(జనవరి 14 మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి ప్రధమ వర్ధంతి)
‘నా మొదటి ప్రవచన కార్యక్రమానికి హాజరై విన్నది ఇద్దరంటే ఇద్దరే’
నిరుడు ఇదే
రోజున హైదరాబాదులో తన తొంభయ్ ఆరో ఏట మరణించిన ప్రసిద్ధ ప్రవచనకారులు, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ మల్లాది
చంద్రశేఖర శాస్త్రి, ఒక కార్యక్రమంలో స్వయంగా వెల్లడించిన విషయం ఇది.
మల్లాది వారి ప్రవచనం వుందని తెలిస్తే వేలాదిమంది
విరగబడి హాజరయ్యే స్థితికి చేరుకున్న తర్వాత, అత్యంత వినయంతో శాస్త్రి గారు ఈ మాట
చెప్పారని నా రేడియో సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారు నాతొ చెప్పారు..
భగవంతుడి ఆదేశమో ఏమో తెలియదు, రామాయణ, భారతాలను గురించి ప్రవచనాల ద్వారా ప్రజాబాహుళ్యానికి తెలపాలని ఆయన చిన్న
వయసులోనే ఆసక్తి పెంచుకున్నారు.
ఒకానొక సందర్భంలో శాస్త్రిగారు ఆ విషయాలను గురించి
ఇలా ప్రస్తావించారు.
‘రేకు పెట్టెలో ఓ జత పంచెలు, కండువాలు పెట్టుకుని బస్ స్టాండ్
కి వెళ్ళేవాడిని. దొరికిన బస్సు, అది ఎటు పోతుందో కూడా చూడకుండా
ఎక్కేసి, అది ఆగిన చోట దిగిపోయేవాడిని. ఆ వూర్లో గుడి ఎక్కడ
వుందో వాకబు చేసుకుని వెళ్ళేవాడిని. అక్కడే అరుగుమీద కూర్చుని సాయంత్రాలు
ప్రవచనాలు మొదలు పెట్టేవాడిని. జనాలకు బుర్రకదల మీద, నాటకాల మీదా వుండే అనురక్తి
ప్రవచనాలపై ఉంటుందని అనుకోలేము. అయినా అలా పట్టువదలకుండా ఊళ్ళు తిరుగుతూ ప్రవచనాలు
చెబుతూ ఉండేవాడిని. క్రమంగా ప్రజలకు వీటిపట్ల అనురక్తి పెరగడం మొదలయింది. అలా
జీవితం చాలించేవరకూ ప్రవచనాలు చెబుతూ ఉండాలనేది నా
కోరిక. ఆ భగవంతుడి అభీష్టం ఎలా వుంటుందో తెలవదు’
మల్లాది వారికి బాచంపల్లి సంతోష్ శాస్త్రి గారు ప్రియ
శిష్యులు. వారు ఎక్కడ ప్రవచనాలు చెప్పినా గురుచరణులు మల్లాది చంద్రశేఖర
శాస్త్రి గారి శిష్యుడనని మొదట్లోనే చెప్పి ప్రారంభించేవారు. ఒకసారి రవీంద్ర
భారతిలో ఉగాది పంచాంగ శ్రవణం. అందులో పాల్గొంటూ, ఒకనాడు నా గురుదేవులు మల్లాది
వారు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించడం అంటే నా జీవితం ధన్యమే’ అన్నారు
సంతోష్ కుమార్ శాస్త్రి.
‘సంతోష్ నా శిష్యుడే. గురువు శిష్యుడిని ఎలా చూడాలని కోరుకుంటాడో సంతోష్ కుమార్ శాస్త్రి అలానే తయారయ్యాడు’ అని
శాస్త్రిగారు కూడా సగర్వంగా చెప్పుకునేవారు.
ఆధ్యాత్మిక ప్రవచనాల ప్రభావమో ఏమో కాని మల్లాది
వారికి ఎటువంటి ఆరోగ్యసమస్యలు ఎదురుకాలేదు. ఒకసారి ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి
నరసింహారావు ఓ సందర్భంలో శాస్త్రిగారి ధాతుపుష్టి గురించి ప్రస్తావించారు.
అశోక్ నగర్ లోని వారి ఇంటికి సాయంత్రాలు ఎవరు
వెళ్ళినా ఓ పెద్ద వెండి పళ్ళెం నిండా అరటికాయ బజ్జీలు తెచ్చి పెట్టేవారట. తాను
తింటూ, వచ్చిన వారిని కూడా తినమని అంటుండేవారట. అప్పటికే వారి వయసు ఎనభయ్ దాటింది.
శాస్త్రి గారికి సద్గతులు కలగాలని కోరుకోనక్కర లేదు.
ఎందుకంటే ధారావాహికంగా వేలాది ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏళ్ళ తరబడి చెబుతూ వచ్చిన
మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారి కోసం ఆ సద్గతులే ఎదురు చూస్తుంటాయి. ఇది తద్యం.
(14-01-2023)
1 కామెంట్:
మీ ఈ టపా టైటిల్ కలిపి చదివి అదిరి పడ్డాను.
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి