ఒక్కో
రోజు అలాగే. అనుకోకుండా ఈ రోజు ఓ మంచి ముక్క, మరో యోగ్యతాపత్రం. సంతోషించడానికి
ఇంకేం కావాలి. ఫేస్ బుక్ లో నేను రాసిన ఓ వ్యాసం పట్ల యండమూరి వీరేంద్ర నాథ్ గారి విశ్లేషనాత్మక
స్పందన ఒకటయితే (Yandamoori
Veerendranath this is what i wrote 10 years ago about
subsidies, in my book MINDPOWER. all this is for votes. hence even opposition
could not say 'no' to it. if possible read, our former Reservebank secretary's
remark, how this is going to ruin our country with this bill... how states
would suffer.)
సాయి గారి ఇంటింటి పత్రిక ‘రచన’ (సెప్టెంబర్
సంచిక) లో శ్రీ డి. వెంకట్రామయ్య గారి ప్రేమపూర్వక ప్రస్తావనలు.
చాలా వివరంగా రాసిన ఆయన వ్యాసాన్ని కాస్త
కుదిస్తే – (అంతా నా గురించే కాబట్టి యెంత కుదించినా కాస్త ఎక్కువే అనిపిస్తే
క్షమించాలి)
వెంకట్రామయ్యగారి ఉవాచ:
“హైదరాబాదు ఆకాశ వాణి వార్తావిభాగంలో మిగతా
అందరికంటే నాతొ ఎక్కువ కాలం పనిచేసిన సహోద్యోగి, మిగతా అందరి కంటే నాకు అత్యంత
ఆప్తుడు భండారు శ్రీని వాసరావు. 1975 లో ఆయన చేరినప్పటినుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు నలభయ్
ఏళ్ళు మా స్నేహం చెక్కుచెదరకుండా వుంది. ...ఎన్నో విషయాల్లో ఏ మాత్రం పోలికా
పొంతనా లేని మేమిద్దరం స్నేహితులుగా అన్నేళ్ళు అంత దగ్గరగా వుండడమే విచిత్రం.
“ఎప్పుడు నవ్వుతు, తుళ్ళుతూ గలగలా మాట్లాడుతూ
వుండడం, తన వాక్చాతుర్యంతో,చమత్కారాలతో, చలోక్తులతో, వ్యంగోక్తులతో చుట్టూ వున్నవాళ్లనందరినీ
కవ్విస్తూ నవ్విస్తూ వుండడం ఆయన సహజ లక్షణాలు. అసలీ మనిషి జీవితంలో ఎన్నడయినా విచారం విషాదంలాంటివేమైనా వుంటాయా, ఎప్పుడయినా ఏ
సందర్భంలో నయినా ఈయన సీరియస్ గా వుంటాడా అనిపిస్తుంది ఆయన్ని చూసిన వాళ్ళందరికీ.
“ న్యూస్ రూమ్ అంటేనే వాతావరణం ఎప్పుడు ఎంతో కొంత
ఉద్విగ్నంగా వుంటుంది. కాని శ్రీనివాసరావు అక్కడ వుంటే చాలు వేడి తగ్గిపోయేది. ఆయన
మాటలతో, చలోక్తులతో అందరూ కాసేపు హాయిగా నవ్వుకునే వారు. కాస్త విశ్రాంతి
దొరికినట్టుగా, వూరట లభించినట్టుగా అనిపించేది పనిచేసేవాళ్లకి.
“సరే! కొత్తగా వచ్చి చేరిన ఈ శ్రీనివాసరావు అనే
ఆయన అసలు స్వరూపం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన
పనితీరు యెలా వుంటుంది అని మొదట్లో అన్నీ సందేహాలే. ఇలాటివన్నీ
తెలుసుకోవడానికీ, ఆయన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికీ అధమ పక్షం ఆరు మాసాలు
పట్టింది. (పూర్తిగా అన్నమాట వాడకూడదేమో. ఎందుకంటే అప్పుడే కాదు.. ఇన్నేళ్ళ తరువాత
కూడా నా మిత్రుడు భండారు శ్రీనివాసరావు లీలలూ, మాటలూ నాకు పూర్తిగా అర్ధం కావు)
(భండారు శ్రీనివాసరావుతో డి.వెంకట్రామయ్యగారి అనుభవాలు
మరికొన్ని వచ్చే సంచికలో- ఎడిటర్)
04-09-2013
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి