(Published in ANDHRAPRABHA today, 27-01-2023, THURSDAY)
మాజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు, టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ పాదయాత్రల్లో సరికొత్త రికార్డు
స్థాపనకు నడుం బిగించారు. నలభయ్ ఏళ్ళ పిన్న వయసులో నాలుగు
వందల రోజుల్లో నాలుగువేల కిలోమీటర్ల దూరం యువగళం పేరుతో సాగే ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈరోజున
మొదలయింది.
2003 లో
రాజశేఖరరెడ్డి జరిపిన ‘ప్రజా ప్రస్తానం’ పాదయాత్ర రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో
మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా
ఇచ్చాపురంలో ముగిసింది. అప్పటికి
దూతదర్సన్ విలేకరిగా వున్న కారణం కావచ్చు, కొంత దూరం వై.ఎస్.ఆర్. తో కలిసి నడిచే అవకాశం, రెండు
మూడు చోట్ల ఆయనతో ముచ్చటించే సావకాశం నాకు లభించాయి. చంద్రబాబు ‘వస్తున్నా
..మీకోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి మొదలై, పదమూడు
జిల్లాలమీదుగా 2340 కిలోమీటర్లు సాగి విశాఖ పట్నంలో
ముగిసింది. పాదయాత్రకు గుర్తుగా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరు
చంద్రబాబుకు వెండి పాదరక్షల జతను బహుకరించారు.
వై.ఎస్.
జగన్ మోహనరెడ్డి తన ప్రజాసంకల్ప యాత్రను 2017నవంబరు ఆరో తేదీన వై.ఎస్.ఆర్. కడప
జిల్లాలోని స్వగ్రామం ఇడుపులపాయలో మొదలుపెట్టి, 13 జిల్లాలగుండా 341 రోజులపాటు
3648 కిలోమీటర్లు
నడిచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించారు.
తెలుగు
రాష్ట్రాలలోనే కాదు, యావత్ దేశంలో సాగిన రాజకీయ పాదయాత్రల్లో అప్పటికి ఇదొక రికార్డు. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు
నాయుడు పాద యాత్రలు చేసిన దరిమిలా జరిగిన ఎన్నికల్లో విజయలక్ష్మి ఆయా పార్టీలని
వరించడంతో వారిరువురు ముఖ్యమంత్రులు కాగలిగారు. ఆ విధంగా
పాదయాత్రాఫలం వారికి సిద్ధించింది. దానితో ఎన్నికల్లో విజయానికి తోడ్పడే అనేక
ప్రధాన అంశాలలో పాదయాత్రలు కూడా చేరిపోయాయి. అంతేకాదు, పాదయాత్ర
చేసిన వారు ముఖ్యమంత్రి అవుతారనే ఓ గుడ్డి నమ్మకం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా
నాటుకుంది. అదే కోవలో జగన్ మోహన రెడ్డి
కూడా తన పాదయాత్ర దరిమిలా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన
విజయం సాధించి ముఖ్యమంత్రి కావడంతో ఈ
నమ్మకం మరింత బలపడింది.
సాధారణంగా
రాజకీయ నాయకులు పాదయాత్రలు ప్రారంభించాలి అంటే అందుకు కొన్ని కారణాలు వుండి
తీరాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అంటూ వాళ్లు పైకి యెంత బింకంగా చెప్పినా
దాని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా దాగే వుంటుంది. అయితే, చేసేది
రాజకీయమే అయినప్పుడు ఇక ఆ యాత్రల కోణాలను దుర్భిణి పెట్టి శోధించాల్సిన అవసరం
ఏముంటుంది అనే ప్రశ్న వారివద్ద సిద్ధంగానే వుంటుంది.
వస్తున్నా
మీకోసం పేరుతొ చంద్రబాబు నాయుడు సాగించిన పాదయాత్రకు నాలుగు దశాబ్దాలకు పూర్వమే ఆయన తొలి పాదయాత్ర
చేశారు. దానిని గురించి తెలిసిన వారు తక్కువ. నిజానికి
అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే పేరున్న రాజకీయ నాయకుడు ఒకడున్నాడని
తెలిసిన వారే తక్కువ.
అప్పట్లో
స్థానికులకు సయితం అంతగా పరిచయం లేని చంద్రబాబు నాయుడు, కాణిపాకం
నుంచి కాలి నడక ప్రారంభించారు. గడప గడప తొక్కారు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు
జోడించి నమస్కరించారు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించారు. ప్రతి వూరిలో ఆగి ఆ
ఊరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రచ్చబండల
మీద, ఇళ్ళ అరుగుల మీద సేద తీరారు. స్తానిక
రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల వద్దే అడ్డంకులు ఎదురయినా మడమ
తిప్పలేదు. ఓ జత దుస్తులు, కాలికి చెప్పులు, తోడుగా కొందరు యువకులు. అంతే! ఇంతకు మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా
కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియతిరిగారు. రాజకీయాల్లో
తలపండిన ఉద్ధండులను ఢీకొని ఎన్నికల్లో గెలిచారు. గెలిచి తొలిసారి శాసన సభలో
అడుగుపెట్టారు.
అప్పటికింకా
నిండా మూడుపదులు నిండని ఆ యువకుడే, మళ్ళీ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆరుపదులు
పైబడిన వయస్సులో,
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పునర్వైభవం కోసం తిరిగి కాలినడకనే
విజయానికి మార్గంగా ఎంచుకున్నారు.. ‘వస్తున్నా మీకోసం’ అంటూ సుదీర్ఘ పాదయాత్రకు
పూనుకున్నారు.
అంతకుముందు
వై ఎస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్ర, దానితో సాధించిన విజయం రాజకీయ నాయకులను
పాదయాత్రలకు పురికొల్పేలా చేసాయి. అంతకు ముందు రెండుమార్లు ప్రయత్నించి అందుకోలేని
ఎన్నికల విజయాన్ని, ఆ
పాదయాత్ర దరిమిలా ఆయన తన ఖాతాలో వేసుకోవడంతో పాదయాత్రలకు కొంత సెంటిమెంటు రంగు
కూడా అంటుకుంది.
ఇక జగన్
మోహన రెడ్డి సాగించిన పాదయాత్ర ఏవిధంగా చూసినా ఒక రికార్డే. సుమారు రెండుకోట్ల
మంది ప్రజలను ఆయన ముఖాముఖి కలుసుకోగలిగారు అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన
సాధించినది చిన్న విషయం ఏమీకాదు. నడిచిన దూరం, వెంట నడిచిన జనం, మాట్లాడిన
సమావేశాలు, ప్రసంగించిన బహిరంగ సభలు, హాజరయిన ప్రజలు ఇలా చెప్పుకుంటూ పొతే అన్నీ రికార్డులే. ఈ యాత్ర సందర్భంగా
వై.ఎస్. జగన్, ఆకాశమే హద్దుగా కురిపించిన
వాగ్దానాలు, హామీల సంఖ్య కూడా ఒక రికార్డే అని చెప్పుకోవాలి.
ఇక్కడ
మరో విషయం ప్రస్తావించడం అప్రస్తుతం కాదనుకుంటాను. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి
ముందు, జగన్
మోహన రెడ్డి పిలిపించుకుని మాట్లాడిన కొద్దిమంది జర్నలిస్టుల్లో నేను కూడా
వున్నాను. జనాలకు ఇచ్చే హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసే విషయంలో ఫాలో అప్
మెషినరీ వంటి వ్యవస్థను పార్టీ పరంగా ముందుగానే ఏర్పాటు చేసుకోవడం మంచిదని
సూచించాను.
ఈ
పాదయాత్రల వల్ల రాజకీయ పార్టీలకు వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమిటనే విషయం
పక్కనపెడితే,
రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి
అనేది రాజకీయనాయకులు గుర్తిస్తున్నారు అనుకోవాలి. ఊళ్లను చుట్టబెడుతూ సాగే ఇటువంటి
సుదీర్ఘ పాదయాత్రల్లో,
క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తమ కళ్ళతో గమనించి నేరుగా అర్ధం
చేసుకోవడానికీ,
సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు కనుగొనడానికి చక్కటి అవకాశం రాజకీయ నాయకులకు
దొరుకుతుంది.
