9, మే 2016, సోమవారం

ఎలా అంటే ఇలా


“మా కుక్క పిల్ల పప్పీకి పాతికేళ్ళు” అన్నాడు ఏకాంబరం.
“ఎలా! అదెలా!” అడిగాడు లాయరు  పీతాంబరం
“ఎలా అంటే ఇలా. ఎప్పుడో విడుదల అయి బాక్సుల్లో వుండిపోయిన సినిమాకి పాతికేళ్ళు, ముప్పయ్యేళ్ళు అంటుంటే, మా పెద్దాడి పుటకలప్పుడే గుటుక్కుమన్న పప్పీకి పాతికేళ్ళు అంటే తప్పేమిటి?”

లా పాయింటు లాగాడు ఏకాంబరం    

అమ్మకు ఓకే! కానీ.....


ఏకాంబరానికి ఏళ్ళు మీద పడుతున్నాయి కాని పెళ్ళికి ఆమడ దూరంలోనే ఆగిపోతున్నాడు. ఆస్తికి ఆస్తి, చదువుకు చదువు, మంచి ఉద్యోగం అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా పెళ్లి  లగ్గం మాత్రం ముడిపడడం లేదు. సంబంధాలు రావడం లేదని కాదు. వస్తున్నాయి. పిల్లాడికి నచ్చిన పిల్ల, పిల్లాడి తల్లికి నచ్చడం లేదు. వచ్చిన ప్రతి సంబంధానికి ఏదో వంకలు పెట్టి తిరగగొడుతుండడంతో కొన్నాల్టికి   ఏకాంబరానికి పిల్లనిస్తామని వచ్చేవాళ్ళే కరువయ్యారు. అతడి పరిస్తితి చూసి బాధపడ్డ స్నేహితుడు విషయం ఆరా తీసి ఒక సలహా ఇచ్చాడు.
“అచ్చం మీ అమ్మ లాంటి పిల్లను వెతికి చూపించు, ఏ వంకా చెప్పకుండా ఓకే అంటుంది” అనే ఆ మిత్రుడి  సలహా పట్టుకుని, బోలెడు  ప్రయత్నం చేసి అచ్చంగా కనుముక్కు తీరు అంతా వాళ్ళ అమ్మగారి పోలికలే వున్న పిల్లనే వాళ్ళ అమ్మకు చూపించాడు. ఆ అమ్మాయిని చూసి ఏకాంబరం అమ్మ తెగ మురిసిపోయింది.  తెచ్చుకుంటే ఇలాంటి కోడల్నే తెచ్చుకోవాలని అక్కడికక్కడే ఆ సంబంధాన్ని సెటిల్ చేసింది.
కొన్నాళ్ళ తరువాత మిత్రుడు కలిసి అడిగాడు ఏమైందని. చూపెట్టిన పిల్ల తల్లికి నచ్చిందని చెప్పాడు. “మరింక ఎందుకు ఆలస్యం ముహూర్తాలు పెట్టుకోవడానికి” అని అడిగాడు స్నేహితుడు.


“అమ్మకు నచ్చింది సరే. అచ్చం అమ్మలాంటి అమ్మాయిని చేసుకుంటాను అంటే నాన్న ఒప్పుకోవడం లేదు” అన్నాడు ఏకాంబరం పుట్టెడు దిగులుతో.

NOTE: Courtesy Image Owner   

ఆత్రం


యువరాజు పెరిగి పెద్దవుతున్నకొద్దీ పెద్ద మహారాజుకు మనాది పెరుగుతూ వస్తోంది.
యువరాజు పుట్టినప్పుడు అందరి పిల్లల మాదిరిగా మామూలుగానే వున్నాడు. ఏడు మీద పడుతున్న కొద్దీ  అతడి పెరుగుదలలో కొంత అవకరం కనిపిస్తూ వచ్చి, ఒక ప్రాయం వచ్చేసరికి అది చూడ వికారంగా తయారయింది. యువరాజు కాళ్ళు ఏడాదికి బెత్తెడు పెరుగుతూ పోతున్నాయి. శరీరంలో మిగిలిన అవయవాల ఎదుగుదల సాధారణంగానే వుంది. పొడగరి కాళ్ళ పిల్లవాడు అనుకోవడానికి వీల్లేకుండా అతగాడి కాళ్ళు బాగా పెరిగిపోయి నిచ్చెన మీద నిలబడ్డ పిల్లాడిలా తయారయ్యాడు.


మహారాజుకి కంట నిదుర లేకుండా పోయింది. దేశదేశాల నుంచి వైద్యులను  రప్పించారు. వాళ్ళు పిల్లాడ్ని చూసి పెదవి విరవడం తప్ప పెదవి విప్పి ఒక్క తరుణోపాయం కూడా చెప్పలేకపోయారు. దాంతో మంత్ర వైద్యులు రంగ ప్రవేశం చేశారు. వాళ్ళలో ఒకడు, యువరాజు కాళ్ళు కురచగా చేస్తానని చెప్పడంతో రాజు మనసు కుదుట పడింది.  అయితే కొన్ని షరతులు అంటూ  మంత్రం గాడు సన్నాయి నొక్కులు నొక్కాడు. ఏమిటన్నాడు రాజు గారు. తనదగ్గరో గాడిద పిల్ల వుందని, చూడడానికి మామూలు గాడిదే కాని అపూర్వ మంత్రం శక్తులు దానికి  వున్నాయని చెప్పాడు. యువరాజు ఆ గాడిద దగ్గరికి వెళ్లి తనని పెళ్లి చేసుకోమని మూడుసార్లు అడగాలని, అది చేసుకోనని అంటుందని, అలా ఒక్కసారి అనగానే యువరాజు కాళ్ళు అడుగు మందం తగ్గిపోతాయని చెప్పాడు. యువరాజు సరేనని ఆ గాడిద పిల్ల వద్దకు వెళ్లి తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. గాడిద చేసుకోను అని స్పష్టంగా చెప్పింది. విచిత్రం. మంత్రగాడు చెప్పినట్టుగానే యువరాజు కాళ్ళు అడుగు తగ్గిపోయాయి. ఇంకోసారి అనిపిస్తే మరో అడుగు తగ్గిపోయింది. ఇంకొకమారు అనిపిస్తే చాలు అతడి కాళ్ళు అందరిలాగే మామూలు స్థాయికి వచ్చేస్తాయి.
మహారాజుకి ఆశపెరిగింది. యువరాజుకి ఆత్రం పెరిగింది. గాడిద దగ్గరికి వెళ్లి ‘నన్ను పెళ్లి చేసుకో, పెళ్ళిచేసుకో’ అని గట్టిగా అడిగాడు. ఆ గాడిద కూడా అంతకంటే గట్టిగా 'చేసుకోను, చేసుకోను, చేసుకోను’ అంటూ ముమ్మారు చెప్పింది.

అంతే! యువరాజు కాళ్ళు నడుము వరకు లేకుండా పోయాయి. 
  
NOTE: COURTESY IMAGE OWNER          

నాతో పెట్టుకుంటే ఇంతే!


ఏకాంబరం తన బాసుతో కలిసి పగటివేళ రైల్లో పోతున్నాడు. ఆ రైలు ఓ పెద్ద సొరంగ మార్గంలో పోతోంది. అదే బోగీలో మరో ఇద్దరు వున్నారు. ఓ వయస్సు మళ్లినావిడ
, ఆవిడతో పాటు మాంచి వయస్సులోవున్న వాళ్ళమ్మాయి. రైలు సొరంగంలో ప్రవేశించగానే బోగీ అంతా చీకటి అలుముకుంది. ఎవరికెవరు కనిపించడం లేదు. వున్నట్టుండి ఎవర్నో ముద్దు పెట్టుకున్న ధ్వని, వెనువెంటనే చెంప చెల్లుమన్న చప్పుడు.
రైలు సొరంగం నుంచి బయటకు వచ్చింది. వెలుతురు వచ్చింది.
వృద్ధురాలు, ఏకాంబరం మొహాల్లో తెలియని కంగారు. మేనేజర్ చెంప కందిపోయి వుంది. తలదించుకుని కూర్చున్నాడు. ఏం జరిగిందో తెలియనట్టు అమ్మడు అమాయకంగా చూస్తోంది. మౌనంగా వున్నారు కానీ ఎవరి ఆలోచనలు వారివి.   
పెద్దావిడ మనసులో అనుకుంటోంది " పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు కానీ ఈ మేనేజర్లవన్నీ పిదప బుద్దులు. ఆఫీసులో అమ్మాయిలతో చనువు తీసుకున్నట్టే మా ఆమ్మాయిని కూడా ఏదో చేసివుంటాడు. ఇది చెంప చెళ్ళుమనిపించింది. మహ మంచి పనిచేసింది. ఇలాటి వెధవలకి ఇలాగే జరగాలి"
అమ్మాయి ఆలోచనలు వేరుగా వున్నాయి "బహుశా ఆ మేనేజర్ వెధవ నన్నే ముద్దుపెట్టుకోవాలని చూసివుంటాడు. చీకట్లో తెలియక  అమ్మకు పెట్టి ఉంటాడు. అమ్మ తక్కువదా! చాచి కొట్టి వుంటుంది"  
మేనేజర్ మరో విధంగా అనుకుంటున్నాడు "ఛ! ఛ! ఎంతపని జరిగింది. చెప్పుకుంటే సిగ్గుచేటు.  ఇది ఖచ్చితంగా ఏకాంబరం గాడి పనే అయివుంటుంది. వాడు ముద్దు పెట్టుకుంటే ఆ అమ్మాయి పొరబడి నా లెంపలు పగలగొట్టింది. కానీ ఎలా చెప్పడం? పగిలింది నా చెంప కదా!"
ఏకాంబరం ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి. కానీ అవి చస్తే బయటపెట్టడు.
" ఈ మేనేజర్ పీనుక్కి తగిన శాస్తే జరిగింది. అస్తమానూ ఆఫీసులో నా మీద పెత్తనం చేస్తాడు. అయిన దానికీ, కాని దానికీ వంకలు పెట్టి నలుగురిలో అవమానిస్తాడు. ఇన్నాల్టికి దొరికాడు వెధవ. ఇంకో టన్నెల్ రానీ,  మరోసారి ముద్దు పెట్టిన చప్పుడు చేస్తాను. మేనేజర్ గాడిద రెండో చెంప కూడా  పగలగొడతాను. ఏకాంబరం అంటే అల్లాటప్పా అనుకుంటున్నాడు వెధవన్నర వెధవ"


8, మే 2016, ఆదివారం

ఆల్ ఫ్రీ

ఆల్ ఫ్రీ
రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం  చంపుకుంటారు.’ – విల్ రోగర్స్


సుమతీ శతకాలుసూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు” 
ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపు లేదు. వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు.  ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుకమండు  వేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. కలర్ టీవీలులాప్ టాపులునెలసరి భత్యాలునగదు బదిలీలుభూసంతర్పణలుపట్టు చీరెలుపసుపు కుంకాలుఉచిత వైద్యాలుఆల్  ఫ్రీ చదువులుబంగారు తల్లులుకరెంటు మీదిబిల్లు మాది తరహా హామీలు – ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాలతో  వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ప్రజలనుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసి నింపుకున్న ఖజానా డబ్బులతోనే  ఓటర్లకు  నజరానాలు  గుప్పిస్తూ, ఇలా ఈ చేత్తో తాయిలాలు  ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీలవి నూటికి నూరుపాళ్ళు అచ్చంగా  ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులనే చెప్పాలి.
వాగ్దానకర్ణుల మాదిరిగా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదుఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు.
ఎందుకంటే ఎన్నికల్లో ప్రకటించే ఈ ఉచితాలన్నీ అధికారం చేతికి అందాక రెండు చేతుల్తో ప్రజాధనాన్ని కడుపారా తినడానికే కనుక.
(చక్కటి కార్టూన్  గీసి సంతకం చేయని కార్టూనిష్టుకు వేలవేల కృతజ్ఞతలతో)


7, మే 2016, శనివారం

జీవితమే ఒక పాఠశాల

సూటిగా....సుతిమెత్తగా..... భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN EDIT PAGE OF "SURYA" TELUGU DAILY ON 08-05-2016, SUNDAY)
NOTE: Roll down further when you open the link to read it with more clarity. Printed under editorial.
LINK:

జీవితం నేర్పే పాఠాలు

జీవించడానికే జీవితం కాదు, నేర్చుకోవడానికి కూడా ఉపకరిస్తుంది. బతుకు బాటలో కనిపించే దృశ్యాల నుంచి కనిపించని వాస్తవాలను చూడగలిగితే, మనిషి జీవితానికి ఒక సార్ధకత లభిస్తుంది. అందుకే ఈ వారం, ఆదివారం మామూలు షరా మార్గం  నుంచి కాస్త పక్కకు మళ్ళి చూడాలనిపించింది. రాయాలనిపించింది. అదే పోయిన వారం నేను  రాయని డైరీ  విశేషాలు.

ఆసుపత్రిలో బోధి వృక్షం 

పండక్కి పుట్టింటికి వచ్చినట్టుగా రెండేళ్ళ కోమారు  ......మా ఆవిడకు తప్పని ఆసుపత్రి సందర్శన.
ముక్కుచెవులకు అన్నింటికీ ఏడువారాల నగలు పెట్టుకున్నట్టు వొళ్ళంతా ఏవిటేవిటో ఆక్సిజన్ మాస్కులూఈసీజీ వైర్లూ. నిశ్శబ్దాన్ని మరింత  భయంకరం చేస్తూ లైఫ్  సేవింగ్ యూనిట్ల చప్పుళ్ళూ. క్షణం పాటు కూడా రెండు కాళ్లు ఒక చోట పెట్టకుండా అటూ ఇటూ తిరుగుతుండే మనిషి నిస్తాణగా ఆస్పత్రి మంచం మీద.  చూడలేక, చూడకుండా వుండలేక అదో రకమైన అర్ధం కాని  అర్ధం లేని మానసిక స్తితి. లోకంలోని జబ్బు మనుషులందరూ ఒక్క చోట చేరినట్టు వున్న  ఐసీయూ నుంచి బయట పడి....
ఆ వెయిటింగు గదిలో కూర్చున్న అందరి వదనాల్లో ఏదో తెలియని ఆందోళన. ఆత్మీయుల ఆరోగ్యం గురించిన మాటలు వినీ వినపడకుండా. ఎవడయినా సూపర్ మాన్ దుడ్డుకర్ర పట్టుకుని ఈ లోకం నుంచి రోగాలను అన్నింటినీ తరిమి కొడితే.... రోగాలు, రోష్టులు తెలియని ఓ చిన్న పాపఅక్కడే  ఆడుకుంటోంది.  తెలియని అందరి దగ్గరి దగ్గరకు వచ్చి తెలిసిన ఆరిందాలా పలకరిస్తోంది.  ఆ పాపాయి నవ్వుతో ఇంకా ఐసీయూలో మా ఆవిడతోనే  వుండిపోయిన   నా మనసు  కొద్దిగా తేరుకుంటోంది.
ఎవరో నలుగురు వచ్చారు. ఇద్దరు మగా మరో ఇద్దరు ఆడవాళ్ళు. వేసుకున్న దుస్తుల్ని పట్టి చూస్తే అంతా   మగవాళ్ళు మాదిరిగా వున్నారు. గలగలా కాకపోయినా కాస్త పెద్దగానే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ రాకతో కొద్దిగా ఎబ్బెట్టుగా మారినట్టయింది అక్కడి వాతావరణం.
ఒకమ్మాయి అడుగుతోంది ఇంగ్లీష్ లో, కాఫీ కావాలా, టీ కావాలా అని. వారేమన్నారో తెలియదు. వారిలో ఫేషన్ గా జుట్టు వెనక్కి దువ్వి ముడి వేసుకున్న ఓ యువకుడు లేచాడు, కాఫీ కౌంటర్ వైపు కదిలాడు. అప్పుడు కనిపించింది అతడికో కాలు లేదు. ఆ స్థానంలో యంత్రం సాయంతో కదిలించగల స్టీల్ రాడ్. ఒక లిప్త పాటు మనసు అదోలా అయింది. కాలు లేకపోయినా అంత మామూలుగా ఎలా  వుండగలుగుతున్నాడు ? కాళ్ళూ చేతులూ వున్న ఓ మామూలు మనిషి లాగానే  తోటివారికి కాఫీ తేవడానికి ఎలా లేచాడు ? వెంట వచ్చిన వాళ్ళలో కూడా అతడో అవిటిమనిషి అన్న భావం ఏమాత్రం కానరాలేదు. కాలు లేకపోయినా కాఫీ  తెస్తాను అని లేస్తే అదో సాధారణ విషయం అయినట్టు కిమ్మనలేదు, ‘నువ్వేం తెస్తావు, కూర్చో’ అంటూ లేనిపోని సానుభూతి ఒలకపోయ్యలేదు.



