(మాజీ డీజీపీ హెచ్.జె.దొర రాసిన ‘ఎన్టీఆర్
తో నేను’ అనే పుస్తకం నుంచి
కొన్ని భాగాలు)
“......ఎన్టీఆర్ కు అసలు దేవుడన్నా, పూజలన్నా
పెద్దగా నమ్మకం లేదు. ఆయన ఇంట్లో ఎప్పుడూ ఏ వ్రతం కానీ, పూజలు కానీ జరగ్గా నేను చూడలేదు. ఒక్క వేంకటేశ్వరస్వామి ఫోటో మినహా మరే
దేవుడి ఫోటో ఆయన ఇంట్లో కనిపించేది కాదు. తిరుమలకు తప్ప రాష్ట్రంలోని మరే ఇతర
దేవాలయానికి ఆయన వెళ్లగా చూడలేదు......
“.......పూజలు పునస్కారాల మీద పెద్దగా నమ్మకం లేకపోయినా,
ఎన్టీఆర్ జ్యోతిష్యాన్ని, వాస్తుని మాత్రం
బాగా నమ్మేవారు. ఎవరయినా జ్యోతిష్కుడు వచ్చి పలానా రాయి వున్న వుంగరం
పెట్టుకొమ్మని చెబితే దాన్ని తు చ తప్పకుండా పాటించేవారు. అలా ఆయన చేతి వేళ్లకి
ఏడెనిమిది ఉంగరాలు వచ్చి చేరాయి.......
“..... సినిమా షూటింగులకి బయట వూళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద
హోటళ్ళలో బస చేసేవారు కాదు. హైదరాబాదు వస్తే , సారధీ
స్టూడియోలో ఓ మూల చిన్న గదిలో సర్దుకునేవారు. చిన్నపాటి పరుపు, ఓ దిండు ఇస్తే చాలు, కింద వేసుకుని పడుకునేవారు.....
“.....ఎన్టీఆర్ కి బాగా దగ్గరగా మసలిన వ్యక్తి, బీవీ
మోహనరెడ్డి. ఒకసారి దైవ దర్శనం కోసం ఎన్టీఆర్- బీవీతో కలసి తిరుపతి వెళ్లి
వస్తున్నారు. వీళ్ళ కారు వెనకనే వస్తున్న వీఐపీ కారు ఒకటి సైరన్ చేసుకుంటూ ముందుకు
వెళ్లిపోయిందట. ఆ వీఐపీ కారుకు అటూ ఇటూ మరికొన్ని కార్లు. ఈ హంగామాను
ఎన్టీఆర్ ఆసక్తిగా గమనిస్తున్నప్పుడు, బీవీ కలగచేసుకుని ‘మీ కారు కూడా ఎనభైలో ఇలాగే సైరన్, పైలట్ హంగామాలతో
ముందుకు దూసుకుపోతుంది. ఇది తధ్యం' అని జోస్యం చెప్పారట........
“......రామారావుది మొదటి నుంచి ఒకటే ఫిలాసఫీ. ఏదయినా
వ్యాపారం అంటూ చేస్తే సొంత డబ్బు పెట్టాలి. ప్రభుత్వ రాయితీలు, ఉచిత స్థలాలు ఎందుకనే వారు. అక్కినేని నాగేశ్వరరావుకు స్టూడియో నిర్మాణానికి
(ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన స్తలంలో వేరే వ్యాపారాలు చేయడం ఎన్టీఆర్ కి నచ్చలేదు. ‘వారికి నోటీసులు పంపండి. ఏం పర్వాలేదు’ అని
ఆదేశాలిచ్చారాయన......
“.......తన సినీ జీవితం తొలినాళ్ళలో ఆత్మాభిమానం మెండుగా
వున్న ఈ నిండు మనిషి, ఒకసారి నడుచుకుంటూ షూటింగుకు వెళ్లడం
చూసి ఆ సినిమా నిర్మాత ఆయనకు ఒక కొత్త కారు కొని ఇంటికి పంపారట. ఆ రోజుల్లో కొత్త
కారు ఖరీదు పదిహేను వందల రూపాయలు. తరువాత తనకు డబ్బు సమకూరాక నందమూరి ఆ నిర్మాత
ఇంటికి వెళ్లి కారు డబ్బులు తిరిగి ఇచ్చేశారట......
".......ఎమ్జీఆర్ (అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం జీ
రామచంద్రన్ ) ఢిల్లీ వెళ్ళే సందర్భాలలో ఆయన విమానం హైదరాబాదులో నలభై అయిదు నిమిషాల
పాటు ఆగేది. ఎన్టీఆర్ టిఫిన్ క్యారియర్ పట్టుకుని
నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళ్ళేవారు. అక్కడ తన మద్రాసు మిత్రుడితో
కాసేపు ఆప్యాయంగా కబుర్లు చెప్పేవారు. ఇలా చాలా సార్లు జరిగింది."
1 కామెంట్:
డోర గారికి అయన చెన్నై విషయాలు బోత్త్హిగా తెలియకపోవడం వలన ఆ విధంగా రాసి ఉండవచ్చును..కాని యెన్టిఅర్ చెన్నై లో ఉన్న దినాల్లో భూతాల రాజు అనే వొక ప.గో జిల్లాకి చెందిన వ్యక్తి ఇంటికి వెళ్లి ప్రత్యెక పూజాలు ఆచరించడం నేను కళ్ళారా చాలా సార్లు చూచాను..ముఖ్యంగా ఇంకా అయన చెన్నై నుంచి ౫-ఏళ్ళలో వెళ్లి పోయే ముందు భూతాల రాజును చాలా ఎక్కువగా కలిసేవారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి