7, జులై 2018, శనివారం

అధికారం నోరు మూయిస్తుంది


సోవియట్ యూనియన్ లో స్టాలిన్  అనంతరం అధికారానికి వచ్చిన కృశ్చెవ్ వీలు చిక్కినప్పుడల్లా స్టాలిన్ విధానాలను తూర్పారబడుతుండే వాడు. నిజానికి స్టాలిన హయాములో కృశ్చెవ్ ఆయనకు కుడి భుజంగా ఉండేవాడు. స్టాలిన్  ఏం చెప్పినా  పెదవి విప్పి ఏమీ చెప్పలేకపోయేవాడు.
స్టాలిన్ తదనంతరం కృశ్చెవ్ సోవియట్ కేంద్ర కమిటీ అధినాయకుడిగా పదవి చేపట్టిన  తర్వాత ఆయన స్టాలిన్ ను పదేపదే  విమర్శించే తీరు కృశ్చెవ్ అనుయాయులకు విచిత్రంగా తోచేది. స్టాలిన్ జీవించి వున్న కాలంలో ఆయనకు వీర విధేయుడుగా ఉంటూ, ఆయన  ఏమి చెప్పినా గొర్రెలా  తల ఊపే కృశ్చెవ్ ఇతడేనా అనే అనుమానం వారిని తొలుస్తుండేది. ‘ఆ రోజునే ఇలా ఎందుకు మాట్లాడలేకపోయారు, ఇప్పుడెందుకు ఇలా దుయ్యబడుతున్నారు’ అని అడగాలని వారికి  వున్నా పైకి అనే ధైర్యం ఎవరికీ లేదు. ఒకరోజు  కృశ్చెవ్ ని ఒక యువ నాయకుడు ధైర్యం చేసి మనసులో మాట అడిగేశాడు. కృశ్చెవ్ నవ్వి ఇలా అన్నాడు.
‘మీరు ఈరోజు నా ముందు నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నారా! ప్రతిదానికి తందానా అంటున్నారా లేదా! ఆరోజుల్లో నేనూ అదేపని  చేశాను’
ఇది ఒక జోక్ కావచ్చు. కేంద్రీకృత అధికార రాజకీయాలకు అద్దం పడుతుంది.
రోజూ టీవీ చర్చల్లో “మీరు ఆరోజు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు నిలదీస్తున్నారు” అని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధించుకుంటూ వుంటే ఎందుకో ఏమో  ఈ జోకు జ్ఞాపకం వస్తుంటుంది.  

30, జూన్ 2018, శనివారం

ఆదిరాజులాంటి జర్నలిష్టులు ఉంటారా? సేలం పాఠకుడి ఆశ్చర్యం! – భండారు శ్రీనివాసరావు

ఈ సాయంత్రం ఒక ఫోను కాల్ వచ్చింది. ‘సేలం నుంచి శ్రీధర్ విశ్వనాధన్ ని మాట్లాడుతున్నాను’ అన్నది అవతల గొంతు స్వచ్చమైన తెలుగులో. అప్పుడు నాకూ ఆశ్చర్యం వేసింది, తమిళనాడు అంటున్నాడు, ఈ తెలుగేమిటని. అదే అడిగాను. ‘పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నాను, అదో కధ. ముందు నేను ఫోను చేసింది ఆదిరాజు అనే జర్నలిష్టు విషయంలో’
‘ఆదిరాజా! ఆయన మీకెలా తెలుసు?’
‘మీరు ఈ రోజు ఆంధ్రప్రభలో ఆయన్ని గురించి ఓ వ్యాసం రాశారు. అది చదివిమీకు ఫోన్ చేస్తున్నాను. మీ పేరుతొ పాటు ఆంధ్రప్రభవాళ్ళు మీ నెంబరు కూడా ఇచ్చారు’
‘ఆంధ్రప్రభ’ సేలం లో దొరుకుతుందా”
‘దొరకదు, కానీ నేను నెట్లో చదువుతాను. ఉదయం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు నాకు ఇదే పని’
‘అలాగా! సంతోషం. మీది తమిళనాడు, అక్కడ కూడా తెలుగువాళ్ళు చాలామంది వున్నారు. కానీ వాళ్ళ ఉచ్చారణ అదో రకంగా వుంటుంది. మీరెలా నేర్చుకున్నారు?’
‘పదేళ్ళ క్రితం నేనొకసారి రామోజీ ఫిలిం సిటీ చూడడానికి హైదరాబాదు వచ్చాను. రైల్వే స్టేషన్ వద్ద ఒక ఆటో డ్రైవరు నా తెనుగు చూసి చిన్నతనంగా చూసాడు. దాంతో నాకు పట్టుదల పెరిగింది. మా వూరికి తిరిగొచ్చిన తర్వాత లైబ్రరీలకు వెళ్లి తెలుగు పుస్తకాలు తిరగేసేవాడిని. నెట్లో తెలుగు పత్రికలు చదవడం మొదలు పెట్టాను. తెలుగు సినిమాలు నెట్లో చూస్తాను. ఆ విధంగా నాకు తెలుగు భాష మీద పట్టు పెరిగింది. మరో సారి హైదరాబాదు వచ్చి ఆ ఆటో వాడితో తెలుగులో మాట్లాడాలి అనే కోరిక వుంది, కానీ అది సాధ్యపడే విషయం కాదు, నాకూ తెలుసు
‘........’
‘అసలు విషయానికి వస్తాను. ఆదిరాజు గారి గురించి చదివిన తర్వాత ఆయన మీద నా అభిమానం, గౌరవం పెరిగాయి. అసలు అలాంటి జర్నలిష్టులు ఈనాడు వున్నారా? మాదగ్గర పరిస్తితి మరీ ఘోరం. ఇక్కడ పత్రికలు విడిగా అమ్ముడు పోవు. పత్రికలే మొత్తంగా అమ్ముడు పోయాయి’
‘......’
‘ఏమండీ! ఆదిరాజు గారి కుటుంబానికి నా తరపున నమస్కారాలు చెప్పండి’
చివర చివర్లో నా మౌనానికి కారణం ఆయన మాటలకు నా గొంతు పూడిపోవడం.
మౌనమే ఆయనకు నా సమాధానం.
విశ్వనాధన్ గారి ఫోను నెంబరు: 07010842088



25, జూన్ 2018, సోమవారం

సిగ్గుతో తలదించుకున్నాను – భండారు శ్రీనివాసరావు


రాజీవ్ గాంధి బాంబు దాడిలో మరణించినప్పుడు నేను మాస్కోలో వున్నాను. ఆ దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకు నేను కుటుంబంతో కలిసి  కాఫీ తాగడానికి ఓ హోటల్ కు వెళ్లాను. అక్కడ మాకు సర్వ్ చేయాల్సిన వెయిట్రెస్ వృద్ధురాలు. అక్కడ వయసుతో పనిలేకుండా ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు వుండేది. మమ్మల్ని చూడగానే భారతీయులమని గుర్తు పట్టింది. అనుమాన నివృత్తికోసం ‘ఇందీస్కీ పజాలుస్తా’ (మీరు ఇండియన్లా) అని అడిగింది. ఔనని చెప్పగానే మా ఆవిడను పిల్లలను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రష్యన్ లో ఏమిటో అంటోంది. ఆ భాష కొద్దిగా తెలిసిన మా పిల్లలు చెప్పింది ఏమిటంటే రాజీవ్ గాంధి చనిపోయాడని తెలిసి ఆమె తన దుఃఖాన్ని మాతో పంచుకుంటోంది. పరాయి దేశంలో వనిత మన దేశంలో జరిగిన ఘోరానికి బాధ పడుతోంది. ఆవిడను చూసి మాకే సిగ్గనిపించింది.
కొన్నేళ్ళ తరువాత హైదరాబాదు వచ్చి రేడియోలో మళ్ళీ చేరాను. ఆ రోజు ఎవరో పెద్దాయన చనిపోతే ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఒకాయన మాకు ఫోను చేసి ఈ సెలవు ‘ Negotiable instruments Act’ కిందికి వస్తుందా అని  అడిగాడు. ఆయన ఏదో బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈ యాక్టు కింద సెలవు ప్రకటించకపోతే అది బ్యాంకులకు వర్తించదు. అదీ సంగతి.
ఆయన ధోరణి  చూసి నాకు సిగ్గనిపించింది. మాస్కో వృత్తాంతం గుర్తుకు వచ్చింది.    

అర్ధం కాని అర్గ్యుమెంటు

ఈ రోజు ఉదయం  AP 24 X 7 ఛానల్ సీయీఓ వెంకట కృష్ణ నిర్వహించే చర్చాకార్యక్రమంలో ఒక వింత వాదన నా చెవిన పడింది. (ఈ అంశంపై జరిగిన చర్చలో నాకు అవకాశం రాలేదు, నా వరకు వచ్చేసరికి మరో అంశం తీసుకున్నారు. ఒకోసారి సమయాభావం వల్ల ఇలా జరుగుతూ వుంటుంది)
విషయం ఇది. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు ఇరవై వేల మంది గ్రామ సహాయకుల జీత భత్యాలను ఇతోధికంగా పెంచింది. ఆహ్వానించదగ్గ నిర్ణయం. వారందరూ కలిసి అమరావతిలో ఒక సమావేశం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నారు. ఇది కూడా ఆక్షేపనీయం కాదు. గతంలో ఇలాంటి ‘థాంక్స్ గివింగ్ సమ్మేళనాలు’ జరిగాయి కూడా. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఇదేమాదిరి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
అయితే ఈ సమావేశానికి హాజరయ్యే సిబ్బందికి ప్రయాణ వసతి, భోజన ఖర్చుల కింద మనిషికి మూడువందల రూపాయలు చెల్లించాలని రాజంపేట రెవెన్యూ అధికారి ఇచ్చిన ఒక ఉత్తర్వును సాక్షి పత్రిక ప్రచురించింది. అదే ఈ నాటి చర్చలో మొదటి అంశం అయి కూర్చుంది. జనసేన, వైసీపీ ప్రతినిధులు సహజంగానే దాన్ని తప్పుపట్టారు. ప్రజాధనం దుర్వినియోగం అని ఆరోపించారు. నిజానికి ఈ నిర్ణయంతో నేరుగా ముఖ్యమంత్రికి సంబంధం ఉండకపోవచ్చు.”More loyal than the King” అనే బాపతు అధికారులు అలాంటి ఒక ఉత్తర్వు జారీ చేసి ఉండవచ్చు. అతి స్వల్ప జీతాలు తీసుకుంటున్న సిబ్బందికి ఆ మాత్రం ఆర్ధిక సాయం అందిస్తే తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు.
అయితే, ఈ విషయంలో వివరణ ఇవ్వడానికి ఫోన్ లైన్లోకి వచ్చిన ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానం విస్మయ పరిచేదిగా వుంది. ఆయన ఏమన్నారంటే:
“ముఖ్యమంత్రిగారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అందుకు ప్రతిగా ఉద్యోగులు ఆయనకు కృతజ్ఞత తెలపాలని అనుకున్నారు. శ్రీకాకుళం, అనంతపురం వంటి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఆర్టీసీ ప్రత్యెక బస్సులు వేస్తోంది. వచ్చే వారికి టిఫిన్, మధ్యాన్న భోజనం, రాత్రి భోజనం పెట్టడానికి ఒక్కో ఉద్యోగికి మూడు వందలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు కూడా మా సంఘం సభ్యులే. పైగా ఆ డబ్బును ఉద్యోగులు మళ్ళీ ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఇక ఇందులో అభ్యంతర పెట్టాల్సింది ఏముంది?”
నిజమే. ఆ డబ్బును తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తారు. కానీ ప్రభుత్వ ఖజానా అనేది ఇలాంటి ఖర్చులకు ‘చేబదులు’ ఇచ్చే వ్యవస్థ కాదుకదా. సిబ్బందికి ఇబ్బంది లేకుండా చూడడమే ఉద్దేశ్యం అయితే సంఘమే ఆ ఖర్చులు భరిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు, పైగా అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలకు జవాబు చెప్పాలిసిన దుస్తితి కూడా వచ్చేది కాదు.
ఈ సింపుల్ లాజిక్ ను ఆ నాయకుడు ఎలా మిస్సయినట్టు?

లింక్:
https://www.youtube.com/watch?v=o-eZo6_KZxk

12, జూన్ 2018, మంగళవారం

రాజకీయ రంగస్థలం

మహానటి సావిత్రి ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒక సినిమాలో, చెల్లెలుగా మరో సినిమాలో వేస్తే ప్రేక్షక జనాలు ఆదరించిన మాట నిజమే కానీ, వేషాలు మార్చుకున్న రాజకీయ రంగస్థల నటులను మాత్రం ఇట్టే గుర్తు పట్టేయగలరన్న సంగతిని వాళ్ళు మరచిపోతున్నట్టున్నారు. అందుకే కాబోలు వేషం మార్చినా ప్రజలు పట్టుకోలేరన్న నమ్మకంతో వ్యవహరిస్తున్నారు.
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూడండి. రంగస్థలం అదే. పాత్రలూ అవే, పాత్రధారులూ వాళ్ళే. పాడే పద్యాలు అవే. చెప్పే డైలాగులూ అవే. కాకపొతే, చూస్తుండగానే పాత్రధారుల పాత్రలు మారిపోయాయి. పాడే పద్యాలు మారిపోయాయి. చెప్పే డైలాగులు చెదిరిపోయాయి. చూసే ప్రేక్షకులు మాత్రం మారలేదు. టిక్కెట్టు లేని సినిమా చూసినట్టు జనాలు పండిత, పామరులనే తేడా లేకుండా ఉచిత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఎప్పటిదాకా!
వచ్చే ఎన్నికల దాకా.


ఆ తర్వాత నాటకాలు ఆడేవాళ్ళే ప్రేక్షకులుగా మారిపోతారు.

11, జూన్ 2018, సోమవారం

అలా దేశాలు చుట్టి వద్దాం రండి! – భండారు శ్రీనివాసరావు



నూట యాభయ్ రూపాయలతో చూపిస్తా రండంటున్నారు రాజేష్ వేమూరి.
నాకు సంతోషం అనిపించి ఆ ప్రయాణం ఇవ్వాళే మొదలెట్టాను. ఇంకా పోలండులోనే వున్నాను. చూడాల్సినవి ఇంకా చాలా వున్నాయి. జర్మనీ, స్వీడన్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్, ఇంకా మనకు ఆట్టే తెలియని, నోరు తిరగని మరో దేశం లిచ్టేన్ స్టెయిన్. 
కాకపోతే చదువరికీ అద్భుతమైన అనుభూతిని రాజేష్ కల్పించింది తాను రాసిన ‘ నా ఐరోపా యాత్ర’ అనే 184 పేజీల పుస్తకం ద్వారా. (నాకు ఈ మాత్రం ఖర్చు కూడా లేకుండా వేమూరి రాజేష్ ఆ పుస్తకాన్ని కొరియర్ ద్వారా నాకు ఈరోజు పంపారు. వారికి కృతజ్ఞతలు) 
నిజానికి వీటిల్లో చాలా దేశాలను నా కళ్ళతో చూసే బంగారు అవకాశం మూడు దశాబ్దాల క్రితమే నేను మాస్కో రేడియోలో ఉన్నప్పుడే లభించింది. కానీ ప్రతి హాలిడేకి నేను స్వదేశాన్నే ఎంచుకోవడం వల్ల దాన్ని కోల్పోయాను. సోవియట్ యూనియన్ రోజుల్లో ఈ దేశాల్లో చాలా వరకు రష్యా మిత్ర దేశాలు. విమానాల్లోనే కాకుండా రైల్లో వెళ్లి తిరిగివచ్చే దేశాలు. పలానా రోజుల్లో పలానా దేశం వెళ్లి వద్దామని అనుకుంటున్నట్టు రేడియో వాళ్లకి చెబితే చాలు యావత్తు కుటుంబానికి వాళ్ళే రైలు టిక్కెట్లు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అందుకు వసూలు చేసే డబ్బు కూడా నామమాత్రం. అప్పుడు చూడని ఈ దేశాల్ని ఇదిగో ఇలా చూడగలుగుతున్నాను. ఆయన ఎంత వివరంగా రాశారంటే రాజేష్ వెంట మనమూ తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది.
వెనకటి రోజుల్లో విదేశీ ప్రయాణం అంటే ఒక అపురూపం. ఇప్పుడలా కాదు, ఉద్యోగాలకోసం బయట దేశాలకు వెళ్ళేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అమెరికా వంటి దేశాల సంగతి చెప్పక్కర లేదు. పొతే ఇదిగో ఇలా యూరోపియన్ దేశాలకు వెళ్ళే పర్యాటకులకు కొదవ లేదు కానీ, ఉద్యోగాలు, ఉపాధుల నిమిత్తం పోయేవారు ఇంకా అరుదే.
విదేశాలను పొగడడం అంటే మన దేశాన్ని చిన్న బుచ్చడం కాదని రచయితే ఒక చోట చెప్పారు. అయితే ఘన చరిత్ర గురించి చెప్పుకుంటే సరిపోదు. దాన్ని పదిల పరచుకోవడం కూడా తెలియాలి. ఉదాహరణకు లండన్ మ్యూజియంలో అమరావతి శిల్పాలను ఒక ఫ్లోరు నిండా ప్రదర్శనకు ఉంచారు. అలాగే, ప్యారిస్ లోని గుయ్ మెట్ మ్యూజియలో ఘంటసాల తవ్వకాల్లో పడిన మూడు శిల్పాలను, ఊరి పేరు వివరాలతో సహా భద్రపరిచారు. అవన్నీ అక్కడ పదిలంగా వున్నందుకు సంతోష పడాలా, పోగొట్టుకున్నందుకు ఖేదపడాలా!
పోలండు, జర్మనీ వంటి దేశాలు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పూర్తిగా ధ్వంసం అయి, మళ్ళీ స్వయం కృషితో కోలుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యాయి. ఆ క్రమంలో అవి ఏనాడూ తమ దీన స్తితిని ప్రపంచానికి చాటుకోలేదు. ఆ తరవాత స్వాతంత్రం వచ్చిన మన దేశాన్ని వాటితో పోల్చుకోగలమా! అక్కడా రాజకీయ పార్టీలు వున్నాయి. అవీ రాజకీయం చేస్తాయి. కానీ అభివృద్ధిని పణం పెట్టికాదు.
ఈ పుస్తకం రాసిన రాజేష్ వేమూరికి అభినందనలు.
(నా ఐరోపా యాత్ర, రచయిత : రాజేష్ వేమూరి, ప్రచురణ: మన ఘంటసాల ప్రచురణలు, ప్రతులకు: +919182272551

5, జూన్ 2018, మంగళవారం

ప్రతిపక్ష నేతగా జగన్ నాలుగేళ్ల ప్రస్థానం – భండారు శ్రీనివాసరావు



My article on YS Jagan Mohan Reddy completing four years as AP Opposition Leader published in Andhra Prabha today, 5th June, 2018)
నా నలభయ్ ఏళ్ళ పాత్రికేయ జీవితంలో వినని మాట గత నాలుగేళ్ళలో తరచుగా వినబడుతోంది. అదేమిటంటే వైసీపీ నేత జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలం అయ్యారని. సాఫల్య వైఫల్యాలు లెక్కించడానికి ప్రతిపక్షం చేతిలో ఉన్న అధికారాలు ఏమిటన్నది, నాకు అర్ధం కాని విషయం. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు కాబట్టి విఫలం అయ్యారు అనడానికి అధికార పీఠం ఎక్కనే లేదు. ఇక ప్రతిపక్షంగా విఫలం అవడం అంటే ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి దోహదపడకపొతే అప్పుడు వైఫల్యాలు గురించి మాట్లాడుకోవచ్చు. ‘సమస్యలే లేవు, ఒక వేళ వున్నా వాటిని ఒకరు చెప్పే పనిలేకుండా తక్షణమే పరిష్కరిస్తున్నాం’ అనే ధోరణితో పాలకపక్షం వున్నప్పుడు ప్రతిపక్ష నేత వైఫల్యాల ప్రసక్తి ఎందుకు తీసుకువస్తున్నట్టు? ఈ రకమైన విమర్శలు చేసేవాళ్ళు ఈ లాజిక్ ని ఎందుకు మరచిపోతున్నట్టు?
జగన్ మోహన రెడ్డి మీద మరో విమర్శ. ప్రజల పక్షం నుంచి కాదు, పాలక పక్షం నుంచి. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుని జగన్ మోహన రెడ్డి ప్రజాస్వామ్య విలువల్ని అపహాస్యం పాలు చేస్తున్నారన్నది ఆ విమర్శ. ప్రజాస్వామ్య ప్రియులెవ్వరూ ఇటువంటి నిర్ణయాన్ని హర్షించని మాట నిజమే. కానీ ఏ పరిస్తితుల్లో అటువంటి నిర్ణయం తీసుకున్నదీ ఆయనే పలుమార్లు బాహాటంగా చెప్పారు. గడచిన నాలుగేళ్ల కాలంలో పాలక పక్షంలోకి చేర్చుకోవడం మాత్రమే కాకుండా, వారిలో ఒకరిని మంత్రి పదవిలో కూర్చోబెట్టడం ద్వారా పాలక పక్షమే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని, తాము అసెంబ్లీలో లేవనెత్తే ప్రజా సమస్యలకు, తమ పార్టీకి చెందిన శాసనసభ్యుడే మంత్రి రూపంలో సమాధానం ఇచ్చే దుస్తితిని చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ చేసే వాదనలో వాస్తవం లేకపోలేదు. తమ ఎమ్మెల్యేలను గతంలో పాలకపక్షంలోకి తీసుకున్న రోజుల్లో కూడా తాము అసెంబ్లీకి హాజరయిన సంగతిని ఆ పార్టీ గుర్తుచేస్తోంది.
ఏది ఏమైనా నాలుగేళ్ల నవ్యాంధ్రలో ప్రజలు కోరుకున్న విధంగా పాలన జరగడం లేదని జగన్ మోహన రెడ్డి తన సంకల్ప యాత్రలో అనుదినం చెబుతూ వస్తూనే వున్నారు. ఈ క్రమంలో ఆయన చేసే ప్రసంగాలలో చంద్రబాబు నాయుడి ప్రసక్తే తరచుగా వినబడుతోంది. ఆయన పేరు పలుమార్లు ప్రస్తావిస్తూ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అందుకు ప్రతిగా చంద్రబాబు మంత్రివర్గంలోని మెజారిటీ సభ్యులు విడివిడిగా, కొండొకచో ఒక్కుమ్మడిగా జగన్ మోహన రెడ్డి పై మాటల దాడి చేస్తున్నారు. వీరికి పాలక పక్ష ఎమ్మెల్యేలు గొంతు కలుపుతున్నారు. ఏతావాతా జరుగుతున్నది ఏమిటంటే, ప్రజాసమస్యలకంటే వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకే మీడియాలో విస్తృత ప్రాచుర్యం లభిస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే దిశగా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే. అలాగే, ఇదే సమయంలో తాము రాష్ట్రానికి చేసిన మంచి పనులని గురించి చెప్పుకోవడం కంటే జగన్ పార్టీని, ముఖ్యంగా జగన్ మోహన రెడ్డిని చెడుగా చిత్రించడానికే పాలక పక్షం ఎక్కువ శ్రమ పడుతున్నట్టు కానవస్తోంది. నిజానికి ఇవేమీ కొత్తవి కాదు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు చేసినవే. ప్రజలు వాటిని పట్టించుకోలేదన్న సంగతి వైఎస్ఆర్ సీపీకి లభించిన ఓట్ల శాతం తెలుపుతోంది.
ప్రజలు పట్టించుకోని ఈ అవినీతి అంశాన్ని ఈసారి ఎన్నికల్లో ఉభయ పక్షాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు వారి మాటల తీరు తెలుపుతోంది.
ప్రభుత్వంలోని లొసుగులను ఎత్తి చూపడమే ప్రతిపక్షాల ప్రధాన బాధ్యత. అసెంబ్లీ వేదికపైనా, లేదా ఇతర వేదికలపైనా అనేది వేరే విషయం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తన ప్రజా సంకల్ప యాత్రలో కొంత సమయాన్ని ఇందుకు కేటాయిస్తున్నమాట నిజమే అయినా, అత్యధికంగా చంద్రబాబుపైనే ఆయన తన విమర్సనాస్త్రాలను సంధిస్తున్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన అవినీతి మాయం అని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క పాలక పక్షం కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడి లేదు. ఆఖరికి అధికారికంగా, ప్రజాధనంతో నిర్వహించే కార్యక్రమాల్లో సైతం ప్రతిపక్షాలపై, ముఖ్యంగా, వైసీపీ నాయకుడిపై పేరు పెట్టి విరుచుకుపడుతూ, ఆ పార్టీని అవినీతి కూపంగా వర్ణిస్తూ, ఆ విషయాన్ని ప్రజలకు నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, రానున్న ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది అని వారు ఉభయులూ బలంగా నమ్ముతున్న ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని సొంతం చేసుకునే దిశగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
అయితే, ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటుచేసే సభల్లో ప్రతిపక్షనేత వై ఎస్ జగన్ మోహన రెడ్డి చేసే ప్రసంగాలలో కొన్ని అతిశయోక్తులు, మాట జారడాలు వెలుగు చూస్తున్నాయి. జనాలను ఉత్తేజ పరిచే ప్రసంగాలలో ఇవి సహజం అని సర్ది చెప్పుకున్నా, ఏ పార్టీకి చెందని వారిని కొంత కలవర పరుస్తున్నాయి. పాలక పక్షం గతంలో ప్రతిపక్షంగా వున్నప్పుడు ఇదే విధంగా వ్యవహరించేది అనే విషయం గుర్తు చేసి తప్పించుకోవడం అంటే విలువలను పక్కన పెట్టడమే. అలాగే, విశ్వసనీయతకు తమ పార్టీ ప్రతిబింబం అని చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ మోహన రెడ్డి ఆకాశమే హద్దుగా ప్రతి రోజూ చేసుకుంటూ పోతున్న హామీల ప్రకటనలు గమనిస్తుంటే ఇవన్నీ సాధ్యమయ్యే వ్యవహారాలేనా అనే అనుమానం కలుగుతోంది. ఈ విషయంలో ఒక పర్యాయం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే, గత ఎన్నికల సమయంలో అలా హామీలు గుప్పించిన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడానికి ఎంతగా ఉడ్డుకుడుచుకున్నదీ తెలిసిన విషయమే. ఇస్తున్న ప్రతి హామీ అమలు ఎలా సాధ్యమో మరునాడే జగన్ ఒక ప్రకటన రూపంలో వెల్లడిస్తే విశ్వసనీయత మసక బారకుండా వుంటుంది.
రానున్నది ఎన్నికల కాలం. గత ఎన్నికల్లో చేతికి అందినట్టే అంది చేజారిన అదృష్టాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నించడంలో అబ్బురం ఏమీ లేదు. అలాగే కొన్ని ఊహించని పరిస్తితుల్లో దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి టీడీపీ శాయశక్తులా కృషి చేయడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఈ ప్రయత్నాలు, ఈ కృషి ప్రజాస్వామ్య బద్ధంగా జరిగితే జనం సంతోషిస్తారు.
ఎన్నికల కోయిల కూయక ముందే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతంగా ప్రారంభించాయి. నిజానికి నాలుగేళ్ల క్రితం కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరినప్పటించే ఇది మొదలయిందని చెప్పాలి. అప్పటినుంచీ, అక్కడ జరిగే అభివృద్ధి గురించి కంటే పాలక ప్రతిపక్షాల కుమ్ములాటలే మీడియాలో ప్రధానంగా చోటు చేసుకుంటూ రావడం ఓ విషాదం.
ఏదో ఒక పేరుతొ పాత పార్టీలు, కొత్తగా ఎన్నికల బరిలో దిగిన పాత పార్టీలు, ఇంకా పురుడు పోసుకోని సరికొత్త పార్టీలు లేదా వాటి నాయకులు ప్రజల మధ్యనే ఉంటున్నాయి. ఈ విషయంలో పాలక పక్షానిది వడ్డించిన విస్తరి. అన్నీ అమర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సదా సిద్ధంగా వుంటుంది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జగన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఒక నిర్ణయం తీసుకుని ఆ రాష్ట్రంలో తన పార్టీని రద్దుచేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఆ రోజుల్లో కొందరు ఆక్షేపించినా నిజానికి ఇది విజ్ఞతతో కూడిన నిర్ణయం.
అలాగే, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి నాలుగేళ్లయినా ఒక అవతరణ దినం నిర్ణయించడంలో జరుగుతున్న జాప్యం కూడా ఒక ఎత్తుగడే అనే విషయాన్ని కూడా గుర్తించాలి. విభజన కారణంగా ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఆగ్రహం, అసంతృప్తి జ్వాలలు చల్లారి పోకుండా చూడాలనే అనుభవం పుష్కలంగా ఉన్న ఏ రాజకీయ నాయకుడు అయినా ఆలోచిస్తాడు.
రాష్ట్ర విభజన అనేది ఇప్పుడిప్పుడే మానుతున్న గాయం. దానిని భావోద్వేగ అంశంగా మార్చి పబ్బం గడుపుకోవాలని చూడడం రాజకీయంగా పనికి రావచ్చేమో కాని భవిష్యత్తులో అది మానని, ఏ చికిత్సకు లొంగని వ్రణంగా మారే ప్రమాదం వుంది.
ప్రతిపక్షాన్ని నిలువరించడానికి పాలక పక్షం ఈ అంశాన్ని వాడుకోవాలని చూడడం విజ్ఞత అనిపించుకోదు. ఇది విశాల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విషయం. కానీ రాజకీయాల్లో ఇలాటి వాటిని పట్టించుకున్న దాఖలా లేదు. ఎవరి ప్రయోజనాలు వారివి. విజయం ముందు ఏ విలువలు అయినా దిగదుడుపే.
(EOM)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595