20, మే 2016, శుక్రవారం

వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తా
(ఒక విన్నపం: 2012 లోరాసిన వ్యాసం చదవడానికి  ముందు కొంత సమయం కేటాయించి కింది ఫోటోలు చూడండి, దీన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ  పోస్ట్ చేసిన సందర్భం ఏమిటో చెప్పాల్సిన పనిలేదు)

కోల్ కటా అని ఇప్పుడు పేరు మార్చుకున్న కలకత్తా నగరంలో వున్న అనేక వేల వీధుల్లో ఇది ఒకటి. దాని పేరు హరీష్ చంద్ర స్ట్రీట్.
కాశీ యాత్రకు వెడుతూ మార్గ మధ్యంలో కలకత్తాలో ఆగినప్పుడు పనికట్టుకుని చూసివచ్చిన వీధి ఇదొక్కటే.



ఓపెన్ డ్రైనేజీ. మురుగుకాలువ. వీధిలోనే స్నానాలు.  ఇంటి ఆకారం కూడా లేని టార్పాలిన్ తడికెల నడుమ కాపురాలు. వీధి కుక్కల స్వైర విహారాలు. చూడగానే వికారం కలిగించే చిరుతిండ్ల అంగళ్ళు.










కలకత్తాలోనే కాదు దేశంలో బస్తీలో చూసినా ఇలాటి వీధులు అనేకానేకం కానవస్తాయి. అటువంటప్పుడు వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ అని సన్నాయి నొక్కులెందుకు అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
అదే. అది చెప్పడానికే ఉపోద్ఘాతం.
పై ఫోటోలను కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఒకదానిలో బెంగుళూరు పెంకులు  కప్పిన ఒక సాదా సీదా ఇల్లు కనిపిస్తుంది. (నా వెంట యాత్రకు వచ్చిన  వేమూరి విశ్వనాధ శాస్త్రి గారు చేతి సైగతో చూపిస్తున్న ఇల్లు)


ఇంట్లో వుండే వ్యక్తి మాత్రం అంత సాదా సీదా సాధారణ మనిషి కాదు. కొన్ని దశాబ్దాలపాటు అవిచ్చిన్నంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పాలించిన మార్క్సిష్టులకు, లెఫ్ట్ పార్టీలకు అధికార పీఠాన్ని  దూరం చేసిన అత్యంత సాదా సీదా రాజకీయ నాయకురాలు, తృణమూల్ అధినేత్రి  ‘దీదీమమతా బెనర్జీ - ముఖ్యమంత్రి హోదాలో నివసిస్తున్నది ఇంట్లోనే అంటే పట్టాన నమ్మడం కష్టం. కానీ కళ్ళతో చూసిన దాన్ని నమ్మక తప్పదు కదా.
మమతా దీదీ నివసిస్తున్న ఇల్లూ, ఇల్లు వున్న వీధినీ చూస్తుంటే ఇలాటి రాజకీయ నాయకులు కూడా వుంటారా అనిపించడం అంతే సహజం.  కానీ ఒక ముఖ్యమంత్రి వుండే వీధే అలా వుంటే ఇక మిగిలిన వాటి సంగతేమిటిదీనికి జవాబు కూడా అంతగా  అర్ధం కాని హింగ్లీ  (హిందీ-బెంగాలీ) భాషలో వీధిలో వుండే వ్యక్తి నుంచే లభించింది. కోల్ కటా లోని అన్ని వీధులు బాగుపడ్డ తరువాతే తన వీధిని బాగు చేసే పనికి పూనుకోవాలని దీదీ హుకుం జారీ చేసారట. ఇందులోని నిజానిజాలు వీధికి ఎదురుగా వుండే మరో వీధిలో కొలువున్న మరో దేవత కలకత్తా కాళీనే చెప్పాలి.
దీదీ సాదా సీదా వ్యవహార శైలి తెలిసిన వాళ్లకు వీధి వ్యవహారం  అంత ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కాకపొతే,
పోలీసు పటాలాలు, స్టెన్ గన్లు ధరించి పహరా కాసే  అంగరక్షకులు, అడుగడుగు బారికేడ్లు ఇవన్నీ ఏమీ లేకుండా ఒక ముఖ్యమంత్రి అంత సాధారణ జీవితం గడుపుతున్న తీరుతెన్నులు గమనిస్తే రాజకీయ ప్రముఖుల రక్షణ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం అంత అవసరమా అన్న సందేహం తలెత్తక మానదు. (19-03-2012)                


ఆకాశంలో యుద్ధం

    
దిగ్దంతాలకు ఆవల ఎక్కడో
పరలోక వాసులు పోరు సాగిస్తున్న సంకేతాలు
అనంతాకాశంలో    
జవనాశ్వాల గిట్టల రాపిడితో
నల్లటి మబ్బుల్ని చీలుస్తూ
వెలుగులు చిమ్ముతున్న మెరుపు తీగెలు        
కనపడని  కొండలు కదిలిపోతున్నట్టు
గజదళం చేస్తున్న ఘీంకారాలతో
ప్రళయ ధ్వనులను తలపిస్తున్న  ఉరుములు
చెవులు చిల్లులు పడేలా పడుతున్న
పిడుగుల నడుమ సన్నగా వినిపిస్తున్న
‘అర్జున, ఫల్గుణ, పార్ధివ’ ఘోషలు 
రణక్షేత్రంలో  వైరిమూకలు    
విసురుకుంటున్న అక్షయ తూణీరాల వాన చినుకులు  
అరచేతుల్తో అడ్డుపట్టి  విదిలిస్తున్న
అదృశ్యసమీరాలు
ఓ దిక్కు నుంచి మరో దిక్కుకు మరలుతున్న
వర్షపు జల్లుల వయ్యారాలు
ఇంతా చేసి
ఓ అరఘడియే సాగింది ఈ ప్రకృతి  పారవశ్య నృత్యం!  
ఉరిమే మబ్బుల చాటున
జరిగినదంతా మౌనంగా చూసిన  సూర్యుడు
ముసిముసి నగవులతో
పశ్చిమాద్రిన మళ్ళీ  ప్రత్యక్షం!



(COURTESY IMAGE OWNER)

గెలుపు మొదటిదీ కాదు, ఓటమి చివరిదీ కాదు


సూటిగా....సుతిమెత్తగా......

గతవారం జాతి జనుల దృష్టిని ఆకట్టుకున్న అంశాలు, అయిదు రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికలు,  కొసరుగా  పాలేరు ఉపఎన్నిక. వాటి ఫలితాలు.
వివిధ రాష్ట్రాల్లో  విభిన్న తేదీల్లో ఎన్నికలు  జరిగిన కారణంగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వీటి ఫలితాలు వెలువడ్డాయి.
వీటిల్లో  చిత్రమైనది పాలేరు ఉపఎన్నిక.
పాలేరు ఎన్నికల్లో  గెలిచిన పార్టీకి ఓడిపోతామన్న భయం ఏ దశలోనూ లేదు, ఓడిన వాళ్లకు గెలుస్తామన్న నమ్మకం ఏ  కోశానా లేదు. అయినా సరే ప్రచారం కానీ, దాని సంరంభం కానీ తక్కువ స్థాయిలో  జరగలేదు. గెలుస్తామని విశ్వాసం  వున్న అధికార పార్టీ టీ.ఆర్.ఎస్. ఎలాంటి చిన్న లొసుగుకు కూడా అవకాశం ఇవ్వకుండా  సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. గెలిచే నమ్మకం ఆవగింజంత లేకపోయినా విపక్షాలు కూడా గెలిచి తీరాలి అనే విశ్వాసంతో ఎదురు పోరాడాయి. అందుకే పాలేరు ఉపఎన్నికలో  అంతటి భారీ  స్థాయిలో ప్రచారం జరిగింది. చివరికి అందరూ అనుకున్నట్టుగానే విజయలక్ష్మి టీ.ఆర్.ఎస్. నే వరించింది. ఆ పార్టీ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు బ్రహ్మాండమయిన మెజారిటీతో గెలుపొందారు. మెజారిటీ యెంత అనేదానిపైనే తప్ప అక్కడ ఎవరికీ ఫలితం పట్ల ఆసక్తి లేకపోవడం ఒక విశేషం.
ఉప ఎన్నిక అని కూడా చూడకుండా, అధికార పార్టీ, మంత్రుల్నీ, శాసన సభ్యులనూ ఊరూరా మోహరించిందని,   తన చేతుల్లో వున్న సమస్త అధికారాలను, ధన వనరులను విచ్చల విడిగా దుర్వినియోగం చేసి గెలిచిందని విపక్షాలు ఆరోపించాయి. అది సహజం కూడా.
పొతే, అధికార దుర్వినియోగం అనే మాటే ఈ రోజుల్లో కాస్త వింతగా  వినబడుతోంది. సద్వినియోగానికి అధికారాన్ని వాడుకుంటున్న రాజకీయ పార్టీలు ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళు గతంలో అధికారంలో వున్నప్పుడు ఇదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా  మంత్రులను గెలుపు బాధ్యత అప్పగించాయి.
అలా అని అధికార దుర్వినియోగాన్ని సమర్ధించడం ఈ రచయిత ఉద్దేశ్యం కాదు. కాకపొతే అలా ఆరోపించే  నైతిక హక్కును రాజకీయ పార్టీలే పోగొట్టుకుంటున్నాయి. ఈ నైతిక హక్కు అనేది కూడా ప్రస్తుత కాలంలో ఒక  పనికిమాలిన ఊతపదంగా  మారిపోయింది. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్నే అన్ని పార్టీలు పాటిస్తూ వస్తున్నాయి. ఇక ఎవరిని యేమని ఏమి లాభం?
అయితే, ఒకే ఒక్క ఉప ఎన్నికలో విజయం కోసం ఇంతటి స్థాయిలో నింద మోయడం ఆ పార్టీకి  అవసరమా అనే ప్రశ్న మిగిలే వుంటుంది. నిష్టూరమైన నిజం, ఏం చేస్తాం!
ప్రచారం సందర్భంగా తమపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు అన్నింటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు.  హైదరాబాదులోని  పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయోత్సవాలకు హాజరయిన ముఖ్యమంత్రి విలేకరులతో ముచ్చటించారు. ఆరోపణలకు  జవాబు చెప్పడమే కాదు ఒక హెచ్చరిక కూడా చేసారు. నిరాధారమైన ఆరోపణలు చేసే వారిపై కేసులు పెట్టి కఠిన శిక్షలు పడేలా చూస్తామని గట్టిగా హెచ్చరించారు. ఎన్నికల సంఘం  సమర్దులయిన అధికారులని కితాబు ఇచ్చిన ఖమ్మం జిల్లా అధికారులపై ఎన్నికల సందర్భంగా  విపక్షాలు చేసిన ఆరోపణలను,ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్  భగీరధ వంటి పధకాల గురించి మాట్లాడుతున్న తీరును  కేసీఆర్ తప్పుపట్టారు. పాలేరు ఉప ఎన్నిక ఫలితం తమ రెండేళ్ళ పాలనకు ప్రజలు తెలిపిన ఆమోదంగా ఆయన అభివర్ణించారు. టీ.ఆర్.ఎస్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ పెద్ద మెజారిటీలతో గెలుస్తూ రావడమే ప్రతిపక్షాల ఆరోపణలకు ఎలాంటి ప్రాతిపదిక లేదనడానికి నిదర్శనమన్నారు.
పనిలో పనిగా కేసీఆర్ తన పార్టీ శ్రేణులకు కూడా హితవు పలికారు. సాధించిన విజయాలతో పొగరుగా  వ్యవహరించరాదనీ, విజయ గర్వంతో అధిక ప్రసంగాలు చేయవద్దనీ, ప్రజలు అందించిన విజయాన్ని గౌరవంగా స్వీకరించి మరింత బాగా  పని చేయాలని ఆయన సలహా ఇచ్చారు.      
పాలేరులో ఘన విజయం  సాధించిన తుమ్మలపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను మరో అందుకు కూడా  అభినందించవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి  పరాజయం పాలయిన నాగేశ్వరరావు, ఆ తరువాత టీ.ఆర్.ఎస్.  లో చేరి, ఎమ్మెల్సీ అయి మంత్రి కూడా అయ్యారు. దొడ్డి దోవన మంత్రి అయ్యారనే నింద ఆయనపై  ప్రతికక్షులు మోపారు. బహుశా ఆ మచ్చ మాపుకోవడం కోసం అన్నట్టుగా ఆయన ఉప ఎన్నిక బరిలో దిగి, నేరుగా ప్రజల  ఆమోదంతో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  ఒకరకంగా ఇది మంచి సాంప్రదాయం. ఇందుకు తుమ్మలను అభినందించాలి.  
ఎన్నికల్లో పొత్తులు కొన్ని సందర్భాలలో కలిసి వస్తాయి. మరి కొన్ని సార్లు వికటిస్తాయి. 2014 లో జరిగిన  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు మొదటి దానికి ఉదాహరణ. పాలేరు ఉపఎన్నికలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడం రెండో దానికి రుజువు.
భారత దేశానికి ఉత్తరాన  ఒక కొసన వున్న ఈశాన్య రాష్ట్రం ‘అసోం’ తో మొదలు పెట్టి, తూర్పున వున్న పశ్చిమ బెంగాల్, దక్షిణాదిన వున్న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అయిదు రాష్ట్రాల్లోని ఓటర్లు ఇచ్చిన తీర్పులు,  ప్రజల నాడిని పట్టుకోవడానికి, వారి ‘మూడ్’ గ్రహించడానికి ఒక మేరకు ఉపకరిస్తాయి.
ఈ అయిదింటిలో భారతీయ జనతా  పార్టీ ఎక్కడా అధికారంలో లేదు. అంచేత ఒక్కటి గెలిచినా ఆ పార్టీకి బోనసే అవుతుంది. అసోం లో ఆ పార్టీ సాధించిన విజయానికి బీజేపీ అధినాయకత్వం సంబర పడడానికి అదే కారణం. అదొక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించడంలో కొంత అతిశయోక్తి  ఉన్నప్పటికీ, బీహారు, ఢిల్లీ ఎన్నికల పరాజయ నేపధ్యం నుంచి అసోం విజయాన్ని గమనిస్తే, అది ఆ పార్టీకి  మంచి ఊరట కలిగించే పరిణామమే అనాలి. మూడు పర్యాయాలుగా అంటే పదిహేనేళ్ళుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు మొహం మొత్తడం కూడా సహజమే. అయితే ఆ ఒక్క కారణమే బీజేపీ గెలుపుకు కారణం అని చెప్పలేము, ముస్లిం ఓటర్లు గణనీయంగా  వున్న ఆ ఈశాన్య రాష్ట్రంలో పొత్తుల విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందు చూపుతో అనుసరించిన వ్యూహం కూడా ఆ పార్టీ  విజయానికి కారణం అయింది. పొత్తులు కలిసివచ్చిన అదృష్టం బీజేపీని వరించింది. గత లోక సభ ఎన్నికల్లో అసోంలో సంఖ్యాబలం పెంచుకోగలిగిన బీజేపీకి బాగా సంతోషపడగల మరో విజయం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లభించింది.
“గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో (బహుశా అసోంలో సాధించిన విజయోత్సాహం కావచ్చు), ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రధాని మోడీ చెప్పినట్టు మీడియాలో వచ్చింది.
సంతోషం. ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది.  కోడలు కంటానంటే కనొద్దనే  అత్తగారుంటుందా!
అయితే, రెండేళ్ళ క్రితం, మోడీ నాయకత్వం పట్ల అచంచల విశ్వాసంతో ఓటేసి ఆయనకు అపూర్వ విజయం సమకూర్చి పెట్టిన ప్రజలు ఇతర రాష్ట్రాల్లో కూడా వున్నారు. వాళ్ళు కూడా ఈ మాటలు వింటున్నారని మోడీ మహాశయులు గుర్తు పెట్టుకోవాలి.         

మరో అపూర్వ విజయం పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఇక్కడ పొత్తులు కొన్ని పార్టీల కొంప ముంచాయి. కాంగ్రెస్, కమ్యూనిష్టులు జత కట్టడం జనాలకు నచ్చినట్టు లేదు. కాకపోతే  స్వతంత్రం వచ్చిన తొలి ఏళ్ళలో బెంగాల్ ని గుప్పెట్లో పెట్టుకుని, ఆ తరువాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో నామ మాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్, తన స్థానాలను ఈ పొత్తులతో  మెరుగు పరుచుకుంటే, కాంగ్రెస్ ఓట్లు సరిగా బదిలీ కాక కమ్యూనిష్టు పార్టీలు చతికిలపడ్డాయి. మూడు దశాబ్దాలకు పైగా అప్రతిహతంగా  బెంగాల్ ని పాలించిన వామపక్షాలు, వ్యూహ రచనలో విఫలమై మూడో స్థానానికి దిగజారాయి. పొత్తులు అచ్చిరాని పార్టీల జాబితాలో చేరిపోయారు.
సర్వజనులు, సర్వే జనులు పసికట్టలేని ఫలితం తమిళనాట వెలువడింది.               
అప్పటికి ఇంకా అసలు ఫలితాలు రానే రాలేదు. తమిళనాడులో జయలలిత పార్టీ పరాజయం పాలవుతుందని వచ్చిన సర్వేల సమాచారాలపైనే టీవీల్లో చర్చోపచర్చలు పుంఖానుపుంఖాలుగా   మొదలయ్యాయి. ఒకనాటి  సాయంత్రం ఒక టీవీ ఛానల్ ఎడిటర్స్ టైం కార్యక్రమంలో చెన్నై నుంచి ఓ తెలుగు మహిళ మాట్లాడుతూ, ‘అమ్మ (జయలలిత) ఓడిపోయే ప్రసక్తే లేద’ని కుండ బద్దలు కొట్టి చెప్పారు. జయలలిత పట్ల ఆమెకు వున్న ప్రత్యేకాభిమానం ఆమె చేత అలా మాట్లాడిస్తున్నదేమో అనుకున్నారు కానీ చివరికి ఆవిడ చెప్పిందే నిజమయింది. అనేక ఏళ్ళకు పూర్వం ఆమె  సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న రోజుల్లో హీరో జోడీగా వెలిగి, తదుపరి ఆమెకు రాజకీయ అరంగేట్రం చేయించిన  ఎంజీఆర్, మూడు దశాబ్దాల క్రితం నెలకొల్పిన విజయ భేరీ  రికార్డును ఇప్పుడు  జయలలిత  తిరగరాసింది. తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీసింది. అయితే, ప్రచార పర్వంలో ఆకాశమే హద్దుగా ఆమె ప్రకటించుకుంటూ పోయిన వరాల భారం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అలవి కాని భారం అయ్యే ప్రమాదం పొంచి వుంది. అంతే కాదు, బలమైన సంఖ్యాబలంతో ప్రతిపక్ష డీఎంకే కొలువు తీరడం కూడా జయకు రానున్న అయిదేళ్ళ కాలం కత్తిమీద సామే. ఎందుకంటే గతంలో ఈ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా ఓడిపోయిన వారికి దక్కిన స్థానాలు నామమాత్రమే.
కెప్టెన్ సీఎం అంటూ స్వయం ప్రకటిత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని  అపారమైన సంఖ్యలో సినిమా అభిమానులను కలిగిన  సినీ హీరో విజయకాంత్ కనీసం ఎమ్మెల్యేగా గెలుపుకు కూడా నోచుకోలేదు.  ఆయన పార్టీ  ఈ ఎన్నికల్లో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. కొన్ని పార్టీలు, ఇతరులను ఓడించడానికో, గెలిపించడానికో తప్ప స్వయంగా గెలవడానికి పనికిరావన్న నానుడికి నిదర్శనంగా  ఆ  పార్టీ మిగిలిపోయింది.
కేరళలో కమ్యూనిష్టు కూటమి విజయానికి మార్గం సుగమం చేసిన కీర్తి ఆ రాష్ట్రాన్ని గత అయిదేళ్లుగా పాలిస్తూ వచ్చిన కాంగ్రెస్ కూటమికి దక్కుతుంది. ఆ కాలంలో వెల్లువెత్తిన స్కాములు, అధికార దుర్వినియోగాలు, సహజంగా రాజకీయ చైతన్యం కలిగిన కేరళీయులను మార్పు దిశగా అడుగులు వేయించింది.
2014 నుంచి మొదలయిన మోడీ వెలుగుల్లో మసకబారుతూవస్తున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ ప్రాభవం ఈ ఎన్నికల్లో మరింత  దిగజారింది. అసోం చేజారింది. కేరళ చేయి ఒదిలేసింది. తమిళనాడులో కాంగ్రెస్ కు నిలువ నీడే లేకుండా పోయింది. కమ్యూనిష్టుల పుణ్యమా అని, వాళ్ళు ఓడిపోయినా  పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్  పార్టీకి కాస్తంత ఊపిరి చిక్కింది.  పొతే,  చిరు రాష్ట్రం పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ పతాకపు మువ్వన్నెల ధగధగలు మెరిశాయి. అయితే ఈ మెరుపుల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న డీ.ఎం.కే.కి  కొద్ది  వాటా వుంది. అంచేత అక్కడ దక్కేది సంపూర్ణ అధికారం కాదు, సంకీర్ణమే.       
గెలుపోటములు దైవాధీనాలు అంటారు. కానీ, ఎన్నికల్లో ఓటమికి స్వయంకృతాపరాధాలే ప్రధాన కారణం. విజయాలకు తామే కారణం అని గొప్పలు చెప్పుకోవచ్చు కానీ అది పూర్తి వాస్తవం కాదు. ఎదుటి వారి వైఫల్యాలు, తప్పిదాలు కూడా విజయ సోపానాలు ఎక్కడానికి ఉపకరిస్తాయి. కానీ ఏ పార్టీ ఈ నిజాన్ని ఒప్పుకోదు.
 ఉదాహరణకు ఒక పార్టీ ఒక రాష్ట్రంలో గెలుపొందింది. మరో రాష్ట్రంలో పరాజయం పాలయింది. ఆ  పార్టీ నాయకుడు ఒకాయన ఇలా అంటున్నాడు మీడియాతో.
‘మాకు ప్రజలు బ్రహ్మ రధం పట్టారు. మా విధానాలు నచ్చి, మెచ్చి ఆ రాష్ట్రంలో  మాకు పట్టం కట్టారు’
‘అధికార పార్టీ అనుసరించిన అరాచక విధానాలు, అధికార దుర్వినియోగాలు అక్కడ మా ఓటమికి కారణం’
రాజకీయ పార్టీలకి ఇవి సహజంగా అనిపించవచ్చు కానీ, రాజకీయాలను దగ్గరగా గమనించేవారికి అసహజంగా అనిపిస్తాయి. ఈ ద్వంద్వ  ప్రమాణాలతో  ఇలా ఇంకెన్నాళ్ళు  ప్రజలని మభ్య పెడతారో అర్ధం కాదు.
గెలుపోటములను హుందాగా స్వీకరించే తత్వం అలవరచుకోవాలి. రాజ్యాలను తమ జీవిత పర్యంతం పాలించే రాజుల కాలంలో మనం  జీవించడం లేదు. మనం వున్నది  ప్రతి అయిదేళ్లకూ ఎన్నికలు జరిగే ప్రజాస్వామ్య వ్యవస్థలో.  ఈ  విషయం మరిచిపోతుండడం వల్లనే ఈ రాజకీయులతో ఇన్ని అవస్థలు.   
గెలిచి వచ్చిన ప్రతి పార్టీ ప్రజలకు మేలు చేస్తూ పోతుంటే వాళ్ళే  వాటిని ప్రతి అయిదేళ్లకు తిరిగి ఎన్నుకుంటారు. అంతేకాని అధికారంలో పాతుకుపోవడానికి అడ్డ దారులు తొక్కే అవసరంలేదు.
దురదృష్టం ఏమిటంటే రాజకీయ పార్టీలు మరోలా ఆలోచిస్తున్నాయి. పదవి  శాశ్వతం అనే భ్రమల్లో మునిగితేలుతున్నాయి. అంతే అయితే పరవాలేదు పదవిని శాశ్వతం చేసుకోవాలనే కాంక్షతో ప్రజలని భ్రమల్లో ముంచి తేల్చే పనిలో పడ్డాయి. తాము పనిమంతులం  గొప్పలు  చెప్పుకోవడానికి అవతలివాళ్ళు పనికిమాలిన వెధవలు  అని నిర్ధారించే కార్యక్రమంలో మునిగి తేలుతున్నాయి.   
అందుకే ముందే చెప్పింది.
గెలుపు మొదటిదీ కాదు, ఓటమి చివరిదీ కాదు .
ఎవరెస్టు ఎక్కిన వాడు అక్కడే వుండిపోడు, పాతాళంలో పడ్డవాడు అక్కడే ఆగిపోడు. ఇది తెలుసుకుంటే ఓటమి వల్ల నైరాశ్యం కలగదు. విజయం వల్ల గర్వం ప్రబలదు.
ఉపశృతి:
ఇది జరిగి చాలాయేళ్ళు అవుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  పనిచేసిన మోహన్ కందా గారు పదవీ విరమణ చేస్తుంటే, రేడియోలో నా సీనియర్ సహచరుడు ఆర్వీవీ కృష్ణారావుతో కలిసి ఆయన్ని చూడడానికి వెళ్లాను.  
అప్పుడు ఆయనో మాట చెప్పారు.
“పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు.  ఈ సత్యం తెలిసి కూడా  ప్రతి ఒక్కరూ జీవితం  శాశ్వతం అనే అనుకుంటూ వుంటారు. అలాగే, ప్రతి ఉద్యోగికీ ఏదో  ఒకరోజు రిటైర్మెంట్ తప్పదు. కానీ, రిటైర్ అయ్యే రోజు కూడా ఇంకా పదవిలో వుంటాననే భ్రమలో ఉంటాడు.”’
మోహన్ కందా గారు ఈ  విషయం ఒక పత్రికలో కూడా రాసినట్టు జ్ఞాపకం.
అయినా నా చాదస్తం కానీ, ఈ మెట్టవేదాంతం  వేదాంతులకే ఎక్కదు, రాజకీయులకేం పడుతుంది.
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595  
   


18, మే 2016, బుధవారం

అయినను పోయిరావలయు హస్తినకు ......


సూటిగా...సుతిమెత్తగా......భండారు శ్రీనివాసరావు

ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఒక మంచి సాంప్రదాయానికి తెర తీశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను విడివిడిగా ఢిల్లీ పిలిపించుకుని ఆయా రాష్ట్రాలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు. తెలంగాణా కొత్త రాష్ట్రం ఎదుర్కుంటున్న కొన్ని సమస్యలపై కేంద్రం స్పందన గురించి ఆ వెనువెంటనే ప్రధాని మోడీ  ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు.
పొతే, చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటన వల్ల వాయిదా పడ్డ ప్రధానితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం మొన్న మంగళవారం హస్తినలో జరిగింది. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా హాజరయిన ప్రధానితో భేటీ సుదీర్ఘంగా సాగింది. చంద్రబాబు నాయుడు తనదయిన పద్ధతిలో పవర్ పాయింటు ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. దానితో పాటే రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్కెల జాబితాతో కూడిన వినతి పత్రం కూడా ప్రధానికి అందచేశారు. సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీతో విడిగా చర్చలు జరిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం గురించి నొక్కి చెప్పారు. ముందు కొద్దిసేపు అనుకున్న ఈ ముఖాముఖి భేటీ దాదాపు ఇరవై నిమిషాలు సాగిందని సమాచారం. అనేక విషయాల్లో తన అంతరంగ ఆవిష్కరణకు ముఖ్యమంత్రి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉంటారనడంలో  సందేహం లేదు.
ప్రధానితో తాను  జరిపిన సమావేశం వివరాలను గురించి ఆ తరువాత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలియచేశారు.  సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, ప్రత్యేక హోదా విషయంలో ఆందోళన చెందవద్దని,  ఆ అంశంలో ముడివడివున్న సున్నితత్వం తనకు తెలుసని ప్రధాని  తనతో చెప్పారని చంద్రబాబు తెలియచేసారు. అంతేకాని, కేసీఆర్ విషయంలో జరిగినట్టు  ప్రధాని పనుపున కానీ, ఆయన   ట్విట్టర్ ఖాతా  ద్వారా కానీ ఎటువంటి వివరణ వెలువడినట్టు సమాచారం లేదు.
విలేకరుల సమావేశంలో చంద్రబాబునాయుడు నాయుడు మాట్లాడిన తీరు, ఆయన హావభావాల్లో తొంగిచూసిన రవంత అసహనం, ఆందోళన గమనిస్తే, ప్రత్యే క హోదా విషయంలో ప్రధాని మోడీ నుంచి స్పష్టమైన హామీ లభించిన దాఖలా కానరాలేదు.
ముఖ్యమంత్రి మాటలను బట్టి,  సమావేశం జరిగిన తీరు కొంత అర్ధం చేసుకోవచ్చు. కొన్ని సున్నిత అంశాల విషయంలో  ఆయన బిగబట్టుకుని మాట్లాడుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కానవచ్చాయి.
ఒక ముఖ్యమంత్రిగా తాను ఢిల్లీలో అడుక్కోవాల్సిన పరిస్తితి దాపురించినదని ఆయన అనడం ఆయనలో  కొన్నాళ్ళుగా రగులుతున్న ఆవేదనకు అద్దం పట్టింది. కాకపోతే ఈ పరిస్తితికి కారణం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నెపం ఆ పార్టీపై మోపారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన నేతగా నేటి పరిస్తితి ఆయనకు నిజంగా వేదన  కలిగించే విషయమే.
ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాలి. చంద్రబాబునాయుడు  ఈనాడు అప్పాయింట్ మెంట్ తీసుకుని ఢిల్లీలో  కలుస్తున్న నాయకుల్లో అనేకమంది, గతంలో  ఆయన్ని కలుసుకోవడం కోసం, ఒక్క క్షణం పాటయినా ఆయన దృష్టిలో పడడం కోసం  ఢిల్లీ ఏపీ భవన్  ఆవరణలోని చెట్లకింద నిరీక్షించడం తెలిసిన వారికి ఈసంగతి బాగా అర్ధం అవుతుంది. నాటి స్తితిని నేటితో పోల్చి చూసుకున్నప్పుడు ఆయనలో అసహనం కట్టలు తెంచుకోవాలి. కానీ,  పరిణతి చెందిన రాజకీయ చాతుర్యం బహుశా ఆయన్ని ఇంత నిగ్రహంగా వ్యవహరించేలా చేస్తోందని అనుకోవాలి.

హోదా విషయంలో  అన్ని పార్టీలు స్పందించాలని చంద్రబాబు కోరారు. ఇది ఒక్క బీజేపీ బాధ్యత మాత్రమె కాదని అంటూ,  నాడు విభజన సమయంలో అన్ని పార్టీలు వున్న విషయాన్నీ ఆయన గుర్తు చేసారు.
ఇవన్నీ ఆయన గతంలో అనేక పర్యాయాలు చెప్పిన విషయాలే.
కానీ, ఇలా ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు ఇలా వివరణలు, సంజాయిషీలు ఇస్తూ పోవాలి?
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి వచ్చిన తరువాత ఇంతకంటే తీయని కబురు ఏదో చెబుతారని ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా పట్ల ఆశలు పెట్టుకున్న వాళ్ళు  నిరాశపడ్డారు. అయితే, ఈ  విషయంలో  గత కొంత కాలంగా రాష్ట్ర స్థాయి బీజేపీ, టీడీపీ  నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు  గమనిస్తున్న వారికి మాత్రం  ఇది ముడిపడే విషయం కాదని అర్ధం అవుతూనే వుంది.
ప్రత్యేక హోదాతో పాటు  ప్రత్యేక ప్యాకేజీ కూడా కేంద్రం ఇవ్వాలనే డిమాండు ఆంధ్రప్రదేశ్ నాయకుల నుంచి పెరుగుతోంది. చివరికి ఇది ప్యాకేజీకి పరిమితం అయినా ఆశ్చర్యపోనక్కర లేదు.  ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పకపోయినా ఈ విషయంలో అస్పష్టతతో కూడిన కొంత స్పష్టత ఇచ్చారనుకోవాలి.
అర్ధరాజ్యం కాకపోయినా అయిదూళ్ళయినా  పాండవులకు ఇవ్వాల్సిందని దూతగా హస్తిన వెళ్ళిన  శ్రీకృష్ణుడు కౌరవరాజు దృతరాష్ట్రుడుని కోరతాడు. సుయోధనుడు అందుకు కూడా సమ్మతించకపోవడంతో చివరకు సమరమే శరణ్యమవుతుంది.
అభినవ భారతంలో కూడా ఇదే జరుగుతుందా? బీజేపీ, టీడీపీ ల నడుమ దోస్తీ బీటలు వారుతుందా?  
గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న వారికి ఒక విషయంలో స్పష్టత వుంది. రాజకీయ పార్టీల నడుమ సఖ్యత కానీ, దోస్తీ కానీ, పొత్తు కానీ, దాన్ని ఏ పేరుతొ పిలుచుకున్నా అది తాత్కాలికమే. ఎందుకంటే, ఇటీవలి కాలంలో ఇటువంటి పొత్తులకు సిద్దాంతాలు, సూత్రాలు కాకుండా రాజకీయ అవసరాలు ప్రాతిపదిక అవుతున్నాయి. నిబద్ధత లోపించినప్పుడు స్నేహాలు చిరకాలం నిలబడడం కష్టం.
టీడీపీ, బీజేపీ స్నేహం ఎన్నాళ్ళు సాగుతుంది అనేది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. అది వారి సమస్యాకాదు. కాకపోతే  ప్రత్యేక హోదా అనే విషయంలో వారికి ఆసక్తి వుంది. ప్రత్యేక హోదా సంజీవని కాదని కూడా ప్రజల్లో అధిక సంఖ్యాకులకు అర్ధం అయిపోయింది. అయితే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని రాజకీయ పార్టీలు తమని ఈ విషయంలో వంచిస్తున్నాయేమో అనే భావన ప్రబలినప్పుడే అసలు కష్టాలు మొదలవుతాయి.  ఈ కష్టాలు ముందు మెడకు చుట్టుకునేది కూడా ఆ రాజకీయ పార్టీలకే. ఎందుకంటే, ప్రత్యేక హోదా అనేది కొత్త రాష్ట్రానికి యెంత అవసరమో సాకల్యంగా వారికి  వివరించి చెప్పింది అవే కాబట్టి. ఆ అంశం ముదిరి పాకానపడి భావోద్వేగ స్వరూపాన్ని సంతరించుకున్నప్పుడు అసలు కధ మొదలవుతుంది.  అప్పుడు ప్రజలకు నచ్చచెప్పడం పార్టీలకే కాదు, బ్రహ్మకు కూడా తరం కాదు.
పాండవోద్యోగ విజయాల్లో శ్రీకృష్ణుడు చేసిన హితబోధ ఇదే.
‘క్రమక్రమముగా కొలువు కూటము రణకూటమగుచున్నది, పదుగురున్నప్పుడే కురురాజా నా మాటలు ఆలకింపుడు’ అంటూ, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ అయిదు పద్యాల్లో ముందస్తుగానే తెలియ చేస్తాడు సమస్తం ఎరిగిన కృష్ణ పరమాత్మ. 

అందుకే సుతిమెత్తగా చెబుతున్న ఈ సూటి మాట.
ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పటికే జనంలో బాగా పాకిపోయింది. అది సంజీవనా, కాదా!  మంత్రం దండమా కాదా! సర్వరోగ నివారిణా కాదా  అనే మీమాంసతో నిమిత్తం లేని దశకు వారు చేరుకుంటున్నారు. ఈ అగ్గికి ఆద్యం పోసేవాళ్ళు ఎట్లాగు సిద్ధంగా వుంటారు. అలా అని వారిని తప్పుపట్టడం సరికాదు. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి.
ఈ పరిస్థితికి మీరంటే మీరు కారణం అంటూ ఒకరినొకరు దెప్పుకుంటుంటే  ప్రజలు నమ్ముతారని అనుకోవడం వుట్టి భ్రమ. కాకపోతే, ఆయా పార్టీల వీరాభిమానులు తమ పార్టీల వాదనకు అనుగుణంగా చెలరేగిపోతుండవచ్చు. అదంతా ప్రజాభిప్రాయం అనుకుంటే ఎవరిని వారు మోసం చేసుకోవడమే అవుతుంది.
కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ప్రతి పార్టీ విడివిడిగా కోరుతూనే వుంది. కానీ ఒక్క తాటిపై నడవాలని కానీ, ఒక్క మాటపై నిలబడాలని కానీ ఏ ఒక్క పార్టీ కోరుకోవడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో కూడా  సీమాంధ్ర ప్రాంతం రాజకీయ నాయకులు ఇదే తప్పిదం చేశారు. మళ్ళీ అదే పునరావృతం అవుతుంటే పార్టీలతో నిమిత్తం లేనివారికి బాధగా ఉంటోంది.
రాజకీయ లబ్ది అనే కోణం ఒదిలిపెట్టి ఇప్పుడు జరగాల్సింది ఒక్కటే. ప్రజలకు వున్నది వున్నట్టు చెప్పడం. నిజాయితీతో చెప్పే చేదు నిజాలను సయితం స్వీకరించే సాధుగుణం ఇంకా జనంలో సజీవంగానే  వుంది.  కానీ, ప్రతిదీ రాజకీయకోణం నుంచి చూడడం మానేసి కనీసం ఒక్కసారయినా రాజకీయ నాయకులు నిబద్ధతతో ప్రజలముందుకు రావాలి.
పరిష్కార మార్గాలు మూడే మూడు.
ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా తనంత తానుగానే ఆ ప్రకటన చేయడం.
ప్రత్యేక హోదాకు ఏవయినా సహేతుకమైన కారణాలు అడ్డు పడుతుంటే వాటిని కేంద్రంలోని బీజేపీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వయంగా  వివరించి, పరిహారంగా భారీ సాయాన్ని ప్రకటించి, నిధులను వెంటనే విడుదల చేయడం.
ఇవేవీ కుదరవు అనుకుంటే, టీడీపీ, బీజేపీ నాయకులు లేనిపోని  మాటలతో, వాగ్వాదాలతో  పొద్దుపుచ్చే వైఖరికి స్వస్తి చెప్పి రాజకీయ రణక్షేత్రంలో నేరుగా తలపడడం.
నిష్టూరమనిపించినా, టీడీపీ, బీజేపీలు మరో వాస్తవం గుర్తు పెట్టుకోవాలి.
ప్రత్యేక హోదా వల్ల కానీ, ప్రత్యేక ప్యాకేజీ వల్ల కానీ రాజధాని కూడా లేకుండా ఏర్పడ్డ కొత్త రాష్ట్రానికి మంచి మేలే జరుగుతుంది. అంతేకాకుండా, ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలుగు దేశం పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి  నిధుల కొరత నుంచి మంచి ఉపశమనం చిక్కుతుంది. చేయవలసిన పనులు సకాలంలో చేసి వచ్చే ఎన్నికలనాటికి  పార్టీని సంసిద్ధం చేసే రాజకీయ వెసులుబాటు లభిస్తుంది.  ఈ రీత్యా  ప్రధానమైన రాజకీయ లబ్ది చేకూరేది తెలుగు దేశం పార్టీకే. అల్లాగే, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారనే ఆదరణ ప్రజల్లో దొరికేది భారతీయ జనతా పార్టీకి. కానీ, అటు వైసీపీకి కానీ, మరో వైపు  కాంగ్రెస్ కు కానీ ప్రస్తుతానికి  పెద్దగా  ఒనగూడే రాజకీయ ప్రయోజనం  ఏమీ వుండదు,  ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఒప్పించాం అని గొప్పలు  చెప్పుకోవడానికి తప్ప.
వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయాలను ఒదిలిపెట్టి, ప్రజలను భావోద్వేగాలకు గురిచేయడం వల్ల అసలే  ఇబ్బందుల్లో వున్న కొత్త రాష్ట్రానికి  మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు.
ఈ విషయంలో సీమాంధ్ర పార్టీలు, పొరుగున వున్న తెలంగాణాలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగుతున్న తరుణంలో అక్కడి పార్టీలు అనుసరించిన ఐక్యతా విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
అంతేకాని, వైసీపీ టీడీపీని, టీడీపీ వైసీపీని, బీజేపీ కాంగ్రెస్ నీ, కాంగ్రెస్ బీజేపీని తప్పులెన్నే తప్పుడు విధానాలనుంచి తక్షణం తప్పుకోవాలి.
ప్రజల ప్రయోజనాలను  ఏ పార్టీ కాపాడుతుందో, అ పార్టీ ప్రయోజనాలను ప్రజలు  కాపాడతారు.
(18-05-2016)
  

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595    

     

17, మే 2016, మంగళవారం

తర్వాత రమ్మను


“ఎవరాయన”
“తెలీదండీ. పెద్ద జర్నలిష్ట్ టండీ”
“మన గురించి రాస్తారా?”
“అదీ తెలీదండీ. ఆయన తనకు తెలిసిన విషయాలను, తెలీని విషయాలను తెలుసుకుని పత్రికలకు వ్యాసాలు రాస్తారుటండీ”

“అలాగా. అయితే సారుకి టైము లేదు, తరువాత రమ్మను” 

ఒక విలేకరి కధ


ఈ తరం జర్నలిష్టులకు అంతగా తెలియని పత్రికారచయిత జీ.కృష్ణ గారు. అక్షరాలా కీర్తిశేషులు. కీర్తి మినహా ఏమీ సొంతానికి మిగిల్చుకోకుండా దాటిపోయిన ‘కలం కూలీ’. ఇక, శ్రీ సామల సదాశివ. గొప్ప రచయిత. ఈయనా కృష్ణ గారి బాపతే. అందుకే ఇద్దరికీ అంత స్నేహం. కృష్ణ గారు రాసిన జ్ఞాపకాల సమాహారం – ‘విలేఖరి లోకం’ గ్రంధానికి, ‘అతనికి దిగులెక్కడిది?’ అనే ముందు మాట రాశారు సదాశివ గారు. అందులో..... రాసిన  కొన్ని వాక్యాలు.  (బ్రాకెట్లో నేను రాసినవి – సులభంగా అర్ధం కావడానికి)
“ఇంతకుముందు అతని (కృష్ణ గారి) కోసం ఎవరేది చేస్తానన్నా ఒప్పుకున్నాడా? వల్లమాలిన స్వాభిమానమాయే! మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారు (అధికారంలో వున్నప్పుడు) ఇల్లో ఫ్లాటో ఇస్తానంటే, ‘యెందుకు’ అని ఎదురు ప్రశ్న వేసినాడట. పోనీయండి.  ముఖ్యమంత్రి గారు (అప్పుడు చంద్రబాబు నాయుడు గారు) అతనికి (వైద్యపరంగా) చాలా సహాయం చేసాడని, చేస్తున్నాడని విన్నాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి అతని పరిస్తితి తెచ్చిన పుణ్య పురుషుడు ధన్యుడు. ‘ఎవరి రాజ్యంలో కళాసాహిత్యవేత్తలు నిర్ధనులై కష్టపడతారో ఆ దోషం రాజుది’ అన్నాడు భర్తృహరి. ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క సత్కార్యంతో ఆ దోషం తమకంటకుండా తొలగించుకున్నారు. ‘ముఖ్యమంత్రిగారు నా గదిలో ప్రవేశిస్తూ ‘ఏమండీ ఈ మాత్రం డబ్బు కోసం బెంగ  పెట్టుకుంటే యెలా? నేనున్నానుగా’ అని నాలో జీవితాశ కలిగించినారు’ అని కృష్ణ నాతో అన్నాడు. ‘మరి, మీ ఇంటికి సిరి వచ్చిన జాడ కనిపించదే’ అంటే ఎమిల్ జోలా కధ చెప్పినాడు” 
సదాశివ ఇంకా ఇలా రాశారు.
“కృష్ణ, కావ్యకంఠ గణపతిముని శిష్యుడు.
‘రంజ్ సే ఖోగర్ హువా ఇన్సాన్ తొ మిట్ జాతా హై రంజ్ - ముష్కిలే ఇత్నీ పడీ ముజ్ పర్ కే ఆసా హోగయీ – బాధలకు అలవాటు పడ్డ మనిషికి ఏదీ బాధ అనిపించదు. ఎన్ని కష్టాలు అనుభవించినానంటే ఇప్పుడు నాకేదీ కష్టమనిపించడం లేదు’ అన్నాడు మీర్జా గాలిబు. గాలిబుకు జీ. కృష్ణకు కొన్ని పోలికలున్నాయి. కృష్ణ కష్టాలకు అలవాటు పడ్డాడు. కాని బాధ పడ్డట్టు కనిపించలేదు. ‘మనసా ధారయన్ దుఃఖం’ అన్నారు రామున్ని గురించి. కృష్ణ ధీరుడే కాని దీనుడు కాదు.
“జీ కృష్ణకు హిపోక్రసీ నచ్చదు. దాపరికం లేని విలేఖరి. స్పష్టంగా తెలియని దోషాలు తమకు తెలిసినట్టు ఆరోపిస్తూ ఎవరినీ ఎండగట్టకూడదు. విలేఖరిగా కృష్ణ కొన్ని విలువలు పాటించాడు.తాను రాసే వాక్యాలకు జవాబుదారీ వహించే రాస్తాడు. బాధ్యతారహితంగా రాసే వాళ్లకి  ఈ ‘విలేఖరి లోకం’ రవంత వెలుగు చూపిస్తే సంతోషం.”


(ఒకనాటి ప్రెస్  క్లబ్ కార్యక్రమంలో కృష్ణగారిని సాదరంగా పలకరిస్తున్న నాటి ఆర్ధికమంత్రి శ్రీ రోశయ్య, క్లబ్  కార్యదర్శి ఎం.ఎస్. శంకర్, యూ.ఎన్.ఐ. విలేకరి శ్రీ పార్ధసారధి, వారి నడుమ క్లబ్ ఉపాధ్యక్షుని  పాత్రలో నేను) 



తోకటపా: నేను నార్లగారి స్కూలు కనుక ‘విలేకరి’ అనే రాస్తాను. ‘ఖరి’ అంటే ‘ఆడగాడిద’ అనేది వారి ఆంతర్యం.