అంతకు ముందు వరకు మాస్కో వెళ్ళడం గురించి ద్వైదీభావం. చలి దేశం. పిల్లలు స్కూలు చదువుల్లోనే వున్నారు. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ స్కూళ్ళల్లో అడ్మిషన్లు మళ్ళీ మొదటికి వస్తాయి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి. ఇన్నేళ్ళ కాపురంలో టీవీలు, ఫ్రిజ్ లు వంటి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయలేదు. మా రెండో అన్నయ్య కలర్ టీవీ కొనుక్కున్నప్పుడు, అప్పటివరకు వాడిన బ్లాక్ అండ్ వైట్ టీవీ, మా ఆవిడ పిన్ని కొడుకు ప్రకాష్ తాను పెద్ద ఫ్రిజ్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన పాత సింగిల్ డోర్ ఫ్రిజ్, బెజవాడలో వున్నప్పుడు ఇండియన్ బ్యాంకు వాళ్ళు జర్నలిస్టులకు ఇచ్చిన వెయ్యి రూపాయల రుణంలో ఆరువందలు పెట్టి కొనుక్కున్న స్టీలు అల్మరా. నాలుగు ఇనుప కుర్చీలు, రెండు డెకొలాం మంచాలు ఇవీ మా చరాస్తులు.
హెల్మెట్
సంఘటన తర్వాత మనసు గాయపడింది. పోలీసులు, అరెస్టులు అనే పదాలు సాంప్రదాయ కుటుంబ వాతావరణంలో పెరిగిన మా
వారందరికీ ఒక రకమైన మానసిక క్లేశాన్ని కలిగించాయి.
అప్పటికే
కొందరం జర్నలిస్టులం మొదలు పెట్టిన యాంటీ హెల్మెట్ ఉద్యమంతో సీనియర్ పోలీసు
అధికారులు మా పట్ల మనస్తాపంతో వున్నారు. నన్ను అరెస్టు చేయడం, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ సంఘటనపై దర్యాప్తు కోసం వన్ మ్యాన్ కమిషన్
ఏర్పాటుచేయడం, ఆ
వెంటనే నా మాస్కో ప్రయాణం ఇవన్నీ మా నడుమ
సత్సంబంధాలలో పైకి కనబడని తేడా తీసుకువచ్చాయి.
నేను
మాస్కో వెళ్ళేటప్పుడు పీ ఎస్ రామమోహన
రావు గారు డీజీపీ. నిఖార్సయిన పోలీసు అధికారి.
అంతకు
మునుపు ఆయన ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఖమ్మం బస్ స్టాండులో ఒక
ఉద్యోగితో సీటు రిజర్వేషన్ విషయంలో పేచీ వచ్చింది. హైదరాబాదు రాగానే ఘాటుగా ఓ
పిర్యాదు రాసి పంపించాను. మూడు రోజుల తరువాత అనుకుంటాను, అదే ఉద్యోగి మా
మేనల్లుడిని వెంటబెట్టుకుని హైదరాబాదు వచ్చాడు.
‘ఏదో తెలియక
చేసాడు, ఇప్పుడు
ఎమ్డీ గారు నీ పిర్యాదు మీద చాలా దూరం ట్రాన్సఫర్ చేశారు, నాకు బాగా తెలిసిన వాళ్లు. నువ్వే
మళ్ళీ ఏదో సర్ది చెప్పి బదిలీ క్యాన్సిల్ చేయించు’ ఇదీ మా వాడి రాయబారం.
సరేనని ఆయన
ఆఫీసుకు వెళ్ళి కలిసి విషయం చెప్పాను. అప్పుడాయన ఇలా అన్నారు.
‘మీరు
కంప్లయింటు ఇచ్చారు. మీ మీద గౌరవం కొద్దీ విచారణ కూడా జరపకుండా బదిలీ చేసాను. అదీ
నేను చేసిన పొరబాటు. ఇప్పడు మీ మాట విని మరో పొరబాటు చేయడం ఇష్టం లేదు. బదిలీ
క్యాన్సిల్ చేయడం చిటికెలో పని. కాని సంస్థలో డిసిప్లిన్ మాటేమిటి. ఎమ్డీ
ట్రాన్స్ఫర్ చేస్తే నాకొక లెక్కా! ఒక్క రోజులో మళ్ళీ క్యాన్సిల్ చేయించుకున్నానని
అందరితో చెప్పుకుంటాడు. క్రమశిక్షణ దెబ్బతింటుంది. ముందు పోయి వేసిన చోట జాయిన్
కమ్మని చెప్పండి. ఓ ఆరు నెలల తరువాత మళ్ళీ వెనక్కు వేస్తాను’
దట్ ఈజ్
రామ్మోహనరావు గారు!
అంత
పరిచయం వున్న డీజీపీ రామమోహన రావు గారిని మాస్కో వెళ్ళబోయేముందు ఆయన ఆఫీసుకు వెళ్ళి
కలిసాను. చాలా ఆప్యాయంగా పలకరించి క్షేమ సమాచారాలు కనుక్కుని, వీడ్కోలు చెబుతూ ఒక
మాట అన్నారు. ‘మాస్కోలో పోలీసులతో జాగ్రత్త. మన దగ్గరలా హెల్మెట్ల విషయంలో ఠలాయిస్తే కుదరదు.’ ఆయన శైలి అది.
అయితే మాస్కో వెళ్ళడం అన్నది అంత సులభంగా ఏమీ జరగలేదు. ఆ రోజుల్లో, రేడియో మాస్కోలో ఆకాశవాణి తరపున తెలుగు విభాగంలో పనిచేస్తున్న శ్రీ ఏడిద గోపాలరావు మాతృసంస్తకు తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమయింది. తెలుగులో వార్తలు చదివే రేడియో న్యూస్ రీడర్లలో, మాస్కోకి సెకండ్ మెంట్ (డిప్యుటేషన్) మీద వెళ్ళే అర్హత వున్నది కేవలం శ్రీ డి. వెంకట్రామయ్యకు మాత్రమే. నిజానికి నేను న్యూస్ రీడర్ ని కాదు. రేడియో విలేకరిని. చలి దేశానికి
వెళ్ళడానికి ఆరోగ్య కారణాల వల్ల ఆయనకు వీలులేకపోవడంతో ఆ దండ నా మెడలో
పడింది. మా
సీనియర్ కొలీగ్ శ్రీ ఆకిరి రామకృష్ణారావు పూనికతో ఆ అవకాశం నాకు దక్కింది. మాస్కోకి వెళ్ళడానికి అవసరమయిన అనుమతులూ గట్రా లభించడానికి దొరికిన వ్యవధిలో, నాకు
తారసపడిన అనేక మంది గొప్ప వ్యక్తులు, 'ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాము, ఎన్నెన్నో నగరాలు చుట్టబెట్టాము. కానీ, మాస్కో చూడాలన్నది మా చిరకాల స్వప్నం' అనేవారు. దాంతో మాస్కో వెళ్ళాలనే ఆసక్తి నాలో కూడా బాగా పెరిగిపోయింది.
రేడియో
మాస్కోలో పనిచేయడానికి నిర్ణయం జరిగింది కానీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు
రావడంలో జాప్యం జరుగుతోంది. విషయం తెలుసుకుందామని నేనూ, అప్పుడు రేడియో న్యూస్ ఎడిటర్ గా
పనిచేస్తున్న ఆకిరి రామకృష్ణారావు గారు కలిసి రైల్లో ఢిల్లీ వెళ్లాం. ఏపీ భవన్ లో దిగి బ్రేక్ ఫాస్ట్
పూర్తిచేసుకుని ఆఫీసు పని వేళలకి ఇంకా కొంత సమయం ఉండడంతో, అప్పుడు కేంద్ర మంత్రిగా
వున్నపి. శివశంకర్ గారి ఇంటికి ఫోను చేసి
వస్తున్నట్టు ఆకిరి చెప్పారు. ముందే కబురు చేయడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు వెంటనే
లోపలకు పంపారు. ముందు గదిలో శివశంకర్ గారు కూర్చుని వున్నారు. మమ్మల్ని సాదరంగా పలకరించి
వచ్చిన పని ఏమిటని వాకబు చేసారు. ఆకిరి సంకోచించకుండా నా మాస్కో ఆర్డర్లు లేటవుతున్నాయని
చెప్పారు. ఆయన వెంటనే రాక్స్ ఫోనులో (మాట్లాడే విషయాలు ఇతరులకు తెలిసే అవకాశం లేని
ఫోన్లు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమైన సీనియర్ అధికారుల ఇళ్ళల్లో
మాత్రమే వుంటాయి) సమాచార శాఖ కార్యదర్శితో మాట్లాడి నా విషయం చెప్పారు. ఆయన
పదిగంటలకు ఆఫీసుకు పంపించమని చెప్పారు. ఢిల్లీ వచ్చిన పని అనుకోకుండా శివశంకర్ గారిని కలవడంతో పూర్తయింది.
దాంతో ఆయనతో కాసేపు అవీ ఇవీ మాట్లాడి, ఆయన ఇచ్చిన కాఫీ తాగి బయట పడ్డాము. పది గంటలకల్లా శాస్త్రి
భవన్ (సమాచార మంత్రిత్వశాఖ కార్యాలయం
వుండే సదనం) చేరుకున్నాము. అక్కడ చాలా హడావిడిగా వుంది. హైదరాబాదు స్టేషన్
డైరెక్టర్ గా పనిచేసి ఢిల్లీలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న గుంటూరు రఘురాం (మా పెద్దన్నయ్య పర్వతాలరావుకి మంచి
స్నేహితులు) గారిని కలుసుకున్నాము. ఆయన మమ్మల్ని చూస్తూనే, ‘రండి
రండి మీకోసమే చూస్తున్నాను, మీ
ఆర్డరు రెడీగా ఉందం’టూ చేతికి అందించారు.
ఆ
రోజుల్లో ఢిల్లీ అధికార కారిడార్లలో శివశంకర్ గారి హవా అలా వుండేది.
1987 అక్టోబరు
చివరి వారం.
నేను
మాస్కో రేడియోలో చేరడానికి తేదీ నిర్ణయం అయింది. నాకు పాస్ పోర్ట్ వుంది కానీ మా
ఆవిడకు, పిల్లలకు
లేవు. అప్పుడు పాస్ పోర్ట్ ఆఫీసు బర్కత్ పురా నుంచి మెహిదీపట్నానికి మారింది. ఆ
రోజుల్లో రోమెల్ అనే పెద్ద మనిషి పాస్
పోర్ట్ అధికారి. సత్యసాయిబాబాకు వీర భక్తుడు. భార్యా పిల్లల్ని తీసుకుని వెళ్లి
కలిసి అప్లికేషన్లు ఇచ్చాను. పాస్ పోర్ట్ దరకాస్తులు
తీసుకుని వాటిని ఎవరికో అప్పగించి నాతొ పిచ్చాపాటీ మొదలు పెట్టారు. మా పిల్లలు
చాలా చిన్నపిల్లలు. బయటకి పోదాం అంటూ సణుగుడు మొదలు పెట్టారు.
దాంతో నేను కల్పించుకుని మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు కలెక్ట్
చేసుకోవడానికి అని అడిగాను. ఆయన దానికి నవ్వి ఇలా అన్నాడు.
‘మీరు భలే
వాళ్లండి. మీ ఫోటోలు అతికించిన జిగురు అయినా ఆరాలా లేదా! అలా
తొందరపడితే ఎలా?’
అప్పుడు
నాకు అర్ధం అయింది. నాతో ముచ్చట్లు చెబుతూ, మరోపక్క వాటిని నాకు అప్పటికప్పుడు ఇచ్చే
ఏర్పాటు ఏదో చేస్తున్నారని.
అలా 1987 అక్టోబర్
5 న మా
ఇంటిల్లిపాదికి గంటలో పాస్ పోర్టులు చేతికి వచ్చాయి.
కుటుంబాన్ని
తీసుకుని ముందు
ఢిల్లీ రైల్లో వెళ్లి, సోవియట్
ఎంబసీలో వీసా స్టాంప్ వేయించుకుని, అక్టోబరు 31న రష్యా విమాన సంస్థ ఏరో ఫ్లోట్ లో మాస్కో
వెళ్ళాలి.
ఢిల్లీ
పోవడం కోసం సికిందరాబాదు స్టేషన్ కు వెళ్ళాము. బంధుమితృలు చాలా మంది వచ్చారు, వీడ్కోలు పలకడానికి. నేను మా అమ్మతో
ప్లాటుఫారం మీద ఓ సిమెంటు బెంచిపై
కూర్చుని ఉన్నాను. ఆమె మొహంలో బాధ కనిపించడం లేదు కానీ, మనసులో మాత్రం బాధ పడుతోంది. అప్పటికి
మా అమ్మకు ఎనభయ్ ఏళ్ళు నిండాయి. బడికి వెళ్లి చదువుకోకపోయినా పురాణాలు అన్నీ నోటికి వచ్చు.
రైలు ప్లాటుఫారం మీదకు వస్తూ దూరంగా
కనిపించింది. ఆమె నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని మెల్లగా అంది.
“కూటి కోసం, కూలి కోసం దేశాలు పోవాలా!’
ఏం
చెప్పాలో తోచలేదు.
కాళ్ళకు
దణ్ణం పెట్టి, ఆమె
ఆశీస్సులు తీసుకుని రైలు ఎక్కిన తర్వాత కూడా ఆమె మాటలే చెవిలో రింగుమంటున్నాయి.
రామాయణ, భారత, భాగవతాలు కంఠోపాఠం కానీ, మా అమ్మకు శ్రీశ్రీ కవిత గురించి ఎలా తెలిసింది? టీవీలో ఆకలి రాజ్యం సినిమా చూసి
ఉంటుందా! చూసినా ఇంతలా ఎలా గుర్తు పెట్టుకుంది?
ఆ
సందేహం ఇప్పటికీ నివృత్తి కాలేదు.
కింది
ఫోటో:
1987 లో ఢిల్లీ
మీదుగా మాస్కో వెళ్ళడానికి సికిందరాబాదు రైల్వే స్టేషన్ లో మా అమ్మ వెంకట్రావమ్మ గారితో
నేనూ, నా కుటుంబం.
(ఇంకా
వుంది)
3 కామెంట్లు:
విలేఖరులు మీడియా వాళ్ళు పెద్దవాళ్ళతో తమకున్న పరిచయాలను ఎలా ఉపయోగించుకుంటారు తమ పనులు చక్కబెట్టుకుంటారు అన్నది బాగా వివరిస్తున్నారు.
మనదేశం లో 🪖 పెట్టుకోను అని మారాం చేయవచ్చు. కానీ ఇతర దేశాల్లో పనిచేసే భారతీయులు కిక్కురుమనకుండా అక్కడి నిబంధనలు పాటిస్తారు.
ఖరులు కాదండి కరులు అనాలి.
విశేషాల లేఖకులు కావున విలేఖరులు అన్నదే సరైన పదము కావచ్చు. లేక విశేషాలను మోసుకు వస్తారు కాబట్టి విలేఖరులు అంటారేమో. వింత వార్తలు ఏకరువు పెడతారు కాబట్టి విలేకరులు అని అన్నా ఓకే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి