ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ......
20, అక్టోబర్ 2018, శనివారం
Discussion on Rahul Gandhi's Telangana Tour | Public Point | Part 2 | AB...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ......
లేబుళ్లు:
ABN debate on Rahul Telangana visit
19, అక్టోబర్ 2018, శుక్రవారం
సతీమణి అంటే....... భండారు శ్రీనివాసరావు
ఎమ్మెస్సార్ కృష్ణారావు గారు. రేడియోలో
నా సీనియర్ కొలీగ్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు అధికారిగా హైదరాబాదులో, ఢిల్లీలో పనిచేసి
రిటైర్ అయ్యారు. ఆయనకు తెలుగంటే ప్రాణం. ‘మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడండి, లేదా
పూర్తిగా తెలుగులో మాట్లాడండి, అంతేకాని ఇంగ్లీష్ తెలుగు కలిపి సంకరం చేయొద్దు’ అనేవారు.
‘నా వైఫ్’ అని ఏదైనా చెప్పబోతే ఆయనకు
చర్రున కాలేది. ‘నా వైఫ్ ఏమిటి ఛండాలంగా, మా ఆవిడ అని హాయిగా అనొచ్చుగా’ అనేది ఆయన వాదన.
అలాగే ‘సతీమణి’ అనే పదం పట్ల
కృష్ణారావు గారికి కొన్ని అభ్యంతరాలు ఉండేవి.
‘సతీమణి అంటే సతులలో మణి అని అర్ధం. రుక్మిణి
కృష్ణుడి సతీమణి. ఆయనకున్న అష్ట సతుల్లో ఆవిడ మణి అని. పలానా వారి సతీమణి అని
వార్తల్లో చెబితే తప్పు అర్ధం వస్తుంది, ఆయనగారికి ఇంకా వేరే భార్యలు వున్నారని.
అలా కాకుండా పలానా వారి భార్య’ అని రాయమనేవారు.
లేబుళ్లు:
సతీమణి అంటే....... భండారు శ్రీనివాసరావు
చంద్రబాబుతో మా ఆవిడ పోటీ – భండారు శ్రీనివాసరావు
“చంద్రబాబును చూడండి, ఆ వయసులో ఎలా
అలుపు ఎరగకుండా పనిచేస్తున్నాడో. మొన్నీమధ్య అమెరికా వెళ్లి వచ్చాడా. మనమయితే జెట్ లాగ్ అంటూ రెండ్రోజులు కాళ్ళు మునగతీసుకుని
ఇంట్లోనే పడివుంటాం. ఆయన మాత్రం కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు
తిత్లీ తుపాను సంగతి చూడండి, తుపాను రావడం తీరం దాటి వెళ్ళడం మాత్రం జరిగింది కానీ
ఆయన ఆల్ మకాం శ్రీకాకుళం జిల్లాలోనే పెట్టి ఎలా అహోరాత్రులు పనిచేస్తున్నాడో.
టీవీల్లో చూస్తుంటే ఆశ్చర్యంకలుగుతుంది. రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తానని అంటుంటే
ఏమో అనుకున్నా కానీ నిజమే అనిపిస్తోంది”
ఈ మధ్య మా ఇంటికి వచ్చిన ఒక పెద్ద
మనిషి చెప్పుకొచ్చాడు, మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూ చంద్రబాబు గురించి అనర్ఘలంగా మాట్లాడుతూ.
ఆయనకో సంగతి తెలవదు మా ఆవిడ కూడా
రోజుకు పద్దెనిమిది గంటలు, అవసరమయితే మరికొన్ని గంటలు ఎక్కువగా పనిచేస్తుందని. పని
చెయ్యకపోయినా, పని లేకపోయినా ఆమెకు తోచదని నాకూ ఆలస్యంగానే తెలిసింది.
‘చూసారా డ్రాయింగు రూములో తేడా’
అంటుంది నేను మధ్యాన్నం నిద్ర లేవగానే. ఈ కొద్ది సమయంలో కొట్టొచ్చిన ఆ తేడా ఏమిటని
నేను నిద్ర కళ్ళు మరింత విప్పార్చి చూస్తే ఏమీ కనబడదు.
‘అదే మరి. నిన్న ఫ్లవర్ వాజు
ఎక్కడుంది? ఇవ్వాళ ఎక్కడుంది. ఇక్కడ పెట్టి చూసాను, ఎంతో అందంగా కనిపించింది’
కొలను విడిచిన తామరపూలు వాడి పోతాయని
సుమతీ శతకంలో చదివా కానీ, ఫ్లవర్ వాజ్ చోటు మారితే లేని అందాలు సంతరించుకుంటుందని
నాకు తెలియదు.
‘అవునా’ అనబోయి ఎందుకయినా మంచిదని ‘అవును’
అన్నాను ముక్తసరిగా.
‘పక్కింటి పిన్నిగారు కూడా అలాగే అంది,
ఇలా పెడితేనే చాలా బాగుందని’
ఇచ్చిన కాఫీ తాగి బల్ల మీద పెట్టబోతే అదక్కడ
కనిపించలేదు. ఏమైందా అని చూస్తే గదిలో మరో మూలకు జరిగి కూర్చుంది.
‘వాస్తు మహిమా?’ అనబోయి ఆగి ఆ నమ్మకాలు
ఆమెకు లేవని గుర్తుకొచ్చి, ఇంటి సర్డుడు కార్యక్రమంలో భాగమని జ్ఞాపకంవచ్చి నాలుక
మడతేసి సర్దుకున్నాను.
మా ఇంట్లో సోఫాలు ఈ రోజు వున్నట్టు మరురోజు
ఉంటాయన్న గ్యారంటీ లేదు. అటూ ఇటూ మారుస్తూ వాటితో చెడుగుడు ఆడడం మా ఆవిడకో సరదా.
మంచాలు జరుగుతాయి. తలగడలు అటువి ఇటవుతాయి.
టీవీ దిక్కు మార్చుకుంటుంది. పూలకుండీలు, బట్టల బీరువాలు, పుస్తకాల అరమరాలు,
డైనింగు టేబులు ఏవీ నాల్రోజుల పాటు ఒక్క తీరున, ఒక్క జాగాలో వుండవు. వంటిల్లు
సరేసరి. అది ఆవిడ సొంత సామ్రాజ్యం.
‘ఆ గోడ మీద వినాయకుడి పెద్ద పటం అక్కడ
బాగా అనిపించడం లేదు, ఎవరయినా వచ్చినప్పుడు ఎదురుగా కనిపిస్తే బాగుంటుంది.’ తనలో
తాను అనుకుంటున్నట్టుగా పైకే అనేసింది.
నాకు అనిపించింది, బ్రహ్మ రుద్రాదులు
కూడా ఆ వినాయకుడి స్థానచలనాన్ని ఇక ఆపలేరని.
మొన్నటికి మొన్న మా అమ్మగారి ఆబ్దీకం,
ఆ తర్వాత వరలక్ష్మీ వ్రతాలు, వినాయక చవితి, ఇప్పడు దేవీ నవరాత్రులు, లలితా
సహస్రాలు, ఇవన్నీ ఒక్క చేత్తో సంభాళిస్తూనే మళ్ళీ ఇలా తెచ్చి పెట్టుకున్న పనులు.
అలసట అనేది ఈ మనిషికి లేదా ఉండదా అనిపిస్తుంది.
అలాగే మరోటి కూడా అనిపిస్తుంది.
ఇందులో పనికొచ్చే పనులెన్ని?
పనికిరానివెన్ని?
పని కోసం పనిచేయడమా? పనికొచ్చే
పనిచేయడమా?
అడగడానికి మా ఇంట్లో అసెంబ్లీ లేదు.
18, అక్టోబర్ 2018, గురువారం
17, అక్టోబర్ 2018, బుధవారం
ఏవిటి లాభం అంటే అదే లాభం – భండారు శ్రీనివాసరావు
‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నన్ను కష్టపెట్టడానికే పుట్టారు’ అనేది ఓ నలభయ్ ఏళ్ళ క్రితం నాకున్న ఓ నిశ్చితాభిప్రాయం.
అది చిన్నప్పుడు బలవంతాన కలరా సూదిమందు ఇచ్చిన సర్కారు మనిషి కావచ్చు, అడిగిన అప్పచ్చులు వెంటనే పెట్టలేదని నేను కోపం పెంచుకున్న మా బామ్మ కావచ్చు, హోం వర్కు చేయలేదని నా వీపు వాయగొట్టిన లెక్కల మాస్టారు కావచ్చు, దాచిపెట్టుకున్న గోలీలు కాజేసిన నా బెస్టు ఫ్రెండు కావచ్చు ఇలా ఈ డెబ్బయి ఏళ్ళ పైచిలుకు సాగిన నా ఈ జీవితంలో, ప్రతి దశలో ఎవరో ఒకరు నన్ను కష్టపెడుతూనే వచ్చారని అదేమిటో ఓ పిచ్చి నమ్మకం. ఆ నమ్మకంతోనే వాళ్ళతో పెరుగుతూ విరుగుతూ వచ్చిన మానవ సంబంధాలు.
ఇన్నేళ్ళ తరవాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏమిటో అంతా విష్ణుమాయ.
‘ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నన్ను సుఖపెట్టడానికే పుట్టారు’ అనేది కొత్తగా మొగ్గ తొలుస్తున్న భావన.
అది పొరుగింటివారు కావచ్చు, ఆటో డ్రైవరు కావచ్చు, ఇంట్లో పొద్దున్నే పత్రికలు వేసే పేపరు బాయి కావచ్చు, ఇలా ఎందరెందరో వాళ్ళ సుఖాల్ని వదులుకుని నన్ను సుఖపెడుతున్నారనే అభిప్రాయం నాలో నాకే ఒక కొత్త మనిషిని చూపిస్తోంది.
ఈ ఎరుక నలభయ్ ఏళ్ళ క్రితమే కలిగివుంటే ఈనాడు నాకు ఎటు చూసినా మంచి మిత్రులే వుండేవాళ్ళు. అలాంటి విలువయిన సంపదను నేనే చేతులారా పోగొట్టుకున్నానన్నమాట.
ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం?
‘ఏం లాభం అనే ప్రశ్నే శుద్ధ వేస్టు. మనిషి ఆలోచనా ధోరణి మంచిగా మారడం అనేది ఏ వయస్సులో జరిగినా అది లాభమే. నీకే కాదు, నీ చుట్టూ వున్న సమాజానికి కూడా’ అన్నాడు మా మేనల్లుడు రామచంద్రం.
లేబుళ్లు:
ఏవిటి లాభం అంటే అదే లాభం
16, అక్టోబర్ 2018, మంగళవారం
మా మంచం కధ – భండారు శ్రీనివాసరావు
మేము కాపురం పెట్టిన పదేళ్లకు కాబోలు మొట్టమొదటిసారి
మొదటి మంచం కొనుక్కున్నాము. ఇందుకోసం నేనూ మా ఆవిడా కలసి పెద్ద సర్వేనే చేసాం.
ఎక్కడమంచివి కొనుక్కోవచ్చని కాదు, ఎక్కడ కారు చౌకగా దొరుకుతాయాయని.
మొత్తం మీద లక్ డి కా పూల్ టెలిఫోన్ భవన్ దగ్గర మాకు తగ్గ షాపువాడు ఒకడు
దొరికాడు. డెకొలం షీట్ వేసిన సింగిల్ కాట్స్ రెండూ కలిపి రెండువందల యాభయ్ రూపాయలు.
షాపువాడే రిక్షాలో వేసి పంపిస్తానన్నాడు. సాయంత్రానికల్లా అవి దిగాయి. వున్న రెండు
గదుల్లో ఒక రూమును ఫినాయిల్ వేసి కడిగి సిద్ధంగా ఉంచాము. మంచాలు వేయగా కాస్త కాళ్ళు కదపడానికి కాసింత జాగా
మిగిలింది. మంచాలు అయితే వచ్చాయి కానీ వాటిమీద పరుపులు కొనడానికి మళ్ళీ ఒక నెల
ఆగాల్సి వచ్చింది. ఏ పని చేయాలన్నా ఫస్ట్ తారీకు రావాలికదా.
మొత్తం మీద పరుపులు కూడా అమిరాయి. ఇక ఆ
మంచాలే మాకు సర్వస్వం అయిపోయాయి. నలుగురు కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవాలన్నా,
చీట్ల పేకలు ఆడుకోవాలన్నా, ఆ మంచాల మీదనే. డైనింగ్ టేబుల్ అమిరేవరకు టిఫిన్లు,
భోజనాలు కూడా వాటిమీదనే. నిజం చెప్పొద్దూ భోజనాల బల్లలు కొనుక్కున్న తర్వాత కూడా మంచాల
మీద కూర్చునే అన్నాలు తినేవాళ్ళం.
ఉండడానికి మరో రూము వుంది కానీ, ఆ గది
పగలల్లా అమ్మవొడి. అంటే మా ఆవిడ నడిపే చైల్డ్ కేర్ సెంటర్ అన్నమాట. పదిహేను
ఇరవైమంది పసిపిల్లలు, చిన్న పిల్లలతో కీసర బాసరగా వుండేది. సాయంత్రం కాగానే
శుభ్రంగా కడిగించి వుంచేది. ఇక అప్పటినుంచి అది పర్మిషన్ అక్కరలేని పేకాట క్లబ్ గా
మారిపోయేది. పెద్దపెద్ద వాళ్ళు సాయంత్రానికల్లా అక్కడ జమయ్యేవాళ్ళు. అలా కాలక్షేపం చేసిన వాళ్ళు చాలామంది జీవితంలో చాలా పెద్ద స్థానాలలోకి చేరుకున్నారు. ఈ మధ్యనే
జ్వాలాకు ఒక ఆలోచన వచ్చింది కూడా, అప్పటి
క్లబ్ సభ్యులతో కలసి ఒక గెట్ టు గెదర్ ఏర్పాటు చేయాలని. ఇక మా ఆవిడ అమ్మవొడిలో
పెరిగిన పిల్లలు అనేకమంది ఇప్పుడు
విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
ఇలా అందరికీ కలిసొచ్చిన ఆ చిక్కడపల్లి
ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్ మెంటుగా మారిపోయింది. మాస్కో వెళ్ళేంతవరకు మేము ఆ
ఇంట్లోనే అద్దెకు ఉన్నాము. ముప్పయ్యేళ్ళ తరవాత కూడా ఆ ఏరియాలో అమ్మవొడి అంటే
గుర్తుపట్టేవాళ్ళు వున్నారు.
సందర్భం వచ్చింది కాబట్టి ఓ విషయం
చెప్పుకోవాలి. నేను ఉదయం ఆరుగంటల కల్లా బయలుదేరి ఆఫీసు కారులో రేడియో స్టేషన్ కు
వెళ్లి పొద్దుటిపూట ప్రసారం అయ్యే న్యూస్ బులెటిన్
తయారుచేసి వార్తల అనంతరం ఏడున్నర కల్లా మళ్ళీ
ఇంటికి చేరేవాడిని. అలా అప్పుడు పక్క
ఎక్కితే మళ్ళీ మిట్ట మధ్యాన్నమే దిగడం. తర్వాత సెక్రెటేరియేట్, ఆఫీసు చూసుకుని
సాయంత్రం వచ్చేవాడిని. ఇది ఎవరికంటా పడలేదు కానీ, నేను పొద్దస్తమానం ఇంట్లో
పడివుండడం మాత్రం ఇరుగింటి పొరుగింటి అమ్మలక్కల కంటపడింది. నాకు ఉద్యోగం లేదనీ,
అందుకే ఇల్లు నడపడానికి మా ఆవిడ ఇలా కేర్ సెంటర్ నడుపుతోందని వాళ్లకి వాళ్ళే
తీర్మానించుకుని మా ఆవిడమీద బోలెడు జాలి, నా మీద లేనిపోని అక్కసు పెంచుకున్నారు
(ట). ‘ సెక్రెటేరియేట్ లో మా వారికి తెలిసిన వాళ్ళు వున్నారు. ఏదో కొలువు
ఇప్పిస్తారు, మీ వారిని ఓసారి కలవమని చెప్పండి’
అన్నదో ఆవిడ నేరుగా మా ఆవిడతోనే.
ఆ అమ్మలక్కలు అందించిన ఆ ఆయుధం నన్ను ఆట
పట్టించడానికి మా ఆవిడకు కొన్ని రోజులు బాగా ఉపయోగపడింది.
15, అక్టోబర్ 2018, సోమవారం
మా బామ్మ మంచం నా కంచం – భండారు శ్రీనివాసరావు
అరవై ఏళ్ళ కిందటి జ్ఞాపకం. మా
బామ్మగారికి అప్పుడు అరవై ఏళ్ళు పైమాటే. మా కుటుంబానికి ఆవిడ విక్టోరియా రాణి. మా
నాన్నగారు నాకు ఎరుకలేని చిన్నవయస్సులోనే పోయారు. ఆయనకు ఏడుగురు ఆడపిల్లలు.
నలుగురు మగపిల్లలం. అయిదుగురు అక్కయ్యలకు ఆయన హయాములోనే పెళ్ళిళ్ళు అయ్యాయి.
మగపిల్లలం చాలా చిన్నవాళ్ళం. మగ దక్షత లేని కుటుంబ భారాన్ని ఆవిడ అప్పటినుంచీ భుజాలకు
ఎత్తుకుంది. లెక్కలు చెప్పుకోవడానికి పెద్ద ఆస్తి. కానీ లెక్క తీస్తే అయివేజు
అంతంత మాత్రం.
ఇదంతా ఎందుకంటే మా ఇంటికి మా బామ్మగారే
మకుటం లేని రాణి అని చెప్పడానికి. ఇంట్లో ఆవిడకూ, మా అమ్మగారికీ వెండి భోజనం
పళ్ళేలు, వాటి మధ్యలో ఒక బంగారం పువ్వు.
పక్కనే వెండి గ్లాసులు. ఇంకా వెండి సామాను వుండేది కానీ అవన్నీ ఇనప్పెట్టె లోనే.
వాటి తాళం చెవులు మా బామ్మగారి దిండు కిందా. ఇంట్లో మిగిలిన వాళ్ళ కంచాలు అన్నీ రాతెండివే. బయటనుంచి వచ్చిన
వాళ్ళకోసం మా అమ్మగారు దొడ్లో ఉన్న బాదం చెట్టు ఆకులతో విస్తళ్ళు కుట్టేది.
కంచమే కాదు, మా బామ్మగారి మంచం కూడా సపరేటే. ఇంట్లో చాలా మంచాలు, నవారువీ,
నులకవీ ఉండేవి. ఆమె మంచం మాత్రం ఆమెకే ప్రత్యేకం. మిగిలిన మంచాల మీద ప్రోటోకాల్
ప్రకారం దిండ్లూ, దుప్పట్లూ మారుతుండేవి. అంటే బావగార్లు కానీ అతిధులు కానీ వస్తే
వాళ్లకు నవారు మంచాలు. మిగిలిన వాళ్లకి నులక మంచాలు. ప్రతి రోజూ ఉదయం పూట ఈ
మంచాలకు సళ్ళు లాగి బిగించే కార్యక్రమం ఒకటి నడుస్తుండేది. దాన్ని మా ఆరో అక్కయ్య
ప్రేమక్కయ్య పర్యవేక్షించేది. లాంతర్లు, బుడ్డి దీపాలను ముగ్గుతో తుడిచి శుభ్రం
చేసి, కిరసనాయిల్ పోసి సిద్ధం చేసే పని మా ఏడో అక్కయ్య భారతక్కయ్య మీద పడేది.
అప్పటికి వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు కాలేదు.
కంచాలతో కదా మొదలు పెట్టింది. అప్పుడప్పుడే
స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. మా ఇంట్లో
అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. మా రెండో అక్కయ్య శారదక్కయ్య ఓసారి పండక్కి
వస్తూ రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ, మూడో అన్నయ్య వెంకటేశ్వర
రావుకూ ఒకటీ ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు
రెండూ కలిపి పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు మా నాన్నగారి మూడు నెలల
జీతం అన్న మాట. ఇహ అప్పుడు చూడాలి మా మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో
తెలవదు కానీ అదెక్కినంత ఆనందం.
మా అక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు మోహం
ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్ ఏళ్ళకు
పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు లగేజి సమస్య కారణంగా ఆ కంచంతో నా రుణానుబంధం
తెగిపోయింది.
తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది.
డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాత, చాలా కొద్ది మంది ఇళ్ళల్లో
తప్ప, ఇప్పుడు ఈ విడి కంచాల గోల లేదు.
మళ్ళీ ముప్పయ్యారేళ్ళ తర్వాత మా ఆవిడకు
కలిగిన వింత కోరిక పుణ్యమా అని నాకు తిరిగి సొంత కంచం వైభోగం వచ్చిపడింది. మొన్న
బజారుకు వెళ్లి దసరా పండుగ సందర్భంగా చేసిన కొనుగోళ్లలో భాగంగా నాకు ఒక స్టీలు
కంచం కొనుక్కొచ్చింది.
నిన్న దానికి ప్రారంభోత్సవం చేయాలని
సంకల్పం. దేవుడు మరోలా అనుకున్నాడు. కంచం మధ్యలో ఆ స్టీలు కంపెనీ వాడు ఒక పెద్ద
స్టిక్కరు అతికించి కూర్చున్నాడు. దాన్ని తీయాలని మా పనిమనిషి గోటితో
ప్రయత్నించింది. ఆ స్టిక్కరు ఊడిరాకపోగా అది
వికటించి మరింత వికార స్వరూపం సంతరించుకుంది. ఇరుగింటి పొరుగింటి చిన్న ఆడ లేడీస్
(మరి మేము మాత్రమే ఈ అపార్ట్మెంట్లో అందరికీ ఆంటీలం,అంకుళ్ళం! ఆ చిన్నవాళ్ళను, మరీ అంత చిన్నవాళ్ళేమీ కాదులెండి,
పిల్లలకు పిల్లలు ఉన్నవాళ్ళే, కానీ ఆంటీ అంటే మాత్రం ఎంతో నొచ్చుకుంటారు) కలగచేసుకుని,
నీళ్ళు సలసలా మరగబెట్టి, ఆ వేడి వేడి
నీళ్ళు గుమ్మరించి ఆ కంచానికి అభ్యంగన స్నానం, సంప్రోక్షణ వగైరా సలక్షణంగా
పూర్తి చేశారు కానీ, ఆ స్టిక్కరు మాత్రం పోలింగు బూతులో వేలికి అసహ్యంగా అంటించిన ‘గుర్తు’
మాదిరిగా అలాగే వుండిపోయింది.
ఓ డౌటనుమానం కూడా మనసులోనే మిగిలి
పోయింది.
‘అవునూ! ఈ స్టెయిన్ లెస్ స్టీల్
కంపెనీల వాళ్లు తమ కంపెనీ స్టిక్కరు కంచాలకు వెనుక భాగంలో అరచేతి మందాన అంటిస్తే
వాళ్ళ సొమ్మేమయినా పోతుందా!’
లేబుళ్లు:
నా మంచం నా కంచం –
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)