18, సెప్టెంబర్ 2013, బుధవారం

ఆలోచన మొదలయితే అదే పదివేలు

  
ఛానల్ నుంచి తిరిగివస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఫోను చేసి మాట్లాడ్డం మామూలే. వెంటనే చేశాడంటే ఎవరో తెలిసిన వాళ్ళే. కాస్త వ్యవధానం తీసుకుని చేశాడంటే నెంబరు కనుక్కుని మరీ చేశాడు కాబట్టి  అందులో ఎంతో కొంత విషయం వుండే వుంటుంది. ఆ అభిప్రాయాలను మామూలుగా తీసుకోకూడదు.
సంభాషణ మొదలయింది.
‘నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను.’
‘చెప్పండి’
‘మీరు ఈరోజు మాట్లాడింది నాకేమీ నచ్చలేదు’
‘ఏ విషయం గురించి’
‘ఇంకేం విషయం.  సీమాంధ్ర ఆందోళన గురించి. మొన్నీమధ్య ఎక్కడో మీ మాస్కో పుస్తకం చూసాను. కృష్ణా జిల్లా వాళ్లని అందులో రాసి వుంది. మరి యెందుకు వ్యతిరేకంగా చెబుతున్నారు.’
‘అక్కడి ఆందోళనలు గురించి నేను తేలికచేసి చెప్పిన సందర్భం లేదే’
‘ప్రజలను  ఇబ్బంది పెట్టకూడదంటే ఏమిటి అర్ధం?’
‘దాంట్లో తప్పేముంది?’
‘తప్పుకాక మరేముంది?’
(సంభాషణ గాడి తప్పడం లేదు కదా!)
‘మీరెవరో నాకు తెలియదు. కానీ మీరంతట మీరు ఫోను చేశారు. మనసు పెట్టి సావధానంగా వింటే నాలుగు మాటలు చెబుతాను. లేదా తప్పించుకోవడానికి అని మీరు అనుకోకపోతే నేనే ఇంటికి పోయిన తరువాత ఈ నెంబరుకు ఫోను చేస్తాను. సరేనా!’
‘సరే!’
మామూలుగా చెప్పాలంటే ఇవన్నీ మామూలే. స్టూడియోల్లో కూర్చుని జవాబులు చెప్పేవాళ్ళు అడిగిన ప్రశ్నకు తగ్గట్టుగా చెబుదామనుకుంటారు. కానీ ప్రోగాం చూసేవాళ్ళ దృష్టి వేరుగా వుంటుంది. అందుకే ఈ భావ సంఘర్షణ.
ఇంటికి వెళ్ళీ వెళ్ళగానే నెంబరు కలిపాను.
‘ఇప్పుడు చెప్పండి. కాదు అడగండి’ అన్నాను.
ఈసారి అవతల స్వరంలో రవంత ఆశ్చర్యం.
‘నేను చెప్పేది కాస్త సావధానంగా వినండి. ఆ తరువాత అడగదలచుకున్నది అడగండి’ నేనే మొదలు పెట్టాను. ‘మాది కృష్ణా జిల్లా కదా ఇలా యెందుకు మాట్లాడుతున్నారు అని అన్నారు. నేను పుట్టింది కృష్ణా జిల్లా అని ఆరున్నర దశాబ్దాల క్రితం నేను పుట్టినప్పుడు నాకు తెలియదు. స్కూలు రికార్డుల్లో తప్ప పుట్టిన ప్రాంతం యేది అన్న స్పృహ కాని అవసరం కానీ ఇంతవరకూ అవసరపడలేదు. నిజమే. మా వూరు కృష్ణా జిల్లాలోని కంభంపాడు. రెండు మైళ్ల దూరంలో ఖమ్మం జిల్లా సరిహద్దు. రూపాయి రైలు టిక్కెట్టు పెడితే ఖమ్మం వెళ్ళేవాళ్ళం. అదే కృష్ణా జిల్లా కేంద్రం బందరు మా వూరికి  చాలా దూరం. అంచేత చదువు సంధ్యలు, పెళ్లి సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నీ దాపున వున్న ఖమ్మంలోనే. ఇలా వెళ్లడం భవిష్యత్తులో ఓ తప్పు అవుతుందని అప్పుడు మాకు తెలియదు.
‘సరే! అసలు విషయానికి వద్దాము. తెలంగాణాలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు నేను ఛానళ్ళలో ఇలాగే వాదించేవాడిని. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులు అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికీ వుండకూడదు అన్నది, ఎవరు కాదన్నా, అది  నా నిశ్చితాభిప్రాయం.
‘వెనుకటి రోజులు వేరు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. పిల్లల చదువులకు  తలితండ్రులు ఎంతో విలువ ఇస్తున్నారు. పరీక్షల రోజుల్లో  పెళ్లీ  పేరంటాళ్లకు వెళ్లడం కూడా మానుకుంటున్నారు. కేబుల్ టీవీ కనెక్షన్లు తీసేయిస్తున్నారు. వేలకు వేలు వాళ్ళ చదువులపై ఖర్చు పెడుతున్నారు. ఒక్కరోజు స్కూలుకు వెళ్ళలేని పరిస్తితి ఏర్పడ్డా తల్లడిల్లిపోతున్నారు. యాభయ్  ఏళ్ళక్రితం సంగతి వేరు. అందరివీ వానాకాలం చదువులు. చదువుకున్నవారికి ఇన్నిన్ని అవకాశాలు లేని రోజులు. అలాగే ఉద్యోగాలు. ఒక్కరోజు వెళ్ళకపోయినా, గంట ఆలశ్యంగా వెళ్ళినా జీతంలో కోత. ఆవిదంగానే అనారోగ్యాల బాధలు. మంచి ఆసుపత్రుల కోసం ఎంతెంతో దూరాలు. ట్రాఫిక్ కష్టాలు. వీటికి తోడు రాస్తారోఖోలు. అవతల ప్రాణాలమీదకు వస్తున్నా వినే నాధుడు వుండడు. ఈ ఆందోళనలు అన్నీ  చేస్తున్నది ప్రజలకోసమే అని చెప్పేవాళ్ళు ఆ ప్రజలనే ఇబ్బందులపాలు చేస్తున్నారు అని చెప్పడం నేరమా! చెప్పండి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డా, బస్సులు, ఆటోలు తిరక్కపోయినా, బడులు జరక్కపోయినా, నష్టపోయేది ఎవరు? ఈ మొత్తం వ్యవహారానికి మెయిన్ స్విచ్ ఢిల్లీలో వుంటే ఇక్కడ ఆందోళనలు చేసుకుంటూ మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకుంటూ వుంటే వొడ్డున కూర్చుని తమాషా చూసేవాళ్ళు ఎలా దిగివస్తారు? అసలు ఇదేం లాజిక్? తెలంగాణలో సకల జనుల సమ్మె సమయంలో ఇలా మాట్లాడితే వాళ్లకు కోపం వచ్చింది. ఇప్పుడు మీరు కోప్పడుతున్నారు.
‘ఇప్పుడు చెప్పండి నేను  మాట్లాడిన దాంట్లో తప్పేమిటో? మీకు నచ్చనిది ఏమిటో?’
అవతల నిశ్శబ్ధం.
కాసేపటి తరువాత మాట  వినబడింది.
‘మీరు చెప్పినదంతా విన్నాను. మీతో మరోసారి మాట్లాడుతాను.’

అంటే ఏమన్న మాట. ఆలోచన మొదలయిందన్న మాట.

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఒక్క అయిదు నిమిషాలు మీవి కావనుకుంటే......

.......... ఓ అద్భుత ప్రపంచం మీ కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. కుర్చీలో కూర్చుని చేతుల్లో సంగీత వాయిద్యాలు వుంచుకుని చైనా యువతులు చేసే విన్యాసాలు అపూర్వం. ఇందులో అంత ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటారా? కుర్చీలో కూర్చున్నట్టు కూర్చుంటారు కాని అక్కడ కుర్చీలే వుండవు. యోగాసనాలతో అలా కాళ్ళు ముడుచుకుని కూర్చుంటారు. అంతసేపు అలా యెలా వుండగలిగారు ? మానవ మాత్రులకు ఇది సాధ్యమయ్యే పనేనా? చూసి తెలుచుకోండి. ఆసక్తి వుంటే కింది లింక్ పై క్లిక్ చేయండి.

http://www.youtube.com/watch_popup?v=6HfDeTVpinU&vq=medium

ఇల్లాలి ముచ్చట్లు



చిన్నప్పుడు చదివిన స్కూలు గురించి ఆ స్కూలు ప్రిన్సిపాల్ గురించి ఓ నలభయ్ అయిదేళ్ళ తరువాత ముచ్చటించుకునే అవకాశం అమెరికా అందాల భరిణెగా   ఎంపికయిన తెలుగు మల్లెపువ్వు ‘నీనా దావులూరి’ మా ఆవిడకు అందించింది.  పిడుక్కూ బియ్యానికీ లంకె పెట్టే ఈ కధా కమామిషూ ఆమె మాటల్లోనే విందాం.


(మిస్ అమెరికా నీనా దావులూరి)


“1968 ప్రాంతాల్లో నేను (అంటే నిర్మలాదేవి) బెజవాడ మాంటిసోరి స్కూల్లో చదివేదాన్ని.  సరస్వతి వొదినె గారి పిల్లలు సత్యవతి, విజయ అంతా ఆ స్కూలే. ఆ స్కూల్లో పిల్లల్ని చదివించడం అనేది ఆ రోజుల్లో చాలా గొప్పగా వుండేది. దానికి కారణం ప్రిన్సిపాల్  కోటేశ్వరమ్మగారు.  బెజవాడ కనకదుర్గమ్మ లాగే కోటేశ్వరమ్మ పేరు కూడా అంతే ప్రసిద్ధి.


(నలుగురికి జీవితంలో పనికొచ్చే విద్యాబుద్ధులు నేర్పించిన మాంటిసోరి కోటీశ్వరమ్మగారు)  


“విజయకు కుమారుడు (కార్తీక్) పుట్టినప్పుడు (పాతికేళ్ళు దాటింది) బారసాలకు కోటేశ్వరమ్మగారు కూడా వచ్చారు. మేమంతా ఆవిడ  స్టూడెంట్లం కాబట్టి భోజనాల సమయంలో ఆమె చుట్టూ కూర్చున్నాం. చాలా ఏళ్ళ తరువాత కలిసినా ఆవిడ పేరు పేరునా అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. ‘ఏం చేస్తున్నవంటే’ ‘హైదరాబాదులో ‘అమ్మవొడి’ పేరుతొ కేర్ సెంటర్ నడుపుతున్నాను’ అని చెప్పా. బహుశా ఆమె దగ్గర చదువుకున్నవాళ్ళల్లో  చదువులో ఎక్కిరానిదాన్ని నేనే అనుకుంటా. కానీ ఆవిడ మాత్రం నన్ను అభినందించారు. స్త్రీలు స్వతంత్రంగా ఏదో ఒకటి చేయడం చాలా అవసరమని చెప్పారు. నేను ఏదో మా అవసరాలకు కేర్ సెంటర్  పెట్టుకుంటే, ఆవిడ పెద్ద మనస్సుతో ఆశీర్వదించిన విధానం నేను మరిచిపోలేను. ఈరోజు విజయ ‘నీనా దావులూరి’ విషయం చెప్పడానికి ఫోను చేస్తే ఆ పాత విషయాలన్నీ మరోమారు గుర్తుచేసుకున్నాము. కోటేశ్వరమ్మ గారిని సంస్మరించుకునే అవకాశం ఇచ్చిన నీనా దావులూరికి కృతజ్ఞతలు.”

"చివర్లో ఇంకో విషయం. తెలుగు సినిమా రంగంలో హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న ‘జంధ్యాల’ (జేవీడీఎస్ శాస్త్రి) కూడా మాంటిసోరి స్కూల్లో మా క్లాసుమేటు. దీనికి కొనసాగింపు లాంటి ముగింపు ఏమిటంటే జంద్యాల తదనంతర కాలంలో బెజవాడ ఎస్సారార్ కాలేజీలో మూడేళ్ళు మా వారికీ బీకాం లో క్లాసుమేటు."
(17-09-2013)                      
  


లిఫ్టోచ్చిందోయ్ బాబూ లిఫ్టోచ్చింది!


అపార్టుమెంటు జీవితాల్లో మనుషుల్ని కలిపేది విడతీసేది లిఫ్టే. ఈ వాస్తవం మా లిఫ్ట్ పుణ్యమా అని మా ఎరుకలోకి వచ్చింది.
మా మధుబన్  అపార్టుమెంటులో లిఫ్ట్ చెడిపోయింది. ఇది పెద్ద వార్తేమీ కాదు. కాకపోతే అది చెడిపోయి మూడు నెలలు దాటిపోయింది. రిపేరు ఖర్చు పెద్ద మొత్తం కావడంతో చాలా రోజులు సంక్షేపించారు. మొదటి రెండు అంతస్తుల్లో వుండేవాళ్ళు మాకు  లిఫ్ట్ అవసరమే లేదు అలాంటప్పుడు అనవసరంగా  ఖర్చు యెందుకు భరించాలి అన్న పద్దతిలో ముందు వాదనకు దిగినా తరువాత దిగివచ్చి డబ్బులో వాటా ఇవ్వడానికి వొప్పుకున్నారు. మొత్తం మీద పని మొదలయ్యింది. కానీ చురుకుగా సాగలేదు. ఈ లోగా మూడో అంతస్తులో వుంటున్న మేమూ మాపై అంతస్తులోవున్నవాళ్ళూ గత్యంతరం లేక  మెట్లమీద నుంచే రాకపోకలు మొదలు పెట్టాము. కింది వాళ్లు సరేసరి. దాంతో అపార్టుమెంటులో వుంటున్నవాళ్లందరూ  రోజులో ఏదో ఒక సమయంలో మెట్లమీద ఎదురు పడడం, మర్యాదకు పలకరించుకోవడం కూడా మొదలైంది. ఏతావాతా ఈ సంబంధాలు క్రమంగా పలకరింపులదాకా, పలకరింపులు ముచ్చట్లదాకా, ముచ్చట్లు  ఒకరింటికి ఒకరు వెళ్ళి రావడాలదాకా  పెరిగి మొత్తం అపార్టుమెంటులోనే ఒక సుహృద్భావవాతావరణం ఏర్పడింది. అంతకు  ముందుదాకా ఎడమొహం పెడమొహంగా వుంటున్నవాళ్లు కూడా  మొహాలమీద చిరునవ్వు పులుముకుని మరీ పలకరించుకోవడం మొదలుపెట్టారు.  ఈలోగా లిఫ్ట్ రిపేరు పని కూడా మొదలయింది. కానీ ఆ పనివాడికి ఈ పాత లిఫ్ట్ రిపేరుకంటే మించిన పని మరెక్కడన్నా దొరికిందో యేమో కానీ మా పనిని వాయిదాల పద్దతిలో కొనసాగిస్తూ వచ్చాడు. దానా దీనా ఈ ఆలశ్యం కూడా మంచే చేసింది. లిఫ్ట్ రిపేరు ఖర్చు విషయంలో పొట్టు పొట్టయిన వాళ్లు, వాళ్ల పిల్లలు చెట్టాపట్టాలు వేసుకుని మెట్లెక్కి దిగే పరిస్తితి ఏర్పడింది. ‘బెడ్ రూమ్ టు బాత్ రూమ్ మార్నింగ్ వాక్’ చేసే నా బోంట్లకు మెట్ల మార్గం కాసింత వ్యాయామ మార్గంగా మారింది.
కాబట్టి ఈ పొట్టి కధలో గట్టి నీతి ఏమిటంటే చెడిపోవడం కూడా కొండకచో మంచే చేస్తుంది.
(తోకవాక్యం: మా ఆవిడ నేను రాసే ఇవ్వేవీ చదవదు కాబట్టి ధైర్యంగా రాస్తున్నాను. లిఫ్ట్ లేకపోవడం వల్ల ఆవిడ  వూళ్ళో బంధువుల ఇళ్లకు రోజువారీ  చేసే పెత్తనాలు కూడా బాగా తగ్గిపోయాయి. మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ)
17-09-2013

16, సెప్టెంబర్ 2013, సోమవారం

కప్పూ సాసరు కధ


కప్పూ సాసరు గురించి ఎమ్వీ  అప్పారావు గారు ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు. వాటికి ఇది కొనసాగింపు.
కాఫీ కప్పు అంటామే కాని  మూడు వందల ఏళ్ళ క్రితం దీన్ని తేనీరు సేవించడానికి వాడేవారు. చైనా నుంచి ఈస్ట్ ఇండియా ట్రేడింగ్ కంపెనీ ముందు వీటిని దిగుమతి చేసుకుందట. అప్పట్లో టీ ఖరీదు ప్రియం. కాఫీ మాదిరిగా గ్లాసుల్లో కాకుండా పొదుపుగా తాగడానికి ఈ కప్పు ఏర్పాటు అనే కధ కూడా ప్రచారంలో వుంది. వేడి ద్రవాన్ని సాసరులో పోసి వూదుకుంటూ తాగడానికి  సాసరు ఉపయోగిస్తున్నా దాని  పరమార్ధం మాత్రం వేడి కాఫీ/తేనీరు  వొంటి మీద వొలకకుండా, అలాగే   టేబుల్ మీద పరచిన వస్త్రం పై మరకలు పడకుండా చూడడానికి మాత్రమే.



ఖరీదయిన కప్పూ సాసర్లు సేకరించడం అనేది కలిగిన వారికి ఒక హాబీ. మేము మాస్కో నుంచి వచ్చినప్పుడు నీలి రంగు కాఫీ  సెట్లు కొన్ని పట్టుకొచ్చాము. మా ఇంటికి వచ్చిన ఓ పెద్దాయన వాటి ఖరీదు చెప్పేదాకా మాకు వాటి విలువ తెలియదు. అంతే! అవిప్పుడు మా ఇంటి డ్రాయింగు రూములో కొలువు తీరాయి. ఎవరయినా చూసి ‘ఓహో ఆహా’ అని అనడానికి తప్ప వాడడానికి వీలు లేని ‘అందమైన అపురూపమైన’ అలంకరణ సామగ్రిగా మారిపోయాయి.
(16-09-2013)



అనువాద వాదసంవాదాలు


అనువాద సమస్యలు వుండవచ్చు కాని అనువాదమే చదువరికి ఓ సమస్యగా మారకూడదు.
ఇటీవల కొందరు అనువాదం గురించి వెల్లడిస్తున్న అభిప్రాయాలు చదువుతున్నప్పుడు నేనూ కొన్ని భావాలను పంచుకోవాలని అనిపించింది.


కీర్తి శేషులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు లోగడ ’అనువాద సమస్యలు’ అనే పుస్తకం రాశారు. నేను పాతికేళ్ళ క్రితం మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసేటప్పుడు ఈ అనువాద సమస్యలు నాకూ ఎదురయ్యాయి. ఎందుకంటే ప్రతిరోజూ ఓ గంట వ్యవధికి సరిపోను రేడియో కార్యక్రమాలను తెలుగులో రూపొందించాల్సిన బాధ్యత నాపై వుండేది. రష్యన్ రేడియో అధికారులు కార్యక్రమాల మూలప్రతిని ఇంగ్లీష్ లో ఇచ్చేవారు. దాదాపు ఎనభయ్ కి పైగా  ప్రపంచ భాషలకు ప్రాతినిధ్యం  వహిస్తూ అక్కడ పనిచేసే మేమందరం వాటిని ఎవరి భాషలోకి వాళ్ళం  అనువాదం చేసుకుని రికార్డ్ చేసేవాళ్ళం. నాటి కమ్యూనిస్టు ప్రభుత్వం వారి భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కోసం ఈ ఏర్పాటు.  అందువల్ల కొన్ని కొరుకుడు పడని వాక్య నిర్మాణాలు, పదజాలాలు అక్కడ  పనిచేసే వాళ్లకు కాస్త ఇబ్బందికరంగా వుండేవి. ఈ నేపధ్యంలో మాస్కో ‘రాదుగ’  ప్రచురణ సంస్థలో పనిచేసే ఆర్వీయార్ గారు ( ఈ మధ్యనే ఆయన చనిపోయారు)  నాకు ఈ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ‘రారా’ గా ప్రసిద్ధులయిన రెడ్డి గారు రాసిన ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. అనువాద సమస్యలు అన్నింటికీ ఈ పుస్తకం పరిష్కారం చూపలేకపోవచ్చు కాని అనువాదాల పట్ల అనురక్తి వున్న ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం అని నా ఉద్దేశ్యం. విశాలాంద్ర ప్రచురణ సంస్థలో ఈ పుస్తకం దొరికే అవకాశం వుంది.
పోతే, అనువాదాలకు సంబంధించి సంస్మరించుకోవాల్సిన మరో మహనీయుడు ‘కలం కూలీ’ జీ.కృష్ణ గారు. అనువాదం చేసేటప్పుడు తెలుగులో ఆలోచించమని చెప్పేవారు. ఒక భాషలో వుండే పదాలు ఆయా ప్రాంతాల లేదా సంస్కృతుల ప్రాతిపదికగా ఆ భాషల్లోకి  చొరబడతాయి. మరో భాషలోకి అనువదించేటప్పుడు వాటి సమానార్ధక పదాలు లభ్యం కాకపోవచ్చు. అప్పుడు ఇంగ్లీష్ తెలియని పల్లెపట్టుల్లో ప్రజలు ఇలాటి భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఎటువంటి పదాలు వాడతారు అని కాసేపు ఆలోచిస్తే చక్కటి సమానార్ధకాలు దొరికితీరుతాయి. కాని మన అనువాద నిపుణులకు ఆ తీరిక వుండదు. వారికి అప్పటికప్పుడు తట్టిన పదాలను జనం మీద  ప్రయోగించి అవే ప్రామాణికం పొమ్మంటారు. అందువల్లనే అలాటి వాటి గురించి నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్తితి ఎదురవుతోంది. పిల్లి అంటే మార్జాలం అంటూ  సరిపెట్టుకోమంటున్నారు.
నెట్ ప్రపంచం ఆవిష్కరణ అనంతరం తెలుగు వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అనువాద సమస్యలు మరింత పెరిగే అవకాశం వుంది. వీటిని ఎదుర్కోలేక సమాధానపడితే, పుట్టతేనె వంటి  తియ్యటి తెనుగు  తన స్వరూపాన్నే కోల్పోయే ప్రమాదం వుంటుంది.

కాబట్టి, రాసేది  అనుసృజన అయినా అనువాదం అయినా తెలుగులో ఆలోచించి తెలుగులో రాయాలి. (16-09-2013)                     

15, సెప్టెంబర్ 2013, ఆదివారం

కోపం వచ్చినప్పుడు గొంతు యెందుకు పెరుగుతుంది?



గురువు గారు శిష్యులతో ముచ్చటిస్తున్నారు. పనిలో పనిగా జ్ఞానబోధ చేస్తున్నారు.
గురువు అడిగారు “ కోపం వచ్చినప్పుడు స్వరం యెందుకు పెరుగుతుంది? పక్కన వున్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా గొంతు పెంచాల్సిన అవసరం యేముంటుంది?”
శిష్యులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏం జవాబు చెప్పాలో తెలియక.
గురువుగారే చివరకు వివరించారు.
“ఇద్దరు వ్యక్తులకు ఒకరి మీద మరొకరికి పట్టరాని కోపం వచ్చినప్పుడు వారి హృదయాల నడుమ దూరం పెరుగుతుంది. ఆ దూరం కారణంగా  తాము చెప్పేది ఎదుటివాడికి వినబడదేమో అన్న అనుమానంతో  స్వరం పెంచుతారు. కోపం పెరిగిన కొద్దీ దూరం పెరుగుతుంది. దూరం పెరిగిన కొద్దీ మాటల్లో తీవ్రత పెరుగుతుంది”
గురువు గారు తాను చెప్పదలచుకున్నదాన్ని కొనసాగించారు. శిష్యులు మనసు పెట్టి వింటున్నారు.
“ఎప్పుడన్నా ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకునే తరహా గమనించారా! చాలా నెమ్మదిగా, మృదువుగా వారి సంభాషణ సాగుతుంది. ఎందుకంటే వారు మానసికంగా దగ్గరగా వుంటారు. అందువల్ల పెద్దగా అరిచినట్టు మాట్లాడుకోవాల్సిన అవసరం వారికి వుండదు.
“వారి నడుమ ప్రేమ మరింత బలపడిందనుకోండి. వారి నడుమ సాన్నిహిత్యం కూడా  మరింతగా పెరుగుతుంది. హృదయాలు మరింత దగ్గరవుతాయి. దాంతో వారి మధ్య మాటలు గుసగుసలాడుకున్నట్టుగా సాగుతాయి.
“అంటే  ఏమిటన్న మాట. కోపం లేకపోతే స్వరం పెరగదు. కోపం లేని వ్యక్తుల నడుమ సంభాషణ మాట్లాడుకున్నట్టుగా  వుంటుంది. పోట్లాడుకున్నట్టు వుండదు.
“వాదనలు చేసుకునేటప్పుడు దీన్ని మరింత గమనంలో పెట్టుకోవాలి. మీ మాటల్లో ప్రేమ తొణికిసలాడితే ఎదుటివాడి పలుకుల్లో కూడా పదును తగ్గుతుంది.
“వాదనల్లో వాడే పదాలతో హృదయాలను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడితే మీకు కోపం అనేదే రాదు. వచ్చినా ఎదుటి వ్యక్తిని శాశ్వితంగా దూరం చేసుకునేంతగా మీ  స్వరం పెరగదు”

గురువుగారు ఆనాటికి పాఠం ముగించారు. శిష్యులు తమ జీవితాలకు ఉపయోగపడే కొత్త పాఠం ఒకటి ఆనాడు  నేర్చుకున్నారు. (15-09-2013)