14, జనవరి 2023, శనివారం

రుచి కాదు శ్రమ ముఖ్యం – భండారు శ్రీనివాసరావు

 “రుచి చూసి చెప్పాలి” అన్నారు గీత వెల్లంకి గారు పులిహోర డబ్బా చేతికి ఇస్తూ. దానితో పాటే తాను రాసిన  డార్క్ ఫాంటసి కవితా సంకలనాన్ని కూడా సంతకం చేసి ఇచ్చారు.

భోగి పండుగనాడు ఉదయమే డబుల్ ధమాకా అన్నమాట.

గీత గారెని ప్రత్యక్షంగా కలవడం ఇదే మొదటిసారి. చాలా ప్లెయిన్ మనిషి అని ఫేస్ బుక్ లో రాతలు బట్టి అర్ధం అయింది. నిజమే అని ఈ రోజది స్పష్టం అయింది. కల్మషం లేని ప్రవృత్తి. మా కోడలు, మనుమరాలి కేర్ టేకర్ నేహాతో హిందీలో మాట్లాడారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అదేమిటో హైదరాబాదులో యాభయ్ ఏళ్ళకు పైగా ఉంటున్నా సాట్, ఆట్ కు తేడా తెలియదు. గీత గారు  ఓ ఏడాదో ఎంతో ఢిల్లీలో ఉన్నారుట, ఆ కొద్ది కాలంలోనే హిందీ పట్టేశారు. నేను మాస్కో రేడియోలో పనిచేసేటప్పుడు నాకు రష్యన్ భాష నేర్పడానికి రేడియో వాళ్ళు ఓ పంతులమ్మను పెట్టారు. వారానికి  నాలుగు రోజులు ఇంటికే వచ్చి రష్యన్ ట్యూషన్ చెప్పేది. చివరికి జరిగింది ఏమిటి? ఆమెకు తెలుగు వచ్చేసింది. నాకు వచ్చిన రష్యన్ భాష సున్నకు సున్నా హళ్లికి హళ్ళీ.

ఇక రుచిపచుల సంగతి.

నాకు మొదటి నుంచీ  నాడీ మండలంలో ఈ భాగం పనిచేయదు.  పులిహోర చేసినప్పుడు బాగుందా, కారం ఉప్పూ సరిపోయాయా అని అడిగేది మా ఆవిడ. ఈరోజు శుక్రవారం, పులుపు నాలిక్కి తగలరాదు, అంచేతే అడుగుతున్నాను చెప్పండి అని ఖచ్చితంగా చెప్పాలి సుమా అనే సంకేతం జోడించేది. అయినా నేను మామూలు ధోరణిలో బాగుంది అనేవాడిని ముక్తసరిగా.  ఈ మాట ఆమెకు నచ్చేది కాదు. ఈ జవాబుకన్నా బాగాలేదు అని చెప్పినా సంతోషపడేదేమో.

అయితే నా కారణం నాకుంది.

అది పులిహోర కావచ్చు, మైసూర్ పాకం కావచ్చు. అవి చేయడానికి వెనుక ఎంతో శ్రమ దాగివుంది. బాగాలేదు అంటే ఆడవారి శ్రమను అవమానించినట్టే.

కానీ ఈ విషయం ఎప్పుడూ నేను పైకి చెప్పలేదు. ఇప్పుడు అనిపిస్తోంది, ఈ ఒక్క ముక్కా ఆమె ఉన్న రోజుల్లోనే ఎందుకు చెప్పలేకపోయానా అని.

గీత గారికి మరోమారు కృతజ్ఞతలు,  ఇంకా చదవని పుస్తకానికీ, తినని పులిహోరకీ.

(మా ఇంట్లో  అంతా అపరాహ్ణం.  మధ్యాహ్నం మూడు దాటాలి భోజనాలకి)



14-01-2023   

  

కామెంట్‌లు లేవు: