13, ఫిబ్రవరి 2013, బుధవారం

రెడీమేడ్ మొగుళ్ళు





తల్లిపాలు తప్ప అన్నీ అమ్మకానికి పెట్టే కార్పొరేట్ యుగం నడుస్తోంది. మంచి లాభసాటి వ్యాపారం పెట్టాలని అనుకున్న ఓ కార్పొరేట్ సంస్థ,   ఏకంగా రెడీమేడ్  మొగుళ్లను అమ్మే ఓ పెద్ద దుకాణాన్ని న్యూ యార్క్ లో తెరిచింది. తలకు వంద డాలర్లు ప్రవేశ రుసుము పెట్టింది. తమ అభిరుచులకు తగిన చక్కని  భర్తకోసం వెతికే కన్నెపడుచులు ఎంచెక్కా ఈ షాపులోకి వెళ్ళి నచ్చిన వారిని నచ్చినట్టు కొనుక్కుని ఇంటికి తీసుకువెళ్ళి తమ ఇంటివాడిని చేసుకునే  సౌలభ్యం ఇందులో వుండడం వల్ల పెళ్ళికాని పడతులందరూ పెళ్ళికాని ప్రసాదులకోసం ఈ దుకాణంపై ఎగబడ్డారు. అయితే ఈ షాపులో షాపింగ్ చేయాలంటే కొన్ని నియమాలు, నిబంధనలు వున్నాయి.
అవేమిటంటే-
ఆరంతస్తుల ఈ భవనంలోకి ఎవరినయినాసరే ఒకేసారి అనుమతిస్తారు.
ప్రతి అంతస్తులో పెళ్లిళ్ళు కావాల్సిన యువకులు స్వయంవరంలో మాదిరిగా సిద్ధంగా వుంటారు. మొదటి అంతస్తులోనే తగిన యువకుడు తటస్థపడితే ఇక మరో అంతస్తుకు వెళ్ళడానికి వీలుండదు.
ఈ కండిషన్లు అన్నీ క్షుణ్ణంగా చదివిన తరువాత ఒక యువతి  రెడీమేడ్ మొగుడ్ని కొనుక్కోవడం కోసం వంద డాలర్లు చెల్లించి ఆ షాపులోకి  వెళ్ళింది.
మొదటి అంతస్తు మొదట్లోనే ఒక బోర్డు రాసివుంది.
‘ఈ అంతస్తులో మీకు నచ్చిన మొగుళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు.  వీళ్ళందరూ చాలా బుద్దిమంతులు. చక్కటి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పైపెచ్చు  దేవుడిమీద విశ్వాసం వున్నవాళ్ళు.’
ఆ యువతి తలపంకించి రెండో అంతస్తుకు  చేరుకుంది.
‘ఈ అంతస్తులో అమ్మకానికి వున్న మగపిల్లలు  మరింత మంచివాళ్ళు. వీళ్ళకు ఉద్యోగాలు, దైవభక్తే  కాదు, పిల్లలంటే  తగని ప్రేమ కూడా’
అది చదివిన ఆ అమ్మడు మరో అంతస్తుకు వెళ్ళింది.
‘ఇక్కడ అమ్మకానికి వున్నవారికి అన్ని యోగ్యతలు వున్నాయి. మంచి ఉద్యోగం, దేవుడంటే భయం భక్తీ, పిల్లల్ని ప్రేమించే తత్వం, అన్నిటికీ మించి కళ్ళు చెదిరే అందం. మంచి బేరం మించిన దొరకదు’ అని అక్కడ రాసివుంది.
అయినా ఆ అమ్మాయికి తృప్తి లేకపోయింది. నాలుగో అంతస్తుకు వెళ్ళింది.
‘కింది మూడు అంతస్తులలో వున్న వారి లక్షణాలకు  అదనంగా ఇక్కడి వారికి మరో మంచి గుణం వుంది. అదేమిటంటే కిమ్మనకుండా  ఇంటి పనులుమొత్తం వొంటిచేత్తో సవరిస్తారు.’
ఒక్కక్షణం ఆమె ఆలోచించింది. ఇంతకంటే వెతకడం వృధాఏమో అని లిప్తపాటు ఆలోచించింది. అయినా పై అంతస్తులో ఇంతకంటే మంచి మొగుడు దొరక్కపోతాడా అన్న ఆలోచన ఆమెను అక్కడ నిలవనియ్యలేదు. దానితో  మరో అంతస్తుకు వెళ్ళింది.  
‘మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ వున్న మగవాళ్ళు పుటం వేసి గాలించినా మీకు ఎక్కడా దొరకరు. కొరుక్కుతినాలనిపించే అందం, కూర్చుని తిన్నా తరతరాలకు తరగని ఆస్తి, పిల్లలపట్ల ప్రేమ, పెద్దలంటే గౌరవం, ఇంటి పనులు, వంట పనులు సమస్తం స్వయంగా చూసుకోగల శక్తి సామర్ధ్యాలు, ఓహ్! ఒక్కసారి లోపలకు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది’
ఆ యువతి కాసేపు ఆలోచించింది. మిగిలింది ఇంక ఒకే అంతస్తు. పోయి చూస్తే పోలా!’
ఆరో అంతస్తుకు చేరుకుంది. అక్కడ కింద కనబడ్డ బోర్డులు లాటివి ఏవీ లేవు. తలుపు తోసుకుని లోపలకు వెళ్ళింది. అంతా ఖాళీ. ఎవ్వరూ లేరు. కొంపతీసి నిఖార్సయిన మంచి మొగుళ్ళందర్నీ జనం ముందే  ఎగరేసుకుపోలేదు కదా!’ అని అనుకుంటూ తిరిగొస్తుంటే తలుపు వెనక ఎలక్ట్రానిక్ డిస్ ప్లే మీద ఇలా కనబడింది.
‘ఇప్పటిదాకా  లక్షాపాతికవేల నూటనలభయ్ రెండు మంది  ఈ చివరి అంతస్తుకు వచ్చారు. మీరు లక్షాపాతికవేల నూటనలభయ్ మూడోవారు. ఈ హాలులో అమ్మకానికి మగవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆడవాళ్ళని మెప్పించడం అతికష్టం అన్న నిజానికి రుజువుగా మాత్రమే ఈ అంతస్తుని ఏర్పాటు చేశాం.
‘మా  షాపుకి వచ్చినందుకు ధన్యవాదాలు. దిగివెళ్ళేటప్పుడు జాగ్రత్త. మీకు అంతా మంచే జరగాలని మా యాజమాన్యం కోరుకుంటోంది’  
(గమనిక: నెట్లో  తిరుగాడుతున్న ఆంగ్ల కధనాన్ని శ్రీ గొర్తి శ్రీనివాస్ పంపారు. దానికి స్వేచ్చానువాదం ఇది)

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

1 1 1 1 1 1





అంటే అక్షరాలా లక్షా పదకొండువేల నూట పదకొండు సార్లు నా ఈ బ్లాగుపై మీ అభిమాన జల్లులు కురిపించారు. ఈ మైలు రాయి దాటడంలో మీ అందరి సహకారానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. – భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.in/


vartha vyakya _ kishan reddy state president _ kumbhamela issue _ 12-02-...

NEWS HOUR on Telangana - Part 1 - ON CVR NEWS

Addhar Card Debate : 03/02/13 - Studio N

Top Story (playlist) - Tv5 Top Story with Vijay on 11th Feb.2013

The Primetime Show 11th Feb 2013 - Sakshi TV

కధకు మరణం లేదు


(కధకు మరణం లేదు. చక్కని కధకు 'పాతా కొత్తా' తేడాలేదు. అలాటికధలు ఎన్నిసార్లు చదువుకున్నా తృప్తి తీరదు. అందుకే కధా ప్రియులు దేవినేని మధుసూదన రావు గారు ఈ కధను మరోమారు నెమరు వేసుకొవడానికి నెట్లో పంపారు.
వండడం ఓ కళ. వండి వార్చడం మరో కళ. వండినదాన్ని వడ్డించడం ఇంకో అపురూప కళ. అదేమిటో శంకరమంచి సత్యం గారు తన 'అమరావతి కధ'ల్లో ఒకదానిలో చెప్పారు. ఆరగించండి.)



తృప్తి
పూర్ణయ్యని బావగాడంటారు అందరూ.
బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరమూ లేదు. పెళ్ళి గాని, పేరంటం గాని, వంట హంగంతా బావగాడే. వంటవాళ్ళని కూర్చోనిచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు.
ఒకసారి వనసంతర్పణం పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు కొందరు. పేకాటలో మునిగిన వారు కొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. “అందరూ వినండర్రా” అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు, పేకాట మూయించాడు. “వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను” అంటూ లిస్టు చదివాడు.
“వంకాయ మెంతికారం పెట్టిన కూర
అరటికాయ నిమ్మకాయ పిండిన కూర
పెసరపప్పుతో చుక్కకూర
వాక్కాయ కొబ్బరి పచ్చడి
పొట్లకాయ పెరుగు పచ్చడి
అల్లం, ధనియాల చారు
మసాలా పప్పుచారు
అయ్యా! జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం
మామిడి కోరుతో పులిహోర
గుమ్మడి వడియాలు, వూరమిరపకాయలు.
అందరికీ సమ్మతమేనా?” అని అరిచాడు.
సమ్మతమేమిటి నామొహం - అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది.
అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకూ ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. “చూశారా! లేత వంకాయలు… నవనవలాడుతున్నాయి… మెంతికారం పెట్టి మరీ వండిస్తున్నాను… దగ్గరుండి కోయించుకు వచ్చాను. …” అని అందరికీ చూపించి వెళ్ళి పోయాడు. ఆ తరవాత జనానికి వేరే ఆలోచనలు పోయినాయి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు. కాయ కాయ పళంగా వండితే రుచా? తరిగి వండితే రుచా? అసలు రుచి వంకాయలో వుందా? వంకాయ తొడిమలో వుందా? ఇలా చర్చలు సాగాయి.
మరో అరగంటకి — –
నిగనిగలాడే వాక్కాయల బుట్టతో, లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. “వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి,” అని తలా ఓ కాయ పంచాడు. “చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది.” అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనం అంతా వంట కబుర్లలో పడ్డారు. బావగాడు ఇలా ప్రదర్శన లిస్తుంటే ఆకలి రెప రెప పెరుగుతోంది.
ఇక అక్కడ గాడిపొయ్యి దగ్గర వంటవాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు.
ఓ పక్క పులిహోర తిరగమాత వెయ్యగానే రయ్యిన జనం దగ్గరికి పరిగెత్తుకు వొచ్చి, “ఆ వాసన చూశారా? పులిహోర తిరగమోత… సన్న బియ్యంతో చేయిస్తున్నాను,” అని మాయమయ్యాడు.
మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది. తాటి ప్రమాణమైంది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురు మంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. “లేత అరిటాకులు, శుభ్రంగా కడుక్కోండి.” అని వరుసల మధ్య కొచ్చి హెచ్చరించాడు.
“సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం? రెండు ఆకులు కలిపి వేయించు” అంటున్నాడు.
వడ్డనలు మొదలయ్యాయి.
నేతి జారీ పుచ్చుకొని పేరు పేరునా అందర్నీ అడిగి వడ్డిస్తున్నాడు. “వంకాయ అలా వదిలేయకూడదు. నిమ్మకాయ పిండిన అరిటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు.” అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు.
“చుక్కకూర పప్పులో వూరమిరపకాయలు మిళాయించండి.”
“పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి.”
“వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు. తప్పు లేదు.”
“ఇంకా విస్తట్లో మిగిల్చావేం. పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో.”
“అప్పుడే మంచినీళ్ళు తాగకు. మీగడ పెరుగుంది.” ….
ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందు నుండి లేవడమే కష్టమయింది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరవాత వంటవాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. “కష్టపడి వండారు, తినకపోతే ఎలా?” అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున గాడిపొయ్యి పక్కన ఒక చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు.
అప్పటికి కూరలు మిగల్లేదు.
ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంతా హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురూ హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారన్న సంతోషమే బావగాడి తాంబూలపు పెదాలపైని చిరునవ్వు.

(అమరావతి కథలు - సత్యం శంకరమంచి. నవోదయ పబ్లిషర్స్, విజయవాడ. 1978. రూ. 150/-)

Top Story (playlist)

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

The Primetime show 19th Nov 2012 - Sakshi TV

Sakshi TV - The PrimeTime Show 24th May 2012

Sakshi TV - Sakshi Prime Time Show 20th June 2012

Sakshi TV - The Prime Time Show 13th April 2012

CM YSR affection towards Brahmin community

Sakshi TV - Sakshi Vedika With Senior Journalist Bhandaru Srinivasa Rao

Sakshi TV - Sakshi Vedika With Senior Journalist Bhandaru Srinivasa Rao

Sakshi TV -Sakshi News Week With Senior Journalist Bhandaru Srinivasa Rao

Sakshi TV - Sakshi News Week With Bhandaru Srinivas Rao 5th Aug 2012

Sakshi TV - Sakshi News Week With Bhandaru srinivas rao

సాక్షి న్యూస్ వీక్ 20th Jan

సాక్షి న్యూస్ వీక్ 20th Jan

సాక్షి ది హెడ్ లైన్ షో 22nd Jan 2013

సాక్షి ది హెడ్ లైన్ షో 22nd Jan 2013

సాక్షి న్యూస్ వీక్ 3rd Feb 2013

సాక్షి న్యూస్ వీక్ 3rd Feb 2013

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

మా ఆవిడకు నేనిస్తున్న ‘యోగ్యతాపత్రం’






తన బలమేమిటో, బలహీనతలేమిటో తనకు  ఏమీ తెలియకపోవడం వల్ల ఈ నలభై రెండేళ్ళ పైచిలుకు వైవాహిక జీవితాన్నినాతో నెట్టుకు రాగలిగింది.
అయితే ఆమె బలమూ, బలహీనతలు నాకు తెలుసు. మగవాడిగా పుట్టి నా స్థానంలో వున్నట్టయితే మా సంసారాన్ని ఇంకా గొప్ప విజయ తీరాలకు  చేర్చివుండేది కూడా.  ఆ విషయంలో నాకు ఎలాటి సందేహం లేదు. వొప్పుకోవడానికి ఎలాటి భేషజం లేదు. బహుశా మొగుళ్లలో తొంభయ్ తొమ్మిది శాతం మందికి  అంతరాంతరాల్లో తమ భార్యల గురించి  పైకి చెప్పుకోలేని  ఈ మాదిరి అభిప్రాయమే వుండి వుండవచ్చు కూడా.
తన గురించి ఇన్నేళ్ళ తరువాత బాహాటంగా చెబుతున్న ఈ ఒక్క మంచి ముక్క కూడా తను చదివే ఛాన్స్ లేదు. ఎందుకంటే జర్నలిస్టుగా  పత్రికల్లో, సోషల్ నెట్ వర్కుల్లో నేను రాసే  రాతలు, విశ్లేషకుడిగా టీవీల్లో నేను చెప్పే మాటలు ఆమెకు ఏమీ పట్టవు. తన పనేదో తనది. కుటుంబం, దాని బాగోగులు తప్ప తనకు మరో ధ్యాస లేదు. ఈ రెంటినీ పట్టించుకునే తీరికా  ఓపికా నాకు లేవు. అంచేత  కుటుంబపరమయిన బాధలూ,  బాధ్యతలూ  తనవి. చుట్టపక్కాల  మెచ్చుకోళ్లన్నీ నా ఖాతాలోకి. ‘మంచి’ బదిలీ పధకం అన్న మాట. మరోరకంగా ఇది మా ఆవిడ బలహీనత, నా బలమున్నూ.
అన్నదమ్ములు లేరు. అక్కచెల్లెళ్ళు లేరు.  తలిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె. అయినా,   నాకోసం అయినవారినందర్నీ  కాదనుకుని, అన్నింటినీ వొదులుకుని గత  నలభై వసంతాలుగా   నావెంట నడిచివస్తూ, వెనకవుండి నన్ను నడిపిస్తూ వస్తున్న మా ఆవిడ నిర్మల - 58 పుట్టినరోజు ఈనెల తొమ్మిదో తేదీ.  ఎప్పటిలా ఆరోజు నాకు  గుర్తుండదని తెలిసినవాడిని  కనుక ముందుగానే రాసిపెట్టి వుంచుకున్న  యోగ్యతాపత్రం ఇది.  మనసు పెట్టి రాసి ఇస్తున్న పుట్టిన రోజు కానుక కూడా. (అల్ప సంతోషులతో వున్న లాభాల్లో ఇదొకటి)   
- భండారు శ్రీనివాసరావు      

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

స్త్రీ సాహసం



స్త్రీ సాహసం

నిజానికిది  టెలిగ్రాఫ్ పత్రికలో చాలా వివరంగా వచ్చిన కధనమే. సంక్షిప్తీకరించి తెలుగులో రాయడానికి చేసిన ప్రయత్నం ఇది.
చందా జవేరీ అనే అనే కలకత్తా ఆవిడ అమ్మాయిగా వున్నప్పుడు ఓ సాహసకృత్యానికి పూనుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత  అదేమిటో ఆవిడ  తన మాటల్లోనే ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  వెల్లడించింది. ఇప్పుడే యెందుకు? ఇన్నేళ్ళ తరువాత యెందుకు? అంటే ఇన్ని సంవత్సరాలుగా చందా జవేరీ గారు అమెరికాలోనే వుండిపోయారు కాబట్టి, ఈ మధ్యనే ఆవిడ స్వదేశం వచ్చి వెళ్లారు కాబట్టి అనేది ఆ పత్రిక వివరణ.
అంచేత ఆవిడ కధా కమామిషూ తెలుసుకోవాలంటే ఓ ముప్పయ్యేళ్ళ పై చిలుకు వెనక్కు వెళ్ళాలి.
అప్పుడు ఆవిడ, అంటే 49 ఏళ్ళ  చందా జవేరీ 17 సంవత్సరాల ప్రాయంలో పెళ్లి కాని  అమ్మాయిగా వున్నప్పుడు  ఓ సాహసం చేసింది. ఇప్పుడావిడను గురించి ఇంతగా చెప్పుకుంటున్నారంటే అదే కారణం.
సాధారణ మరాఠా అమ్మాయిగా జీవితం గడుపుతున్న  చందా జవేరీకి పెళ్లీడు వచ్చిందని పెళ్లి చేసేయాలని తలితండ్రులు తొందర పడుతున్న సమయంలో ఆమె తీసుకున్న ఓ తొందరపాటు నిర్ణయం తలితండ్రుల్ని గందరగోళంలోను, ఆమె జీవితాన్ని సుందర మార్గంలోనూ పడవేసింది. 1984 వ సంవత్సరంలో కలకత్తాలోని పార్క్ స్ట్రీట్ లో ఆమెకు విదేశీ టూరిస్టు దంపతులు పరిచయం కాకతాళీయంగా జరిగినా, ఆ పరిచయమే ఆమె జీవితంలో పెనుమార్పులకు దారి తీసింది. అదేమిటో ఆమె మాటల్లోనే –

చందా జవేరీ 

‘మాది ఓ సాధారణ  మధ్య తరగతి కుటుంబం. వివేకానంద నగర్ లోని బాలికా శిక్షా సదన్ లో హైస్కూలు  చదువు పూర్తిచేసాను. మా ఇళ్ళల్లో ఆడపిల్లలకు అదే పెద్ద చదువు. కాలేజీకి పంపించడం వుండదు. పెళ్ళిచేసి  అత్తారింటికి పంపించేస్తారు. అలాగే  మా అమ్మానాన్నా కూడా నాకొక సంబంధం ఖాయం చేశారు. నాకేమో పై చదువులు చదవాలని వుంది. ఏంచేయాలో తెలియని స్తితిలో ఇంటి నుంచి పారిపోయాను.
‘అంతకు ముందు స్కూలుకు వెళ్ళేటప్పుడు అమెరికన్ లైబ్రరీకి కూడా వెడుతుండేదానిని. ఒకరోజు దానికి దగ్గర్లో తిరుగాడుతున్న ఓ అమెరికన్ మహిళ ఎండ వేడిమి తట్టుకోలేక  వీధిలోనే శోష వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. నేను ఆమెకు సపర్యలు చేసి ఆసుపత్రికి తీసుకువెళ్లాను. ఆ సంఘటనతో  ఆమె భర్త డేవిడ్ కు నాపట్ల సదభిప్రాయం కలిగింది. ఆ పరిచయంతో అమెరికాలోని వాళ్ల ఫోన్ నెంబరు ఇచ్చాడు.
‘ఇంటి నుంచి బయటపడి దిక్కుతోచని స్తితిలో వున్న నాకు కేరెన్ దంపతులు గుర్తుకు వచ్చారు. ఏమయితే అయిందని డేవిడ్ కు ఫోను చేశాను. ఇప్పట్లోలా అప్పట్లో  ఇన్ని కమ్యూనికేషన్  సౌకర్యాలు లేవు. పబ్లిక్ బూతు నుంచి ప్రయత్నిస్తే అతి కష్టం మీద లైన్ దొరికింది. డేవిడ్ గారికి ముందు నేనెన్వరో చప్పున గుర్తు రాలేదు. వచ్చిన తరువాత  ఏమనుకున్నారో యేమో కాని స్పాన్సర్ లెటర్ పంపడానికి అంగీకరించారు.
‘దాన్ని  తీసుకుని అమెరికన్ కాన్సులేట్ కు వెళ్లాను. వీసా అధికారి నన్ను ఎగాదిగా చూశాడు. ‘చూస్తే  చాలా చిన్నపిల్ల లాగా వున్నావు. నీకు వీసా ఇవ్వడం కుదరదు’ అనేశాడు. నాకు ఎక్కడలేని కోపం వచ్చేసింది.
‘ఏం! మీ అమెరికా ఏవన్నా స్వర్గలోకమా? అక్కడికి వెళ్ళినవాళ్ళు తిరిగిరాకుండా అక్కడే వుండిపోవడానికి అవటా !’ అని కడిగి పారేశాను. ఏవనుకున్నాడో యేమో అతగాడు ఓ మందహాసాన్ని నా మొహం మీద పారేసి, ఏదో నవ్వుతాలకు అన్నాను ఏమనుకోకు’ అంటూ   అయిదేళ్ళ మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇచ్చేసాడు.
‘అంతే!  అమెరికాకు ఎగిరిపోయాను.  దిగిన తరువాత గాని తత్వం బోధపడలేదు. పర్సులో పైసాలేదు. వున్న ఇండియన్ కరెన్సీ కాస్తా కలకత్తా ఎయిర్ పోర్ట్ అధికారులు నిబంధనల పేరుతొ తీసేసుకున్నారు. అమెరికాలో మళ్ళీ డేవిడ్ దంపతులే ఆదుకున్నారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఇంటికి తీసుకువెళ్ళారు. దుస్తులు కొనిపెట్టారు.
‘జీవిక కోసం,  వొంటరిగా జీవిస్తున్న ఓ  వృద్ధురాలి ఆలానా పాలనా చూసే పని తలకెత్తుకున్నాను. దురదృష్టం. నేను పనిలో చేరిన మరునాడే ఆవిడ వృద్ధాప్యంతో కన్నుమూసింది. ఆమె డైరీలో వున్న నెంబరు చూసి హవాయిలోవున్న ఆమె కుమారుడికి ఫోన్ చేసి తల్లి మరణవార్త తెలిపాను. ఆమె మరణం కంటే అతడిచ్చిన జవాబు నన్ను బాగా కుంగ తీసింది. ‘శవాలను  ఖననం చేసే వారికి కబురుచేస్తే వాళ్ళే చూసుకుంటారు’ అన్నది అతగాడి సమాధానం.  అమెరికన్ల జీవితంలో దాగున్న ఓ విషాద కోణాన్ని ఈ సంఘటన నాకు బోధపరిచింది.
‘సరే! మరో వృద్ధురాలు నన్ను పనిలోకి తీసుకుంది. ఆమె వయస్సు తొంభయ్ ఎనిమిది సంవత్సరాలు. దయకల తల్లి. చదువుపట్ల నా ఆసక్తిని గ్రహించి హార్వర్డ్ యూనివర్సిటీ లో చేరమని ముప్పయి వేల డాలర్లు ఇచ్చి ప్రోత్సహించింది.
‘అంతే! మళ్ళీ వెనక్కు తిరిగిచూడాల్సిన అగత్యం పడలేదు.
‘నోబుల్ బహుమతి గ్రహీత  లీనస్  పాలింగ్ తో  పరిచయం నా జీవితాన్ని మరో అద్భుతమైన మలుపు తిప్పింది. రసాయన శాస్త్రంలో రెండు పర్యాయాలు ఈ విశేష పురస్కారాన్ని పొందిన ఏకైక శాస్త్రవేత్త ఈయన ఒక్కరే.
‘లాస్ ఏంజెల్స్ లో నేను స్థాపించిన కంపెనీ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. డేవిడ్ కు బాగా తెలిసిన అమెరికన్ దంపతులు నన్ను దత్త పుత్రికగా స్వీకరించారు. నన్ను కన్న తలిదండ్రులను కూడా ఒకసారి ఆ దేశానికి రప్పించాను. ఒకరోజు తమ  మనసుల్ని నొప్పించి ఇంటి నుంచి బయటకు వచ్చేసిన  కన్న కూతురు సాధించిన  ఎదుగుదలను చూసి వారు కూడా ఎంతో సంతోషించారు. ‘అమెరికా అంటే ఎం టీవీ ఒక్కటే కాదు, అక్కడా హృదయం వున్న మనుషులు వున్నారని వాళ్లు గ్రహించగలిగారు.
‘ఇప్పటికీ కలకత్తా అంటే చెప్పలేని అభిమానం.  సాల్ట్ లేక్ లో ఇల్లు కట్టుకున్నాను. నేను చిన్నారిగా వున్నప్పటి నగరానికి ఇప్పటికీ ఎంతో తేడా కనబడుతోంది. నా రోజుల్లో మార్వారీ కుటుంబాల్లో ఆడపిల్లలను పై చదువులకు పంపే వారు కాదు. ఇప్పుడో! పరిస్తితి మారింది. వాళ్లు కూడా కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్నారు. నిజానికి పిల్లలకు తలిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి అదొక్కటే!’
చందా జవేరీ ఒక్కతే కాదు, అవకాశాలు రావాలే కాని తమ శక్తిని ప్రదర్శించే అమ్మాయిలకు కొదవలేని దేశం మనది. అయితే, అవకాశాలు రావాలా లేక వాటిని వొడిసి పట్టుకోవాలా అన్నదే ఆ లక్ష్య సాధనలో అడ్డం పడుతున్న అడ్డంకిలా అనిపిస్తోంది. (05-02-2013)