20, డిసెంబర్ 2011, మంగళవారం

"ఎన్టీఆర్ తో నేను" -హెచ్.జె. దొర




"ఎన్టీఆర్ తో నేను" -హెచ్.జె. దొర 


( సీనియర్ ఐ పీ ఎస్ అధికారి, మాజీ డీజీపీ హెచ్.జె.దొర గారు ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పేరుతొ  
రాసిన పుస్తకంలో కొన్ని మచ్చుతునకలు.)




“....అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకుని తిరిగివచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు తప్పలేదు.
“....నాదెండ్ల భాస్కరరావు ఎవరో అప్పటిదాకా నాకు (దొరకు) తెలియదు.
“ ....తన వ్యక్తిగత విషయాలు గురించి సైతం ఎన్టీఆర్ నా దగ్గర ఓపెన్ అయ్యేవారు.
“....కొంతమంది ఎన్టీఆర్ దగ్గర (నా గురించి) ప్రస్తావించి ఇతను (దొర) ‘అవతల వ్యక్తి’ అని చెప్పినా కూడా ఆయన నన్ను వొదులుకోలేదు.
“....మా మామయ్య బొడ్డేపల్లి రాజగోపాల రావు ఏడు పర్యాయాలు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి (కాంగ్రెస్ అభ్యర్ధిగా) పోటీ చేసి ఎన్నికవుతూ వచ్చారు. మా ఇంట్లోనే కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు నడిచేవి. మా మామయ్యకు కుడి భుజంగా వుంటూ ఈ క్యాంప్ నడిపేది స్వయంగా నా తమ్ముడు, ఆయన అల్లుడు హెచ్.ఏ.దొర. చూపరులకు ఇదంతా ఆశ్చర్యంగా వుండేది.
“....దేశ రాజకీయాల్లో ఎప్పుడయితే రాజకీయ పార్టీలకు, వాటి సిద్ధాంతాలకు ప్రాముఖ్యం  తగ్గి వ్యక్తుల ప్రాధాన్యాలు పెరిగాయో, గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయో అప్పుడే (పోలీసు శాఖలో అంతర్భాగంగా వున్న) ఇంటెలిజెన్స్ వ్యవస్త అవసరాలు పెరిగాయి.
“.....ఎన్టీఆర్ ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్  మీదే డిపెండ్ అయ్యేవారు.
“....ఎన్టీఆర్ ఏజెన్సీ ప్రాంతాలలో (ముఖ్యమంత్రి హోదాలో)  టూర్ చేసేటప్పుడు .....అప్పుడు అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, ఖాళీగా వున్న ఇళ్ళల్లో కానీ (ఆయనకు) బస ఏర్పాటు చేసేవారు. (సీఎం పేషీకి చెందిన సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులు - రాఘవేంద్రరావు, టీ ఆర్ ప్రసాద్, బెనర్జీ లతో పాటు నేను (దొర) చాలా చిన్న గదుల్లో సరయిన వసతులు లేకపోయినా నైట్ హాల్ట్ చేసేవాళ్ళం.
“....ఆంధ్ర జ్యోతి అధినేత కే.ఎల్.ఎన్. ప్రసాద్ చనిపోయారని కబురందింది. ..వెళ్లి నివాళులు అర్పించాలని చంద్రబాబు అన్నారు. ‘ఏం! ఎందుకెళ్ళాలి? మేం వెళ్ళం!’ – ఇదీ ఎన్టీఆర్ సమాధానం.
“అక్టోబర్ 31,1984. ఉదయం పది గంటలు. యు.ఎన్.ఐ. విలేకరి నుంచి ఫోన్. ప్రధానమంత్రి  ఇందిరాగాంధీని ఎవరో షూట్ చేసారట....ఢిల్లీ యెలా వెళ్లాలనే దానిపై తర్జన భర్జన. ఆ రోజుల్లో హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి రెండే ఫ్లయిట్లు. నావల్ చీఫ్ హైదరాబాదులో వున్న సంగతి తెలుసుకుని ఆయన వచ్చిన ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను తీసుకుని ఢిల్లీ వెళ్ళాము. అప్పుడు హైదరాబాదులో వున్న మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా అదే విమానం ఎక్కారు.ఆ చిన్న విమానం, యావ్రో ఎయిర్ క్రాఫ్ట్, ఢిల్లీ చేరడానికి నాలుగు గంటలు పట్టింది.
“....  ఆగస్టు సంక్షోభం నుంచి ఎన్టీఆర్ కు తలనొప్పులు మొదలయ్యాయి. (సొంత) ఎమ్మెల్యేలు పలువురు ఇప్పుడు ఆయననుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారు. ఒకరకంగా బ్లాక్ మెయిల్. అందుకే ఆయన (ఎన్టీఆర్) శాసన సభను రద్దుచేసి తాజాగా ప్రజాతీర్పు కోరదామనుకుంటున్నారు.
“.....పెను తుపాను బాధితుల పరామర్శ కోసం మద్రాసు వచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీని రాజభవన్ లో ఎన్టీఆర్ కలసి మాట్లాడారు. ఆ చర్చల తరువాత ఉభయుల మధ్య రాజకీయ అవగాహన కుదిరినట్టు మాకు కొన్ని రోజులయ్యాక తెలిసింది. దీని పర్యవసానమే ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం.
“....రాజీవ్ గాంధీతో ఎన్టీఆర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీలోని ముగ్గురు ముఖ్యులు (పీవీ నరసింహారావు, శివశంకర్, జలగం వెంగళరావు) వీరిపై  తెలుగుదేశం పార్టీ గట్టి అభ్యర్ధులను పోటీకి పెట్టకూడదు.
“....పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలకు రమ్మని కాంగ్రెసేతర పార్టీలకు చెందిన జాతీయ నాయకులనుంచి ఎన్టీఆర్ పై ఒకటే వొత్తిళ్ళు. అయినా రాజీవ్ గాంధీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎన్టీఆర్ వెళ్ళలేదు. రామకృష్ణ హెగ్డే మాట కాదన లేక కర్నాటకలోని ఒక్క కోలార్ కు మాత్రమే వెళ్లారు. అలా వెళ్లినందుకు అప్పటికే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చేసింది – ఏమిటిదీ అని. అందుకు పార్టీ వివరణ ఇవ్వాల్సివచ్చింది.
“....ఎన్నికలకు ముందు ఒక అవగాహనకు వచ్చిన రాజీవ్, ఎన్టీఆర్ ఆ తరువాత ఆ సయోధ్యకు తిలోదకాలు ఇచ్చారు.
“....రాజీవ్ గాంధీ (రాష్ట్రాల) పర్యటనల్లో కొన్ని సాహసాలు చేస్తుండేవారు.ఒకసారి ఖమ్మం జిల్లా  వచ్చినప్పుడు భద్రాచలంలో దిగి ఒక జీపులో ఎక్కి అందరూ చూస్తుండగానే దాన్ని ముందుకు ఉరికించి అడవుల్లో మాయమయ్యారు.  ఎటు వెళ్ళారో తెలియక మాకు టెన్షన్ మొదలయింది........
“....మరోసారి విశాఖ ఎయిర్ పోర్ట్ లో జర్నలిష్టులతో గంటన్నర మాట్లాడుతూ వుండిపోయారు. ఇంతలో బాగా చీకటి పడింది. ఆయన ఫ్లయిట్ ఎక్కగానే మేం కూడా తిరిగొచ్చేశాము.  తర్వాత తెలిసిందేమిటంటే వాతావరణం అనుకూలించక ఫ్లయిట్ టేకాఫ్ కాలేదు. ప్రధాని ఆ రాత్రి నావల్ ఆఫీసర్స్ మెస్ లో విశ్రాంతి తీసుకుని మరునాడు ఢిల్లీ వెళ్ళిపోయారు........తన జీవితపు చివరి ప్రయాణం కూడా విశాఖ ఎయిర్ పోర్ట్  నుంచే సాగడం రాజీవ్ గాంధీకి సంబంధించి ఒక విషాదం. (మరికొన్ని విశేషాలు మరోసారి- భండారు శ్రీనివాసరావు, 20-12-2011)

19, డిసెంబర్ 2011, సోమవారం

భగవద్గీత మీద ప్రమాణం చేసి - భండారు శ్రీనివాసరావు


 భగవద్గీత మీద ప్రమాణం చేసి  - భండారు శ్రీనివాసరావు


ప్రపంచ అద్భుత సంఘటనల్లో ఒకదానిగా ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి అణు బాంబు పరీక్ష జరిగి ఇప్పటికి దాదాపు అరవై ఏడేళ్ళు గడిచాయి. న్యూ మెక్సికోలోని సోకొర్రోకు ఆగ్నేయంగా 35 మైళ్ల దూరంలో 1945 జులై 16 వ తేదీన  ‘ట్రినిటీ’ అనే గుప్త నామంతో అమెరికా అణు పరీక్ష జయప్రదంగా నిర్వహించింది. అప్పటినుంచి లోకంలో  అణు శకం మొదలయిందని చెప్పుకోవచ్చు.
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత కమ్యూనిజానికి కాలం చెల్లిన రష్యాలో వ్యాస విరచితమయిన ‘భగవద్గీత ‘ను నిషేధించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
అప్పట్లో అమెరికా జరిపిన అణు పరీక్షకూ, భగవద్గీతకూ సంబంధమేమిటన్న అనుమానం రావచ్చు.  దాన్ని నివృత్తి చేసుకోవాలంటే గతాన్ని కొంత నెమరు వేసుకోవాలి.
అమెరికా ఈ పరీక్షకు పెట్టిన పేరు ‘ట్రినిటీ’ అయితే పరీక్షించిన అణుబాంబు కు నిర్దేశించిన నామం ‘ది గాడ్జెట్’ . తొలి అణు పరీక్షను విజయవంతంగా  జరిపిన విజయోత్సాహంతో  అమెరికా కొద్ది వ్యవధిలోనే   రెండు అణు బాంబులను జపాను పై ప్రయోగించి అణు బాంబు శక్తిసామర్ధ్యాలను లోకానికి ఎత్తిచూపింది.
1945  ఆరోతేదీన తొలి బాంబు ప్రయోగం జపాను లోని హిరోషిమాపై జరిగింది. మరో మూడురోజులకే తొమ్మిదో తేదీన రెండో అణు బాంబును నాగాసాకీపై అమెరికా ప్రయోగించింది.
హిరోషిమాపై  జారవిడిచిన అణుబాంబు  గుప్తనామం ‘లిటిల్ బాయ్’  కాగా,  నాగాసాకీని మట్టుబెట్టిన  బాంబుకు పెట్టిన పేరు ‘ఫ్యాట్ మ్యాన్‘
నిజానికి హిరోషిమాపై  ప్రయోగించిన తొలి బాంబు  పరీక్ష చేసి ప్రయోగించినది కాదు. అయినా విజయవంతం అయింది. ఈ బాంబును  ముందుగా  పరీక్షిం చకపోవడానికి కూడా ఒక కారణం వుంది. ఒకే ఒక్క బాంబుకు కావాల్సిన  యురేనియం -235 నిల్వలు మాత్రమే అమెరికా వద్ద మిగిలివుండడంతో ఆ బాంబును  పరీక్షించడానికి వీలు లేకుండా పోయింది. పోతే నాగాసాకీపై ప్రయోగించిన బాంబు ట్రినిటీ మాదిరి తయారు చేసిన అణు  బాంబు.
ఈ రెండు బాంబులు కలసి సృష్టించిన మారణ హోమం ఇంతా అంతా కాదు. ప్రయోగించిన ఒకటి రెండు క్షణాల వ్యవధిలోనే లక్షా నలభై ఎనిమిది వేలమంది ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. ఆ  బాంబులు కలిగించిన అణు ధార్మిక ప్రభావం కారణంగా ఆ తరువాత అయిదేళ్ళలోమరణించిన వారి సంఖ్య  లక్షలకు చేరింది. దీన్నిబట్టి అణ్వస్త్రాల వల్ల అవనికి పొంచివున్న ముప్పు యెంతటిదో   అర్ధం చేసుకోవచ్చు.

తొలి అణు పరీక్ష 

పోతే, ట్రినిటీ పరీక్షకు అంతా సిద్ధం చేసుకున్న  అమెరికా శాస్త్రవేత్తలకు వర్షం రూపంలో తొలి అడ్డంకి ఎదురయింది. అణు విస్పోటన  పరీక్షకు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ముహూర్తం నిర్ణయించారు. కానీ వాతావరణం  ఉరుములు, మెరుపులు వర్షంతో అనుకూలించలేదు. ఆ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తే పరిణామాలు దారుణంగా వుంటాయని అధికారులు భావించి కొద్ది సేపు వాయిదా వేసారు. ప్రెసిడెంట్ ట్రూమన్ తో సహా అంతా  ఎదురు చూస్తున్న వాతావరణ నివేదిక ఉదయం నాలుగు గంటల నలభై అయిదు నిమిషాలకు శాస్త్రవేత్తలకు  అందింది. పరీక్షకు అధికార్లు పచ్చ జెండా  చూపారు.  సరిగ్గా 5-10 కి  20 నిమిషాల కౌంట్ డౌన్ మొదలయింది. అక్కడికి  16 మైళ్ల దూరంలో  నిర్మించిన  ఎత్తయిన టవర్ నుంచి  ఉన్నతాధికారులు  ప్రయోగ ప్రక్రియని  పరిశీలిస్తున్నారు. స్తానిక కాల మానం ప్రకారం ఉదయం అయిదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభై అయిదు సెకన్లకు మానవాళి  భవిష్యత్తును  ప్రశ్నార్ధకం చేస్తూ తొలి  అణు విస్పోటనం తన భీషణ రూపాన్ని ప్రదర్శిస్తూ లోక భీకరంగా ఆవిష్క్రుతమయింది.   పేలుడుకు  ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి.  క్షణంలో వందో వంతులో   20 కిలో టన్నుల టి.ఎం.టి. శక్తికి సరిసమానంయిన ‘ఎనర్జీ’ విడుదలయింది. ఒకటి రెండు క్షణాలపాటు ఆ ప్రదేశం,  చుట్టుపక్కల కొండలు పట్టపగలు వెలుతురును తలదన్నే విధంగా  వేయి సూర్యుల కాంతితో (దివి సూర్య సహస్రస్య – భగవద్గీత 11 వ అధ్యాయం 12 వ శ్లోకం ప్రధమ పాదం)  వెలిగిపోయాయి.  బాంబు పేలిన చోట పది అడుగుల లోటు  వంద అడుగుల వెడల్పు కలిగిన గొయ్యి   ఏర్పడింది.  ఆ ప్రదేశం యావత్తు నిప్పుల కొలిమిలా మారింది. నీలంనుంచి ఎరుపు, ఎరుపు  నుంచి పచ్చ, పచ్చ నుంచి తెలుపు -  ఇలా రకరకాలుగా రంగులు మారుతున్న దృశ్యాలు ఆకాశంలో దర్శనమిచ్చాయి. పెద్ద పుట్టగొడుగు మాదిరిగా  నల్లటి నలుపు రంగుతో మిశ్రితమయిన ఎర్రటి పొగ మేఘాలు  గగన తలంలో ఏడున్నర మైళ్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి.
ట్రినిటీ పరీక్ష డైరెక్టర్ కెన్నెత్ బ్రెయిన్ బ్రిడ్జ్  బాంబు పేలుడు సృష్టించిన ఉత్పాతానికి విభ్రమ చెందాడు. ప్రపంచ వినాశ నానికి దోహదం చేసే దారుణ  ప్రక్రియలో పాలుపంచుకున్న నిర్వేదం ఆయన తొలి పలుకుల్లో ధ్వనించింది. ‘చీ! జరగరానిది జరిగి పోయింది –‘Now we all sons of bitches’- అదీ ఆయన వ్యాఖ్య.
ట్రినిటీ పరీక్షకు సాక్షీభూతంగా నిలచిన మరో శాస్త్ర వేత్త , ఈ నాటి ఈ వ్యాసానికి ప్రేరకుడు అయిన జె.రాబర్ట్  ఓపెన్ హీమర్    (J.Robert Oppenheimer) ‘వేయి సూర్యుల కాంతి ‘ అన్న భగవద్గీత లోని సంస్కృతపాదం ఆధారంగా ఆనాటి దృశ్యాన్ని వర్ణించారు.   ఆ తరువాత  చాలా ఏళ్ళకు అణు పరీక్షను గురించి మాట్లాడుతూ మరో మాట చెప్పారు. ముందు అది ఎవరికీ అర్ధం కాలేదు  ఎందుకంటె అది సంస్కృతంలో వుంది.  భగవద్గీతలోని వాక్యం అది. ‘కాలోస్మి  లోకక్షయకృత్ ప్రవ్రుద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః’
("kālo'smi lokakṣayakṛtpravṛddho lokānsamāhartumiha pravṛttaḥ"  which he translated as "I am become Death, the destroyer of worlds)[
అంటే -
 ‘నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే సర్వంసహా శక్తిని’
ఇక మాస్కో  కోర్టు భగవద్గీత గురించి ఏ తీర్పు యెలా  ఇస్తే ఎవరికి కావాలి ?  (19-12-2011)

18, డిసెంబర్ 2011, ఆదివారం

మాయమై పోతున్నవమ్మా!


మాయమై పోతున్నవమ్మా!

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో  స్నేహితుడొకడిచ్చాడని చెప్పి మా పిల్లలు  ఓ తెలుగు సినిమా క్యాసెట్ ఇంటికి పట్టుకొచ్చారు. కాసెట్ అయితే వుంది కానీ దాన్ని టీవీ (నలుపు తెలుపు) తెరపై చూడడానికి వీడియో క్యాసెట్ ప్లేయర్ (వీ సీ పీ ) లేదు. నాడా దొరికిందని ఘోడా కోసం వెదికినట్టు చిక్కడపల్లిలో ఓ షాపునుంచి దాన్ని గంటకు ఇంత అని రెంటుకు  తీసుకొచ్చి ఇంట్లో  ఆ సినిమా చూసాం. ఆ తరువాత అందరి  ఇళ్ళల్లో వీసీపీలు వీసీఆర్ లు గృహప్రవేశం చేశాయనుకోండి. అది వేరే కధ.
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత - మా బావగారి డెబ్బయ్యేడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1995 లో తీసిన  వీడియో క్యాసెట్ చూడాలనిపిస్తే వీసీఆర్ అనే పరికరం ఇళ్లల్లోనే కాదు షాపుల్లో కూడా మాయమై పోయింది. ఒకప్పుడు వీసీఆర్ ఇంట్లో వుంటే  ఘనంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడా మాట చెబితే నమ్మేవాళ్ళు వుండరేమో. ఎందుకంటె ఈ నాటి పిల్లలకు ఆనాటి  వీడియో క్యాసెట్లు, వీడియో ప్లేయర్లు చూసివుండే అవకాశం లేదు కాబట్టి.
నిన్ననో మొన్ననో పేపర్లో ఓ వార్త చదివాను.
ఉత్తరాలు చదవడం దగ్గరనుంచి, టెలిఫోన్ డైరెక్టరీ  చూడడం వరకు అనేక పనుల అవసరం అందుబాటులోకి వచ్చిన  టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు జనాలకు లేకుండా పోయిందని ఓ సర్వే తేల్చిందట. ఇలాటివి దాదాపు  యాభయ్ దాకా వున్నాయని కూడా  ఆ సర్వే సారాంశం.
వెబ్ ప్రపంచం ఆవిష్క్రుతమైయిన దగ్గరనుంచి లోగడ ప్రజలు అలవాటు  పడిన అనేక పనుల  అవసరం నేటి  ప్రపంచంలో లేకుండాపోయింది. వెనుక ఏదయినా ఫోను నెంబరు కావాల్సివస్తే డైరెక్టరీ తో పనిపడేది. ఇప్పుడు వాటిని చూసేవారే లేరు. ఇంటర్ నెట్ వినియోగం  ఇంకా పూర్తిగా  వ్యాపించని కొన్ని దేశాల మాటేమో గాని ఇప్పుడు అనేకానేక దేశాల్లో ట్రావెల్ సంస్తల కార్యాలయాలకు వెళ్లి ప్రయాణాల టిక్కెట్లు కొనుక్కునే వారి సంఖ్య నామమాత్రం. పోస్ట్ కార్డులు, పబ్లిక్ టెలిఫోన్ బాక్సులు, ఫోటో ప్రింటింగ్, టెలిఫోన్ నెంబర్లను  గుర్తుగా రాసుకునే చిన్నిచిన్ని  పుస్తకాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి అని లండన్ కు చెందిన మొజి కంపెనీ చేసిన సర్వే తెలుపుతోంది. ఫిలిం షో టైమింగులు చెక్ చేసుకోవడానికి పేపర్లు తిరగేయడం కూడా బాగా తగ్గిపోతోంది.

మాయమై పోతున్న అంశాలు మననం చేసుకుంటున్నప్పుడు మిత్రులు ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు హరికధను గుర్తుచేశారు. అదేమిటో ఆయన మాటల్లోనే విందాం.
మనకు ఇష్టం లేని కబుర్లు ఎవరయినా  చెపుతుంటే ఈ హరికధలు చాల్లేవోయి అంటూ ఉంటాము.
కానీ హరికధలంటే బోరు కొట్టే కధలు మాత్రం కాదు.హరికధలు, ఒకానొక కాలంలో జనాలను కట్టిపడేసిన భక్తిరస ధునులు. ప్రజలను సమ్మోహితులను చేసిన శ్రవణానందకర ధ్వనులు.
చాన్నాళ్ళుగా ఈ ఛానళ్ళ ప్రోగ్రాములు చూసి చూసి విసుగెత్తి పోయినప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కాని భక్తీ ఛానల్ కాని చూడడం ఈ మధ్య తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోయింది. నిజంగా పెద్ద రిలీఫ్.  ఈ మధ్య ఎస్.వి.బి.సి. ఛానల్ లో ఉమామహేశ్వరీ గారి హరికథ చూసాను. ఎంతో బాగా చెప్పారు.మరపున పడుతున్న మధుర జ్ఞాపకాలను తమ హరికధా గానంతో తట్టిలేపారు.
"ఈ నాటి పిల్లలకు కాని ఇంకా చాలామంది  పెద్ద వాళ్ళకు కాని హరికథ అనే ప్రసిద్ధ కళా రూపం వొకటి వుందని కూడా తెలియదేమో అనిపించే రోజుల్లో జీవిస్తున్నాము.   హరికథ ఎంత గొప్పదో నాకు తెలుసు.  నేను కాలేజీ చదువు పూర్తయిన తరువాత కూడా హరికథ అంటే ఎంతో ఇష్ట పడే వాడిని.   ఎనభయ్యో దశకములో కూడా హరికథకు ఎంతో కొంత ప్రభావము వుండేది.
"యాభయ్, అరవై దశకాల్లో కూడా హరికథ ఎంతో  ఉచ్చ స్థితిలో వుండేది. దేవాలయాల ఉత్సవాలలో, వినాయక చవితి, దేవి నవరాత్రుళ్ళు, శ్రీరామ నవమి పందిళ్ళలో, పెద్ద స్థితిమంతుల ఇళ్ళల్లో జరిగే  శుభకార్యాలలో హరికథా కాలక్షేపాలు ఉండేవి.  మధ్య మధ్యలో వేసవికాలంలో  కూడా గ్రామస్తులు అంతా కలసి రామాయణమో, మహా భారతమో సీరియల్ గా చెప్పించుకొనే వారు.    సాంస్కృతిక కార్యక్రమాలు నెలనెలా  నిర్వహించే గాన సభల్లో కూడా ఏడాదికి వోసారి అయినా హరికకధ  పెట్టించే వారు.

హరికధ అనేది  సర్వ కళాసమాహారం.  హరికథ చెప్పే దాసు గారికి సాహిత్యం, సంగీతం క్షుణ్ణంగా వచ్చి తీరాలి. రామాయణ,భారత,భాగవతాదులు కరతలామలకంగా వుండాలి.  కొద్దో గొప్పో నాట్యం తెలిసి వుండాలి.  వీటన్నితో పాటు సమయస్పూర్తి, చతురత, రక్తి కట్టించే సామర్ధ్యం అవసరం. అభినయ కళ తెలిసివుండడం కూడా ముఖ్యం.  ఇన్ని వుంటేనే  దాసుగారికి బంతిపూల దండలు  దండిగా పడేది.  హరి కథలు చెప్పే దాసుగారిని భాగవతార్ అని పిల్చేవారు.  అమ్ముల విశ్వనాథ భాగవతార్ అలా.  హరికథకి వయోలిన్, మృదంగం పక్క వాయిద్యాలు.  దాసుగారు కుడిచేతిలో చిడతలు పట్టుకొని కీర్తనలు పాడేటప్పుడు తాళం వేస్తూ వుండే వారు. కాళ్ళకు గజ్జెలు.  దాసు గారి ఆహార్యం పట్టు పంచె, పట్టు ఉత్తరీయం, నుదుట సింధూరం. అన్నట్టు దాసుగారు తనతో ఎప్పుడూ తీసుకు వెళ్ళేది శ్రుతి బాక్స్.

కథా ప్రారంభంలో దాసుగారు పక్క వాయిద్యాల సమేతంగా వేదిక మీద కూర్చునే గణపతి ప్రార్ధనతో మొదలుపెట్టి తాను  ఏ కధ  చెప్పదలచుకొన్నారన్నది  సూచన ప్రాయంగా తెలియచేస్తూ  రెండు మూడు కీర్తనలు పాడే వారు. తర్వాత లేచి నిలబడి, గజ్జెలు కళ్ళకు అద్దుకొని, వాటిని  కాళ్ళకు కట్టుకొని, శ్రీమద్రమారమణ గోవిందా అని తానంటూ, సభికులందరి చేతా గట్టిగా అనిపిస్తూ  కథలోకి ఉపక్రమించే వారు.  కీర్తనలు ఆలపించేటప్పుడు పక్క వాయిద్యాల సహకారం తీసుకొనే  వారు. సందర్భోచితంగా నాట్యం చేస్తూ కథను రక్తి కట్టించే వారు. నిద్రలో జోగే శ్రోతలను మేలు కొలిపెందుకు మధ్యమధ్యలో గోవిందలు కొట్టించేవారు.  సినిమాలో కూడా హరికథలు పెట్టేవారు.  పది పదిహేను నిమిషాలు వుండేవి.  విజయా వారి షాహుకారు సినిమా హరికథ తోనే ప్రారంభం అవుతుంది.  నాగేశ్వరరావు కృష్ణకుమారి నటించిన కవితా వారి వాగ్దానం సినిమాలో రేలంగి హరిదాసుగా ఘంటసాల పాడిన  సీతా కల్యాణం చాలా మంది ఇష్టపడే మరపు రాని హరికథ.
హరికథ అంటే ఆది భట్ల నారాయణ దాసు గారి పేరే అందరికి గుర్తుకు వస్తుంది.  విజయనగరం సంస్థానం ఆస్థాన విద్వాంసులు ఆయన. ఫిడేలు  ద్వారం వెంకట స్వామి నాయుడు గారికి ముందు విజయనగరం సంగీత కళా శాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు కూడా. హరికధ  చెప్పే ప్రతివారు మేము నారాయణదాసు గారి శిష్యులమనో లేదా ఆయన కథలు చెపుతున్నామనో చెప్పుకొనేవారు.  ఇప్పటికి కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో నారాయణ దాసు గారి ఉత్సవాలు చేస్తూ వుంటారు.
ఆయన తర్వాత తరంలో నరసాపురం దీక్షిత్ దాసు గారు. మా అమ్మ గారు నారాయణ దాసు గారు దీక్షిత దాసు గారు ఇద్దరి కథలూ విన్నాను అని చెప్పారు.  నేను కూడా ఎందరో ప్రసిద్ధులయిన  విద్వాంసుల హరికథలు విన్నాను.  తోట్లవల్లూరులో మా నాన్నగారు రాయసం గంగన్న పంతులు గారు వేణు గోపాల  స్వామి దేవాలయం ఆఫీసర్ గా పనిచేసినప్పుడు  వైశాఖ పౌర్ణమి కల్యాణాలలోను,  శివాలయంలో శివరాత్రి, దసరా నవరత్రులలోను ఎంతో మంది పేరున్న వారు వచ్చి హరికథలు చెప్పే వారు. కూచిభొట్ల కోటేశ్వర రావు అనే ఆయన బక్క పలచగా పొడుగ్గా వుండేవారు.  భక్త పోతన హరికథ ఎంతో గొప్పగా చెప్పే వారు.  'లలిత సరస గాన కళానిధే' అంటూ ప్రార్ధన చేసేవారు.  లేచి నిల్చున్న  వెంటనే 'వాసుదేవ' అని కళ్యాణి రాగంలో త్యాగరాజ కీర్తన ఎంతో శ్రావ్యంగా పాడే వారు.  సందర్భానికి తగ్గట్టుగా  పిట్ట కథలు చెప్పే వారు. ఇరవయ్యేళ్ళ తర్వాత నేను బెజవాడ రేడియోలో పని చేస్తున్నప్పుడు కూడా వారిని కలిసే అవకాశం నాకు దక్కింది.  పోతన భాగవతాన్ని అమ్ముకోలేక ఎంత బాధ పడ్డాడో అందరికీ తెలిసిందే.  పోతన గారిలాగే  కూచిభొట్ల వారుకూడా తమకున్న అద్భుతమయిన హరికథా విద్యను  అమ్ముకోలేదు.  ఏమిస్తే అది పుచ్చుకొనే వారు. పేద వారయినా పెద్ద మనసు వున్నవారు.  మేము బెజవాడలో త్యాగరాజ సంగీత కళా సమితి అనే సంస్థను ప్రారంభిస్తే ఇంట్లో వున్న  వెండి త్యాగరాజు ఫోటో పట్టుకొచ్చి ఇచ్చి 'ఇదే మీ లోగో' అన్న గొప్ప హృదయం వున్నమనిషి ఆయన. ప్రాతఃస్మరణీయులు.




సొమ్ములు వాగ్దేవికి
సరసమ్ములు సంగీత సహజ సౌందర్య
విలాసమ్ములు, మధురమ్ములు, మా   
అమ్ముల తమ్ముల మనోహరాపముల్  –కరుణశ్రీ  



అమ్ముల విశ్వనాధం గారు మరో గొప్ప విద్వాంసులు.  చల్లపల్లి, అవని గడ్డ ప్రాంతం వారు.  స్ఫురద్రూపి. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులు.మండలి బుద్ధప్రసాద్ గారు ప్రచురించిన దివిసీమ రత్నాలలో అమ్ముల విశ్వనాధం గారి గురించి చాలా వివరంగా వుంది.  నారాయణదాసు గారి తర్వాత బహుశః శిలా విగ్రహం వేయించుకోగలిగిన గౌరవం పొందింది అమ్ముల వారే.  శివధనుర్భంగం కథ చాలా గొప్పగా చెప్పేవారు. నేను రేలంగి లో వున్నప్పుడు మావూళ్లో సుబ్రహ్మణ్య షష్టికి కధ చెప్పిన తరువాత మళ్ళీ వూళ్ళోవాళ్ళు పిలిపించి రామాయణం సీరియల్ గా వారం రోజులు చెప్పించారు.  ఆఖరి రోజున రామపట్టాభిషేకం నాడు దాసుగారిని ఘనంగా సత్కరించారు కూడా.అమ్ముల విశ్వనాధం గారి అమ్మాయి దుర్గాభవాని ప్రస్తుతం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది.
సీరియల్ హరికథల గురించి కొంత చెప్పాలి. పొలం పనులు అయిపోయి అందరు తీరిగ్గా వున్నప్పుడు సీరియల్ హరికథలు పెట్టించుకునేవారు.  గుళ్ళో కళ్యాణ మండపం స్టేజిగా రామాయణమో, భారతమో పూర్తిగా చెప్పించే వారు.  రాత్రి ఏడు ఎనిమిది మధ్య ప్రారంభమయిన కథ పన్నెండు గంటల దాకా సాగేది.  మధ్యలో హారతి పళ్ళెం పట్టే వారు.  హరికధ వినడానికి వచ్చిన  హారతి పళ్ళెంలో  తమకు తోచిన విధంగా అణా, అర్ధణా, బేడా, పావలా కాసులు వేసేవాళ్ళు.  పళ్ళెం మధ్యలో చిన్న కుంది పెట్టి వొత్తి వెలిగించి  దీపం పెట్టే వాళ్ళు.  చీకట్లో కొంతమంది అణా వేసి పావలా కొట్టేసేవారని జోకులు కూడా ఉండేవి. చిల్లర లేక పోతే హారతి పళ్ళెం పట్టే వాడిని అడిగి తీసుకునే వెసులుబాటు వుండేది. నా దగ్గర పావలా వుంది నేను వో అణా వెయ్యాలి మిగతాది ఇచ్చెయ్యిఅని అడిగి తీసుకునే వారు.
"వీరగంధం వెంకట సుబ్బారావు, రాజశేఖరుని లక్ష్మీపతి రావుర్యాలి రామచంద్ర రావు, కంచిభొట్ల వీర రాఘవయ్య, నౌడూరి విశ్వనాధ శాస్త్రి , కడలి వీరదాసు, ముదపాక మల్లేశ్వర రావు, ప్రగడ వీర భద్ర రావు, ముదునూరు శంకర్ రావు, ఎల్లమంద రావు, చోరగుడి పాండురంగరావు గార్లు హరికధలు చెప్పడంలో దిట్టలుగా పేరుతెచ్చుకున్నారు.  ములుకోట్ల సదాశివ శాస్త్రి గారు అని తెనాలి అనుకొంటా.  హైస్కూల్ లో తెలుగు మాష్టారు గా వుండే వారు. త్యాగరాజ చరిత్రను  రామ భక్తి అంతా జోడించి చెప్పే వారు.   1996  ప్రాంతంలో నేను హైదరాబాద్ రేడియోలో పని చేస్తున్నప్పుడు తెనాలి నుంచి వాళ్ళ తాలూకు వాళ్ళు ఫోన్ చేసి ఆయన మరణించారు అని చెప్పి ఆయన్ను గురించి వివరిస్తూ ఉంటే ఆయన గొప్ప తనం నాకు తెలుసండీ  అని వార్తల్లో విపులంగా చెప్పాము. వార్తలు విన్న తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి అంత బాధలో కూడా చాలా బాగా కవర్ చేసారు అని థాంక్స్ చెప్పాడు.  పాతూరి మధుసూదన్ రావు  గారు  మొత్తం సంస్కృతం లోనే హరికథ చెప్పే వారు. సంసృతం రాని వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా. ఇలా రాసుకొంటూపోతే  చాలా  వున్నాయి. రేడియోలో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు. ఏ కధ అయినా చెప్పేవారు. షెడ్యూల్ చేసిన ప్రోగ్రాం లేక పోతే ప్రయాగ వారి హరికథ వుండేది.  గాంధీ, నెహ్రు, బోస్  చరిత్రలు కూడా ఆయన హరికధలుగా  చెప్పే వారు.
తర్వాత తరం లో మనకందరికీ తెలుసున్న వ్యక్తి కోట సచ్చిదానంద  శాస్త్రి గారు.  చాలా రమణీయం గా హాస్యోక్తులతో ఎన్ని గంటలు విన్నాఇంకా ఇంకా  వినాలనిపించేలా చెప్పేవారు. ఇప్పటికి కూడా చెప్తున్నారు.  2005 లో నల్లకుంట శంకర్ మఠంలోదర్శనం మాస పత్రికతో కలసి వారం రోజుల పాటు  హరికథా ఉత్సవాలు నిర్వహించారు,  మా ప్రసార భారతి సి.యి.వో. కే.ఎస్. శర్మ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి.
బుర్రా  శివరామకృష్ణ శాస్త్రి కూడా మంచి కథకులు.  ఆడ వారిలో కూడా మంచి విద్వాంసులు వున్నారు. తెనాలి ఉమా చౌదరి భాగవతారిణి  కొన్నేళ్ళపాటు ఆంధ్రదేశం తో పాటు ఇతర రాష్ట్రాలోని తెలుగు వారికి సయితం  అభిమాన పాత్రులయ్యారు.  నగరాజకుమారి, వజ్రాల విజయ శ్రీ , మంత్రిప్రగడ లలిత కుమారి హరికథలు అంటే జనం  చెవి కోసుకొనే వారు.
రాజమండ్రి  దగ్గర కపిలేశ్వరపురం జమీందార్  సత్యనారాయణరావు గారు సర్వారాయ హరికథ గురు కులం ప్రారంభించి, హరికధలపట్ల ఆసక్తివున్న వారికి   అక్కడే వసతి కల్పించి రెండు మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేసారు.  ఇప్పుడు హరికథ చెపుతున్నవారిలో  చాలా మంది కపిలేశ్వరపురం  గురుకులం  విద్యార్ధులే - మొదట్లో ప్రస్తావించిన ఉమా మహేశ్వరితో సహా.  ఉమా మహేశ్వరి  చాలా చిన్నతనంలోనే సంసృతంలో హరికధ  చెప్పి అందరిని మెప్పించారు.  మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు కళా కృష్ణ గారిని వివాహం చేసుకొని ఈ  దంపతులిద్దరూ  వొకరు పేరిణి నాట్యం ద్వారా  మరొకరు హరికథ ద్వారా కళాసేవ  చేస్తున్నారు.
"ఆచార్య తూమాటి దోణప్ప గారు హరికధా సర్వస్వం అనే గ్రంధం రాశారు.  తెలుగు యూనివర్సిటీ వారు నిరుడు తమ రజితోత్సవాల సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పుస్తకాల్లో ఇది కూడా వుంది. ఇంకా అవి వున్నాయో లేదో  కూడా తెలియదు. హరికధను అభిమానించే వారంతా కొని  దాచుకోవాల్సిన పుస్తకం.

రేడియోలో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు గంట సేపు హరికథ వచ్చేది. రేడియో సంగీత సమ్మేళనం, నాటక సప్తాహం లాగా హరికథా సప్తాహం కూడా నిర్వహించే వాళ్ళు. హరిదాసులు అందరు వారి లెటర్ హెడ్స్ పైనా, కర పత్రాల పైనా రేడియో ఆర్టిస్టుఅని వేసుకొనే వారు.  ఇప్పుడు కూడా హరికథలు ప్రసారం చేస్తున్నారో లేదో వోసారి చెక్ చెయ్యాలి.  వస్తే చాలా సంతోషం. మానేస్తే  అంత కంటే అన్యాయం మరోటి వుండదు.  తోలుబొమ్మలాటలు పోయాయి. పౌరాణిక నాటకాలు మరచి పోతున్నారు. హరికథని అలా కానివ్వకూడదు.  తమిళనాడులో ఇంకా హరికధ  ఆదరణకు నోచుకుంటూనే వుందన్న సంగతి మరచిపోకూడదు.

గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కధా గాన కళా పరిషద్ ఏర్పాటు చేసింది. సంగీత,సాహిత్య, నాటక అకాడమీల్లాగానే అది కూడా కాలగర్భంలో కలసిపోయింది. అలాగే బుర్రకధలు. ఎన్నికలప్పుడే ప్రచారాలకోసం గుర్తుకొచ్చే విధంగా క్రమంగా మాయమయిపోతున్నాయి. (18-12-2011)
 










 














7, డిసెంబర్ 2011, బుధవారం

బెజవాడ అంటే ఇదా!


బెజవాడ అంటే ఇదా!



ఈ మధ్య విడుదలయిన ‘బెజవాడ’ తెలుగు సినిమా గురించి ఓ బెజవాడ అభిమాని ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని  ఆయన మాటల్లోనే -

“బెజవాడ సినిమా చూసారా. బెజవాడ అంత భయంకరంగా  ఉంటుందా. రోడ్లమీద
రవుడీలు అలా కత్తులు పట్టుకొని చంపుతామంటూ తిరుగుతారా?   నడిరోడ్లమీదే జనాలను అంత అమానుషంగా  రక్తసిక్త మయ్యేలా చంపేస్తారా?  బాబోయి!” 

“నేను సినిమాలు  చూడడం దాదాపు మానేశాననే చెప్పాలి.
ఎప్పుడేనా వో మంచి సినిమా వస్తే ఇంట్లో వాళ్ల  బలవంతం మీదా ఏడాదికి ఒక్కటో
రెండో చూస్తాను. అదీ హాయిగా నవ్వుకొనే సినిమా అయితేనే.
“ఇప్పుడు బెజవాడ పేరుతొ  సినిమా తీసారని తెలిసి ఆ సినిమా  మీద
రోజూ ఛానల్స్ లో వచ్చే చర్చలు అప్పుడప్పుడు చూస్తున్నాను, గోడలమీద వాల్ పోస్టర్లు, హోర్డింగులు
కూడా చూస్తూనే వున్నాను.  నిజంగానే భయంకరంగా వున్నాయి. వాటిని చూస్తుంటే  నా బెజవాడ ఇది కాదు అని గట్టిగా చెప్పాలనిపిస్తోంది.
"రెండు కులాల మద్య కక్షలు కార్పణ్యాలు, ఆ కులాలకు ప్రతినిధులని చెప్పుకొనే  వ్యక్తుల మధ్య రగిలే పగలు,సెగలు ఇవాళ  బెజవాడ అంటే. బహుశా దాన్ని  విజయవాడ అనాలేమో. బెజవాడ కాదేమో.
“నాకు తెలిసిన బెజవాడ, సినిమాలో చూపించిన  బెజవాడ మాత్రం  కాదు.
“నా బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు. సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు  పేరు.
 “అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ, కే.ఎల్.రావు, టి.వి.ఎస్. చలపతి రావు,
డాక్టర్ దక్షిణా మూర్తి, మరుపిళ్ళచిట్టి, కాకాని వెంకట రత్నం, కాకరపర్తి భావన్నారాయణ, ఖుద్దూస్, ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో ఆణి ముత్యాలు.. బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు.
“సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ,  మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీ కాంత రావు, వోలేటి వెంకటేశ్వర్లు, మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావు,  శ్రీరంగం గోపాల రత్నం బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు
“సాహిత్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పేరాల భారత శర్మ, చెరుకుపల్లి జమదగ్ని శర్మ  వంటి కవి పండిత శ్రేష్ఠులు,  పరిశ్రమలతో పాటు  ధార్మిక సంస్థలు నెలకొల్పిన  చుండూరు  వెంకటరెడ్డి, కౌతా పూర్ణానందం, మాగంటి సూర్యనారాయణ, జీ.ఎస్. రాజు, సినీ  రంగం ప్రముఖులు పోతిన శ్రీనివాసరావు, పూర్ణ మంగరాజు
కామరాజు, విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు, నవయుగ శ్రీనివాసరావు,
కాట్రగడ్డ నరసయ్య, తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల -   బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.
“ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు, తంగిరాల వీరరాఘవయ్య , చోడవరపు దేవల్రాజు, జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా, నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని   అద్దంకి
శ్రీరామమూర్తి, విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప,  బి.వి. రంగారావు, సూరవరపు వెంకటేశ్వర్లు, సూరిబాబు- రాజేశ్వరి,
కర్నాటి లక్ష్మినరసయ్య,  సీడీ  కృష్ణమూర్తి,   నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య, వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు,  ప్లీడర్లు కొండపల్లి రామచంద్ర రావు, చింతలపాటి
శివరామకృష్ణ, ముసునూరి వెంకటరామ శాస్త్రి,  చక్రవర్తి, పాటిబండ సుందరరావు, ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు, పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల
నాగేశ్వర రావు, కే.ఎల్.ఎన్. ప్రసాద్, నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రమణ్య శర్మ, కాట్రగడ్డ రాజగోపాలరావు, బొమ్మారెడ్డి,  ఏబీకె ప్రసాద్,   పీ.ఎస్. ప్రకాశరావు, అయిదుగురు ముఖ్యమంత్రులకు పీ.ఆర్.వో. గా పనిచేసిన భండారు పర్వతాలరావు -  వీరిదీ  బెజవాడ. బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే!
“ప్రభాకర ఉమామహేశ్వర పండితుల  ధార్మికోపన్యాసాలు, వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు, లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు తెన్నేటి  లత, కొమ్మూరి వేణుగోపాలరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీ రావు,  నవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు, నిమ్మగడ్డ వారి  ఎంవీకేఆర్ పబ్లిసిటీస్, దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే  నేషనల్ లితో ప్రింటర్స్ బెజవాడకు లాండ్ మార్కులు.

“టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి  లక్ష్మీ జనరల్ స్టోర్స్,  వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు  శ్రీ రామనవమి  పందిళ్ళు, రామకోటి సప్తాహాలు, నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే అదీ బెజవాడ.

తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్, తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం, డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్, కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి, సామారంగం చౌక్, చల్లపల్లి బంగ్లా,  బోడెమ్మ హోటల్,  న్యూ ఇండియా హోటల్ సెంటర్, ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు, అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్,  అలంకార్  సెంటర్,  మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, వీధి రాజయ్య మేడ, బందర్ రోడ్డు, పాత శివాలయం, కొత్త గుళ్ళు,  జెండా పంజా బస్ స్టాఫ్, అక్కడ గుమిగూడే  జనం ఇవీ బెజవాడ  అంటే.
“లీలా  మహల్ పక్కన పిడత కింద పప్పు, ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు  రోడ్డు  సెంటర్ అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్, మోడర్న్ కేఫ్ లో మినప దోసె,  దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం,  పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా, ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల  హల్వా,  రామచంద్రరావు హోటల్లో  అరటి ఆకు భోజనం. మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు,  కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలం,  సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది, వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల, నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల, సినిమా హాలా లేక  శిల్ప కళా క్షేత్రమా అనిపించే దుర్గా కళా మందిరం , మారుతి సినిమా,  జైహింద్ టాకీసు, లక్ష్మీ టాకీసు,  ఎప్పుడూ  హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్, పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్- ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే.
“రాఘవయ్య పార్క్, రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం,  దివ్యజ్ఞాన  సమాజం, అన్నదాన సమాజం, కాళేశ్వర రావు మార్కెట్, గాంధీ కొండ, పప్పుల మిల్లు, శరభయ్య గుళ్ళు, అరండల్ సత్రం, చెట్ల బజారు, గోరీల దొడ్డి, కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మ,  ప్రకాశం బరాజు, అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో  గోపికలతో  సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ, గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట, రేడియో స్టేషన్, నక్కలరోడ్డు, అచ్చమాంబ ఆసుపత్రి, అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి, మాంటిసోరి స్కూలు, బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ, మొగల్రాజపురం గుహలు, ఎస్.ఆర్.ఆర్. కాలేజి, లయోలా  కాలేజి, శాతవాహన కాలేజి, గాంధీజీ  మునిసిపల్ హైస్కూల్,  సి.వి.ఆర్. స్కూలు, ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే.

“అంతే కాని ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో  ఎందుకు చెప్పాలో  తెలియనివాళ్లు తీసిన ‘బెజవాడ’  సినిమా చూసి బెజవాడ ఇలా వుంటుందని అనుకునేవారికి ఇవన్నీ తెలియాలి.
“మా బెజవాడ చాలా గొప్పది.
“అరవ వాళ్లకి  మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది.”
(07-12-2011)
,













4, డిసెంబర్ 2011, ఆదివారం

ఏం చెప్పను? యేమని చెప్పను?



ఏం చెప్పను? యేమని చెప్పను


ఆ వృద్ధాశ్రమంలో పదేళ్లుగా పనిచేస్తూ ఇరవై లోనే అరవై ఏళ్ళు పైపడ్డ వాడిగా తయారయ్యాను.  ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నాను కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నవ్వు మొహంతో వున్నవారెవ్వరూ నాకు ఆ ఆశ్రమంలో తారస పడలేదు. ఎవరిని కదిలించినా కన్నీటి కధలే. అన్నీ వుండి  కూడా ఏమీ లేని వారి వ్యధలే.  తల్లీ తండ్రీ లేని అనాధను కనుక ఆ వృద్ధులు పడే  వేదనలు, ఆవేదనలు మొదట్లో నాకేమీ అర్ధం అయ్యేవి కావు. ఇక్కడ రూమ్ బాయ్ గా చేరినప్పటినుంచి వయసు మీద పడ్డ వారి బాధలేమిటో, వారి సమస్యలేమిటో కొద్ది కొద్దిగా అవగతం కావడం మొదలయింది
.
ఆశ్రమం అన్న మాటే కానీ వున్న దానికీ, తిన్న దానికీ అణా పైసలతో సహా వసూలు చేస్తారు. ఆ డబ్బులు కట్టడానికి వచ్చే వారి పిల్లల మొహాల్లో కూడా  ఏ ఒక్కనాడు నాకు సంతోషం అన్నది కానవచ్చేది కాదు. తలితండ్రుల్ని  అలా చూడాల్సి వచ్చినందుకు కాదు వారి  బాధ, కన్న వారి బాధ్యతలు ఇలా ఇంకా  ఎన్నాళ్ళు మోయాలో అన్నదే వారి అసహనానికి కారణం అని మెలమెల్లగా బోధపడుతూ వచ్చింది. ఈ నేపధ్యంలో - 

ఒక రోజు ఓ పెద్దాయన ఆశ్రమంలో చేరాడు. అతడొచ్చినప్పుడు నేనే డ్యూటీ లో వున్నాను. వయస్సు తొంభై అని  రిజిస్టర్లో వివరాలను బట్టి  తెలుసుకున్నాను. పైకి చూస్తే  అన్నేళ్ళ వాడిగా అనిపించలేదు. బోసినోరే అయినా అతడి నవ్వులో ఒకరకమైన ఆకర్షణ. చూడగానే లేచి నిలబడాలని అనిపించే పెద్దరికం.ఎలాటి దిగులూ దైన్యం కనిపించని ఆయన వదనం నాకు కొత్తగా, గమ్మత్తుగా  అనిపించింది.

మరోసారి వివరాలు చూసాను. పెద్ద ఉద్యోగం చేసాడు. పెద్ద పెద్ద హోదాలు అనుభవించాడు. భార్య ఏడాది  క్రితమే కన్ను మూసింది. లంకంత కొంపలో ఒకే ఒక్కడు. ఇద్దరు కొడుకులూ, ముగ్గురు అమ్మాయిలూ అందరూ కట్టుకున్నవాళ్ళతో, పుట్టిన సంతానంతో  కలసి విదేశాల్లో సెటిల్ అయ్యారు. వాళ్లు రమ్మంటారు. ఈయన పోనంటారు. తలచుకుంటే ఇంత కంటే మంచి సౌకర్యాలు వున్న ఓల్డ్  ఏజ్ హోంలో దర్జాగా చేరగల స్తోమత వున్నట్టే వుంది. దీన్నే ఎందుకు ఎంచుకున్నాడో తెలవదు.
ఆయన వుండబోయే గది ఎలావుంటుందో నాకు తెలుసు. ఆ గదిలో మొన్న మొన్నటి వరకు వున్న వృద్ధురాలు మొన్నీమధ్యనే  కాలం చేసింది.  చిన్న గది. ఓ మేజా. ఓ పక్కగా కిటికీ. దానికి వేలాడుతూ పాత కర్టెన్. దాన్నిమార్చండి బాబూ అని  పోరు పెడుతూనే ఆ వృద్ధురాలు ఏమారి పోయింది. తెలియని లోకాలకు తరలిపోయింది. ఎందుకయినా మంచిదని ఆయన వుండబోయే గది తీరుతెన్నులు గురించి ముందే చెవిలో వేసాను. బదులుగా ఆయన చిన్నగా  నవ్వాడు.

గది చూపించడానికి నేను ముందు నడిచాను. చేతి కర్రను ఊతంగా తీసుకుని ఆయన నా వెంట నడిచాడు.

గదిని చూసి ఆయన నిరాశ పడతాడనుకున్నాను. అదేమిటో విచిత్రం! పదేళ్ళ పిల్లాడు ఆటబొమ్మ చేతిలో పెడితే మురిసిపోయినట్టు ఆనందంగా  చుట్టూ చూస్తూ బాగుంది. నాకిది బాగా నచ్చింది అన్నాడు.                 
అర్ధం కానట్టు పెట్టిన నా మొహాన్ని, అందులోని భావాలను గమనించి ఆయన మెల్లగా చెప్పాడు.
గదిలో  ఫర్నిచర్ ఎలావుంది? ఫాన్ వుందా? ఏసీ వుందా? అన్న వాటిని బట్టి చూస్తే, నిజమే ఈ గది అంత బావోలేదు. ఇలాగే వుండాలని నేను వచ్చేముందు అనుకోలేదు. అందువల్లనే నాకు నచ్చింది. ఇలా వుండాలి అని ముందు  అనుకుని  అలా లేకపోతే తరువాత  మిగిలేది నైరాశ్యమే.

ముసలాళ్ళు ధోరణిలో పడితే యెలా మాట్లాడుతారో నాకు తెలుసు. అందుకే నేనేమీ కల్పించుకోకుండా మౌనంగా వుండి పోయాను.
కానీ ఆయన మాటలు కొనసాగించాడు. ముందు అంతగా పట్టించుకోకపోయినా ఆయన మాటల్లోని ఆకర్షణ శక్తి నన్ను కట్టిపడేసింది.
భార్య చనిపోయిన తరువాత కొన్నాళ్ళ పాటు ఈ లోకం  శూన్యం అనిపించింది. ఆవిడతో పాటే నేనూ పోయి వుంటే యెంత బాగుండేదో అనుకునే వాడిని. కానీ క్రమంగా మళ్ళీ నలుగురిలో  పడ్డాను. ఈ లోకానికి నేను చేయగలిగినదేమయినా వున్నదా అని ఆలోచించాను. పిల్లలు వాళ్ల మానాన  వాళ్లు స్తిరపడ్డారు. ఒక్కడికీ  అంత ఇల్లు అనవసరం అనిపించింది. చిన్న పిల్లలకు ఉచితంగా చదువు  చెప్పే ఓ సంస్తకు రాసిచ్చాను. అనాధ బాలలను పెంచి పోషించే మరో సంస్తకు వున్న డబ్బంతా ఇచ్చేసాను. సంపాదించిన దానికి సార్ధకత లభించింది. సంపాదన మళ్ళీ మొదలు పెట్టాలి. కాకపొతే అది డబ్బు కాదు. నలుగురితో మంచిగా వుండడడం, మంచి  అనిపించుకోవడం. నిజానికి ఇది డబ్బు సంపాదించడం కన్నా కష్టం.
చిన్నదో పెద్దదో ఆ మంచంలో పడుకుంటాను. నా వొంట్లో ఏ అవయవం సరిగ్గా పనిచేయడం లేదో, దానివల్ల  పడాల్సిన బాధలేమిటో ఆ మంచంలో పడుకుని ఆలోచిస్తాను.  పొద్దున్న లేచిన తరువాత  అవయవాలన్నీ సరిగ్గా వుంటే వాటిని అలా సక్రమంగా పనిచేయిస్తున్న ఆ సర్వేశ్వరుడికి ఓ దణ్ణం పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు కావాల్సింది నా ఆరోగ్యం. మరొకరికి భారంగా మార్చే అనారోగ్యాన్ని దూరంగా వుంచడం. ఇది నా  చేతిలో వుందనుకోను. అయినా మానవ ప్రయత్నం చేయాలి కదా.        
       
ప్రతి ఉదయం,  ప్రతి ఉషోదయం నాకు అదనంగా దేవుడిచ్చిన వరమనే భావిస్తాను. పొద్దున్నే  లేచి లోకాన్ని మళ్ళీ  చూడగలగడం కంటే ఈ వయస్సులో కావాల్సింది ఏముంటుంది? అలా వచ్చిన ఆ  కొత్త రోజుకు స్వాగతం చెబుతాను. నా జీవిత కాలంలో నాకు సొంతమయిన మధుర క్షణాలనన్నింటినీ  మరో సారి మననం చేసుకునే మహత్తర  అవకాశం దొరికిందని ఆనందిస్తాను.

వృద్ధాప్యం బ్యాంక్ ఎక్కౌంట్ లాంటిది. జీవన యానంలో సంపాదించి కూడబెట్టుకున్న దాన్ని  అందులో  డిపాజిట్ చేసుకోవచ్చు. జీవితం చరమాంకంలో తిరిగి తీసుకోవచ్చు. అది డబ్బే కానక్కర లేదు సుమా! నీవంటివారి నుంచి పొందే  వాత్సల్యం కూడా అలాటిదే.

ఈ రోజున ఇలా తారసపడి నీ ప్రేమాభిమానాలతో నా బ్యాంక్ ఖాతాను పెంచుతున్నావు. అంటే నేను తిరిగి తీసుకునే ఆనందాన్ని మరింతగా పెంచుతున్నావన్న మాట. అందుకు నేను నీకు సదా రుణపడివుంటాను.
ఆ వృద్ధుడి మాటలు వింటుంటే నాకు నోట మాట రాకుండా అయిపోయింది.
(04-12-2011)