మనిషితో పాటే అవస్థలు పుడతాయి. వాటిని చూసి బెదిరి పోవడం కంటే వాటితో సహజీవనం చెయ్యగలిగితే.....
అర్ధం చేసుకోవాలే కాని, ఆసుపత్రులు కూడా బోధి వృక్షాలే!

ఆసుపత్రి వైరాగ్యాలు

ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఈసురోమంటూ రోగులు. చెరగని చిరునగవులతో వారి మధ్యలో తిరుగుతుండే  నర్సులు, గంజాయి పొలంలో తులసి మొక్కల్లా. 
నీరవ  నిశ్శబ్దం. వెలుతురూ, చీకటీ కాని మధ్యస్తపు వెలుతురులో ప్రాణం కొట్టుకుంటున్నట్టుగా ఒంటికి తగిలించిన మిషన్లు  చేసే చప్పుళ్ళు. యముని మహిషపు మెడ గంటల ధ్వనుల మాదిరిగా.
డబ్బులు వద్దు, తిని హరాయించుకోలేని సిరి సంపదలు అసలే  వద్దు, నా ముద్ద అన్నం నేను తినే ఆరోగ్యం ఇవ్వు చాలు దేవుడా!
లోకంలోని రోగాలన్నీ ఆసుపత్రుల్లోనే కొలువు తీరినట్టున్నాయి. ఈ రోగాలూ,  ఈ ఆసుపత్రులూ   అమాంతం ఈ లోకంనుంచి  మాయమయిపోతే యెంత బాగుంటుందో కదా!
కన్నుకింత, పన్నుకింత, గుండెకింత, నడవని కాలుకింత, మడవని కీలుకింత. బొమికగా మారని ఎముకకింత, ఒంట్లో పారే నెత్తురుకింత. అన్నింటికీ లక్షల్లో రేట్లు.  ఖరీదు కట్టని అవయవం అంటూ  ఈ దేహంలో  ఒక్కటయినా ఉందా? ఒక్క రూపాయి  కూడా మారు  అడగకుండా,  అమ్మ కడుపులో వుండగానే  మనిషికి  అన్నీ  అమర్చి,   ఈ భూమ్మీద పడేసిన అద్భుత శక్తికి యెంత ఇస్తే ఆ రుణం తీరాలి?

అంగుష్టపు మనిషి

ప్రెషర్ కుక్కర్ లో అన్నంలా కుతకుతలాడిన మనసులు, శరీరాలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. లక్షల ఎయిర్ కండిషనర్లు ఏకబిగిన పనిచేసినా, కోట్ల కిలోవాట్ల కరెంటు ఖర్చయినా సాధ్యపడని విధంగా నగరం ఒక్క  వానతో చల్లబడింది. తను యెంత అల్పుడో, చీమ కంటే కూడా యెంత హీనమో  మనిషికి  తెలపడానికి బహుశా ప్రకృతి ఇలాంటి ట్రిక్కులు చేస్తుందేమో!
కానీ తెలుసుకుంటాడా అన్నదే జవాబులేని ప్రశ్న.

అల్పత్వం

కంటి చూపుతో కాల్చేస్తా, వొంటి చేత్తో ఇరగదీస్తా అనే మాటలు చప్పట్లు కొట్టించుకునే డైలాగులు మాత్రమే. నిజానికి ఈ శక్తి ఒక్క ప్రకృతికే వుంది.
మొన్న గురువారం అర్ధ రాత్రి జనాలు గాఢ నిద్రలో వున్నప్పుడు నగరంలో గాలి వాన సాగించిన బీభత్స దృశ్యాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఆ రాత్రి మేలుకుని వుండే అవసరం పడి జరిగిన అనర్ధాన్ని బయటకి వెళ్లి కనులారా చూడలేకపోయినా, ప్రచండ వేగంతో వీచిన గాలికి తలుపులు, కిటికీలు టపటపా కొట్టుకున్న ధ్వనులు చెవుల్లో ఇంకా మారుమోగుతూనే వున్నాయి. వున్నట్టుండి పైన డాబా మీద  పిడుగు పడ్డ చప్పుడు. తెల్లారి లేచి చూస్తే, పైన వాటర్ ట్యాంక్ కు అమర్చిన ఇనుప నిచ్చెన విరిగి పడివుంది.  నలుగురు చేయి వేస్తేకాని కదల్చలేని బరువైన నిచ్చెన, ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా యెగిరి పడింది.
మనిషి అల్పత్వానికి మరో ఉదాహరణ.




కంటికే కెమెరా వుంటే....

కొన్ని చూద్దామన్నా కంట పడవు. మరికొన్ని అనుకోకుండా కంటపడతాయి. చేతిలో సెల్ ఫోన్ సిద్ధంగా వున్నా, ఫోటో తీయలేని పరిస్తితి. తీస్తే  పపారజ్జీ (సెలెబ్రిటీలను వెంటాడి, వేటాడి ఫోటో తీసే బాపతు) కింద  జమకట్టే  ప్రమాదం కూడా వుంది మరి. కంటికే కెమెరా వుంటే యెంత బాగుండు అనిపిస్తుంది అల్లాంటప్పుడు.

ఈ మధ్యాన్నం మండుటెండలో బేగంపేట్ లోని సీజీహెచ్ఎస్ (కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వైద్య శాల)కి వెళ్లి తిరిగొస్తుంటే కేబీఆర్ పార్కు పక్కన చెట్ల నీడలో ఒక ముసలవ్వ, అవిటి వాడయిన తన పెనిమిటికి అన్నం ముద్దలు తినిపిస్తోంది. ఏమీ లేకపోయినా అన్నీ వున్న మనుషులు వాళ్ళు.
కాస్త దూరంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మరో మనోహర  దృశ్యం. మోటారు సైకిల్  పై  ఓ యువ జంట. అతడి నెత్తిపై హెల్మెట్. వల్లెవాటు తలపై చుట్టుకున్న ఆ యువతి చేతిలో ఉల్లిపొర కాగితంలో చుట్టిన పిజ్జా, పిస్తా లాంటి ఓ ఆధునిక తినుబండారం. తనో ముక్క కొరికింది.  చెలుడి ఆకలి తెలిసిందేమో, హెల్మెట్ పై సుతారంగా తట్టింది. అతగాడు ప్రియురాలి మనసు తెలిసినవాడి మాదిరిగా హెల్మెట్ కొద్దిగా పైకి ఎత్తాడు. ఆ అమ్మాయి చేతిలో తినుబండారాన్ని అతడి పెదవుల వద్దకు చేర్చింది. అతడో ముక్క కొరికి చెలికి థాంక్స్ చెబుతున్నాడు. ప్రేమకు సజీవ సాక్ష్యంలాంటి జంట.
ఈ రెండు దృశ్యాలు ఆవిరి అయిపోతున్న ఆప్యాయతలకి, ఆనురాగాలకీ మారు రూపాలు.

మహా మాయ

పొద్దున్న ఆరుగంటలు.
మంచం మీద నుంచి లేవాలంటే బద్ధకం. నిద్ర కళ్ళ అంచుల్లోనే వుంటుంది. ఓ అయిదే అయిదు  నిమిషాలు కళ్ళుమూసుకుని తెరిస్తే చాలు అదేమి  చిత్రమో! గడియారంలో టైం ఏడు గంటలు చూపెడుతుంటుంది.
సరే!  పడుతూ లేస్తూ  ఆఫీసుకు వెడతాం. ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పుకుని సీటులోకి చేరేసరికి సమయం పన్నెండు. ఈలోగా ఎక్కడలేని నిద్ర తన్నుకుంటూ, ముంచుకుంటూ వస్తుంది. పాపం, దాన్నికాదని యెలా!  మన ఆఫీసే కదా అనుకుంటూ,   అలా  అయిదంటే  అయిదే నిమిషాలు కళ్ళుమూసుకుంటాం. కళ్ళు తెరిచి చూస్తే   గడియారంలో   టైం మాత్రం మాత్రం నత్త నడక నడుస్తూ వుంటుంది. ఇంట్లో ఆ గడియారం ఉరుకులేమిటో తెలియదు. ఆఫీసులో ఈ  గడియారం పెళ్లి నడకలేమిటో......ఏమీ  అర్ధం కాదు.
అంతా మాయ. మహా మాయ. 
 
అగ్గిపెట్టె పది పైసలు

న్యూ ఇయర్  గిఫ్ట్ లకింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.
అలా 1973 లో మార్చి నెల 31   తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా పాత కాగితాలు వెతుకుతుంటే దొరికింది. (అంటే  నలభయ్ మూడేళ్ళ కిందటి మాట)

నూనె : రు. 3-25
నెయ్యి: రు. 2-75
పెరుగు: రు.0-20
టమాటాలు: రు. 0.55
అగ్గిపెట్టె: రు. 0.10
సబ్బు: రు.1-00
రిక్షా:  రు. 0-50
వక్కపొడి పొట్లం: రు. 0-10

(నోటు: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా నో సీ ఎం - నో పీఎం బాపతు







మహా మాయ

పొద్దున్న ఆరుగంటలు.
మంచం మీద నుంచి లేవాలంటే బద్ధకం. నిద్ర కళ్ళ అంచుల్లోనే వుంటుంది. ఓ అయిదే అయిదు  నిమిషాలు కళ్ళుమూసుకుని తెరిస్తే చాలు అదేమి  చిత్రమో! గడియారంలో టైం ఏడు గంటలు చూపెడుతుంటుంది.
సరే!  పడుతూ లేస్తూ  ఆఫీసుకు వెడతాం. ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పుకుని సీటులోకి చేరేసరికి సమయం పన్నెండు. ఈలోగా ఎక్కడలేని నిద్ర తన్నుకుంటూ, ముంచుకుంటూ వస్తుంది. పాపం, దాన్నికాదని యెలా!  మన ఆఫీసే కదా అనుకుంటూ,   అలా  అయిదంటే  అయిదే నిమిషాలు కళ్ళుమూసుకుంటాం. కళ్ళు తెరిచి చూస్తే   గడియారంలో   టైం మాత్రం నత్త నడక నడుస్తూ వుంటుంది.
ఇంట్లో ఆ గడియారం ఉరుకులేమిటో తెలియదు. ఆఫీసులో ఈ  గడియారం తాబేలు నడకలేమిటో అర్ధం కాదు. 
అంతా మాయ. మహా మాయ.



NOTE: COURTESY IMAGE OWNER