తమ నడుమ
వుండేవారికే పట్టం కట్టడానికి జనం క్యూలు కడుతున్నారు అనేది అపోహ కావచ్చు కానీ
అందులో కొంత నిజం లేకపోలేదని, ఏసీ
గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం
పెడుతున్నారని గత అనుభవాలు తెలుపుతున్నాయి.
ప్రజల
ఇబ్బందులను, కడగండ్లను కళ్ళారా చూడగలిగే అవకాశం ఈ పాదయాత్రల వల్ల రాజకీయ నాయకులకు
లభిస్తుంది. భవిష్యత్తులో అధికారం దక్కినప్పుడు వాటిల్లో కొన్నింటిని అయినా
పరిష్కరించగలిగితే ప్రజలకు కూడా వారి యాత్రాఫలసిద్ధి ప్రాప్తిస్తుంది.
ఇది
జరిగింది కూడా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానంలో తనకు ఎదురయిన అనుభవాల
ఫలితంగా రూపొందించిన ‘ఆరోగ్య శ్రీ, 108, బడుగువర్గాల విద్యార్ధులు చెల్లించిన ఫీజు
తిరిగి ఇచ్చే పధకం’ వంటివి రాష్ట్ర ప్రజానీకానికి దక్కాయి. చంద్రబాబు’ వస్తున్నా..
మీకోసం..’ యాత్ర వల్ల రైతులకు రుణ మాఫీ జరిగింది.
ఏదయితేనేం, ఏ
పేరుతొ అయితేనేం, నాయకులు
ఏసీ గదులు వదిలిపెట్టి కొద్దికాలం అయినా
ప్రజలతో మమేకం అయ్యే వీలు ఈ యాత్రల వల్ల ఏర్పడింది. రోగి కోరిందీ, వైద్యుడు
ఇచ్చిందీ ఒకటే అని జనాలు సంతోషించాలి.
ముందే
చెప్పినట్టు ఈ రాజకీయ పాదయాత్రలు భవిష్యత్తులో కూడా ఇబ్బడిముబ్బడిగా సాగే అవకాశం
వుంది. రాజకీయ విమర్శలు, ప్రతి
విమర్శలతో సరిపుచ్చితే పర్వాలేదు కానీ ఇరువైపుల పారావారాలు శృతిమించి
వ్యక్తిగత దూషణభూషణలకు దిగకుండా వుంటే అదే పదివేలు.
జగన్
మోహన రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఆకాశాన్ని దాటిపోయాయని, రాష్ట్రానికి
వచ్చే ఆదాయంతో వాటిని అమలుచేయడం మానవ మాత్రుడికి కూడా సాధ్యం కాదని ఆ రోజుల్లో
అధికార పార్టీ విమర్శలు చేసింది. ‘వస్తున్నా మీకోసం..’ పాదయాత్ర సమయంలో’ చంద్రబాబు
ఇస్తూ పోయిన వాగ్దానాలు గురించి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన
వ్యాఖ్యలను బాబు రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికీ ఉదహరిస్తుంటారు. ‘వాకింగ్ ఫ్రెండ్’ (చంద్రబాబు)
ఇస్తూ పోతున్న హామీలను అమలు చేయాలంటే, రాష్ట్ర బడ్జెట్ అటుంచి మొత్తం కేంద్ర
బడ్జెట్ కూడా సరిపోదని ఆనాడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని
వాళ్ళు గుర్తు చేస్తుంటారు.
రాజకీయ
విమర్శలను కొంత అర్ధం చేసుకోవచ్చు . కొందరు వ్యక్తిగతంగానే కాకుండా చాలా చౌకబారుగా
కూడా చేసే వ్యాఖ్యల తీరు బాధాకరం. చంద్రబాబు పాదయాత్ర సమయంలో ఆయన
ధరించిన బూట్లు గురించి, దారిపొడుగునా దుమ్ము రేగకుండా నీళ్ళు చల్లించే ఏర్పాట్ల గురించీ ఎద్దేవా
చేస్తూ ఆయన ప్రత్యర్ధులు చేసిన వ్యాఖ్యలు బహుశా వారికి గుర్తుండి ఉండకపోవచ్చు.
రాజకీయ
యాత్రలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయపరమైన హామీలు పార్టీలన్నింటికీ తప్పనిసరి రాజకీయ విన్యాసాలుగా
మారిపోతున్న ఈ రోజుల్లో, రాజకీయ నాయకులు ఒకింత సంయమనంగా మాట్లాడడం వారికే మంచిది. ఏమో ఎవరికెరుక? ఇలాంటి
కువిమర్శలను తామే ఎదుర్కోవాల్సిన దుస్తితి భవిష్యత్తులో తమకే ఎదురు కావచ్చు.
దీనికి
ఓ మంచి మార్గాన్ని కవి బ్రహ్మ తిక్కన మనకేనాడో బోధించాడు.
ధర్మాలలోకెల్లా
ఉత్తమోత్తమమైన ధర్మంగా మహాభారతంలో విదుర నీతి పేరుతో ఆ మహాకవి చెప్పినదాన్ని
పాటిస్తే చాలు. అదేంటంటారా!
‘‘ఒరులేయవి
యొనరించిన, నరవర అప్రియంబు తన మనంబునకగు, తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమ
ధర్మపథముల కెల్లన్’’.
ఇతరులు
ఏం చేస్తే మనకు ఇష్టం ఉండదో, దాన్ని మనం ఇతరులపట్ల చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమ ధర్మం అన్నది ఈ పద్య
తాత్పర్యం.
ఇతరులకు
నీతులు చెప్పే రాజకీయ నాయకులకు ఈ నీతిపాఠాలు తలకెక్కుతాయా!
అనుమానమే!
(27-01-2023)
6 కామెంట్లు:
జ"గన్" యాత్ర మొదలు పెట్టిన తొలిరోజుల్లో చెంబా అనధికార పత్రికల్లో "కాళ్ళు బొబ్బలెక్కాయి. ఇక ఆపెయ్యాలని నిర్ణయించుకున్న జగన్" అనే వార్తలు తరచూ వస్తుండేవి. మరి మాలోకేశాన్ని గురించి ఏం రాస్తారో చూడాలి.
మళ్ళీ అదే ఇరుకుసందులు.
"కిక్కిరిసిన జనం" అంటూ అవే దిగజారుడురాతలు.
అప్పటికి "దూతదర్సన్" విలేకరిగా వున్న కారణం కావచ్చు, కొంత దూరం వై.ఎస్.ఆర్. తో కలిసి నడిచే అవకాశం...
"దూతదర్శన్" పదం బావుందండి
ఎన్నికల వరకు పాద యాత్రలు బండి యాత్రలు సాగుతాయి. యాత్రా ఫలం ఎవరికి దక్కుతుందో చెప్పలేము.
వైయస్సార్, చంద్రబాబు, జగన్ లకు ప్రజల్లో ఒక పూర్తిస్థాయి ఇమేజ్ వున్నప్పుడు పాదయాత్రలు చేసారు. లోకేష్ కు ఎటువంటి ఇమేజ్ వున్నదో అందరికీ తెలిసిందే. జగన్ తనని ఏదేదో అన్నట్టు ఊహించేసుకోని.. దానికి తనే తొడకొట్టి సమాధాలివ్వడమేంటో అర్ధంకాదు. బహుశా ప్రతి(పచ్చ)పత్రికల వ్యూహంలో బాగం కావొచ్చు. ఇది ఇలానే కంటిన్యూఅయితే.. పూర్తిస్థాయి కమేడియన్ ఇమేజ్ స్థిరపడిపోతుంది. పచ్చపత్రికల మత్తులోనించి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది.
అనంధ్రా, కర్ణాటకల మధ్య పెట్రోలురేట్ల తేడాను, లోకేష్ నిరూపించడం బాగుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి