టిఫిన్లో, భోజనాలో కనుక్కుని పెట్టేది. ఇన్నేళ్ళుగా ఆమె నిరంతరంగా చేస్తున్న  సేవలను నేను ఎన్నడూ గుర్తించలేదు. ఓ మంచి మాట తనతో అన్నదీ లేదు. అందరూ అన్నపూర్ణ తల్లి అంటుంటే గర్వంగా ఫీలయ్యేవాడిని. పైగా అలా చేయడం ఆమె బాధ్యత అనుకునేవాడిని.
నేను పొద్దున్నే టీవీ షోలకు వెళ్ళాలి అంటే ఆ పాట్లేవో తనే పడేది. నాకంటే ముందే లేచి కార్న్ ఫ్లేక్స్ తయారు చేసి తినిపించి  బీపీ మాత్తర్లు ఇచ్చి పంపేది. డాక్టర్ రాసిచ్చిన ఆ మాత్ర పేరేమిటో నాకిప్పటికీ తెలవదు.
ఒక్కోసారి ‘వుండండుండండి! ఆ టీవీ వాళ్లకు ఈ చొక్కా రంగు పడదు. తీరా పోయిన తర్వాత గ్రీన్ మ్యాటో, బ్లూ మ్యాటో అని వేరే ఎవరి చొక్కానో  తగిలిస్తారు. ముందే మార్చుకుని వెళ్ళండి’ అంటూ జాగ్రత్తలు చెబుతుంది.
అలా  అన్నీ ఆమే నాకు అమర్చి పెట్టేది.  కంటికి రెప్పలా కనుక్కుంటూ వుండేది. ఇంట్లో నేనొక మహారాజుని. ఆవిడ జీతం భత్యం లేని మహామంత్రి. నన్నలా మురిపెంగా, మన్ననగా, లాలనగా  చూసుకుని, నా కళ్ళముందే  అలా దాటిపోయింది.
ఇప్పుడు అర్ధం అయివుంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్!  ఆమెను పోగొట్టుకుని  కాదు, నేను ఇంతగా బాధ పడుతోంది. ఇలా చేసే మనిషి లేకుండా ఎలా బతకాలి దేవుడా అనే స్వార్ధం నా చేత ఇలా రాయిస్తోంది. కాబట్టి స్నేహితురాలా! నిలువెల్లా స్వార్ధం నిండిన ఈ వ్యక్తికి ఊరడింపు వాక్యాలు, హిత వచనాలు పలికి మీ మంచితనాన్ని వృధా చేసుకోకండి ప్లీజ్!