ఛానల్ నుంచి తిరిగివస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఫోను
చేసి మాట్లాడ్డం మామూలే. వెంటనే చేశాడంటే ఎవరో తెలిసిన వాళ్ళే. కాస్త వ్యవధానం
తీసుకుని చేశాడంటే నెంబరు కనుక్కుని మరీ చేశాడు కాబట్టి అందులో ఎంతో కొంత విషయం వుండే వుంటుంది. ఆ
అభిప్రాయాలను మామూలుగా తీసుకోకూడదు.
సంభాషణ మొదలయింది.
‘నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను.’
‘చెప్పండి’
‘మీరు ఈరోజు మాట్లాడింది నాకేమీ నచ్చలేదు’
‘ఏ విషయం గురించి’
‘ఇంకేం విషయం. సీమాంధ్ర ఆందోళన గురించి. మొన్నీమధ్య ఎక్కడో మీ
మాస్కో పుస్తకం చూసాను. కృష్ణా జిల్లా వాళ్లని అందులో రాసి వుంది. మరి యెందుకు వ్యతిరేకంగా
చెబుతున్నారు.’
‘అక్కడి ఆందోళనలు గురించి నేను తేలికచేసి చెప్పిన
సందర్భం లేదే’
‘ప్రజలను ఇబ్బంది పెట్టకూడదంటే ఏమిటి అర్ధం?’
‘దాంట్లో తప్పేముంది?’
‘తప్పుకాక మరేముంది?’
(సంభాషణ గాడి తప్పడం లేదు కదా!)
‘మీరెవరో నాకు తెలియదు. కానీ మీరంతట మీరు ఫోను
చేశారు. మనసు పెట్టి సావధానంగా వింటే నాలుగు మాటలు చెబుతాను. లేదా
తప్పించుకోవడానికి అని మీరు అనుకోకపోతే నేనే ఇంటికి పోయిన తరువాత ఈ నెంబరుకు ఫోను
చేస్తాను. సరేనా!’
‘సరే!’
మామూలుగా చెప్పాలంటే ఇవన్నీ మామూలే. స్టూడియోల్లో
కూర్చుని జవాబులు చెప్పేవాళ్ళు అడిగిన ప్రశ్నకు తగ్గట్టుగా చెబుదామనుకుంటారు. కానీ
ప్రోగాం చూసేవాళ్ళ దృష్టి వేరుగా వుంటుంది. అందుకే ఈ భావ సంఘర్షణ.
ఇంటికి వెళ్ళీ వెళ్ళగానే నెంబరు కలిపాను.
‘ఇప్పుడు చెప్పండి. కాదు అడగండి’ అన్నాను.
ఈసారి అవతల స్వరంలో రవంత ఆశ్చర్యం.
‘నేను చెప్పేది కాస్త సావధానంగా వినండి. ఆ తరువాత
అడగదలచుకున్నది అడగండి’ నేనే మొదలు పెట్టాను. ‘మాది కృష్ణా జిల్లా కదా ఇలా యెందుకు
మాట్లాడుతున్నారు అని అన్నారు. నేను పుట్టింది కృష్ణా జిల్లా అని ఆరున్నర దశాబ్దాల
క్రితం నేను పుట్టినప్పుడు నాకు తెలియదు. స్కూలు రికార్డుల్లో తప్ప పుట్టిన
ప్రాంతం యేది అన్న స్పృహ కాని అవసరం కానీ ఇంతవరకూ అవసరపడలేదు. నిజమే. మా వూరు
కృష్ణా జిల్లాలోని కంభంపాడు. రెండు మైళ్ల దూరంలో ఖమ్మం జిల్లా సరిహద్దు. రూపాయి
రైలు టిక్కెట్టు పెడితే ఖమ్మం వెళ్ళేవాళ్ళం. అదే కృష్ణా జిల్లా కేంద్రం బందరు మా
వూరికి చాలా దూరం. అంచేత చదువు సంధ్యలు,
పెళ్లి సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నీ దాపున వున్న ఖమ్మంలోనే. ఇలా వెళ్లడం భవిష్యత్తులో
ఓ తప్పు అవుతుందని అప్పుడు మాకు తెలియదు.
‘సరే! అసలు విషయానికి వద్దాము. తెలంగాణాలో సకల
జనుల సమ్మె జరిగినప్పుడు నేను ఛానళ్ళలో ఇలాగే వాదించేవాడిని. ప్రజాస్వామ్యం ఇచ్చిన
హక్కులు అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికీ వుండకూడదు అన్నది, ఎవరు కాదన్నా,
అది నా నిశ్చితాభిప్రాయం.
‘వెనుకటి రోజులు వేరు. ఇప్పుడు రోజులు
మారిపోయాయి. పిల్లల చదువులకు తలితండ్రులు
ఎంతో విలువ ఇస్తున్నారు. పరీక్షల రోజుల్లో పెళ్లీ పేరంటాళ్లకు
వెళ్లడం కూడా మానుకుంటున్నారు. కేబుల్ టీవీ కనెక్షన్లు తీసేయిస్తున్నారు. వేలకు
వేలు వాళ్ళ చదువులపై ఖర్చు పెడుతున్నారు. ఒక్కరోజు స్కూలుకు వెళ్ళలేని పరిస్తితి ఏర్పడ్డా
తల్లడిల్లిపోతున్నారు. యాభయ్ ఏళ్ళక్రితం
సంగతి వేరు. అందరివీ వానాకాలం చదువులు. చదువుకున్నవారికి ఇన్నిన్ని అవకాశాలు లేని రోజులు.
అలాగే ఉద్యోగాలు. ఒక్కరోజు వెళ్ళకపోయినా, గంట ఆలశ్యంగా వెళ్ళినా జీతంలో కోత.
ఆవిదంగానే అనారోగ్యాల బాధలు. మంచి ఆసుపత్రుల కోసం ఎంతెంతో దూరాలు. ట్రాఫిక్
కష్టాలు. వీటికి తోడు రాస్తారోఖోలు. అవతల ప్రాణాలమీదకు వస్తున్నా వినే నాధుడు వుండడు.
ఈ ఆందోళనలు అన్నీ చేస్తున్నది ప్రజలకోసమే
అని చెప్పేవాళ్ళు ఆ ప్రజలనే ఇబ్బందులపాలు చేస్తున్నారు అని చెప్పడం నేరమా! చెప్పండి.
ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డా, బస్సులు, ఆటోలు తిరక్కపోయినా, బడులు జరక్కపోయినా,
నష్టపోయేది ఎవరు? ఈ మొత్తం వ్యవహారానికి మెయిన్ స్విచ్ ఢిల్లీలో వుంటే ఇక్కడ
ఆందోళనలు చేసుకుంటూ మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకుంటూ వుంటే వొడ్డున కూర్చుని తమాషా
చూసేవాళ్ళు ఎలా దిగివస్తారు? అసలు ఇదేం లాజిక్? తెలంగాణలో సకల జనుల సమ్మె సమయంలో
ఇలా మాట్లాడితే వాళ్లకు కోపం వచ్చింది. ఇప్పుడు మీరు కోప్పడుతున్నారు.
‘ఇప్పుడు చెప్పండి నేను మాట్లాడిన దాంట్లో తప్పేమిటో? మీకు నచ్చనిది
ఏమిటో?’
అవతల నిశ్శబ్ధం.
కాసేపటి తరువాత మాట వినబడింది.
‘మీరు చెప్పినదంతా విన్నాను. మీతో మరోసారి
మాట్లాడుతాను.’
అంటే ఏమన్న మాట. ఆలోచన మొదలయిందన్న మాట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి