సంక్రాంతికి
సొంతూరుకు వెళ్ళాలనే అభిలాషతో అయిదేళ్ళ క్రితం హైదరాబాదు నుండి నాలుగు కార్లలో ఉదయమే
బయలుదేరి మా వూరు కంభంపాడుకు బయలుదేరాము. టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కువ ఆలస్యం
కాకుండానే బయటపడ్డాము. ఒక్క వాట్సప్
మెసేజ్ తో ఖమ్మం, రెబ్బారం, పెనుగంచిప్రోలు నుంచి కూడా చిన్నా పెద్దా యాభయ్, అరవై మందిమి మా
వూరికి సంక్రాంతి అతిధులం.
ఇక మా ఇంట్లో
సందడే సందడి. నగరాల్లో పుట్టి పెరిగిన కోడలు పిల్లలు, కొంగులు దోపుకుని
అర్దరాత్రివరకు మేలుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దారు. వీళ్ళల్లో సగానికిపైగా ఎప్పుడూ
పల్లెటూరు మొహం చూసిన వాళ్లు కాదు. ‘మిధునం’ సినిమా చూసిన తరువాత వీళ్ళందరికీ పల్లెటూరు చూడాలన్న
కోరిక పుట్టుకొచ్చింది. ఎన్నడూ రుచి చూడని జొన్నన్నం వండడం కోసం నగరాల్లో పుట్టి
పెరిగిన మా కోడళ్ళు జొన్నలు దంచేందుకు రోకళ్ళు చేతబట్టారు. మర్నాడు చుట్టూ
పచ్చటి చేలు. పిల్లల హడావిడి చెప్పతరం కాదు. పెద్దవాళ్ళు కూడా వయసు మరిచి పోయి
మొక్కజొన్న చేలో కలయతిరుగుతూ ఫోటోలు దిగారు. రేగుపళ్ళు ఏరుకుని తిన్నారు.
వూళ్ళో ఉన్న రెండు
రోజులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని, కొత్త జ్ఞాపకాలను
మూటగట్టుకుని మళ్ళీ అందరం కార్లెక్కి హైదరాబాదు రోడ్డెక్కాము.
మొత్తానికి
పెద్దలకూ, పిల్లలకూ మంచి ఎనర్జీ టూర్!
వీడియో COURTESY: మా అన్నయ్య కుమారుడు రమేష్ భండారు.
https://youtu.be/T6zc-Yi1Jio
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి