21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

పాత గవర్నర్ - కొత్త నివేదిక

ABN ఆంధ్రజ్యోతిలో వస్తున్న స్క్రోలింగ్ :
"రాష్ట్రంలో రాజకీయ  అనిశ్చితి, అస్తిరత.
"రాజకీయ పార్టీలు ప్రాంతాలవారీగా విడిపోయాయి.
"ఏ ఒక్క పార్టీ మెజారిటీ నిరుపించుకునే  పరిస్తితి లేదు.
"సీఎం పదవికి  అందరికీ ఆమోదయోగ్యమైన  వ్యక్తి కనిపించడం లేదు"
- రాష్ట్రపతికి పంపిన నివేదికలో గవర్నర్
వ్యాఖ్య:  ఆయన గవర్నర్ అయినప్పటినుంచీ, అంతకు కొంత ముందర నుంచి  కూడా రాష్ట్రంలో దాదాపు ఇదే పరిస్తితి. కొత్తదేమీ కాదు. కాకపొతే నివేదికే కొత్తది.

(21-02-2014, 11 AM)

20, ఫిబ్రవరి 2014, గురువారం

ఒక ప్రక్రియ ముగిసింది ఇక ప్రజలే ప్రభువులు కావాలి


మన  రాష్ట్రానికి సంబంధించిన  ఒక ప్రధానమైన ఘట్టం చరిత్రలో చోటుచేసుకుంది. చాలా ఏళ్ళుగా నలుగుతూ, సలుపుతూ వచ్చిన ఒక సమస్యకు 'ముగింపు' దొరికింది. పడింది 'శుభం' కార్డా, మరో సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం.  దాన్ని కాలమే తేలుస్తుంది.


ఎందుకంటే 1956 లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 'ఆంధ్రప్రదేశ్' ఏర్పాటయినప్పుడు ఇలాగే సంతసించినవాళ్ళు వున్నారు. సందేహించినవాళ్లు వున్నారు. ఆనాడు సంశయం వ్యక్తం చేసిన వాళ్ల భయాలే నిజం అయ్యాయని ఈనాడు విభజనను గట్టిగా కోరుతున్నవారు ఎంతో గట్టిగా వాదించిన సందర్భాలు వున్నాయి. అంచేత సందేహిస్తున్నవారి భయాలను తేలిగ్గా కొట్టివేయడం  కూడా తగదు. ఎవరు అవునన్నా   ఎవరు కాదన్నా తెలంగాణా ఆవిష్కృతం కాబోతోంది. ఈ సమయంలో గెలుపు వోటముల ప్రసక్తిని పక్కనబెట్టాలి. యుద్దంలో, ఆటల్లో మాత్రమే ఈ మాటలు వినబడతాయి. ఇంతకాలం జరిగింది యుద్ధమూ కాదు, ఆటా కాదు. ఉభయప్రాంతాల జనంలో వున్న ఆకాంక్షకు చక్కని  అభివ్యక్తీకరణ మాత్రమే. కొందరు రాజకీయులు దీనికి అగ్గి రాజేసారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం ఎంతమాత్రం లేదు. ఇకనుంచయినా సరే, రెండు ప్రాంతాల ప్రజలు  రాజకీయుల చేతుల్లో పావులు కాకుండా తమ  ప్రాంతాల సత్వర  అభివృద్ధిలో  స్వయంగా భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్న నగ్న సత్యాన్ని రాజకీయ నాయకులకు ఎరుకపరచాలి.
(ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ బిల్లును  ఈరోజు, 20-02-2014,   మధ్యాహ్నం  3-10 కి హోం మంత్రి శ్రీ షిండే  రాజ్యసభలో  ప్రవేశపెట్టారు.  దాదాపు  అయిదు గంటలకు పైగా చర్చ జరిగింది. తరువాత విపక్షాలు డివిజన్ కోరినా సభాపతి వొప్పుకోలేదు. మూజువాణీ వోటుతో  రాత్రి  8- 08 నిమిషాలకు బిల్లును ఆమోదించింది)  



డౌటేహం


"ఆంధ్రా బ్యాంకులో పనిచేసే స్నేహితుడు ఒకరు అడిగారు. విభజన  అనంతరం తెలంగాణాలో తమ బ్యాంకు సంగతేమిటని? కర్నాటక, మహారాష్ట్ర బ్యాంకులు మాదిరిగానే   అనే జవాబు ఆయనకు నచ్చినట్టులేదు." 

ఎప్పుడూ ఇంతే!

"వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు"
"ప్రారంభమైన అనంతరం తిరిగి వాయిదా పడ్డ ఉభయసభలు" 

తిరుక్షవరం

'మా తిరుపతిని ఇచ్చేయండి' - కేంద్రానికి తమిళ నేత రాం దాస్ వినతి (ఈరోజు ఆంధ్ర జ్యోతిలో వార్త)
'సందట్లో సడేమియా అంటే ఇదే కాబోలు' - వ్యాఖ్య 

వార్త - వ్యాఖ్య

'జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ' - వార్త
'నేషనల్ హై వే పై సైకిల్ సవారీ' - వ్యాఖ్య 

ఇదేం ఆట?


ఆఖరి బ్యాట్స్ మన్ కిరణ్ బ్యాట్ కింద పడేసి అవుట్ అయ్యానని ప్రకటించి మరీ మైదానం నుంచి పెవిలియన్ దారి పట్టాడు. అంపైర్ నరసింహన్ ఏవీ చెప్పకుండా మూడో అంపైర్  నిర్ణయానికి వొదిలేసి కూర్చున్నాడు. ఇంతకీ ఆట పూర్తయిందా! మళ్ళీ మొదలవుతుందా!
(స్పోర్ట్స్ న్యూస్ రాసేటప్పుడు గౌరవవాచకాలు వాడకపోవడం జర్నలిజంలో ఒక సంప్రదాయం)

19, ఫిబ్రవరి 2014, బుధవారం

యక్షప్రశ్న


యక్షుడు : ధర్మరాజా! నేను ఇంతవరకు అడిగిన అన్ని ప్రశ్నలకు నువ్వు ఎంతో విజ్ఞతతో కూడిన సరయిన సమాధానాలు చెప్పి నన్ను సంతోషపెట్టావు. ఇక ఈ చిట్ట చివరి ప్రశ్నకు కూడా సరైన జవాబు చెప్పి నీ సోదరుల ప్రాణాలు దక్కించుకో! ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి తమ పదవికి రాజీనామా చేసారని, దాన్ని గవర్నర్ ఆమోదించారనీ దాదాపు అన్ని టీవీ ఛానల్స్ లో స్క్రోలింగులు వచ్చాయి. ఇంతకీ,  సీఎం రాజీనామాను ఆమోదించినట్టా లేదా!"
ధర్మరాజు: నమస్కారం వెళ్లివస్తాను. మీ ప్రశ్నకో నమస్కారం.

(19-02-2014)

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

23 నిమిషాల్లో 29 వ రాష్ట్రం




'నోటా' బాటే రైటు


లోక్ సభ, రాజ్య సభల్లో రణగొణ ధ్వనుల నడుమ తూతూ మంత్రంగా సాగిపోతున్న బిల్లుల ఇంట్రడక్షన్, ఆమోదం ప్రక్రియ చూస్తుంటే ఏమనిపిస్తోంది?

"వచ్చే ఎన్నికల్లో వోటర్లందరూ కూడబలుక్కుని కనీసం ఒక్కసారయినా మూకుమ్మడిగా బ్యాలట్ పత్రంలోని 'నోటా' (NONE OF THE ABOVE) అవకాశాన్ని ఉపయోగించుకుని అన్నే పార్టీలవారినీ ముక్తకంఠంతో తిరస్కరిస్తే బాగుండునని"   

నిష్టూరం అనిపించినా ఇదే నిజం.


రాష్ట్రంలో ఒక చారిత్రిక ఘట్టానికి తెర లేచే సమయం ఆసన్నమౌతోంది. మరి కొన్నింటికి తెరలు దించాల్సిన తరుణం కూడా ఇదే.
ఈరోజు లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు పై చర్చ, ఆమోదం అంటూ మీడియా కోయిలలు ముందస్తుగా కూత పెడుతున్నాయి. సోనియా గాంధీ కూడా నాలుగ్గంటల పాటు జరిగే చర్చలో పాల్గొంటారని కూడా వార్త. చర్చ జరుగుతుందని ఎలాటి అత్యాశలు లేవు కాని,  ఇది నిజం కావాలని మాత్రం  భవదీయుడి ఆశ. ఎందుకిలా నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో, ఏ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన ప్రక్రియను ముందుకు తీసుకుపోవాల్సి వచ్చిందో జాతికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అందరికంటే కూడా సోనియాపై ఎక్కువ వుంది. అలాగే ఈ నిర్ణయం వల్ల మనస్తాపం చెందుతున్న మనస్సుల్లో చెలరేగుతున్న భయాందోళనలను నివృత్తి చేయడానికి ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తీరాలి. మాట్లాడడానికి వీలు లేని పరిస్థితులు తలెత్తితే, కనీసం లిఖిత పూర్వక ప్రకటన అన్నా చేయాలి.
రాష్ట్రాన్ని విభజించడంతో పని పూర్తయిందని అనుకోకూడదు. ఈ ఘడియ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళపై మరింత బాధ్యత వుంది. సంయమనంతో వ్యవహరించి - 'విడిపోయి కలిసుందాం' అని ఇన్నాళ్ళుగా చెబుతూ వస్తున్న మాటల్లో ఏమాత్రం డొల్లతనం లేదని నిరూపించుకోవాలి. అద్దంలో చందమామ మాదిరిగా ఇన్నేళ్ళుగా వూరిస్తూ వచ్చిన లక్ష్యం దగ్గర పడుతున్నప్పుడు కావాల్సింది అవతలివారిపట్ల రవంత సానుభూతి. అడ్డగోలుగా అడ్డం పడుతున్నారని , మళ్ళీ అడ్డగోలు ప్రకటనలు, ఆరోపణలు చేయడానికి ఇది ఎంతమాత్రం తరుణం కాదు.  
ఇప్పుడు కావాల్సింది కాసింత సంయమనం. కొద్ది సర్దుబాటు మనస్తత్వం. కాదు కూడదు అనుకుంటే -దీపనిర్వాణగంధం సామెత  మిగులుతుంది. నిష్టూరం అనిపించినా ఇదే నిజం.  
(18-02-2014 - 9 AM)

17, ఫిబ్రవరి 2014, సోమవారం

"SHOW WILL CONTINUE"

వార్త - వ్యాఖ్య  
తప్పుకుంటారా  తప్పిస్తారా
సీఎం కిరణ్ రేపు (మంగళవారం)మధ్యాన్నం మూడుగంటలకు తమ పదవికి రాజీనామా చేస్తారు. (వార్త)
అంటే ఆఖరివరకు ఆడి ఆఖరి బంతికి  బ్యాట్ పారేసి అవుట్ కావడం.
సీఎం కిరణ్ కొత్తపార్టీ  పెడతారు (వార్త)
అంటే బ్యాట్ పారేయకపోవడం (గెలుపు ఓటమి వోటరు అధీనం)
ఏదిఏమైనా ఆట ముగియడం ఖాయం
కాకపొతే, మేరా నామ్ జోకర్ సినిమాలో రాజకపూర్ చెప్పినట్టు
"SHOW WILL CONTINUE"  
(17-02-2014)

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని?

అసలేంజరుగుతోంది? -భండారు శ్రీనివాసరావు  
 అసలేంజరుగుతోంది?’ -  ఒక కేసుకు సంబంధించి, దేశంలో పరిస్తితులపై అత్యున్నత న్యాయస్తానం సుప్రీం కోర్టు కొంతకాలం క్రితం చేసిన వ్యాఖ్య ఇది.
గత కొన్ని మాసాల నుంచి  పాత పేపర్లు తిరగేసినా, టీవీ చర్చలు పునశ్చరణ చేసుకున్నా సామాన్య జనానికి సయితం మనసులో మెదిలే ప్రశ్న ఇదే.
ఎంత చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంత చెడిపోయిన రాజకీయపార్టీకయినా ఏవోకొన్ని సిద్ధాంత మూలాలుంటాయి. కొన్ని స్థిరమైన భావజాలాలుంటాయి. కానీ ఈనాడు  దాదాపు  అన్ని రాజకీయపార్టీలు తమ  సిద్ధాంతాలకు చెల్లు చీటీ రాసినట్టే కానవస్తోంది.
 అలాగే అన్ని రాజకీయ పార్టీలకు, పేరు ఏదయినా అధిష్టానం అంటూ ఒకటుంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో ఎక్కువఅని గొప్పలు చెప్పుకునే పార్టీలలో కూడా ఎవరూ నోరెత్తి అధిష్టానాన్ని బాహాటంగా ఎగర్తించే సాహసం చెయ్యరు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? చోటామోటా నాయకులు సయితం తమ పార్టీ అధినాయకులను విలేఖరుల ముందే  పూచికపుల్లలుగా తీసివేస్తున్నారు. ఔరా! వీరికెంత ధైర్యం!అని నలుగురూ అనుకునేలా నలుగురిముందే తమ నాయకులను  చెరిగి పారేస్తున్నారు.
నాయకురాలి జాతీయతను ప్రశ్నించినా, నాయకుడి రెండు కళ్ళ విధానాన్ని విమర్శించినా  ఇదేరకమయిన తెగింపు. ఏం చేస్తారులే అనే ధైర్యం.
ఏకంగా పార్లమెంటును, శాసన సభను వేదికగా చేసుకుని తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తూ, సొంత పార్టీనే నగుబాటు చేసినా ఏం కాదన్న ధీమా.
అసెంబ్లీ. పార్లమెంటు  సమావేశాల్లోనే  ధిక్కార స్వరాన్ని బాహాటంగా వినిపించినా పోయేదేమీలేదన్న మొండితనం.
చట్టసభల సాక్షిగానే చట్ట ఉల్లంఘనకు పాల్పడే మంకుతనం.
రాష్ట్రం రెండు ముక్కలవుతుందా మూడు చెక్కలవుతుందా తేలే ఘడియ  తేలకముందే పార్టీలన్నీ రెండుముక్కలుగా పైనుంచి కిందవరకూ చీలిపోయాయి. ప్రాంతాల విషయం వచ్చేసరికి ఎవరికీ పార్టీల సంగతి పట్టడం లేదు. విధానాల సంగతి గుర్తు రావడం లేదు. పార్టీలు వేరయినా మాట్లాడేది ఒక్కటిగానే వుంటోంది. ఎదుటి వారిని చీల్చి చెండాడడానికి నాలుకలన్నీ ఒక్కటవుతున్నాయి. విద్వేషాగ్నులు రగల్చడానికి, నిందారోపణలు చేయడానికి సొంత పార్టీ వారు, పరాయి పక్షం వారు అన్న తేడా లేకుండా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్తితిని గమనించేవారికి ఎవరు యే పార్టీ వారో చప్పున ఒక పట్టాన చెప్పడం కష్టమవుతోంది. పైపెచ్చు వీరిలో అనేకమంది ఏదో ఒక పార్టీని నిజాయితీగా  అంటిపెట్టుకుని నిష్కళంక రాజకీయాలు చేస్తున్నవారు కాకపోవడం వల్లకూడా అయోమయం పెచ్చుపెరుగుతోంది. మొన్న మొన్నటి వరకూ వేరే పార్టీలో వుండి ఆ గూటి పలుకులు పలికి  ఇప్పుడు మళ్ళీ అదే నోటితో వేరే పలుకులు వల్లె వేయడం చూసి విస్తుబోవడం వీక్షకుల వంతు అవుతోంది. కళ్ళకు గంతలు కట్టి -  వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ  పేరేమీఅని అడిగినట్టు అడిగితే  'ఎవరు ఎవరో' చెప్పలేని దుస్తితి.          
గతంలో పార్టీ విధానాలను మీడియాకు వివరించడానికి ప్రతి పార్టీకి అధికార ప్రతినిధులు వుండేవారు.  ఇప్పటికీ లేకపోలేదు. కానీ పార్టీ పేరుపెట్టుకుని  ప్రతిఒక్కరూ మీడియాతో మాట్లాడేస్తున్నారు.  దానికి పార్టీ అనుమతి వుందా లేదా అన్నది వారికి  అప్రస్తుతం. వారు చెప్పేది పార్టీ విధానమా కాదా అన్నది మీడియాకు అప్రస్తుతం. ఇలా -  ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టుగా అప్పటికామాటలాడేవారితోనే మరింత గందరగోళం ఏర్పడుతోంది.
ఒక పార్టీ వారు చెప్పిన దానిని మరో పార్టీ వారు ఖండించే పద్దతి పోయి ఎవరి పార్టీవారిని వారే దుయ్యపట్టే కొత్త సంస్కృతి తాజాగా రూపుదిద్దుకుని వున్న  అయోమయాన్ని మరింత పెంచింది. అలాగే ఒక పార్టీని మరో పార్టీ సమర్ధించే విధానం కూడా పరిస్తితిని మరింతగా గందరగోళపరుస్తోంది. అవసరాన్నిబట్టి అవలంబిస్తున్న ఈ రెండు నాల్కల ధోరణి రాజకీయపార్టీల దివాళాకోరుతనాన్ని ఎత్తి  చూపుతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలదీ ఇదే వరస కావడం మరో విషాదం.
వీటన్నిటికీ తోడు, క్రికెట్ పరిభాష లోని  మ్యాచ్ ఫిక్సింగ్పదం  రాజకీయాల్లోకి దూసుకువచ్చింది. వీరు వారితో ఫిక్సయ్యారని ఒకరంటే, వారు వీరితో కుమ్మక్కయ్యారని మరొకరంటున్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో యక్షుడు అడిగి వుంటే ధర్మరాజు కూడా జవాబు చెప్పలేని స్తితి.
ఇంతటి  అయోమయం, ఇంతటి కంగాళీ వ్యవహారం, ఇంతటి దగాకోరు రాజకీయం గత నాలుగు దశాబ్దాల జర్నలిస్టు జీవితంలో ఏనాడు కనీ వినీ ఎరుగని విషయాలు.
ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని?
(16-02-2014)

ఏమి చెప్పుదు సంజయా!


ఆ వార్త దావానలంలా నగరంలో ఒక్కసారిగా గుప్పుమంది.
ఒకరు కాదు, ఇద్దరు కాదు ఒకేసారి చిత్రపరిశ్రమకు చెందిన ముగ్గురు – నిర్మాత, డైరక్టర్, రచయిత – ఓ హోటల్ గదిలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి వెళ్ళిన పోలీసులకు ఆ గదిలో ఓ లేఖ దొరికింది.
అందులో ఇలా వుంది.
విషయం : మహాభారతం మీద మీరు నిర్మించాలనుకున్న సినిమా
రిఫరెన్స్ : ప్రభుత్వం నుంచి  ఆర్ధిక సాయం కోసం  మీరు పెట్టుకున్న ధరఖాస్తు
అయ్యా !
మీరు పంపిన పై ధరఖాస్తు కింది సంతకందారు పరిశీలనకై వచ్చింది. 'మహాభారతం' అనే సినిమా తీయడానికి ప్రభుత్వ సాయం కోసం  మీరు పెట్టుకున్న అర్జీని  ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. మహాభారతం సబ్జెక్ట్ లోని కొన్ని అంశాలు మరీ సున్నితమైనవిగా భావించి ప్రభుత్వం ఈ ధరఖాస్తును పరిశీలించేందుకు ఒక అత్యున్నత  స్తాయి సంఘాన్ని ఏర్పాటుచేసింది.  మీరు దాఖలు చేసిన మహా భారతం  స్క్రిప్ట్ ను నిశితంగా  పరిశీలించిన తరువాత వాటిని ఈ కింది విధంగా క్రోడీకరించడం జరిగింది.    

1
. మీరు పంపిన స్క్రిప్ట్ లో  మహాభారతం కధలో వందమంది కౌరవులు, అయిదుగురు పాండవులు వుంటారని  పేర్కొన్నారు.  ఈ సంఖ్యల పట్ల కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆ శాఖ జారీ చేసిన మార్గదర్శిక సూత్రాల ప్రకారం ఒక కుటుంబంలో ఇంత మంది సంతానం వుండడం, అలాటి విషయాలను సినిమా మాధ్యమం ద్వారా ప్రచారం చేయడం ఆమోదయోగ్యం కాదు. చిన్న కుటుంబం ఆవశ్యకతను గురించి ప్రచారం చేయడం కోసం ప్రభత్వం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న దృష్ట్యా నూర్గురు కౌరవులను చూపించే మహాభారతం వంటి సినిమాలకు సాయం చేయరాదని ఆ మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడింది. ఈ చిత్రంలో కౌరవ పాండవుల సంఖ్యను మూడు దాటకుండా చూసుకోగలిగితే ఆర్ధిక సాయం చేసే విషయాన్ని పరిశీలించవచ్చని ఆ శాఖ సిఫారసు చేసింది.

2
. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ కధలోని మరో ప్రధాన అంశంపై అభ్యంతరం తెలిపింది. మహాభారతం స్ర్కిప్ట్ ప్రకారం కౌరవులు  క్లోనింగ్ విధానం ప్రకారం జన్మించినట్టు వుంది. ప్రస్తుత చట్టాల ప్రకారం భారత దేశంలో క్లోనింగ్ నిషేధం. ఈ దృష్ట్యా , కౌరవులు సాధారణ పద్ధతిలో జన్మించినట్టు స్క్రిప్ట్ ను మార్చాల్సివుంటుంది.
3
. జాతీయ మహిళా హక్కుల కమిషన్ అభ్యంతరం మరో రకంగా వుంది. అయిదుగురు పాండవులకు కలిపి ఒకే భార్య వున్నట్టుగా స్క్రిప్ట్ లో చూపించారు. మహిళలను  కించపరిచే  విధంగా రూపొందించిన ఈ కధను ఎట్టి పరిస్తితిలోను ప్రస్తుతం వున్నవిదంగా చూపించడం తగదని స్పష్టం చేసింది.
4
. ఈ చిత్రంలో దృతరాష్ట్రుడు అనే పాత్ర అనేక సందర్భాలలో కనిపిస్తుంది. అతడిని అనేక దృశ్యాలలో 'అంధుడు అంధుడు' అని నిందాపూర్వకంగా మాట్లాడిన అంశాలను తొలగించాలని  వికలాంగుల మంత్రిత్వశాఖ గట్టిగా సిఫారసు చేసింది.
5
.  ఓ ఘట్టంలో ద్రౌపది అనే స్త్రీ పాత్రను నిండు సభలో వస్త్రాపహరణం చేస్తున్నట్టు వుంది. ఇది  స్త్రీ జాతికే అవమానకరమని , ఈ సన్నివేశాన్ని  తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని మహిళా శిశు సంక్షేమ  శాఖ తన సిఫారసులో పేర్కొన్నది. ఇలాటి సన్నివేశాలను సినిమాల్లో చూపించడంవల్ల మహిళా సంఘాలనుంచి తీవ్ర వ్యతిరేకత  వ్యక్తం అయ్యే అవకాశం వుందని, దరిమిలా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావచ్చనీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ సన్నివేశాలను తొలగించకుండా స్క్రిప్ట్  ఆమోదించడం తమకు సమ్మతం కాదని పేర్కొన్నది.
6
. కౌరవ పాండవులను జూదరులుగా  చూపించారని, ప్రజల్లో జూద ప్రవృత్తిని ప్రోత్సహించే విధంగా వున్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని కూడా సూచించింది.  అంతగా కధకు అవసరం అనుకుంటే  కౌరవ పాండవులు గుర్రపు పందేల్లో పోటీ పడినట్టు చూపించుకోవచ్చని సూచించింది. గుర్రపు పందేలు జూదం కిందికి రావని సుప్రీం కోర్టు  గతంలో పేర్కొన్న  విషయాన్ని హోం శాఖ తన సిఫార్సుకు జత చేసింది.
ఇన్ని కారణాల దృష్ట్యా మహాభారతం సినిమా స్క్రిప్ట్ ను తదనుగుణంగా మారిస్తే తప్ప ఆర్ధిక సాయం చేసే విషయాన్ని పరిశీలించడం జరగదని ఆ లేఖలో స్పష్టం చేయడం జరిగింది.  

తెలుసా ఎవరికయినా?

Antonia Edvige Albina Maino - ఎవరో తెలుసా ? అని మల్లాది గారు అడిగారు.
తెలుసా ఎవరికయినా?

కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే?



“కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వా
రేరీ? సిరి మూటన్ కట్టుకొని పోవంజాలిరే?...........................”
ఇది పోతన గారి పద్యం. వామనావతార ఘట్టంలోది. వామనుడు నిజానికి విష్ణువని, బలిని నాశనం చెయ్యటానికే వచ్చాడని గ్రహించిన శుకృడు వామనుడికి దానం ఇవ్వొద్దని బలిని హెచ్చరిస్తూ లోకంలో ఏదీ శాశ్వితం కాదన్న భావాన్ని వ్యక్తం చేసే సందర్భం.
పోతనగారి కవితా భావావేశాన్ని ఇక్కడికి వొదిలి చికాగో లోని ఎడ్జ్ వాటర్ బీచ్ హోటల్లో జరిగిన ఒక సమావేశం గురించి చెప్పుకుందాం. ఆ రోజు  ఆ హోటల్లో ఏడుగురు అతిరధ మహారధులు సమావేశం అయ్యారు. వారిలో ఎవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ఎందుకంటే ఇదంతా  తొంభయ్ ఏళ్ళ కిందటి ముచ్చట. 1923లో జరిగిన ఈ సమావేశానికి హాజరయిన గొప్పగొప్ప వాళ్ళందరూ కేవలం పాతికేళ్ళ కాలం గడిచేసరికి  ఏమయ్యారో చెప్పడానికే పోతనగారి పద్యం జ్ఞాపకం చేసుకోవాల్సివచ్చింది.
వారిలో ఒకరు  అతిపెద్ద ఉక్కు కర్మాగారం – బెత్లేహం స్టీల్ కార్పోరేషన్ అధిపతి చార్లెస్ ఎం. స్కెవాబ్. కంపెనీ అప్పుల్లో కూరుకుపోయి   దివాళా తీసి దీన స్తితిలో  చనిపోయాడు.
అప్పట్లో అతిపెద్ద పెట్రోలు కంపెనీ అధినేత హోవార్డ్ హబ్ సన్. పాపం మతిచెడిన స్తితిలో ఈ అపర కుబేరుడు కన్ను మూసాడు.
గోధుమ వ్యాపారంలో కోట్లు గడించిన సంపన్నుడు ఆర్ధర్ క్యుతెన్ సర్వస్వం కోల్పోయి అతి పేదరికంలో అంతిమ శ్వాస విడిచాడు.
ఆరోజుల్లో న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్ చైర్మన్ రిచర్డ్ విట్నీ జైలు పాలయ్యాడు.
ప్రెసిడెంట్ హార్డింగ్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రి ఆల్బర్ట్ ఫాల్  కొంతకాలం జైలు వూచలు లెక్కబెట్టాడు. క్షమాబిక్ష పొంది ఇంటికి వెళ్ళిన కొద్దికాలానికే మరణించాడు.
వాల్ స్ట్రీట్  షేర్ల వ్యాపారంలో చేయితిరిగిన జెస్సీ లివర్ మోర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అలనాడు వ్యాపార సామ్రాజ్యాన్ని కంటి చూపుతో శాసించిన ఇవార్ కృగర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటర్ నేషనల్ సెటిల్ మెంట్ బ్యాంక్  ప్రెసిడెంట్ లియోన్ ఫ్రేజర్ సైతం ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
అతి పెద్ద యుటిలిటీ కంపెనీ అధినేత అయిన సామ్యూల్ ఇన్సల్ చేతిలో చిల్లి గవ్వ లేకుండా అసువులుబాసాడు.
వీరంతా డబ్బు యెలా సంపాదించాలి అన్న యావలోనే జీవితాల్ని గడిపారు కానీ యెలా జీవించాలి అన్న విషయాన్ని ఏనాడు పట్టించుకోలేదు.
డబ్బు చెడ్డది కాదు. మనిషికి అత్యవసరమైన  కూడూ గుడ్డా ఏర్పాటు చేసుకోవడానికి ధనం అవసరమే. కానీ అదే సర్వస్వం కాదు. అది శాశ్వితం కూడా కాదు. అలనాడు బలి చక్రవర్తి చెప్పింది అదే.
(నెట్లో సంచారం చేస్తున్న ఒక ఆంగ్ల వ్యాసానికి సంక్షిప్తంగా స్వేచ్చగా చేసిన అనువాదం) 


15, ఫిబ్రవరి 2014, శనివారం

వెనకడుగు వేద్దాం రండి !


“జీవితమంటే శక్తి. బలహీనతకు మరోపేరే మృత్యువు. మన వూహలు,ఆలోచనలు,ఆశలు,ఆశయాలు అన్నీ మన జీవితాల్లో భాగమే!” – స్వామి  వివేకానంద


అరవయ్యో పడిలో పడ్డ చాలామంది ఏదో తెలియని అభద్రతా భావంతో కలత చెందుతుండడం కద్దు. వయసు మీద పడుతోందన్న భావన కావచ్చు. జీవితం మలిసంధ్యలో అడుగు పెడుతున్నామన్న భయం కావచ్చు. సంఘంలో, కుటుంబంలో తమకున్న ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతున్నదేమో అన్న  బాధ  కావచ్చు. కారణం ఏదయినా వయసు మీరుతున్నవారిలో ఈ రకమయిన ఆందోళనలు  సహజం. అయితే వీటిని అధిగమించి జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవడం అసాధ్యమేమీ కాదంటున్నారు జీవితాన్ని కాచి వడబోసిన వాళ్లు.       
ముందు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ముసలితనం వచ్చేసిందని చెప్పుకోకపోవడం.
వయసుల్లో మూడు రకాలున్నాయి.జనన తేదీ ప్రకారం చెప్పుకునే వయసు ఒకటయితే,రెండోది శారీరిక ఆరోగ్యం ఆధారంగా అంచనా వేసేది. ఇక మూడో వయస్సు అనేది మన భావనలు  బట్టి ఆలోచనలు బట్టి నిర్ధారణ అవుతుంది. ‘కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు’ అని శ్రీ శ్రీ రాసింది ఇలాటి వారి గురించే.
ఇందులో మొదటి దానిమీద మనకు కంట్రోల్ వుండని మాట నిజమే. నిజానికి ఆ వయసును ఏమాత్రం మార్చలేము, ఏమార్చలేము.
కాకపోతే రెండోదాన్ని మానవ ప్రయత్నంతో  కొంతవరకు అడ్డుకోవడానికి వీలవుతుంది. అంటే సరయిన  పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మనసును ఉల్లాసంగా వుంచుకోవడం ద్వారా కొంతమేరకు వయసు ప్రభావం శరీరం మీద పడకుండా చూసుకోవచ్చు. సానుకూల వైఖరి, ఆశావహ దృక్పధం పెంపొందింపచేసుకోవడం వల్ల మూడో రకం వయస్సును అదుపుచేసుకోవడానికి  కుదురుతుంది.
ఆరోగ్యమే మహా భాగ్యం అనే సూక్తి చిన్నప్పటినుంచి వింటున్నదే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సూక్తిలోని ‘భాగ్యానికి’ నిర్వచనాన్ని మార్చుకోవాల్సి వుంటుంది.
భాగ్యం అంటే సంపద కాదు. బ్యాంకుల్లో వుండే డబ్బు కాదు. కుటుంబం అందరూ ఆనందంగా సంతోషంగా వుండడం. వయసు మళ్లి  పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఆలోచించుకోవాల్సింది డబ్బు గురించి  కాదు. ఆరోగ్యంగా వుండేట్టు చూసుకోవడం ముఖ్యం. వెనుకటి మాదిరిగా ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లిపోయింది. ఉద్యోగాలు, ఉపాధులు వెతుక్కుంటూ పిల్లలు దూర ప్రాంతాలకు, ప్రదేశాలకు తరలివెడుతున్న కాలమిది. రోగం రొష్టూ పేరుతొ వారిని ఇబ్బందుల పాలు చేయకుండా ఆరోగ్యాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈనాటి పెద్దతరంపై వుంది. కొద్దిపాటి క్రమశిక్షణ అలవరచుకుంటే ఇదేమంత పెద్దపని కాదు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్య భీమా పాలసీ తీసుకోవడం, డాక్టర్ రాసిచ్చిన మందులు సక్రమంగా  వేసుకోవడం – ఇలా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలిగితే పిల్లల్ని అనవసర శ్రమలనుంచి రక్షించినవాళ్ళవుతారు.            
ధనమూలం ఇదం జగత్!
డబ్బుతో ఆనందాన్ని కొనడం వీలుకాదు కాని ఆనందంగా జీవించడానికి  డబ్బు కావాలి.
అందుకే పశువుకు తిన్నది దండి మనిషికి వున్నది దండి అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజంలో గౌరవంగా జీవించడానికి, కుటుంబ సభ్యులనుంచి ప్రేమాదరాలు పొందడానికి, ఎంతో కొంత సొంత సొమ్ము ప్రతి ఒక్కరికీ అవసరం. వయస్సు మీదపడ్డ తరువాత శారీరిక శ్రమ చేసి సంపాదించడానికి వీలులేని రోజుల్ని ముందుగానే అంచనా వేసుకుని  భద్రమయిన భవిష్యత్ జీవితం కోసం తమకంటూ కొంత మొత్తాన్ని  కూడబెట్టుకోవడం చాలా అవసరం. దీన్ని స్వార్ధం అని ఎవ్వరూ అనుకోరు. మీ పిల్లలు మీ అవసరాలను కనుక్కోగలిగితే అది బోనసుగా భావించాలి. మీ అవసరాలు కనుక్కోలేని అవసరాలు వాళ్లకు వుంటే దాన్ని పెద్దమనసుతో అర్ధం చేసుకునే పెద్దరికం మీకుండాలి. అప్పుడే ముదిమి వయస్సులో చీకూ చింతా లేని జీవితం మీ సొంతమవుతుంది.

హాయిగా మనసెంతో తీయగా
మనసును హాయిగా వుంచుకోవాలి. ఇతరులను హాయిగా వుంచాలి. కుర్రవాళ్లల్లో కుర్రవాళ్ళుగా మసలగలగాలి. అంటే టీ షర్టులు వేసుకోవడం, షార్టులు ధరించడం కాదు. ‘మా రోజుల్లో అయితే...’ అంటూ నస పెట్టకుండా వాళ్లకు నచ్చేరీతిలో మీ రోజుల్లోని సంగతులను మనసుకు హత్తుకునే పద్దతిలో చెప్పడం  అలవరచుకోవాలి. వేళకు నిద్రపోవడం, చక్కటి సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడం, నిత్య జీవితంలో హాస్యాన్ని ఆస్వాదించగలగడం – ఇవన్నీ మనసుకు హాయినిచ్చి వయసును తగ్గిస్తాయి.      
సమయం అమూల్యం
ఈ జీవన యానంలో సంపాదించింది యెంత వున్నా పోగొట్టుకున్నది, పోగొట్టుకునేది  మాత్రం అమూల్యమయిన సమయాన్నే అని గుర్తు పెట్టుకోవాలి. ఇకనుంచీ ప్రతి రోజూ కొత్తగా మళ్ళీ పుట్టామని అనుకోవాలి. నిన్న అనేది క్యాన్సిల్ చేసిన చెక్కు. రేపనేది ప్రామిసరీ నోటు. పోతే,  ఈ రోజు అనేది వుంది చూసారూ అది మాత్రం  చేతిలో వున్న పైకం. దాన్ని జాగ్రత్తగా ప్రయోజనకరంగా వాడుకోగలగాలి. ప్రతి క్షణాన్ని జీవించడం, ఆస్వాదించడం  నేర్చుకోవాలి. 
మార్పు శాశ్వితం.
మారుతూ  వున్నప్పుడు అది శాశ్వితమెలా అవుతుందన్న అనుమానాలు పెట్టుకోకూడదు. మార్పును అంగీకరించడం అంటే వరద వాలులో కొట్టుకుంటూపోవడం కాదు. మార్పు అనివార్యం. ఈ సత్యం అంగీకరించగలిగితేనే యువ తరంతో, రానున్న తరంతో  సంబంధాలు బాగుంటాయి. పిల్లలు చెప్పేదేమిటి అని కొట్టిపారేయకుండా ఆ చెబుతున్న దానిలో కొత్తదనాన్ని గ్రహించగలిగితే ‘ముసలి వాసనలు’ మన నుంచి తప్పుకుంటాయి.   కాలక్రమంలో చోటుచేసుకున్న మార్పుల ఫలితంగానే మన జీవితాలు  ఇప్పుడిలా  సుఖప్రదంగా గడుస్తున్నాయన్న  వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి.  
నాకేమిటి?
స్వార్ధం లేని మనిషంటూ వుండడు.ఏమిచేసినా దీనివల్ల ‘నాకేమిటి’ అనేవాళ్ళే ఎక్కువగా తారసపడుతుంటారు.కానీ వున్న ఈ చిన్ని జీవితంలో అవసరంలో వున్నవాడికి సాయపడడం వల్ల కలిగే సంతృప్తికి ఏదీ సమానం కాదు.ఇచ్చుటలో వున్న హాయిని కనీసం జీవితం చరమాంకంలో కూడా అనుభవించలేకపోతే ఇక దానికి సార్ధకత లేనట్టే. ఆ జీవితానికి అర్ధం లేనట్టే.
మరచిపో !మన్నించు!!
ఈ రెండుపదాలు చాలా చిన్నవే అయినా నిజానికి  ఎంతో గొప్పవి.ఇతరుల తప్పిదాలు గురించి అస్తమానం ఆలోచించడం వల్ల వొరిగేదేమీ వుండదు.ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపడానికి మనం గాంధీలం కాకపోవచ్చు.  కానీ వయసు మీదపడుతున్న దశలో మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం ఈ మాత్రం సర్దుబాట్లు అవసరం. లేకపోతే పెరిగేది మన ‘బీపీ’నే. 
ఇక ఆఖరుదీ అతి ముఖ్యమైనదీ ఏమిటంటే
మరణ భయం
జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి వ్యక్తీ గిట్టక తప్పదు. ఇది తెలియని వాళ్లు వుండరు. కానీ తెలియనట్టుగా వుంటారు. రేపు పదవీ విరమణ చేసే వ్యక్తి కూడా చేస్తున్న ఉద్యోగం  శాశ్వతమే అన్న భ్రమలో వుంటాడు. అలాగే మరణం తధ్యమని తెలిసీ అది తన జోలికి రాదన్న భ్రాంతిలో మనుషులు బతుకుతారు. శరీరం బలహీనపడి, అభద్రతాభావం బలపడి ఒక్కసారి మరణ భయం పట్టుకున్నదంటే చాలు ఇక ఆ మనిషి మరణానికి చేరువయినట్టే. మనం చనిపోతే భార్యా పిల్లలు తట్టుకోలేరన్న మరో అర్ధం లేని అనుమానం మనిషిని పీడిస్తుంది. కానీ సకృత్తుగా తప్ప ఇది జరిగే పని కాదు. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి కుటుంబంలోని వారు బాధ పడడం సహజం. కానీ  ఆ బాధ, ఆ ఆవేదన  శాశ్వితంగా అలాగే వారిని అంటుకుని వుండవు. కాలమే అలాటి గాయాలు మానిపోయేలా చేస్తుంది. అది ప్రకృతి ప్రసాదించిన వరం.
అందుకే మరణం గురించి ఆలోచించడం శుద్ద దండుగ.
జీవితాన్ని అరవైల్లో కూడా మళ్ళీ మొదలు పెట్టవచ్చు. అది మన చేతుల్లోనే వుంది.
వయస్సు మళ్ళిన స్నేహితుల్లారా రండి. దర్జాగా  వెనుకడుగు వేద్దాం పదండి. వెనుకటి జీవితాన్ని మళ్ళీ ఆస్వాదిద్దాం రారండి.

'ఐశావిట్, నోశావిట్'



అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పుడు స్పీకర్ నోటి వెంట - అర్ధం అయీ కానట్టుగా  'ఐశావిట్, నోశావిట్' అనే పదాలు వినబడుతుంటాయి. నిజానికి వీటిని 'ayes have it, noes have it' అని పలకాలి.
కాలిన్స్ ఇంగ్లీష్ నిఘంటువు ప్రకారం - ayes have it అంటే  those who voted in favour of something have won (ఎక్కువమంది అనుకూలురు).noes have it అంటే there is a majority of votes in the negative (ఎక్కువమంది వ్యతిరేకులు)