24, డిసెంబర్ 2012, సోమవారం

గెలుపెవరిది?


గెలుపెవరిది?



అనగనగా ఇద్దరు ........

తాతయ్య కధ చెప్పడం మొదలుపెట్టగానే చిన్నారి శంకరం అల్లరి మానేసి బుద్ధిగా వినడం మొదలెట్టాడు.

ఆ ఇద్దరిలో ఒకరికి  ముట్టె పొగరు జాస్తి. వాడికి  లేని అవలక్షణాలు లేవు. కోపం వస్తే వొళ్ళూ పై తెలియదు.పక్కవారు పచ్చగా వుంటే  కంట్లో నిప్పులు పోసుకుంటాడు. వాడి  అత్యాశకు అంతులేదు.  దురాశకు అవధులు లేవు. అన్నీ తనకే  కావాలనుకుంటాడు. పైగా, ఈ లక్షణాలకు తోడు  తనమీద తనకే ఎక్కడలేని  జాలి. భేషజానికేం  తక్కువలేదు. లేనిపోని  గొప్పలు చెప్పుకుంటూ తనో గొప్పవాడినని భ్రమ పడుతుంటాడు. పచ్చి అబద్దాలతో పబ్బం గడుపుకుంటాడు. పైపెచ్చు అహంకారం. ఎవర్నీ లెక్కచేయని తత్వం. తప్పు చేయడం అసలు  తప్పే కాదనుకునే మనిషి
మనుషుల్లో ఇలాటివాళ్ళు కూడా వుంటారా తాతయ్యా?’ అమాయకంగా అడిగాడు శంకరం.
మరో రకం కూడా వుంటారు.చెప్పసాగాడు తాతయ్య.
ఈ ఇద్దరిలో రెండోవాడున్నాడే వాడే ఈ రెండో రకం. వీడు మొదటివాడికి పూర్తిగా విరుద్ధం.
వీడేమో  అతి మంచివాడు. మంచంటే కామంచి కాదు. పుటం వేసిన బంగారం లాంటి మనిషి. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ వుంటాడు. ఎదటివారిని నవ్విస్తుంటాడు. పక్కవాడికి కాల్లో ముల్లు గుచ్చుకుంటే వీడికి కంట్లో నీరు తిరుగుతుంది. హాయిగా  హాయిని పంచి పెడుతూ ఎంతో  హాయిగా జీవించడం వీడి నుంచే నేర్చుకోవాలి. తనమీద తనకు యెనలేని విశ్వాసం. భవిష్యత్తు మీద ప్రగాఢమైన నమ్మకం.  ఉదార హృదయం. తన గురించి ఆలోచించకుండా అవసరంలో వున్నవాడికి సాయపడడం వీడి నైజం.
ఇలాటి వాళ్లు కూడా వుంటారా తాతయ్యా!మనవాడి సందేహం.
వుంటార్రా. అలాటివాళ్ళు వుండబట్టే మనందరం వుండగలుగుతున్నాం. అదిసరే. ముందు కధ విను.
ఈ ఇద్దరి నడుమా ఒకరోజు పోట్లాట వచ్చింది. అది చిలికి చిలికి గాలివానగా మారి భీషణ పోరాటంగా మారింది.
ఇద్దరిలో ఎవరు గెలిచారు తాతయ్యా?’ మనవడి ప్రశ్న.
తాతయ్య ఒక్క క్షణం ఆగి,
ఎవరు గెలుస్తారు? మనం ఎవరికి పాలుపోసి పెంచితే వాడిదే గెలుపు.
అంటూ తాతయ్య విలాసంగా నవ్వాడు.
(తనకు బాగా నచ్చిన చిన్న కధ అని కితాబు ఇస్తూ గూగుల్ ప్లస్ లో సుజాతగారు పోస్ట్ చేసిన ఆంగ్ల కధకు స్వేచ్చానువాదం – భండారు శ్రీనివాసరావు )

ఎండమావులు


ఎండమావులు






మండిపోయే ఎండ వేళల
మెండుగా భువి నిండి వుండే
ఎండమావులు ఎండమావులు

ఎండమావుల జలము కొరకై
మండుటెండల పిపాసార్తిని
నడిచిపోయే మూగజీవం

మూగజీవపు నిష్కళంకపు
మాంస భక్షణ కాంక్ష చేతను
వెంబడించే వేటకాడు

వేటకాడార్జించినట్టి
పాపకాంచన భార వివశత
వంగిపోయిన వింటిబద్ద

వింటిబద్ద విడాకులివ్వగ
మూగజీవిని ముద్దులాడగ
ఉరికివచ్చే ఉక్కుబాణం

ఉక్కుబాణము చేత చచ్చిన
మూగజీవపు ఎర్రనెత్తుట
తడిసిపోయిన ఎండమావులు
ఎండమావులు ఎండమావులు

-కీర్తిశేషులు భండారు పర్వతాలరావు: స్రవంతి: డిసెంబరు, 1955                 

23, డిసెంబర్ 2012, ఆదివారం

చూడకపోవడం నేరం!



చూడకపోవడం నేరం!





ఆదివారం. భోంచేసి ఓ కునుకు తీసేలోగా దివాకర్ నుంచి ఫోన్.
వీజేఎం దివాకర్ అనే నా జర్నలిస్ట్ స్నేహితుడు మంచి రాయసకాడు. అంతకు మించి మంచి అభిరుచి కలిగిన  కళా హృదయుడు.
‘అద్భుతం!
‘సుబ్బరాయశర్మ ఇంకా కొంతమంది మిత్రులతో కల్సి సినిమా చూసి బయటకు వస్తూనే, మనసు ఉగ్గబట్టుకోలేక ఫోన్ చేస్తున్నాను. రాత్రే సతీష్ కుమార్తె పెళ్ళిలో ఈ చిత్రం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూసి చెబుతున్నాను శ్రీనివాసరావు గారు ఇది  సెల్యూలాయిడ్ గీతం. మిధునం పుస్తకం అందరం చదివాం. అంతటి హృద్యమయిన ఇతివృత్తం తెరకెక్కించడం సాధ్యమయ్యే పనేనా అనికూడా అనుకున్నాం. అయితే   పుస్తకానికి కాని, దాని అభిమానులకి కాని  భరణి అన్యాయం చెయ్యలేదు. నేను చెబుతున్నాను రాసుకోండి. ఈ చిత్రం చూడకపోవడం నేరం’ అంటున్నాడు దివాకర్.
మిధునం చిత్రానికి టాగ్ లైన్ ‘మన అమ్మానాన్నల ప్రేమ కధ’ అని పెట్టారు.
‘మిధునం’ సినిమా చూడండి. బాగుంటే పదిమందికి చెప్పండి. నచ్చకపోతే వెయ్యి మందితో చెప్పండ’ని తనికెళ్ళ భరణి గారు ఓ టీవీ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పారు.
నిజానికి ఈ చిత్రానికి ఆ మాటే టాగ్ లైన్ గా పెడితే సరిపోయేదేమో భరణి గారు.   (23-12-2012)      

ఈ చీకటి గొందులలో.............


ఈ చీకటి గొందులలో.............




“పరరాజుల పాలనలో పతనమయిన సంస్కృతి నాది
ఉద్దరించాలి – పున
రుద్దరించాలి మళ్ళీ
నా జాతి పౌరుషము
అలల తలదన్ని చెలగాలి!
నా  జాతి! నా సంస్కృతి!! నా దేశం!!!”

“ఎవరు నాయనా నీవు?
ఈ చీకటి గొందులలో
ఎందులకీ తందనాలు?”

“అ హ్హ హ్హ ! బాగున్నది
తెలిస్తే ఒకవేళ నీకు
శుక వ్యాస వాల్మీకులు
కాళిదాసు భోజుడు
రాణాప్రతాపు  రాయలు
తెలుసుకో భారతీయుణ్ణి నేను!
తందనాలు ! అలాగే వుంటుంది నీకు
వందనాలు నను కదిలించకు...”

“పిచ్చివాడ బాధపడకు
హృదయమున్న కుర్రాడివి
వ్యధపడి వ్యర్దుడివి కాకు
నిన్నటి సూర్యోదయం
నేడు నీకు వెలుగివ్వదు
ప్రస్తుతమున పని గడవగ
ప్రయత్నించు ఒక జ్యోతి కొరకు”

“వద్దు నన్ను అడ్డవద్దు
ఆత్మను మధించి నేడే
ఆరని జ్యోతిని వెలిగిస్తా
నాకూ, నా జాతికి, దేశానికి
నవ్యోషస్సు సాధిస్తా”

“చీకటిలో పరుగులెత్తి
చెడిపోవుట నీకు వద్దు
దారిగనక పరుగులిడిన
చేరవు గమ్యానికెపుడు
గొలుసులతో కట్టి
ఏనుగులతో లాగింపదలప
పతనమయిన భారతీయ
సంస్కృతియన సముద్రమున
మునిగిన ఓడ కాదు నాయనా
కరిగిన ఉప్పు!
ఉద్రేకం పనికిరాదు
ఉత్సాహం ఉంటే చూపు”

“యెందుకు నను మళ్ళీ
వెనుకకు మళ్ళించెదరు?
పవిత్రమయిన నా సంస్కృతి
పునరుద్దరింపవలదా
నా తల్లికి దివ్యాభరణం
నా జాతికి గర్వకారణం
నా దేశపు సంజీవి ఇది
నా సంస్కృతి – నశింపనీయను
మన్నించి నను మళ్ళింపకుడీ!”

“కళలూ కావ్యాలూ దేశానికి
ఘనమయిన ఆభరణాలే!
ఎండే  డొక్కలతో చుట్టూ
ఏడుస్తుంటే పిల్లలు
చెప్పు నాయనా! మాత
సువర్ణాభరణాలు ధరియిస్తుందా!
చీకటి గొందులనెప్పుడు
అప్సరసలు నర్తించరు
ఆకలి డొక్కలలో  కళ
ఆనందం పొంగించదు
రా నాయనా రా ఈ గొందుల
గోడలపై తడుముకుంటు
ప్రయత్నించి సంపాదిద్దాం ఓ దివ్వెను
సఖ్యతతో బతుకుతున్న
సోదరులే బంగారం తల్లికి
కష్టజీవిని కని కన్నులు
కార్చే కన్నీరే సంస్కృతి
లే! వూగిసలాడకు ఇంకా
రా! నాయనా! రా!
-భండారు పర్వతాలరావు : తెలుగు స్వతంత్ర : జనవరి 6, 1956.                                         

22, డిసెంబర్ 2012, శనివారం

తెలుగు టీవీ విశ్లేషకుల తీరుతెన్నులు


తెలుగు టీవీ విశ్లేషకుల తీరుతెన్నులు

దాదాపు అన్ని తెలుగు టీవీ చానళ్ళు, దూరదర్శన్ సప్తగిరితో సహా ఉదయం  వేళల్లో  వార్తలు, వాటిపై వ్యాఖ్యలు వివిధ శీర్షికలతో ప్రసారం చేస్తున్నాయి. వీటిల్లో పాల్గొనే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయా పార్టీల అభిప్రాయాలనే బల్ల గుద్ది వాదిస్తుంటారు. పోతే విశ్లేషకులు  (నన్ను కూడా కలుపుకుని) వ్యక్తం చేసే  అభిప్రాయాలపై ఈ మధ్య ఒకాయన చేసిన వ్యాఖ్యానం సబబుగా అనిపించి అందరితో పంచుకోవాలని అనిపించింది. 
  


ఆయన అన్నది ఏమిటంటే-  
చర్చిస్తున్న అంశం –
కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ నడుమ అయితే వైయస్సార్ సీ పీ ని సమర్ధిస్తారు.
కాంగ్రెస్, టీడీపీ మధ్య అయితే కాంగ్రెస్ కొమ్ము కాస్తారు.
మళ్ళీ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిని సమర్ధించేవాళ్ళు పీసీసీ అధ్యక్షుడిని విమర్శిస్తారు. పీసీసీ అధినేతను సమర్ధించే వాళ్ళు  ముఖ్యమంత్రి తీరును తప్పుబడతారు.
చర్చనీయాంశం టీడీపీ, వైయస్సార్ సీపీ మధ్య అయితే టీడీపీ పల్లవి ఎత్తుకుంటారు.
టీడీపీ, టీ ఆర్ యస్ నడుమ అయితే టీ ఆర్ యస్ ను సమర్ధిస్తారు.
కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ల మధ్య అయితే వామపక్షాలను భుజానికెత్తుకుంటారు.
సీపీయం, సీపీఐ మధ్య వివాదమయితే సీపీయం కు మద్దతిస్తారు,
అంతేకాదు, పార్టీ పార్టీని బట్టి, చర్చలో పాల్గొంటున్న పార్టీల నాయకులను బట్టి, ఛానల్ ఛానల్ ను బట్టి కూడా విశ్లేషకుల తీరుతెన్నులు, హావభావాలు మారిపోతుంటాయి (ట).
(ప్రత్యక్ష ప్రసారాలు కాబట్టి, ఆ కారణంగా  ఎవరిదివారు గమనించి సరిదిద్దుకునే వీలు సాళ్ళు వుండవు కాబట్టీ తత్కారణం చూపి తప్పించుకోకుండా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడం ఉత్తమమేమో అని నాకనిపించింది.)

NOTE: Image credit goes to the CARTOONIST

21, డిసెంబర్ 2012, శుక్రవారం

కలలోని నిజం – భండారు పర్వతాలరావు



కలలోని నిజం – భండారు పర్వతాలరావు


కలల లోకంలో  


తలపుటలలు రేగి ఎదల
వలపు వగరు తెచ్చి నింపె
వలపు వగరు మేసి ఎదలు
కలమునందు కలల నొంపె

కలలు తొణకు కలము ప్రజకు
మధువు జిలుకు కవిత నంపె
మధువు జిలుకు కవిత పఠిత
మానసమున మత్తు నింపె

మత్తిల్లిన మానసంబు
మదపు మగత దోగి కునికె
మదపు మగత దోగి కునుకు
మానసమును కలలు కలచె

కలయందున వలపు లేదు
కలల తొణకు కలము లేదు
మధువు జిలుకు కవిత లేదు
మధువు వలన  మగత లేదు

వలపులేక  మధువు లేక
కలయందున నేమున్నది?
చర్మములో, బొమికెలలో
శవముకాని దొకటున్నది

కలలో కనిపించిన బొమి
కల గూటిని చూచి మనసు
కలవరపడి లేచి చూచె
‘కలయే నిజమంచు’ అరచె

కలలు కరిగె, వలపు విరిగె
మధువు తొలికె, మగత తొలగె
నిజం వీపు చరచి ముందు
నిలచి తానున్నానని పలికె! 
                
(విశాలాంధ్ర: ఫిబ్రవరి,1 - 1963)  

20, డిసెంబర్ 2012, గురువారం

శాంతి – భండారు పర్వతాలరావు


శాంతి – భండారు పర్వతాలరావు

మన కొంపలపై బాంబులు
మన పచ్చని పైరుల మంటలు
మన పల్లెల పరుల మిలట్రీ
మన చెల్లికి దుర్మార్గుల చెర
జాబిల్లికి విషవాయువు తెర

మానవ జీవితాల బ్రహ్మజెముడు ముళ్లు
మనిషికీ మనిషికీ మధ్య ఎందుకోయి ఈ గళ్ళు
వద్దు! ప్రళయాన్ని ప్రసవించగల పొరపాట్లు
వద్దు! విలయపుటంచుల వివేకపు కప్పదాట్లు



వద్దు వద్దు మనకీ యుద్ధం!
కావలసినదొకటే శాంతి
జగమంతయు వెలుగగ క్రాంతి!
(విశాలాంధ్ర: ఫిబ్రవరి, 1963)