అదొక సువిశాల భవన ప్రాంగణం.
సుదూరంగా కెమెరా కన్ను నుంచి చూస్తే అంతా
నిర్మానుష్యంగా వుంది. ఆ భవనం ప్రవేశ ద్వారం వద్ద ఓ వ్యక్తి వొంటరిగా నిలబడి
వున్నాడు. కనుచూపుమేరలో ఎవరూ లేరు. ఇంతలో
ఓ పొడవాటి నల్లటి మోటారు వాహనం అక్కడికి
చేరుకుంది. దానికీ వెనుకా ముందూ ఎలాటి వాహనాలు లేవు. అందులో నుంచి ముందుగా డ్రైవర్ దిగి వెనుక వైపు డోరు
తెరిచిపట్టుకున్నాడు. ఒకే వ్యక్తి ఆ కారునుంచి దిగాడు. కోటు బొత్తాములు సవరించుకుంటూ ముందుకు నడిచాడు.
అప్పటివరకు అక్కడ వొంటరిగా వేచివున్న వ్యక్తి రెండు అడుగులు ముందుకు వేసి
కారులోనుంచి దిగిన వ్యక్తితో ఆప్యాయంగా కరచాలనం చేశాడు. ఆదరంగా ఆహ్వానించి సాదరంగా
ద్వారం వైపు చేయి చూపించి ఇతర అతిధుల రాక కోసం
ఎదురు చూస్తూ అక్కడే నిలబడి పోయాడు. ఆ వచ్చిన వ్యక్తి కూడా ఎవరికోసం ఎదురు చూడకుండానే ఎవ్వరూ తోడు లేకుండానే వొంటరిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
(నిజంగానే ఇద్దరే ఇద్దరు)
చాలా దూరంనుంచి ఈ దృశ్యాన్ని
రికార్డ్ చేస్తున్న అనేక టెలివిజన్ కెమెరాలు దాన్ని ప్రపంచ వ్యాప్తంగా తమ చానళ్ళలో ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఎందుకంటే ఆ ఇద్దరూ
సామాన్యులు కారు. కారునుంచి దిగివచ్చిన వ్యక్తి ఈ ప్రపంచాన్ని తన కనుసన్నల్లో
ఆడిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఆయనకు స్వాగతం పలికిన వ్యక్తి రష్యా
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇదంతా యెందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీఐపీ భద్రత
పేరుతో ఎంతో హడావిడి చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందుల పాలుచేసే అనుభవాలకు అలవాటుపడిన ప్రాణాలకు ఈ రకమైన దృశ్యాలు నిజంగా
ఎంతగానో వూరట కలిగిస్తాయి. అలా అని వాళ్లు భద్రతా చర్యల పట్ల ప్రమత్తంగా వుంటున్నారని
కాదు. ఆధునిక సాంకేతిక పరికరాలను సమర్ధవంతంగా వుపయోగించుకుంటున్నారని వేరే
చెప్పనక్కరలేదు కూడా.
మన దేశంలో ఈ దృశ్యం మరోరకంగా కానవస్తుంది. ఒక స్థాయి కలిగిన నాయకులు కలుసుకున్నప్పుడు
సయితం కళ్ళు తిరిగే హడావిడి. మందీ మార్బలం, పుష్పగుచ్చాలతో సంసిద్ధంగా వుండే వ్యక్తిగత సిబ్బంది, ఏకే 47 వంటి తుపాకులు ధరించిన బ్లాక్ క్యాట్ బాడీ గార్డులు, ఎటుచూసినా
అడుగడుగునా సాయుధ పోలీసు అధికారులు. ఇక విదేశీ ప్రముఖులు వస్తే చెప్పనక్కరలేదు. భద్రత
పేరుతొ జనాలను కాల్చుకు తింటారు. చెప్పొచ్చేది ఏమిటంటే ఇలాటివాటిని చూసి
నేర్చుకునేది ఏమైనా వుంటుందా అన్నదే.
(సదస్సు ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు నిర్మానుష్యంగా వున్న భవనప్రాంగణం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి