5, మే 2011, గురువారం

సీఎం కిరణ్ - యధా రాజా తధా భాష - భండారు శ్రీనివాసరావు


సీఎం కిరణ్ - యధా రాజా తధా భాష

హైదరాబాదులో జనసమ్మర్ధం బాగావుండే ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య విగ్రహం కూడలిలో ఒక పెద్ద హోర్డింగ్ వద్దనుకున్నా కంట్లోపడి పలకరిస్తుంది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తనదయిన తెల్లని పైజామా లాల్చీ మార్కు దుస్తులు ధరించి కనబడుతుంటారు. ఇంతవరకు బాగానే వుంది. కాకపొతే ముఖ్యమంత్రి నిలువెత్తు చిత్రంతో పాటు కనబడే తెలుగు కవిత్వమే వెగటు కలిగించేదిగానేకాదు, అర్ధంపర్ధం లేకుండా కూడా వుంది. అంత్య ప్రాసలకోసం ఆరాటపడి రాసిన ఈ కవిత (?) ముఖ్యమంత్రి హోదాకు ఎంతమాత్రం అనుగుణంగా లేదని చెప్పడానికి ఈ నాలుగు పంక్తులు చదివితే చాలు.

“ప్రజా సంస్కరణల సారధి

అవినీతిజ్ఞుల విరోధి

------------------స్తిత ప్రజ్ఞతి

ఓ హైదరాబాదీ! ఇక నీవే మా బాదరబందీ!!”

బాదరబందీ అంటే అర్ధం తెలిసే ఇది రాసారా అని ఎవరయినా అనుకుంటే ఎవరిది తప్పు?

3, మే 2011, మంగళవారం

వై ఎస్ కుటుంబానికి తొలి పరాజయం ఎదురు కానున్నదా!- భండారు శ్రీనివాసరావు


వై ఎస్ కుటుంబానికి తొలి పరాజయం ఎదురు కానున్నదా!- భండారు శ్రీనివాసరావు

(03-05-2011 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)

కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి తొలి పరాజయం ఎదురు కానున్నదా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఎదురవుతోంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆ జిల్లాలో అప్రతిహత రాజకీయాలకు కేంద్ర బిందువుగా వుంటూ వస్తున్న వైఎస్ కుటుంబ సభ్యులలో ఒకరు ఓటమి పాలయ్యే స్తితిని కడప ఉపఎన్నికలు కల్పించాయి. పులివెందుల అసెంబ్లీకి జరుగనున్న ఉపఎన్నికలో వైఎస్ సతీమణి విజయమ్మతో వైఎస్ అనుంగు సోదరుడు వివేకానందరెడ్డే స్వయానా తలపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా వైఎస్ కుటుంబ సభ్యులలో ఒకరు ఓటమి పాలయినట్టే లెక్క.

ఇక, కడప పార్లమెంట్ స్తానానికి జరగనున్న ఉప ఎన్నికలో జగన్ గెలిస్తే, ఆ విజయంలో అతడు పడ్డ కష్టంతో పాటు ఇన్నాళ్లబట్టి వైఎస్ఆర్ గురించి కొందరు కాంగ్రెస్ నాయకులు పేలిన అవాకులు చెవాకులకు కూడా భాగం వుంటుంది. వైఎస్ మరణం తరువాత ఆయనకు రాజకీయవారసుడిగా ఎదగడానికి జగన్ చేసిన ప్రయత్నాలకు- అదేపనిగా వాళ్ళు చేస్తూ వస్తున్న విమర్శలు, ఆరోపణలు చాలావరకు తోడ్పడ్డాయని చెప్పవచ్చు. రాష్ట్ర రాజకీయాలలో బహుశా ఇంత త్వరితగతిన ఎదిగివచ్చిన యువనేత జగన్ ఒక్కరే. కాకపొతే ఆయనకు ఇంత స్తాయిలో ‘హీరోయిజం’ కట్టబెట్టిన ఘనత మాత్రం కాంగ్రెస్ వారిదే.

కడప ఉప ఎన్నికల ప్రచార సమరం మొదలయిన ఇన్నాళ్లకు కాంగ్రెస్ నాయకులకు బీజేపీ రూపంలో ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. మతతత్వ పార్టీతో జగన్ దోస్తీ కట్టకతప్పదంటూ వారు ప్రారంభించిన ప్రచారానికి జగనే స్వయంగా ఆజ్యం పోశాడు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తన తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నానంటూ – వీటికి వొప్పుకుంటే బెజీపీతో పొత్తుకు తనకు అభ్యంతరం వుండబోదన్న భావం ధ్వనించేలా చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది. జగన్ వ్యాఖ్యను సమర్ధించాల్సిన ఆత్మరక్షణలో వైఎస్ఆర్ పార్టీ పడిపోయింది. పెదవి దాటితే పృధివి దాటుతుందన్న సామెత చందంగా తయారయిన ఈ వ్యవహారం రాజకీయనాయకులందరికీ ఒక గుణపాఠం. అయితే, కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నట్టు కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో లక్షకు పైగా వున్న ముస్లిం మైనారిటీ ఓటర్లందరూ కట్టగట్టుకుని ఈ అంశంపై జగన్ పార్టీకి దూరమవుతారనుకోవడం కూడా వాస్తవం కాదు. ఎందుకంటె, బీజేపీని ఒక మతబూచిగా చూపిస్తూ మాట్లాడుతున్నవారిలో చాలామంది గతంలో ఆ పార్టీతో అంటకాగిన వారే కావడం ఒక కారణం.

దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా ప్రజాస్వామ్యం అంటే తెలియని ప్రజలు కడప జిల్లాలో వున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. వోటు హక్కు ఇంతవరకు వాడుకొననివారు, వాడుకోలేనివారు ఆ జిల్లాలో ఇప్పటికీ అనేకమంది వున్నారన్నది వారి అభిప్రాయం. ఏకపక్ష పోలింగ్ అంటే రిగ్గింగ్ జరిగే గ్రామాలు వందల సంఖ్యలో వున్నాయని లెక్కలు తీస్తున్నారు. అయితే ఇది ఈ ఉప ఎన్నికలకు మాత్రమే పరిమితమయినదన్నట్టుగా మాట్లాడం సరికాదు. ఎన్నోనాళ్ళుగా కడప జిల్లాలో ఎన్నికల సమయంలో వినవచ్చే మొదటి ఆరోపణ ఇదే. ఇది నిజమనుకుంటే దీనికి తప్పు పట్టాల్సింది అక్కడ పోటీ చేసే రాజకీయ పార్టీలను కాదు. రాజకీయ నాయకులనూ కాదు. మొదటి ముద్దాయి ఎన్నికల కమిషన్ అయితే – తరువాత వరుసలో పేర్కొనాల్సింది ఆయా సందర్భాలలో రాష్ట్రాన్ని పాలించిన లేదా పాలిస్తున్న ప్రభుత్వాలను.

ప్రస్తుతం పత్రికలు చదువుతున్న వారికీ, ఇరవై నాలుగ్గంటల టీవీ ప్రసారాలు చూస్తున్నవారికీ కడపలో జరగరానిదేదో జరిగిపోతున్నదన్న భావం కలుగుతోంది. వోటర్లను లోబరచుకోవడానికి కోట్ల కొద్దీ డబ్బు విచ్చలవిడిగా వెదజల్లుతున్నారనీ, మద్యం ఏరులై పారుతోందనీ, ఇంత ఖరీదయిన ఎన్నికలను దేశంలో మరెక్కడా చూడబోమనీ మీడియాలో అనుదినం అనేక కధనాలు దర్శనమిస్తున్నాయి. వీటికి తోడు ఈ రెండు నియోజకవర్గాలలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనీ, వోటు వెయ్యరన్న అనుమానం వున్నవారిపై పోలీసులతో వేల సంఖ్యలో బైండోవర్ కేసులు పెట్టిస్తున్నారనీ, గుప్పెడు వోట్లు రాబట్టగలరన్న ఆశ లేశమాత్రం వున్నాసరే అలాటి ఛోటానాయకులను గాలం వేసిపట్టి, భయపెట్టో, భ్రమపెట్టో - ఒక్క వోటు కూడా ప్రత్యర్ధి ఖాతాలోపడకుండా చూసుకుంటున్నారనీ – ఇలా అనేక రకాల సమాచారంతో జనం అయోమయానికి గురవుతున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడ్డ డబ్బే ఇంతవరకూ కోటి రూపాయలు దాటిపోయిందంటే ఎన్నికలు ముగిసేనాటికి ఇది ఏ లెక్కకు తేలుతుందో అంచనాలకు చిక్కడం లేదు. కరెన్సీ నోట్లు కట్టలు కట్టలుగా దొరికాయంటున్న వార్తలే కాని వాటి సొంతదారులెవరు, పంపిణీదారులెవరు అన్నది తేల్చిచేప్పే నాధులే కరువయ్యారు. పొరుగున వున్న కర్నాటక నుంచి డబ్బు ముందే పంపిణీ అయిందని కొందరు ఆరోపిస్తుంటే, ఇంతమంది మంత్రులు కట్టకట్టుకుని జిల్లాలో మకాం వేసిందే ఇందుకని వారి ప్రత్యర్ధులు అంటున్నారు. మొత్తం మీద డబ్బు ప్రభావం ఓటర్లపై ఎంత వుంటుందో తెలవదు కానీ వోట్లు కొనుగోలు చేయకపోతే తరువాత తీరిగ్గా విచారించాల్సివస్తుందేమోనని ఏ పార్టీ కూడా ఛాన్స్ తీసుకుంటున్న దాఖలాలు కనబడడం లేదు. ఇంత ఖరీదయిన ఎన్నిక ఇదే అంటూ ఈ పరిస్తితులను ఇలాగే కొనసాగనిస్తే ముందు ముందు ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది తమ బోటివారికి అందని మానిపండేనంటూ రాజకీయాల్లో తలపండినవాళ్ళు తలలు పట్టుకుంటున్నారు.

ఇంతకుపూర్వం జరిగిన ఎన్నికల సందర్భంగా మీడియాలో పురుడు పోసుకున్న పెయిడ్ న్యూస్ అనే వికృత శిశువు ఈ ఉపఎన్నికలనాటికి తన విశ్వరూపాన్ని మరింత విశృంఖలంగా ప్రదర్శిస్తోంది. పత్రికలు (సంచికలు) అమ్ముడుపోవడం కాదు ఏకంగా పత్రికలే అమ్ముడుపోయాయి అనే తీరులో ఈ పెయిడ్ న్యూస్ వ్యవహారం పత్రికారంగానికే మాయని మచ్చగా తయారవుతోంది. పత్రిక ప్రతులు బాగా అమ్ముడు పోతే మంచి సర్క్యులేషన్ వున్న పత్రికగా చెప్పుకునే రోజులు గత కాలపు ముచ్చటగా మారిపోయి, ఎవరికో ఒకరికి అమ్ముడుపోయిన పత్రికగా ముద్ర వేసుకునే దరిద్రపు కాలం దాపురించింది. దీనికి తోడు కొత్తగా ప్రవేశించిన ఎలెక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు కొన్ని రాజకీయ పార్టీ నాయకుల జేబు సంస్తలు కావడంతో - ఇప్పుడు ఏది పెయిడ్ న్యూస్? ఏది కాదు? అన్న ప్రశ్నకు జవాబు దొరకడం క్లిష్టంగా మారింది. తమిళనాడులో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా మీడియాకు రాజకీయాలకు నడుమ వుండాల్సిన విభజన రేఖ త్వరితగతిన అదృశ్యమవుతోంది. దానితో పెయిడ్ న్యూస్ అన్న పదానికి కొత్త నిర్వచనం ఇవ్వాల్సిన పరిస్తితి ఏర్పడింది. మిగిలిన అన్ని రంగాలలో మాదిరిగానే ఈ రంగంలో కూడా విలువలు తగ్గిపోతున్నాయని నలుగురూ అనుకునే విధంగా, పత్రికా స్వేచ్చ పట్ల పలచన భావం పెచ్చరిల్లేలా వాతావరణం రూపుదిద్దుకోవడం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన మీడియాకు ఎంతమాత్రం శోభనివ్వదు.

పోతే, ఎన్నికల కమిషన్ పాత్ర.

ఓటర్లందరూ స్వేచ్చగా ఓటు వేయడానికి వీలయిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఈ వ్యవస్తపై వుంది. దీనికి తగిన అధికారాలు రాజ్యాంగం కల్పించింది. వాటిని తుచ తప్పకుండా వినియోగించి ఎన్నికలు సక్రమంగా నిర్వహించగల సమగ్ర యంత్రాంగం రాష్ట్ర స్తాయి ఎన్నికల సంఘానికి లేదు. పరిమిత సిబ్బందితో, పరిమిత వ్యవధిలో అపరిమితమయిన బాధ్యతలను నిర్వర్తించాల్సిన గురుతర బాధ్యత ఎన్నికల ప్రధానాధికారిపై వుంటుంది. రాష్ట్ర కేడర్ కు చెందిన ఐ.ఏ.ఎస్. అధికారే ఎన్నికల సంఘానికి ప్రధానాధికారిగా వ్యవహరిస్తుంటారు. ఈ పదవిలో వున్నవారు తిరిగి ఏదో ఒక రోజు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేయాల్సి వుంటుంది. అందువల్ల వారిది ఒకరకంగా అసిధారావ్రతం అనే చెప్పాలి. వున్న స్వల్ప కాలంలో అనుమానాలకు తావు లేకుండా, నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్న మాట రాకుండా, నిబద్ధత ప్రశ్నార్ధకం కాకుండా వున్నంతలో బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేర్చాల్సివుంటుంది. కత్తిమీద సాములాటి కర్తవ్య నిర్వహణలో ఎంత జాగరూకత ప్రదర్శించినా ఎవరో ఒకరు అసంతృప్తికి గురయ్యే అవకాశాలే ఎక్కువ. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన గురించి ఆయా పార్టీలు చేసే ఫిర్యాదులపై సమగ్రంగా విచారించి నిర్ణయం తీసుకునే వ్యవధానం లేకపోవడంతో ఎన్నికల అధికారి కార్యాలయం ఏవో ఒకటి రెండు ముఖ్యమయిన విషయాలపై స్పందించి ఉనికిని కాపాడుకునే పరిస్తితిలో వుంది. శాశ్విత యంత్రాంగం లేని పరిస్థితుల్లో, అందుబాటులో వున్న అధికార వ్యవస్తపై ఆధారపడి పని చేయాల్సిన స్తితిలో, సాధారణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులు వివాదాస్పద అంశాలపై నిర్ణయాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వొదిలి పెడతారన్న అపవాదు వుంది. ఒక్కోసారి స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నా వాటిని అమలు చేయాల్సింది క్షేత్ర స్తాయి అధికారులు, సిబ్బంది కావడం వల్లా, వారిపై నియంత్రణ అధికారం పరిమితం కావడం వల్లా – ఆశించిన తీరులో ఫలితాలు రావడం లేదనే అభిప్రాయం వుంది. కొన్ని సందర్భాలలో దిగువ స్తాయి సిబ్బంది స్తానిక పరిస్థితులు, రాజకీయ వొత్తిళ్లకు అనుగుణంగా తీసుకునేచర్యలకు ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి వస్తోంది. చదిపరాళ్ల గ్రామంలో మల్లెల రామలక్ష్మమ్మ వంటి వయస్సు మళ్ళిన మహిళలపై కూడా పోలీసులు బైండోవర్ కేసులు పెడుతున్నట్టు ఫిర్యాదులు రావడం, స్పందించిన అధికారులు ఆ కేసులను ఉపసంహరించుకోవడం ఇందుకు ఉదాహరణ.

అనేకరకాలుగా తన ప్రత్యేకతలను చాటిచెబుతున్న ఈ కడప ఉపఎన్నికలలో ఎవరో ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడిపోతారు. అది గొప్ప విషయమేమీ కాదు. కానీ ప్రజాస్వామ్యానికి పునాది వంటి ఓటరు మాత్రం ఓడిపోకూడదు. ప్రజాస్వామ్యం పరిహాసానికి గురికాకూడదు. తాత్కాలిక ప్రయోజనాలకోసం శాశ్విత విలువలను తాకట్టు పెట్టకూడదు. రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల వేళ గుర్తుపెట్టుకోవాల్సిన కట్టుబాటు ఇది. (03-05--2011)

25, ఏప్రిల్ 2011, సోమవారం

జీవనస్రవంతి - భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి - భండారు శ్రీనివాసరావు



ఎటు ముందుకు? ఎటు వెనక్కు?


కోయంబత్తూర్ లో పార్ధసారధి అనే యువకుడికి ఈ మీమాంస ఓ పట్టాన తెమలకపోవడంతో ఇక వెనకా ముందూ చూడకుండా వెనకనుంచి ముందుకు, ముందు నుంచి వెనక్కు నడిచే ఓ అపూర్వ విద్యని ఆపోసన పట్టాడు. అతను ముక్కు సూటిగా పోగలడు. కావాలనుకుంటే వీపు సూటిగా కూడా నడవగలడు. ఇలాటి మెళకువలు నేర్చేసుకున్న తరవాత తీరి కూర్చోకుండా లేచి నడవడం మొదలు పెట్టాడు. ఎటుబడితే అటు నడవడంలో రికార్డులు బద్దలుకొట్టే పనిని ఓ పనిగా పెట్టుకున్నాడు. ఈ మధ్య పదిహేనురోజులపాటు విసుగూవిరామం లేకుండా అదేపనిగా నడుస్తూ పోయాడు. తరువాత ఇది పని కాదనుకుని 47 గంటల పాటు మొహం ముందుకు పెట్టి వెనక్కు నడిచాడు. మరోసారి గంటా పదిహేను నిమిషాలపాటు ముఖానికి అభిముఖంగా వెనక్కు పరిగెత్తాడు. ఇక అలా కాదనుకుని ఒంటికాలుమీద ముప్పయి గంటలు నిలబడ్డాడు. దేవతలు ప్రత్యక్షం కాలేదు కానీ, విలేఖరులు మాత్రం వెంటబడి ఆ నటరాజు నడకల తీరును పేపర్లకెక్కించారు. (22-10-1982 నాడు ఆకాశవాణిలో ప్రసారం)

24, ఏప్రిల్ 2011, ఆదివారం

మగవారికి మాత్రమే!

మగవారికి మాత్రమే!


చట్టానికి మనసుంది


“రెండో పెళ్లి చేసుకోవడానికి మగవారిని అనుమతించక పోవడానికి కారణం ?”

“ఎందుకంటే ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష విధించడానికి చట్టం ఒప్పుకోదు కాబట్టి.”


మార్గం



“చిరకాలం జీవించడానికి ఏదయినా మార్గం వుందా డాక్టర్?”

“పెళ్లి చేసుకుని చూడండి”

“పెళ్లాడితే ఎక్కువ కాలం జీవించడం సాధ్యపడుతుందంటారా డాక్టర్?”

“అల్లా అని కాదు. కాకపొతే ఒక్కసారి పెళ్లి చేసుకున్న తరువాత చిరకాలం జీవించాలనే కోరిక దానంతట అదే తగ్గిపోతుంది.”


కరచాలనం



“పెళ్లి సమయంలో వధూవరులులిద్దరు ఒకరి చేయి మరొకరు గట్టిగా పట్టుకుంటారెందుకు?”

“మల్లయుద్ధంలోకి దిగేముందు యోధులిద్దరూ కరచాలనం చేసుకోవడం మామూలే కదా ”


మౌనం



“ఏమండీ! ఇవాళ మన పెళ్లి రోజు. కొత్తరకంగా జరుపుకుంటే ఎలావుంటుందంటారు?”

“కరక్టుగా చెప్పావు. లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటిస్తే సరి”


లీల



“భగవంతుడి లీలలను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అందమయిన అమ్మాయిలను సృష్టించేది ఆయనే. మళ్ళీ వాళ్ళను భార్యలుగా మార్చేదీ ఆయనే.”


రాదే చెలీ ! నమ్మరాదే చెలీ!


పెళ్ళికి ముందు ప్రేమించుకునే రోజుల్లో తాను చెప్పేది తన్మయంగా వింటూ రాత్రంతా గడిపే మగవాడు - పెళ్ళయిన తరువాత తను మాట్లాడడం మొదలు పెట్టకముందే ఎందుకు గుర్రు పెడతాడన్నది ఇంతవరకు ఏ ఆడపిల్లకు అర్ధం కాని విషయం.

నగదు బదిలీ



ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా క్షణాల మీద నగదు బదిలీ చేయవచ్చు. అంతకంటే త్వరగా చేయాలంటే మాత్రం ఒకే ఒక మార్గం పెళ్లి చేసుకోవడం.

రుచి



చాకొలెట్ల రుచి చాకొలెట్లదే. ఆడ స్నేహితులు అలాటివాళ్ళే . ఎప్పుడు తిన్నాఅవి తియ్యగానే వుంటాయి.

ప్రేమికులు పిజ్జాల మాదిరి. తరచుగా తినాలనిపిస్తుంది. ఎప్పుడయినా అవి వేడివేడిగా, కారం కారంగా వుంటాయి.

ఇక భర్తలు మాత్రం, వేరే గతి లేదన్నప్పుడు తినే పప్పన్నం లాంటి వాళ్ళు.


నో ఛాన్స్ ప్లీజ్



దూర దేశంలో వున్న భర్తకు భార్య తాలూకు వాళ్ళనుంచి ఫోను వచ్చింది.

“మీ ఆవిడ చనిపోయింది. నువ్వు వచ్చేంతవరకు ఆగడానికి వీలుండదు. ఆమె శవాన్ని పూడ్చి పెట్టాలా లేక దహనం చేయాలా?”

“ముందు దహనం చేయండి. తరువాత ఆ బూడిదను గొయ్యితీసి పాతి పెట్టండి. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లోను ఎలాటి ఛాన్స్ తీసుకోవద్దు.”


కల్పితం



“మీ షాపులో ‘భార్యలను అదుపులో పెట్టడం ఎలా?' అనే  పుస్తకం వుందా?”

“కల్పితాలు, ఊహాగానాలతో రాసే పుస్తకాలు  అమ్మే విభాగం ఆ పక్కన వుంది. వెళ్లి కనుక్కోండి”


తధాస్తు దేవతలు



“నన్ను నమ్ము రాధా! నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నీ కోసం నరకానికి వెళ్ళ డాని కయినా సిద్ధమే.”

పైనున్న దేవతలు తధాస్తు అన్నారు. రాధను పెళ్ళాడిన తరువాత అతడి జీవితం నిజంగానే నరకంగా మారిపోయింది.

23, ఏప్రిల్ 2011, శనివారం

జీవన స్రవంతి - భండారు శ్రీనివాసరావు

జీవన స్రవంతి - భండారు శ్రీనివాసరావు



డిష్యుం డిష్యుం సినిమాలు చూసొచ్చిన చిన్న పిల్లలు ఇంటికొచ్చిన తరువాత కూడా తమాషాగా చేతులు వూపుతూ వుత్తుత్తి పోరాటాలు చెస్తూ వుండడం కద్దు. వాళ్ళలా మంచాలమీదా కుర్చీల మీదా గెంతుతూ తెలుగు సిన్మా పతాక సన్నివేశాలను సునాయాసంగా ప్రదర్శిస్తూ వుంటే – కొందరు తల్లులు సెన్సార్ వారి పాత్ర చేపట్టి వారిని అదుపు చేస్తుంటారు.

ఈ మధ్య పశ్చిమ బెంగాల్ లో ఒక శిశుకిశోరం హీరోలకు హీరోలా చెలరేగిపోయి పత్రికావార్తలకు ఎక్కాడు. ఆ అబ్బాయి పేరు దినేష్. తీరిక వేళల్లో ఎనిమిదో తరగతి చదువుతూ, తీరికచేసుకుని సినిమాలు చూస్తూ కాలం గడుపుతున్న రోజుల్లో ఒకనాడు వాళ్ల ఇంటిమీద బందిపోట్లు విరుచుకు పడ్డారు. ఆ సమయంలో పిచ్చాపాటీ వేస్తున్న దినేష్ తండ్రి గారూ ఆయన స్నేహితులూ బందిపోట్లను చూడగానే ఎక్కడ లేని బలాన్ని కాలి పిక్కల్లోకి తెచ్చుకుని కాళ్ళకు బుద్ధి చెప్పారు. పదమూడేళ్ళ దినేష్ మాత్రం – అంతకు ముందే చూసిన స్టంట్ సినిమా గుర్తుకుతెచ్చుకున్నవాడై, ఉత్తేజం తెచ్చుకున్నవాడై, గోడకు వేళ్ళాడుతున్న నాన్నగారి తుపాకీని దొరకపుచ్చుకుని ఫటాఫట్ మని కాల్పులు మొదలు పెట్టాడు. బుడతడి చేతిలో వున్నది బొమ్మ తుపాకీ అని ముందు భ్రమ పడిన బందిపోట్లు తమలో నలుగురు అప్పటికే కుప్పకూలిపోవడం గమనించి – ఆ చిచ్చర పిడుగు ధాటికి అబ్బురపడి ‘ఆహా’ అని మెచ్చుకోబోయి – పేలుతున్న తూటాలు తటాలున జ్ఞాపకం వచ్చి బతుకు జీవుడా అని కాళ్ళకు బుద్ధి చెప్పారు. (1982 ఆగష్టు లో ఆకాశవాణిలో ప్రసారితం)

జీవన స్రవంతి --భండారు శ్రీనివాసరావు

జీవన స్రవంతి --భండారు శ్రీనివాసరావు




ఇద్దరు ముద్దు – ముగ్గురు హద్దు – ఆపై వద్దు అనే నినాదం సంతానానికే కాదు సంసారం చేసే భార్యలకి కూడా వర్తించదంటున్నాడు ఓ థాయ్ లాండ్ పెద్దమనిషి. ఆయన ఇప్పటికే అయిదుగురు పెళ్ళాలను కట్టేసుకుని ఆరో భార్య కోసం ఆవురావురుమంటున్నాడు. పద్నాలుగుమంది పిల్లల తండ్రయ్యాక కూడా ఆయనగారికి ఇహ సుఖాలమీద మొహం మొత్తలేదు. ఆరో పెళ్ళికి రెడీ అంటూ ఈ మధ్య ఓ ప్రకటన చేసాడు. ఇలా ఎంతమందినయినా పెళ్ళాడడానికి ఆ దేశంలో ఎలాటి నిషేధాలు లేకపోవడంతో ఆయన గారిలాటి వాళ్లిలా నిత్య పెళ్లి కొడుకుల్లా వెలిగిపోతున్నారు. ఇంతమంది ఇల్లాళ్ళు ఇంటినిండా కంటి నిండుగా తిరుగుతున్నా ఆయన గారికి ఇంటి పోరు ఇసుమంతయినా లేకపోవడం నిజంగా అదృష్టం. ఆయన గారి ఇష్ట సఖులందరూ ఒక్క కడుపున పుట్టిన సొంత అక్క చెల్లెళ్ళ మాదిరిగా కలగలిసిపోయి ఒకే ఇంట్లో ఒకే మొగుడితో కలసి కాపురం చేస్తూ ‘కలసివుంటే కలదు సుఖం’ అన్న సామెతను నిజం చేస్తున్నారు. పంచ సతుల నడుమ వున్న అన్యోన్యం అలుసుగా తీసుకుని రెచ్చిపోయిన ఆ మొగుడు గారు ఆరో పెళ్ళికి సిద్ధం అయ్యాడు. కొత్తావిడ ఇంకా గడపలో కాలుపెట్టకముందే ఆ మగానుభావుడు తన మనసులోని కోర్కెను బయట పెట్టాడు. ఆరుగురితో ఆగననీ మరో పెళ్ళికి కూడా సిద్ధమనీ అంటున్నాడు. చూద్దాం! ఆరో ఆవిడ కూడా మిగిలిన సవతుల మాదిరిగా మొగుడితో రాజీ పడిపోతుందో లేక తిక్క మొగుడి  తలతిక్క కుదురుస్తుందో. (18-09-1980 నాడు రేడియోలో ప్రసారితం)

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

వోటు వేళ వేటు రాజకీయం – భండారు శ్రీనివాసరావు

వోటు వేళ వేటు రాజకీయం – భండారు శ్రీనివాసరావు


(22-04-2011 తేదీన సూర్య దినపత్రికలో ప్రచురితం)

అలనాడు కౌరవ సభలో ధర్మరాజు శకుని ఆడిన కపట ద్యూతంలో సమస్తం కోల్పోయి ఆఖరుకు పణంగా వొడ్డిన ఆలిని కూడా పోగొట్టుకున్న తరువాత అంతఃపురంలో వున్న ద్రౌపదిని నిండు కొలువుకు తీసుకురమ్మని దుర్యోధనుడు తన కింద పనిచేసే ప్రాతికామిని ఆదేశిస్తాడు. తనను కొనిపోవచ్చిన ప్రాతికామినిని ద్రౌపది ఒకే ఒక ప్రశ్న వేసి దానికి జవాబు తెమ్మని కోరుతుంది. జూదంలో ధర్మరాజు ముందుగా ‘తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా?’ అన్నది ద్రౌపది తెలుసుకోదలచిన ధర్మసూక్ష్మం. పైగా దీనికి సమాధానాన్ని ధర్మకోవిదుడయిన భీష్ముడి నుంచి రాబట్టాలనుకుంటుంది.

సరిగ్గా ఇప్పుడు అదే సందేహం ఆంధ్ర ప్రదేశ్ విధానసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముందు మరో రూపంలో నిలుచుంది. టీడీపీ సభ్యుడిగా రాజీనామా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఆ పార్టీ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలా లేక సభ్యుడు నేరుగా స్పీకర్ కు పంపిన రాజీనామాను ఆమోదించాలా అన్న ధర్మసంకటంతో ఆయన చాలాకాలంగా గుంజాటన పడుతున్నారు. ద్రౌపది మనసులో మెదిలినట్టుగా వీటిల్లో ఏది ముందు ఏది వెనుక అనే మీమాంస నుంచి బయటపడడానికి మనోహర్ ఎక్కువ సమయమే తీసుకుంటున్నట్టుంది. కాకపొతే, కడప ఉపఎన్నికల రూపంలో తరుముకొచ్చిన రాజకీయ వొత్తిళ్ల దృష్ట్యా ‘జగన్ అనుచర ఎమ్మెల్యేల’ విషయంలో తాడో పేడో తేల్చుకోవాల్సిన స్తితి దాపురించడంతో ఆయన హడావిడిగా న్యాయ నిపుణులను సంప్రదించి, అనర్హత వేటు వేసే విషయంలో ముందు టీడీపికి చెందిన ముగ్గురు సభ్యులకు సంజాయిషీ నోటీసులు పంపారు. ఈ సభ్యుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న తాపత్రయం కంటే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను కట్టడి చేయడం అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత కలిగిన అంశంగా మారిపోయింది. రాజాజ్ఞను ధిక్కరిస్తూ హరి భజన చేసే ప్రహ్లాదుడిపై బెత్తం ఎత్తలేని అసహాయ గురువులు చండామార్కులు - ఇతర రాక్షస విద్యార్ధులపై దండ ప్రయోగం చేస్తూ, వాటిని చూసయినా రాజకుమారుడు బెదిరిపోయి దారికి రాకపోతాడా అని ప్రయత్నించిన చందంగా – స్పీకర్ కార్యాలయంలో చాలాకాలంగా పెండింగ్ లో పడి వున్న ’అనర్హత’ పిర్యాదులను వెలికి తీసి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ తలపెట్టి ముందుగా సంబంధిత సభ్యులకు నోటీసులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తదనుగుణంగానే, అనర్హత వేటు వేయాలని కోరుతూ గతంలో తెలుగుదేశం పార్టీ పిర్యాదు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళాయి. లోగడ ఇదే మాదిరి నోటీసు అందుకున్న మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి తాజాగా ఇంకో నోటీసు ఇచ్చారు. అంతకుముందు అందుకున్న నోటీసుకు ప్రసన్న కుమార్ రెడ్డి సమాధానం ఇవ్వడం జరిగింది కానీ, ఆ తరవాత కూడా ఆయన సొంత పార్టీని లెక్క చేయకుండా ఢిల్లీ, విజయవాడలలో జరిగిన జగన్ కార్యక్రమాలకు హాజరయినందువల్ల పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు నిర్ధారణ అయినందువల్ల ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టీడీపీ, స్పీకర్ కు మరోసారి పిర్యాదు చేసిన నేపధ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా మనోహర్ నోటీసు పంపారు. దీనికి ఆయన ఇచ్చే సంజాయిషీ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ తలపోస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన ప్రజారాజ్యం పార్టీ అద్యక్షుడు చిరంజీవి కూడా జగన్ వెంట వెడుతున్న తమ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలపై సయితం చర్య తీసుకుని అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరాలని నిర్ణయించారు.

ఎన్నో నెలలుగా పెండింగులో వున్న అంశాలకు ఇంత ఆదరాబాదరాగా స్పీకర్ స్తానంలో వున్న డిప్యూటీ స్పీకర్ స్పందించడానికి కారణాలు వూహించడం కష్టమేమీకాదు. పేరుకు స్పీకర్ పదవి అన్నది రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సినదే అయినా ఆచరణలోకి వచ్చేసరికి అధికారంలో వున్న పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదు. పొరుగున వున్న కర్నాటకలో జరిగింది కూడా ఇదే.

కర్ణాటకను ఆదర్శంగా తీసుకుని అసమ్మతి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ పార్టీ పావులు కదపడం మొదలెట్టింది. ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, విప్ కొండ్రు మురళి హడావిడిగా అటు ముఖ్య మంత్రిని, డిప్యూటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను విడివిడిగా కల్సుకుని సంప్రదింపులు సాగించారు. వీటికి తోడు జగన్ వర్గానికి మద్దతు తెలుపుతున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టిని కలుసుకున్నట్టు వార్తలు వెలువడడంతో ఏదో జరగబోతున్నదన్న అనుమానాలు వెల్లువెత్తాయి. ‘ఏ క్షణంలోనయినా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం’ అంటూ టెలివిజన్ తెరలపై ఒక రోజల్లా స్క్రోలింగులు పరిగెత్తాయి. ఆయా పార్టీల ప్రతినిధులు, విశ్లేషకులు జరుగుతున్న పరిణామాలపై తమ తమ అభిప్రాయాలతో కొన్ని గంటలపాటు శ్రోతలను హోరెత్తించారు. తమపై వేటు వేసే తెగింపు కాంగ్రెస్ నాయకత్వానికి ఎక్కడిదన్న ధోరణిలో జగన్ మోహన్ రెడ్డికి తొలినుంచి బాహాటంగా బాసటగా నిలబడ్డ కొండా సురేఖ ఎద్దేవా చేశారు. అనర్హత వేటు వేస్తె దాని పరిణామాలు తీవ్రంగా వుంటాయని అంటూ ‘మరో ఆగస్టు సంక్షోభం’ గురించి ప్రస్తావన తెచ్చి ప్రభుత్వ పతనం తప్పదన్న తీరులో హెచ్చరికలు చేశారు. ఏతావాతా ఏమిజరిగిందో కానీ, కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చిన ‘ఆ క్షణం’ రాకుండానే ఇరవై నాలుగ్గంటలు లక్షణంగా గడిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీలోని ఈ విలక్షణ లక్షణం మరోమారు వెలుగు చూడడం మినహా జరిగిందేమీ లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తొలుత తీసుకున్న నిర్ణయం అమలును ఒకటి రెండు రోజులు వాయిదా వేసుకోవాలని ఆ పార్టీ తలపోస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయపరమయిన చిక్కులు ఎదురవకుండా జగన్ వెంట నడుస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతను ఆపాదించేందుకు వీలయిన అన్ని ఆధారాలను సిద్ధం చేసుకుని పకడ్బందీగా పిర్యాదు చేయాలన్నదే వాయిదాకు కారణంగా చెబుతున్నారు.ఒక్క పెట్టున అందరిపై వేటు వేయాలా లేక కొందరిపై ముందు చర్య తీసుకుని మిగిలినవారికి తద్వారా హెచ్చరికలు పంపాలా అన్న విషయంలో ఆ పార్టీ నాయకులకు ఇంకా స్పష్టత వచ్చినట్టులేదు. ఏ అడుగు వేస్తె ఏమవుతుందో, దాని ప్రభావం కడప ఎన్నికలపై ఏవిధంగా వుంటుందో అన్న గుంజాటనలో పార్టీ నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నట్టుగా వుంది. చివరకు తెముల్చుకుని పిర్యాదు చేసినా దానిపై చర్యకు ఎంతోకొంత కాలం పడుతుంది.

కాగా, కడప ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, జగన్ వోటమి అన్న ఒక్క లక్ష్యాన్నే పెట్టుకుని సర్వశక్తులు వొడ్డి పోరాడుతున్నట్టుగావుంది. సగానికి సగం మంత్రివర్గాన్ని కడపలో మోహరించి, గెలుపుకు ఉపయోగపడే ఏ చిన్న అవకాశాన్ని వొదిలిపెట్టరాదన్న ధ్యేయంతో పనిచేస్తున్నట్టుగా ప్రస్తుత వాతావరణం తెలుపుతోంది. అందుకే, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఒక అడుగు ముందుకు వేసి - జగన్ కు, భారతీయ జనతా పార్టీకి ముడిపెట్టి మాట్లాడే సరికొత్త వ్యూహానికి తెర లేపారు. దాన్ని అందిపుచ్చుకున్న పార్టీ నాయకులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ జగన్ పార్టీకి ముస్లిం వోటర్లను దూరం చేసే ప్రచారాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్ ను, ఆ పార్టీ అధినేత్రి సోనియాను అనుదినం విమర్శిస్తున్న జగన్ మోహన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో గెలిచి తిరిగి లోకసభలో అడుగు పెడితే ఆయన వేసే తొలి అడుగులు బీజేపీ వైపే అని తేల్చిచెప్పడం మొదలెట్టారు. సాధారణంగా ఇటువంటి వూహాజనిత అంశాలపై స్పందించాల్సిన అవసరం లేదని దాటవేసేవారు కూడా అధ్యతన భావిలో జగన్ పార్టీ బీజేపీ పంచన చేరుతుందని బల్ల గుద్ది చెబుతుండడం చూస్తే ఇది ఖచ్చితంగా కడప ఉప ఎన్నికలకోసం రూపొందించిన ఎత్తుగడగా అర్ధం అవుతుంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారానికి తగ్గట్టే మీడియాలో కూడా ఈ అంశంపై విస్తృత చర్చలు ప్రారంభమయ్యాయి.

అలాగే, తెలంగాణా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి వెల్లడించాలని వస్తున్న డిమాండ్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ప్రధాన పార్టీలే ఈ విషయంలో మీనమేషాలు లెక్కపెడుతున్నప్పుడు అప్పుడే పురుడు పోసుకున్న పార్టీ విధివిధానాలు ఏమిటన్న ప్రశ్న అర్ధరహితం.

ఈ ఎన్నికల సందర్భంగా వెలువడుతున్న అన్ని రకాల అభిప్రాయాలపై ప్రజలు తమ తీర్పును కొద్ది రోజుల్లో చెప్పబోతున్నారు. అది శాసన సభ్యుల అనర్హత విషయం కావచ్చు, అక్రమార్జనలతో సాగించే ఎన్నికల పోరాటాలు కావచ్చు, అవకాశవాద రాజకీయాలు కావచ్చు – అంశం ఏదయినా తుది తీర్పు ప్రజలదే. అంతిమ నిర్ణయం జనాలదే. వోటు వేసే వోటరుకే పాలకులపై వేటు వేసే హక్కు వుంటుంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు ఎవరయినా గుర్తుంచుకోవాల్సిన ప్రాధమిక పాఠం ఇది.

సాధారణంగా ఉపఎన్నికల్లో ఒకటి రెండు స్తానాలు గెలుచుకున్నా పోగొట్టుకున్నా పాలకపక్షానికి వచ్చేదీ పోయేదీ యేమీవుండదు. కానీ ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్న నేపధ్యం ఎంతో విలక్షణమయినది. అందుకే, దేశంలో మరో అయిదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీల ఎన్నికలు కూడా కడప ఉప ఎన్నికల ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించ లేకపోయాయి. జాతీయ మీడియా సైతం ఈ ఎన్నికలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కడప ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా జాతీయ స్తాయిలో సైతం ప్రభావితం చేసే అవకాశాలు వుండడమే దీనికి కారణం.(21-04-2011)