చాలా ఏళ్ళ కిందటి సంగతి.
ఢిల్లీలో బాబూ జగ్జీవన్ రామ్ మరణించినట్టు ఆరోజు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో పీటీఐ వార్తా సంస్థ వార్త ఇచ్చింది. మరో నలభయ్ అయిదు నిమిషాల్లో విజయవాడ నుంచి ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ప్రాంతీయ వార్తావిభాగం అధికారి శ్రీ ఆర్వీవీ కృష్ణారావు, వెంటనే స్పందించి, జగ్ జీవన్ రాం గురించిన సమస్త సమాచారం సిద్ధం చేసుకుని సవివరంగా ఆ వార్తను ప్రసారం చేసారు. న్యూస్ రీడర్, కీర్తిశేషులు కొప్పుల సుబ్బారావు ఆ రోజు బులెటిన్ చదివారు. ప్రాంతీయ వార్తల అనంతరం ఢిల్లీ నుంచి వెలువడే సంస్కృత వార్తల్లో ఈ సమాచారం లేకపోవడంతో సిబ్బంది కంగారు పడ్డారు. ఆ తరువాత ఏడూ అయిదుకు వచ్చే ఢిల్లీ తెలుగు వార్తల్లోనూ, ఎనిమిది గంటల జాతీయ వార్తల్లోనూ ఆ మరణ వార్త లేకపోవడంతో కంగారు మరీ ఎక్కువయింది. బెజవాడ రేడియో కప్పదాటు వేసిన విషయం బయట పడింది. అప్పటి తెలుగు దేశం లోక్ సభ సభ్యుడు శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ ఈ విషయాన్ని ప్రశ్న రూపంలో లేవనెత్తారు. సమాచార శాఖ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో, ఈ వార్త ప్రసారం చేయడంలో పీటీఐ పై ఆధారపడి దేశంలోని ఏడు రేడియో స్టేషన్లు తప్పు చేశాయని తెలిపారు. గమ్మత్తేమిటంటే ఈ పొరబాటు చేసిన విజయవాడ రేడియో స్టేషన్ పేరు ఈ జాబితాలో లేదు.
ఏది ఏమైనా ఈ ఉదంతంతో రేడియో అధికారులు మరణ వార్తల ప్రసారం విషయంలో అనుసరించాల్సిన ఆదేశిక సూత్రాలు ఢిల్లీ నుంచి జారీ అయ్యాయి. రేడియో విలేకరి స్వయంగా వెళ్లి చూసి ఇచ్చేదాకా, ముఖ్యుల మరణ వార్తను ప్రసారం చేయరాదని ఆంక్షలు విధించారు.
తరువాత చాలా కాలానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి శ్రీ టి. అంజయ్య ఢిల్లీలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో మరణించారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీ పీవీ నరసింహారావు అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకు వస్తున్నట్టు జాతీయ వార్తా ఛానళ్ళు సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా అంజయ్య మరణ వార్త ‘లేట్ న్యూస్’ రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు.
విజయవాడలో ఉన్న కృష్ణారావు గారు హైదరాబాదులో ఉన్న నాకు ఫోను చేసి అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన చనిపోయింది ఢిల్లీలో. నిబంధనల ప్రకారం ఢిల్లీ విలేకరి ఆ వార్తను ధ్రువపరచాలి. అందుకోసం ప్రయత్నించారు కానీ ఆ సమయంలో ఢిల్లీలోఎవరూ దొరకలేదు. చనిపోయింది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్ చేయక పొతే ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది. దాంతో ఏమైతే ఏమైందని కృష్ణారావు గారు అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి ఉదయం ఆరూ నలభయ్ అయిదు నిమిషాలకు మొదలయ్యే ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు.
మళ్ళీ సీను రిపీట్. ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి ఇచ్చినా నిబంధనల పేరుతొ తీసుకోలేదు.
‘తెలుగు ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ వార్తను ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ విషయం చెప్పరా’ అంటూ మళ్ళీ పుట్టపాగ రాధాకృష్ణ గారే పార్ల మెంటులో హడావిడి చేసారు.
ఇలాటివే మరి కొన్ని అవకతవకలు రేడియో వార్తల్లో దొర్లాయి. ఒకటి జగ్జీవన్ రాం మరణ వార్త, రెండోది లోక్ నాయక్ జయప్రకాశ్ కన్నుమూత గురించిన వార్త. ఈ రెండింటినీ ధ్రువ పరచుకోకుండానే వార్తల్లో ఇవ్వడం, నాలుక కరచుకోవడం జరిగింది. పార్లమెంటు శ్రద్ధాంజలి ఘటించింది కూడా. ఆ తరువాత కానీ జరిగిన పొరబాటు తెలియరాలేదు.
ఇంకా పాత కాలంలో తమిళనాట (అప్పుడు మద్రాసు రాష్ట్రము) ద్రవిడ నాయకుడు అన్నాదొరై మరణ వార్త ప్రసారం చేసే విషయంలో రేడియోవాళ్ళు తొందర పడి దూడ వేసారనే వదంతి ఒకటి వుంది. నాకైతే తెలియదు.
మరోటి విదేశీ రేడియో ముచ్చట.
ఎనభయ్యవ దశకం చివర్లో నేను మాస్కోలో, రేడియో మాస్కో తెలుగు విభాగంలో పనిచేసే రోజుల్లో, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.జి. రామచంద్రన్ తీవ్ర అస్వస్థత అనంతరం కన్ను మూశారు. వార్తను ధృవీకరించుకోవడం జరిగింది కానీ, ఆ వార్త రేడియో మాస్కో తమిళ వార్తల్లో కూడా ప్రసారానికి నోచుకోలేదు. కారణం మరో విషయంలో వాళ్లకు ధృవీకరణ సకాలంలో అందకపోవడమే. అదేమిటంటే, చెప్పుకోవడానికి చిత్రంగా వుంటుంది కానీ, ఎం.జి. రామచంద్రన్ కు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి నడుమ సయోధ్య ఉందా లేదా అనే విషయం రేడియో మాస్కో ఢిల్లీ విలేకరినుంచి తగిన సమాచారం అప్పటికి అందకపోవడం వల్ల ఆ మరణ వార్తను కొన్నాళ్ళు నిలిపి వేసి తర్వాత ప్రసారం చేశారు.
ఇంకోటి, ఏకంగా స్వకీయమే. అంటే రేడియో విలేకరిగా స్వయంగా నేను వేసిన దూడ సంగతే. అదీ చెప్పుకోవాలి కదా మరి.
ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. సచివాలయం బీట్ చూసే విలేకరుల, అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.
ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్ (మొయినుద్దీన్ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లో కూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్ తప్పిపోతే మళ్లీ సాయంత్రం దాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్ అవుతోందని చెప్పేసి, ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది! మంత్రులందరూ (రాజీనామా లేఖలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్ మంటూ బయటకు పరుగెత్తి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే, విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే. ఇందుకు నేనూ మినహాయింపు కాదని చెప్పడానికే.
అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి, విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా నవ్వుతూ ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.
`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్ ఆఫీసర్ (జిల్లాకలెక్టర్) ఉండేవాడు. ఇప్పుడో, ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి `శ్రీనివాసూ' అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.
ఇక వార్తల్ని అందించడంలో తొందరపాటు విషయానికి వస్తే ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. రేడియోలో కూడా అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యులసంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి. ఇలాంటి పొరపాట్లే మరికొన్ని తరహా వార్తల విషయంలో జరిగితేనే వస్తుంది చిక్కంతా.
శ్రీమతి ఇందిరాగాంధీని హత్యచేసినప్పుడు చాల సేపటివరకూ రేడియో ఆ వార్తని వెల్లడించలేదు. ఆవిడ మరణవార్తని జాతికి తెలియచెయ్యడంలో తాత్సారం జరిగిందని దరిమిలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానిపై కాల్పులు జరిగాయన్న వార్త బయటకు పొక్కింది కానీ అసలేం జరిగిందన్న దానిపై అందరికీ తీరని సందేహాలే. చివరికి రాజీవ్ గాంధీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ మరణం గురించి బీ బీ సీ వార్తలు విని ధృవపరుచుకున్నారు.
ఆమెపై కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒక సిక్కు మతస్తుడు ఉన్నాడన్న సంగతిని రేడియో వార్తల్లో ముందు వెల్లడించలేదు. అందువల్ల, అప్పటివరకూ అందరి మనసుల్లో ఆందోళన, అలజడి తప్పిస్తే అంతా ప్రశాంతమే. కానీ కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒకడిపేరు `బియాంత్ సింగ్' అన్న రేడియో వార్తల్లో విషయం వెల్లడి కాగానే ఒక్కసారిగా అంతా తారుమారయింది. పరిస్థితులు వర్ణించలేనంత భీభత్సంగా పరిణమించాయి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘాతుకానికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే సిక్కు ట్రక్కు డ్రైవర్లు ఊచకోతకు గురయ్యారు. అవేశకావేశాల ముందు వివేకం, విచక్షణ తలవంచాయి.
ఎవరో చెప్పినట్టు ట్యూబునుంచి పేస్టు బయటకు తీయగలమే కానీ మళ్లీ అందులో పెట్టలేం. అలాగే పేల్చిన తూటా కూడా. ఒక్కోసారి వార్త రగిలించే ప్రమాద తీవ్రత సయితం అలాంటిదే.
నిజమే. వార్తను వెనువెంటనే అందించాలన్న కర్తవ్యదీక్షని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ సామాజిక బాధ్యత సంగతేమిటి? పగల సెగలు రగిలించి, వ్యధలు మిగిలించి, విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న సమాచారాన్ని కాసేపు తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?
భయంకరమైన పోటీ వాతావరణంలో పయనిస్తున్న ఈనాటి మీడియా మనుగడకు ఎంతో కొంత మేరకు సంచలనాత్మక కథనాలు అవసరమే. కాకపోతే టీ ఆర్ పీ రేటింగ్‌లతో పాటు విశాల జనహితాన్ని పట్టించుకోవడం కూడా ఆవశ్యకమే! కాదంటారా!
18 కామెంట్‌లు:
Being a secularist you won’t write about Rajouri killings. Don’t forget those secularists will not spare any body and the secularist parties will not save.
కామెంట్‌ను పోస్ట్ చేయండి