30, అక్టోబర్ 2020, శుక్రవారం

తాగడానికెందుకురా తొందరా ! - భండారు శ్రీనివాసరావు

 1995 లో ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించినప్పుడు, ఎవరైనా మందు ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే పలానా పత్రిక పలానా పేజీలో అని జవాబు వచ్చేది. మద్యనిషేధం ఎందుకు అవసరమో ప్రజలకు నచ్చచెబుతూ పుంఖానుపుంఖాలుగా వార్తలు, వ్యాసాలు ఆ పత్రిక ప్రచురించేది. ఆ తర్వాత కొద్ది కాలానికే సంభవించిన రాజకీయ పరిణామాల దరిమిలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యనిషేధం కారణంగా మద్యం మాఫియాల వల్ల ఒనగూడబోయే అనర్థాలు గురించి కూడా అదే పత్రిక వైనవైనాలుగా రాసింది. కొంతకాలం తర్వాత అందరూ అనుకున్నట్టే చంద్రబాబునాయుడు ముందు మద్యనిషేధాన్నిసడలించి, ఆ పిదప పూర్తిగా తొలగించారు.

ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోవడం, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాలలో మద్యం రవాణా పెరిగిపోవడం, అన్నింటికంటే మించి మద్యం మాఫియా కోరలు సాచి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం ఇవన్నీ ఆయన మద్య నిషధం ఎత్తివేయడానికి కారణాలుగా చెప్పుకున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో మాఫియా చెలరేగి ఆయా ప్రాంతాల రాజకీయ నాయకుల అస్తిత్వానికే ప్రమాదకరంగా పరిణమించడంతో అన్ని పార్టీల వాళ్ళు బయటకు ఎన్ని ప్రకటనలు చేసినా లోపల మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని హర్షించారనే చెప్పాలి.

అప్పుడు కర్నాటక సరిహద్దుల్లో వుండే ఒక అధికార పక్షం శాసన సభ్యుడు చెప్పిన విషయం ఏమిటంటే ఒక లారీ లోడు మద్యం రాష్ట్రంలోకి వచ్చేలా చేయగలిగితే లక్షల రూపాయలు ముట్టచెప్పేవారట. ఈ రకమైన సులభ ఆదాయానికి అవకాశం దొరకడంతో మద్యం మాఫియా ప్రభుత్వ వ్యవస్థలనే ప్రభావితం చేయగల స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పారు. రాజకీయులను కలవరపరచిన అంశాలలో ఇది ప్రధానమైనది.

అమలు సాధ్యం కాని మద్య నిషేధం వుంటేనేమి, లేకపోతేనేమి అనే నిస్పృహ ప్రజలలో కలిగించి, వారిలో తదనుగుణమైన మార్పు రావడానికి అప్పటి పత్రికలు కొన్ని సహకరించాయి. మొదటే చెప్పినట్టు ముందు పేర్కొన్న పత్రికదే ఇందులో సింహభాగం క్రెడిట్.

1980 - 2010 నడుమ పుట్టిన వారిలో చాలామందికి 1994, 1995 ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు, పరిణామాల పట్ల పూర్తి అవగాహన వుండే అవకాశాలు తక్కువగా వుంటాయి. ఎందుకంటే అప్పటికి వారి వయసు పదిహేనేళ్లకు లోపు కనుక. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా పాల్గొంటున్న అలాంటి వారికి అలనాటి విషయాలు గురించి గూగుల్ పరిజ్ఞానం ఉండవచ్చు కానీ ప్రత్యక్ష సాక్షులుగా వుండి అవగాహన చేసుకునే వీలు వుండే అవకాశం లేదు.

1994లో నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలయిన ఓ పేద మహిళ రోసమ్మ సాగించిన సారా వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడంతో అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న ఎన్టీ రామారావుకు ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో ఇదొక ప్రచారాస్త్రంగా ఉపయోగపడింది. తమ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని ఆయన వివిధ ఎన్నికల సభల్లో చేసిన వాగ్దానం పేద దిగువ తరగతి మహిళలలో విపరీతమైన ఆశలు పెంచింది. ఫలితంగా అంతకుముందు అయిదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో గెలిపించి ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. రామారావు గారు కూడా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రవేశపెట్టారు.

పేద జనాల తాలూకు ఆడంగులందరూ హాహా ఓహో అన్నారు. అయితే ప్రశంసలతో ప్రభుత్వాలు నడవవు కదా! పైగా బోలెడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కానీ ఆయన మొండి మనిషి. ససేమిరా మద్యనిషేధాన్ని ఎట్టిపరిస్థితిలోనూ అమలు చేసి తీరాల్సిందే అన్నారు. కానీ జరిగింది వేరే విధంగా వుంది.

బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఆర్ధికంగా కూసింత నిలదొక్కుకునే దశలో మద్యం మాఫియా జడలు విప్పింది. నిషేధ చట్టానికి తూట్లు పొడిచే కార్యక్రమం ఒక పద్దతి ప్రకారం మొదలయింది. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా సాగింది. బయట నుంచి ఒక్క లారీ లోడ్ మద్యం రాష్ట్రంలోకి వచ్చేలా చూడగలిగిన పెద్దలకు లక్షల్లో నజరానాలు అందాయి. సరిహద్దు ప్రాంతాల ప్రజాప్రతినిధులకు నెలలవారీ మామూళ్ళు ముట్టాయి. వారికి సహకరించేవారు రాత్రికి రాత్రి లక్షాధికారులు అయ్యారు.

ప్రభుత్వానికి రాజమార్గంలో రావాల్సిన ఆదాయం దారిమళ్లి వేరే వారి జేబుల్లోకి చేరింది. ఉభయ భ్రష్టత్వం ఉపరిసన్యాసం.

ఎవరెన్ని కబుర్లు చెప్పినా మద్యం అనేది ఏ ప్రభుత్వానికి అయినా కాసుల వర్షం కురిపించే కామధేనువు. అయితే అదే సమయంలో అదే మద్యనిషేధం వాగ్దానరూపం ధరిస్తే ఎన్నికల వైతరణిని దాటించే సులభమైన మార్గం కూడా. అంచేత తెలివయిన రాజకీయ నాయకులు రెండు వైపులా పదునున్న ఈ అయుధాన్ని అంతే తెలివిగా ఉపయోగించుకుంటారు.
అందుకే, పైకి చెప్పరు కానీ వారిది ఒకే నినాదం.
“అధికారంలోకి రావడానికి ప్రజలకు నచ్చే కొన్ని మాటలు చెప్పాలి. అలా దక్కిన అధికారాన్ని నాలుగు కాలాలు నిలబెట్టుకునేందుకు జనాలకు ఇష్టంలేని కొన్ని పనులు చేయాలి”
చేయక తప్పదు కూడా.

అదే జరిగింది లోగడ. ఇప్పుడూ జరుగుతుందేమో తెలియదు.
కానీ ఆనాటి పత్రికల సహకారం ప్రస్తుతం పూర్తిగా పూజ్యం.
(30-10-2020)

కామెంట్‌లు లేవు: