వై ఎస్ కుటుంబానికి తొలి పరాజయం ఎదురు కానున్నదా!- భండారు శ్రీనివాసరావు
(03-05-2011 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)
కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి తొలి పరాజయం ఎదురు కానున్నదా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఎదురవుతోంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆ జిల్లాలో అప్రతిహత రాజకీయాలకు కేంద్ర బిందువుగా వుంటూ వస్తున్న వైఎస్ కుటుంబ సభ్యులలో ఒకరు ఓటమి పాలయ్యే స్తితిని కడప ఉపఎన్నికలు కల్పించాయి. పులివెందుల అసెంబ్లీకి జరుగనున్న ఉపఎన్నికలో వైఎస్ సతీమణి విజయమ్మతో వైఎస్ అనుంగు సోదరుడు వివేకానందరెడ్డే స్వయానా తలపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా వైఎస్ కుటుంబ సభ్యులలో ఒకరు ఓటమి పాలయినట్టే లెక్క.
ఇక, కడప పార్లమెంట్ స్తానానికి జరగనున్న ఉప ఎన్నికలో జగన్ గెలిస్తే, ఆ విజయంలో అతడు పడ్డ కష్టంతో పాటు ఇన్నాళ్లబట్టి వైఎస్ఆర్ గురించి కొందరు కాంగ్రెస్ నాయకులు పేలిన అవాకులు చెవాకులకు కూడా భాగం వుంటుంది. వైఎస్ మరణం తరువాత ఆయనకు రాజకీయవారసుడిగా ఎదగడానికి జగన్ చేసిన ప్రయత్నాలకు- అదేపనిగా వాళ్ళు చేస్తూ వస్తున్న విమర్శలు, ఆరోపణలు చాలావరకు తోడ్పడ్డాయని చెప్పవచ్చు. రాష్ట్ర రాజకీయాలలో బహుశా ఇంత త్వరితగతిన ఎదిగివచ్చిన యువనేత జగన్ ఒక్కరే. కాకపొతే ఆయనకు ఇంత స్తాయిలో ‘హీరోయిజం’ కట్టబెట్టిన ఘనత మాత్రం కాంగ్రెస్ వారిదే.
కడప ఉప ఎన్నికల ప్రచార సమరం మొదలయిన ఇన్నాళ్లకు కాంగ్రెస్ నాయకులకు బీజేపీ రూపంలో ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. మతతత్వ పార్టీతో జగన్ దోస్తీ కట్టకతప్పదంటూ వారు ప్రారంభించిన ప్రచారానికి జగనే స్వయంగా ఆజ్యం పోశాడు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తన తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నానంటూ – వీటికి వొప్పుకుంటే బెజీపీతో పొత్తుకు తనకు అభ్యంతరం వుండబోదన్న భావం ధ్వనించేలా చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది. జగన్ వ్యాఖ్యను సమర్ధించాల్సిన ఆత్మరక్షణలో వైఎస్ఆర్ పార్టీ పడిపోయింది. పెదవి దాటితే పృధివి దాటుతుందన్న సామెత చందంగా తయారయిన ఈ వ్యవహారం రాజకీయనాయకులందరికీ ఒక గుణపాఠం. అయితే, కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నట్టు కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో లక్షకు పైగా వున్న ముస్లిం మైనారిటీ ఓటర్లందరూ కట్టగట్టుకుని ఈ అంశంపై జగన్ పార్టీకి దూరమవుతారనుకోవడం కూడా వాస్తవం కాదు. ఎందుకంటె, బీజేపీని ఒక మతబూచిగా చూపిస్తూ మాట్లాడుతున్నవారిలో చాలామంది గతంలో ఆ పార్టీతో అంటకాగిన వారే కావడం ఒక కారణం.
దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా ప్రజాస్వామ్యం అంటే తెలియని ప్రజలు కడప జిల్లాలో వున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. వోటు హక్కు ఇంతవరకు వాడుకొననివారు, వాడుకోలేనివారు ఆ జిల్లాలో ఇప్పటికీ అనేకమంది వున్నారన్నది వారి అభిప్రాయం. ఏకపక్ష పోలింగ్ అంటే రిగ్గింగ్ జరిగే గ్రామాలు వందల సంఖ్యలో వున్నాయని లెక్కలు తీస్తున్నారు. అయితే ఇది ఈ ఉప ఎన్నికలకు మాత్రమే పరిమితమయినదన్నట్టుగా మాట్లాడం సరికాదు. ఎన్నోనాళ్ళుగా కడప జిల్లాలో ఎన్నికల సమయంలో వినవచ్చే మొదటి ఆరోపణ ఇదే. ఇది నిజమనుకుంటే దీనికి తప్పు పట్టాల్సింది అక్కడ పోటీ చేసే రాజకీయ పార్టీలను కాదు. రాజకీయ నాయకులనూ కాదు. మొదటి ముద్దాయి ఎన్నికల కమిషన్ అయితే – తరువాత వరుసలో పేర్కొనాల్సింది ఆయా సందర్భాలలో రాష్ట్రాన్ని పాలించిన లేదా పాలిస్తున్న ప్రభుత్వాలను.
ప్రస్తుతం పత్రికలు చదువుతున్న వారికీ, ఇరవై నాలుగ్గంటల టీవీ ప్రసారాలు చూస్తున్నవారికీ కడపలో జరగరానిదేదో జరిగిపోతున్నదన్న భావం కలుగుతోంది. వోటర్లను లోబరచుకోవడానికి కోట్ల కొద్దీ డబ్బు విచ్చలవిడిగా వెదజల్లుతున్నారనీ, మద్యం ఏరులై పారుతోందనీ, ఇంత ఖరీదయిన ఎన్నికలను దేశంలో మరెక్కడా చూడబోమనీ మీడియాలో అనుదినం అనేక కధనాలు దర్శనమిస్తున్నాయి. వీటికి తోడు ఈ రెండు నియోజకవర్గాలలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనీ, వోటు వెయ్యరన్న అనుమానం వున్నవారిపై పోలీసులతో వేల సంఖ్యలో బైండోవర్ కేసులు పెట్టిస్తున్నారనీ, గుప్పెడు వోట్లు రాబట్టగలరన్న ఆశ లేశమాత్రం వున్నాసరే అలాటి ఛోటానాయకులను గాలం వేసిపట్టి, భయపెట్టో, భ్రమపెట్టో - ఒక్క వోటు కూడా ప్రత్యర్ధి ఖాతాలోపడకుండా చూసుకుంటున్నారనీ – ఇలా అనేక రకాల సమాచారంతో జనం అయోమయానికి గురవుతున్నారు.
ఈ ఉప ఎన్నికల్లో అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడ్డ డబ్బే ఇంతవరకూ కోటి రూపాయలు దాటిపోయిందంటే ఎన్నికలు ముగిసేనాటికి ఇది ఏ లెక్కకు తేలుతుందో అంచనాలకు చిక్కడం లేదు. కరెన్సీ నోట్లు కట్టలు కట్టలుగా దొరికాయంటున్న వార్తలే కాని వాటి సొంతదారులెవరు, పంపిణీదారులెవరు అన్నది తేల్చిచేప్పే నాధులే కరువయ్యారు. పొరుగున వున్న కర్నాటక నుంచి డబ్బు ముందే పంపిణీ అయిందని కొందరు ఆరోపిస్తుంటే, ఇంతమంది మంత్రులు కట్టకట్టుకుని జిల్లాలో మకాం వేసిందే ఇందుకని వారి ప్రత్యర్ధులు అంటున్నారు. మొత్తం మీద డబ్బు ప్రభావం ఓటర్లపై ఎంత వుంటుందో తెలవదు కానీ వోట్లు కొనుగోలు చేయకపోతే తరువాత తీరిగ్గా విచారించాల్సివస్తుందేమోనని ఏ పార్టీ కూడా ఛాన్స్ తీసుకుంటున్న దాఖలాలు కనబడడం లేదు. ఇంత ఖరీదయిన ఎన్నిక ఇదే అంటూ ఈ పరిస్తితులను ఇలాగే కొనసాగనిస్తే ముందు ముందు ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది తమ బోటివారికి అందని మానిపండేనంటూ రాజకీయాల్లో తలపండినవాళ్ళు తలలు పట్టుకుంటున్నారు.
ఇంతకుపూర్వం జరిగిన ఎన్నికల సందర్భంగా మీడియాలో పురుడు పోసుకున్న పెయిడ్ న్యూస్ అనే వికృత శిశువు ఈ ఉపఎన్నికలనాటికి తన విశ్వరూపాన్ని మరింత విశృంఖలంగా ప్రదర్శిస్తోంది. పత్రికలు (సంచికలు) అమ్ముడుపోవడం కాదు ఏకంగా పత్రికలే అమ్ముడుపోయాయి అనే తీరులో ఈ పెయిడ్ న్యూస్ వ్యవహారం పత్రికారంగానికే మాయని మచ్చగా తయారవుతోంది. పత్రిక ప్రతులు బాగా అమ్ముడు పోతే మంచి సర్క్యులేషన్ వున్న పత్రికగా చెప్పుకునే రోజులు గత కాలపు ముచ్చటగా మారిపోయి, ఎవరికో ఒకరికి అమ్ముడుపోయిన పత్రికగా ముద్ర వేసుకునే దరిద్రపు కాలం దాపురించింది. దీనికి తోడు కొత్తగా ప్రవేశించిన ఎలెక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు కొన్ని రాజకీయ పార్టీ నాయకుల జేబు సంస్తలు కావడంతో - ఇప్పుడు ఏది పెయిడ్ న్యూస్? ఏది కాదు? అన్న ప్రశ్నకు జవాబు దొరకడం క్లిష్టంగా మారింది. తమిళనాడులో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా మీడియాకు రాజకీయాలకు నడుమ వుండాల్సిన విభజన రేఖ త్వరితగతిన అదృశ్యమవుతోంది. దానితో పెయిడ్ న్యూస్ అన్న పదానికి కొత్త నిర్వచనం ఇవ్వాల్సిన పరిస్తితి ఏర్పడింది. మిగిలిన అన్ని రంగాలలో మాదిరిగానే ఈ రంగంలో కూడా విలువలు తగ్గిపోతున్నాయని నలుగురూ అనుకునే విధంగా, పత్రికా స్వేచ్చ పట్ల పలచన భావం పెచ్చరిల్లేలా వాతావరణం రూపుదిద్దుకోవడం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన మీడియాకు ఎంతమాత్రం శోభనివ్వదు.
పోతే, ఎన్నికల కమిషన్ పాత్ర.
ఓటర్లందరూ స్వేచ్చగా ఓటు వేయడానికి వీలయిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఈ వ్యవస్తపై వుంది. దీనికి తగిన అధికారాలు రాజ్యాంగం కల్పించింది. వాటిని తుచ తప్పకుండా వినియోగించి ఎన్నికలు సక్రమంగా నిర్వహించగల సమగ్ర యంత్రాంగం రాష్ట్ర స్తాయి ఎన్నికల సంఘానికి లేదు. పరిమిత సిబ్బందితో, పరిమిత వ్యవధిలో అపరిమితమయిన బాధ్యతలను నిర్వర్తించాల్సిన గురుతర బాధ్యత ఎన్నికల ప్రధానాధికారిపై వుంటుంది. రాష్ట్ర కేడర్ కు చెందిన ఐ.ఏ.ఎస్. అధికారే ఎన్నికల సంఘానికి ప్రధానాధికారిగా వ్యవహరిస్తుంటారు. ఈ పదవిలో వున్నవారు తిరిగి ఏదో ఒక రోజు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేయాల్సి వుంటుంది. అందువల్ల వారిది ఒకరకంగా అసిధారావ్రతం అనే చెప్పాలి. వున్న స్వల్ప కాలంలో అనుమానాలకు తావు లేకుండా, నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్న మాట రాకుండా, నిబద్ధత ప్రశ్నార్ధకం కాకుండా వున్నంతలో బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేర్చాల్సివుంటుంది. కత్తిమీద సాములాటి కర్తవ్య నిర్వహణలో ఎంత జాగరూకత ప్రదర్శించినా ఎవరో ఒకరు అసంతృప్తికి గురయ్యే అవకాశాలే ఎక్కువ. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన గురించి ఆయా పార్టీలు చేసే ఫిర్యాదులపై సమగ్రంగా విచారించి నిర్ణయం తీసుకునే వ్యవధానం లేకపోవడంతో ఎన్నికల అధికారి కార్యాలయం ఏవో ఒకటి రెండు ముఖ్యమయిన విషయాలపై స్పందించి ఉనికిని కాపాడుకునే పరిస్తితిలో వుంది. శాశ్విత యంత్రాంగం లేని పరిస్థితుల్లో, అందుబాటులో వున్న అధికార వ్యవస్తపై ఆధారపడి పని చేయాల్సిన స్తితిలో, సాధారణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులు వివాదాస్పద అంశాలపై నిర్ణయాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వొదిలి పెడతారన్న అపవాదు వుంది. ఒక్కోసారి స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నా వాటిని అమలు చేయాల్సింది క్షేత్ర స్తాయి అధికారులు, సిబ్బంది కావడం వల్లా, వారిపై నియంత్రణ అధికారం పరిమితం కావడం వల్లా – ఆశించిన తీరులో ఫలితాలు రావడం లేదనే అభిప్రాయం వుంది. కొన్ని సందర్భాలలో దిగువ స్తాయి సిబ్బంది స్తానిక పరిస్థితులు, రాజకీయ వొత్తిళ్లకు అనుగుణంగా తీసుకునేచర్యలకు ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి వస్తోంది. చదిపరాళ్ల గ్రామంలో మల్లెల రామలక్ష్మమ్మ వంటి వయస్సు మళ్ళిన మహిళలపై కూడా పోలీసులు బైండోవర్ కేసులు పెడుతున్నట్టు ఫిర్యాదులు రావడం, స్పందించిన అధికారులు ఆ కేసులను ఉపసంహరించుకోవడం ఇందుకు ఉదాహరణ.
అనేకరకాలుగా తన ప్రత్యేకతలను చాటిచెబుతున్న ఈ కడప ఉపఎన్నికలలో ఎవరో ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడిపోతారు. అది గొప్ప విషయమేమీ కాదు. కానీ ప్రజాస్వామ్యానికి పునాది వంటి ఓటరు మాత్రం ఓడిపోకూడదు. ప్రజాస్వామ్యం పరిహాసానికి గురికాకూడదు. తాత్కాలిక ప్రయోజనాలకోసం శాశ్విత విలువలను తాకట్టు పెట్టకూడదు. రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల వేళ గుర్తుపెట్టుకోవాల్సిన కట్టుబాటు ఇది. (03-05--2011)
4 కామెంట్‌లు:
ఇంతకీ ఏమంటున్నారు మీరు?
@Pavani -అంటే అర్ధం నేను రాసింది నేనె మరోసారి చూసుకోవాలేమో.ఒక్క అవకాశం ఇవ్వండి,చదివి చెబుతాను.
మొత్తం కాకపొయినా ఆ టైటిల్ ఒక్కటి చదవండి.రెండు సీట్లకి ముగ్గురు పోటీ పడితే ఒకళ్ళు ఓడిపోవటంలో ఏముంది వింత..మీరు జగనో, విజయమ్మో ఓడిపోబోతున్నారని రాస్తారేమో అని చదివా. కనీసం గెలుపు-ఓటములు విస్లేషించారేమో అనుకున్నా.Kind of disappointing.
@Pavani - అమ్మయ్య బతికించారు.కడప జిల్లాలో వై ఎస్ కుటుంబం రాజకీయాల్లో దిగినతర్వాత ఆ కుటుంబం ఇంతవరకు పరాజయం పాలు కాలేదు.ఇప్పుడు పులివెందులలో వై ఎస్ సతీమణి శ్రీమతి విజయమ్మ, సోదరుడు శ్రీ వివేకానందరెడ్డి ఒకే సీటుకు పోటీ పడుతున్నారు. ఎవరు గెలిచినా వై ఎస్ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు ఓడినట్టేకదా. అదీ కవి హృదయం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి