7, మే 2016, శనివారం

అగ్గిపెట్టె పది పైసలు


మా పాత డైరీల్లో రాసుకున్న పాత విషయాలు
న్యూ ఇయర్  గిఫ్ట్ లకింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.
అలా 1973 లో మార్చి నెల 31   తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా ఇది. (అంటే  నలభయ్ మూడేళ్ళ కిందటి మాట)
నూనె : Rs.3-25
నెయ్యి: Rs. 2-75
పెరుగు: Rs.0-20
టమాటాలు: Rs. 0.55
అగ్గిపెట్టె: Rs. 0.10
సబ్బు: Rs.1-00
రిక్షా:  Rs. 0-50
వక్కపొడి పొట్లం: Rs. 0-10
(NOTE: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా నో సీ ఎం - నో పీఎం బాపతు)


అల్పత్వం

కంటి చూపుతో కాల్చేస్తా, వొంటి చేత్తో ఇరగదీస్తా అనే మాటలు చప్పట్లు కొట్టించుకునే డైలాగులు మాత్రమే. నిజానికి ఈ శక్తి ఒక్క ప్రకృతికే వుంది.
మొన్న గురువారం అర్ధ రాత్రి జనాలు గాఢ నిద్రలో వున్నప్పుడు నగరంలో గాలి వాన సాగించిన బీభత్స దృశ్యాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఆ రాత్రి మేలుకుని వుండే అవసరం పడి జరిగిన అనర్ధాన్ని బయటకి వెళ్లి కనులారా చూడలేకపోయినా, ప్రచండ వేగంతో వీచిన గాలికి తలుపులు, కిటికీలు టపటపా కొట్టుకున్న ధ్వనులు చెవుల్లో ఇంకా మారుమోగుతూనే వున్నాయి. వున్నట్టుండి పైన డాబా మీద  పిడుగు పడ్డ చప్పుడు. తెల్లారి లేచి చూస్తే, పైన వాటర్ ట్యాంక్ కు అమర్చిన ఇనుప నిచ్చెన విరిగి పడివుంది.  నలుగురు చేయి వేస్తేకాని కదల్చలేని బరువైన నిచ్చెన, ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా యెగిరి పడింది.




మనిషి అల్పత్వానికి మరో ఉదాహరణ.   

6, మే 2016, శుక్రవారం

కంటికే కెమెరా వుంటే.....


కొన్ని చూద్దామన్నా కంట పడవు. మరికొన్ని అనుకోకుండా కంటపడతాయి. చేతిలో సెల్ ఫోన్ సిద్ధంగా వున్నా, ఫోటో తీయలేని పరిస్తితి. తీస్తే  పపారజ్జీ (సెలెబ్రిటీలను వెంటాడి, వేటాడి ఫోటో తీసే బాపతు) కింద  జమకట్టే  ప్రమాదం కూడా వుంది మరి. కంటికే కెమెరా వుంటే యెంత బాగుండు అనిపిస్తుంది అల్లాంటప్పుడు.


ఈ మధ్యాన్నం మండుటెండలో బేగంపేట్ లోని సీజీహెచ్ఎస్ కి వెళ్లి తిరిగొస్తుంటే కేబీఆర్ పార్కు పక్కన చెట్ల నీడలో ఒక ముసలవ్వ, అవిటి వాడయిన తన పెనిమిటికి అన్నం ముద్దలు తినిపిస్తోంది. ఏమీ లేకపోయినా అన్నీ వున్న మనుషులు వాళ్ళు.
కాస్త దూరంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మరో మనోహర  దృశ్యం. మోటారు సైకిల్  పై  ఓ యువ జంట. అతడి నెత్తిపై హెల్మెట్. వల్లెవాటు తలపై చుట్టుకున్న ఆ యువతి చేతిలో ఉల్లిపొర కాగితంలో చుట్టిన పిజ్జా, పిస్తా లాంటి ఓ ఆధునిక తినుబండారం. తనో ముక్క కొరికింది.  చెలుడి ఆకలి తెలిసిందేమో, హెల్మెట్ పై సుతారంగా తట్టింది. అతగాడు ప్రియురాలి మనసు తెలిసినవాడి మాదిరిగా హెల్మెట్ కొద్దిగా పైకి ఎత్తాడు. ఆ అమ్మాయి చేతిలో తినుబండారాన్ని అతడి పెదవుల వద్దకు చేర్చింది. అతడో ముక్క కొరికి చెలికి థాంక్స్ చెబుతున్నాడు. ప్రేమకు సజీవ సాక్ష్యంలాంటి జంట.
ఈ రెండు దృశ్యాలు ఆవిరి అయిపోతున్న ఆప్యాయతలకి, ఆనురాగాలకీ మారు రూపాలు.  

NOTE: COURTESY IMAGE OWNER        

5, మే 2016, గురువారం

నిర్వచనోత్తర రామాయణం


సదస్సు
ఒకడి మనస్సులో వున్న అయోమయాన్ని
హాజరయిన అందరికీ, పెంచి మరీ  పంచే వేదిక 
రాజీ
వున్న ఒక్కకేకునూ అందరికీ పంచి, ప్రతి ఒక్కరూ తమకే పెద్ద ముక్క దొరికిందని సంతోషపడేలా
చేయడం.
కన్నీరు
ఆడదాని కంట్లో నుంచి వచ్చే ఆ కన్నీటి వేగం ముందు ఎంతటి బలవంతుడయిన  మగవాడయినా నీరు కారిపోక తప్పదు అని నిరూపించే ప్రబల శక్తి
నిఘంటువు
వివాహం కన్నా విడాకులు అనే పదం ముందు కనపడే పుస్తకం
గోష్టి
ఒకరి మాట మరొకరు వినిపించుకోకుండా ఆఖర్న ఒకరితో ఒకరు విభేదించే మహత్తర కార్యక్రమం.
గొప్ప పుస్తకం
అందరూ మెచ్చుకునేది, ఎవరూ చదవందీ.
చిరునవ్వు
పైకి మెలికలాగా కనిపించినా, వంకర తిరిగినవాటిని కూడా సాపు చేయగల అద్భుత సాధనం
ఆఫీసు
ఇంట్లో పడ్డ శ్రమ అంతా మర్చిపోయి బడలిక తీర్చుకునే ఆహ్లాదకరమైన ప్రదేశం
ఆవులింత
భార్య ముందు నోరు తెరవడానికి మగవాడికి దొరికే అరుదైన అవకాశం
ఎట్సెట్రా
ఏవీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు బుకాయించే పదం
కమిటీ
విడివిడిగా  ఎవరికి వారు ఏమీ చేయలేని మనుషులందరూ ఒక చోట కలిసి ఏమీ చేయలేమని కలిసికట్టుగా తీర్మానించే  సంఘం
అనుభవం
తాము చేసే పొరబాట్లకు  మనుషులు పెట్టుకున్న  ముద్దుపేరు 


NOTE : COURTESY IMAGE OWNER  


ఆసుపత్రి వైరాగ్యాలు


ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఈసురోమంటూ రోగులు. చెరగని చిరునగవులతో వారి మధ్యలో తిరుగుతుండే  నర్సులు, గంజాయి పొలంలో తులసి మొక్కల్లా. 
నీరవ  నిశ్శబ్దం. వెలుతురూ, చీకటీ కాని మధ్యస్తపు వెలుతురులో ప్రాణం కొట్టుకుంటున్నట్టుగా ఒంటికి తగిలించిన మిషన్లు  చేసే చప్పుళ్ళు. యముని మహిషపు మెడ గంటల ధ్వనుల మాదిరిగా.
డబ్బులు వద్దు, తిని హరాయించుకోలేని సిరి సంపదలు అసలే  వద్దు, నా ముద్ద అన్నం నేను తినే ఆరోగ్యం ఇవ్వు చాలు దేవుడా!
లోకంలోని రోగాలన్నీ ఆసుపత్రుల్లోనే కొలువు తీరినట్టున్నాయి. ఈ రోగాలూ,  ఈ ఆసుపత్రులూ   అమాంతం ఈ లోకంనుంచి  మాయమయిపోతే యెంత బాగుంటుందో కదా!

కన్నుకింత, పన్నుకింత, గుండెకింత, నడవని కాలుకింత, మడవని కీలుకింత. బొమికగా మారని ఎముకకింత, ఒంట్లో పారే నెత్తురుకింత. అన్నింటికీ లక్షల్లో రేట్లు.  ఖరీదు కట్టని అవయవం అంటూ  ఈ దేహంలో  ఒక్కటయినా ఉందా? ఒక్క రూపాయి  కూడా మారు  అడగకుండా,  అమ్మ కడుపులో వుండగానే  మనిషికి  అన్నీ  అమర్చి,   ఈ భూమ్మీద పడేసిన అద్భుత శక్తికి యెంత ఇస్తే ఆ రుణం తీరాలి?  (02-05-2016)       

4, మే 2016, బుధవారం

‘చీమ’నిషి



ప్రెషర్ కుక్కర్ లో అన్నంలా కుతకుతలాడిన మనసులు, శరీరాలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. లక్షల ఎయిర్ కండిషనర్లు ఏకబిగిన పనిచేసినా, కోట్ల కిలోవాట్ల కరెంటు ఖర్చయినా సాధ్యపడని విధంగా నగరం ఒక్క  వానతో చల్లబడింది. తను యెంత అల్పుడో, చీమ కంటే కూడా యెంత హీనమో  మనిషికి  తెలపడానికి బహుశా ప్రకృతి ఇలాంటి ట్రిక్కులు చేస్తుందేమో!



కానీ తెలుసుకుంటాడా అన్నదే జవాబులేని ప్రశ్న.

NOTE: COURTESY IMAGE OWNER

3, మే 2016, మంగళవారం

అమెరికా - విహంగవీక్షణం

యు యస్ ఏ లోని కొన్ని ముఖ్యమైన దర్శనీయ స్థలాలను విహంగవీక్షణంగా ఐదు నిముషాల్లోనే చూపిస్తుంది ఈ విడియో. కింది లంకె మీద నొక్కి ఆ చిత్రమేమిటో మీరూ చూడండి.