కప్పూ సాసరు గురించి ఎమ్వీ అప్పారావు గారు ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు. వాటికి ఇది కొనసాగింపు.
కాఫీ కప్పు అంటామే కాని మూడు వందల ఏళ్ళ క్రితం దీన్ని తేనీరు సేవించడానికి వాడేవారు. చైనా నుంచి ఈస్ట్ ఇండియా ట్రేడింగ్ కంపెనీ ముందు వీటిని దిగుమతి చేసుకుందట. అప్పట్లో టీ ఖరీదు ప్రియం. కాఫీ మాదిరిగా గ్లాసుల్లో కాకుండా పొదుపుగా తాగడానికి ఈ కప్పు ఏర్పాటు అనే కధ కూడా ప్రచారంలో వుంది. వేడి ద్రవాన్ని సాసరులో పోసి వూదుకుంటూ తాగడానికి సాసరు ఉపయోగిస్తున్నా దాని పరమార్ధం మాత్రం వేడి కాఫీ/తేనీరు వొంటి మీద వొలకకుండా, అలాగే టేబుల్ మీద పరచిన వస్త్రం పై మరకలు పడకుండా చూడడానికి మాత్రమే.
ఖరీదయిన కప్పూ సాసర్లు సేకరించడం అనేది కలిగిన వారికి ఒక హాబీ. మేము మాస్కో నుంచి వచ్చినప్పుడు నీలి రంగు కాఫీ సెట్లు కొన్ని పట్టుకొచ్చాము. మా ఇంటికి వచ్చిన ఓ పెద్దాయన వాటి ఖరీదు చెప్పేదాకా మాకు వాటి విలువ తెలియదు. అంతే! అవిప్పుడు మా ఇంటి డ్రాయింగు రూములో కొలువు తీరాయి. ఎవరయినా చూసి ‘ఓహో ఆహా’ అని అనడానికి తప్ప వాడడానికి వీలు లేని ‘అందమైన అపురూపమైన’ అలంకరణ సామగ్రిగా మారిపోయాయి.
(16-09-2013)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి