ఆసుపత్రి వైరాగ్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆసుపత్రి వైరాగ్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మే 2016, గురువారం

ఆసుపత్రి వైరాగ్యాలు


ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఈసురోమంటూ రోగులు. చెరగని చిరునగవులతో వారి మధ్యలో తిరుగుతుండే  నర్సులు, గంజాయి పొలంలో తులసి మొక్కల్లా. 
నీరవ  నిశ్శబ్దం. వెలుతురూ, చీకటీ కాని మధ్యస్తపు వెలుతురులో ప్రాణం కొట్టుకుంటున్నట్టుగా ఒంటికి తగిలించిన మిషన్లు  చేసే చప్పుళ్ళు. యముని మహిషపు మెడ గంటల ధ్వనుల మాదిరిగా.
డబ్బులు వద్దు, తిని హరాయించుకోలేని సిరి సంపదలు అసలే  వద్దు, నా ముద్ద అన్నం నేను తినే ఆరోగ్యం ఇవ్వు చాలు దేవుడా!
లోకంలోని రోగాలన్నీ ఆసుపత్రుల్లోనే కొలువు తీరినట్టున్నాయి. ఈ రోగాలూ,  ఈ ఆసుపత్రులూ   అమాంతం ఈ లోకంనుంచి  మాయమయిపోతే యెంత బాగుంటుందో కదా!

కన్నుకింత, పన్నుకింత, గుండెకింత, నడవని కాలుకింత, మడవని కీలుకింత. బొమికగా మారని ఎముకకింత, ఒంట్లో పారే నెత్తురుకింత. అన్నింటికీ లక్షల్లో రేట్లు.  ఖరీదు కట్టని అవయవం అంటూ  ఈ దేహంలో  ఒక్కటయినా ఉందా? ఒక్క రూపాయి  కూడా మారు  అడగకుండా,  అమ్మ కడుపులో వుండగానే  మనిషికి  అన్నీ  అమర్చి,   ఈ భూమ్మీద పడేసిన అద్భుత శక్తికి యెంత ఇస్తే ఆ రుణం తీరాలి?  (02-05-2016)