కరెంటులో బల్లి పడింది
‘హైదరాబాదులో మీకు ఒక్కరికే అధికారులు స్పందిస్తారా’ అని ఒక మిత్రుడు మెసేజ్ పెట్టారు. ఒక్కోసారి నాకూ ఈ అనుమానమే వస్తుంటుంది. జర్నలిస్టు అవతారం చాలించి జనసామాన్యంలో నలుగురితో నారాయణ అంటూ జీవితం ప్రారంభించి కూడా ఇరవై ఏళ్ళు దాటిపోయింది. నాకు తెలిసిన అధికారులు కూడా తదనంతర కాలంలో రిటైర్డ్ జాబితాలో చేరిపోయారు.
పూర్వకాలంలో అంటే సుమారు యాభయ్ ఏళ్ళ క్రితం, ట్రాన్స్కో , జెన్కోల ఆవిర్భావానికి ముందు, ఉమ్మడి రాష్ట్రంలో ఈ రెంటికి కలిపి ఒకే ఒక సంస్థ, రాష్ట్ర విద్యుచ్ఛక్తి సంస్థ వుండేది. దానికి చైర్మన్ డాక్టర్ నార్ల తాతారావు.
అందులో ఎంతమంది పనిచేస్తున్నా, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎవరు పవర్ ఫుల్ అంటే చైర్మన్, తరువాత లైన్ మన్ అనే వారు. ముఖ్యమంత్రి మాట కూడా చైర్మన్ తాతారావు గారి తర్వాతనే చెల్లుబడి అయ్యేది. ఆయన సమర్థతే ఆయనకు ఈ హోదా తెచ్చిపెట్టింది.
నేను రేడియోలో చేరిన కొద్ది కాలం తర్వాత ఆయన్ని కలుసుకునే అవకాశం నాకు లభించింది. ఏదో ఒక సందర్భంలో తాతారావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆఫీసులో చిన్న హాలు లాంటి సమావేశ మందిరం. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ పత్రికల ప్రతినిధులు అందరూ వచ్చారు. అయినా కొన్ని కుర్చీలు ఖాళీగానే వున్నాయి. ఆ రోజుల్లో విలేకరుల సంఖ్య తక్కువ కావడం వల్ల అధికారులకు విలేకరులను పేరుతొ పలకరించేంత చనువు వుండేది.
ఎదురుగా కూర్చొన్న విలేకరులలో అధిక శాతం నెల సరి వేతనాల దృష్ట్యా బీపీఎల్ బాపతు అని తాతారావు గారికి కూడా తెలుసల్లే వుంది. అంచేత తాను చెప్పాల్సింది తాను చెప్పిన తర్వాత, విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా, లేవనెత్తిన సమస్యలకు సానుభూతిగా జవాబులు చెబుతూ, ‘మీలో ఎవరికైనా కరెంటు సమస్య వస్తే, ఇదీ నా ఇంటి నెంబరు, (ఆ రోజుల్లో అందరికీ ల్యాండ్ లైన్ ఫోనులే) ఏ సమయంలో అయినా ఫోన్ చేయండి’ అని ఉదారంగా ప్రకటించి, అందరికీ ఆ నెంబరు ఇచ్చారు.
ఆ రోజుల్లో త్రీ ఫేజ్ కరెంటు అనేది చాలా అరుదైన గృహాలలో మాత్రమే వుండేది. చాలా ఇళ్లకు టు ఫేజ్ కావడంతో సరఫరాలో హెచ్చుతగ్గులు బాగా వుండేవి. కరెంటు రాకడ పోకడ ఎవరు చెప్పగలరు అనుకునే వాళ్ళు.
మరి విలేకరులలో ఎంతమంది తాతారావు గారు ఇచ్చిన ఈ వెసులుబాటును ఉపయోగించుకున్నారో లేదో నాకు తెలియదు కానీ, నా నుంచి ఆయనకు తాకిడి ఎక్కువైంది. చివరికి ఆయన విసుగు నషాళానికి అంటిందేమో, ‘ఇక ఇలా తడవతడవకు ఫోన్ చేయకుండా మీ ఇంటి దగ్గరే ఒక ట్రాన్స్ ఫార్మర్ వేయిస్తాను’ అని చెప్పారు. చెప్పడమే కాదు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వేయించారు కూడా.
ఆ వైభోగం కొన్నాళ్ళు అనుభవించిన తర్వాత, కుటుంబ సమేతంగా మాస్కో వెళ్ళడం, అక్కడ ఓల్టేజ్ హెచ్చుతగ్గులు లేని, కన్నుకొట్టని కరెంటు దీపాల భాగ్యాన్ని అయిదేళ్లు అనుభవించి హైదరాబాదు తిరిగి వచ్చాము. అప్పటికి దాదాపు అన్ని గృహాల్లో త్రీ ఫేజ్ సదుపాయం వచ్చింది. అయినా కరెంటు కోతల సమస్య తప్పలేదు.
కొన్నేళ్ళ క్రితం, మా అపార్ట్ మెంటులో తరచుగా ఈ సమస్య ఏర్పడేది. అన్ని ఫ్లాట్స్ లో ఇన్వర్టర్లు వున్నాయి. లిఫ్ట్ పనిచేయాలి అంటే మాత్రం కరెంటు కావాలి. ఇలా ఒకదానితో మరొకటి ముడి పడి వున్న సమస్యలతో చాలా ఏళ్ళుగా నెట్టుకు వస్తున్నాము.
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి నాకు తెలిసిన దారి, మిగిలిన దారి ఒక్కటే, సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టి ఊరుకోవడం. అదే చేశాను. నా పోస్టుకు ముగ్గురు, నలుగురు ఉన్నతాధికారులు తక్షణం స్పందించడం నాకు ముచ్చటేసింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను వాళ్లకి ఒకటే చెప్పాను. కరెంటు సమస్య కంటే కూడా మీ ప్రతిస్పందన నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని.
అందరికీ ఇలా జరుగుతుందా అనేది నిజంగా శేష ప్రశ్నే. నా దగ్గర కూడా జవాబు లేదు.
ఒక రోజు మళ్ళీ కరెంటు పోయింది. కాకపోతే ఈసారి చాలాసేపు పోయింది. కరెంటు లేకపోయినా నెట్ పనిచేస్తోంది. ఇకనేం నా చేతిలో వున్న పనిచేశాను. చేతులకు పని చెప్పి ఒక పోస్టు రాశాను.
ఆనంద్ గారనే పెద్దమనిషి ఫోన్ చేశారు. ఆయన పెద్ద మనిషే కాదు, విద్యుత్ శాఖలో పెద్ద అధికారి కూడా. SE. (ఇప్పుడు చీఫ్ ఇంజినీర్).
ఓ బల్లి కారణంగా విద్యుత్ సరఫరాకు కొంత అంతరాయం కలిగిందని చెబితే ఆశ్చర్యపోయాను. చెట్ల కొమ్మల రాపిడి వల్ల అప్పుడప్పుడూ ఇలా జరుగుతుందని తెలుసు. కానీ బల్లి పాటు వల్ల కూడా కరెంటు ట్రిప్ అవుతుందన్న మాట.
సరే! ఈ సంగతి పక్కనపెడితే నేను చెప్పేది ఒక్కటే. స్పందించే అధికారులు, సిబ్బంది వుంటే ప్రజలకు ఓ భరోసా వుంటుంది. చెప్పింది వినే నాధుడు వుంటే సగం సమస్య తీరుతుందంటారు.
ఈసారి ఏకంగా ట్రాన్స్ ఫార్మర్ సమస్య వచ్చింది. దాని కారణంగానో ఏమో తెలియదు, లిఫ్ట్ పనిచేయడం మానేసింది. ట్రాన్స్ ఫార్మర్ మార్చాలి అన్నారు. ఎలా అన్నది మరో సమస్య.
కిందటి పోస్టులో ఇదే సమస్య రాశాను.
‘ఈ రోజు దుర్గాష్టమి. రేపు నవమి నాడు ఫస్ట్ అవర్ లో కొత్త ట్రాన్స్ ఫార్మర్ వేయిస్తాము’ అని మెసేజ్ వచ్చింది.
ఏమీ మా అదృష్టం అనుకున్నాను.
ఈరోజు నవమి బుధవారం. మధ్యాన్నం అయింది కానీ ట్రాన్స్ ఫార్మర్ జాడ లేదు. మూడయింది. అదే ఎదురుచూపు.
నేను అన్నం వండుకునేది ఎలక్ట్రిక్ కుక్కర్ లో. కూరలు అవీ ఇంటి దగ్గరలో వున్న ఫుడ్ కేటరర్స్ వాళ్ళు క్యారేజీలో పంపిస్తారు. అవి వచ్చాయి. వంటమనిషి ఉదయం వచ్చి టిఫిన్ చేసిపెట్టి, బియ్యం కడిగి గిన్నెలో పెట్టి వెడుతుంది. తినడానికి ఒక అరగంట ముందు కుక్కర్ ఆన్ చేస్తాను.
చూసి చూసి కుక్కర్ ఆన్ చేశాను. అది ఆన్ అయి వెంటనే ఆఫ్ అయింది. ట్రాన్స్ ఫార్మర్ రాకపోగా వున్న కరెంటు పోయింది. ఇదేమిటి అని అడగడానికి ఒక అధికారికి ఫోన్ చేయబోయాను. కానీ లైను కలిసే లోగా ఆయనే ఫోన్ చేశారు. ‘మా వాళ్ళు వచ్చారు. పని పూర్తయిందని చెప్పారు’.
ఇంతలో కరెంటు కూడా వచ్చింది. దానితో పాటు నలుగురు ట్రాన్స్ కో సిబ్బంది మా ఫ్లాట్ లోకి వచ్చారు. తమని తాము పరిచయం చేసుకున్నారు. ‘అరె! పైకి ఎలా వచ్చారు, మెట్లెక్కి వచ్చారా’ అని నా పలకరింపు. ‘కాదు, లిఫ్ట్ లో వచ్చాము. కొత్త ట్రాన్స్ ఫార్మర్ వేశాము. అందుకోసమే ఒక అరగంట సప్లయి ఆపేశాము’ అన్నారు.
‘పన్నెండు గంటల లోపే క్రేన్ తీసుకుని వచ్చాము. అప్పటికే మీ పక్క గుడి వాళ్ళు భక్తులకు అన్నవితరణ చేస్తున్నారు. అది పూర్తయ్యే వరకు పక్క వీధిలో వెయిట్ చేశాము’ అని ఆలస్యానికి వివరణ ఇస్తుంటే, ‘ఇంకా నయం మాట తూలినవాడిని కాదు’ అని మనసులో అనుకున్నాను.
అతిథి మర్యాదలు చేయడానికి ఇంట్లో వసతి లేని వాడిని కనుక వారిలో ప్రతి ఒక్కరికీ మనఃస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పాను.
వారితో ఫోటో దిగాను.
కింద ఫోటో అదే:
శ్రీయుతులు మల్లేశం (ఫోర్మన్), వెంకటనారాయణ (లైన్ మన్), ఆకాష్ ( జూనియర్ లైన్ మన్), సురేశ్ (ఆర్టిజన్)
(ఇంకా వుంది)
01-10-2025
1 కామెంట్:
కామెంట్‌ను పోస్ట్ చేయండి